Tuesday, May 3, 2022

మిధ్యా భవంతి?

 మిధ్యా భవంతి?

ఒక ఙ్జాపకం-57

****

ఒక చిత్రమైన సంఘటన గూర్చి చెపుతాను మీకు.

ఇది ఒక భయానక చలన చిత్రంలో వాడుకో దగ్గ సంఘటన. ట్రూత్ ఇస్ అల్వేస్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని కద అంటారు.

ఈ సంఘటన అలాంటిదే.

మా అన్నయ్యకి ఈ సంఘటన గుర్తు ఉందో లేదో నాకైతే తెలియదు. ఆయన్ని కూడా టాగ్ చేస్తున్నాను, చూద్దాం ఆయన స్పందనని.

నాకు ఇప్పటికీ ఈ సంఘటన కళ్ళకు కట్టినట్టు గుర్తు ఉంది.

 

యధాలాపంగా కబుర్లు చెబుతూ ఫ్రెండ్స్‌తో చెబితే నమ్మేవారే కరువయ్యారు. అయ్యా ఇది నిజంగా జరిగింది అని చెప్పినా నన్ను కాస్త చిత్రంగా చూశారు.

కొందరు ’నీకేమైనా పిచ్చా’ అన్నట్టు చూశారు.

’బాగా చెప్పావు కల్పించి’ అన్న వారు కూడా ఉన్నారు.

అందుకే వ్రాయటానికి మొహమాటపడుతు వచ్చాను ఇన్నాళ్ళు. బాగా దగ్గరి వాళ్ళకి మాత్రం చెప్పాను ఈ సంఘటన.

సరే ఎవరు ఏమనుకున్నా ఇది నిజంగా జరిగిన విషయం. చెబుతాను. విందురు గాని.

ముఫై ఏళ్ళ పైనే అయుంటుంది ఈ సంఘటన జరిగి.

అప్పట్లో మా అన్నయ్య దగ్గర ఒక మోటార్ సైకిల్ ఉండేది. దాని డిజైన్ కొంచెం యమాహా 350 ని పోలి ఉండేది. కాకపొతే అప్పట్లో యమహా RX 100  బాగా ప్రచారం లొ ఉండేది ఇండియాలో.

అది ఎస్కార్ట్స్ వారి రాజ్‍దూత్ RD 175   మా అన్నయ్య ఎంతో ఇష్ట పడి ఆర్డర్ ఇచ్చి కొనుక్కుని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రైల్వే లగేజి వాన్ లో  తెప్పించుకున్నారు.

దాన్ని రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి నడుపుకుంటు వచ్చింది నేనే. అది వేరే సంగతి.

సరె ఇక ఙ్జాపకం విషయానికి వద్దాం.

అప్పట్లో  కర్నూలు జిల్లా ఆదోని లోఉండేవాళ్ళం.

ఒక సాయంత్రం మా అన్నయ్య హటాత్తుగా అడిగాడు. ’ఈ రాత్రి భోంచేసి సింధనూరుకి వెళుతున్నాను, మోటార్ సైకిల్‍పై, నువ్వు కూడా వస్తావా?’  అని.

నాక్కూడా థ్రిల్లింగ్‍గా అనిపించి ’సరే’ అన్నాను

ఒక రెండు చక్రాల వాహనం మీద నేను చేయబోతున్న అతి పెద్ద ప్రయాణం అది. ఆదోని నుంచి సింధనూరు ఎంత లేదన్నా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దురంలో ఉంది.

రోడ్లు ఇప్పట్లా ఆధునికంగా ఏమి ఉండెవి కావు ఆరోజుల్లో. సింగిల్ రోడ్డు మీద ప్రయాణం. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఒకే రహదారిపై వెళ్ళాలి. మధ్యలో మీడియన్ ఏది ఉండదు. ఇప్పటికీ ఆ రోడ్డు అలాగే ఉంది అనుకుంటా. మనం వెళ్ళేటప్పుడు  ఏదైనా వాహనం ఎదురొచ్చిన ప్రతి సారి మనం వేగం తగ్గించుకుని వాళ్ళకి దారి ఇస్తూ మళ్ళీ రోడ్డు ఎక్కివెళూతూ ఉండే ప్రక్రియ ఉంటుంది. ఈ కారణంగా  ఆ రోజుల్లో ప్రయాణసమయం  చాలా సేపు పట్టేది.

నేను అదివరకు బస్సుల్లో ఆ దారిలో వెళ్ళి ఉండినాను కాబట్టి నాకు అవగాహన ఉంది.

సరే అనుకున్న విధంగానే భోంచేసి రాత్రి దాదాపు ఏడున్నర ఎనిమిది మధ్యలో బయలుదేరాం.

మా అన్నయ్యకి మొదట్నుంచి ఆటోమొబైల్స్ అంటే మక్కువ ఎక్కువ. ఆటో మొబైల్స్ తో ఆయన  ప్రయోగాలు ఒక ప్రత్యేక ఙ్జాపకం వ్రాయాలి.

మంత్రాలయం రోడ్డు నుండి తిక్క సామి దర్గా మీదుగా ఎమ్మిగనూరు రోడ్ జంక్షన్ గా పిలవబడే T జంక్షన్ వద్దకి చేరుకున్నాం. ఇక్కడ ఎడం వైపు మలుపు తిరిగితే కొత్త బస్టాండ్, పత్తికొండ , గుత్తి లకి వెళ్ళేదారి వస్తుంది. మేము కుడి వైపు మలుపు తిరిగి, అదోని పాత బస్టాండ్ గోషాసుపత్రి లమీదుగా ప్రయాణించి, వైఎంకే స్కూలు వద్ద రైలు గేటు దాటుకుని, ఆదోని సరిహద్దులు దాటి ఇక సింధనూరు బాట పట్టించాము మా మోటార్ సైకిల్‍ని.

ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగిపోతోంది. ట్రాఫిక్ రద్దీ కూడ ఎక్కువ ఏమీ లేదు. రోడ్డు కూడా చక్కగా ఉంది.

ఇంకొద్ది సేపట్లో మేము ఎదుర్కోబోయే ఒక విచిత్ర సంఘటన గూర్చి మాకు ఏ మాత్రం అవగాహన లేకపోవడం వల్ల హాయిగా ముందుకు వెళుతూ ఉన్నాము.

మీలో అదోని ఎంత మంది చూశారో నాకు తెలియదు కానీ ఒక సారి చూస్తే అంతసులభంగా మర్చిపోలేరు ఈ ఊరిని అని ఖచ్చితంగా చెప్పగలను.

ఊరిని ఆవరించి అన్ని వైపులా ఆకాశాన్ని అంటేలాంటి రాతి కొండలు. ఇవి చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. సాధారణంగా కొండలమీద రకరకాల వృక్షాలు ఉండటం కద్దు. తిరుపతి, శ్రీశైలం తదితర కొండలు ఇలా వృక్షలతో ఉండటం మీరు చూసే ఉంటారు. కానీ ఇక్కడ కొండలు వాటికి భిన్నంగా నూటికి నూరుపాళ్ళు గ్రానైట్ రాతితో నిండి ఉంటాయి. కొన్ని ఫర్లాంగుల మేరా ఆక్రమించుకున్న భారీ గుండ్రాయిలాంటి ఏకశిలతో కూడిన కొండలు, లెక్కకు మిక్కిలిగా పోగుపోసిన రాళ్ళ కొండలు, చిత్ర విచిత్రమైన ఆకారాలలో బండలు గుండ్లు పేర్చినట్టున్న కొండలు ఇలా రకరకాల కొండలు ఉంటాయి. ఎక్కడా ఒక చిన్న మొక్క కూడా పెరిగే అవకాశం ఉండదు. వర్షాకాలంలో ఎక్కడికక్కడ  జలపాతాలను తలపిస్తూ నీటి ధారలు భారీ ఎత్తున కొండలమీదనుంచి దుముకుతాయి.

పల్చటి వెన్నెలలో కొండలు చాలా గంభీరంగా కనిపిస్తున్నాయి. ఏటు చూసినా పొలాలు, దూరంగా చక్కగా కొండలు ఇలాంటి నేపథ్యంలో ప్రయాణం హాయిగా సాగిపోతోంది.

ఓ గంటా గంటన్నర ప్రయాణించి ఉంటాము.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఎప్పుడో దాటేశాము. కర్ణాటకలోకి ప్రవేశించాము. కొండలు గట్రా ఏమీ కనపడటం లేదు ఇప్పుడు. విశాలమైన భూములు కనిపిస్తున్నాయి దారికి అటు, ఇటు దిగంతాలవరకు.

అక్కడక్కడ తారసపడుతున్న చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ మా ప్రయాణం సాగుతోంది.

తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన ఇంకొద్ది సెకన్లలో జరగబోతోంది అని నాకా క్షణంలో తెలియదు.

నా దృష్టిని దూరంగా కనపడుతున్న ఓ భవంతి ఆకట్టుకుంది.

రోడ్‍కి ఎడం పక్కన, ఖాళీగా ఉన్న పొలాల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ భవంతి నాకు ప్రత్యేకంగా తోచింది.

అప్పటిదాకా అరకొరగా ఉన్న ట్రాఫిక్ కూడా పుంజుకున్నట్టు తోచింది నాకు.

వేగంగా ప్రయాణీస్తూ, క్రమంగా ఆ భవంతికి దగ్గరయ్యాం.

మాకిప్పుడు ఆ భవంతి స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే అది మరీ అందుబాటులో లేదు. దాని దగ్గరికి వెళ్ళాలి అంటే రోడ్ దిగి పొలాల మధ్య సుమారు ఒక నాలుగయిదు వందల మీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది.

రంగురంగుల దీపపు కాంతులతో చాలా వైభవంగా ఉంది ఆ భవంతి. రకరకాల డిజైన్స్‌లో బాటకి ఇరువైపులా, సీరియల్ లైట్స్ రోడ్డు మీదనుంచి భవంతి చేరేదాకా అమర్చారు.

అరుంధతి సినిమాలో గద్వాల్ వెళ్ళే దారిలో సోనూసూద్‍ని బంధించిన భవంతి  అని చూపుతారు చూడండి, మరీ అంత పెద్దగా లేదు కానీ, అలాంటి అనుభూతికి ఖచ్చితంగా గురయ్యాము మేము.

చీకటి రాత్రి. ఇంచుమించు పదకొండు అవుతోంది సమయం రాత్రి.

పల్చటి వెన్నెల, చలిగాలులు వీస్తున్నాయి నెమ్మదిగా.

దీపాల అలంకరణతో వెలిగిపోతున్నప్పటికీ ఏదో ఒక నిశ్చేజత ఉందా భవంతి తాలూకు వాతావరణంలో.

మరీ ఆధునికమైన నిర్మాణ శైలి కాదు ఆ భవంతిది. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన భవంతిలా ఉంది. గోపీ రంగు గోడలతో రెండు అంతస్తుల మేడ అది. ఏదో విలాసవంతమైన ఆకాశహర్మ్యం కాదు కానీ పెద్దదే. మెయింటెనెన్స్ బాగుండటం వల్ల ఒక విధమైన ప్రాచీన సౌందర్యం ఆ భవంతిలో కనిపిస్తోంది.

చిత్రంగా ఎక్కడా మనుషుల అలికిడి లేదు. వాహనాలు మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి ఆ భవంతి బైట. నాకెందుకో ఆ భవంతి వద్దకు వెళదామా అన్న ఆసక్తి కలిగింది. బహుశా నాకు నిర్ణయాధికార శక్తి ఉంటే బండిని తిప్పేవాడిని ఏమో ఆ దిశగా. అన్నయ్య అంటె నాకు భయంతో కూడిన గౌరవం.

అందుకే మెల్లగా గొంతు విప్పి ’ఎవరైనా శ్రీమంతుల ఇంట పెళ్ళేమో’ నాలో నేనే మాట్లాడుకుంటున్నట్టు పైకే అనేశాను.

ఆయన తల తిప్పి ఆ భవంతి వంక చూశారు. అది కొన్ని క్షణాలు మాత్రమే. ఆయన  ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత చిత్రంగా ఏదో నిర్ణయం తీసుకున్న వాడిలా చివ్వున తల తిప్పి రోడ్డు పై ఏకాగ్రత చూపుతూ,  మోటార్ సైకిల్ వేగం పెంచాడు. ఇక  ఆ రాత్రి ఆయన ఆ విషయం గూర్చి ఏమీ మాట్లాడలేదు.

ఇక నేను కూడా ఆ విషయానికి పెద్దగా ప్రాముఖ్యతని ఇవ్వలేదు.

మరి కాసేపటికి సింధనూరు వచ్చింది.

ఆయన తనకు కావాల్సిన డాక్యుమెంట్లేవో కలెక్ట్ చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడే పడుకుని పొద్దున్నే అల్పాహారం స్వీకరించి తిరిగి బయలుదేరాము.

పొద్దున మేము బయలుదేరేటప్పటికి ఎనిమిది అయి ఉంటుంది.

క్రితం రాత్రి భవంతి ఫలానా మైలు రాయి వద్ద ఉంది అన్న వివరాలు నాకు గుర్తే. అందువల్ల తిరుగు ప్రయాణంలో ఆ ప్రదేశాన్ని చేరుకోగానే నా కళ్ళు ఆసక్తిగా అటు ఇటూ చూశాయి.

ఆశ్చర్యపోవటం నా వంతయింది.

ఆ ప్రదేశంలో ఎటువంటి నిర్మాణం లేదు. కను చూపు పారినంత మేరకు విశాలమైన పొలాలు ఉన్నాయి.  పోనీలేబ్బా నేనేమన్న కన్‍ఫ్యూజ్ అయ్యానేమో అనుకుని ఆ మైలురాయి దాటిన తర్వాత కూడా చాలా సేపు  వెదికాను చూపులతో ఆ మిధ్యాభవంతి కోసం.

క్రితం రాత్రి వెలుగులు విరజిమ్మి, వైభవానికి మారుపేరులా ఉండిన ఆ భవంతి నాకు ఎక్కడా కనపడలేదు.

మోటార్ సైకిల్ నడుపుతూ మా అన్నయ్య ’నేను కూడా ఆ భవంతి కోసమే చూస్తూ ఉన్నాను’ అన్నాడు ముక్తసరిగా.

ఆ తర్వాత మేము ఆ భవంతి గూర్చి చాలా సేపు మాట్లాడుకున్నాము.

’తను గతంలో ఎన్నో సార్లు ఆ దారిలో ప్రయాణించానని, గతంలో ఎప్పుడు అలాంటి భవంతి ఆయనకి తారసపడలేదని, అందుకే క్రితం రాత్రి ఆయనకి కూడా ఒక విధమైన గగుర్పాటు కలిగి ఆ దిశగా ఇక ఏ మాత్రం చూడకుండా, వేగం పెంచి వీలయినంత త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోయామని’ మాటల్లో ఆయన చెప్పుకొచ్చారు

నేను మాత్రం ఈ సంఘటన ని మరచిపోలేదు. ఈ సంఘటన ఆయనకి గుర్తు ఉందో లేదొ, ఆయన్ని అడగాలి ఈ సారి కల్సినప్పుడు,  ఎప్పటికప్పుడు మరచిపోతూ ఉన్నాను అడగటం.

అంతే. అంతకు మించి ఏమీ లేదు.

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment