Tuesday, May 3, 2022

ఆర్కెష్ట్ర

 ఒక ఙ్గాపకం -17

"ఆర్కెష్ట్ర"

 

నీ గత ఙ్గాపకం లో పంచ్ లేదేంటి అని ఆడిగాడో మిత్రుడు.

ఇదిగో ఈ ఙ్గాపకం చివరి దాకా చదువు నీకు తిక్క కుదురుతుంది అని చెప్పి ఈ ఙ్గాపకం స్వీకారం చుట్టాను, అఫ్ కోర్స్ ఇది పంచ్ కోసం వ్రాసిందేం కాదు నిజానికి. ఈ ఙ్గాపకం అలాంటిది. దీనిని చివరిదాకా చదివితే మీకు కూడ అదే భావన కలుగుతుంది.

 

***

 

"మరి కొద్ది సేపటిలో మీ అందర్ని మంత్ర ముగ్ధులను చేసే సంగీత విభావరి ప్రారంభం అవబోతోంది. అప్పటి దాకా నేను ఇంకో రెండు జోకులు మీతో చెప్పాలనుకుంటున్నాను"  అని చెప్పాడా వ్యక్తి.

తెర ఇంకా తీయలేదు. ఆ మూసిన తెర ముందే చేతిలో మైకు పట్టుకుని నిలబడి దాదాపు అరగంట నుంచి అందర్ని తన జోకులతో , హాస్య సంభాషణలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఆ బక్కపలచని వ్యక్తి.

పులివెందుల పాలిటెక్నిక్ కాలేజి ఆవరణలో సంగీత విభావరి కార్యక్రమం జరుగుతోంది.

వాళ్ళు ప్రకటించిన మేరకు సాయంత్రం ఆరున్నరకి ప్రారంభం అవ్వాలి. మేము ఓ అరగంట ముందే వచ్చి చక్కటి ప్లేసు సెలెక్ట్ చేసుకుని కూర్చున్నాం. ఏడున్నర అయినా ప్రారంభం అవలేదు.

దాదాపు ఏడున్నరకి ఈ బక్కపలచటి వ్యక్తి వచ్చి శ్రోతలని ఆకట్టుకుంటున్నాడు తన సంభాషణలతో.

ఆహుతులంతా కుర్రకారు, ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన పల్లీయులు.

అతను తన సంభాషణలతో అందరినీ కట్టిపడేశాడు.

అతని జోకులు నిజానికి చాలా చౌకబారుగా వున్నాయి, కొంత మెరకు అసభ్యంగా కూడా వున్నాయి.  తన కడప ఉర్దూ యాసతో, చౌకబారు బాడి లాంగ్వేజితో అతను చెబుతున్న జోకులు నాకు చిరాకు కలిగిస్తున్నాయి.

కానీ సభకొచ్చిన వారు పాటలు పాడే వారు ఇంకా రాలేదన్న విషయమ్ కూడా మర్చిపోయి ఇతని జోకులు తీవ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. "పాటలు వద్దు -  పాడు వద్దు  నువ్వే ఇంకొంచెం సేపు మాట్లాడు తమ్ముడు" అనే స్థితికి వచ్చేశారు ప్రేక్షకులు.

***

నా ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షల అనంతరం వచ్చిన సమ్మర్ హాలిడేస్ కి పులివెందుల రావటం జరిగింది. పోయిన వారం చెప్పాను కద నా ప్రాణ స్నేహితుడు కంచనపల్లి రమణానందం వాళ్ళ ఊరికి రావటం జరిగింది.

ఓల్డ్ బస్ స్టాండులో బస్సు దిగి ఆంకాళమ్మ పేటలో వున్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళవీధి పేరు అలా వుంది కాని, అది అన్ని ఊర్లలోని వీధులలాగే వుంది. కాస్తా రిలిఫ్ గా ఫీల్ అయ్యాను.

ఆ వీధిపేరు విని భయపడ్డ మాట వాస్తవం. స్నేహితులతో కల్సి అలా వేరే ఊరికి వెళ్ళటం అదే మొదటి సారి. నేను, రమణా, శ్యాం అనే ఇంకో మిత్రుడు వెళ్ళాము. మాఇంట్లో వాళ్ళు మొదట కాస్తా సందేహపడ్డా , వాళ్ళ అమ్మానాన్నలు కూడ బలవంతం చేయటంతో చివరికి ధైర్యం చేసి పంపారు.

చాలా ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళాము.

ఆ రోజుల్లొ కడప నుంచి పులివెందులకి వెళ్ళే బస్సులకి పైన లగేజి క్యారియర్ వుండేది కాదు. తీసేసె వారు. కారణం చెబితే చిత్రంగా వుంటుంది.

ఇది ఈ కథ కి సంబంధం లేకున్నా గుర్తు వచ్చింది కాబట్టి చెబుతున్నాను.

కడప ఆకాశవాణి సమీపంలో  ఒక రైల్వే బ్రిడ్జి క్రింద నుండి వెళుతుంది పులివెందుల రూట్. ఆ బ్రిడ్జి ఎత్తు తక్కువ వుండటం వల్ల బస్సులన్నిటికి ములాజా(ఎటువంటి భేషజాలు) లేకుండా లగేజి క్యారియర్ పీకేసి నడిపేవారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు ఈ తతంగం ఇలాగే కొనసాగింది.

అనేక బాలారిష్టాలు ఎదుర్కొని ఇటీవలే రింగురోడ్డు లాంటిది వేశారు అక్కడ.

 

పులివెందులకు వచ్చి రెండు రోజులు అవుతోంది.

చాలా ఉత్సాహంగా గడిచిపోతున్నాయి రోజులు. ఆ రొజుల్లో దూరదర్శన్ ప్రసారాలు కూడా వచ్చేవి కావనుకుంటా ఆ ఊర్లో. ఇప్పట్లో లాగా స్మార్ట ఫోన్లు, ఇంటర్ నెట్లు, కేబుల్ టీవీ ప్రసారాలు కూడా ఏమీలేవు.

అయినా ఉల్లాసంగా గడిచిపోతూంది సమయం. వాళ్ళ అమ్మానాన్నలు మమ్మల్ని చాలా ఆదరంగా చూసుకున్నారు. అసలు కోత్తఊర్లో ఉన్నామన్న భావనే కలుగలేదు.

రమణా వాళ్ళ మేనమామ (వాళ్ళు ఆయనని హనుము మామ అంటారు. ఆయన అసలు పేరు నాకు ఇప్పటికీ తెలియదు) హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసే వారు. ఆయన కూడా తన పిల్లల్ని పంపించారు ఈ శెలవులకి పులివెందులకి.

వాళ్ళ అబ్బాయిలు రాము (అతను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో వున్నాడు), ఆనంద్( ఈ కుర్రాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు ఇప్పుడు), వాళ్ళచెల్లి శ్రీదేవి (ఈమె యు.ఎస్ లో వుంది ఇప్పుడు) వీళ్ళందరూ కూడా కలవటంతో ఇల్లంతా సందడే సందడి అన్నట్టు వుండింది.

మేమంతా క్యారమ్ బోర్డ్ ఆడటం , ఇలా రకరకాల ఆటలు కబుర్లతో కాలం ఎలా గడిచిపోయిందో తెలియటం లేదు.

ఇదిలా వుండగా ఎవరో చెప్పారు ఆ రోజు సాయంత్రం ఆ ఊళ్ళో పాలిటెక్నిక్ కాలేజిలో కాలేజి డే ఫంక్షన్ సంధర్భంగా ’ఆర్కెష్ట్రా’ ఏర్పాటు చేశారు అని. అప్పట్లో అది చాలా పెద్ద వినోద కార్యక్రమం. మేమంతా కలిసి సాయంత్రనికల్ల ఊరికి కాస్తా దూరంగా ఉన్న పాలిటేక్నిక్ కాలేజీ ఆవరణలో వాలిపోయాము.

ఇదిగో మా పిల్లమూకంతా కలిసి ఆ కార్యక్రమానికి వారు ప్రకటించిన సమయం కన్న ముందే చేరుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాము.

 

***

సమయం రాత్రి పదవుతోంది దాదాపు.

ఈ జోకులు కార్యక్రమం ఇలాగే తెల్లారే దాకా కొనసాగుతుందా అని నాకు అనుమానం వస్తుండగా క్రమంగా తెర పైకి లేయటం, పాటల కార్యక్రమం ప్రారంభం అవ్వటం జరిగిపోయాయి.

అంటే దాదాపు నాలుగు గంటలు ఆలశ్యంగా కార్యక్రమం ప్రారంభమయిందన్న మాట. అయినా జనాలు విసిగిపోలేదు. అంతగా అలరించాడు ఆ బక్కపలచటి వ్యక్తి.

ఒకట్రెండు పాటలు అయ్యాక, మళ్ళీ అతనే స్టేజి పైకి వచ్చి నిలబడ్డాడు. జనం అంతా అతన్ని ఈలలతో స్వాగతించి హర్షం వెలిబుచ్చారు. ఇంచుమించు అతనొక సెలబ్రిటీగా మారిపోయాడు పులివెందులలో ఆరోజు.

అతను మైకు అందుకుని ఓ చిన్న ప్రకటన వెలువరించాడు

"మీ అందరి సహనానికి జోహార్లు, అభినందనలు. ఈవేళ్టి అసలు కార్యక్రమం ఆర్కెష్ట్రానే అయినప్పటికి, నాజోకులు అనుకోకుండా వినిపించాల్సి వచ్చింది. అసలు ఏమి జరిగింది అంటే మా బృందం ఆంతా కలిసి కడపనుండి ఐషర్ మిట్శుబిషి ట్రక్కులో బయలుదేరాము. ఇంకా వేంపల్లి కూడా రాకముందే మా ట్రక్కుకు సాంకేతిక లోపం ఏర్పడి ఆగిపోయింది.

నేను ఏదో ఒక వాహనం పట్టుకుని వచ్చేసాను. మా బృందం వాళ్ళు ఆ రెపేరి పూర్తి అయివచ్చే దాకా ఇలా మీతో కబుర్లు చెబుతూ వుండిపోయాను"

అతనిలా చావు కబురు చల్లగా చెప్పేటప్పటికి అందరూ మరొక్క సారి చప్పట్లు కొట్టి ఈలలు వేసి అతన్ని అభినందించారు.

అది కూడా జొకు అనుకున్నారేమో.

 

***

మాటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ప్రభావవంతమయినవో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు అలా కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రభావాన్ని చూడటం జరిగింది.

అప్పటి నుంచి మాటకారులైన మనుషులు ఎక్కడ కనిపించినా నాకు ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. అతనికి పెద్ద విద్యా గంధం లేదు, సాహిత్యం తో అనుబంధం లేదు, పెద్ద పద్దతిగా మాట్లాడగలిగేలాంటి మాటకారి  కూడా కాదు. కేవలం అతని సంకల్ప బలం వల్లనే అతను అంత మందిని అన్ని గంటల సేపు ఆపి మంత్రముగ్ధులను చేయగలిగాడు.

ఆ రోజు ఏమాత్రం అటు ఇటు అయి వుండినా కూడా పరిస్తితి ఇంకోలా వుండేది. అసహనానికి గురుయిన తమిళ  ప్రేక్షకులు కృష్ణగిరిలో సినిమా హాలు ధ్వంసం చేశారన్న వార్త చదివి ఇది గుర్తు వచ్చి వ్రాస్తున్నాను.

 

 

 

 

 

No comments:

Post a Comment