పుస్తకాలతో నా ప్రయాణం (Part 2)
ఒక ఙ్జాపకం -43
నా మీద విపరీతంగా ప్రభావం చూపిన
రచయితలలో యండమూరి వీరేంద్రనాధ్ గారు ఒకరు.
శైలి పరంగా ఆయనని అనుకరించిన ఎంతో
మందిలో నేను ఒకడిని.
****
’చప్పున ఆగిపోయాడు’
’అతడి దవడ కండరం బిగిసింది’ (ఇది
యద్దనపూడి సులోచనారాణి గారు కూడా వాడే వారు పేటెంట్ ఎవరిదో నాకు తెలియదు)
’అప్పుడు జరిగింది ఆ సంఘటన’
’ప్రియ పాఠకుడా అప్పుడు ఏమి
జరిగిందో తెలుసుకోవాలంటే ఒక రెండు రోజులు వెనక్కు వెళ్ళాలి’
’ఇంకాసేపట్లో జరగబోయే ఉత్పాతం
అతనికి తెలియదు’
’జేగురురంగు గోడలతో పోలీస్ స్టేషన్
వాతావరణం నిర్వేదంగా ఉంది’
’ఒక తీతువు వికృతంగా అరుస్తూ
ఎగిరిపోయింది’
’కాలిక్రింద ఎండుకొమ్మలు విరిగిన
చప్పుడు’
’జుత్తు విరబోసుకున్న దయ్యాల్లా
చెట్లు గాలికి ఊగి పోతున్నాయి’
’ఈ రాత్రికి నిశ్చయంగా ఏదో
జరగబోతోంది’
ఇలా ఆయనకే ప్రత్యేకమైన వాక్య
నిర్మాణాలు ఉత్కంఠని కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళేవి.
నేను డిగ్రీ చదివే రోజుల్లో , నేను నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వొకాబులారి డెవలెప్ చేసుకోవటంలో
భాగంగా ఫిల్మ్ ఫేర్ మాస పత్రిక ఎక్కువ చదివే వాడిని. నా (ఇంగ్లీష్ లాంగ్వేజి ఎలా
ఇంప్రూవ్ చేసుకున్నానో వివరంగా ఒక సిరీస్ వ్రాస్తాను)
ప్రస్తుతం ఫిల్మ్ ఫేర్ ప్రస్తావన
ఎందుకు తెచ్చానంటే, అందులో ఒక సెలెబ్రిటీ్ తో వారు చేసిన
ఇంటర్వ్యూ మనం చదవబోయే ముందు అక్కడి చుట్టుప్రక్కల వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు
వర్ణిస్తారు. ఆ భాష, ఆ పదప్రయోగాలు, ఆ
కవితాత్మక ధోరణి మనల్ని ఏదో లోకాలకు తీసుకువెళుతుంది. ఇదంతా
ఫిల్మ్ ఫేర్ చదివేటప్పుడు నేను పొందిన అనుభూతి.
అంతకు ఎన్నో సంవత్సరాల క్రితమే
యండమూరి గారి నవలల్లో ఈ అనుభూతిని పొందాను నేను. కాస్తా వివరంగా చెప్పే ప్రయత్నం
చేస్తాను.
పాఠకుడు తాను ఉన్న ప్రదేశం, సమయం అన్నీ మర్చిపోయి ఆ నవలలోని లోకానికి వెళ్ళిపోతాడు.
అక్కడి అణువణువు అతను అనుభూతి చెందగలడు. రంగు, రుచి, వాసన, స్పర్శ అన్నింటినీ అతను పొందగలడు ఆయన వాక్యాల
ద్వారా. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ వెనక్కు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం
రాదు. ముందుకు వెళ్ళిపోతుండటమే.
ప్రార్థన నవలలో అన్నాబత్తుల
(అనుకుంట) అనే పాత్ర మేడా మీద నుంచి కింద పడి ఇంటి వెనుక చెత్తలో పడతాడు. అతన్ని
ఎవరూ గమనించే అవకాశం లేదు. ఎముకలు విరిగి కదలలేక రాత్రంతా అక్కడే గడుపుతాడు.
అప్పుడు పంది కొక్కులు అతని దగ్గరికి వచ్చే దృశ్యం తలచుకుంటే ఇప్పటికీ నాకు వళ్ళు
జలదరిస్తుంది.
రాక్షసుడు నవలలో ద్వీపం మధ్యలో
అడవి వర్ణన.
తులసిదళంలో చివరి సీన్ లో స్మశానం
డేగరెక్కల చప్పుడులో ఆఫ్‍ఘనిస్తాన్, పాకిస్తాన్, మన పాత బస్తీలో ఇరుకు
సందులు ఇక్కడికి తీసుకువెళ్ళిపోతాడు ఆయన తన మాటలతో.
మొత్తం దృశ్యమే.
కమ్యూనికేషన్ అంటేనే మన
మస్థిష్కంలో దృశ్యాన్ని అలవోకగా చొప్పించటమే కద. ఈ విషయంలో ఈయన ముందు ఎవ్వరైనా
దిగగుడుపే.
ఇవన్నీ కాక ఆయా సంధర్భాలను బట్టి
చందోబద్దంగా ఉన్న సంస్కృత పదబంధాలతో కూడిన పదాడాంబరంతో ఉన్న వాక్య నిర్మాణంతో ఆ
సందర్భాన్ని బట్టి పూర్తి నిండుతనాన్ని చేకూరుస్తారు ఆ సన్నివేశానికి.
ఇలాంటప్పుడు కరుణశ్రీ, అల్లసాని పెద్దన, ధూర్జటి, శ్రీనాధుడు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గార్ల
పద్యాలు, కవితలు, పాటలు వచ్చేస్తాయి
అవసరమైతే.
ఇక్కడ అసందర్భమైనా ఒక మాట
చెపుతాను.
సంజయ్ లీలా బన్సాలీ సినిమాల్లో
దృశ్యాలు కానీ , పాటలు కానీ ఈ లక్షణం కలిగి ఉంటాయి. విశాలమైన
కాన్వాస్ లాంటి తెరపై మొత్తం సుసంపన్నంగా రంగులు, ఐశ్వర్యం
ఉట్టిపడుతూ అలంకరణలూ కళ్ళకు విందుగా ఉంటాయి.
ఇలాంటి అనుభూతి ఆయన తన
మాటల్తో/పదాల్తో మనకు కలిగిస్తారు యండమూరి వారు.
ఉదాహరణకి , అభిలాష నవల్లో చిరంజీవి తెల్లవారు ఝాముని ఉరితీయబడతాడు అనంగా
, ఇక వివశుడై యధార్తాన్ని పోలీసు కానిస్టేబుల్ కి చెప్పేస్తాడు.
అప్పుడు చిరంజీవిని రక్షించటానికి బయల్దేరుతాడు ఆ కానిస్టేబుల్.
అప్పుడు చిరంజీవి జైలు కటకటాలకి తల
ఆనిచ్చివంగి చూస్తూ చూపు ఆనిన మేరా ఆ కానిస్టేబుల్ వెళ్ళిన దిశగా చూసే దృశ్యం
సినిమా కంటే స్పష్టంగా పాఠకుడి మదిలో ముద్రించుకుని పోతుంది.
ఆ తరువాత నిద్ర మాత్రలు వేసుకుని
పడుకున్న రాధికని లేపటం, ఈ ఎపిసోడ్ అంతా సినిమాకన్నా స్పష్టంగా నా
మెదడులో ముద్రించుకు పోయింది.
సరిగ్గా ఈ కారణంగా ఆయన నవలలు
చదివిన పాఠకులకు ఆయన సినిమాలు పేలవంగా అనిపిస్తాయి.
ఇటీవల ఎస్ ఎస్ రాజమౌళీ కూడా అదే
మాట చెప్పారు, నా కలల్ని నేనే సినిమాలుగా తీయలేను. అంత
విస్తృతంగా ఉంటాయి నా కలలు అని. యండమూరి వీరేంద్రనాధ్ గారి నవలల్లోని వర్ణనలు కూడా
ఇదే కోవలోకి వస్తాయి. అదృష్టవశాత్తు ఆయన తనకలల్ని చక్కగా మన ముందు సరియైన పదాలతో
వాక్యనిర్మాణంతో, వర్ణనలతో మన ముందు ఉంచగలరు . అదే ఆయన విజయ
రహస్యం.
చెప్పాను కద నేను ఏడవ
తరగతి చదివేటప్పుడు మొదలెట్టాను తులసిదళం నవల చదవటం సీరియల్ గా అని.
ఒక చిన్న మలయమారుతంలా
ప్రారంభం అయి, తుఫాను పెనుగాలిలా, ఝంఝామారుతంలా తెలుగు సాహిత్యంలో
పెనుమార్పులకు నాంది పలికింది ఈ తులసిదళం. దీనికి నేను సాక్షిని.
ఈ సీరియల్
పూర్తయ్యేటప్పటికి మేము నూజివీడుకు మారాము మా నాన్నగారి బదిలీ వల్ల.
ఆంధ్రభూమితో పెద్ద
ఇబ్బంది ఒకటి ఉండేది. ఇప్పుడు స్వాతి కద ఠంచనుగా ప్రతి గురువారం వచ్చినట్టు ఆంభూ
వచ్చేది కాదు. వారికి ఏవో సాంకేతిక ఇబ్బందులు ఉండేవి అనుకుంటా.ఒక్కోసారి పదిరోజులు
అయినా వచ్చేది కాదు. ఒక్కోసారి డేట్ స్కిప్ చేసి రెండు వారాల తర్వాత డేట్ వేసి
విడుదల చేసే వారు మార్కెట్ లోనికి, ’ఇప్పటి దాకా కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము, ఇంక
మీదట రెగ్యులర్ గా విడుదలచేస్తాము’ అని ఒక హామీ ఇచ్చేవారు సికరాజు గారు. మళ్ళీ షరా
మామూలే అన్నట్టు ఉండేది.
కానీ తులసిదళం కోసం
ఎదురుచూపుల్లో ఈ చిన్న చిన్న అసౌకర్యాలని పాఠకులు పట్టించుకునే వారు కాదు.
ఇవన్నీ ఇలా ఉండగా, షాపుల్లో కాపీలూ వచ్చినవి వచ్చినట్టు హాట్
కేకుల్లా అమ్ముడుపోయేవి. అవి ఫలాన టైం కి వస్తాయని ఒక గారెంటీ లేదు, వచ్చినవి ఉంటాయని గారెంటీ లెదు. బడ్డి కొట్టు వాడికి లంచం ఇచ్చి మన కాపిని
అట్టిపెట్టమని చెప్పిన సందర్బాలు కోకొల్లలు. ఒక్కోసారి, నూజివీడు
నుండి విజయవాడకి మనిషిని పంపి కాపీలు తెప్పించుకున్న సందర్బాలు కూడా కద్దు.
మన తెలుగునాట ఈ
తులసిదళం సీరియల్ సృష్టించిన సంచలనం తో సరిపోల్చదగ్గ మరో సంఘటన అంటే శివ సినిమా
విడుదల అప్పుడు రాష్ట్రం మొత్తం ఎలా అయితే ఒక ఉన్మాదానికి గురి అయిందో సరిగ్గా అలా
జరిగింది తులసిదళం విప్లవం. రెండూ కూడా కళ్ళార చూసాను కాబట్టి చెప్పగలుగుతున్నాను.
యండమూరి వీరేంద్రనాధ్
గారిని తిట్టుకోకూడదు కానీ ప్రతి వారం
సీరియల్ చివర ’ఇంకా ఉంది’ అన్న పదం బ్రాకెట్లో కనపడగానే ’ఒరే... నీ దుంప తెగ’ అని
తిట్టుకునే వారు రాష్ట్రంలో ప్రజలందరు.
అంటే సస్పెన్స్ ని
పీక్స్ కి తీస్కువెళ్ళి సరిగ్గా అక్కడ ఆపేసే వారు ఆ వారానికి.
’కట్టప్ప బాహుబలిని
ఎందుకు చంపాడు?’ అన్న ప్రశ్న తెలుగుప్రజల్ని
అందర్ని ఎలా ఒక్కటి చేసిందో అలా ప్రతీవారం ఆయన మెలిక పెట్టి ఆపేసిన ఆ సస్పెన్స్
తాలూకూ అంశం గూర్చి ఎక్కడో చోట ప్రతి ఒక్కరూ, కాలేజీల్లో, రచ్చబండలపై , ప్రయాణాల్లో పక్కప్రయాణికులతో ,
ఆఫీసుల్లో కొలిగ్స్ తో నిరంతరం జరిగేవి.
అది తులసిదళం మానియా.
ఆయన ప్రతి నవలతోనూ నా
ఙ్జానం విస్తృతి అవుతూ వచ్చేది.
హిప్నాటిజం అంటే అదే
మొదటి సారి నేను వినటం, చేతబడి అన్నా అదే మొదటి సారి.
ఇలా ప్రతి నవలతోనూ ఆయన కొత్త విషయాలు తెలిపేవారు.
వచ్చే భాగంలో"
యండమూరి వీరేంద్రనాధ్
నవలలు చదవటం వల్ల నాకొచ్చిన చిక్కు
అయన పాత్రలలో
ధీరోధాత్తత
వ్యక్తిత్వ వికాసంలో
ఆయన నవలల పాత్ర
No comments:
Post a Comment