Tuesday, May 17, 2022

"కంచి పరమాచార్య దర్శనం"

 "కంచి పరమాచార్య దర్శనం"

ఒక ఙ్జాపకం

****

"నిన్ను నీవు అన్ని విధాలుగా బలోపేతుడిని చేసుకో, ఆర్థికంగా, హోదా పరంగా, నైతికంగా నిన్ను బలోపేతుడిని చేసుకో. 

నీవు బలహీనంగా ఉంటే నలుగురికి ఎలా సాయపడగలవు?

బలమే జీవం - బలహీనత మరణం.

నీ ఇల్లే సరిగా లేకుంటే వేరొకరికి ఆశ్రయం ఎలా ఇవ్వగలవు?

నీవే బలహీనంగా ఉంటే వేరొకరికి ఎలా సాయం చేయగలవు?

టీచర్లను ప్రభుత్వాలు, పాఠశాలల యజమానులు నియమిస్తారు. అది సరే. నివ్వు కూడా టీచరే.  నిన్ను నీవు ఈ సమాజానికి టీచర్‍గా నియమించుకో. ఈ సమాజానికి మార్గదర్శనం చేయగలిగే గురు స్థానంలో ఉండు.

మంచి చెడు అనేవి సమాజంలో ఆది నుంచి ఉన్నాయి. నీవు ఒక సాక్షి స్థానంలో ఉండకు. మంచిని ప్రొత్సహించు, చెడుని ఖండించి మంచిని పెంపొందించు.

మానవ సమాజంలో ఒక వృత్తి ఎక్కువ అని కానీ, ఇంకొక వృత్తి తక్కువ అని కానీ లేదు. ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమైనదే. వ్యక్తి యొక్క అవసరాలని తీర్చాగలిగిన అన్ని వృత్తుల వారూ ఈ సమాజానికి అత్యంత ఆవశ్యకమే కద."

ఈ మాటలని వింటూ మైమరచి పోయాను.

ఇటీవల కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి గారి అనుగ్రహ భాషణంలో దొరికిన కొన్ని ఆణిముత్యాలు ఇవి. ఈ సభలో పాల్గొనగలిగిన అదృష్టం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం.

ఆయన ఆశువుగా రెండు గంటలకు పైగానే మాట్లాడారు.

ఎదురుగా పేపర్ పెట్టుకుని మాట్లాడిన మాటలు కావవి. సమాజం పట్ల ప్రేమతో, మానవుల పట్ల అవ్యాజమైన దయతో వారు వెలిబుచ్చిన కరుణామయమైన పలుకులు అవి. 

వారి ప్రతి పలుకులో దయ, వదనం పై చెక్కుచెదరని చిరునవ్వు, ఆవేశ కావేషాలకు ఆమడదూరంలో ఉండే నిర్మలమైన స్వరం ఆ యోగికి పెట్టకనే పెట్టిన ఆభరణాలు.

"నిన్ను నీవు బాగుపరచుకోవడం స్వార్థం కాదు. నీవే బాగులేకుంటే నీవు నలుగురికి ఎలా ఉపయోగపడతావు. కాబట్టి ఇతర వ్యాపకాలన్నీ కట్టి పెట్టి రోజుకు కొంత సేపయినా నిన్ను నీవు బాగు పరచుకోవటానికి సమయం కేటాయించు.

ఈ వేళ్టి సమాజానికి కావల్సింది ఙ్జానం మరియు క్షాత్రం. నిన్ను నీవు ధృఢపరచుకో. బలహీనతలకు లొంగకు. నీ ధర్మాన్ని వీడకు. నీ జన్మ ఈ సమాజానికి ఉపయోగపడేలా తీర్చు దిద్దుకో"

డబ్బు సంపాయించటం గూర్చి నేను విశ్వసించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవే చెబుతుంటాను నా స్టూడెంట్స్‌తో కూడా

"మన మనసులలో డబ్బు సంపాయించడం అన్నది ఒక తప్పుడు పని అన్నట్టుగా ముద్ర పడింది. అదేమీ లేదు. డబ్బు సంపాయించాలి. వీలయినంత ఐశ్వర్యవంతుడిగా ఎదగాలి. అన్ని అనర్థాలకు పేదరికం కారణం. వీలయినంత డబ్బు సంపాదించాలి.

పనికి ప్రతిఫలాన్ని ఆశించటం తప్పు కాదు. కానీ డబ్బు కోసం పని చేయకండి. ఆత్మ తృప్తి కోసం పని చేయండి. చేసే పనిలో ఆత్మానందాన్ని అనుభవించండి. 

డబ్బు సంపాయించటానికి అడ్డదారులు తొక్కకండి. ధర్మ మార్గంలో, నైతికంగా, న్యాయబద్దంగా డబ్బు సంపాయించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే మంచి వాళ్ళు డబ్బు సంపాయించటం పట్ల విముఖంగా ఉంటారో ప్రపంచంలోని సంపదంతా చెడ్డవాళ్ళ చేతిలో చేరిపోతుంది. 

కాబట్టి మంచి వాళ్ళు విధిగా ఐశ్వర్యవంతులుగా ఎదగాలి. ఎప్పుడైతే సంపద మంచి వారి చేతిలో పడుతుందో, వారు తమ సంపదని మంచి పనులకూ, నలుగురి సంక్షేమానికి  వినియోగిస్తారు. 

చెడ్డవాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలా చేయాలి.

 ఈ సమాజాన్ని బాగు పరచటానికి ఇంతకన్నా గొప్ప కార్యం ఉండదు. నీవు ఏకాకివి కాదు నీకు సామాజిక బాధ్యత ఉంది. నీవు ఆర్థికంగా ఎదగాలి. ఐశ్వర్యవంతుడివి అవ్వాలి. నలుగురికి ఉపయోగపడాలి" నా అభిప్రాయాలు తప్పో ఒప్పో నాకు తెలియదు. ఇలా చెబుతూ ఉంటాను నా శిక్షణా కార్యక్రమాలలో భాగంగా.


స్వామి వారి ప్రసంగం విన్నాక నా అభిప్రాయాలు మరింత ధృడతరమయ్యాయి.


ఇటీవల వ్యక్తిత్వ వికాసం అనే పేరు పెట్టుకుని కొందరు పుస్తకాలు వ్రాస్తున్నారు. మైకులు అందుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు, సామాజిక బాధ్యతని విస్మరించి మాట్లాడుతున్న ఇలాంటి వారి ప్రసంగాలని విని ఇంప్రెషనబులు ఏజ్ లో ఉన్న పిల్లల మనస్సులు కలుషితం అవుతున్నాయి. 

"నీకు నీవే ముఖ్యం. నీ తర్వాతే ఏదైనా. అమ్మనీ నాన్ననీ పట్టించుకోవద్దు. నీకు కావాల్సింది చేయి. ఈ రోజు పోతే రేపు రాదు. ఈ క్షణం గడిచిందా, మళ్ళి రాదు. నీకు కావాల్సిన ఆనందాల్ని జుర్రుకో. ఈ క్షణంలో జీవించు. ఎవ్వర్నీ పట్టించుకోవద్దు. ఎవ్వరి అభిప్రాయాలకి విలువ ఇవ్వద్దు. 

నీ జీవితం నీ ఇష్టం. నీ స్వేఛ్చని అరికట్టే ఏశక్తినైనా ఎదిరించు. హాయిగా ఉండు. ఆనందంగా తోచినట్టు జీవించు" ఇట్లా సాగుతాయి వీరి ప్రసంగాలు.

ఇలాంటి ట్రెయినర్లకి తీరుగా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు. వారు ఏమి చదువుకుని ఉంటారో వారికైనా తెలుసో లేదో మనకు తెలియదు. 

ఇట్లాంటి కుహనా వ్యక్తిత్వ వికాస శిక్షకుల పట్ల, సెల్ఫ్ స్టయిల్డ్ మానసిక చికిత్సా నిపుణుల పట్ల , చివరి నిమిషం వరకు ఆందోళన వ్యక్తం చేసే వాడు మిత్రుడు హిప్నోకమలాకర్.కన్ను మూసే వరకు ఇలాంటి అపరిపక్వ ట్రెయినర్ల పట్ల బాధ వ్యక్తం చేసేవాడు.

****

నేను ఈ వ్యాసం ప్రారంభంలో కంచి స్వామి వారు చెప్పిన విషయాలు చూడండి ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి. వారు చెప్పింది కూడా ఏమిటంటే ప్రతి వ్యక్తి బలోపేతుడు అవ్వాలి, ఆర్థికంగా ఎదగాలి, హోదా పెంచుకోవాలి, ఆరోగ్యం పెంచుకోవాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి. తన వ్యక్తిత్వ నిర్మాణం పట్ల శ్రద్ధ చూపాలి.

ఇలా బలోపేతుడైన ప్రతి వ్యక్తి,  తన కుటుంబానికి , సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆకాంక్ష ఉంది. ఆ పలుకులలో ఎంత దయ ఉంది. ఎంత బాధ్యత ఉంది. 

ఇంకా కొన్ని ముచ్చట్లతో మళ్ళి కలుస్తా అప్పటివరకు శెలవు.

No comments:

Post a Comment