ప్రాడో -2
ఒక ఙ్జ్యాపకం
ఏ కుక్కను కొనాలి అన్న తర్క
వితర్కాలకు తెరవేస్తూ మా శ్రీమతి లాబ్రడార్ అన్న స్నేహభావం గల కుక్కను కొనమని
తీర్మానం చేసింది అని తెలుసుకున్నాం కద పోయిన భాగంలో.
లాబ్రడార్ బ్రీడ్ కుక్కలు ఎక్కడ
తెచ్చుకోవాలి అన్నది ఇప్పుడు మా ముందున్న ప్రశ్న. సరే చెప్పాను కదా మా కాలనీ లొనే
లాబ్రడార్ బ్రీడ్ కి సంబంధించి నడిచే విఙ్జ్యాన సర్వస్వం (ఎన్‍సైక్లోపిడియా)
అనదగ్గ ఒక ఆంటీ ఉన్నారని (ఈ ఆంటీ అన్నది పిల్లల భాష. నేను ఆవిడని చెల్లెమ్మ అనటం
సబబుగా ఉంటుంది.) సరే ఆంటీనో, చెల్లెమ్మనో ఆవిడ
దగ్గరకి వెడీతే మనకు ఈ సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుందని నేను, మా ఆవిడ , పిల్లలం అందరం కలిసి వాళ్ళ ఇంటికి
వెళ్ళాం. ఉత్త చేతులతో వెడితే బాగుండదు కద, పూలు పండ్లూ
తీసుకుని శాస్త్రోక్తంగా వాళ్ళింటికి వెళ్ళాం.
ఆవిడ వృత్తిరిత్యా డాక్టర్, ప్రవృత్తి రిత్యా పోరాట వాది, మహిళా హక్కులు,
పౌరహక్కులు, సామాజిక సమరసత ఇలా సోషల్ ఇష్యూస్
పై పోరాడుతూ ఉంటుంది.
మేము వెళ్ళే సరికి ఎవరో టీవీ
ప్రతినిధులు ఆవిడ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు.
"పెళ్ళిళ్ళూ అనేవి ఎవరికులంలో
వాళ్ళూ చేసుకోవటం మానేసి, అగ్రవర్ణాల వారి పిల్లలనందరిని కట్టకట్టి
వెనుకబడ్డ వర్గాల వారి అబ్బాయిలకు ఇచ్చి పెళ్ళీ చేస్తే ఒక్క రాత్రిలో కుల
వ్యవస్తని నిర్మూలించవచ్చని......" ఇల ఆవిడ ఆవేశంగా టీవీ కేమెరాకేసి భీకరంగా
చూస్తు సమాజానికి ఒక సవాల్ విసిరారు.
మమ్మల్ని కూచోమని సైగ చేసారు.
సరే ఇంటర్వ్యూ అయిపోయింది కెమెరా
బృందం వారు వాన్ ఎక్కి వెళ్ళిపోయారు.
"ఎమర్రా బాగున్నారా, సరే ఏ కుక్కని కొనాలని నిర్ణయం తీసుకున్నారు?" అని ఆవిడ శునక సంబంధ కుశలప్రశ్నలు వేశారు.
పూలు పండ్లు ఆవిడ ఎదురుగా టీపాయ్
మీద పెట్టి సవినయంగా చెప్పుకున్నాం , చివరికి
ఆవిడకి ఇష్టమైన బ్రీడ్ అయినట్టి లాబ్రడార్ కొనటానికే నిర్ణయం తీసుకున్నామని.
"మంచిది. మీరు ఒక ఆరేడు నెలలు
ఆగి అయినా సరే, లాబ్రడార్ పెంచుకుంటున్న వాళ్ళలో, బాగా తెలిసిన వాళ్ళ ఇళ్ళలో
ముందుగా చెప్పి పెట్టి, ఒక పప్పీ కావాలని చెప్పి అది
పిల్లల్ని కన్నాక అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటే, మనకు మంచి
కుక్క దొరుకుతుంది."
"అదేంటండి. ఎందుకు అలాగా?" అడిగాను నేను అర్థం కాక
"దాని పేరెంట్స్ ఎవరో మనకు
ముందుగా తెలుస్తుంది కాబట్టి, అది క్రాస్ బ్రీడ్
కాదని మనకు ఖాయంగా తెలుస్తుంది, భరోసాగా తీసుకోవచ్చు.
కెన్నెల్స్ లో దొరికే కుక్కలకు పేరెంట్స్ ఎవరో మనకు తెలియదు, అప్పుడు మనకు వాటి పెడిగ్రీ
తెలిసే అవకాశం లేదు (పుట్తు పూర్వోత్తరాలు, కులగోత్రాలు లాగా
అన్నమాట). అది రిస్కు కద."
"మాకు అంత టైం లేదు అండీ, పిల్లలు ఆత్ర పడుతున్నారు" అన్నాను
"సరే మీ ఇష్టం" అంది
ఆవిడ.
మొత్తమ్మీద మనుషుల్లో సమాజిక
సమానత్వం తేవాలని ఆమె కంకణ బద్దురాలు అయి ఉంది కానీ కుక్కల విషయంలో అవి వర్ణ సంకరం కావటం ఆవిడకి సమ్మతం కావటం లేదు.
ఏమిటొ నాకేమి అర్థం కాలేదు. సరె ఆమెని నేను ఏడ్యుకేట్ చేయలేను కద. ఇన్నిని
బ్రీడ్లు, ఇన్నిన్ని తెగలు ఏమి బాగులేదు. నాకైతే
కుక్కలన్నిట్లొ కూడా సమానత్వం
తెప్పిద్దామని బలంగా అనిపించింది. ఖర్మ నా మాట ఎవడు వింటాడు.
సరే గూగుల్ లో సెర్చ్
చేసి, జస్ట్ డయల్ కి ఫోన్ చేసి
కొన్ని కెన్నెల్స్ కి మళ్ళీ ఫోన్లు చేస్తే దాదాపు అయిదువేల నుంచి ఇరవై వేల దాకా
చెబుతున్నారు ఒక్కొ పప్పీ కి.
నాకు కుక్కపిల్లకు
పోయి అంత డబ్బు వెచ్చించడం ఇష్టం లేదు. సరే ఇదిలా ఉండగా ఓల్డ్ సిటీ నుంచి ఒక
మిత్రుడు ఫోన్ చేసి వాళ్ళీంటి దగ్గర ఒక నవాబు గారి దగ్గర లాబ్రడార్ బ్రీడ్ పప్పీలు
ఉన్నాయి ఉత్తినే నామకార్థ రుసుముతో వాటిని తీసుకోవచ్చని ఆయనకి కుక్క పిల్లలతో
వ్యాపారం చేసే ఉద్దేశం లేదు సరదాకి పెంచుతున్నాడు, ఎవరికయినా నామకార్థ రుసుముతొ ఇస్తూ ఉంటాడని ఇప్పుడు నాలుగు పప్పీలు రెడీగా
ఉన్నాయని చెవుల్లో తేనె పోసినట్టు చెప్పాడు.
ఆ నవాబు గారి ఫోన్
నెంబర్ ఇప్పించుకుని
సరే ఇంకేముంది ఒక
శుభముహూర్తం లో నేను మా ఆవిడ ఇద్దరు పిల్లలు కారేసుకుని బయలు దేరాము. నల్గొండ
క్రాస్ రోడ్ దగ్గర ఎడమ వైపుకు మలుపుతీసుకుని చంచల్ గుడా జైలు వరకు వెళ్ళీ, జైలు దగ్గర మలుపు తీసుకుని ఓల్డ్ సిటీ
వైపుకి ప్రయాణం ప్రారంభించాము.
అప్పటి దాకా మేము
ఓల్డ్ సిటీ చూసింది లేదు.
రోడ్డుకు అటూ ఇటూ
చంచల్ గూడా జైలు. (అప్పటికి రోడ్డు బ్లాక్ చేయలేదు ఇంకా)
అక్కడి నుంచి వాతా
వరణం గంభీరంగా మారింది. జైలు పరిసరాలు దాటి కాస్త ముందుకు వెళ్ళిన తరువాత, ఒక ఫ్లై ఓవర్ వచ్చింది , అది దాటి ముందుకు వెళ్ళే కొద్ది వాతావరణం పుర్తిగా కొత్తగా
అగుపించసాగింది.
నాకు ఎన్నడూ పరిచయం
లేని భాషలో బోర్డులు, పుర్తి ఇస్లాం సంప్రదాయ
బద్ధంగా వేష ధారణలొ స్త్రీ పురుషులు. నాకు సడన్ గా ఏదో దేశంలోకి వచ్చేశామా
అన్నట్టు అనిపించింది.
సరే అడ్రసు
సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళీ ఒక పాడు పడిన పురాతన బంగ్లా ముందుకు చేరుకున్నాము.
బాగా పాత పడి
దుమ్ముకొట్టుకుని పోయిన మెర్సిడిస్ బెంజ్ కారు వాడకం లేక అవసాన దశలో ఆ బంగ్లా
ముందు ఉంది. అదే విధంగా పాత రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్టు ఒకటి, కాడిలాక్ కారు ఒకటి ఇవన్నీ కూడా
దుమ్ముకొట్టుకుని పోయి గతించి పోయిన ప్రాభవానికి చిహ్నాలుగా ఆ భవంతి ముందు
ఉన్నాయి.
మేము కారు దిగి గేటు
దాటి లోపలికి అడుగు పెట్టాను. గొలుసు తో కట్టేసిన జెర్మన్ షెపర్డ్ ఒకటీ భీకరంగా
అరిచింది నన్ను చూసి. దానికి గొలుసు అడ్డుకట్ట వేయకుంటే అది నన్ను ఖండ ఖండాలుగా
చీల్చేసేది అనుకుంటా.
’ఊర్కో, ఊర్కో’ అని దానిని ఉర్దూలో సముదాయిస్తూ ఒక
వృద్దుడు లోపలి నుంచి వచ్చాడు. ఆజానుబాహుడు, తెల్లటి తెలుపు.
పొడుగ్గ పెరిగిన గడ్డం, రంగు వేసి, వేసి
మానేయటం వల్ల ఆ గడ్డం ఒక విధమైన ఎర్రటి రంగులో ఉంది .
అయన నడకలో వృద్ధాప్యం
వల్ల వేగం లోపించింది,, ఒక ముసలి సింహం లాగా మెల్లిగా
వచ్చాడు ’ఎవరూ బేటా’ అంటు నన్ను ప్రశ్నించాడు. ఆయన కంఠంలో ఒక రాజసం ఉంది.
నేను వచ్చిన విషయం
చెప్పగా ఆయన గుర్తు పట్టి "రండి రండి" అంటూ ఆదరంగా ఆహ్వానించి కాంపౌండ్
లో ఒక వారగా తీసుకు వెళ్ళాడు. అక్కడ సింహంలాంటి రంగులో ఒక వృద్ధ శునకం దాని
చుట్టూగెంతులు వేస్తు ఒక అయిదు పప్పీలు ఉన్నాయి.
"ఇదిగో వీటిలో ఒక
దాన్ని తీసుకోండి, ఈ మూడు మగవి, ఇది ఆడది" అంటూ ఆయన విషయానికి వచ్చాడు.
వాటిల్లో ఒక పప్పి
విపరీతమయిన చురుకుదనం తో ఉంది. అది మిగతా పప్పీలని అణగదోస్తూ గెంతులు వేస్తోంది.
మిగతా వాటి అన్నింటి మీదకి అది చాలా ఆక్టివ్ గా మాకు తోచి దానిని ఎనుకున్నాము.
అది మేము తీసుకున్న
గొప్ప పొరపాటు నిర్ణయాలలో అది ఒకటి అని కాలక్రమేణా మాకు తెలియవచ్చింది.
ఆ కుక్కను అదే పప్పీని, మేము తీసుకుని వచ్చి దానికి ప్రాడో అని
నామకరణం చేసి హరి ఓం అని పెంచుకోవటం మొదలెట్టాం.
దానితో మేము పడ్డ
కష్టాలు, మేము అనుభవించిన నరక
సదృశ్యమయిన అనుభవాలు రాగల ఎపిసోడ్ లో మీకు తెలియజేయగలను.
No comments:
Post a Comment