Tuesday, May 3, 2022

సిల్వర్ జూబ్లీ

 సిల్వర్ జూబ్లీ

ఒక ఙ్జ్యాపకం 27

 

మంత్రాలయం.

ఇది దాదాపు యాభై ఏండ్ల క్రితం జరిగిన సంఘటన. ఈ నిజ జీవిత సంఘటన నా జీవితానికి సంబంధించినదే కానీ ప్రత్యక్షంగా నేను ఈ సంఘటనలో పోషించిన పాత్ర అంటు ఏమీలేదు. ఎందుకంటే అప్పుడు నా వయస్సు మహా అంటే ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది.

మా అమ్మ ఒడిలో పడుకుని ఉంటాను ఈ కథ యావత్తు. అక్కడే నాకు జీవిత భాగస్వామి కూడా దొరుకుతుంది. అదేంటి ఒకటున్నర సంవత్సరం వయసు కూడా లేని బడుద్దాయికి భార్య దొరకటం ఏమిటి అంటారా? పూర్తిగా చదవండి మీకే అర్థం అవుతుంది.

మా అమ్మానాన్నలకు, ముఖ్యంగా మా అమ్మ శ్రీమతి సంజీవ లక్ష్మీ గారికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి అంటే చాలా నమ్మకం. ఆవిడకి స్వప్న దర్శనాలు ఇచ్చి కొన్ని సందేశాలు కూడా ఇచ్చారని చెప్పేవారు కూడా.

మా అమ్మగారికి రాఘవేంద్ర స్వామి గారిచ్చిన  స్వప్న సందేశం ఒకటి ఇక్కడ చెబుతాను. ఇది ఒక విషాదం నిజానికి. ఈ విషాద సంఘటన ఎందుకు చెబుతున్నాను అంటే మా అమ్మగారికి మంత్రాలయ రాఘవేంద్రస్వామి పట్ల భక్తి ఎంతటి ధృఢ తరమైనది అని చెప్పటానికి మాత్రమే.

ఈ కథకి ఈ విషాద సంఘటనకి సంబంధం ఉండదన్నమాట.

నేను పుట్టక ముందే మా అక్కయ్య సాయి లక్ష్మీ తన పదకొండో ఏట,  చిన్న వయస్సులోనే కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారని మా అమ్మానాన్నలు తరచూ అనుకుంటూ ఉండగా విన్నాను నా చిన్నతనంలో.

’చైల్డ్ ప్రాడిజీ’ అంటారు చూడండి అలా చాలా తెలివితేటలతో ఉండేదట మా సాయి లక్ష్మీ అక్కయ్య. సాహిత్యానికి సంబంధించి చాలా లోతైన పరిఙ్జ్యానం కలిగిఉండేదట తను,అంత చిన్న వయసులోనే .  తనకు ఫోటోగ్రాఫిక్ మెమొరీ (ఏకసంథాగ్రాహిత్వం) ఉండేదట. మా అమ్మానాన్నలకు ఆమె మరణం చాలా పెద షాక్ అని నాకర్థమయ్యేది వారి మాటలను బట్టి.

మా సాయి లక్ష్మీ అక్కయ్య ఆరొగ్యం గుర్చి మా అమ్మావాళ్ళు ఆందోళన పడుతుంటే ఒక సారి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మా అమ్మగారికి స్పష్టంగా స్వప్న దర్శనం ఇచ్చి "ఈమె ఎక్కువరోజులు బ్రతకదు, బాధపడకండి. ఈమెకి ఉత్తమగతులు కల్పిస్తున్నాను" అని చెప్పారట. ఆ తర్వాత ఆమె మరణించడం జరిగిందిట.

ఇదిలా ఉండగా, ముగ్గురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టడం జరిగింది. పుట్టినప్పటికే నాకు తలమీద జుత్తు సరిగ్గ లేదట. అంటే ఇప్పుడేదో అద్భుతంగా ఉందని కాదు. జుత్తు అంతా ఎర్రగా, పాలిపోయి నిర్జీవంగా ఉండేదట. ఎన్ని వైద్యాలు చెయించినా ఫలితం కలగక పోవటంతో మా అమ్మానాన్నలు చివరికి నన్ను తీసుకుని మంత్రాలయం వెళ్ళి కొన్ని రోజులు ఉండి సేవ చేసుకుని వచ్చారు అట.

సేవ అంటే మరేమి లేదు కొన్ని రోజులు మంత్రాలయంలోనే ఉంటూ ప్రతిరోజు ప్రదక్షిణలు, పారాయణలు చేస్తూ నిత్యం దైవధ్యానంలో ఉండటము అన్నమాట.

చెప్పాను కద మా అమ్మనాన్నలకు మంత్రాలయ రాఘవెంద్రస్వామి వారి పట్ల చాలా భక్తి శ్రద్దలు ఉన్నాయని.

కొన్ని రోజులు ఒకే దగ్గర ఉంటే ఆ చుట్టు ప్రక్కల భక్తులు పరిచయం అవుతారు కద. అదే జరిగింది. మా అమ్మావాళ్ళు ఉంటున్న కాటేజికి ప్రక్కన కాటేజీలో ఒక యవజంట దిగారట. వారు  నలభై రోజుల మండల సేవచేసుకోవటానికి వచ్చారట.

వాళ్ళు చూట్టానికి చాలా అందంగా ఉన్నారట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉన్నారట.

ఆ యువజంట చింతకుంట అనే గ్రామం నుంచి వచ్చారట. ఆ గ్రామం ఆదోనీ నుంచి బళ్ళారికి వెళ్ళేదారిలో ఉంటుంది. మంత్రాలయంకి దగ్గరే.

చక్కటి సంతానం కలగాలనే అభిలాషతో రాఘవేంద్ర స్వామికి మండల సేవ చేయటానికి వచ్చారట ఆ యువజంట. ఆ విధంగా వారితో పరిచయం కలిగింది మా అమ్మానాన్నలకు. ఆ తర్వాత ఎవరి ఊర్లకు వారు వెళ్ళీపోయారు

ఆ రోజుల్లో ఈ మెయిల్, వాట్సాప్, ఫేస్ బుక్కు లు లేని కారణంగా వారి స్నేహం అక్కడితో ఆగిపోయింది. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఏమి జరగలేదు వారి మధ్య.

 

ఆ తర్వాత కాలచక్రం గిర్రున తిరిగింది. నాకు ఉద్యోగం రావటం,  ఇరవై ఏడో నాకు పెళ్ళి కుదిరింది. నా శ్రీమతి పేరు ’పరిమళ లత’. సాధారణంగా రాఘవేంద్ర స్వామి వారి భక్తులు పెట్టుకుంటారు తమ పిల్లలకి ఆ పేరు. రాఘవేంద్ర స్వామి వారి మందిరంలో ఇచ్చే ప్రసాదం పేరు ’పరిమళ ప్రసాదం’. ముఖ్యంగా మధ్వ బ్రాహ్మణులు పెట్టుకుంటారు ఎక్కువగా ఆ పేరు తమ పిల్లలకి.

ఆ తరువాత మాటల్లో తెలిసిందీ ఏమిటి నా శ్రీమతి ఎవరో కాదు, మా అమ్మానాన్నలకు చాలా ఏళ్ళక్రితం మంత్రాలయంలో తారస పడిన యువజంట కు పుట్టిన మొదటి సంతానం నా శ్రీమతి అన్నమాట.

అంటే మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అన్నట్టు మా పెళ్ళి మా శ్రీమతి పుట్టకముందే  మంత్రాలయంలో అలా ఫిక్స్ చేశాడన్న మాట.

అక్కడితో ఆగిపోతే కథేమి ఉంది. ఇంకా చాలా జరిగాయి.

నా పేరు వివేకానంద్ అయినప్పటికి దగ్గరి వారు నన్ను ఆనంద్ అని పిలుస్తారు. నా శీమతి పుట్టిన తెలుగు సంవత్సరం పేరు ’ఆనందనామ సంవత్సరం’.

ఆ విధంగా కూడా ఆయన డిసైడ్ చేశాడు అన్నమాట.

ఆ తరువాత మేము మా నాన్నగారి ట్రాన్స్ఫర్ల కారణంగా వివిధ ఊర్లు తిరిగాము అని చెప్పాను కద. ఆ పరంపరలో భాగంగా 1980 లొ మేము జమ్మలమడుగులో ఉండినాము. ఇది వరకు నా ఙ్జ్యాపకాలలో భాగంగా మేము జమ్మలమడుగు లో ఒక ఇంటిలో ఎదుర్కొన్న కొన్ని మానవాతీత శక్తుల గుర్చి ’భూత్ బంగ్లా’ అన్న ఎపిసోడ్ లో వ్రాశాను. పాఠకులకు గురుతు ఉండే ఉంటుంది.

మేము ఆ ఊరు వదిలి వెళ్ళిన తరువాతా అదే ఇంట్లో మా శ్రీమతి బాల్యం కూడా గడవటం ఒక యాధృచ్చికం.

అయ్యా కొసమెరుపు ఏమిటి అంటే ఈ ఎపిసోడ్ కి ’నిను వీడని నీడను నేనే’ అని పేరు పెట్టమని మా శ్రీమతి సజెస్ట్ చేస్తున్నప్పటికి, నేను నవ్వి ఊరుకున్నాను.

మొన్ననే సిల్వర్ జూబిలి వెడ్డింగ్ ఆనివర్శరీ కూడా జరుపుకున్నాము మేము.

ఇంతటితో ఈ కథ సమాప్తం.

 

No comments:

Post a Comment