పుస్తకాలతో నా ప్రయాణం - (పార్ట్ 3)
ఒక ఙ్జాపకం - 44
ముందుగా మీ అందరికీ ఒక చిన్న సూచన.
నేను వ్రాస్తున్న ఙ్జాపకాలన్నీ
ఎటువంటి ప్రత్యేక పరిశోధన చేయకుండా కేవలం
నా ఙ్జాపకంలో ఉన్నవి వ్రాస్తున్నాను. నాకు డైరీ వ్రాసే మంచి అలవాటు కూడా లేదు
నిజానికి.
’పుస్తకాలతో నా ప్రయాణం’ అన్న ఈ
సిరిస్ ని కూడా ఎటువంటి రీసెర్చ్ చేయకుండా వ్రాసేస్తున్నాను. అంటే నా ఉద్దేశ్యం
కేవలం ఇప్పటికిప్పుడు కూర్చుని నా ఙ్జాపకం
సహకరించిన మేరకు, నాకు వచ్చిన ఆలోచనలని వ్రాసేస్తున్నాను. ఈ
సిరీస్ పేరే ’ఒక ఙ్జాపకం’ కద.
కాకపోతే మొదటిసారిగా ఒక అంశం
గూర్చి కాస్తా అధ్యయనం చేయబోతున్నాను. కుటుంబాల మధ్య, బంధువుల మధ్య పంతాలు, అపార్థాలు,
స్పర్థలు వీటికి సంబంధించి ఒక సిరీస్ వ్రాయబోతున్నాను. మా మేనమామ
కుటుంబానికి, మా అమ్మగారు ఆమె అక్కయ్యల కుటుంబాలతో మధ్య
ఏర్పడ్డ విభేదాల కారణంగా (సిబ్లింగ్ రైవలరీ అనుకోవచ్చు), వారందరూ కూడా చివరిదాకా , అంటే కన్ను మూసే వరకు కూడా
ఒకర్నొకరు చూసుకోకపోవటాలు, దాదాపు మూడు తరాలు, వారి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళ కుటుంబాలు ఎలా
ఎవరికి వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండి పోయారు అన్న విషయం
గూర్చి వ్రాద్దామని ఆలోచిస్తున్నాను.
ఇక ఈ సిరీస్ లోకి వద్దాం.
యండమూరి వీరేంద్రనాధ్ గారి శైలికి
అలవాటు పడ్డాక ఇక ఇతరులవి ఎవరిరచనలూ చదవలేకపోయే వాడిని.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి.
అప్పటిదాకా నవలా రంగాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన యద్దనపూడి సులోచనారాణి గారి
వేగానికి కాస్తా బ్రేక్ పడింది యండమూరి
రాకతో.
అనేక మంది రచయిత్రులు విస్తృతంగా
వ్రాసేవారు అప్పటిదాకా.
వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, ఆరెకపూడి (కోడూరి)
కౌసల్యాదేవి, (ముప్పాళ్ళ) రంగనాయకమ్మ, తెన్నేటి
హేమలత, కే.రామలక్ష్మి, సి.ఆనందరామం,
మాలతీచందూర్, పోల్కంపల్లి శాంతాదేవి,చక్కిలం విజయలక్ష్మీ, పొట్లూరి విజయలక్ష్మీ, పరిమళా సోమేశ్వర్, చిట్టారెడ్డి సూర్యకుమారి,
డి.కామేశ్వరి, శ్రీదేవి, పాటిబండ్ల విజయలక్ష్మి, పవని నిర్మల ప్రభావతి, తోటకూర ఆశాలత, పాలకూర సీతాలత వీరందరీ పేర్లు
నాకు బాగా గుర్తు ఉండిపోయాయి. వీళ్ళలో చివరి ఇద్దరు కలంపేరుతో వ్రాసే మొగవారని
విన్నాను.
మా పెద్దక్కయ్య రామలక్ష్మీ కి
వివాహం జరిగి అప్పటి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో సెటిల్ అయ్యాక ఒక సారి మాటల
మధ్యలో చెప్పారు పోల్కంపల్లి శాంతాదేవి గారు, చందమామ
లో కథలు వ్రాసే ఉమ్మెత్తల యఙ్జరామయ్య గారు వనపర్తిలో ఉంటారని. మేమంతా పిచ్చ క్రేజ్
కి గురయ్యాం. అంటే రచయితలు, రచయిత్రులు అంటే భూమి మీద కాక
ఎక్కడో స్వర్గంలో ఉంటారని విశ్వసించే వారం.
అలాంటిది మాములుగా మనందరితోపాటు వారు కూడా ఉంటారనే వార్త మమ్మల్ని
సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.
యండమూరి వారి శకం మొదలయ్యాక
కూడ కొంత మంది రచయిత్రులు - రోళ్ళ సంధ్యా దేవి, రావినూతల సువర్నాకన్నన్, బొమ్మదేవర నాగ
కుమారి, భలభద్రపాత్రుని రమణి, పెళ్ళకూరు (సోమిరేడ్డి) జయప్రద తదితరుల పేర్లు
తరచూ కనిపించేవి పత్రికలలో.
అలాగే ఈయన ఇచ్చిన ఊపుతో అనేకమంది మగ రచయితలు వెలుగులోకి వచ్చారు (ఉత్తిగా
రచయితలు అంటే సరిపోతుంది. కాని కాస్తా బలంగా చెప్పటానికి అలా వాడానన్న మాట)
అప్పటికే ఎన్నో ఏళ్ళుగా రచయితగా రాణిస్తున్న మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు
మరింత గుర్తింపు తెచ్చుకున్నారు ఈ పరంపరలో.
మల్లాది గారి ’దూరం’ అనే ప్రయోగాత్మక
సీరియల్ తులసిదళం ప్రారంభమయిన కొన్నాళ్ళకి ఆంభూలో మొదలైపోయింది. ఒక రచయితకి అతని
అభిమానికి మధ్యన నడిచిన ఉత్తరాలను వరుస వెంబడి పేరుస్తూ వెళుతూ ఒక అందమైన ప్రేమ
కథని ఆవిష్కరించారు మల్లాది గారు ఈ సిరియల్ లో. ఇది కూడా విపరీతమైన ఆదరణ పొందింది.
ఏది ఈ ఏమైనా ఈ రేసులో (పోటీ ఉందనుకుంటే) తులసీదళమే విజేత నా అభిప్రాయంలో.
తులసిదళం కావచ్చు, దూరం
కావచ్చు వీటి వెనుక అసలు చోదక శక్తి సి.కనకంబర రాజు గారు. ఈయన అయిడియాల వల్ల
ఆంధ్రభూమి అతి తక్కువ సమయంలో రికార్డు సర్క్యులేషన్ పొందింది. సికరాజు గారు
అయిడియాల పుట్ట. ఆయన ఐడియాల కారణంగానే ఆంధ్రభూమి నిస్సందేహంగా నెంబర్ వన్
స్థానాన్ని చేజిక్కించుకుంది. మద్రాసు నుంచి వస్తున్న దినమణి గ్రూప్ వారి
ఆంధ్రప్రభ యాజమన్యానికి ఆంధ్రపదేశ్ లో జరుగుతున్న ఈ సర్క్యులేషన్ విప్లవం అర్థం
అయ్యేలోపల పుట్టి మునిగి పోయింది. ఆంధ్రప్రభ దినపత్రిక ని అంతకు కొన్నేళ్ళ క్రితమే
ఈనాడు దాటేసింది. వారపత్రికని ఆంధ్రభూమి దాటేసి నెంబర్ వన్ అయి కూర్చుంది.
సికరాజు గారు కేవలం ఒక ఉద్యోగి మాత్రమే. అందువల్ల ఆయనకు తగినంత స్వేఛ్చ ఉండేది
కాదనుకుంటా. అయినా ఆయన ఆంధ్రభూమిని ఎవ్వరూ ఊహించని ఎత్తులకు తీస్కు వెళ్ళారు.
ఏవో కారణాల వల్ల వారు అందులోంచి వైదొలగి ’83 ప్రాంతాలలో పల్లకి అన్న పత్రిక తో
ముందుకు వెళ్ళారు. అది కొన్ని బాలారిష్టాల అనంతరం బాగానే విజయం సాధించింది. ఆ
తరువాత మూతపడింది.
ఈ నేపధ్యంలో వేమూరి బలరాం గారు స్వాతి వారపత్రికను స్థాపించి అతి తక్కువ
సమయంలో అత్యధిక సర్క్యులేషన్ గల వారపత్రిక గా ఎదిగేలా చూసుకున్నారు. సికరాజు గారి
మీదకు ఆయనకు ఉన్న ఆడ్వాంటేజి ఏమిటి అంటే అయన ఎడిటర్ మాత్రమే కాదు ఓనర్ కూడ.
ఇక మళ్ళీ సికరాజు గారి విషయానికి వస్తే, ఆయన కింగ్ మేకర్ అని కూడా
చెప్పవచ్చు. తాను తెర వెనుక ఉంటూనే రచయితలకు విపరీతమైన క్రేజ్ సృష్టించే వారు. ఆయన
ఇచ్చిన వేదికని ఉపయోగించుకుని యండమూరి, మల్లాది గార్లు బాగా లాభపడ్డారు. అఫ్ కోర్స్ బాగా వ్రాయటం
వల్ల.
ఇటీవల మల్లాది గారు తన యాభ్యయ్యేళ్ళ రచనా ప్రస్థానాన్ని సమీక్షిస్తూ ’నవలవెనుక
కథ’ అన్న అపురూపమైన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో మల్లాది గారు ఒక విషయం
చెప్తారు. అది నిజం కూడా. అది ఏమిటంటే, సికరాజు గారు ఎంత ప్రోత్సాహం ఇచ్చినా సీరియల్ నవలల గ్రామర్
ని, పాపులర్ నవలల గ్రామర్ ని నేను
(మల్లాది), యండమూరి అర్థం
చేసుకున్నట్టు మరే రచయితా అర్థం చేసుకోలేదు. మేము అల్లుకుపోయాము అని. అంతె కద. ఆ
రోజుల్లోనే నవలకు పాతిక వేల రూపాయలు డిమాండ్ చేయగలిగే స్థితికి వెళ్ళి, కేంద్రప్రభుత్వ ఉద్యోగం మానేసి
పూర్తి స్థాయి కమర్షియల్ రచయితగా స్థిరపడేలాంటి కాన్పిడెన్స్ తనపై తనకు ఉండటం
వల్లనే. కాకపోతే సికరాజు గారు లేకపోతే వారి అభివృద్ది ఇంత వేగంగా జరిగి ఉండెది
కాదు.
రాంగోపాల్ వర్మ, శివ సినిమాతో తనను తాను ప్రూవ్
చేసుకున్నప్పటికి, నాగార్జున
గనక సరైన సమయంలో ఆయనకి అవకాశం ఇవ్వకుంటే ఏమీ చేయలేకపోయే వాడు. ఆర్జీవి స్వయంగా
వేదిక మీద చెప్పిన విషయం ఇది.
అలాగే ఎడిటర్ల తో తన అనుభవాలగూర్చి వ్రాస్తూ ’జరిగిన కథ’ అన్న పుస్తకం
వ్రాసారు.
అందులో చెబుతారు ఆయన చూసిన ఎడిటర్లలో ది బెస్ట్ ఎడిటర్ సికరాజు గారే అని.
ఇటీవల ఆంధ్రభూమి నుంచి రిటైర్ అయిన ఒక మహిళా ఎడిటర్ గారితో సికరాజు గారిని కాస్త
నేను పొగిడినట్టు అనిపించి ఆవిడ మౌనం వహించారు. ఆవిడకి ఆ టాపిక్ నచ్చలేదని నాకర్థం
అయింది.
పత్రిక సర్క్యులేషన్ పెంచటమే కద ఎడిటర్ విజయానికి తార్కాణం. సినిమా జయాపజయాలు
దర్శకుడి ప్రతిభకి కొలబద్దలాగ.
’క్రికెటర్లకో, సినీ
తారలకో ఉండేటంత క్రేజ్ ని స్వంతం చేసుకున్న రచయిత యండమూరి వీరేంద్రనాధ్’ అంటు
ఒకసారి ఆంభూ ముఖచిత్రంగా యండమూరిగారి ఫోటోని ప్రచురించి పెద్ద ఇంటర్వ్యూ ని వేశారు
లోపలి పేజిల్లో. అంతె గాక ప్రతివారం పాఠకుల ప్రశ్నలకు రచయితలతో సమాధానం అంటూ
ముఖాముఖి అనే తరహా శీర్షిక
ప్రవేశపెట్టారు. అందులో విధిగా రచయిత ఫోటో ఒకటి ప్రచురించేవారు.
మరో సారి ఇలాంటి కాప్షనే ఉపయోగిస్తూ మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి గూర్చి కూడా
కవరి పేజి, వ్యాసం
వేశారు. వారి ఫోటో బదులు వారి పేరు వ్రాశారు. ఆయన ఫోటో ఇవ్వరు కద పబ్లిక్ లో.
ఈ రచయితలు గడ్డం కింద చేయి పెట్టుకునో, శూన్యంలోకి చూస్తూనో, కలం పట్టుకుని టేబుల్ ముందు
కూర్చుని వ్రాస్తున్నట్టో, లేతగా చిరునవ్వు నవ్వుతున్నట్టో ఫోటో ఒకటి పెట్టే వారు రచయిత , రచయిత్రులవి. ఆ ఫోటో గూర్చి మళ్ళీ ప్రశ్నలు. వీరిలో మళ్ళీ
అందంగా ఉన్న బొమ్మదేవర నాగకుమారి ఫోటోని పాఠకులు బాగా ఇష్టపడేవారు.
ఒకటి బాగా గుర్తు నాకు .ఒక సారి ఒక పాఠకుడు ’కొమ్మనాపల్లి గణపతి రావు అనే
రచయితని’ "మీరెందుకు ఎప్పుడు గడ్డంతో కనిపిస్తారు?" అని అడిగితే "ఒక మోటార్
సైకిల్ ఆక్సిడెంట్ లో అయిన గాయం వల్ల ఏర్పడ్డ మచ్చని కప్పేదానికి గడ్డం
పెంచుకుంటున్నాను. ఏది ఏమయినా ఆ ఆక్సిడెంట్ నాకు తెలిపిన విషయం ఏమిటంటే - ’వేగమే
కాదు ఒడుపూ ఉండాలి’ అని" . ఇలా సరదాగా, ఆసక్తిగా,
చమత్కారంగా సాగేవి ఆ సందేహాలు సమాధానాలు.
యండమూరి గారు ఆ శీర్షిక ద్వారా తన ఇమేజిని బాగా బిల్డ్ చేసే ప్రయత్నం
చేసుకునేవారు, అది
తప్పేమి కాదనుకోండి. తన పౌరాణిక ఙ్జానాన్ని, ఆడిటర్ గా చిన్న వయసులోనే తను
సాధించిన విజయాల్ని, తనకు
ఉర్దూ ఘజల్స్ బాగా అర్థం అవుతాయని ఇలా ఉండేవి వారి సమాధానాలు.
ఇక వీరిలో మల్లాది వారి శైలి ప్రత్యేకం. వారు ఫోటో వేసుకోక పోవటం ద్వారా ఒక
సరికొత్త ట్రెండ్ కి తెర ఎత్తారు. ’హిస్ ఆబ్సెన్స్ క్రియేటెడ్ హిస్ ప్రెసెన్స్
కాన్ప్సిక్యువస్లీ’ అన్న ప్రయోగం ఉంది ఇంగ్లీష్ లో. ఆయన రాకపోవడం వల్ల ఆయన గూర్చి
పార్టీలో ఆయన గూర్చే ఎక్కువ అందరూ అనుకున్నారు , గుర్తు చేసుకున్నారు అన్నట్టు. అదే
విధంగా ఫోటోలు వేసుకునే అందరికన్న ఫోటోలు వేసుకోక పోవటం వల్ల అందరూ ఆయన్ని గుర్చి
ఎక్కువ మాట్లాడుకునే వారు. అదే అడిగేవారు ఆయన్ని.
’నేను చనిపోయాక ఒకటే సారి బ్లాక్ బార్డర్ తో నా ఫోటో వస్తుంది’ అని ఆయన ఒకోసారి వేదాంత భరితంగా, ఒక్కోసారి సరదాగా చిలిపిగా సమాధానం
చెప్పి దాటవేసేవారు ఆ విషయం.
చందు సోంబాబు అనే బుద్ధిమంతుడు ఏకంగా శృంగార రచనలు చేసేవాడు, ఆయనకి సికరాజు గారు ఆంధ్రా
హెరాల్డ్ రాబిన్స్ అంటూ బిరుదొకటి తగిలించారు. ఈ కోవలోనే మేర్లపాక మురళి అనే రచయిత
కూడా స్వాతి లో రచనలు చేసేవాడు ఆ తరువాత.
మల్లిక్, యర్రంశెట్టి
సాయి, కొమ్మనాపల్లి
గణపతిరావు,చందు
సోంబాబు లను కూడా సికరాజు గారు బాగా ప్రోత్సహించేవారు. అలాగే ఆ రోజుల్లో ఇతర
పత్రికలలో కూడా మగ రచయితల హవా కొనసాగేది.
సూర్యదేవర రాం మోహన్ రావు, ఘండికోట బ్రహ్మాజి రావు, చల్లా సుబ్రహ్మణ్యం, మైనంపాటి భాస్కర్ ఇలా అనేక మంది
రచయితలు విరివిగా రచనలు చేసే వారు.
రచయితలు ఎందరున్నా, యండమూరి వీరేంద్రనాధ్, మల్లాది వెంకట కృష్ణ మూర్తి గార్ల
నవలలకు ఉన్నంత చదివించే గుణం ఇతరుల రచనలకు ఉండేది కాదు.
తులసిదళం సీరియల్ గా వస్తున్న కాలంలోనే ఆంధ్రసచిత్ర వారపత్రికలో అనుకుంటా కవి
సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఫాంటసీ సీరియల్ (దీన్ని పెద్ద కథ అనవచ్చు ఒక
అయిదారు వారాలు వచ్చింది) ’హాహా హూ హూ’ వచ్చింది. ఇందులో తుంబురుడో గంధర్వుడో ఏదో
కారణాన భూమి మీదకు వచ్చి చిత్రమయిన ఇబ్బందులు ఎదుర్కోవటం థీం.
మొత్తం మీద 1980-2000 వరకు తెలుగు పత్రికా రంగానికి స్వర్ణ యుగం అని
చెప్పవచ్చు. ఎన్నెన్ని పత్రికలో చెప్పలేను. ఇటీవల్ కిరణ్ ప్రభ గారు ’శతాబ్దాల
తెలుగు పత్రికలు తీరుతెన్నులు ’ అనే తన పదహారు భాగాల టాక్ షోలో కూడా 89-2000 మధ్య
పిరియడ్ ని తెలుగు పత్రికల స్వర్ణయుగంగా
పేర్కొనడం గమనార్హం.
యండమూరి వీరేంద్రనాథ్ గారితో నాకెదురైన చిక్కిదే. ఆయన నవలలు చదివిన తర్వాత
ఇతరులవి ఎవరికి చదివినా పేలవంగా అనిపించేవి. పాపులర్ నవలలలో ఆయనకి ముఖాముఖి నిలబడి
అంత స్థాయిలో పేరు తెచ్చుకున్న రచయిత మల్లాది వెంకటకృష్జమూర్తి గారె.
వీరిద్దరి మధ్య పోలికలు , తేడాలు వ్రాయటం అన్న పాయింట్ తీస్కుని ఎవరైనా పీ హెచ్ డీ
చేయవచ్చు. అంత మేరకు స్టఫ్ ఉంది
చెప్పుకోటానికి.
(ఇంకా ఉంది)
వచ్చే భాగాలలో :
- మల్లాది గారి పాత్రలకు, యండమూరి గారి పాత్రలకు తేడా
- యండమూరి గారి పాత్రలలో ధీరోధాత్తత
- యండమూరి నవలలలోని పాత్రల ద్వారా పాఠకుల వ్యక్తిత్వ నిర్మాణం
- యండమూరి మంచి దీటైన వక్త కాదేమో
- నేను చదివిన ప్రయోజనాత్మక సాహిత్యం
- తెలుగు రాష్ట్రాలకు దూరంగా నా జీవితం
-నేను చదివిన ఆంగ్ల సాహిత్యం, వ్యక్తిత్వ వికాస సాహిత్యం
- నేను చూసిన అంతర్జాతీయ స్థాయి వక్తలు, శిక్షకులు
- నన్ను ప్రభావితం చేసిన అంతర్జాతీయ స్థాయి వక్తలు, శిక్షణలు
- నన్ను ప్రభావితం చేసిన ఆధ్యాత్మిక పుస్తకాలు, రచయితలు
---------
డాక్టర్. రాయపెద్ది వివేకానంద్
హైదరాబాద్.
No comments:
Post a Comment