Tuesday, May 3, 2022

హృదయ పూర్వక కృతఙ్జతలు

 హృదయ పూర్వక కృతఙ్జతలు

----

"ఇంటర్నేషనల్ లీడర్స్ అండ్ అఛీవర్స్ అవార్డ్స్ -2022" అవార్డ్ నేను సాధించిన సందర్భంగా, నాకు అభినందనలు తెలిపి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతఙ్జతలు.

 

ఈ అవార్డ్ నా ప్రతి ఒక్క విద్యార్థికి అంకితం ఇస్తున్నాను. అందుకు కారణాలు ఏమిటో కూడా చెబుతాను ఇక్కడ.

ఒకటో కారణం  :

నా విద్యార్థులు అత్యంత ఉన్నత స్థానాల నుంచి వస్తుంటారు. నేను చెప్పినది చెప్పినట్టు ఒద్దికగా నేర్చుకుని తమ తమ రంగాలలో వారు మరింత అభివృద్ది సాధించటం వల్ల నలుగురూ వారిని అభినందిస్తూ ఉంటారు. వారిలో ఆ ఒబ్బిడి, వినయం, నేర్చుకోవాలనే తపన లేకుంటే, నేను ఎంత చక్కగా బోధించినా వృధా కద.  వారు నేను కేకలు వేస్తే పడ్డారు, తిడితే తిట్టిచ్చుకున్నారు, మరల మరల సాధన చేయమంటే తమ స్థాయిని మరిచి,  విసుక్కోకుండా చిన్న పిల్లలలాగా  సాధన చేశారు. మళ్ళీ తమ తమ కార్య క్షేత్రాలకి వెళ్ళి నన్ను పొగుడుతూ వారి మిత్రులను, సహ ఉద్యోగులను నా వద్దకు పంపారు.

కాబట్టి ఈ  అవార్డ్ కి సంబంధించిన ఘనత వారికే ఎక్కువ చెందుతుంది.

రెండో కారణం :

నిజానికి ఈ అవార్డ్ కి నన్ను  నా పూర్వ విద్యార్థులు నామినేట్ చేశారు అట. ఆపై అవార్డ్ కమిటీ వాళ్ళు సంస్థాగతంగా నా గూర్చి అధ్యయనం చేసి, నిజ నిర్ధారణ చేసుకున్నాక ఈ అవార్డ్ కి నన్ను ఎన్నిక చేశారు. నాకు అవార్డ్ వచ్చింది అని నేను ఈ మెయిల్ అందుకునే దాకా నాకు తెలియదు.  ఇదంతా నాకు విచిత్రమైన విషయం.

 

నా విద్యార్థులు వివిధ బాక్ గ్రౌండ్స్ నుంచి వస్తారు. దేశీయ, బహుళ జాతీయ కంపెనీలలో సీఈఓ స్థాయి అధికారులు, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ స్థాయి అధికారులు, ఐటీ, నాన్ ఐటీ కంపెనీలలో కీలక హోదాలో ఉండే వ్యక్తులు నా విద్యార్థులు గా ఉన్నారు.

అదే విధంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాలలో కీలక స్థానాలలో ఉన్న లబ్దప్రతిష్టులు అయిన ప్రముఖులు, అంతర్హాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన విద్వానులు, విదుషీమణులు నా పూర్వ, ప్రస్తుత విద్యార్థులలో ఉంటారు. కానీ ఏనాడు వారి నుంచి నేను ఏమీ ఆశించలేదు. అది వారందరికీ ఆశ్చర్యం. మా పిల్లలు కూడా తరచూ అంటూ ఉంటారు, "ఇంత సర్కిల్ పెట్టుకుని ఇంత సింపుల్ గా, నెమ్మదిగా ఉంటావు ఏమిటి నాన్నా" అని.

నాకు నా విద్యార్థుల విజయం తప్ప ఇంకేమి కాబట్టదు. కానీ వారందరూ ఏదో ఒక విధంగా నాకు సాయం చేయాలని సదా తపన పడుతూ ఉంటారు.  కానీ వారి నుంచి నామమాత్ర రుసుము వసూలు చేసి వారికి విద్యని అందించటం మినహా నేను వారితో ఏ విధమైన లావాదేవీలు సంబంధ బాంధవ్యాలు కొనసాగించలేదు. నాకు సిగ్గు ఎక్కువ. వాస్తవానికి నేను ఒక అంతర్ముఖుడిని , పైగా నాకు అత్యాశలు లేవు. ,  నేను ఎక్కువగా దూకుడుగా ఉండకపోవటానికి, ఇవి కూడా కారణాలు కావచ్చు.

అయినా వారు అనేక విధాలుగా నాకు మాట సాయం అందిస్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి సర్‍ప్రైజ్‍లు ఇస్తూ ఉంటారు. నేను అందుకున్న అవార్డులు అన్నీ ఇలాంటివే.

ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు. ఇటీవల మా అవిడ కాలు ఫ్రాక్చర్ అయిన సందర్భంగా క్లాస్ కి సడన్ గా శెలవు ప్రకటించాల్సి వచ్చింది ఓ సాయంత్రం. కారణం తెల్సుకుని ఆ బాచ్ లోని ఒక డాక్టర్ పూనుకుని , మీరు ఊరుకోండి సర్, మీకు తిక్కనా ఏమిటి అని నన్ను మందలించి,  లక్షాయాభైవేలు, రెండు లక్షలు అవ్వాల్సిన ఆపరేషన్ ని కేవలం యాభై వేలకే అయ్యే లాగా చేసి పెట్టాడు. ఇదంతా వారి మంచి తనమే తప్ప నా గొప్పతనం ఏమీ కాదు.

వారి ప్రేమ ఇలా వ్యక్తమౌతూ ఉంటుంది బహుశా.

మన హాస్యం గ్రూప్ లో కూడా తమ తమ రంగాలలో లబ్ద ప్రతిష్టుతులు అయిన వారు, వివిధ అవార్డులు పొందిన  నా విద్యార్థులు కొంతమంది ఉన్నారు. తమ పిల్లల్ని నా వద్ద చేర్పించిన వారూ ఉన్నారు. ఆయా వ్యక్తులందరూ కూడా పూర్తి సంతృప్తి తో ఉన్నారు నా శిక్షణ పట్ల.

అవార్డ్ రావటం గొప్ప కాదు, ’వీడి మొహానికి  అవార్డ్ ఏమిటి విడ్డూరం కాకపోతే’ అని ఎవరూ అనుకోకుంటే చాలు, అందుకే బాధ్యతగా నా పనులు నేను చక్కగా చేసుకుంటూ వెళుతుంటాను.

సర్! యూ రిచ్లీ డిసర్వ్ ఇట్’ ఇదే మాట నాకు చాలు. ఇది అవార్డ్ కంటే ఎక్కువ. దేవుని దయవల్ల నా విద్యార్థులు అందరూ ’యూ రిచ్లీ డిసర్వ్ ఇట్’ అనే అంటున్నారు. అది చాలు.

 

ఇక పోతే,  నా ఇంగ్లీష్ భాషా ప్రయాణం :

విద్యార్థి దశ నుండి కో ఎడ్యుకేషన్ విధానంలో చదువుకునే సందర్భాలలో ’అందర్నీ’ ఇంప్రెస్ చేయటానికి నేను నేర్చుకున్న ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ నాకు ఇలా భుక్తిని, గౌరవాన్ని కలిగిస్తున్నాయి. భగవంతునికి కృతఙ్జతలు.

నాకు ఇంగ్లీష్ ఎందుకు వచ్చిందో చెబుతాను.

ఖలేజా సినిమాలో మహేష్ బాబు, ’ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయి పోయాయి’ అని బాధ పడతాడు. నా పరిస్థితి అలా ఉండేది నా చిన్నప్పుడు.

రాయపెద్ది హనుమంతరావు సంతానానికి ఇంగ్లీష్ రాకపోవటమేమిటయ్యా అని నలుగురు చిన్నప్పటి నుంచీ నా మీద వత్తిడి పెంచేసే వారు. ’ఇది కాదు తియ్’ అని, నేర్చుకునే ప్రయత్నం చేసినా ఎవరూ పెద్దగా గుర్తించి అభినందించేవారు కాదు. హనుమంతరావు సంతానానికి ఇంగ్లీష్ ఎలాగు వస్తుంది అనే భావన, రాయపెద్ది అప్పా శాస్త్రి తమ్ముడికి ఇంగ్లీష్ రాకపోవటం వింత కానీ, వస్తే వింత ఏముంది అనే ధోరణి నాకు ఇంగ్లీష్ అంటే మంచి నీళ్ళ ప్రాయం అనే భావన కలిగింది. ఆ పై నేను ఎన్నుకోవాల్సి వచ్చిన వృత్తి కూడా నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవటానికి బాగా దోహదపడింది.

మెజిస్టీరియల్ హోదాలో, డిస్ట్రిక్ట్ సబ్ కలెక్టర్ గా రిటైర్ అయిన మా అప్ప (నాన్నగారు) ఇంట్లో తెలుగు వాతావరణాన్ని, సింప్లిసిటీ తో కూడిన జీవన విధానాన్ని, తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి కలిగేలాంటి వాతావరణాన్ని కల్పించారు. ఎన్నడూ అతిశయానికి పోయేవిధంగా మా జీవన విధానాన్ని ఆయన రూపుదిద్దలేదు. పదో తరగతి పూర్తయ్యే వరకు తెలుగు మీడియంలోనే చదువు అని కూడా నిర్దేశించారు.

ఎత్తింది మొదలు ఇంగ్లీష్ మీడియం లో చదివితే అటు కాకి నడక రాదు, ఇటు హంస నడకా రాదు అని మమ్మల్ని తెలుగు మీడియం లోనే వేశారు.

మా నాన్నగారి కోరికలు రెండు నా విషయంలో మరియు మా అన్నయ్య విషయంలో.

ఒకటి -మేము సంస్కృతం బాగా నేర్చుకోవాలన్నది,

రెండు - ఇంగ్లీష్ లో స్కాలర్స్ అవ్వాలన్నది.

ఈ రెండింటిలో ఇంగ్లీష్ కి సంబంధించిన కోరిక ని కొంతమేరకు నిజం చేశాను అని అనుకుంటాను.

మా అన్నయ్య సునాయాసంగా అయ్యేఎస్ ఆఫీసర్ అయ్యేఅవకాశాలు, ఇంట్లో  ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆయనకి మక్కువ ఉన్న ఇంగ్లీష్ లెక్చరింగ్ రంగాన్ని ఎన్నుకొని ఇంగ్లీష్ లెక్చరర్ అయి, ఆ తరువాత ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. అందువల్ల కూడా నాకు సహజంగా ఇంగ్లీష్ వచ్చేసింది. నేను ప్రయత్నం ఏమీ చేయలేదు ఇంగ్లీష్ విషయంగా.

కానీ నా ఇంగ్లీష్ బాగా అభివృద్ది అయ్యేదానికి మా నాన్న చిత్రంగా పునాదులు వేశారు.

ఆయన ఇంగ్లీష్ నేర్పించే ధొరణీ చాలా పవర్ ఫుల్ గా ఉండేది. ఒక పదానికి అర్థం అడిగితే ఆ  సాయంత్రం వరకు వివిధ సందర్భాలలో హఠాత్తుగా ఆ పదాన్ని  రక రకాలుగా వాడుతూ దానిని ఉపయోగించే విధానం నేర్పించేవారు.

ఇప్పుడు మా అప్ప సజీవంగా లేకున్నా, మా అన్నయ్య శ్రీ అప్పాజీ గారు నాకు ఇంగ్లీష్ విషయం లో ఇప్పటికీ చేదోడు వాదోడు గా ఉన్నారు. ఆయన నాకు తండ్రి తరువాత తండ్రి అంతటివారు. మా అన్న అప్పాజి గారి పాత్ర నా జీవితంలో మరువలేనిది.

 

మరొక్క సారి అందరికి వినమ్రంగా నమస్కరిస్తూ, కృతఙ్జతలు తెలియజేసుకుంటున్నాను.

No comments:

Post a Comment