Tuesday, May 3, 2022

తిరగేసిన కుండలు

 తిరగేసిన కుండలు

ఒక ఙ్జాపకం.

ఒక సారి డా. బసవేశ్వర రావు గారితో మాట్లాడుతూ ఉండగా, ఆయన ఆకస్మాత్తుగా, "మీరు ఓషోను చదివారా?" అని అడిగారు.

నేను మౌనం వహించాను.

నేను పెద్దగా చదవలేదు నిజానికి ఓషో గూర్చి గానీ, ఓషో గారిని గాని.

అదే చెప్పాను, చెప్పి మౌనం వహించాను.

నాకు తెలిసిందే ప్రపంచం అనుకుంటూ ఉంటాను నేను. అది సహజం కద.

ఎక్కువ సేపు మౌనంగా ఉండలేకపోయాను నేను.

డాక్టర్ తో నాకున్న చనువు కారణంగా అడగనే అడిగాను చివరకు.

"ఆయన చుట్టూ బోలెడు వివాదాలు ఉన్నాయి కదా " అని

ఇంతలో నర్స్ వచ్చి పేషంట్లు వచ్చారని చెప్పింది.

ఆయన వారిని చూసి పంపెసి,, నా వైపు తిరిగారు.

"వివాదాలు ఉన్నాయి. కాదనను. కానీ ఆయన చెప్పిన మాటలు, ఆయన బుక్స్ చదివారా?"

నేను లేదన్నట్టు తలూపాను.

నా పాయింట్ ఆయన సరిగా అర్థం చేసుకున్నారు. డాక్టర్ గారు చెప్పటం ప్రారంభించారు.

"నిస్సందేహంగా ఓషో గారు వివాదాస్పదులే. కానీ మనం కొందరి నుంచి ఙ్జానం మాత్రమే పొందాలి. వారి వ్యక్తిగత జీవితాలతో పని లేదు.

ఇది ఎలాగుంటుందంటె, ఆకాశం నుంచి అనండి, దైవం నుంచి అని అనండి, ఙ్జానం అనేది నిరంతరం మనవైపు సురగంగలాగా ఉరకలెత్తుతూ వస్తు ఉంటుంది. దానిని కొందరు నిజమైన యోగులు, లేదా ఙ్జానులు పూర్తిగా యోగ్యులుగా ఉండి దానిని స్వీకరించి, దానిని ఆచరించి మనకి అందిస్తారు. అలాంటి వారు నిండు కుండలు లాంటి వారు. వారిని నిండుకుండలతో పోల్చుకుంటే, ఆ ఙ్జానం వారిలో పూర్తిగా నిండి , ఆపై వారినుంచి పొంగి పొరలుతుంది. త్యాగరాజ స్వామి, అన్నమయ్య, శ్రీ పాద శ్రీ వల్లభ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇలాగా ఎందరో మహానుభావులు ఎందరినో దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

దీనికి పూర్తి వ్యతిరేకంగా కొందరు ఉంటారు. ఓషోగారిలాగా. వీరు బోర్లించిన కుండలాంటి వారు. వారి వారి పురాకృత పుణ్యవశాన వారిపై కూడా ఙ్జాన వర్షం కురుస్తుంది. వారు ఆ ఙ్జానాన్ని తమలోకి తీస్కున్నారా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. కానీ నిస్సందేహంగా ఆ బోర్లించిన కుండలాంటి ఆ ఙ్జానుల పై నుంచి, మన వైపు ఙ్జాన గంగ వెల్లువలాగా ఉరకలెత్తి వస్తుంది. మన పని అమృతోపమానమైన ఆ ఙ్జానాన్ని దోసిళ్ళు పట్టుకుని జుర్రుకోవటమే.

ఆయన ఙ్జానా, అఙ్జానా, మంచి వాడా, చెడ్డవాడా అన్న విచికిత్స వద్దు. ఆ ఙ్జాన గంగని జుర్రుకోవటమే మన పని. వారు చేసిన చెడు పనులు మనం చేయాలని కాదు దీని అర్థం వారి బోధనల్లోని సారాన్ని తీస్కోవటమే మన పని.

వారి ప్రవచనాల్లోని లోతుని, గాఢతని బేరీజు వేయటానికి మనకున్న అర్హతలు చాలవు" అని ముగించారు డా.బసవేశ్వరరావు గారు.

****

ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు గుర్తు వచ్చింది అంటే చెబుతాను.

****

నేను మా ఆవిడ, ఎప్పుడైనా సరదాగా సెల్ ఫోన్ లో పాటలు పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. నేను ఒక్కో సారి నాకిష్టమైన టాక్ షోలు పెట్టుకుంటాను. తను వింటుంది. తాను ఏదైన ఇష్టంగా పెట్టినప్పుడు నేను వింటాను.

ఈ రోజు ఆదివారం కద, రాత్రి టిపిన్ తింటున్నప్పుడు సరదాగా తను మహేష్ భట్ సినిమా "సడక్" పాటలు పెట్టింది. అవి నాకు ఎలాగు చాలా ఇష్టం కద. హాయిగా వింటూ , దోశెలు తింటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.

అప్పుడు యధాలాపంగా నేను అన్నాను.

"ఈ సినిమా పాటలు ఎంత అద్బుతంగా ఉంటాయి, ఎంత లోతైన అర్థాలు ఉన్నాయి. ఇంత భావుకతతో నిండిన ఈ పాటలున్న సినిమాకి పని చేసిన వారు చాలా మంది ఏదో విధంగా నేరాలలో ఇరుక్కున్న వారే.

నదీం శ్రావణ్ జంటలో నదీం ఖాన్, గుల్షన్ కుమార్ హత్య కేసులో ముద్దాయి,

సంజయ్ దత్ గురించి మనకు తెలిసిందే,

దర్శకుడు మహేష్ భట్ నిత్యమూ దేశ ద్రోహులతో చేతులు కలిపి భారత దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి,

పూజా భట్ కి పెద్దగా మంచి పేరు లేదు.

వీరందరూ మరి ఇంత మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ఎలా మనకు అందించారో కద" అని అన్నాను.

తను నవ్వుతూ చూసింది నా వంక. ఆ నవ్వులో, ’మీరు ఎప్పుడూ చెబుతుంటారే డా. బసవేశ్వర రావు గూర్చి’ అన్న అర్థం కనిపించింది నాకు.

తను విధిగా ఒక పాలసీ పాటిస్తుంది. అది ఏమిటి అంటే కళాకారులు వారు ఎంత గొప్పవారైనా సరే, వారిని వెళ్ళి వ్యక్తిగతంగా కలుసుకోవాల్సిన పని లేదు అన్నది ఆమె పాలసి. ఆ కళారూపం దైవదత్త వరం. మనం ఆ కళారూపకాల వల్ల వారిని ఎంతెంతో ఊహించుకుంటాము. అవన్నీ నిజం అవాలని లేదు అన్నది ఆమె వాదన.

నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కద’ అన్న అర్థం కూడా కనిపించింది ఆమె నవ్వులో.

అవును సుమా’ అని నవ్వేశాను నేను.

ఇంతలో ఇంకో దోశె తీసుకుని మా అత్తయ్యగారు వచ్చారు.

ఇంతటితో ఈ ఙ్జాపకం సమాప్తం.

----

డా.రాయపెద్ది వివేకానంద్

19 డిసెంబర్ 2021 ఆదివారం

 

No comments:

Post a Comment