Tuesday, May 3, 2022

పుస్తకాలతో నా ప్రయాణం (Part 4)

 పుస్తకాలతో నా ప్రయాణం (Part 4)

ఒక ఙ్జాపకం - 45

 

చాలా చిన్న వయసులోనే పుస్తకాలు చదవగలగడం నాకు బాగా కలిసొచ్చిన అంశం, ఏ ఒక్క రచయిత మీదకి యండమూరి గారు తన నవలల ద్వారా నాకు కొత్త విషయాలు నిరంతరం తెలిపేవారు.

హిప్నాటిజం గూర్చి మొదటి సారి వినింది యండమూరి వీరేంద్రనాధ్ గారి తులసిదళం చదివినప్పుడే. అప్పటికి నా వయసు పన్నెండు సంవత్సరాలు అని చెప్పాను కద.

లుకేమియా, బ్లడ్ కాన్సర్ల గూర్చి,  కార్పొరేట్ హాస్పిటల్స్ తాలూకు దోపిడి గూర్చి ప్రార్థన నవల చదివి తెల్సుకున్నాను మొదటి సారి.

రొయ్యల పెంపకం , కోల్డ్ స్టోరేజ్ ల గూర్చి పర్ణశాల నవల చదివి, ఆర్థిక శాస్త్రం, షేర్ మార్కెట్ల గూర్చి డబ్బు టుది పవారాఫ్ డబ్బు చదివి, సెక్షన్ 302, ఉరి శిక్ష తాలూకు పూర్తి వివరాలు అభిలాష చదివి, రొయ్యల పరిశ్రమ కార్పొరేట్ ఎత్తులు పై ఎత్తులు పర్ణశాల చదివి తెల్సుకున్నాను మొదటి సారి.

మాఫియా అన్నపదం మొదటి సారి వినింది, చదివింది యండమూరి గారి నవలల ద్వారానే.

తెలుగుభాష గొప్పదనం, గోదావరి అందాలు తెలుసుకునింది వారి ద్వారానే.

ఒక స్త్రీ ద్వారా ప్రభావితం అయ్యి ఆ  ప్రేరణతో ఎంతో ఎత్తుకు వెళ్ళిన సోమయాజి పాత్ర చిత్రంగా తోచేది. అదేకాక ఆనందోబ్రహ్మ లో  భవిష్యత్ లో ప్రపంచం ఎలా ఉండబోతొంది అని తనలోని దార్శనికతని చూపారు. ఆ ఊహలు చాలా మట్టుకు నిజం అవుతూ ఉన్నాయి ఇప్పుడు.

ఛెస్ క్రీడ, అంతర్జాతీయ ఛెస్ పోటీల గూర్చి లోతైన వివరాలు వెన్నెల్లో ఆడపిల్ల ద్వారా తెలుసుకున్నాము. రేవంత్ అన్న పేరుతో ఎవరైనా తారసపడితే ఇప్పటికీ నవ్వొస్తుంది. అందులో హీరోయిన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ’రేవంత్ అంటే గుర్రాలు తోలేవాడు’ అని. ఇప్పట్లో తలితండ్రులు చాలా మట్టుకు ఇలా విచిత్రమైన పేర్లు తెలిసో తెలియకో పెట్టేస్తూ ఉంటారు. అలా విచిత్రమైన పేర్లు వినంగానే చప్పున ’వెన్నెల్లో ఆడపిల్ల’లో హీరోయిన్ మాటలు గుర్తువస్తాయి.

అంతర్ముఖంలో అనుకుంటాను శైలి పరంగా ఓ ప్రయోగం చేశారు, ఏ పాత్ర వర్షన్ లో వింటే ఆ పాత్రే కరెక్ట్ అనిపిస్తుంది. (ఇలాంటి ప్రయోగం చాలా ఏళ్ళ తరువాత నేను కంకణం అనే మమ్ముట్టి నటించిన మళయాళ డబ్బింగ్ సినిమాలో చూసి అబ్బుర పడ్డాను. జోషీ అనే ఆయన చాలా అద్బుతంగా దర్శకత్వం వహించారు ఆ సినిమాకి. యండమూరి గారికి ఏమి సంబంధం లేదు ఈ సినిమాకి . ఉత్తినే గుర్తు వచ్చి వ్రాశాను)

రెండు భాగాల రాక్షసుడు నవలలో అయితే హీరోకి అసలు పేరే పెట్టలేదు, చివరిదాకా ’అతడు’ అంటూనే నడిపిస్తాడు. ఎప్పటి నుంచో కోరిక ఉంది నాకు ఇలా వ్రాయాలని.  జనవరి నుంచి ప్రారంభమైన నా సీరియల్ ’ప్లేటోనిక్ ప్రేమ’ లో ఏకంగా హీరో, హీరోయిన్ ఇద్దరికీ పేర్లు లేకుండా వ్రాశాను. ప్రేరణ యండమూరి గారే అనటంలో సందేహం లేదు.

13-14-15 లో ఇన్‍ఫెర్టిలిటీ సమస్య ఆధారంగా ఫెర్టిలిటీ క్లినిక్స్ లో జరిగే దారుణాలు.

నల్లంచు తెల్లచీర నవలలో చీరల వ్యాపారంలో కార్పొరేట్ స్తాయికి ఎదిగిన కుర్రాడు, ఆ రంగంలోని పోటాపోటీ

ఇలా ఒకటా రెండా ఎన్నో నవలలు, ఎన్నో విషయాలు. అభిలాష తర్వాత ఆయన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని , ముఖ్యంగా చిరంజీవి ని దృష్టిలో పెట్టుకుని వ్రాయటం ప్రారంభించారు.

కానీ తనదైన ముద్ర అయితే కోల్పోలేదు శైలిపరంగా , కాకపోతే ఎన్నుకునే వస్తువు, కథ, కథనం మరీ నేల విడిచి సాము చేసేవి.

ఇక మళ్ళీ తులసి దళం టైం కి వస్తే, పడిపోతున్న సర్కులేషన్ చూస్కుని ఆంధ్రప్రభవారు మేల్కొని ’దుప్పట్లో మిన్నాగు’ అనే సీరియల్ వ్రాయించారు యండమూరి గారితో. కాని సికరాజు గారి ఐడియాలతో ఎవ్వరూ పోటీ పడలేకపోయారు ఆ రోజుల్లొ.

ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పుకోవాలి.

ఆ రోజుల్లో వై. సునీతా రెడ్డి అనే రచయిత్రి (?) పేరుతో ’తులసిదళం’ కి పేరడీగా ’వేపమండలు’ అన్న సీరియల్ కూడా అంధ్రప్రభలో వచ్చింది. అది పెద్దగా ఎవర్నీ ఆకట్టుకోలేదు.

అది కూడా సరదాగా యండమూరిగారే వ్రాసారని అనుకుంటారు. ఎక్కడో దీని గూర్చి యండమూరి గారి వివరణ చదివాను కానీ నాకు విషయం ఏమిటి అన్నది నాకు గుర్తు లేదు.

చిన్న వయసులోనే, యండమూరి గారి నవలల ద్వారా పొందిన  ఙ్జానం వల్ల నాలో, ఒక విధమైన ఆత్మ విశ్వాసం , అహం, మాటల్లో చెప్పలేని సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్రెండ్స్ లో పుస్తకాలు చదివే అలవాటు తొంభై శాతం మందికి ఉండేది కాదు ఆ చిన్న చిన్న ఊర్లలో.  నాకు అబ్బిన ఈ ఙ్జానం కారణంగా ఆ చిన్న ఊర్లలో స్నేహితుల కబుర్లు, వారి లక్ష్యాలు, వారి ప్రవర్తన నాకు చాలా సాధారణంగా (పచ్చిగా చెప్పాలంటే నేలబారుగా అనిపించేది). ఆ కారణంగా నేను తిరిగి పుస్తకాలలోనే సాంత్వన పొందేవాడిని. ఈ విచిత్రమైన మానసిక స్థితి వల్ల నాకు నా వయసుకన్నా పెద్దవారు ఎక్కువగా స్నేహితులుగా ఉండేవారు.

నేను పన్నెండో ఏటనే కలం పట్టటానికి కూడా ఈ మానసిక స్థితి కారణం అయింది.

ఈ ఙ్జానం కారణంగా నాకు వ్యాస రచనలపోటీల్లో, వక్తృత్వం పోటీల్లో బహుమతులు వరుసగట్టి వచ్చేవి. నాటకాలు, ఏకపాత్రాభినయనాలలో కూడా బాగా పాల్గొనేవాడిని. స్కూల్ లో నన్ను మేధావిగా పరిగణించి సాంస్కృతిక కార్యక్రమాలకి వేదిక మీద మైకు ముందు నిలబడి మాట్లాడటానికి (ఇప్పుడు ఈ ప్రక్రియని ఆంకరింగ్ అంటున్నారు) స్వాగతోపన్యాసాలు ఇవ్వటానికి నన్ను ఉపయోగించుకునేవారు.

కాలేజి మేగజైన్లలో నా రచనలు విధిగా అచ్చయ్యేవి.

ఎటొచ్చీ ఆటపాటలలో బాగా వెనుకంజలో ఉండేవాడిని. ఎప్పుడన్నా ఆడితే కబడ్డీ, క్రికేట్ కాస్తా ఆడేవాడిని. మొత్తం మీద ఎక్కువ సమయం నేను- నా పుస్తకాలు అన్నట్టే ఉండేవాడిని.

ఇవన్నమాట నేను ఎదుర్కొన్న ఇబ్బందులు.

ఆయన కథలు కూడా బాగా వ్రాస్తారు. కథలు అంటే గుర్తు వచ్చింది. చాలా కాలం క్రితం చదివిన ఆయన వ్రాసిన కథ ఒకటి లీలగా గుర్తుంది .

కంపెనీ పని మీద మొదటి సారిగా ఫస్ట్ క్లాసులో ప్రయాణించాల్సి వచ్చిన ఒక వెంకట్రావు (అనుకుంటా) చాలా సేపు ఆ వాతావరణం లో ఇమడలేకపోతాడు.సాటి ప్రయాణీకులైన ఐశ్వర్యవంతుల మధ్య కుచించుకుపోతూ ఆత్మన్యూనతతో ఇబ్బంది పడతాడు. చాలా సేపు గొప్పలు పోయిన ఆ  ఐశ్వర్యవంతులు రైల్లో ఏదో అమ్ముకోటానికి వచ్చిన ఒక వెండర్ తో బేరం చేస్తూ చాలా చౌకబారుగా ప్రవర్తిస్తారు. అప్పుడు అతనికి ఆత్మవిశ్వాసం తలెత్తుతుంది. హాయిగా ఫ్రీగా మసలగలుగుతాడు ఆత్మన్యూనతని వదిలి.

ఇదేకథలో అనుకుంటా సింబాలిక్ గా, ఆత్మన్యూనతతో బాధపడే ఆ పాత్రని ఒక ఎలుక వచ్చి తన మీసాల్ని గాల్లో ఎగరేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. ఆత్మన్యూనతని జయించిన అతను కథ చివర్లో ఆ ఎలకపై బలంగా ఏదో వస్తువుని విసిరేసి  తన మానసిక స్థితి ని పాఠకులకు చూపిస్తాడు.

కొన్ని కథలలో ముగింపు స్పష్టంగా ఇవ్వకుండా పాఠకుల ఊహకే వదిలే వారు.

ఇందాకటి కథలో మీరు గమనించారా, పాఠకులలో వ్యక్తిత్వ నిర్మాణం అన్నప్రక్రియని చాలా సున్నితంగా చేసేవారు.

ఆయన ప్రస్తుతం వ్యక్తిత్వ వికాసరంగం లో ఉన్నారు అన్న సంగతి మనకు తెలిసిందే. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే, ఆయన తన నవలల్లోని పాత్రల ద్వారా కూడా పాఠకుల వ్యక్తిత్వ నిర్మాణం చేసే వారు అని నేను భావిస్తాను.

నా మనసు పై బాగా ముద్ర పడిన ఒక అంశం చెబుతాను. దీన్ని మీరు సహృదయంతో , ఓపెన్ మైండ్ తో చదవమని మనవి.

పర్ణశాలలోనో, ఋషి నవలలోనో గుర్తు లెదు, ఒక స్త్రీ పాత్రని విలన్లు ఏర్పాటు చేస్తారు, ఆవిడ కర్తవ్యం ఏమిటి అంటే,  హీరోను లోబరచుకుని అతన్ని కర్తవ్య విమూఢుడిని చేయడం.

ఆమె క్రమక్రమంగా వివస్త్ర అవుతూ, అదే క్రమంలో పైట తొలగించగానే, అత్యుత్తమ వ్యక్తిత్వం, సంస్కారం మూర్తీభవించిన హీరో పాత్ర నోటి వెంబడి ’అమ్మా’ అన్న పిలుపు అసంకల్పితంగానే వచ్చేస్తుంది.

పర స్త్రీ తల్లి వంటిది అన్న ఉపన్యాసం ఏది ఇవ్వకుండా ఇలాంటి బలమైన సంఘటన ద్వారా ఆయన తన పాఠకులలో చక్కటి సంస్కారాలు నింపేవాడు.

ధీరోదాత్తులు అయిన ఆయన కథానాయక  పాత్రలను ఈ కోణంతో పరిశీలిస్తే వ్యక్తిత్వ వికాసం సహజంగానే కలుగుతుంది. ’రైజింగ్ లైక్ ఎ ఫీనిక్స్’ అన్న విధంగా ఆయన పాత్రలు ఎన్ని కష్టాలు వచ్చినా చలించవు. కింద పడటం తప్పు కాదు , కింద పడి లేవకుండా అక్కడే పడి ఉండటం తప్పు. లే, లేచి పోరాటం చెయ్ అనే సందేశం ఇస్తాయి ఆయన పాత్రలు.

అందరాని ఎత్తుల్ని, స్వప్నాలని లక్ష్యంగా పెట్టుకుని గెలిచే కథానాయకులు,  బ్రతికి చెడి- తిరిగి ఉఛ్ఛ స్థితికి చేరుకునే కథా నాయకులు, వెన్నుపోటుకు గురి అయ్యి కూడా చౌకబారుగా పగ అని పెట్టుకోకుండా, తిరిగి తన విజయం ద్వారానే ప్రతీకారం తీర్చుకునే పాత్రలు, అంతుపట్టని రోగం పై విజయం సాధించే పాత్రలు, బాల్యంలో ఒక స్త్రీ  ఇచ్చిన ప్రేరణ కారణంగా  ఎదిగి, ఆ స్త్రీ మూర్తికి కృతఙ్జతలు చెప్పుకోవాలని తపన పడే పాత్రలు, మంచి మనసున్న మేష్టార్లు, మనసున్న పొలీసులు, మనసున్న డాక్టర్లు, మేధావులైన పాత్రలు

ఇటీవల కౌముది.నెట్ లో ఆయన చిత్రకారుడు చంద్రకి ఇచ్చిన ఇంటర్వ్యూ చదివాను.

తన నవలల వల్ల సమాజానికి ఏమి మంచి జరగడం లేదని, తన నవలలు కమర్షియల్ నవలలని ఆయన పదే పదే చెబుతుఉంటారు. ఈ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. ఈ విషయంలో నేను యండమూరి గారితో విభేదిస్తాను.

పాపులర్ నవలలు, కమర్షియల్ నవలలు అనే పదాలు ఎవరు కనిపెట్టారో తెలియదు గానీ ఆయన మనసుని ఎవరొ బాగా నొప్పించారు అనిమాత్రం అనిపించింది.

చదివించే గుణం (రీడబిలిటి) ఉండేలాగా వ్రాయటం తప్పయితే ఆయనది ముమ్మాటికీ తప్పే.

ఆయన నవలలు చదివి ఎంతో మంది అమ్మాయిలు వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు, ఎంతో మంది కుర్రాళ్ళు రెసిలియెన్స్ నేచర్ అలవరచుకున్నారు, ధీరోదాత్తత, కష్టించి పనిచేసే తత్వం, స్వంతంగా తమ వ్యాపారాలు తాము చేసుకోగలిగే గుణం, తెలుగుభాష పట్ల ప్రేమ, ఐక్యూ పెంచుకుని పెద్ద చదువులు చదవాలి అనే తత్వం అలవర్చుకున్నారు. వ్యక్తులను మార్చటంలో ఆయన నవలలు నిస్సందేహంగా దోహద పడ్డాయి.

ఆయన తన నవలల గూర్చి తక్కువ చేసుకుని మాట్లాడటం మానేయ్యాలి. అది వినయం కాదు, అది ఏమిటో చెప్పలేను.

ఇప్పుడు తలితండ్రులుగా మారిన అప్పటి యువత తమ పిల్లలకు నీహారిక అనే పేరు పెట్టుకున్నారు.

ఇక ఈయన కాంటెపరరీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి విషయానికి వస్తే ఆయన నవలలలొ ఎన్నో మంచి నవలలు ఉన్నాయి. ఆయన శైలి పూర్తిగా యండమూరి గారి శైలికి భిన్నం.

చాలా  సింపుల్గా , మనం నిత్యజీవితంలో మాట్లాడుకునేలాంటి మాటలు హాయిగా ఉంటాయి ఆయన వాక్యాలు.

అందుకే పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఆయనకు ’ఆంధ్రుల ఆహ్లాద రచయిత’ అని బిరుదు ఇచ్చారు. ఈ మాటని మల్లాది గారే తన ఇటీవలి పుస్తకంలో ఎడిటర్లతో తన ప్రయాణాలు అన్న శీర్షికలో వ్రాసుకున్నారు.

ఒక ఆసక్తికరమైన అంశం చెప్పుకొచ్చారు మల్లాది గారు తన ఇటివలి నవలవెనుక కథలో. అదేంటంటె "మల్లాది గారికి వచ్చే ఫాన్ మెయిల్ (లెటర్స్) ను చూసి యండమూరి గారు ఉడుక్కుని, నీకే ఎక్కువ లెటర్స్ వస్తాయి ఫాన్స్ నుంచి"  అని అనేశారట.

అది నిజమే కావచ్చు.

నేను కూడా మల్లాది వారికి చాలా లెటర్స్ వ్రాసేవాడిని ఆ రోజుల్లొ. ఆయన చాలా డిసిప్లిన్డ్. నాకు ప్రత్యుత్తరం ఇచ్చేవారు. ఫ్రం ఆడ్రెస్ స్థానంలో ఆయన ప్రత్యేకంగా తయారు చేయించుకున్నఅడ్రసు ప్రింట్ చేసిన స్టిక్కర్ బంగారు వర్ణంలో ఉండేది అతికించి పంపే వారు.

మల్లాది గారి పుస్తకంలో ఈ వాక్యం చదివి ఆలోచనలో పడ్డాను. ఈ విషయంలో నా అనాలిసిస్ (అంచనా) ఏమిటి అంటే చెబుతాను.

మనం ఒక గొప్ప గ్రంధం చదువుతాము. అది చదవంగానే ఆలోచనలో పడతాము. మన ఆలోచనలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తాము. ఎక్కడ కూర్చున్నా, ఏమి చేస్తున్నా ఆ పుస్తకం మనల్ని వెంబడిస్తునే ఉంటుంది. ఆ వాక్యాలు గుర్తు వస్తూ ఉంటాయి. ఆ రచయితని గుర్తు ఉంచుకుంటాము మనసులోనే . ఆయనకి లెటర్ వ్రాయాలని అనుకోము.

కౌటిల్యుడికో, అల్లసాని పెద్దనకో లెటర్ వ్రాయాలని అనుకోము కద. అలాగన్న మాట. యండమూరిగారు తన నవల ద్వారా పాఠకుడి మదిలో అలా ఒక ఎత్తైన స్థానం ఏర్పరుచుకునేవారు అనుకుంటా.

చేతన్ భగత్ నవల చదివాక ఆయనకి మెయిల్ పెట్టాలి అనిపిస్తుంది, అదే,  పౌలోకుయిలో గారి బుక్ చదివాక, ఆయనకి మెయిల్ పెట్టాలి అనిపించదు. ఆలోచించాలి అనిపిస్తుంది.

మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు సాదాసీదాగా అనిపించడం వల్ల పాఠకులు పర్సనల్ గా  కనెక్ట్ అయ్యేవారు అనుకుంటా. యండమూరి వీరేంద్రనాధ్ గారు ఒక గౌరవ స్థానం పొందేవారు పాఠకుల మనస్సులలో.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

మల్లాది వారి నవల స్రవంతి చదివాక ప్రతి ఒక్కరికి కాసేపు అనైతికమయిన ఆలోచనలు వస్తాయి. వివాహేతర సంబంధం పట్ల థ్రిల్ కలిగించేలాగా ఉంటుంది ఆ నవల ఆద్యంతం. అది చదివి చాలా మంది తమకు అలాంటి ఒక స్త్రీ పరిచయం అయితే బాగుంటుంది అని అనిపించింది అని చెప్పారని, మల్లాది వారే స్వయంగా తన నవలవెనుక కథలో చెప్పుకొచ్చారు.

వీరి నవలలలో ప్రధానంగా బలహీన మనస్కులైన సామాన్యులే కథానాయకులు. వీరికి త్రాగుడు, జూదం, వ్యభిచారం, ఇలాంటి బలహీనతలు ఉంటాయి. అంటే ఇక్కడ మల్లాది వారి రచనల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. సామాన్యులు నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాంటి వారు ఆయన నాయకులుగా ఉంటారు.

ఆయన చాలా రకాల జానర్లు టచ్ చేసి ఉండచ్చు, కానీ సామాజిక బాధ్యత లేని అసభ్య కథా వస్తువులు, ప్రతీకారం, హింస ఇలాంటి అంశాలు అన్నీ వారి నవలలలో సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి.

ఆయన నవలలలో చెప్పుకోదగ్గ ఎన్నో నవలలు ఉన్నప్పటికీ అడల్ట్ జోక్స్ ఆధారంగా నవలలు, అనైతిక కథాంశాలతో నవలలు వారు ఎందుకు వ్రాస్తారో నాకు అర్థం కాదు.

ఇటీవల ఆయన ఆధ్యాత్మిక అంశాలతో నవలలు వ్రాయటం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం.

ఏది ఏమైనా మల్లాది గారు కూడా తెలుగు పాపులర్ సాహిత్యంలో ఒక ధృవతార.

(ఇంకా ఉంది)

 

No comments:

Post a Comment