ఒక అపరిచితుడు
ఒక ఙ్జాపకం-41
ఈ సంఘటన లో కాస్తా
భీబత్స రసం, మానవత్వం కరుణ ఇమిడి ఉన్నాయి.
అనుకోని రీతిలో సహాయం అందితే అది అందుకున్నవారికి ఎంత తీయగా ఉంటుందో తెలిసింది
నాకు ఈ సంఘటన ద్వారా.
మరీ భయంకరమయిన అనుభవం
కాకున్నా బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన అనే చెప్పాలి.
పొయిన సంవత్సరం, అంటే 2019 విజయదశమికి బీచుపల్లి కి వెళ్ళి
ఆంజనేయస్వామిని దర్శించుకుని రావాలని అనిపించింది. ఉదయాన్నే కార్లో బయలుదేరి
స్వామి దర్శనం చేసుకుని, మధ్యాహ్నం అక్కడే భోంచేసి కాసేపు
విశ్రాంతి తీసుకున్నాము.
మధ్యాహ్నం దాదాపు
రెండు, రెండున్నర మధ్య హైదరాబాదు కి
బయల్దేరాము. కార్ నేనే నడుపుతున్నాను.
ఆ రోజు ఎండ కాస్తా
ఎక్కువే ఉంది.
కార్ కిటికీ అద్దాలని
పారదర్శకంగానే ఉంచాము, బ్లాక్ ఫిల్మ్ సుప్రీం కోర్టు
ఉత్తర్వుల కారణంగాఅంటించలేదు. ఏండ తీవ్రంగా గుచ్చుకుంటోంది. అందుకే ఎండ వచ్చేవైపు
కి కిటికి అద్దాలకు టవళ్ళు తగిలించి ఉంచాము.
గత వారం రోజులుగా కార్
ఏసీ తగినంత చల్లదనాన్ని ఇవ్వటం లేదని గమనించాను. సరేలే ఈ ట్రిప్ అయ్యాక చూపిద్దాం
అని తాత్సారం చేశాను.
ఆ నిర్లక్ష్యమే మా
కొంప ముంచింది ఆ వేళ.
హైవే విశాలంగా ఉండటం
వల్ల వేగం నూరు కిలోమీటర్లదాకా తాకుతున్నాను. ఏసీ పూర్తి స్తాయిలో ఆన్ చేసి
ఉన్నప్పటికి, బ్లోయర్ చప్పుడు వస్తూందే గాని
చల్లదనం చాలా తక్కువ స్థాయిలో లభిస్తోంది.
అసలే ఎండ వేడిమి
ఎక్కువగా ఉంది. ఏసీ చూస్తే బాగా ఇబ్బంది పెడుతోంది.
సరే ప్రయాణం
సాగుతోంది.
బీచుపల్లి
బ్రిడ్జి , పెబ్బేరు క్రాసింగ్ దాటి శాఖాపూర్ టోల్ ప్లాజా దాకా వచ్చాము.
ఫాస్టాగ్ ఖచ్చితంగా
ఉండాలి అన్న నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు అప్పటికి. అందుకే ఇంకా ఫాస్టాగ్ కొని అతికించలేదు కార్
కి. ఆ కారణంగా టోల్ గేట్ దగ్గర కార్ ని ఆపాల్సి వచ్చింది. అది ఒకందుకు మంచిదే
అయింది.
ఉదయాన్నే వచ్చేటప్పుడు
రాక-పోక (టూ వే) కి టోల్ ఒకే విడత చెల్లించి రసీదు తీస్కున్నాను.
ఇప్పుడు తిరుగుప్రయాణంలో
అది చూపటానికి కార్ కిటికీ అద్దం దించి, టోల్ బూత్ అద్దాల కాబిన్ లోని కుర్రాడికి రశీదు తీసి అందించాను. ఈ లోగా
అక్కడే ఉన్న మరో కుర్రాడు, కంప్యూటర్ ముందర ఉన్నకుర్రాడికి
నా కార్ ని చూపిస్తూ ఏదో చెప్పాడు. అతని వస్త్రధారణ బట్టి టోల్ గేట్ తాలూకు స్టాఫ్
అని అర్థం అవుతోంది,
వాళ్ళు నాతో ఏమి
చెప్పలేదు.
నేనే చొరవ తీసుకుని
అడిగాను ’ఏమయింది’ అని.
అప్పటికే ఏదో కాలిన
వాసన మా ముక్కుపుటాల్ని సోకుతోంది.
ఆ కుర్రాడు కాస్త
నిర్లక్షంగా ’ఆ ఏమి లేదు సార్. ఏదొ పొగ వస్తోంది మీ కార్ కింద నుంచి’ అన్నాడు
హిందిలొ.
టోల్ గేట్ తెర్చుకుంది.
ఈ లోగా వెనుక వున్న కార్లు హారన్ మోత మోగిస్తుండటంతో, నేను రసీదు తీస్కుని, కార్ ని ముందుకు ఉరికించి ఓ ఇరవై అడుగులు ముందుకు వచ్చాను. ఇంకా టోల్ గేట్
ఆవరణలోనే ఉన్నాము.
తలెత్తి మిర్రర్ లో
వెనుక ఏమి జరుగుతోందో అని చూద్దును గదా వెనుకంతా దట్టమైన పొగ.
ఇక నేను ముందు వెనుక
ఆలోచించకుండా కారు రాంగ్ సైడ్ అయితే అయింది అని అలాగే ఆపేసి, "కారు ఇంజిన్ లో ఏదో అగ్ని రాజుకుంది,
వెంటనే దిగేసెయ్యండి అని చెప్పి’ ఇంజిన్ ఆఫ్ చేసి, నా ఫోన్, హెడ్
ఫోన్లు తీసుకుని దిగేశాను. పక్కనే కూర్చుని ఉన్న మా అబ్బాయి అటు వేపు డోర్ తీసుకుని
దిగేశాడు. వెనుక సీట్లో ఉన్న మా ఆవిడ, అమ్మాయి కూడా చేతికి
దొరికిన ముఖ్యమయిన లగేజిని తీస్కొని దిగేశారు. కార్ లోంచి పొగ వచి కార్ క్షణాల్లో అంటుకుని అగ్ని కీలల్లో
చిక్కుకుంది అన్న వార్తలు పేపర్లలో చదివి ఉండటం వల్ల అందరం అప్రమత్తులం అయి
దిగాము. నా స్నేహితుడి తమ్ముడి కారు (టాటా క్జీటా పెట్రోల్) ఇటీవలే తిరుపతి కడప
దారిలో అర్దరాత్రి అగ్నిలో ఆహుతు అయిన విషయం ఇంకా మా మదిలో తాజాగా ఉండటం వల్ల
అందరం అప్రమత్తులమై దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాము. ఇక ప్రాణభయం లేదు.
దిగిన తర్వాత నేను
చేసిన మొదటి పని - బానెట్ తెరిచి, ఇంజిన్
లోకి వంగి చూశాను. మా ఆవిడ వారిస్తూనే ఉంది, దూరం వచ్చేయండి
కారు పేలిపోతుందో ఏమో అని. కానీ తెలుసుకోవాలి కద అసలు సమస్య ఏమిటో.
బానెట్ తెరువంగానే పొగ
ఒక్కసారిగా పైకి ఎగసింది. ఇంతసేపు కారు వేగం కారణంగా ఆ దట్టమైన పొగ, వెనుక వైపుకు ప్రయాణించింది. ఇప్పుడు కారు కదలటం లేదు కాబట్టి అన్ని
వైపులకు స్వేఛ్చగా అలుముకుంటోంది. అయితే మంటలేమి కన్పించటం లేదు.
కాకపోతే నాసికా
పుటాల్ని బద్దలు కొట్టేలా కంపు.
ఒకట్రెండు లారీలు
చోద్యం చూస్తూ మమ్మల్ని దాటి పోయాయి.
ఇంత జరుగుతున్నా టోల్
గేట్ సిబ్బంది ఒక్క అంగుళం కూడా మా వైపు కదిలి రాలేదు.
కాసేపటికి పొగ తీవ్రత
తగ్గింది. నాకు కార్ నడపటం లో సామర్థ్యం ఉందే గానీ ఇలాంటి ఉత్పాతాలు ఏర్పడితే ఎలా
ఎదుర్కోవాలో అనుభవం లేదు.
కారు ఆగిపోగానే అందరూ
బానెట్ తెరచి చూస్తుంటారు కద అన్చెప్పి నేను కూడా బానెట్ ఎత్తి కుర్చున్నానే కానీ
నాకు ఇంజిన్ రిపేరింగ్ లో ఓనమాలు తెలియవు. రిపేరింగ్ వరకు ఎందుకు బానెట్ తెరిచి
చూడంగానే ఇంజిన్ లో ఉన్న భాగాల పేర్లు సైతం నాకు తెలియవు.
కాస్తా సీరియస్ గా
ఇంజిన్ లోని అన్ని భాగాల్ని ఒక సారి తేరిపారా చూశాను. నాకు బాగా పేర్లు తెలిసిన
భాగాలు రేడియేటర్. బ్యాటరి. అంతే మిగతావి పేర్లు కూడా తెలియదు. ఎక్కడ ఏది నొక్కితే
ఏమి జరుగుతుందో తెలియదు. కొన్ని పైపులు ఎక్కడినుంచో బయలుదేరి ఎక్కడికో వెళుతూ
ఉన్నాయి.
గంభిరంగా తలపంకించి, అవసరమయినదానికన్న ఎక్కువ ఏకాగ్రతతో ఇంజిన్
ని చూస్తూ ఉండిపోయాను కాసేపు.
నగరానికి దాదాపు రెండు
వందలకిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయాము. ఈ కార్ కదుల్తుందా తెలియదు. కనీసం పేలి
పోకుండా, అగ్ని కీలల్లో చిక్కుకోకుండా
క్షేమంగా ఉంటుందా అదీ తెలియదు.
అంతా అగమ్యగోచరంగా
ఉంది.
ఉండుండి టోల్ గేట్
సెక్యూరిటీ వాడు విజిల్ వేసి కారు దారిలో అడ్డుతీయమని సైగ చేస్తున్నాడు.
మాకు అయోమయంగా ఉంది.
టోల్ గేట్ సిబ్బంది ఏ మాత్రం సహాయం అందించకుండా చోద్యం చూస్తున్నారు. మాకు ఏమీ
పాలుపోవడంలేదు. ఇల్లు ఎలా చేరాలి? ఈ
కారు పరిస్థితి ఏమిటి? దీన్ని ఇక్కడే వదిలెయ్యాలా, పిల్లల్ల్ని మా ఆవిడని ఏదేని బస్ ఎక్కించి పంపి, నేను
సుజుకి సర్వీస్ వాణ్ణి పిలిపించుకోవాలా ?
ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నాను.
ఈ లోగా మా
పక్క నుంచే ఒక ఇండికా కారు వెళ్ళింది.
అది అలాగే
ముందుకు వెళ్ళీ మెల్లిగా రోడ్డుకి ఎడమవైపుకి తీసి ఆగింది.ఆగిన ఆ కారు డోర్
తెరచుకుని ఒక యువకుడు దిగాడు. మహా అంటె అతనికి పాతిక సంవత్సరాలు ఉంటాయి. కాస్తా
చామన చాయ.
కారు ఆగిన
దగ్గర నుంచి మా వద్దకు నెమ్మదిగా వచ్చాడు.
అతడు
రావటం రావటమే, తెరచి
ఉంచిన బోనెట్ లోకి తల దూర్చి ఇంజిన్లో కొద్ది కొద్దిగా పొగ వస్తున్న భాగంవంక చూసి
ఒకే మాట అడిగాడు
"మీ
ఏసి చల్లదనం ఎలా ఉంది?" అని
’గత వారం
రోజులుగా ఏసీ పనితనం తగ్గుతూ వస్తోంది. ఇవ్వాళ అది అసలు చల్లదనమే ఇవ్వలేదు. కేవలం
బ్లోయర్ చప్పుడు తో వెచ్చటి గాలి మాత్రమే వచ్చింది" అని చెప్పాను నేను.
ఒక
అనుభవఙ్జుడు అయిన వైద్యుడు నాడి చూసి వ్యాధి నిర్దారణ చేసినట్టు అతడు క్షణంలో ఆ
సమస్యకు మూలకారణం చెప్పి, దానికి తగిన పరిష్కారం కూడా చెప్పేశాడు.
’ఇది ఏసీ
లో సమస్య. ఏసీ యూనిట్ కాలిపోయింది. ఇలాగే నడిపితే కారు కు ప్రమాదం. ముందుగా నేను
ఇంజిన్ నుంచి దానికి అనుసంధానించి ఉన్న బెల్టుని తీసేస్తాను. అప్పుడు ఏసీ పని
చేయదు. మీరు హైదరాబాద్ దాకా వెళ్ళిపోవచ్చు.
అక్కడికెళ్ళాక
కంపెనీ సర్వీసింగ్ సెంటర్ కి వెళ్ళీ సరిచేయించుకోవచ్చు" అని తన తిర్మానం
ప్రకటించాడు.
అతని
మాటలమధ్యలో తెలిసింది ఏమిటి అంటే హైదరాబాద్ లో అతని కి కార్ సర్వీసింగ్ వర్క్ షాప్
ఉందని , ’అయినా మీరు బయట ఇవ్వరు లెండి,
కంపెనీ సర్వీస్ సెంటర్లో మాత్రమే ఇస్తుంటారు అని అర్థం అవుతోంది
అన్న మాటలప్పుడు చెప్పాడు ఆ సంగతీ.
మెము
ఇంతవరకు కారు ని బయట ఎక్కడా సర్వీసు కు ఇవ్వలేదని కనిపెట్టాడు, ఏసీలో సమస్య ఉందని కనిపెట్టాడు,
ఇలా అతను కనిపెట్టిన అనేక అంశాలు చాలా సూక్షమైనవి. మాకు ఆశ్చర్యం
వేసింది అతని పరిఙ్జానికి.
మేము అతని
ప్రొపోసల్ కి అంగీకారం వ్యక్తపరచగానే ఏసీని అనుసంధానిస్తున్న బెల్టును తొలగించాడు.
కాకపోతే అతను అనుకున్నంత సులభంగా రాలేదు
అది. ఇంజిన్ వేడివల్ల ఆ ప్రయత్నంలో అతని చేతులకు చిన్న బొబ్బలు కూడా అయ్యాయి.
చివరికి
అత్యంత కష్టం మీద ఆ బెల్టుని తొలగించి ’ఇక మీరు నిశ్చింతగా బయలుదేరి క్షేమంగా
చేరండి" అని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు.
ఆ
హడావుడిలో అతనెవరో, అతని పేరేమిటో , అతని ఫోన్ నెంబర్ ఏమిటో ఇలా ఏ వివరాలు మేము అడగలేదు. మెరుపులా వచ్చి
మెరుపులా మాయమైన ఆ అపద్భాందవుడికి నమస్కారం అందజేయటం మినహా ఏమిచేయలేను.
సాయం
చేయాల్సిన టోల్ గేట్ సిబ్బంది నిమ్మకు నిరెత్తినట్టు కూర్చొని ఉంటే ఒక అపరిచితుడు
ఆపద్భాందవుడిలా మాకు సాయం చేశాడు.
No comments:
Post a Comment