’ఫిర్’ (PHHIR)
నాకు ఇష్టమైన దర్శకులలో విక్రం భట్
ఒకరు.
నిన్న సరదాగా ’ఫిర్’ (PHHIR) సినిమా చూశాను. ఇది యూట్యూబ్ లో ఉచితంగా చూడవచ్చు
ఎవరైనా.
ఈ ఫిర్ 2011 లో విడుదల అయిన హిందీ
చిత్రం. ఈ రివ్యూ చదవబోయే ముందే చెబుతున్నాను, నేను
ఈ సినిమాకి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. నా మాట నమ్మి మీరు గుడ్డిగా ఈ సినిమా
చూసేయవచ్చు.
అసలు ఈ చిత్రాన్ని ఇన్నాళ్ళూ ఎలా
మిస్ అయ్యానా అని బాధ పడ్డాను. ఈ చిత్రాన్ని గూర్చి వివరంగ చెప్పుకోబోయే ముందు , విక్రమ్ భట్ గూర్చి ఓ నాలుగు ముక్కలు చెప్పుకుందాం.
ఈ పేరు చూస్తే నాకు ఒక భరోసా. ఈయన
నిర్మాత, దర్శకుడు, రచయిత,
స్క్రీన్ ప్లే రచయిత, నటుడు.
ఈయన గూర్చి తెలియని వారికి ఎలా
చెప్పాలి అంటే, ఫరేబ్, గులాం (ఆతీ
క్యా ఖండాలా), హారర్
చిత్రాలైన రాజ్ సిరీస్, 1920 సిరీస్, తదితర
చిత్రాల దర్శకుడు అని చెబితే సులభంగా అర్థం అవుతుంది.
అంతే కాదు, ఈయన దర్శకత్వం వహించిన హాంటెడ్ 3డీ మూవీ భారతదేశంలో తీయబడ్డ
హారర్ మూవీస్ అన్నింట్లోకి అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం. ఇలా ఆయన ప్రత్యేకతలు
చెప్పుకుంటూ పోతే చాలానే వ్రాయవచ్చు.
ఇది విక్రం భట్ గూర్చి వ్యాసం కాదు
కాబట్టి, ఆయన గూర్చి సూక్ష్మంగా ఇంకో రెండు ముక్కలు
చెప్పి అసలు విషయానికి వస్తాను.
హిందీ చిత్ర రంగానికి దిశ, దశ కల్పించిన అతిరథ మహారథులలో ఒకరైన విజయ్ భట్ గారి మనవడే ఈ
విక్రమ్ భట్. ఇతను తన పద్నాలగవ ఏట నుండే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిపోయాడు.
శేఖర్ కపూర్ వంటి అగ్ర దర్శకుల వద్ద దర్శకత్వం లో ఓనమాలు దిద్దుకున్నాడు.
రాశిలో గానీ, వాసి లో గానీ ఇతని చిత్రాలు అగ్ర స్థానంలో ఉంటాయి. నాకు ఇతని
స్క్రీన్ ప్లే లో గానీ, కథనంలో గానీ , టేకింగ్
లో గానీ, దర్శకత్వానికి
సంబంధించి గానీ బాగా నచ్చే విషయాలు చాలానే ఉన్నాయి.
కథనం సాఫీగా సాగిపోతుంది ఇతని
చిత్రాలలో
ఎక్కడా ప్రేక్షకులు అయోమయానికి గురి
అవ్వరు. సాంకేతికత మనకు సాయంగా ఉండాలేగానీ సాంకేతికత చిత్ర కథనాన్ని డామినేట్
చేయకూడదు అన్నది ఇతని సిద్దాంతం అనుకుంటా.
ఉదాహరణకి చిత్ర ప్రారంభంలో పేర్లు
వేసేటప్పుడు చాలా మంది దర్శకులు నిర్మాత డబ్బులు కోట్లు వెచ్చించి పిచ్చి పిచ్చి
గ్రాఫిక్స్ ఉపయోగించి, నానాకం డిజైన్స్ , సౌండ్స్
వచ్చేటట్టు చేస్తూ పేర్లు వేస్తూ ఉంటారు. ఇంతకూ ఆ గ్రాఫిక్స్ మాయాజాలంలో
చిక్కుకుని మనకు ఆయా పేర్లు సరిగ్గా
కనపడవు. మీరు ఈ యాంగిల్ లో ఒక సారి చూడండి సినిమాలని.
కానీ విక్రమ్ భట్ గారి సినిమాలలో
టైటిల్స్ చక్కగా కంటికి కనిపించే విధంగా, ముదురు
రంగుల నేపధ్యంలో, లేత రంగు అక్షరాలలో కనిపిస్తాయి. అధిక భాగం టైటిల్స్ చక్కగా
ఇంగ్లీష్ అక్షరాలలో వేస్తారు. ఆ టైటిల్స్ కూడా ఏదో మొక్కుబడిగా వేసినట్టు
పరుగులెత్తించకుండా, చక్కగా కుదురుగా మనం చదువుకొనగలిగేలాంటి
వేగంతో వేస్తారు. టైటిల్స్ పరమోద్దేశం అదే కద. అంటే టైటిల్స్ దగ్గరనుంచి కూడా అతను
ప్రేక్షకుల కోణం లో సినిమా చూస్తూ , తీస్తాడన్న మాట ప్రతీ షాట్.
ఇంకో అంశం చెప్తాను.
హారర్ కథ కి అనుగుణంగా
చీకట్లో కథ నడుస్తోందంటే, ఆయా పాత్రలు మనకు కనపడనే కనపడవు చాలా మంది దర్శకుల సినిమాలలో.
కానీ ఈయన సినిమాలలో మనం లీనమయి పోవటానికి ఒక ప్రధాన కారణం , ఒక
సగటు ప్రేక్షకుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అన్న అంశాలని ఈయన కాచి
వడబోశాడా అన్నట్టు ఉంటాయి ఈయన తీసే డార్క్ షాట్స్ సైతం. పాత్రలు చీకట్లో ఉన్నారు
అన్న స్పృహ మనకు కలుగుతూ ఉంటుంది కానీ, మనకు చూడ్డంలో
ఇబ్బంది ఉండదు. ఇలా సూక్షాతి సూక్ష్మమైన
అంశాల విషయంలో సైతం జాగ్రత్తలు
తీస్కుంటారు.
ఇకపోతే, ఈ ఫిర్ చిత్రానికి ఈయన దర్శకుడేమీ కాదు.
ఈ చిత్రాన్ని ఈయన స్వంత నిర్మాణ
సంస్థ ఏఎస్ ఏ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్ ప్రైజెస్ వారు నిర్మించి, పంపిణీ చేశారు, ఈయన ఈ చిత్రానికి కేవలం
స్క్రీన్ ప్లే మాత్రం నిర్వహించారు. కానీ ప్రతి ఫ్రేం లో ఈయన ముద్ర కనిపిస్తుంది.
ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ ఈయనే
అన్నది నిర్వివాదాంశం.
పాటలకు, సంగీతానికీ పెద్ద పీట వేస్తారు వీరి చిత్రాలలో. రాజ్ పాటలు
మీకు గుర్తుండే ఉంటాయి.
ఈయన మన దాసరి నారాయణ రావు లాగా, రాంగోపాల్ వర్మ లాగా యంగ్ టాలెంట్ కి చాలా ప్రోత్సాహం
ఇస్తారు. అనేక మంది యువదర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, నటీ నటులు ఈయన ద్వారా సినిమా రంగ అరంగేట్రం
చేశారు.
ఈ చిత్రానికి దర్శకుడు గిరీష్
ధమీజా, ఈయన భట్ క్యాంప్ నిర్మించిన చిత్రాలు
గ్యాంగ్‍స్టర్, జఖ్మ్, 1920 లండన్,
ఫుట్ పాత్, శాపిత్, కసూర్,క్రీచర్ తదితర చిత్రాల ద్వారా
చిరపరిచితుడే. మొత్తం మీద వీళ్ళ ఇంటి కుర్రాడిలాగా అన్నమాట.
కాబట్టి, ఈయన డైరెక్ట్ గా దర్శకుడు కాకపోయినా, ఇది విక్రం భట్ చిత్రంగానే నేను
పరిగణించి చూశాను.
కథ ఏమిటో చెప్పుకుందాం స్థూలంగా.
(మీకు సస్పెన్స్ గుట్టు విప్పను గాక విప్పను)
కథ మొత్తం ఇంగ్లాడ్ లో జరుగుతుంది.
చాలా పాత కాలంలో ఇంగ్లాండ్ లో
మాంఛెస్టర్ లో ప్రారంభం అవుతుంది కథ.
ప్రారంభ సన్నివేశంలో, సంపన్నుడైన ఒక నడివయస్కుడు రోల్స్ రాయిస్ కార్ లో ఒక దైవాంశ
సంభూతుడి ఆశ్రమానికి వస్తాడు. ఆ సంపన్నుడు నోరు విప్పకముందే, ఆ దైవాంశసంభూతుడు కఠినమైన స్వరం లో గట్టిగా అంటాడు,
’అక్కడే ఆగు. నీవు చేసిన పాపం
తాలూకు చెడు తరంగాలు నీ చుట్టూ ఆవరించి కనపడుతున్నాయి. నీవు ఇప్పుడు తీవ్ర
పశ్బాత్తాపం పడ్తున్నావు. లాభం ఏమిటి? నీవు
చేసిన పనికి నిన్ను నువ్వే నిందించుకుంటున్నావు, నీవు
ఇప్పుడు ఒక కఠోర నిర్ణయం తీసుకుని మరీ వచ్చావు నా వద్దకు. ఇంకో జన్మ ఎత్తైనా నీవు
నీ పాపం అనుభవించాలి. తప్పించుకోలేవు. వెళ్ళు నా ముందు నుంచి" అని అంతటి
ఐశ్వర్యవంతుడిని సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా పంపించేస్తాడు.
ఆ తర్వాత సీన్ లో ఈ ఐశ్వర్యవంతుడు
ఏదో ఒక ఉత్తరం వ్రాసి పెట్టి ఒక భోషాణం
లాంటి పెట్టెలో వేసి, కాసేపు కుమిలిపోయి, ఆ
తర్వాత తనను తాను తుపాకి తో కాల్చుకుని చనిపోతాడు.
ఇది ప్రారంభ సన్నివేశం. ఆ తర్వాత
టైటిల్స్ వస్తాయి.
ఇక ప్రస్తత కథలోకి వస్తే ఆధునిక
ఇంగ్లాండ్ లో ఒక యువ డాక్టర్ (రజనీష్ దుగ్గల్) ,అతని భార్య శియా (రోషినీ చోప్రా) ఆనందంగా ఉంటారు. ఆ అమ్మాయికి ఒక
యూనివర్శిటిలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వస్తుంది. ఆ సందర్భంగా వారు సెలబ్రేట్
చేసుకోవాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటారు.
కానీ ఆ అమ్మాయి అనుకున్న హోటల్ కి
రాదు. ఎంత వెదికినా ఆచూకి తెలియదు. ఆమె అదృశ్యం అయింది అని పోలీస్ రిపోర్ట్
ఇస్తారు.
ఇక్కడ నుంచి కథ అనుకోని మలుపులు
తిరుగుతుంది.
దిశా (అదా శర్మ -ఈమె కూడా భట్
క్యాంప్ లో రెగ్యులర్ మెంబర్) కి కొన్ని అతీత శక్తులు ఉంటాయి. ఎవరిదైన ఒక వస్తువు
పట్టుకుంటే వారికి సంబంధించిన దృశ్యాలు ఆమెకి చక్కగా సినిమాలాగా కనిపిస్తాయి.
ఇంగ్లాండ్ పోలీసులు ఈమె సహాయం
తీస్కుని అనేక మిష్టరీలని ఛేదిస్తూ ఉంటారు. మన కేసు పరంపరలో భాగంగా పోలీసులు ఈమె
సాయం అర్థిస్తారు.
పోలీసులకి దొరికిన శియా కారుని ఈమె
తాకి కొన్ని కీలకమైన అంశాలు తెలియజెపుతుంది. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరిగి
సుఖాంతం అవుతుంది.
ఇది స్తూలంగా కథ.
ఈ కథని కావాలంటే పుంగనూరు లోనో, చిప్పగిరిలోనో కూడా తక్కువ బడ్జెట్ లో తీసి మమ అని అనిపించి
ఉండవచ్చు. కానీ చెప్పుకున్నాం కథ మన సూత్రధారి విక్రం భట్ అని.
ఈయన సినిమాలలో రిచ్ నెస్ ఉంటుంది, సంగీతం అద్భుతంగా ఉంటుంది, పాత్రలన్నీ
ఆధునికంగా ప్రవర్తిస్తాయి, పాటలు సూపర్ గా ఉంటాయి.
ఈ లక్షణాలన్నీ ఈ సినిమాలో కూడా
పుష్కలంగా ఉన్నాయి.
ఫైనల్ వర్డిక్ట్:
మీరు ఈ సినిమా ఇప్పటి దాకా
చూడకుంటే తక్షణం చూడండి. చాలా బాగుంది. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది.
సనాతన ధర్మం పట్ల, వేదం పట్ల, కర్మ సిద్దాంతం పట్ల గొరవభావం పెంపొందించేలాగా ఉంది యావత్తు కథ, కథనం.
చివర్లో మరొక సారి దైవాంశ సంభూతుడు
ఒక కీలక సన్నివేశంలో కన్పించి చెప్పే
మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి.
"నీ జీవితానికి నీవే కర్తవు.
మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు
జరుగుతుంది. నీవు చేసిన కర్మ ని తప్పించుకోలేవు.
నీ కర్మానుసారం మాత్రమే నీ జీవితం, నీ జన్మ పరంపరలు
ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న నీ కర్మలనుంచి తప్పించుకోలేవు, కాకపోతే
కొత్త పాపం మూటకట్టుకుంటావు. నీవు ఏ మాత్రం మంచి చేస్తూ వెళ్ళినా అది నీ పాత
కర్మనుంచి నువ్వు తప్పించుకునే మార్గం సుగమం చేస్తుంది. ఈ విషయం లో దైవం, దైవ జనులు సైతం నిమిత్త మాత్రులు. నీ కర్మే నీ జీవితాన్ని
శాసిస్తుంది"
ఈ వాక్యాల తర్వాత ప్రేక్షకుడికి, దర్శకుడు కథలోని ఒక కీలక లింకుని ఆవిష్కరిస్తాడు.
అక్కడితో కథ ముగుస్తుంది.
ఫోటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ సూపర్.
వీరి క్యాంప్ నుంచి వచ్చిన గ్యాంగ్
స్టర్ కూడా తప్పక చూడండి. ఆ సినిమాని ఎన్ని సార్లు చూసినా నాకు గుండెలో పిండినట్టు
అవుతుంది. ఆ కథ, కథనం గూర్చి ఒక రివ్యూనే వ్రాయాలి విడిగా.
No comments:
Post a Comment