Tuesday, May 3, 2022

అమరమ్మ అవ్వ

 "అమరమ్మ అవ్వ"

ఒక ఙ్జాపకం  - 21

మీకు మహిమలు, అద్భుతాలు అనే వాటి పట్ల నమ్మకం ఉన్నా లేకున్న ఇది చదవండి. ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కాబట్టి. ఇది జరిగి దాదాపు పదహారు సంవత్సరాలు అవుతోంది.

ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ జాబ్ కి రిజైన్ చేసేద్దాం అనే నిర్ణయానికి వచ్చాను. నేను ఇండస్ట్రీ లో మంచి పొజిషన్ కి ఎదిగే అవకాశం ఉన్నా కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికి స్వంతంగా ఏదయినా చేద్దాం అనే దిశగా  ఆలోచనలు సాగిస్తున్న కాలం అది. స్వంత బిజినెస్ మొదలు పెడితే మొదటి ఒకట్రెండు సంవత్సరాలు  క్షణం తీరిక ఉండదు కాబట్టి ఒక సారి  అందర్నీ చూసి వద్దామని ఆదోని బయలు దేరాను. అక్కడే అమ్మా,నాన్నలు, మా అన్నయ్య వుంటారు. మా అక్కయ్యలు కూడా వచ్చారు ఆదోనికి.

నా నిర్ణయం చెప్పాను చూచాయగా. స్వంత బిజినెస్ అంటే నేను నిర్వహించుకోగలనా, హాయిగా ఉద్యోగం చేసుకుంటూ గడిపేయ్యవచ్చు కద అని పెద్దలు అందరు అభిప్రాయ పడ్డారు కానీ నాకు అడ్డుచెప్పలేదు.

మరుసటి రోజు ఉదయం మా అన్నయ్య ఒక సంగతి చెప్పారు. ఆదోనికి దగ్గరలో ఉరుకుంద అనే ఊరికి దగ్గర ఒక అవధూత వెలిసింది. ఆమెను చూడ్డానికి వెళదామా అని ప్రొపోస్ చేశాడు.

ఆయన వద్ద మారుతి 800 కారు వుండేది ఆ రొజుల్లో. మాకు పెద్ద క్రేజ్ ఆ కారంటే. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని మూడు మూడున్నర ప్రాంతాలలో బయలుదేరాం.

నేను, మా శ్రీమతి, మా అన్నయ్య, ఇద్దరు అక్కయ్యలు ఇలా అందరం ఇరుక్కుని బయలుదేరాం. ఈ ఉరుకుంద గ్రామానికి చుట్టుప్రక్కల ఎక్కడైనా వుండొచ్చు అట ఆ అవధూత. అక్కడి స్థానికులు ఆవిడని అమరవ్వ అంటారు అని చెప్పారు మా అన్నయ్య శ్రీ అప్పాజి గారు.

కార్ లో వెళుతూ వుండగా ఆవిడ విశేషాలు చెప్పుకు వచ్చారు అయన.

ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అట. ఆవిడ భాష పాత కాలపు కన్నడ, తెలుగు, మరాఠీలు కలగలిపి వుంటుందట. ఆవిడకి ఒక స్థిర నివాసం అంటూ ఏదీ లేదట. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వుంటుందట. చెట్ల క్రింద, పొల్లాల్లోనూ, సత్రంలోనూ ఇలా ఎలా పడితే అలా వుంటుందట.

ఆవిడ వస్త్రధారణ, జడలు కట్టిన ఆవిడ జుత్తు చూడంగానే ఒక పిచ్చి ఆవిడ లాగా వుంటుందట. ఆవిడ స్నానం చేసి ఎన్నాళ్ళో అయినట్టు వుంటుందట, సరి అయిన పోషణ లేక శరీరం అంతా దుమ్ముకొట్టుకుని పోయి, వేళ్ళకు గోళ్ళు బాగా పొడవుగా పెరిగి మెలికలు తిరిగి వుంటాయట.

ఇవన్నిటి కారణంగా సహజంగానే ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే మనకు దుర్వాసన రావాలి కద. కానీ తద్విరుద్ధంగా ఆవిడ దగ్గర ఒక విధమైన సువాసన వస్తుందట.

ఆవిడ సాధారణ స్థితి మౌనం అట. కానీ ఎవరి మీదయినా దయ కలిగితే వారితో మాట్లాడుతుందట. కాకపోతే ఆమె ఏమి చెబుతుందో అర్థం చేసుకోవటం బాగా కన్నడం వచ్చిన వారికి కూడా అర్థం కాకపోవచ్చట ఒక్కోసారి. ఇది ఎలాగంటే, మన అన్నమయ్య కీర్తనలు తెలుగే అయినా మనకు ఇప్పుడు చాలా పదాలు అర్థం కావు కద. అలాగన్నమాట.

మా అన్నయ్య ఇవన్నీ వివరిస్తుంటే మాకు చాలా ఉద్విగ్నంగా ఉంది ఆమెని ఎప్పుడెప్పుడు చూస్తామా అని.

కౌతాళం ఉరుకుంద దాటి పొలాల మధ్యలో ఉన్న మట్టి రోడ్డులో వెళుతూ వున్నాం. మంచి ఏండ కాలం కావటం వల్ల చమటలు పడుతున్నాయి. రోడ్డు మీదనుంచి ఎర్ర రంగు మట్టి తెరలు తెరలు గా లెస్తూ వుంది కారు వెళ్ళినంత మేరా.

ఇక ఏ క్షణమయినా ఆమె దర్శనం అవవొచ్చు అని ప్రకటించారు మా అన్న గారు.

దారిలో అక్కడక్కడ ఆగుతూ ’ఆమె ఎక్కడ వుంది’  అని స్థానికులని విచారిస్తూ మెల్లిగా సాగుతోంది మా ప్రయాణం.

అమరవ్వ అని పిలవబడే ఆమెకి ఇదమిత్తంగా ఒక నివాస స్థలం అంటూ వుండేడి కాదు. ఆ రోజుకు సంబంధించినంతవరకు ఎక్కడో పొలాల్లో కూర్చోని వుందట.

అలా అన్వేషించుకుంటూ ఆ గ్రామీణులు చెప్పిన గుర్తుల ప్రకారం వెడితే దూరంగా ఒక పొలం మధ్యలో ఒక పెద్ద గుంపు కనపడింది.

దాన్ని బట్టి మా అన్నయ్య అంచనా వేశారు అక్కడే వుంటుంది అని.

"ఏమిటి మీరు కూడా మట్కా నంబర్ల కోసం వచ్చారా?" ఒక గ్రామీణుడు ప్రశ్నించాడు.

మా అన్నయ్య నవ్వి ఊర్కున్నారు. ఆ రొజుల్లో అది ఒక రకమైన జూదం. బొంబాయి కేంద్ర స్తానంగా కొందరు అండర్ వరల్డ్ డాన్లు ధనసంపాదన కు ఇది నిర్వహించే వారట. ఇది ఒక విధమైన బెట్టింగ్ లాంటిది.

దేశంలో ఏ ఊరి నుంచి ఎవరైనా పాల్గొనవచ్చు. కొన్ని సంఖ్యల మీద బెట్టింగ్ కాసి, ఎదురు చూస్తారు. వాళ్ళ అదృష్టం బాగుంటే వారి బెట్టింగ్ కి డబ్బులు వచ్చేవి. ఈ జూదం గురించి నాకు పెద్దగా తెలియదు.

ఆ రోజుల్లో ఆమె చుట్టూ చేరే గ్రామీణులు ఆధ్యాత్మిక ఙ్జ్యానమ్ కోసమో ధర్మ సందేహాల నివృత్తి కోసమో కాకుండా "ఏ నెంబర్ మీద బెట్టింగ్ కాయాలి" అని అడగటానికి ఆవిడ చుట్టూ చేరే వారట.

కొన్ని కొన్ని సార్లు ఆవిడ అనుగ్రహం తో కొంత మందికి నెంబర్లు సూచించటం వాటి మీద వారు ఇబ్బడి ముబ్బడిగా ధనం సంపాయించటం కూడా జరిగిందట.

ఆ విధంగా మట్కా నెంబర్లను అడగటానికి వచ్చే గ్రామీణులతో ఆమె చుట్టూ ఎప్పుడూ వందలది మంది కూర్చుని ఉంటారట.

నేను వారి పట్ల హేళనగా నవ్వాను. అప్పుడు మా అన్నయ్య "మనం మాత్రం ఆధ్యాత్మిక సత్యాలు అడగటానికి వెళుతున్నామా? మా కష్టాలు ఎప్పుడు తీరతాయి, ఉద్యోగంలొ ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఆరోగ్యాలు ఎలా ఉంటాయి అని ఇలాంటి ప్రశ్నలు అడగటానికే కద వెళుతున్నాం, స్తాయిలో తేడా వుండొచ్చు కానీ ఆ గ్రామీణులు, మనం అందరం అర్థార్థులమే తేడా ఏమి లేదు, గమ్మున కూర్చోండి అందరు" అని  కేకేసి ఆయన సాయిబాబ నామస్మరణలో మునిగిపోయారు. ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్టే కద.

మేము పొలం గట్టున కారు ఆపి దిగాము.

మా అన్నయ్య కారు ఇంజిన్ ఆఫ్ చేసి, హేండిల్ లాక్ చేసి, హేండ్ బ్రేకు వేసి, వెనుక ముందు కారు టైర్లు కదలకుండా పెద్ద పెద్ద బండ రాళ్ళు నాల్గు సేకరించి పెట్టి , కారు ని చేత్తొ తోసి అది కదలటం లేదు అని తృప్తిగా నిర్ధారణ చేసుకుని బయలుదేరారు.

కోతలు పూర్తి అయిన మొక్కజొన్న తోట అది, నల్లరేగడి నేల కనుచూపు ఆనినంత మేరా విశాలమైన ఖాళీ పొలం. గట్టు నుంచి దాదాపు అరకిలోమీటరు దూరంలో పొలం మధ్యలో పెద్ద గుంపు మధ్య ఒక ఎత్తైన బండ రాయి మీద ఆమె కూర్చుని వుంది. ఎవరితో ఏమి మాట్లాడటం లెదు.

ఉండుండి ఎవరో అదృశ్య వ్యక్తి తో పోట్లాడుతున్నట్టు గట్టిగా గాల్లో చేతులు విసురుతూ అరుస్తోంది. చాలా ఆవేశంగా వుంది ఆవిడ.

మెము కాస్తా నాగరికులుగా కనిపిస్తుండటం తో ఆ గ్రామీణులు మాకు ముందు వరుసలో కూర్చోనిచ్చారు.

మా అన్నయ్య గొప్ప సాయిబాబా భక్తులు.

ఆమె రూపంలో ఉన్న సాయిని దర్శిస్తున్నాము అన్న భావనతో తనతో తెచ్చుకున్న హరతిని కూర్చున్న దగ్గరే వెలిగించి దూరంనుంచే హారతీ తిప్పుతూ ఆరతి పాట పాడుతూ సాయిబాబాగా ఆమెని భావించి మొక్కుకుంటున్నాడు.

ఇంతలో అక్కడి గ్రామీణులు ఆయన్ని వారించారు అలా చేయకండి ఆవిడకి కోపం వస్తుంది అని. కానీ ఆవిడ ఆ గ్రామీణున్ని గట్టిగా కేకేసి నివారించి తృప్తిగా ఆరతి అందుకుంది.

ఆయన ధయిర్యం చేసి లెచి నడచి వెళ్ళి తనతో తెచ్చుకున్న పూలు ఆవిడ పాదాల వద్ద ఉంచారు.

ఆమె ప్రవర్తన తో అనుభవం ఉన్న అక్కడి భక్తులు ప్రాణాలు ఉగ్గబెట్టుకుని చూస్తున్నారు ఆయన కదలికలని. ఆవిడకి కోపం వస్తే కర్రతోనూ, పెద్దపెద్ద కంకర రాళ్ళతోనూ కొడుతుందట.

మా అన్నయ్య అవేవీ పట్టించుకోక పారవశ్యంతో ’బాబా బాబా’ అంటూ ఆవిడ పాదాల వద్ద పూలు వుంచి వెనుకకు రాబోయారు. అప్పుడు ఆవిడ అప్యాయంగా కన్నడంలో ’ఎక్కడికి వెళతావు. కూర్చో’ అంటూ తన పాదాల దగ్గరే కూర్చోమంది.

గ్రామీణులందరూ అవాక్కయ్యారు. వాళ్ళకు అప్పటి దాక రాళ్ళతో కర్రతో దెబ్బలు పడ్డాయట దగ్గరగా వెళ్ళినందుకు.

ఈ లోగా ఆవిడ చాలా ప్రశాంతత నిండిన కళ్ళతో మా అందరినీ కూడా తన వద్దకు రమ్మని సైగ చేసింది. మేము అంతా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం.

ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాడిని పలకరించినట్టు ఆమె మా అన్నయ్యని కుశల ప్రశ్నలు వేసింది. సంభాషణ యావత్తు కన్నడంలో జరుగుతోంది.

మా అన్నయ్య ’బాబా, నాకు వ్యువహార ఙ్జ్యానం వుంది కన్నడంలో మీరు మాట్లాడె కన్నడం నాకు అర్థం కావటం లేదు: అన్నాడు. అప్పుడు ఆమె సైగ పై ఒక వృద్ధుడైన గ్రామీణుడు దగ్గరకి వచ్చి ఆమె మాటలు మాకు అర్థం అయ్యెలా చెప్పసాగాడు.

మా అన్నయ్య మా అందర్ని పరిచయం చేశాడు. నా గురించి పరిచయం చేయగానే ఆవిడ అంది "తాతని పూజ చేస్తాడు కద" అని.

నేను వెంకయ్యస్వామి అనే అవధూత కి భక్తుడిని . నెల్లూరు జిల్లాలోని గ్రామీణులు ప్రేమగా ఆయన్ని వెంకయ్య తాత అనడం కద్దు.

అప్పుడు మా అన్నయ్య " బాబా మా తమ్ముడు మహరాజుగా ఉద్యోగం చేసుకోకుండా తనే స్వంతంగా ఏదో వ్యాపారం చేసుకుంటాను అని చెప్పి ఉద్యోగానికి రాజినామా చేస్తాను అంటున్నాడు. వాడి విషయం మాకు దిగులుగా వుంది. మీరే వాడిని సరి అయిన దారిలో పెట్టాలి " అని అన్నాడు.

ఆవిడ నా వంక దయగా చూసి ఒక సారి తన దృష్టిని దూరంగా ఆగి ఉన్న మా కారు వంక సారించారు.

అప్పుడొక అద్భుతం జరిగింది.

ఆమె కారు వంకే రెప్పలార్పకుండా చూస్తూ నిలబడి గట్టిగా చప్పట్లు చరిచింది కొన్ని క్షణాలు.
మేమెవ్వరం ఊహించని విధంగా కారు ముందుకు కదిలింది. దాన టైర్ల ముందర పెట్టబడిన బండల్ని ఎక్కి నెమ్మదిగా దిగి
, నింపాదిగా ఓ పది అడుగులు ముందుకు నడిచి ఆగిపోయింది.

హేండిల్ లాక్, హేండ్ బ్రేక్, టైర్ల ముందు బండలు, ఇన్నింటిని అధిగమించి ఫిజిక్స్ సూత్రాలను సవాలు చేస్తూ కారు ముందుకు వెళ్ళటం ఆశ్చర్యం. అది ఎలా జరిగిందో ఇప్పటికీ నాకు తెలియదు. అది ఒక అద్భుతం అంతే.

ఆ తర్వాత ఆమ గట్టిగా కన్నడంలో ఏదో అరిచింది.

ఆ గ్రామీణుడు ఆ మాటల్ని తెలుగులో చెప్పాడు "ఈ కారు ను ఇంత దూరం నుంచి ఎన్ని అవరోధాలున్నానేను  నడిపించినట్టు, తాతను పూజిస్తున్న అతని జీవితాన్ని ఆ తాతే నడిపిస్తాడు ఏమి భయపడకండి. అతని నిర్ణయం ప్రకారమే అతని నడవనివ్వండి"

మా అన్న ఆత్రం పట్టలేక పదే పదే అడిగాడు నా గురించి. ఆయనకు నాపై ఉన్న ప్రేమ అలాంటిది.

అప్పుడు ఆమెలో తీవ్రత చూశాము. "చెప్పాను కద. ఎన్ని సార్లు చెప్పాలి?" గట్టిగా అరిచింది. ఆమె దెబ్బ అదివరకే ఎన్నో సార్లు చవి చూసిన గ్రామీణులు మమ్మల్ని మౌనంగా వుండమని హెచ్చరించారు.

ఆ తర్వాత ఇంకా ఏవో ప్రశ్నలు వేసి ఆవిడకి అరటిపండ్లు, టెంకాయలు నైవేద్యంగా సమర్పించాము.

ఇక బయలు దేరుదామని లేచే లోపు ఆమె వారించారు ఆగమని.

ఆమె అనుమతి తీసుకుని బయలుదేరుదామని ఎన్ని సార్లు ప్రయతించినా మమ్మల్ని పోనియ్యలేదు. అవధూతల దర్శనానికి వెళ్ళినప్పుడు వారు అనుమతి ఇచ్చాకే బయలె దేరాలి అని శాస్త్రం.

మా మూడో అక్కయ్య (ఈవిడకి ఇలాంటివి నమ్మకం లేదు)  "ఏంటి ఇది, ఎన్ని సార్లు ఇలా నేను వెళ్ళీ కార్లో కూర్చుంటాను" అని లేచి నిలబడబోయారు.

అప్పుడు అమరమ్మ అవ్వ కీచుమని అరచి ఓ పెద్ద కంకర రాయి తీసుకుని సూటిగా మా అక్కయ్య మీదకి విసిరారు. అది ఆమె నుదుటికి తగిలి ధారగా రక్తం కారటం ప్రారంభం అయింది. కర్చీఫ్ అడ్డు పెట్టి, తాను కూర్చుండి పోయింది. చిత్రంగా తనకు నొప్పి అస్సలు లేదంది.

ఆ తరువాత ఆమె ఒక అరగంటకి మా అందరికి బయలుదేరటానికి అనుమతి ఇచ్చారు.

మా అక్కయ్యకి తగిలిన ఆ గాయం తీవ్రత చూస్తుంటే కనీసం ఒక నెల రోజులు అవస్త పడుతుంది అనుకున్నాం. చిత్రంగా మరుసటి రోజు ఉదయానికల్లా అసలు గాయం తగిలిందా అన్నట్టుగా మానిపోయింది అది.

 

ఇలా ఈ అమరమ్మ అవ్వను నేను మరోక సారి కూడా దర్శించుకోవటం జరిగింది. ఆ రెండో విడతలో ఫోటోలు కూడా తీసుకోవటం జరిగింది. ఇక్కడ జతచేసిన ఫోటోలు రెండో విడతవి.

 

రెండొ విడత వెళ్ళీనప్పుడు మా అన్న గారి అత్తయ్యకి ఆవిడ గ్లాసులకొద్దీ మజ్జిగ త్రాగించారు తన ప్రక్కనే కూర్చోబెట్టుకుని. అంతకు మించి మరేమి విశేషాలు జరుగలేదు ఆ విడత.

No comments:

Post a Comment