Tuesday, May 3, 2022

గువ్వా గోరింక

 


గువ్వా గోరింక

 

కథ చాలా బాగుంది.

చప్పగా, నత్త నడక కథనంతో ,అవక తవక గా చెప్పబడ్డ ఒక మంచి కథ.

కథ ద్వారా చెప్పదలచుకున్న సందేశం చాలా ప్రభావవంతంగా ఉంది. ప్రస్తుత సమాజానికి ఈ సినిమా ద్వారా అందించబోయిన సందేశం చాలా అవసరం. నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు చూడండి అలాగన్నమాట. చాలా ప్రభావవంతమైన సందేశం.

 

ఏమిటి దర్శకుడు అందివ్వబోయిన సందేశం?

 

* శారీరిక ఆకర్షణ ప్రేమ కాదు

* ప్రేమ అంటె ఒకరినొకరు అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోవటం కూడా.

* లివిన్ రిలేషన్ షిప్ అన్నది అమోద యోగ్యం కాదు. పరస్పరంఅర్థం చేసుకోవడం, ఉభయుల అభిరుచులను గౌరవించుకోవడం అన్నది లివింగ్ రిలేషన్ ద్వారా కూడా సాధ్యపడదు.

* ఒకర్నొకరు చూసుకోకుండా కూడా మనసులు కలవటం సాధ్యమే. తుఛ్చమైన శారీరిక ఆకర్షణకి ప్రేమ అని పేరు పెట్టుకుని మోసం చేసే పురుషులు ఉన్నట్టే స్త్రీలు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త.

 

పై సందేశాలు నిస్సందేహంగా అమోదయోగ్యమైనవే. ఈ రోజుల్లొ ఇలాంటి సందేశంతో ఒక యూత్ సినిమా తీయబూనటం దర్శకుడి సాహసమే . అతన్ని అభినందించాల్సిందే.

 

 

ఇంతకు కథ ఏమిటి?

పెద్ద కథ ఏమీ లేదు.

ఒక చిన్న ఊరి నుంచి డిగ్రీ పూర్తి చేసుకున్న సంప్రదాయబద్దమైన ఒకమ్మాయి, సంగీతంలో పైచదువులకోసం నగరానికి వస్తుంది. పై చదువులు అవ్వంగానే తండ్రి చెప్పిన సంబంధం ఒప్పుకుని పెళ్ళి చేసుకుంటాను అని తండ్రికి మాట ఇచ్చి మరీ వస్తుంది నగరానికి. ఆమె నడవడి, మాటతీరు, వస్త్రధారణ బట్టి సంప్రదాయ బద్దమైన అమ్మాయి అని మనం అర్థం చేసుకోవాలి అని దర్శకుడు ప్రయత్నిస్తాడు.

ఆమె నగరానికి రాగానే ఒకట్రెండు రోజులు ఉండటానికి స్నేహితురాలి ఇంట్లో దిగుతుంది.  ఆ స్నేహితురాలు బహుశా చిన్నప్పటి నుంచి పరిచయం అనుకుంటా. కానీ ఆ అమ్మాయి నగర జీవితంలో ఆధునికశైలి ప్రకారం ఒక యువకుడితో సహజీవనం చేస్తూ ఉంటుంది.

ఊరికి వచ్చిన స్నేహితురాల్ని రిసీవ్ చేసుకుని వచ్చి, తీరా వాళ్ళింటి తలుపు లోపలికి ప్రవేశించే సమయంలో చెపుతుంది తన సహజీవనం గూర్చి. మన హీరోయిన్ ఏమి ఎక్స్ ప్రెషన్స్ చూపకుండా లోనికి ప్రవేశిస్తుంది. ఈ సీన్ లో హీరోయిన్ సంఘర్షణ ని ఇంకొంచెం వివరంగా చూపించి ఉంటే ఆ పాత్రని దర్శకుడు అనుకున్న రీతిలో ఎలివేట్ చేసే అవకాశం ఉండేది.

ఆ ఒక్క సీన్లో మాత్రమే ఈ సహజీవనం జంట అన్యోన్యంగా ఉంటారు. ఆ తరువాత ప్రతి సీన్లోనూ కీచులాటలే వారి మధ్య.

కాఫీ పొడి, టీపొడులు ఉంటాయో ఉండవో గానీ వారి ఇంట్లో నిత్యం  వోడ్కా లభిస్తూ ఉంటుంది. ఆధునికులు కద.

ఏ పాత్రకి ఆర్థిక సమస్యలు ఉండవు. అందరివి కడుపు నిండిన బేరాలే. అయినా వారిని మధ్య తరగతి మనుషులు అని మనం అనుకోవాలి అని ఆశిస్తాడు దర్శకుడు.

సరే, హీరోయిన్ కి రెండో రోజే ప్రక్కన ఫ్లాట్ దొరికుతుంది రెంట్ కి. ఆ పక్కనే ఉన్న మరో ఫ్లాట్ లో హీరో ఉంటాడు. అతనికి శబ్దం అంటే చిరాకు. శబ్దం రాని ఇంజిన్ తయారు చేయాలి అనుకుంటూ ప్రయోగాలు చేసే ఇంజినీర్ అతడు. ఇంట్లోనే ఏదొ ప్రయోగాలు చేస్తుంటాడు.  కానీ ఇప్పటికే జపాన్, జర్మనీ కంపెనీలు అలాంటి ఇంజిన్లు తయారు చేశారు అన్న విషయాన్ని దర్శకుడు విస్మరించాడు ఇక్కడ.

ఇక్కడ భిన్న అభిప్రాయాలు వారివి అని చూపటం దర్శకుడి ఆలోచన. హీరోయిన్ కి వయొలిన్ వాద్యం ఇష్టం. అతనికి శబ్దం అంటే సరిపోదు. అది భిన్నాభిప్రాయం అని మనం అనుకోవాలి.

తమాషా ఏమిటి అంటే పక్కపక్క ఫ్లాట్ లలో నే ఉన్నా వారు ఒకరినొకరు చూసుకోరు.  ఒకరి ఇంట్లో నుంచి ఇంకొకరు సునాయాసంగా సంభాషించుకుంటూ ఉంటారు. ప్రేమలో కూడా పడతారు.

చిన్న చిన్న అపార్థాల అనంతరం ఒకరినిఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమ మయం చేసుకుంటారు జీవితం.

సహజీవనం చేసిన జంట ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం లో విఫలం అవుతారు. 

ఇది స్థూలంగా కథ.

హీరో స్నేహితులు, వారి హాస్యం ఇవన్నీ ఉపకథలు.

కథ మొత్తం ఒక గోడ అడ్డుగా రెండు ఇళ్ళ మధ్య నత్త నడుస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

 

కథనం లో లోపాలు:    బోలెడు.

 

1) దెయ్యం గూర్చి భయపడ్డ సంప్రదాయబద్ధమైన హీరోయిన్, ఏ ఆంజనేయస్వామి దారమో కట్టుకోకుండా స్నేహితురాలి మాట విని వోడ్కా సేవించి ధైర్యం తెచ్చుకోవటం ఏమిటొ?

2) కుర్చీతో నాల్గు దెబ్బలు కొడితే వాళ్ళిద్దరి ఇంటీ మధ్య ఉన్న గోడ కూలిపోవటం ఏమిటో? అది కనీసం కే సీ ఆర్ ప్రభుత్వం కట్టిచ్చిన డబలు బెడ్రూం ఫ్లాట్ కూడా కాక పోయె.

3) ప్రియ దర్శి కి ప్రేమ మీద నమ్మకం కలగడానికి సృష్టించిన సీన్ చాలా పేలవంగా ఉంది. ప్రియదర్శిని కూడా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు.

4) హీరోయిన్ వయొలిన్ విద్వాంసురాలు కావటం వల్ల సంగీతానికి బోలెడు అవకాశం ఉంది. కానీ ఆ పాయింట్ ని విస్మరించాడు దర్శకుడు.

5) హీరో తండ్రి ఫిష్ వెంకట్ కి శబ్దం అంటే ఎందుకు చిరాకో అని తెలియ చెపుతూ బజాజ్ చేతక్ సంఘటన ని చొప్పించడం పరమ పేలవంగా ఉంది. జంధ్యాల ని ప్రేరణగా తీస్కున్నట్టు కనిపిస్తుంది ఈ తండ్రి కొడుకుల పాత్రలని చిత్రించటంలో. కానీ లా తీయలేకపోయారు.

 

సత్యదేవ్ టాలెంట్ ని ఏమాత్రం ఉపయోగించుకోవటానికి అవకాశం లేని పేలవమైన కథని ఎన్నుకున్నాడు దర్శకుడు.

 

సినీ దర్శకుడు వంశీ తీసిన ఔను....వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి, గోపిక , గోదారి సినిమాల్ని మిక్సీలో వేసి తిప్పగా వచ్చిన అయిడియాతో కథ అల్లుకున్నట్టు ఉంది.

మంచి సందేశం ఇవ్వబొయి, అయ్యబాబోయి యూత్ చూడరేమో అన్న భయానికి లోనయి తడబాటుతో తీసినట్టు ఉంది. మంచి సందేశం ఇవ్వటానికి పూనుకున్నప్పుడు మంచి కథని ఎన్నుకుని ఉండాల్సింది.

 

దర్శకుడు రాంగోపాల్ వర్మ స్కూల్ అట. ఇంకొంచెం సాధన చేస్తే మంచి భవిష్యత్తు ఉంది అని అనిపించింది.

 

 

No comments:

Post a Comment