Tuesday, May 3, 2022

ప్రాడో Part 1

 ప్రాడో

ఒక ఙ్జ్యాపకం-22

కుక్కను పెంచుకోవాలి అన్నది ఎందుకో చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. కానీ ఇంట్లో సానుకూలంగా స్పందించే వారు కాదు.

మా అమ్మ గారు నొప్పింకక తానొవ్వక అన్న సిద్దాంతం ప్రకారం ’కుక్క వద్దు’ అని నన్ను ఎలాగో ఒప్పించేది.
ఆవిడ ప్రధాన ఆయుధం ఏమిటీ అంటే నాన్న గారికి ప్రతి సంవత్సరం ట్రాన్స్పర్స్ అవుతాయి కద, కుక్క ఊరు మారితే నీరు మారి బ్రతకదు, మనకు పాపం వస్తుంది అని.
నాన్న రిటైర్ అయ్యాక పెంచుకుందామ్ లే అనేది. సరే ఏమి చెద్దాం ఇంటి దగ్గర చుట్టు ప్రక్కల వుండే వీధి కుక్కలకే ఆహారం వేసి వాటినే పెంచుకుంటున్నట్టు ఫీలయ్యేవాడిని. అలా నా బాల్యం గడిచిపోయింది.
ఆ తర్వాత వంతు మా అవిడ తీసుకుంది. ’మనం స్వంత ఇల్లు కొన్నాక తప్పక కుక్క ను పెంచుకుందాం అండి’ అని నన్ను ఊరడించేది.
సరే స్వంత ఇల్లు, కారు, ఇద్దరు పిల్లలు ఇలా ఒక ఇంటికి కావాల్సిన హంగులు అన్నీ వచ్చాయి. కాని నేను జీవన సమరం లో పడిపోయి ఈ కుక్క స్వప్నాన్ని మరచి పొయాను.
నీవు బలంగా కల కంటే విశ్వం లో శక్తులన్ని కుమ్మక్కయి నీ కలను నెరవేరుస్తాయని’ ’ది ఆల్కెమిస్ట్’ లో పౌలో ఖుయిలో చెప్పారు కద. సరిగ్గా ఇలాగే జరిగింది నా కుక్క స్వప్నం విషయంలో.
స్వంత ఇంటి గృహ ప్రవేశం ముహూర్తం నిర్ణయం అయ్యాక పూజా సామాగ్రి,ఇతర సరుకులు, వంట వాడిని ఎవర్ని మాట్లాదాం, పూజాదికాలకి ఏ పండితుడిని పిలుద్దాం అని కద ఎవరయినా ఆలోచిస్తారు.
కాని మా ఇంట్లో కాస్తా విచిత్రమయిన తంతు నడిచింది.
మా పిల్లలు అప్పటికి హై స్కూలు చదువులు చదువుతూ ఉండినారు. వాళ్ళు ఎప్పటినుంచో మనసులో పెట్టుకున్నట్టున్నారు, స్వంత ఇల్లు అన్న మాట వినిపించే సరికి ’అయితే కుక్క ని తెచ్చుకుందాం మొదట’ అని గట్టిగా గోల మొదలెట్టారు.
పాల ప్యాకెట్లు ఎక్కడ దొరుకుతాయొ చెప్పగలను, కూరగాయలు ఎక్కడ అమ్ముతారో చెప్పగలను, కార్లు ఎక్కడ అమ్ముతారో చెప్పగలను ఇలా ఒక్కొక్క వస్తువు ఒక్కో దగ్గర దొరుకుతుంది అని మనకు ఇదమిత్తంగా తెలుసు. కానీ ఈ కుక్కలు ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు కద.
సరే నా చిన్నప్పటి పద్దతి ప్రకారం ఏదయినా వీధిలొ దొరికే కుక్క పిల్లకి మెడలో ఒక పురికోస తాడు కట్టి పెంచేసుకుందాం చక్కగా అని ఒక బ్రహ్మాండమయిన అయిడియా కూడా ఇచ్చేశాను. అక్కడితో సమస్య తీరి పోయింది అని భావించాను.
కానీ అలా అయ్యుంటే ఇంత కథేం ఉంది?
మా పిల్లలు ససేమిరా అన్నారు, మంచి జాతి కుక్క నే ఏదయినా ప్రొఫెషన్ కెన్నెల్ లో తెచ్చుకుందాము అని వారు డిమాండ్ చేశారు.
అవును సుమా కుక్కల్ని అమ్మే ప్రదేశం కెన్నెల్ అని నాకు గుర్తొచ్చింది. వారు చిన్న పిల్లలు కద ఇక నేనే పూనుకోవాలి. ఒకట్రెండు కెన్నెల్స్ ఫొన్ నెంబర్లు నెట్ లో చూసి నోట్ చేసుకుని ఫోన్లు చేయటం ప్రారంభించాను.
వారి వ్యవహారం అంతా హై క్లాసు గా వుంది. మొదట ఒకటి నొక్కండి, రెండు నొక్కండి, ఆ తర్వాత పీక నొక్కండి వంటి ఫార్మాలిటిస్ అన్నీ పూర్తయ్యాక, ఒక రిసెప్షనిస్ట్ లాంటి అమ్మయి ఫోన్ ఎత్తి స్టయిల్ గా, మీకు ఏ బ్రీడ్ కి సంబంధించిన విభాగానికి కనెక్ట్ చేయమంటారు అని అడిగింది.
ఏ కెన్నెల్ కి ఫోన్ చేసినా ,అవతలి నుండి మీకు ’ఏ బ్రీడ్ కావాలి’ అని ఒక ప్రశ్న సంధించేవారు.
ఇంచుమించు మనకు కావాల్సిన బ్రాంచి మనసులోసెలక్ట్ చేసుకున్న పిమ్మట ఇంజినీరింగ్ కాలేజి కౌన్సెలింగ్ కి వెళ్ళినట్టు, ఈ బ్రీడ్ ఏమిటో తెలియజేస్తే కానీ వారు మనకు ఏ విధమైన సహాయం అందించలేమని స్పష్టాతి స్పష్టంగా చెప్పారు.
ఈ పరంపర లో ఒక దయామయురాలు, మీ పర్పస్ ఏమిటో చెప్పండి మీకు బ్రీడ్ సెలక్ట్ చేసుకోవటం లో సాయ పడతాను అని ఆపన్న హస్తం అందించింది.
"
కుక్కతో పర్పస్ ఏమిటండీ నాన్సెన్స్" అని అనబోయి తమాయించుకున్నాను.
"
ఊరి బయట ఫార్మ్ హవుస్ లాంటి వాటి కాపలాకా, ఇంట్లో దొంగలు పడి దోచుకోకుండా కాపలాకా, మీరు వేటకు వెళుతుంటే మీకు సాయానికా ( ఈమె నా మొహం చూడలేదనుకుంటా, నా మొహానికి వేట ఒక్కటే తక్కువ), సరదాగా ఆడుకోవటానికి బొచ్చు కుక్కా ఇలా ఆవిడ అందించిన ఙ్జ్యానం ఎన్ సైక్లోపిడియాతో సరిపోల్చవచ్చు.
టమోటాలలో నాటు టమోటా, హైబ్రీడ్ టమోట అని వెరైటీలు ఉన్నట్టు ఈ కుక్కలలో కూడా వివిధ జాతులు ఉంటాయి, పైగా ఒక్కొక్క జాతి ఒక్కొక్క పనికి ఉపయోగ పడతాయి అన్న ప్రాధమిక ఙ్జ్యానం కలిగింది నాకు . ’కారణ జన్ములు’ అన్న పదం కుక్కలలొ ఇలా వాడుకోవచ్చన్నమాట.
ఓకే అయ్ విల్ గెట్ బాక్ టు యూ’ అని వారికి ఆంగ్లంలోనే సమధానం చెప్పి పిల్లల వంక తిరిగి మనం ఏ బ్రీడ్ తీసుకుందాం అని ఒక కఠినమైన ప్రశ్నని సంధించిన వాడిలా ముఖం పెట్టి అడిగాను.
డాల్మేషన్
జెర్మన్ షెపర్డ్
హవుండ్
లాబ్రడార్
బీగిల్
బ్లడ్ హవుండ్
గోల్డన్ రిట్రయివర్
పాయింటర్
డాషుండ్
పామేరియన్
ఇలా అనేక పేర్లు వల్లె వేశారు పిల్లలు. నాకు మిడిగుడ్లు పడ్డాయి. వీళ్ళు చాలానే అధ్యయనం చేశారన్న మాట ఈ విషయంలో. మరి టెక్స్ట్ బుక్స్ కూడా ఈ స్థాయిలొ చదువుతున్నారొ లేదో.
చివరికి ఒక్కో కుక్క గురించి మళ్ళీ ఇంటర్ నెట్ లో క్షుణ్ణంగా అధ్యయనం చేశాము. ఆ ఫోటోలు అవీ కూడా చూశాము.
మా అవిడ పామెరియన్ కి ఓటు వేసింది. మా అమ్మాయి కూడా అదే కావాలంది.
"
మా వాడు ’చ చ అవి ఆడపిల్లలు పెంచే కుక్కలు, నాకు హంటింగ్ డాగ్స్, అందునా భారీ భయంకరమయిన డాగ్స్ కావాలి" అని హాలీవుడ్ హీరోల రేంజి లో అడిగాడు.
చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సిద్ధాంతమ్ అమలు చేస్తూ, మా శ్రీమతి వాకౌట్ చేస్తూ ఏక వాక్య తీర్మానం చేసింది ’అలాంటి భయంకరమైన్ కుక్కలు ఇంట్లో కి తెస్తే తాను పుట్టింటికి వెళ్ళిపోతానని’
మళ్ళీ అన్ని పక్షాలని ఏక త్రాటి మీదకు తెచ్చి, మా ఆఫీస్ లో గోడకు ఉన్న నిలువెత్తు ఫోటొ ఫ్రేం లో వ్రాసి ఉన్న మోటివేషనల్ కొటేషన్ " ఎ డయలాగ్ కన్ సాల్వ్ ఎవ్వ్రీ ప్రాబ్లెం" అన్న వాక్యం గుర్తు తెచ్చుకుని, నువ్వే అలా అలిగితే ఎలా అని తనను బుజ్జగింఛి అందర్నీ ఒప్పించే ప్రయత్నాలు మొదలెట్టాను. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించిన తరువాత
చివరికి రెండు కుక్కల జాతులు చివరి వరుసలో నిలిచాయి సెలక్షన్ కమిటీ ముందు (అంటే మా ఆవిడన్న మాట)
మా చిన్నప్పుడు ఆల్సేషన్ డాగ్ అనే వారం, దాన్ని ఇప్పుడు జెర్మన్ షెప్పర్డ్ అనాలట ఇది ఒకటి,
రెండోది లాబ్రడార్.
మా సెలక్షన్ కమిటీ వారు జెర్మన్ షెప్పర్డ్ కు ఉన్న కౄరమైన రూపురేఖల కారణంగా దానిని వీటో అధికారంతో రద్దు చేశారు. చివరికి మిగిలింది ’లాబ్రడార్’. ఇది చూడ్డానికి బాగా ఉంటుంది, స్నేహ గుణం ఎక్కువ, మనుషులకి హాని చేయదు, కాని కుక్కల గురించి తెలియని వారికి దానిని చూస్తే భయం కలుగుతుంది, కానీ అది చాలా స్నేహ గుణం ఉన్న కుక్క అని తెలిసాకా దాన్ని ఇష్టపడతారు.
పెళ్ళికి ముందు ఆడవారు భర్తలో కూడా ఇలాంటి లక్షణాలే చూస్తారేమొ అని అనిపించింది, ఇప్పటి దాకా తనతో చెప్పలేదు.
ముఖ్యంగా దానికి ఉన్న ఘ్రాణ శక్తి కారణంగా దాన్ని పోలీసు డిపార్ట్మ్ంట్ వారు ఎక్కువ కొంటారట.
ఇక ఆ రోజు నుంచి లాబ్రడార్ కు సంబంధించి ఇంటర్ నెట్ లో తీవ్ర అధ్యయనం చేయటం ప్రారంభం అయింది. తవ్వేకోద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
ఇదిలా ఉండగా మా వెనుక వీధిలో ఒకాంటి గారికి కుక్కల గురించి అందునా లాబ్రడార్ బ్రీడ్ గురించి క్షుణ్ణంగా తెలుసు అన్న విషయం మాకు తెల్సి , ఆవిడని కలిసాం.
ఆవిడ కూడా సరదాగా కుక్కను పెంచుకోవడానికి అయితే లాబ్రడార్ సరిసమానం అయిన బ్రీడ్ లేదు పొమ్మని తేల్చేశారు.
ఇది మొదటి అంకం.
మిగతా విషయాలు త్వరలో.

 

No comments:

Post a Comment