Tuesday, May 3, 2022

అది పెళ్ళి బస్సు- బళ్ళారి బస్సు

 బళ్ళారి బస్సు

ఒక ఙ్జాపకం -34

 

మార్చ్ 7 మంగళవారం 1995

(స్థలం: ఆదోనీ - బళ్ళారి రోడ్డు మార్గం. చింతకుంట అన్నగ్రామం వద్ద)

 

అది పెళ్ళి బస్సు. పెళ్ళి కొడుకు ఎవరో కాదు నేనే.

 

’ఢడ్’ మన్న పెద్ద శబ్దం రావటం ఏమిటి బస్సు ఆగి పోవటం ఏమిటి క్షణాలలో జరిగిపోయింది.

కనురెప్ప మూసి తెరిచే లోగా దగ్గర్లో పొల్లాల్లో పనులు చేసుకుంటున్న డజన్ల కొద్ది రైతు కూలీలు మా బస్సును చుట్టు ముట్టేశారు. ఏడుపులు, పెడబొబ్బలు, ఆక్రందనలు, శాపనార్థాలు ఇలా వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది.

 

******

 

ఙ్జాపకానికి నిర్వనం ఏమిటి ?

గతంలో నవ్వుపుట్టిచ్చిన సంఘటనలు ఇప్పుడు తలచుకుంటే ఏడుపు రావాలి,

గతంలో మనల్ని ఏడ్పించిన సంఘటనలు ఇప్పుడు తలచుకుంటే నవ్వు రావాలి.

అదీ ఙ్జాపకం అంటే అంటూ వాట్సాప్ మేధావి ఒకరు శెలవిచ్చారు ఇటీవల.

 

నేను ఇప్పుడు మీతో పంచుకోబోయే ఙ్జాపకం ఎప్పుడు తలచుకున్నా భయం, గగుర్పాటే కలుగుతాయి నాకు.

 

నా ఙ్జాపకాలు చదువుతూ వస్తున్న నా దూరపు చుట్టం ఒకరు అడిగారు ’నీ జీవితంలో భలే చిత్రమైన సంఘటనలు జరుగుతూ వుంటాయే’ అని. నేను నవ్వి చెప్పాను.

"నా జీవితంలోనే కాదు అందరి జీవితాల్లోనూ చిత్రాతి చిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే నేను వీటిని వ్రాస్తున్నాను అంతే"

నిజమే కదండీ. ఇంగ్లీష్ వాడు చెప్పనే చెప్పాడు కద "ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్" అని. ఇటీవల ఒక ఆథర్ కోచ్ కూడా తన ప్రసంగంలో అదే చెప్పాడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వందలాది పుస్తకాలకు సరిపడా అనుభవాలు, ఙ్జాపకాలు ఉంటాయి అని.

దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడే కండ్ల ముందు జరిగినట్టుగా ఉంది.

మానవ మనస్తత్వం చాలా చిత్రమయినది. కోటి మందిలో ఒకరికి తగిలే అవకాశం ఉన్న లాటరీ తనకే తగులుతుంది అనుకుంటాడు. ఏదయినా ప్రమాదానికి సంబంధించిన వార్తలు విన్నప్పుడు తనకు ఎన్నటికీ ప్రమాదం జరగనే జరగదు అని అనుకుంటాడు.

తీరా ప్రమాదంలో ఇరుక్కున్నాక మనిషి విపరీతంగా భయపడిపోవటానికి , వత్తిడికి (స్ట్రెస్) కి గురవటానికి ఈ విధమైన ఆలోచనా విధానమే కారణం అనుకుంటా.

మనవరకు ప్రమాదం ఎన్నడూ రాదు, ప్రమాదాలన్ని ఎదుటి వారికే జరుగుతాయి అని అనుకుంటూ ఉంటాము కాని ఊహించని విధంగా ప్రమాదం ఎదురైతే ఎలాఉంటుందో మా అనుభవానికి వచ్చిన ఆ రోజు ను ఎలా మరువగలను?

 

నేను కడపలో మేడికల్ రెప్రజేంటేటివ్ గా పని చేస్తున్న రోజులు అవి.

చింతకుంట వెంకోబరావు గారి మనవరాలు, శ్రీ లక్ష్మీ కాంతం అరుణమ్మల గారి గారాల పట్టి అయిన పరిమళ లతతో నా వివాహం నిశ్చయం అయింది. వాళ్ళ స్వగ్రామం చింతకుంట.  ఆ గ్రామం బళ్ళారికి దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి ఆ గ్రామం కర్ణాటక సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. మా మామగారు అప్పట్లో ఆదొనిలో నివాసం ఉండేవారు. సహజంగా ఆదోనీలో వివాహాం చేయాలని అనుకున్నారు. కానీ మెము ప్రత్యేకంగా కోరటం వల్ల ఉన్నంతలో పెద్ద ఊరు అయిన బళ్ళారిలో చేయటానికి ఏర్పాట్లు అయ్యాయి.

మా అన్నయ్య శ్రీ రాయపెద్ది అప్పాజీ శాస్త్రి గారు ఆదోనిలోనే ఉండటం వల్ల మేమందరం అక్కడినుంచి బళ్ళారికి ఒకరోజు ముందుగా బయలుదేరాము.

మా అన్నగారి స్నేహితుడు శ్రీ బాలాజీ బదరీనాథ్ గారు రావుజీ బ్రదర్స్ అనే బస్సుల కంపెనీ నడిపిస్తుంటారు. ఆయనే ఒక బస్సు ఏర్పాటు చేశారు. ఈ బాలాజీ బదరీనాథ్ గారు ఇంగ్లీష్ లెక్చరర్ మరియు ఆర్ట్స్ కాలేజి లో ఎన్ సీ సీ ఆఫీసర్ కూడా.  వారి గూర్చీ ఒకసారి వివరంగా కొన్ని ఙ్జాపకాలు వ్రాయాలి.

ఇకపోతే ,బళ్ళారి ఆదోని మధ్య ప్రయాణం చాలా చిత్రంగా ఉంటుంది. ఆర్టీసి బస్సులు తక్కువ గా నడుస్తాయి. అందులోకూడా కర్ణాటక కు చెందిన బస్సులదే సింహభాగం.

ప్రయివేటు బస్సులే  ఆ దారిలో ప్రయాణీకులకు దిక్కు. ప్రధానంగా ఎంజీ బ్రదర్స్ వారి’నీలకంఠెశ్వర మోటార్ సర్వీస్’ బస్సులు, మనం ఇందాక చెప్పుకున్న రావుజీ బ్రదర్స్ వారి బస్సులు ఎక్కువగా నడిచేవి ఆ రోజుల్లో ఆ రూట్లో.

బస్సులో పాటలు వేస్తారు కద , అదే విధంగా ఈ రూట్లో బస్సుల్లో కూడా పాటలు వేసే వారు. కాని ఒక గమ్మత్తేమిటంటే చింతకుంట గ్రామం వచ్చే వరకు తెలుగు పాటలు, అక్కడ నుంచి కన్నడ పాటలు వేసే వారు ఆ బస్సులో. అంటే ఏ రాష్ట్రంలో బస్సు నడుస్తున్నప్పుడు ఆ భాష పాటలు వేసే వారన్నమాట.

ఈ విధంగా రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతకుంట గ్రామం చాలా ప్రాముఖ్యతని కలిగిఉండేదని చెప్పవచ్చు ఆ రోజుల్లో.

ఇప్పుడు చింతకుంట గ్రామాన్ని తాకే పని లేకుండా ఊరికి దూరంగా ఎక్స్ ప్రెస్ హైవే రావటం వల్ల వాహనాల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఆ గ్రామం తాలుకూ ప్రాభవం బాగా తగ్గిపోయింది.

ఇందుకు సంబంధించి కొన్ని ఙ్జాపకాలు వివరంగా మరోసారి వ్రాస్తాను.

*****

సరే మన బస్సు బయలుదేరింది.

బంధువులను అందరినీ సమీకరించుకుని ఆదోని నుంచి బయలు దేరింది మా బస్సు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని రెండు రెండున్నరకు బయల్దేరాము. కర్ణాటకలో ఉన్న బళ్ళారి కి సాయంత్రం అయిందిటికల్లా సునాయాసంగా చేరగలం.

అక్కలు, బావలు, అన్నయ్య, వదినెమ్మ, అమ్మా నాన్నలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, నా సన్నిహిత మిత్రులు ఒకరిద్దరు, అన్నయ్య మిత్రులు, దగరి బంధువులు ఇలా అందరం ఆనందంగా బయలుదేరాం బస్సులో.

నేను మా అమ్మనాన్నల పక్కన ముందు సీట్లో కూర్చుని ఉన్నాను. అవి పిచ్చి రోజులు. నాకు పెద్ద పూల హారం ఒకటి తగిలించారు. చేతిలో పుష్ప గుచ్చం ఒకటి పెట్టారు. అవి బళ్ళారి చేరే వరకు తీయవద్దు అని బంధువులు పెద్దలు అందరూ షరతు పెట్టారు. అది ఉండటం మంచిది అయింది అని తరువాత అనుకున్నాము.

మరి కొద్ది క్షణాల్లో జరగబోయే పెను ఉత్పాతం ఎవ్వరికీ తెలియకపోవటం వల్ల అందరం ఆనందంగా ఉన్నాము.

బస్సంతా తెగ కోలాహలంగా ఉంది.

పెద్దలు ఎప్పటెప్పటివో విషయాలు గుర్తు తెచ్చుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

పిల్లలంతా అంత్యాక్షరీ ఆడుతున్నారు. ఆరోజుల్లో విహారయాత్రలలో అంత్యాక్షరి విధిగా ఆడేవారు.

జీ టీవిలో అన్నుమాలిక్ ’అంత్యాక్షరీ’ షోకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఆ రోజుల్లో . సల్మాన్ ఖాన్ నటించిన  ’మైనే ప్యార్ కియా’ లో అంత్యాక్షరీ ఆధారంగా ఏకంగా ఒక పాటనే ఉంది.

అంత్యాక్షరీ కోలాహలంగా నడుస్తోంది బస్సులో.

బస్సు డ్రైవర్ కూడా మంచి అనుభవఙ్జుడు అనుకుంటా చాలా జోరుగా నడిపిస్తున్నాడు. అతని పక్క నే ఖాకీ డ్రస్సు వేసుకున్న క్లీనర్ భక్తిపూర్వకంగా డ్రైవర్ ని చూస్తూ కబుర్లు చెబుతున్నాడు.

ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన. నేను రోడ్డు వంక చూస్తూనే ఉన్నాను. మరి ఏమయిందొ తెలియదు.

’ఢడ్’ మన్న పెద్ద శబ్దం రావటం ఏమిటి బస్సు ఆగి పోవటం ఏమిటి క్షణాలలో జరిగిపోయింది.

కనురెప్ప మూసి తెరిచే లోగా దగ్గర్లో పొల్లాల్లో పనులు చేసుకుంటున్న డజన్ల కొద్ది రైతు కూలీలు మా బస్సును చుట్టు ముట్టేశారు. ఏడుపులు, పెడబొబ్బలు, ఆక్రందనలు, శాపనార్థాలు ఇలా వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది.

ఎవరో వెనుక టైర్ క్రింద పడ్డారట.

ఎదురుగా వస్తున్న ఒక లారీ వాడు మా బస్సు కాబిన్ డోర్ పక్కగా లారీ ఆపి ’ఎక్కేయ్, ఎక్కేయ్’ అని కన్నడంలో అరిచి మా డ్రైవర్ ని లారీలో ఎక్కించుకుని పోయాడు.

మేము డ్రైవర్ కూడా లేని బస్సులో ఎటూ కాని దగ్గర మార్గ మధ్యంలో చిక్కుపడిపోయాము. అందునా చుట్టూ కోపంతో ఊగిపోతున్న గ్రామీణులు.

వాళ్ళ అరుపుల బట్టి మాకు అర్థం అయింది ఏమిటి అంటే వెనుక చక్రం క్రింద పడింది అభం శుభం ఎరుగని ఒక చిన్నపిల్ల అట.

ఆ గ్రామీణులు కోపోద్రిక్తులై బస్సులోనికి వచ్చే ప్రయత్నం చేయటం మొదలెట్టారు. ’డోర్ తియ్యండి డోర్ తియ్యండి’ అని కేకలు వేస్తూ కర్రలతో చేతులతో దడదడ మని బస్సు డోర్ మీద గట్టిగా కొట్టసాగారు. ఒకరిద్దరు రాళ్ళు తీస్కుని అద్దాలు పగలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ లోగా ఆ గ్రామీళుల్లో ఒకరిద్దరు యువకులు డ్రైవర్ సీటు దగ్గర ఉన్న డోర్ తీస్కుని బస్సులోకి వచ్చేసి , లోపలి నుంచి పెద్దడోర్ తీసేశారు .

ఇప్పుడు మా పరిస్తితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారిపోయింది.

ఆ గ్రామీణుల దృష్టి ఖాకీ దుస్తులలో ఉన్న కండక్టర్ మీద పడింది. ఇంకేముంది అందరూ అతన్ని పట్టుకుని చితకకొట్టేశారు. అతను మొత్తుకుంటూనే ఉన్నాడు ’నేను డ్రైవర్ని కాను. డ్రైవర్ పారిపోయాడు’ అని కాని వాళ్ళు అతని మాట వింటేగా.

మేమంతా ఎంత కలగజేసుకున్నా వారు ఏ మాత్రం శాంతించడం లేదు.

ఉన్నంతలో నా నుదుటన తిలకం, మెడలో దండ, చేతిలో పుష్పగుచ్చం ఇవన్నీ చూసి వాళ్ళు కాస్తా శాంతించారు. మిమ్మల్ని "ఇబ్బంది పెట్టాలి మాకు కూడా లేదండీ మాకు జరిగిన అన్యాయం ఆ పగ వాడికి కూడా జరిగకూడదు" అంటూ వాళ్ళు కన్నడ కలగలసిన తెలుగులో వాళ్ళ ఆక్రోశం వెళ్ళగ్రక్కారు.

కానీ వాళ్ళలో అందరూ శాంతంగా అయితే లేరు. కొందరు విచక్షణా రహితంగా కర్రలతో బస్సులోని రూఫ్ ని బాదుతూ విపరీతమైన శబ్దాన్ని చేస్తూ పెద్దపెద్దగా అరుస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ బాధ అర్థం చేసుకోదగినదే. కానీ మా అందరికీ మెదళ్ళు మొద్దుబారిపోయాయి.

ఏమి చేయటానికి ఏమి ఆలోచించటానికి మాకు పాలుపోవటం లేదు.

ఈలోగా మేము ఫలానా ఇంటి వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకోవటానికి బళ్ళారికి వెళుతున్నాము అన్న విషయం విని వాళ్ళు వెనక్కు తగ్గారు.

దేవుని దయవల్ల ఈ ప్రమాదం చింతకుంట గ్రామానికి దగ్గర్లోనే జరగటం గుడ్డిలో మెల్ల అన్నట్టు అయింది మా ప్రాణానికి.

చింతకుంట వెంకోబరావు గారింటి వియ్యంకులు మేము అని తెలియంగానే ఆ గ్రామీణులు కాస్తా గౌరవంగానే చూడ్డం మొదలెట్టారు మమ్మల్ని. వారు ఏ విధమైన ఇబ్బంది పెట్టలేదు ఆ తర్వాత.

ఈ లోగా ఎవరో కబురుపెట్టారు. మా మామ గారి తమ్ముడు శ్రీ చింతకుంట రామకృష్ణ ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చేశాడు మా ఎదుటికి.

ఆ క్షణంలో ఆయన్ని చూడంగానే గజేంద్రమోక్షంలో గరుత్మంతుడిని ఎక్కివచ్చిన విష్ణుమూర్తిని చూసిన అనుభూతి కలిగింది మా అందరికీ.

ఆయన పెళ్ళి పనుల నిమిత్తం బళ్ళారికి, చింతకుంటకు తిరుగుతూ ఉండటం ఆ సమయంలో ఊర్లోనే ఉండటం తటస్తించింది.

ఆయన రావటం రావటం రంగంలోకి దిగిపోయాడు. వారందరినీ శాంతింపజేసి, మిగతా సంగతులు అన్నీ తర్వాత చూసుకుందాము, మొదట పెళ్ళి బృందం వారిని సమయానికి వెళ్ళనీయాలి అని తీర్మానం చేశాడు.

ఈ యావత్తు ఉదంతం జరుగుతున్నంత సేపు మా వాళ్ళు నన్ను బస్సు దిగనివ్వలేదు.

ఆపై  దిగిన తర్వాత కూడా నన్ను అటు ఇటు కదలనివ్వలేదు.

ఈ బస్సు కదలటానికి వీల్లేదు. కాబట్టి వేరే బస్సు మాట్లాడుకోవాలి. ఆ అడవిలో కాంట్రాక్టు మాట్లాడటానికి ఇంకో బస్సెక్కడ దొరుకుతుంది. సెల్ ఫోన్లు లేని రోజులు అవి.

ఈ లోగా అటుగా వెళుతున్న ఓ ఆర్టీసి బస్సుని ఆపి మేమందరం ఎక్కాము. అప్పటికే ఫుల్లుగా ఉన్న ఆ బస్సులో మేమంతా నించుని ప్రయాణం చేయాల్సి వచ్చింది.

నేను చేతిలోంచి పుష్పగుఛ్చం, మెడలో దండా తీసేసి మాములు ప్రయాణీకుడి అవతారం ఎత్తాను.

విషయం తెలుసుకుని ఎవరో దయామయుడు నాకు కూర్చోవటానికి సీటు ఇచ్చాడు.

జంధ్యాల దర్శకత్వంలో గనక  తీస్తే ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం లోఒక కామెడి సినిమాకు పనికొచ్చేటంత విషయం ఉంది. బళ్ళారి వచ్చింది. వాడు ఏదో ఒక స్టాపులోనో బస్టాండ్ లోనో దిగమంటాడు.

’బాబ్బాబు. నీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని కళ్యాణ మండపంవద్ద దింపవయ్యా’ అని బ్రతిమాలుకోవడం మా వాళ్ళ వంతయింది.

చాలా సేపు బ్రతిమాలుకున్నాక అతను కూడా మానవతా దృక్పధంతో అంగీకరించాడు.

పాపయ్య మారేజి హాల్, గ్లాస్ బజార్ . ఇది కళ్యాణ మండపం అడ్రసు. మొదట బస్టాండ్ కెళ్ళాలా లేదా కళ్యాణ మండపానికి వెళ్ళాలా బస్సు అని ఒక విచికిత్స ఏర్పడింది డ్రైవర్ కి.

బస్టాండ్ కెళితే,  రిటర్న్ ట్రిప్ ప్రయాణీకులందరూ ఎక్కి కూర్చుంటారు వాళ్ళకు విషయం తెలియక గొడవపెట్టుకోవచ్చు లేటు అవుతుందని.

లేదూ మొదటే కళ్యాణ మండపం కు వెళ్ళాలి అంటే ఈ బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది.

అప్పుడు ఈ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ పెద్ద మనసు చేసుకుని , మేము సెంటర్ దగ్గర దిగిపోతాము. మొదట మీరు బస్సు తీసుకుని కళ్యాణ మండపం వెళ్ళండి అని తమ సౌజన్యం ప్రకటించారు.

వారందరికీ చేతులెత్తి మొక్కటం మినహా ఏమీ చేయలేకపోయాము.

సరే బస్సు కళ్యాణ మండపానికి బయలుదేరింది.

అప్పుడు డ్రైవర్ ఇంకో షరతును మా ముందుకు  తెచ్చాడు.

మొదట తాను వీధి చివర నే బస్సు ఆపుతానని , మా వాళ్ళు ఎవరైనా వెళ్ళి ముందుగా ఆడ పెళ్ళివాళ్ళని కెమెరాలు ఆపి పెట్టుకొమ్మని చెప్పాలని , ఫోటొలు, వీడియోలు తీయరాదని కండిషన్ పెట్టాడు.

"తాను మానవతా ధృక్పధంతో మాత్రమే మాకు సాయం చేస్తున్నానని, ఇలా నిర్ణీతరూట్ కాని రూట్లో  తన బస్సు కనపడిందంటే తన ఉద్యోగ జీవితానికి ముప్పు అవుతుందని , గిట్టని వాళ్ళు తనపై తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఉందని" అతను భీష్మించుకుని కూర్చున్నాడు.

ఇక తప్పదు కద. మా అన్నయ్యా వాళ్ళు బస్సు దిగి కళ్యాణ మండపానికి వెళ్ళి బస్సు వచ్చిందని కాని వీడియోలు, కెమెరాలు కట్టిపెట్టుకొమ్మని చెప్పి వచ్చారు.

మేము అక్కడికి చేరుకోవడంలో తీవ్రమైన జాప్యం వల్ల మొదటే ఆందోళనగా ఉన్న వారు ఈ విచిత్రమైన షరతుకి తెల్లమొహం వేశారు.

ఆ తరువాత విషయం అంతా తెలుసుకుని అందరూ నిట్టూర్చారు.

మొత్తం మీద కథ సుఖాంతం అయింది.

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment