Tuesday, May 3, 2022

స్టాన్లీ (మొదటి భాగం)

 స్టాన్లీ  (మొదటి భాగం)

ఒక ఙ్జాపకం -39

 

1989-1992: నేను స్టాన్లీని కలిసిన కాలం అది.

 

1992 మార్చి లో నేను ఇప్కా లాబ్స్ లో మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేరాను.

ఈ మూడు సంవత్సరాల కాలం (89-92) నా జీవితంలో అత్యంత దుర్భరమైన సమయం అని చెప్పొచ్చు.

సకారణంగానా - అకారణంగానా అన్నది పక్కన పెడితే ఆ మూడు సంవత్సరాలు నేను తీవ్రమైన డిప్రెషన్లో  (నిరాశా నిస్పృహలలో)  గడిపాను. కెరియర్ లో తారాజువ్వలాగా దూసుకుపోవాల్సిన ఆ దశలో డిప్రెషన్ ని నెత్తికెక్కిచ్చుకుని , నిర్వ్యాపారంగా విలువైన సమయాన్ని వృధా చేసుకున్నాను.

"నీకేమి కావాలి" అని దేవుడు ఇప్పుడు కనపడి అడిగితే నేను మళ్ళీ నా జీవితాన్ని తిరిగి అక్కడ్నుంచి పునర్నిర్మించుకునే అవకాశం ఇవ్వమని అడుగుతాను బహుశా.

 

డేల్ కార్నెగీ వ్రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్  ఇన్ఫ్లు యెన్స్ పీపుల్, వెయిన్ డెయ్యర్ వ్రాసిన  యువర్ ఎర్రెనియస్ జోన్స్, నెపోలియన్ హిల్ వ్రాసిన పుస్తకాలు, టాన్సాక్షనల్ అనాలిసిస్ ఆధారంగా వ్రాయబడ్డ బార్న్ టు విన్, టఫ్ టైంస్ నెవ్వర్ లాస్ట్- బట్ ది టఫ్ పీపుల్ డూ, నార్మన్ విన్సెంట్ పీల్ వ్రాసిన ’ది పవరాఫ్ పాజిటివ్ థింకింగ్’ లాంటి పుస్తకాలు నేను మొదటిసారిగా చూసింది ఆయన దగ్గరే. ఆయన బలవంతం చేసి నన్ను అవన్నీ చదివించారు.,

ఆయనని కలిసిన ఙ్జాపకాలు, నాపై ఆయన చూపిన ప్రభావం మినహాయిస్తే నేను ఆ మూడు సంవత్సరాల కాలంలో గుర్తుంచుకోదగ్గ ఏ ఙ్జాపకం నా జీవితంలో లేదు.

నేను తీవ్రమయిన నాస్తికుడిగా కూడా ఉండిన రోజులు అవి. గుడి గోపురాలు అంటే చిరాకు, అవధూతలు, బాబాలు అంటే వళ్ళు మంట. తీవ్రాతి తీవ్ర పదజాలంతో తూలనాడేవాడిని బాబాల్ని, అవధూతలని.  ఒకట్రెండు సార్లు నాకు నచ్చజెప్పబోయి, మా అమ్మానాన్నలు మౌనంగా బాధపడేవారు. తలితండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో చూడండి " దైవదూషణ చేసే పాపం వాడితో ఎందుకు మూటకట్టించాలి" అని అనుకుని వేదనతో మౌనంగా ఉండి పోయే వారు.

నాన్నగారు డిప్యూటి కలెక్టర్ గా చేసి రిటైర్ అయి ఆనందంగా ఉన్నారు. ఆయనకు చెప్పుకోదగ్గ బాధ్యతలు ఏమి లేవు ఇక. ముగ్గురు అక్కయ్యలకూ పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద అన్నయ్య సెటిల్ అయి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.  అందరూ అమ్మానాన్నలకు చేదోడు వాదోడు గా ఉన్నారు.

వాస్తవానికి మా అమ్మానాన్నలు ఆనందంగా గడపటానికి అనువైన సమయం అది.

కాని ఇరవై ఏళ్ళ చెట్టంత మొగ పిల్లవాడు (అంటే నేను) అంతే లేని నిరాశా, నిస్పృహలలో కూరుకుపోయి, జీవఛ్చవంగా కళ్ళ ముందరే తిరుగుతూ ఉంటే  వారు ఎంత వేదన అనుభవించి ఉంటారో ఇప్పుడు నేను ఊహించగలను.  

ఆ రోజుల్లో నేను చేసిన ఒకే ఒక పనికొచ్చే పని బ్యాంకు ఉద్యోగాలకు తయారు అవ్వటం.

ఆ రోజుల్లొనే  క్షణం తీరిక లేకుండా కథలు వ్రాయటం.  ఆ రోజుల్లో నేను అత్యధిక సంఖ్యలో కథలు వ్రాశాను. దాదాపు అరవై కథలు వ్రాశాను ఆ కాలంలో.

మిత్రులెవ్వర్నీ కలిసే వాడిని కాను. నాలో నేనే ఒక లోకం లాగా ఉండే వాడిని.

ఆ రోజుల్లోనే అనుకోకుండా స్టాన్లీ విజయకుమార్ ని కలవడం తటస్థించింది. బ్యాంకు కోచింగ్ విషయంగా సాగర్ అని ఒక మిత్రుడు తానే చొరవ తీస్కుని వచ్చి నన్ను పదే పదే కలిసే వాడు. తను నన్ను బలవంతపెట్టి బయట తిరుగుదాం రా అని తీసుకువెళ్ళేవాడు.

ఒకసారి అలా బయటకు వెళ్ళినప్పుడు, ’ఒక్క నిమిషం మా బావ గారికి ఇంటితాళాలు ఇచ్చి వస్తాను. ఆయన ఇక్కడే బ్యాంకులో పని చేస్తుంటాడు, నువ్వు మాత్రం బయట నిలబడి ఉండటం ఎందుకు లోపలికిరా" అని చెప్పి నన్ను కూడా తీసుకుని కడప స్టేషన్ రోడ్డులో ఉన్న సిండికేట్ బ్యాంకు లోనికి తీస్కు వెళ్ళాడు సాగర్.

అప్పుడు చూశాను మొదటి సారిగా స్టాన్లీ విజయకుమార్ అనబడే ఆ వ్యక్తిని.  ఆయనే సాగర్ వాళ్ళ బావగారు. చూడంగానే ఎక్కడో చూసినట్టుందే ఈయన్ని అనుకున్నాను. ఆ తర్వాత మాట్లాడుతూ ఉంటే స్ఫురణకి వచ్చింది ,ఆయనలో మళయాళ కథానాయకుడు మమ్ముట్టి పోలికలు బాగా ఉన్నాయి అని.

అది మర్యాద కద , సాగర్ నన్ను ఆయనకి పరిచయం చేశాడు. ఎప్పట్నుంచో పరిచయం ఉన్న వాడిలా చాలా ఆప్యాయంగా మాట్లాడాడు స్టాన్లీ నాతో.

ఈ లోగా సాగర్ ఇంకొక మిత్రుడు ఎవరో తారస పడితే నన్ను కాస్తా ఆగమని చెప్పి అతనితో ఒక పది, పదిహేను నిమిషాల పాటు బయటికి వెళ్ళాడు.  

ఆ సమయంలో నేను స్టాన్లీని గమనించటానికి వీలయ్యింది.

ఆయన పేరు కూడా నాకు చాలా స్టైల్ గా అనిపించింది. వాళ్ళు క్రైస్తవులు అన్న విషయం నాకు అప్పుడే తెలిసింది.

కానీ ఆయనని ఒక మతానికి పరిమితం చేయటం చాలా పొరపాటు అన్నది త్వరలో తెలుసుకున్నాను.

అదేమి చిత్రమో ఇప్పటి వరకు,  నాకు తారస పడిన ప్రతి క్రైస్తవుడు హిందూ మతం గూర్చి చులకనగా మాట్లాడటమో, వాళ్ళ మతం లోకి మార్చే ప్రయత్నం చేయటమో చేసినవాడే.

కానీ స్టాన్లీ ఇందుకు భిన్నం.

ఆయన మాటల్లో మత ప్రసక్తి వచ్చేదే కాదు. ఇంకా చిత్రమేమిటంటే ఆయన ఒక గురువు వద్ద సుశ్రూష చేస్తూ, సశాస్తీయంగా కర్ణాటక సంగీతం, అందునా ప్రత్యేకించి, త్యాగరాజ స్వామి కీర్తనలు సాధన చేసేవాడు. ఆయన అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తనలు అద్భుతంగా పాడేవారు. వినాయకచవితి సందర్భంగా మండపాలలోనూ, ఇతర పర్వదినాల్లో ఎదయినా వేదికలపై చిన్న చిన్న కచేరిల్లో పాల్గొని హృద్యంగా పాడేవారు.

ఆయన అభిమాన గాయకుడు కేజే జేసుదాసు. ఆయన అభిమాన గాయకుడిని ఉడిపి శ్రీ కృష్ణుడి గుడిలోనికి, శబరిమలై ఆలయంలోనికి ఆ రోజుల్లో రానివ్వలేదని ఆయన బాధపడేవారు.

 

ఆయనకున్న ఈ సంగీత అభిరుచి కారణంగా ఆయన ద్వారా నాకు వెంకటేశ్వర్లు సార్ పరిచయం అయ్యాడు. (కానీ ఆయన్ని అందరూ ఏడుకొండలు సార్ అని పిలిచేవారు)

 

మాటల మధ్యలో ఒక సారి చెప్పారు ఆయన, తనకు జరిగిన రైలు ప్రమాదం గూర్చి.

ఆయన జీవితంలో జరిగిన ఆ రైలు ప్రమాదం గురించి విన్నప్పుడు నాకు కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది.

ఆయన జీవితంలోని విషాదం, గాజు బొమ్మలాంటి ఆయన ఆరోగ్య పరిస్థితి. అయినా చెక్కుచెదరని ఆయన ఆత్మ విశ్వాసం ఇవన్నీ ఆయన పట్ల నా దృక్పథంలో మార్పులు తీసుకువచ్చాయి.

ఈ ఙ్జాపకం యావత్తు ఆయన గూర్చే. ఇప్పటిదాకా నా మానసిక స్థితి ఇదంతా ఉపోద్ఘాతం మాత్రమే లేదా ఈ కథకి నేపధ్యం అనుకోవచ్చు.

అప్పటికి ఆయన అక్కడ క్యాషియర్ కమ్ క్లర్క్ మాత్రమే అయినా ఆ బ్యాంకు మేనేజర్ గారిని కలవటానికి వచ్చే జనాలకన్నా ఈయన్ని కలవటానికి వచ్చే మనుషులే ఎక్కువగా ఉండటం గమనించాను.

నన్ను అక్కడ ఎదురుచూస్తూ ఉండమని చెప్పి సాగర్ బయటకు వెళ్ళిన వైనాన్ని గమనించి , ఆయన పనుల వత్తిడి ఉన్నప్పటికీ బయటికి వచ్చి,  ఒక అద్దాల క్యాబిన్ లో లైట్లు ఫాన్లు వేసి నన్ను కూర్చోబెట్టి, నాకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేశాడు.

అదే మొదటి సారి ఆయనలోని మంచితనం నేను చూసింది.. ఆ తర్వాత ఆయనలోని మంచితనం తాలూకు విశ్వరూపం చాలా సార్లు చూశాను. ఎవరికి ఏది కావాలో అది అందజేసేవాడు. 

’ఎవరు ఆయన నుంచి ఏయే రూపాల్లో ఆయన ద్వారా సహాయం పొందాలి అని అనుకుంటారో ఆయా రూపాల్లో వారికి సహాయం చేసేవాడు అని అనటం కాస్తా అతిశయోక్తి గా అనిపించినా అది నిజం.

తనని వెదుక్కుంటూ వచ్చే వారిలో యువకులు, మధ్యవయస్కుల వారు, రిటైర్ అయిన వయో వృధ్దులు కూడా ఉండేవారు. ఎవరికి వారినే,  ఆయనకి  వారే ప్రత్యేకం అన్న భావన వ్యక్త పరుస్తూ, చిరునవ్వుతో వారికి సహాయం అందించే వాడు.

పనులు చేసి పెట్టటమే కాదు వారిని సాగనంపుతు వారి వారి వయస్సులను బట్టి ఒక నమస్కారమో, భుజం తట్టటమో, కరచాలనం చేయటమో చేసి పంపే వాడు. చిరునవ్వు మాత్రం కామన్ అందరికి. చిరునవ్వులు విరివిగా అందజేసేవాడు.

తొందర చేసి ఆయనని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని కొందరు, ఆయనకి పనులు అప్పజెప్పి పాస్ బుక్కు, గట్రా అందజేసి సాయంత్రం వస్తాం స్టాన్లీ అని చెప్పి వెళ్ళేవారు. కానీ ఇది ఆయనకు ఇంకో రకంగా ఇబ్బంది అని వారికి తెలియదు. ఆయన లంచ్ చేయటం మానుకుని వారి పనులు చేయటం నేను ఎన్నో సార్లు గమనించాను.

’ఎందుకు ఇంత శ్రమ పడతారు?’ అని నేను అడిగినప్పుడు ’మనకు తెలియకుండానే ప్రకృతి నుంచి, సమాజం నుంచి మనం ఎన్నో సాయాలు పొందుతుంటాము. మనం అనుక్షణం ఎందరికో ఎన్నింటికో ఋణపడుతూ ఉంటాము. నాకు తోచినంతలో అవసరమయినవారికి సాయం చేయటంలో కొంతలో కొంత ఆ ఋణభారం నుంచి బయట పడిన భావన కలుగుతుంది’. అని నవ్వుతూ చెప్పేవాడు.

ఆయన అలా చెప్పినప్పుడు బడాయి ఏమో అనుకున్నాను మొదట.

ఆయన్ని నన్ను కలపడంతో సాగర్ పాత్ర అయిపోయింది నా జీవితంలో. ఆ తర్వాత సాగర్ ని నేను అనేక సార్లు కల్సినప్పటికి, అతనితో పెద్దగా చెప్పుకోదగ్గ ఙ్జాపకాలు ఏమి లేవు. సాగర్ కి , నాకు అంతకు మించి పెద్దగా స్నేహం ముందుకు సాగలేదు. అతనొక మంచి వాడు అంతవరకే. ఇంటెలెక్చువల్ గా అతనికి పెద్దగా  లోతులేకపోవటం ఒక కారణం అనుకుంటా మా  స్నేహం ముందుకు సాగలేదు. కాని అతను నాకున్న మంచి స్నేహితుల్లో ఒకడు.

 

సరే స్టాన్లీ విషయానికి వద్దాం.

నాజీవితంలో చక్కటి మార్పులు రావటానికి అతను ఒక కారణం అవుతాడు అని నేను అప్పట్లో ఊహించలేదు. , ఒక ఇంట్రావర్ట్ గా ఉన్న నన్ను చురుకుగా మార్చటంలో అతని పాత్ర పెద్దదే.

నేను  ఆదోని లో చదువుకున్న విషయం ఒక సారి మాటల మధ్య వచ్చి ’మీకు నాగరాజ కాశికర్ తెలుసా?’ అని ప్రశ్నించాడు స్టాన్లీ.

’నాకు తెలియదు’ అన్నాను

’నా పిచ్చి గాని, మీకు తెలిసే అవకాశం లేదులెండి. ఆయన బ్యాంకు ఎంప్లాయి. మీరు ఆదోనిలో ఉన్నప్పుడు కేవలం స్టూడెంటేగా.....’ అని ఆగి ’ నా జీవితంలో ఆయన ప్రభావం చాలా లోతైనది’ అని అన్నాడు.

స్టాన్లీ ముఖ భంగిమ చూస్తే ఏదో ముఖ్యమైన విషయం చెపుతున్నాడు అని నా కర్థం అయింది. శ్రద్దగా వినటం మొదలెట్టాను.

అదే మొదటి సారి అయన తన రైలు ఆక్సిడెంట్ గూర్చి చెప్పడం. ఆయన చెప్పింది విని నా కాళ్ళక్రింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది.  (ఇంకా  ఉంది)

 

 

 

 

No comments:

Post a Comment