స్టాన్లీ
(రెండవ మరియు చివరి భాగం)
ఒక ఙ్జాపకం -40
( మీరు ’స్టాన్లీ -
మొదటి భాగం చదివారా’
లేకుంటే ఇక్కడ లింకు ఇస్తున్నాను
చదవండి.
https://m.facebook.com/story.php?story_fbid=10219823973929940&id=1237660552
ఇక ఇక్కడ స్టాన్లీ - రెండవ మరియు చివరి భాగం చదవండి.
ఆకాశంలో సాయంత్రపు
కాషాయ వర్ణం స్థానంలో చీకటి తెరలు అలుముకుంటున్నాయి.
నేను, స్టాన్లీ ఇద్దరం బస్సు దిగి, నందలూరు అనే ఊర్లోకి నడుస్తున్నాము.
అదే మొదటి సారి నేను
నందలూరు అనే చిన్న గ్రామాన్ని చూడటం.
రాజంపేట వెళ్ళే
బస్సులో వచ్చి, మద్రాసు హైవే పై బస్సు దిగి ఊర్లోకి మట్టి రోడ్డుపై సుమారు రెండు
కిలోమీటర్లు నడవాలి.
ఇది దాదాపు ముఫై
సంవత్సరాల కిందటి మాట. అప్పట్లో హైవే మీదనుంచి ఊర్లోకి వెళ్ళేబాటకి అటు ఇటూ పొలాలు
ఉండేవి. నందలూరు చిత్రమైన ఊరు. మద్రాసు హైవే కి అటు సగం , ఇటు సగం ఉండేది ఆ ఊరు. రెండు సగాలని
విడదీస్తూ పొలాలు చాలా ఉండేవి.
కడప నుంచి మద్రాసు
వెళ్ళే హైవేపై బస్సు దిగి కుడివైపు వెళితే నందలూరు రైల్వే స్టేషన్, ఊరు ఉండేవి. మేము ఇప్పుడు వెళుతున్నది
ఆదిశలోనె.
అదే హైవే పై దిగి
ఎడమవైపు వెళితే నందలూరు యొక్క ఇంకో సగం, చారిత్రక సౌమ్యనాధస్వామి దేవాలయం వస్తాయి. నేను మూడేళ్ళ తర్వాత ఉద్యోగంలో
చేరాక కొన్నేళ్ళ పాటు ఈ నందలూరు ని
దర్శించటం నా వృత్తి ధర్మంగా ఉండేది. అందువల్ల ఆ ఊరి గూర్చి ఇంత వివరంగా
చెప్పగలుగుతున్నాను.
అసలా ప్రయాణమే
చిత్రంగా ప్రారంభం అయింది.
ఆ రోజు సాయంత్రం
బ్యాంకు కట్టేసే సమయానికి వెళ్ళాను నేను. ఆయన అప్పటికే బయల్దేరటానికి సిద్దంగా
ఉన్నాడు.
’మనం నందలూరు వెళదామా?’ అకస్మాత్తుగా అడిగాడు ఆయన.
నేను ఆయన వంక
ప్రశ్నార్థకంగా చూశాను.
"మా మిత్రుడిది
ఒక పాట కచేరి ఉంది నన్ను రమ్మని ఆహ్వానించాడు" అని చెప్పారు ఆయన.
అందులో అభ్యంతర
పెట్టాల్సిందేమి కనపళ్ళేదు నాకు. రాత్రి వచ్చేసరికి ఆలశ్యం అవుతుందేమో, మా ఇంట్లో చెప్పేసి వెళదాం అన్చెప్పి,
ఆయన్ని మా ఇంటికి తీసుకువెళ్ళాను.
కడపలో గాడిచర్ల
రామారావు వీధిలో ఉండేది మా ఇల్లు. అదే
వీధిలో ముందుకు వెళితే , మోచంపేట (చారిత్రక పేరు
మోక్షంపేట అట) వస్తుంది. అలాగే ముందుకు వెళితే బిల్టప్ జంక్షన్ దాటుకుని
పులివెందుల బాట పట్టవచ్చు.
మా ఇంటి వెనుక వైపు
భుజంగరావు వీధి, ఆ తర్వాత అంతా మధ్వ వీధి.
ఏతావాత ఇది అంతా పూర్వం ఒక అగ్రహారం కావచ్చు. ఇప్పుడు అదంతా చరిత్ర.
ఈ మోచంపేట, బిల్టపు పేర్లు గుర్తు పెట్టుకోండి.
ఇప్పుడు నేను చెప్పబోయె కథలో ఈ పేర్లు ఇంకొ సారి ప్రస్తావనకి వస్తాయి.
స్టాన్లీ వద్ద
హీరోహోండా సీడి 100 ఉండేది. దాన్లో మా ఇంటికి వచ్చి,మా అమ్మానాన్నలకు విషయం చెప్పి నందలూరుకి బయల్దేరాము.
ఆయన ని చూడ్డం అదే
మొదటి సారి మా అమ్మానాన్నలకు. ఆయన వినయం, విఙ్జానం తో కూడిన భాషణం వల్ల మా అమ్మానాన్నలకు ఆయన మీద సదభిప్రాయం
ఏర్పడింది.
ముఖ్యంగా నేను
డిప్రెషన్ వదిలి మనుషుల్లో పడటం వారిని చాలా ఆనందపరచింది.
సరే అలా మొదలయ్యింది
మా నందలూరు ప్రయాణం.
మాకు ముందుగ కాస్తా
దూరంలో ఒక బృందం కూడా నందలూరు వైపే వెళుతోంది. వాళ్ళ చేతుల్లో మృదంగం , తంబూర తదితర వాద్య పరికారాలు ఉన్నాయి.
"అరె ఏడుకొండలు
ఇంకా ఇక్కడే ఉన్నాడే" అని చిన్నగా అన్నాడు స్టాన్లీ.
ఆ బృందం లో
నడుచుకుంటూ వెళుతున్న ఓ మోస్తరు లావుగా
ఉన్న వ్యక్తిని చూపుతు చెప్పారు "ఆయనే ఏడుకొండలు నా ఫ్రెండు వారే ఈ కచేరిలో పాడేది"
పట్టు కుర్తా, పైజామ ధరించి ఓ మోస్తరు లావుగా ఉన్న ఆ
వ్యక్తి నడక కాస్తా గమ్మత్తుగా నాట్య శైలిలో ఉంది.
’ష్.. మాట్లాడకుండా
వెళ్ళి ఏడుకొండల్ని ఆశ్చర్య పరుద్దాం" అని మాటలు ఆపేసి నిశ్శబ్దంగా నడవటం
మొదలెట్టాడు స్టాన్లీ.
దూరం నుంచి గుర్తు
పట్టలేదు కానీ ఈ ఏడుకొండలు మా ఇంటి ముందు వెళుతుండగా చాలా సార్లు చూశాను. నాకు
ఆయనతోటి అదివరకే కాస్తా పరిచయం ఉంది. ఆయన ఇందాక నేను చెప్పానే మోచం పేట అన్న
వీధిలో రామకృష్ణ హైస్కూలు లోసంగీతం మేష్టారు.
ఆ తరువాతి రోజుల్లో
ఆయన గూర్చి ఈనాడు దినపత్రికలో కడప సప్లిమెంట్ లో సెంటర్ పేజిలో ఫోటోతో సహా వ్యాసం
వచ్చేలా చేసాను. దాంతో ఆయన ఓవర్ నైట్ ఒక సెలెబ్రిటి అయిపోయాడు వాళ్ళ స్కూల్లో., మరియు మా వీధిలో.
ఈనాడులో పని చేసే
కేశవరావు అనే కల్చరల్ కాంటిబ్యూటర్ తో నాకు పరిచయం ఉండేది ఆ రోజుల్లో. అతనికి
చెప్పి నేను ఈ చిన్న సాయం చేశాను. వెంకటేశ్వరరావు అలియాస్ ఏడుకొండలు గారు
అప్పట్నుంచి నన్ను చాలా అభిమానించేవారు. వాళ్ళ ఇంటికి ఆహ్వనించి విందుభోజనం
ఏర్పాటు చేశారు నాకు అనేక మార్లు. ఆయన శ్రీమతి రమ గారు నన్ను తమ్ముడు అంటు చాలా
అభిమానంగా చూసే వారు.
, కొన్ని సంవత్సరాల క్రితం,
ఈటీవీ లో "పాడతా తీయగా ....." కార్యక్రమంలో కడప నుంచి పాల్గొన్న సబీహ అన్న
అమ్మాయి మీకు గుర్తు ఉండే ఉంటుంది అనుకుంటా.
’నా పేరు సబీహా, కడప లొ బిల్టప్ దగ్గర మరియాపురంలో మా
ఇల్లు’ అంటూ ముద్దు మాటల్తో చెప్పిన ఆ అమ్మాయి మాటల్ని పదే పదే అడిగి
చెప్పించుకునే వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పీ గారు ఆట పట్టించటానికి
ఎన్ని సార్లు అడిగినా ఆ అమ్మాయి పాపం ఓపికగా చెప్పేది తన చిరునామ.
ఆ అమ్మాయి ఈ ఏడుకొండల
వెంకటేశ్వర రావు గారి శిష్యురాలు. ఆ అమ్మాయినే కాదు అనేక మంది ఔత్సాహిక
గాయనీగాయకులకు ఆయన శిక్షణ ఇచ్చాడు.
ఆ సంగతులు తర్వాత
చెపుతాను.
ఇక నందలూరు విషయానికి
వస్తే, ఆ సంగీత బ్రృందం రైల్వేస్టేషన్
వద్ద ఉన్న ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం కి చేరుకున్నారు. ’తోకెంబడి నారాయణా ’
అన్నట్టుగా మేము కూడా ఆడిటోరియం చేరుకున్నాం.
ఇందాకే చెప్పాను కద, వెంకటేశ్వర్లు గారికి సర్ప్రైజ్ ఇచ్చే
ఆలోచనలో ఉన్నారు స్టాన్లీ గారు అని.
మేము కూడా నేరుగా
వాళ్ళకు విడిదిగా ఇచ్చిన చిన్న గ్రీన్ రూం లాంటి దానికి చేరుకున్నాం. స్టాన్లీ
గారు నేనస్సలు ఊహించని విధంగా వెనకపాటుగా వెళ్ళి రెండు అరచేతులతో ఏడుకొండలు గారి
కళ్ళు మూసి "కనుక్కోండి చూద్దాం" అన్నారు.
వ్యక్తిగతంగా నాకు
ఇలాంటి మొరటు సరసాలు ఇష్టం ఉండదు. ఆయన నన్ను అలా చేసుంటే ఖచ్చితంగా చిరాకు
పడేవాడిని అనుకుంటా.
ఏడుకొండలు గారు కూడా
’అరె!స్టాన్లీ" అంటూ అరచి, గుర్తు
పట్టేశారు మొదటి ప్రయత్నంలోనె.
’మీరు రారేమో
అనుకున్నాను" అంటూ ఇంచుమించు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు ఆనందంతో.
నన్ను చూసి
సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు.
మొత్తానికి ఆ రోజు
స్టాన్లీ లో ఓ చిన్న పిల్లాడిని చూశాను.
అదే విధంగా డాన్స్
శ్రీను అనే మరో కుర్రాడు కడప నిర్మలా
కాన్వెంట్ లొ పనిచేస్తూ, దివ్య ట్యుటోరియల్ అని చెప్పి
ఓ చిన్న ట్యూషన్ పాయింట్ అప్సరా టాకీస్ దగ్గర శంకరాపురం లో నడిపేవాడు. బేసిగ్గా
అతనికి నాట్యం , సంగీతం అంటే ఇష్టం. చక్కటి డాన్సర్ అతను.
ఇతను స్టాన్లీతో ఒకసారి ’మీరు మమ్ముట్టు లాగుంటారు సార్’ అని
చెపుతూ అతనే సిగ్గుతో మెలికలు తిరిగి పోయాడు. ఈ డాన్సర్లు మామూలుగా మాట్లాడినా
నాకు తమాషాగానే ఉంటుంది.
ఈ శ్రీనివాస్ అనే కుర్రాడి గూర్చి వివరంగా ఒక ఙ్జాపకం
వ్రాయలి. అతను నాకు మొదట ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి.
ఆ దివ్యా ట్యుటోరియల్
పాయింట్ లో ఇంగ్లీష్ మరియు పర్సనాలిటి డెవలెప్ మెంట్ క్లాసెస్ చెబుదువు రమ్మని
నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అన్న అభిప్రాయానికొచ్చాడు
ఎందుకో అతను.
అక్కడు నేను పని
చేసింది మహా అంటె ఒక నెల అంతే. ఆ తరువాత ఆ శ్రీనివాస్ ఈతకు వెళ్ళి, లోతు లేని నీళ్ళలో అనుమానస్పద మృతికి గురయ్యాడు.
చిత్రమేమిటి అంటే అతను
నాకు మొదట సరదాగా ఇచ్చిన ఇంగ్లీష్, పర్సనాలిటీ డేవలప్మెంట్ రంగంలోనే
ఇప్పుడు నాకు అనుకోకుండా జీవనోపాధి లభిస్తోంది.
ఈ శ్రీనివాస్ తో చాలా చిలిపిగా, ఒకింత అసభ్యంగా కూడా జోకులు వేసి మాట్లాడేవాడు ఈ స్టాన్లీ.
ఆ తరువాతి రోజులలో NLP గూర్చి నాకు అవగాహన వచ్చిన తర్వాత నాకు
అర్థం అయింది , ఆయన ప్రవర్తన ని మిర్రరింగ్ అంటారని. ఆయనేమి
చెప్పలేదు నాకు ఇది ఫలాన అని. నేనే తెలుసుకున్నాను ఆయన్ని ఇంకో కొత్త కోణంలో.
అంటే ఎదుటి వ్యక్తి
స్థాయి ని బట్టి, అతని ఆలోచన సరళిని బట్టి,
అతని మాట తీరుని బట్టి, బాడీ లాంగ్వేజి ని
బట్టి ,అతని అభిరుచులని బట్టి అతనిలాగే ప్రవర్తిస్తూ అతనికి
దగ్గరవుతూ అతని నమ్మకాన్ని చూరగొనటం అన్నమాట.
బహుశా అతను ఈ
కారణంగానే కావచ్చు అజాత శత్రువు గా ఉండే వాడు.
ఆ వేళ పాట కచ్చేరి
కార్యక్రమం ముగించుకుని మేము బస్సులో తిరిగి వస్తుండగా, చెప్పాడు ఆయన.
"అదోనిలో నాగరాజ
కాశికర్ అనే ఒక బ్యాంకు ఎంప్లాయి ఉన్నారు. నేను ఆదోనిలో పని చేసిన కాలంలో నాకు
పరిచయం. ఆయన కర్ణాటక సంగీతంలో చాలా దిట్ట. నాకు అన్నమయ్య కీర్తనల గూర్చి, త్యాగరాయ కీర్తనల గూర్చి తెలిసింది మొదట
ఆయన దగ్గరే. నాగరాజ్ గారి దగ్గరే నేను వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని చదవటం అలవాటు
చేసుకున్నాను.
ఆ అలవాటు వల్లే నేను
ఆక్సిడెంట్ అయ్యాక కూడా పూర్తిగా పాజిటివ్ గా నా జీవితాన్ని మలచుకోగలిగాను"
తన ఆక్సిడెంట్ గూర్చి
ఆయన ప్రస్తావించడం ఇది రెండవ సారి.
"ఏమి
ఆక్సిడెంట్" అని నేను అడగలేదు. అది చెప్పే ఉద్దేశం లేకుంటే ఆయన ప్రస్తావించరు
కద. ఆయన్ ఫ్లోని అడ్డు పెట్టడం ఎందుకు అని వింటూ ఉండిపోయాను.
"ఇందాక నందలూరులో
వాళ్ళు కచేరి ప్రారంభించబోయే ముందు కర్ణాటక సంగీతపు త్రిమూర్తులు అనదగ్గ
శ్యామశాస్త్రి, త్యాగయ్య, ముత్తు స్వామి దీక్షితుల పటాలకు హారతి ఇచ్చి, మొక్కుకుని,
హారతిని కళ్ళకద్దుకున్నారు చూడండి, అలాగా నాకు
జట్కా బండి ఎక్కడ కనపడ్డా ఆ గుర్రాన్ని, జట్కా బండిని
కళ్ళకద్దుకుని మొక్కుకోబుద్దవుతుంది"
అర్థం లేని ఆ మాటలు
వెటకారంగా అంటున్నాడేమో అని ఆయన వంక అనుమానంగా చూశాను.
కాదు. ఆయన ఒక అలౌకిక
స్థితిలో చెప్పుకొని పోతున్నాడు.
బస్సు నందలూరు చెరువు
కట్ట పక్కన వెళుతూ ఉంది.
కండక్టర్ వచ్చి
టిక్కెట్లు ఇచ్చి వెళ్ళాడు.
"అవి నేను
ఆదోనిలో సిండికేట్ బ్యాంకులో పని చేస్తున్న రోజులు. ఒక రోజు కడపకని బయల్దేరి
రైల్వే స్టేషన్ చేరుకున్నాను. వర్షం చిరుజల్లులుగా కురుస్తోంది.
రైలు వచ్చింది. అక్కడ కేవలం ఒకటున్నర నిమిషమో, లేదా రెండు నిమిషాలో ఆగుతుంది. వెనుక నుంచి
మరాఠీ ప్రయాణీకులు తొందర పెట్టడం లో,
అసలే వర్షం కురుస్తోందేమో కాలు స్లిప్ అయ్యి, రైలుకి ప్లాట్ఫాం కి మధ్యలో జారి పడిపోయాను.
నేను చచ్చి పోయాననే
అనుకున్నాను. రైలు తాలూకు ఏ బలమైన భాగం తగిలిందో తెలియదు. వెన్నెముక
విరిగిపోయినట్టుగా నొప్పి. నరకయాతన. వేరే ఇతర గాయాలేమి కాలేదు. అప్పటికప్పుడు రైలు
ఆపేశారు.
ఎవరు రక్షించారో
తెలియదు. మెల్లిగా ప్లాట్ ఫాం పైకి లాగి పడుకుండబెట్టారు. నేను ఇంచు మించు స్పృహలో
లేను. వెన్ను లోంచి విపరీతమైన నొప్పి.
సాక్షాత్తు నరకంలో ఉన్నానేమో అనిపిస్తోంది.
నాకు పైకి కనిపిస్తూ ఏ
గాయాలు లేకుండా ఉండటం, నేను ప్రాణాలతోనే ఉండటం తో
చుట్టూ ఉన్న జనాలు పలచన బడ్డారు. రైలు కూడా వెళ్ళిపోయింది.
నన్ను నిలబెట్టే
ప్రయత్నం చేశారు. నా శరీరం ఏ మాత్రం సహకరించలేదు. అసలు కూర్చోలేకపోయాను, నిలబడలేకపోయాను.
అప్పట్లో ఆటోలు లేవు
ఎక్కువగా. అన్నీ రిక్షాలు, లేదా టాంగాలు ఉండేవి స్టేషన్
బయట.
టాంగా అంటే
గుర్రబ్బండే కానీ బెంచీ మీద కూర్చున్నట్టు కాళ్ళు వేలాడేసి కూర్చొనే బళ్ళు.
అలాంటివి ఎక్కువ ఉండేవి ఆ రోజుల్లో ఆదొనిలో.
దేవుడే పంపినట్టు ఆ
రోజు ఎందుకో మనిషి పడుకోటానికి వీలయ్యే జట్కా బండి ఆగి ఉంది బయట. నన్ను మెల్లిగా పడుకున్న వాడిని పడుకున్నట్టే
జట్కా బండిలో పడుకోబెట్టి స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు.
నన్ను అలా పడుకోబెట్టి
తీసుకురావటం చాలా మంచిదయిందని చెప్పారు
డాక్టర్లు. నా వెన్నుపూసలో ఏర్పడ్డ గాయం సామాన్యమయినది కాదని, నేను బ్రతకడమే మిరాకిల్ అని చెప్పుకొచ్చారు
డాక్టర్లు. నా వెన్ను పూస తీవ్రంగా దెబ్బతిందని, కూర్చోబెట్టే
ప్రయత్నం గాని బలవంతంగా చేసుంటే అక్కడే ప్రాణాలు పోయేవి అని చెప్పారు.
అందువల్ల ఎక్కడ
జట్కాలు కనపడ్డా, గుర్రానికి , బండి వానికి, ఆ బండికి మనసులోనే మొక్కుకుంటాను" అని నవ్వుతూ చెప్పారు.
ఇంతలో రైలు గేటు వేయటం
వల్ల బస్సు ఆగింది. బస్సంతా నిశ్శబ్దం ఆవరించింది.
ఆయన చెప్పటం
కొనసాగించాడు.
"ఆ తరువాత
ఆదోనిలో ప్రాధమిక చికిత్స చేసి, మత్తు
ఇంజెక్షన్లు ,నొప్పి తగ్గే మందులు ఇచ్చీ, రాయవేలూర్ కి నన్ను ఆంబులెన్స్ లో తరలించారు. నేను దాదాపు ఆరు నెలలు
ఆసుపత్రిలో మంచం మీదనే పడుకునుండి పోయాను. అక్కడ దశలవారీగా అనేక శస్త్ర చికిత్సలు
చేశారు. ’వెన్నెముక తీవ్రాతి తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆపరేషన్ సఫలీకృతం అయ్యే
అవకాశాలు పది శాతంకన్నా తక్కువే, కేవలం దైవం మీద భారం వేసి
నిమిత్త మాత్రులుగా వారు ఈ శస్త్ర చికిత్స చేపట్టుతున్నారు, దాని
వల్ల వచ్చే ప్రతీ పరిణామానికి సిద్దపడే ఈ ఆపరేషన్ కి నేను ఒప్పుకుంటున్నాను ’అని ప్రతి సారి నాతో పత్రాల మీద సంతకం తీస్కున్న
తర్వాతే శస్త్ర చికిత్స ఆరంభించే వారు.
అప్పటి నా మానసికి
స్థితి ఊహించు. ఆ తర్వాత నెమ్మదిగా కూర్చోవటం, నడవటం ప్రారంభించాను.
ఇప్పటికీ ప్రతి నెలా
ఒక సారి వెళ్ళి వస్తు ఉంటాను వెల్లూర్ కి ఆ వైద్యప్రక్రియలో భాగంగా.
నేను చూడ్డానికి
మామూలుగా ఉన్నాను కానీ అందరిలాంటిది కాదు నా ఆరోగ్యం. మూత్ర విసర్జనకి సంబధించి తీవ్రమయిన సమస్యలు ఏర్పడ్డాయి ఆ రైలు
ఆక్సిడెంట్ వల్ల.
ఇప్పటికీ భరింపలేని నొప్పి
వెన్నులో ఉంటూ ఉంటుంది. నొప్పి ని భరించటం, మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ నాకు నిత్య కృత్యమయి పోయాయి. నొప్పి తగ్గించే
మందులు వాడి వాడి
నేను భరింపలేని
శారీరిక కష్టం అనుభవిస్తున్నాను, విసర్జకావయవాలు
సరిగా పని చేయకుంటే దాని వల్ల కలిగే నరకం మాటల్లో చెప్పలేము.
ఉండుండి తీవ్రమయిన
జ్వరం, వళ్ళు నొప్పులు వస్తాయి,
సరిగా నడవలేను, ఎందుకు జన్మించానా అన్నంత
నొప్పి అవుతుంది. నేను అనుభవించే బాధ పగ
వాడికి కూడా వద్దు." అని చెప్పటం ముగించాడు.
అవును నిజమే. ఆయన తరచు
జ్వరం అని ఒళ్ళు నొప్పులు అని బాధ పడటం గమనించాను ఇదివరకే.
కూర్చోవటమే అపురూపం అనె పరిస్థితి
నిజానికి ఆయనది. అలాంటిది ఇలా మోటార్ సైకిల్ నడపటం, వృత్తి ఉద్యోగం నిర్వహించుకోవటం, అంతేకాకుండా ఆయన
నిరంతరం విపరీతమైన శారీరిక వేదన అనుభవిస్తూ కూడా అందరికీ తలలో నాలుకలాగా ఉండటం,
తనకు సాధ్యమయినంతమేరా నలుగురికి సాయపడగలగటం , సరదాగా
మాట్లాడగలగటం ఇవన్నీ కేవలం ఆయన ఆత్మ శక్తి వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి అని
చెప్పవచ్చు.
ఆయన రైలు ఆక్సిడెంట్
గూర్చి మొదటి సారిగా విన్నప్పుడు నాకు భూమి కదిలిపోయినట్టు అనిపించింది.
ఆయన నాలో మార్పు
ఆశించి ఏదో వ్యక్తిత్వ వికాస శిక్షణలో భాగంగా ఆ మాటలు చెప్పలేదు అని నా
విశ్వాసం. కాని ఆయన మాటలు నాపై చాలా
గాఢమైన ప్రభావం చూపాయి.
నేను డిప్రెషన్ లోంచి
బయటకు రావటంలోఆ నందలూరు ప్రయాణం చాలా ఉపయోగపడింది అనుకుంటాను.
కొత్త
వైద్యుడికన్నా పాత రోగి కి ఙ్జానం ఎక్కువ అని సామెత. ఆ తరువాత నేను మెడికల్
కంపెనీలొ జాబ్ లో చేరినప్పుడు గమనించాను. ఔషదరంగంలో, అనాటమీ, ఫిజియాలజీలో ఆయనకున్న లోతైన ఙ్జానాన్ని.
ఒక సారి ఆయనే చెప్పుకొచ్చాడు.
’మృత్యువుకి దగ్గరి వరకు వెళ్ళి
వచ్చాక జీవితం పట్ల నా దృక్పధమే మారి పోయింది. ఆరు నెలలు వేలూరు ఆసుపత్రిలో
గడిపినప్పుడు రకరకాల మనుషుల్ని, వారి బాధల్ని,
వారి వేదనల్ని దగ్గర్నుంచి చూశాను. ఆరు నెలలు మృత్యువు నాతో చెలగాటం
ఆడింది. మృత్యువు అంటే నాకు భయం పోయింది" అని.
నేను ఆ తర్వాత ప్రమోషన్ మీద
తమిళనాడు వెళ్ళి పోయాను. ఆ తర్వాత ఆయన్ని కలవటానికి వీలు లేకపోయింది.
ఆ తరువాత హైదరాబాద్ లో నేను స్వంత
ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం ఆ పనుల్లో తలమునకలుగా ఉండి పోవడం
జరిగింది. ఆయన గుర్తు ఉన్నాడే కానీ ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు అని కనుక్కొనే ప్రయత్నం చేయలేదు నేను.
కానీ అనుకోకుండా అయనే ఒక సారి
నన్నువెదకి పట్టుకున్నాడు. 2010
ప్రాంతాలలో హైదరాబాద్ లో నా ఇన్స్టిట్యూట్ కి వచ్చి కలిశాడు.
అనంతపురం జిల్లా గుత్తిలో ఆయనకు
తెలిసిన ఒక ఎంబీఏ కాలేజికి నన్ను గెస్ట్ లెక్చరర్ గా పిలిపించి తన మంచి
తనాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
హైదరాబాద్ లో ఓ మూడు రోజులు
ఉన్నారు ఒక సారి. వాళ్ళ చుట్టాలెవరింట్లోనో దిగారు. ప్రతి రోజు దిల్‍సుఖ్‍నగర్
లోని మా ట్రెయినింగ్ సెంటర్ కి వచ్చి సరదాగా మా ట్రెయినింగ్ ప్రోగ్రాంలు చూసేవాడు.
నేను ఆయన కోసం తీరుబాటు కల్పించుకోబోయినా నన్ను వారించి ’మీ పని మీరు చూసుకోండి, నా కోసం ఏదీ ఆపొద్దు. మీపై ఎంతో నమ్మకంతో వచ్చారు వారు అందరు’
అంటూ నాక్లాసులు సక్రమంగా సాగేలా
నడచుకున్నారు.
అదే సమయంలో ఓల్డ్ సిటీలో ఉన్న
నానక్ రాం భగవాన్ దాస్ అనే పీజీ కాలేజిలో నా వర్క్ షాప్ ఉంటే నాతోబాటు సరదాగా
చిన్న పిల్లాడిలా వచ్చి ఆద్యంతమూ నిశ్శబ్దంగా పాల్గొన్నాడు.
చురుకుగా వచ్చి ఫోటోల్లొ పాలు
పంచుకున్నాడు. నేను బలవంతం చేస్తే, మైకు
అందుకుని, మౌనం వీడి కొన్ని నిమిషాలు వారికి చక్కటి
మార్గదర్శనం చేశాడు.
వెళ్ళే ముందు ఆయన చెప్పిన మాటలు
నాకు ఇప్పటికీ గుర్తే.
’ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే
గర్వంగా ఉంది. కత్తిలా తయారయ్యారు. మీ వల్ల సమాజానికి,ముఖ్యంగా యువతకి చక్కటి మార్గ దర్శనం లబిస్తోంది. నేను మిమ్మల్ని చూడాలనుకుంది సరిగ్గా ఇలాగే"
అన్నారు ఆయన నన్ను హైదరాబాద్ లో కలిసినప్పుడు. ఆయన అన్న మాటలు గుర్తు వచ్చినప్పుడల్లా నాకు నా బాధ్యతలు గుర్తు
వస్తుంటాయి. నేను ఇప్పుడు స్వీకరించిన వృత్తి ద్వారా నేను చేయాల్సిన పని ఏమిటి
అన్నది నాకు ఎప్పటికప్పుడు ఆయన మాటలు గుర్తు చేస్తూ ఉంటాయి.
నేను ఈ విధంగా ఎదగడంలో స్టాన్లీ తో
పాటుగా, ప్రముఖ
పాత్ర పోషించిన శ్రీ ఏ.ఎం.తోపే గారు, లుపిన్ రాజు గారు,
మా అన్నయ్య శ్రీ అప్పాజీ గార్ల గూర్చి ఒక సారి వివరంగా ఙ్జాపకాలు
వ్రాస్తాను. చిత్రమేమిటంటే వారెవ్వరూ ఒకరికి ఒకరు తెలియదు. నా జీవితంలో వివిధ
దశల్లో వాళ్ళు గాఢమైన ప్రభావాన్ని చూపారు నాపై.
స్టాన్లీ మరోసారి ఓ
నాలుగేళ్ళ క్రితం నన్ను హైదరాబాద్ లో కలిశారు.
వాళ్ళ అమ్మాయి
వీసా పనుల మీద హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు.
నా దగ్గర
ఉన్న ఆయన ఫోన్ నెంబరు పని చేయటం లేదు. ఆయన ఫేస్ బుక్ లొ చివరి పోస్ట్ 19 మే డేట్ తో కనిపిస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నా
ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మల్లాది వెంకట
కృష్ణమూర్తి గారు ఒక కథ వ్రాశారు. అందులో ఒక బ్యాంకు ఉద్యోగి గూర్చిన చిత్రీకరణ
సరిగ్గా ఇలాగే ఉంటుంది. బహుశా స్టాన్లీ గూర్చి ఎవరైనా మల్లాది గారికి చెప్పారేమో
అన్నంతగా ఉంటుంది ఆ పాత్ర చిత్రణ.
No comments:
Post a Comment