Tuesday, May 3, 2022

గౌరమ్మ

 ఒక ఙ్జాపకం - 33

గౌరమ్మ

 

అప్పటికి నా వయసు పదకొండు సంవత్సరాలు.

ఈ కథలో చిన్న ట్విస్టు ఉంటుంది చివర్లో. గౌరమ్మ గురించి చెప్పుకుందాము.  ఎవరా గౌరమ్మ ఏమా కథ అంటారా? అక్కడికే వస్తున్నాను.

ఉపోద్ఘాతం అని అనుకున్నా పర్వాలేదు, కథా ప్రారంభం అని అనుకున్నా ఫర్వాలేదు. ముందుగా కొన్ని విషయాలు తెల్సుకుందాము.

అప్పట్లో మా నాన్న గారు అనంతపురం జిల్లాకి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) గా పని చేస్తూ ఉండేవారు. ఆయన పాటించే సింప్లిసిటీ వల్ల మ నాన్నది చాల పెద్ద హోదా అని నాకు తెలియదు అప్పట్లో.

జిల్లా కలెక్టర్ తర్వాత అంతటి హోదా ఆయనది.. కానీ ఆయన చాలా సింపుల్ గా ఏ హడావుడీ లేకుండా ఉండేవారు. ప్రభుత్వం వారు కేటాయించిన జీపులు, కార్లు ఇంటి ముందు సదా ఆగిఉండేవి.

ప్రభుత్వ నౌకర్లను కానీ, ప్రభుత్వ వాహనాలను కానీ ఆయన ఏనాడు వ్యక్తిగత అవసరాలకు వాడుకోలేదు.

రైల్వే లైన్ ప్రక్కన ఉండే విద్యారణ్య హైస్కూల్లో  కొన్నాళ్ళూ, ఆ తర్వాత నేషనల్ సాయిబాబ కాలేజి కి అనుబంధంగా ఉన్న హైస్కూల్లోనూ ఆరవ తరగతి చదివాను.

అనంతపురం లో కొవ్వుర్ నగర్ కి , రుద్రంపేట కి మధ్య ఉండే కాలనీ లో ఉండేవారం. పేరు సరిగ్గా గుర్తు లేదు.  అక్కడ ఉన్నది ఒక్క సంవత్సరమే.  ఆ తరువాత మా నాన్నగారికి కడపజిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది.

ఇక్కడ ఉన్న ఈ సంవత్సర కాలంలో మా పెద్దక్కయ్య శ్రీమతి రామలక్ష్మీ గారి వివాహం అయింది. ఆమె వివాహం సందర్భంగా జరిగిన ఒక చిన్న సంఘటన ఈ కథకి మూలం.

ఆ రోజుల్లోనే మరికొన్ని నెలల తర్వాత మా మేనమామ పుత్రుడి వివాహం బళ్ళారిలో జరిగింది. కొన్ని కుటుంబాల మధ్య తీవ్రమానసిక అంతరాలకి ,వేదనకి వేదికగా నిలిచింది ఆ బళ్ళారి వివాహం. ఆ ముచ్చట్లు ఇంకో సారి ఎప్పుడైనా చెప్పుకుందాం.

 

*****

అనంతపురం ఓల్డ్ టవున్ లో అమ్మవారి శాలలో జరిగింది మా పెద్దక్కయ్య వివాహం.  మా బావగారి పేరు శ్రీ భాస్కర లక్ష్మీ నరసింహ మూర్తి గారు. వీరు మహబూబ్‍నగర్ జిల్లా వనపర్తిలో లెక్చరర్ గా పనిచేసేవారు. వారి స్వగ్రామం అనంతపురం జిల్లా వజ్రకరూర్. ఈ ఊరులో వజ్రాలు దొరికుతాయి అని ప్రతితి.

సరే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక మేము ఎదురుచూడటం ప్రారంభించాము వరుడు,  వరుడి తరఫున వివాహ బృందం  కొరకు. వారు ఉదయాన్నే వజ్రకరూర్ నుంచి బయల్దేరారు అన్న వర్తమానం అందింది మాకు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లూ, ఇంటర్ నెట్టూ గట్రా ఉండేవి కావు.

ఇంతకూ ఈ వివాహానికి ప్రధాన పురోహితుడుగా వ్యవహరించింది శ్రీ కడవకల్లు నాగభూషణం గారు. వారు అనంతపురం జిల్లా కడవకల్లు గ్రామానికి చెందిన వారు కావటం వల్ల వారిని మా నాన్న గారు అలాగే వ్యవహరించేవారు. వారి ఇంటి పేరు మాడుగుల. మహా సహస్రావధాని శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారి తండ్రిగారే ఈ పెళ్ళికి ప్రధాన పురోహితుడుగా వ్యవహరించారు. వారికి మా నాన్న గారిమీద ప్రత్యేక అభిమానం.

 

కాసేపటికల్లా పెళ్ళి బస్సు రానే వచ్చింది.

మేళాలు తాళాలతో వారిని రిసీవ్ చేసుకున్నాము, విడిది ఇంటికి తీస్కు వెళ్ళాము. వరుడు, వారి అన్నయ్యలు ఇతర దగ్గర బంధువులు , ముత్తైదువలు అందరూ ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు.

మా నాన్నగారు అప్పటికే నౌకర్లను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక సూచనలు ఇచ్చి ఉన్నారు. మగ పెళ్ళివారికి గౌరవ మర్యాదలలో ఎటువంటి లోపాలు జరగకూడదని, వారి సామాన్లు అన్నీ కూడా సగౌరవంగా విడిది ఇంటికి తీస్కువెళ్ళాలని చెప్పి ఉండటం వల్ల నౌకర్లందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు.

మా బావగారి తరఫు వాళ్ళు కూడా చాలా మర్యాదస్తులు. వారు ’అయ్యొ వద్దులెండి మా సూటుకేసులు గట్రా మేము తెచ్చుకుంటాము’ అని  తెగ మొహమాట పడిపోయారు.

కానీ ఈ నౌకర్లు వారి వద్ద నుంచి బలవంతంగా సూట్ కేసులు, ఇతర సామాన్లు తీస్కుని విడిది ఇంటికి తీసుకువెళ్ళి పెడుతున్నారు.

కానీ ఈ నౌకర్లను తెగ ఇబ్బంది పెట్టిన ఒకావిడ గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఆవిడ పేరే గౌరమ్మ.

నాకు బాగా గుర్తే. ఆవిడ చాలా కళగా ఉన్నారు. చక్కగా పెద్ద బొట్టు పెట్టుకుని, కొప్పు కట్టుకుని మంచి తేజస్సుతో ఉన్నారు. మరీ ఎత్తు కాదు. చక్కటి ఎత్తు, ఎత్తుకు తగిన లావు, తెల్లటి శరీర ఛాయ.

మా నౌకర్లు ఆవిడ చేతిలోంచి సూటు కేసు లాక్కోవటం ఆలశ్యం, ఆవిడ మళ్ళీ బస్సు ఎక్కి మరో సూటుకేసుతో ప్రత్యక్షం అయ్యేది.

’అయ్యో! అమ్మగారు మీకెందుకు శ్రమ. మాకొదిలెయ్యండి’ అని వీళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఆవిడ ధోరణి ఆవిడదే.

ఇలాగా వారికి ఆమెకి ఒక విధమైన పోటీ నడిచింది. ఆమె తిరిగి బస్సు ఎక్కి ఒక సూట్‍కేసో ఏదో ఒక లగేజో తీస్కుని రావటం , ఆవిడ బస్సు దిగి దిగక ముందే ఈ నౌకర్ల బృందం ఆమె దగ్గర నుంచి ఆ సూట్కేసుని లాక్కోవటం అలా గడచి పోయింది.

ఇదంతా మేము కూడా గమనిస్తూనే ఉన్నాము.

ఆ విధంగా ఆమె మా అందరి దృష్టిలో కూడా ప్రత్యేకంగా నిలచి పోయింది.

ఆ తరువాత రోజంతా ఆమె ఎక్కడ కనపడ్డా ఆమెకి ప్రత్యేక గౌరవ మర్యాదలు చెయ్యటం, ఆమె ఉన్న దగ్గరికి కుర్చీ తీసుకెళ్ళి అమర్చటం, ఆమెకి కూల్ డ్రింకులు గట్రాలు సప్లై చేయటం ఇలా ఆమెని తెగ ఇబ్బంది పెట్టేశారు. ఇలా గడచి పోయింది మధ్యాహ్నం భోజనసమయం దాకా.

మధ్యాహ్నం భోజనాలప్పుడు మా నాన్న గారు నౌకర్లందరినీ పిలిచి  ’మీరు భోజనాలకి కూర్చోండి , పొద్దున నుంచి పని చేసి చేసి అలసి పోయారు. ఇప్పుడు కూడా టేబుల్స్ అరెంజ్ మెంట్స్ అని, అదనీ ఇదనీ కంగారు పడకండి అవన్నీ క్యాటరింగ్ వారు చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా కూర్చోండి’ అని బలవంతం చేసి వారిని భోజనాలకు కూర్చుండబెట్టారు.

అప్పుడు ఒక గమ్మత్తు జరిగింది.

ఈ గౌరమ్మ కూడా వడ్డనల వద్దకు వచ్చింది. ’అమ్మగారు నమస్కారం’ అంటూ ఈ నౌకర్ల బృందం ఆమెకి నమస్కరించారు. ఆమె ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఓ కుర్చీ లాక్కుని తాను కుర్చుంది భోజనాలకి.

ఒక్క సారిగా అవాక్కయ్యారు వారంతా.

వియ్యాల వారు తమతో పాటు వారి పని మనిషిని కూడా తీస్కువచ్చారు. ఆమె ఈ గౌరమ్మ.

గౌరమ్మకి గౌరవం ఇవ్వడంలో తప్పేమీ లేదు. కానీ మా నౌకర్లందరూ తాము ఫూల్ అయ్యామన్న భావన వల్ల కాసేపు గమ్మున ఉండి పోయారు. ఆ తరువాత పెళ్ళి మండపం మొత్తం టాప్ లేచి పోయెలా నవ్వులతో నిండిపోయింది.

****

ఫస్ట్ ఇంప్రెషన్స్ ఎప్పటికీ పర్మనెంట్ ఇంప్రెషన్స్ కానవసరం లేదు.

ఈ కథలో గౌరమ్మ గారికి గౌరవం లభించింది. అది మంచిదె. ఆ విషయం పట్ల ఎవ్వరికీ అభ్యంతరం లేదు.

కానీ చాలా సందర్భాలలో ఏమి జరుగుతుంటుందో మీకు తెలుసు కద. మనం కేవలం బాహ్య అలంకరణకి, పై పై రూపానికి , వారి ఆర్థిక స్థితికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంటాము.

ముఖ్యంగా అడ్వర్టైజ్‍మెంట్ ఇండస్ట్రీ మనల్ని అందర్నీ తప్పు దోవ పట్టిస్తోంది ఈ విషయంగా.

నిజానికి మొదటి చూపులోనే ఆకర్షణీయంగా కనిపించని వారు సైతం బహుముఖ ప్రఙ్జావంతులు, మేధావలు అత్యంత గొప్పవారు కూడా అయిఉండవచ్చు. 

నెల్సన్ మండేలా గాని , మహాత్మ గాంధీ గాని, ఏపీజే కలాం గారు కాని పెద్ద అందగాళ్ళు కాకపోవచ్చు. కాని వారి గొప్పదనం వారి అంతరంగం.

శ్రీమతి సుధామూర్తి గారు ఒక విమాన ప్రయాణంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని చెప్పుకొస్తూ ఇదే మాట చెప్పారు. బిజినెస్ క్లాసులోవెళుతున్న  ఆవిడని చూసి,  ’ఆర్డినరి క్లాసు అక్కడుంది మేడం అని చెప్పారట ఎయిర్ హోస్టెస్.

సుధామూర్తి గారు ధరించిన సాధారణ కాటన్ చీర, తల్లో మల్లె పూలు, ఆవిడ సంప్రదాయ అలంకరణ వల్ల వారు ఒక అభిప్రాయానికి వచ్చేసుండవచ్చు ’ఈమె ఆర్డినరీ క్లాసు ప్రయాణీకురాలు’ అని.

కాబట్టి నేను చెప్పదలచుకుందేమిటి అంటే ’first impression need not be the best impression'

 

 

 

 

No comments:

Post a Comment