Tuesday, May 3, 2022

సిరీస్ కంపెనీ-Part 2

 

సిరీస్ కంపెనీ-పార్ట్ 2

ఒక ఙ్జాపకం-65

===============================

’అమరావతి లాడ్జి’

అసలు ఇలాంటి ఒక చక్కని లాడ్జి ఉండేది హైదరాబాద్‍లో అని చాలా మందికి తెలియదనుకుంటాను. కోటీ సర్కిల్ లో గుజరాతి గల్లీ అనే ఒక చిన్న ఇరుకు సందులో ఉండేది అది.

సిరీస్ బేసిక్ ట్రెయినింగ్ ప్రోగ్రాం కొరకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పది రోజులు స్టే చేశాను.

సిరీస్ కంపెనీ వారి ట్రెయినింగ్ పొందటానికి హైదరాబాద్‍వచ్చాను అని ఇదివరకే చెప్పాను కద. నాతో బాటు దాదాపు ఓ పదిహేను మంది ఉన్నారు మా జట్టులో. వారిలో అధిక భాగం పంజాబీ వారు, మహరాష్ట్రా వారు, తమిళనాడు వారు అన్నమాట. వారిలో భానోజీరావు ఒక్కడే తెలుగు వాడు. ఇతను విశాఖపట్నం నుంచి వచ్చాడు. అతను మెరీడియన్ ఫార్మాస్యూటికల్స్ అనే ఓ చిన్న కంపెనీలో పని చేస్తూ, ఇందులో అవకాశం రావడంతో చేరిపోయాడు.

భానోజీరావు నా మొదటి పరిచయంలోనే బాంబు పేల్చాడు.

"ఈ కంపెనీలో ఎందుకు చేరావు బాస్! ఇది ఇంకా మొదటి కంపెనీ నీకు, చిన్న వయసు నీది. ఇంకా నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. వీలయినంత త్వరగా ఈ కంపెనీ మానేసి వేరే ఏదైనా కంపెనీ చూసుకో" మొదటి పరిచయంలోనే భానోజీ రావు నా మొహం మీద చెప్పేశాడు.

నాకు ఏదోలాగా అనిపించింది. ఆ తర్వాత అతను చెప్పింది వాస్తవమే అని క్రమంగా అర్థం అయింది.

ఇక ట్రెయినింగ్ ప్రోగ్రాంలో ఉన్న టీం సభ్యులందరూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. నేను ఈ భానోజీరావు ఒక రూంలో ఉండేవారం. ఎక్కడికి వెళ్ళినా మేమంతా కలిసే వెళ్ళేవారం. ఒకరితో ఒకరం మాట్లాడుకోవటానికి మాకు ఇంగ్లీషే గతి. క్వాలిటీ ఆఫ్ ఇంగ్లీష్ ని పక్కన పెడితే, అందరం మా మనోభావాల్ని పంచుకోవటానికి ఇంగ్లీష్ మిదనే ఆధారపడేవారం.

మొదటి సారిగా ఓ పదిరోజులు వరుసగా ఇంగ్లీష్ లోనే మాట్లాడుకోవటానికి నాకు అలా అవకాశం వచ్చింది. భానోజీరావు నేను తెలుగులోనే మాట్లాడుకునేవారం అప్పుడప్పుడూ, కానీ మిగతా వారు నొచ్చుకునేవారు, ఏమిటి మీరు మాట్లాడుకునేది మాకు కూడా చెప్పండి అని. దాంతో, అందరి మధ్యలో ఉన్నప్పుడు మేము ఇంగ్లీష్‍లోనే మాట్లాడుకునేవారం.

ఈ అమరావతి లాడ్జి గురించి నాలుగు ముక్కలు చెప్పాలి. ఇక్కడ చాలా తక్కువ ధరకే గదులను ఇచ్చేవారు. మేనేజ్‍మెంట్ వారు మార్వాడీలు అనుకుంటా. నీట్‍నెస్ విషయంలో రాజీపడేవారు కాదు. అదే విధంగా చాలా చక్కటి సంస్కారవంతమైన వాతావరణం ఉండేది అక్కడ.

అక్కడ స్టే చేయటానికి వచ్చేవారు కూడా అధిక భాగం ఉత్తర హిందుస్తానీ వారే కావటం గమనించాను. చక్కగా కుటుంబాలతో సహా వచ్చి అక్కడ విడిది చేసేవారు. చిన్నచిన్న వ్యాపారులు, సేల్స్ ఫీల్డ్ లో ఉండేవారు, వీరేకాక హైదరాబాద్ చూడ్డానికి వచ్చే యాత్రీకులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వారు ఉండేవారు. అక్కడ విధిగా హిందీ మాట్లాడేవారు అందరూ.

ఇక్కడ నా హిందీ ప్రతాపం గూర్చి రెండు ముక్కలు చెప్పాలి.

దక్షిణ భారత హిందీ ప్రచార సభ (ఖైరతాబాదు, హైదరాబాదు) వారు నిర్వహించిన మధ్యమ, రాష్ట్రభాష తదితర కోర్స్ లలో నన్నుమా అమ్మగారు చిన్నప్పటి నుంచి చేర్పించి ఉండటం వల్లనైతే నేమీ, దూరదర్శన్ ప్రసారాల వల్లనైతే నేమీ, నాకు హింది భాష అంటే భయం లెదు చిన్నప్పటి నుంచి.

మా అమ్మగారి పుట్టింటిలో అందరూ, అంటే మా మేనమామలు వాళ్ళ పిల్లలు అందరూ హిందీ పండితులే. సీతారామశాస్త్రి అనే ఒక మేనమామ అయితే హిందీ-తెలుగు, తెలుగు-హిందీ డిక్షనరీనే వ్రాశారు ఏకంగా.

మా పెద్ద మేనమామ శ్రీ శ్రీనివాస శాస్త్రి గారు కూడా వృత్తిరిత్యా హిందీ పండితులు, వారు తాడిపత్రిలో ఉండేవారు. ఆయన పౌరోహిత్య్ం కూడా చేసేవారు. ఆయన సంతానం లో అధికభాగం హిందీ ఆధారిత వృత్తిలో స్థిరపడ్డారు. ఈ కారణంగా కావచ్చు , మా అమ్మగారికి - తన పిల్లలందరికీ హిందీ బాగా రావాలనే తపన ఉండేది. మా నాన్నగారి విషయానికొస్తే, తన పిల్లలందరికీ ఇంగ్లీష్, సంస్కృతం కూడా చక్కగా రావాలనే తపన ఉండేది. నేను ఈ కారణాల వల్ల ఇంగ్లీష్, హిందీ లలో ప్రావిణ్యత సాధించాను కానీ, సంస్కృతం విషయంలో  నా పరిఙ్జానం గూర్చి చెప్పాలంటె, మంచు విష్ణు మాటల్లో, సంస్కృతంలో నా పరిఙ్జానం శూన్యం.

మా అన్నయ్య శ్రీ అప్పా శేష శాస్త్రి గారికి ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, కన్నడం లలో కూడా సాధికారత ఉంది.

సరే టాపిక్ డైవర్ట్ అవుతోంది. మళ్ళీ విషయానికి వస్తాను.

ఆ విధంగా నార్త్ ఇండియన్ కొలీగ్స్‌తో అయితేనేమీ, బయట వాళ్ళతోనయితే నేమీ, నేను హిందీ సాధికారికంగా మాట్లాడగలిగేవాడిని. కానీ స్త్రీలింగం, పుంలింగం తదితర వ్యాకరణ దోషాలు ఇబ్బడిముబ్బడిగా దొర్లుతాయి నా హిందీలో అని లాక్షణీకులు (అంటే ఎవరో కాదు, నా శ్రీమతి, మా అక్కయ్యలు) అభిప్రాయపడతారు. అన్నట్టు మా శ్రీమతి కూడా హిందీ పండితురాలే. ఈ దక్షిణ భారత ప్రచార సభవారి కోర్స్‌లన్నీ తుదకంటా ముగించింది తాను. మా అక్కయ్యలు కూడా హిందీ విషయంలో దిట్టలే.

ఇదిగో మళ్ళీ టాపిక్ లో డైవర్ట్ అవుతున్నాను.

ఈ సిరీస్ కంపెనీ వారి ట్రెయినింగ్ పొందిన పదిరోజులూ,

ఉదయాన్నే ఏడున్నరకల్లా స్నానం గట్రా పూర్తి చేసుకుని టై కట్టుకుని, రోడ్‍కి అటుపక్క ఉండే ఓ చిన్న గల్లీలో ఉండే సన్మాన్ హోటల్ చేరుకునే వారం. ఈ హోటల్ ఇప్పటి సుప్రీం ఆడియో పక్కన ఉన్నగల్లీ లో ఉండేది.

నాకు తెలిసి, ఇప్పుడు ఈ అమరావతి లాడ్జ్ కానీ, సన్మాన్ హోటల్ కానీ లేవు.

సన్మాన్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని , కోటీ ఉమెన్స్ కాలేజి వరకు నడచుకుంటూ వెళ్ళి, కోటీ ఉమెన్స్ కాలేజి ఎదురుగా ఉండే బస్టాప్ లో బస్సు పట్టుకుని ఎల్ బీ నగర్ వైపు వెళ్ళే బస్సు పట్టుకుని కూర్చునే వారం. దాదాపు ఇరవై మంది యువకులు ఉదయాన్నే పులుకడిగిన ముత్యాల్లా తయారయిపోయి, షేవింగ్ చేసుకుని, షూశ్ నీట్ గా పాలిష్ కొట్టుకుని, చేతిలో మెడికల్ కిట్లు పట్టుకుని, టైలు కట్టుకుని, ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ బస్సులో కూర్చునేసరికి అందరూ కాస్త ఆసక్తిగా చూసేవారు మా వంక.

వెంకటాద్రి థియేటర్ లో చంటి ఆడేది అప్పట్లో. ప్రతి రోజు బస్సులోంచి వెంకటేష్‍ని, మీనాని చూసి ముందుకు వెళ్ళేవారం. ఇంచుమించు దిల్‍సుఖ్‍నగర్ దాటింది అంటే ఖాళీ ఖాళీగా ఉండేది రోడ్డు. దారికి అటు ఇటూ ఏమీ ఉండేది కాదు. ఇక ఎల్ బీ నగర్ సిరిస్ ఫాక్టరీ చేరుకున్నాం అంటే దాదాపు నగర శివార్లకి చేరుకున్నట్టే లెక్క.

సిరీస్ ఫాక్టరీ వద్ద మమ్మల్ని దింపేసి, మా మొహాన పొగ, దుమ్ము కొట్టేసి, బస్సు వెళ్ళింది అంటే అక్కడ నిర్మానుష్యంగా ఉండేది వాతావరణం . అప్పుడప్పుడూ రోడ్డు పై వెళ్ళే వాహనాలు మినహా ఇంకే సందడి ఉండేది కాదు. రోడ్దు వారగా లారిలు ఆగి ఉండేవి. అక్కడక్కడా ఈ లారి డ్రైవర్లకై చిన్న చిన్న బడ్డి కొట్లు, వాటి ముందు టీ కాచి అమ్మేవారు, పంచర్ షాపులు, లారీ బ్రొకర్ ఆఫీసులు ఉండేవి.

ఇక ఒళ్ళు విరుచుకుని సిరిస్ ఫాక్టరీలోకి ప్రవేశించేవారం.

సిరీస్ కంపెనీ వారి భవన సముదాయాలు చాలా ఉండేవి. ఇప్పుడు కొత్తపేటలో ఉన్న మినర్వా హోటల్, రిలయెన్స్ డిజిటల్ షాప్ వరకు వీరి భవనాలు ఉండేవి. అప్పట్లో వైట్ హవుసు ఉండేది కాదు. అది మధ్యలో వచ్చింది, మధ్యలో నే పోయింది.

వరుసగా ఉన్న ఈ భవనాల సముదాయంలో, మాకు ట్రెయినింగ్ ఒక్కోసారి ఒక్కో భవనం లో ఉండెది.

ట్రెయినింగ్ అంటే ఏమిటో అనుకునేరు. వాళ్ళ ప్రాడక్ట్స్ తాలూకు వివరాలు చెప్పి, వాటిని డాక్టర్ ముందు ఎలా ప్రజెంట్ చేయాలో చెప్పేవారు. విటాపెప్సిన్, బాక్టోస్టాబ్ డీ ఎస్, అస్కారెబ్స్, హిస్టాకార్ట్ తదితర మందులు ఒక ఇరవై ముఫై దాకా ఉండేవి. ఆ విజవల్ ఏయిడ్ శిక్షణ. ఇంతకు మించి ఏమీ ఉండేది కాదు.

ఆ శిక్షణ కూడా అనాసక్తిగా, యాంత్రికంగా ఉండేది. ఈ రెప్రజెంటేటివ్స్ ది ఏముందిలే, వస్తుంటారు పోతుంటారు. ఎంత కాలం ఉంటారులే. వీళ్ళు అతి త్వరలోనే కంపెనీ మానేసి వెళ్ళేవారేగా అన్నట్టు ఉండేది శిక్షకుల బాడీ లాంగ్వేజి.

ఎందుకిలా చెబుతున్నాను అంటే ఆ తర్వాత నేను పని చేసిన ఇతర పెద్ద కంపెనీలలో చూసిన శిక్షణా తరగతులు ఎంతో వైఙ్జానికంగా ఉండేవి. ఉత్తిగా ప్రాడక్ట్ ట్రెయినింగ్ మాత్రమే కాక, వ్యక్తిత్వాన్ని సానబట్టే విధంగా, మన భాషా పాటవాన్ని మరింత మెరుగులు దిద్దేవిధంగా ఉండేవి. ( ఈ ముచ్చట్లన్నీ తరువాత ఎప్పుడైనా చెబుతాను)

వీరి శిక్షణలో కావచ్చు, ఉద్యోగిని చూసుకునే విషయంగా కావచ్చు ఎన్నో లోపాలు కొట్టవచ్చినట్టు కనిపించేవి. నిజానికి టర్నోవర్ దృష్ట్యా, వనరుల దృష్ట్యా చాలా పెద్ద కంపెనీ ఇది. కానీ వారిలో ఏదో నిర్లక్ష్యం, అనాసక్తి కొట్టవచ్చినట్టు కనపడేది. ముఖ్యంగా రెప్రజెంటేటివ్స్ అంటే చాలా చులకన భావన ఉండేది ఈ కంపెనీలో.

శిక్షణ కార్యక్రమం జరిగిన ఈ యావత్తు  పది రోజుల ఖర్చులు యావత్తు ఎవరివి వాళ్ళే పెట్టుకున్నాం. ఖర్చులు అంటే, హైదరాబాద్ కి రావటానికి అయిన ఖర్చు, లాడ్జి ఖర్చులు, తిండి తిప్పలు ఇవన్నీ మేమే పెట్టుకున్నాం. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత్ అప్పాయింట్ మెంట్ డేట్ వేసి అప్పాయింట్ మెంట్ లెటర్ ఇచ్చారు.

’కోట్రైమాక్సజోల్’ బల్స్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ హోదా అనుభవిస్తున్నప్పటికీ, అంధ్రప్రదేశ్ లో ప్రారంభింపబడ్డ అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ అనే అరుదైన గుర్తింపు ఉన్నప్పటికీ ఈ కంపెనీ ఎందుకు చరిత్ర పుటల్లో కలిసి పోయింది అంటె అనేక కారణాలు ఉన్నాయనిపిస్తుంది.

వాటిల్లో ముఖ్యమైనది ఉద్యోగులని చులకనగా చూడటం అనేది ఒక కారణం. అలాగే సంస్థాగత నిర్వాహణాలోపాలు అనేకం ఉండేవి అనుకుంటా.

నాకు మొదట బ్రేక్ ఇచ్చి ఈ రంగంలో కాలూనుకోవటానికి నాకు అవకాశం ఇచ్చిన కంపెనీగూర్చి చెడ్డగా చెప్పటం నా ఉద్దేశం కాదు.

ఇక్కడ ఒకటి చెప్పాలి.  కెరియర్ గా మెడికల్ రెప్రెజెంటేటివ్ వృత్తినే ఎన్నుకోదలచుకున్న పక్షాన, సిరీస్ కంపెనీ ఎంతమాత్రం చేరదగ్గ కంపెనీ కాదని తెలియదు. గుడ్డిగా చేరిపోయాను.  నేను చదువుకునే రోజుల్లో కూడా గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళామే కానీ ఒక స్పష్టమైన గోల్ ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటు వెళ్ళటం అనేది ఉండేది కాదు. అలాంటి ధృక్పథం ఉండి ఉంటే చక్కగా కెరియర్ ప్లాన్ చేసుకుని ఉండేవాడిని అనుకుంటా.

చదువుకున్నదంతా చిన్న ఊర్లు. సరయిన లక్ష్యాలు ఏర్పరచుకునే అవకాశాలు లేవు.

అందుకే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవ్వరూ ఎదుర్కోకూడదు అన్న విధంగా ఇప్పుడు నా శిక్షణ తరగతుల్లో గోల్ సెట్టింగ్ కి , కమ్యునికేషన్ స్కిల్స్ శిక్షణకి, ఇంగ్లీష్ ఫ్లుయెన్సీ శిక్షణకి, ఇంటర్వ్యూ స్కిల్స్ ట్రెయినింగ్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంటాను.

’సర్! ఎందరో ట్రెయినర్స్ ని చూశాం. కానీ మీలా జీవితాన్ని మలుపు తిప్పే ట్రెయినర్స్ ఎక్కడా తారసపడలేదు. మా విజయానికి మీరే కారణం’ అని ప్రతి రోజు నా పూర్వ విద్యార్థులు మెయిల్స్ ద్వారా, ఫోన్స్ ద్వారా చెబుతుంటే, నా లక్ష్యం నెరవేరిందన్న తృప్తి కలుగుతుంటుంది నాకు.

సరే, మళ్ళీ సిరీస్ కంపెనీ ట్రెయినింగ్ విషయానికి వద్దాం.

గుడ్డిలో మెల్ల అన్నట్టు తీరా ట్రెయినింగ్ పూర్తయి, హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరేముందు ఒక నెల శాలరీ అడ్వాన్స్ ఇచ్చారు. రూం చూసుకొవటనికి బస్సు చార్జీలకి వాటికి అవసరం అవుతాయని.

చెప్పాను కద, ఇంకో పది రోజుల్లో ఈ కంపెనీకి రాజీనామా చేసి, ఇప్కాలో చేరిపోయానని.

అప్పుడు ఈ శాలరీ అడ్వాన్స్, సాంపిల్ కన్‍సైన్‍మెంట్ వెనక్కి ఇచ్చేసి, వాళ్ళ ట్రెయినింగ్ ని అభినందిస్తూ, ఒక చక్కటి రాజీనామా పత్రాన్ని సమర్పించి, శెనగలు తిని చెయి కడుక్కున్నట్టు, బొంబాయి రైలెక్కాను.

****

నేను చేరిన ఇప్కా లేబొరేటరీస్ గూర్చి మీకు చెప్పాలి.

ఇప్కాలో  ట్రెయినింగ్ ప్రోగ్రాం ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది. కడప నుంచి బొంబాయికి రానూ పోనూ ఫస్ట్ క్లాస్ టికెట్స్ పంపించారు.బొంబాయి నగర నడిబొడ్డున బొంబాయి సెంట్రల్ కి కూతవేటు దూరంలో త్రీ స్టార్ హోటర్ ఫెసిలిటీస్ తో అకామిడేషన్ ఏర్పాటు చేసారు.

మేము బసలో దిగిన రోజు మధ్యాహ్నం సాక్షాత్తు కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రతి గదికి వచ్చి మాకు సౌకర్యంగా ఉందా అని ప్రేమగ పలకరించారు. ప్రయాణం క్షేమంగా జరిగిందా, వసతి సౌకర్యాలు బాగున్నాయా, ’ఆర్ యూ కంఫర్టబుల్?’ అని ఎంతో ప్రేమతో పలకరించారు.

ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కద. మా ఇంట్లో కూడా ఫోన్ ఉండేది కాదు. మా పక్కింటి డాక్టర్ గారి ఇంటి ఫోన్ నెంబర్ ని పీపీ నెంబర్ కింద ఇచ్చాను, ఎండీ గారు అడిగితే.

ఆ తర్వాత మా ఇంటికి వారే ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మేము క్షేమంగా చేరామని చెప్పి, మమ్మల్ని ఆ కంపెనీలో చేర్చినందుకు మా అమ్మానాన్నలకి థాంక్స్ చెప్పారు.

ఆ ఇరవై ఒక్క రోజులు వారే బస, స్టార్ హోటల్ భోజన వసతి కల్పించినప్పటికీ మాకు మళ్ళీ ఎక్స్-స్టేషన్ అలవెన్స్ కూడా ఇచ్చారు. బట్టలు వాషింగ్, తదితర ఖర్చులు ఉంటాయి కద అన్న నెపంతో. నిజానికి ప్రతీ రోజు హోటల్ వారే మా బట్టల వాషింగ్ , ఇస్త్రీ కూడా చూసుకున్నారు.

ఇంతేకాక అపాయింట్‍మెంట్ లెటర్ ఇచ్చింది లగాయతు డైలీ అలవెన్స్ ఇస్తూ పేరోల్స్ లోకి తీసుకున్నారు మమ్మల్ని. దీనికి పెద్ద ఖర్చు కాకపోవచ్చు కానీ మా మనసుల్ని దోచుకున్నారు.

ఒక కంపెనీ యొక్క వ్యక్తిత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలలో తెలుస్తుంది అని చెప్పవచ్చు.

***

మళ్ళీ సిరిస్ కంపెనీ ముచ్చటకి వద్దాం.

మేము టీం అంతా ప్రతి రోజు కూడా ఖర్చులు షేర్ చేసుకునేవారం. ఈ పంజాబీ వాళ్ళలో ఒకడు బాగా మెయిన్‍టెయిన్ చేసేవాడు ఈ లెక్కా డొక్కా అంతా కూడా.

"బాసూ నీ డబ్బు  నాకు ఒక పైసా వద్దు,  నా డబ్బు కాస్తా ఎక్కువ ఖర్చయినా ఫర్వాలేదు. ఫ్రెండ్‍షిప్ నాకు ముఖ్యం" అంటూ ఉదయాన్నే ఒక యాభై రూపాయలు తీసుకుని, సాయంత్రానికంతా అంతా లెక్క చెప్పేవాడు. మిగిలితే వెనక్కు ఇచ్చేవాడు, పైన ఏమన్న ఖర్చు అయితే అడిగి తీసుకునే వాడు.

మాక్కూడా సుఖంగా ఉండేది ఈ పద్దతి వల్ల.

"బాసూ నీ డబ్బు......." అనేది అతని స్టాక్ డైలాగు. కానీ  చాలా మంచి వాడు.

ట్రెయినింగ్ మధ్యలో ఒక రోజు ఆదివారం విరామం ఇచ్చారు.

 ఆ రోజు మా టీం మేట్స్ నార్త్ ఇండియన్స్, తమిళ వాళ్ళూ దగ్గరుండీ మాకు టిపిన్ పెట్టి, మా బిల్లు కూడా వాళ్ళే పేచేసి, నన్నూ, భానోజీరావు ని తోడ్కొని చార్మినార్ కి తీసుకు వెళ్ళారు. ఆ రోజు మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటున్నారు వీరందరూ . మాకు విషయం అర్థం కాలేదు. మేము షేర్ చేయబోతే వద్దు వద్దంటూ తిరస్కరించారు.

అనుమానంగా చూస్తున్న మా వంక చూసి, ఒక రిక్వెస్ట్ చేశారు

"బాసూ! మాకు తెలుగు తెలియదు కద. ఈ రోజు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళకి, అక్కయ్యలకి, చెల్లెళ్ళకి గాజులు, ముత్యాలు, దండలు తీస్కుందాం అనుకుంటున్నాం. మేము ఇక్కడి వారం కాదని తెలిస్తే మమ్మల్ని మోసం చేస్తారు. మీరు చక్కగా తెలుగు మాట్లాడి బేరం చేసి, మాకు మంచి వస్తువలు తక్కువ ధరకి ఇప్పించండి" అన్నది వారి రిక్వెష్ట్ సారాంశం.

అప్పుడు నవ్వాము నేను, భానోజీ రావు.

"ఒరి మూర్ఖులారా! హైదరాబాద్‍లో, అందునా చార్మినార్ వద్ద తెలుగు మాట్లాడితేనే మోసం చేస్తారు. అసలు తెలుగు రాదు అక్కడ ఎవ్వరికి, మీ హిందీలోనే రెచ్చిపోండి, మిమ్మల్ని ఎవ్వడూ మోసం చేయరు" అనిచెప్పాము.

వారు మొదట నమ్మలేదు మా మాటల్ని.

ఆ తర్వాత వారికే అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది, మా పై జాలి పడ్డారు.

"మీ తెలుగుకి ఏమిటీ దురవస్థ?" అని.

"వద్దులే నాయన! కడుపు చింపుకుంటే కాళ్ళమీద పడుతుంది " అని ఇంగ్లీష్ లో చెప్పుకుని, షాపింగ్ కానిచ్చాం.

ఈ కంపెనీలో ట్రెయినింగ్ పూర్తి చేసుకుని, అనంతపురం హెడ్ క్వార్టర్స్ చేరుకుని ఫీల్డ్ లో నేను పడ్డ కష్టాలు తదితర అంశాలు మీకు పార్ట్-3 లో చెబుతాను.

No comments:

Post a Comment