ఒక ఙ్జాపకం
బస్సులో పాటలు
ఒక సారి వనపర్తి నుంచి హైదరాబాదు
కి వస్తున్నాను బస్సులో. అక్కడ ఏడుకో ఏడున్నరకో బయలుదేరింది బస్సు.
తమిళనాడు లో బస్సులో పాటలు పెట్టడం
అనేది అత్యంత సామాన్యమైన విషయం. కానీ మనదగ్గర ఏపిఎస్‍ఆర్‍టీసీ బస్సులలో అటువంటి
పద్దతి ఉండేది కాదు ఆ రోజుల్లో. మన దగ్గర నైట్ సర్వీస్ బస్సులలో వీడియో ఉంటుంది
కానీ మామూలు బస్సులలో పాటలు పెట్టడం తక్కువ.
సరే ఇలా పాటలు పెట్టిన బస్సులలో
ఎదురైన ఒక చిత్రమైన అనుభవాన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. అది ఏమిటంటే ఒకే
సినిమాలోని పాటల్ని ఆ ప్రయాణం ఆద్యంతం కాసెట్ ని తిప్పి తిప్పి పెట్టి వినిపించిన
డ్రైవర్ల గూర్చి ఇక్కడ చెబుతున్నాను ఇలా ఒక సారి కాదు, నాకు నాలుగు సార్లు జరిగింది.
ఈ వనపర్తి టు హైదరాబాద్ బస్సులో
డ్రైవర్ తన అభిరుచి కొద్ది బస్సులో మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేశాడు. సాధారణంగా ఏ
బీటు ఉండే పాటలో వేస్తాడేమో అని భయపడుతూ కూర్చున్నవాడిని బస్సు బయలుదేరిన
కాసేపటికి, అతడు ’ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’
సినిమాలోని పాటలు ప్లే చేయటం మొదలెట్టగానే ఒక విధమైన నిశ్చింతకి గురయ్యాను. హాయిగా
ఆ పాటల్ని వింటూ, ఎప్పుడు బిజినేపల్లి వచ్చిందో , ఎప్పుడు జడ్చర్ల వచ్చిందో కూడా గమనించలేదు.
పాటలన్ని అయిపోవచ్చినప్పుడు ఒక
విధమైన బాధకి గురయ్యాను. కాలేజి లో లాస్ట్ డే ఫేర్ వెల్ పార్టీ రోజు కలిగే లాంటి
తియ్యటి బాధ అది. అరెరె ఐపోతున్నాయే ఈ పాటలు, ఈ
డ్రైవర్ ఏ పాటలు వేస్తాడో నెక్ట్స్ అనుకునేలోగా మనల్ని ఆశ్చర్యపరుస్తూ తిరిగి అదే
కాసెట్ మళ్ళీ ప్లే చేశాడు. ఇలా ఒక సారి కాదు, హైదరాబాద్ చేరే
వరకు వేరే పాటలు పెడితే ఒట్టు.
కానీ అదొక తియ్యటి అనుభూతి. ఆ
పాటల్ని ఆ వింటూ ఆ జర్నీ ఆనందంగా గడిపేశాను.
ఈ ’ఔను...వాళ్ళిదరూ ఇష్టపడ్డారు’
సినిమా పాటలకు ఇలాంటి గౌరవం మరోసారి ఇలాగే హైదరాబాద్ టు విజయవాడ బస్సు ప్రయాణంలో
లభించింది.
ఇంకో సారి ఇలాగే వనపర్తి నుంచి
హైదరాబాద్ కి ఒక మెటాడోర్ వాన్ లో వచ్చాను. ఆ వాన్ డ్రైవర్ అయితే వెంకటేష్, అసిన్ లు నటించిన ఘర్షణ సినిమాలోని "యే చిలిపి కళ్ళలోని
కలవో, ఏ చిగురు గుండెలోన లయవో అన్న’ పాటను ఒక్కదానినే
ప్రయాణం ఆద్యంతం మొదలు ప్లే చేశాడు.
ఇలాగే ఒక సారి విజయవాడ నుంచి
వస్తున్న ప్రయాణంలో హైటేక్ బస్సు మధ్యాహ్నం రెండు ఆ ప్రాంతాలలో బయలు దేరింది. అవి
జయం సినిమా విడుదల అయిన కొత్తలు. ఎక్కడ చూసినా జయం పాటలే. ఆటోల్లో, బస్సుల్లో, హోటళ్ళలో, పందిళ్ళలో ఇలా ఎక్కడకి పోయినా అవే.
ఆ ప్రయాణంలో కూడా బస్సు డ్రైవర్
హైదరాబాద్ చేరే వరకు జయం సినిమా పాటల్నే ప్లే చేశాడు. వేరే పాటల కాసెట్లు ఉన్నా
కూడా వాటిని తాకను కూడా తాకలేదు.
ఇంకోసారి హైదరాబాద్
నుంచి కడపకు వెళ్ళేటప్పుడు బస్సు దొరకక ఒక జీపు లో కర్నూలు వరకూ వెళ్ళాల్సి
వచ్చింది. ఆ జీపు డ్రైవర్ కర్నూలు చేరే వరకు ’పెళ్ళి సందడి’ పాటల్ని మాత్రమే
వినిపించాడు.
ఇలాగే ’అల్లరి
ప్రియుడు’ సినిమా పాటలకి ఈ అరుదైన గౌరవం లభించింది అని మిత్రులు చెప్పారు.
స్వస్తి.
No comments:
Post a Comment