Showing posts with label telugu stories. Show all posts
Showing posts with label telugu stories. Show all posts

Monday, June 6, 2022

కాఫీ ప్రియుడు

 


కాఫీ ప్రియుడు

డా.రాయపెద్ది వివేకానంద్

-------------------------------------------------------------------------------------------------

 ఓ పెద్ద బాంక్ ఫ్రాడ్‍ని నేను అరికట్టగలిగాను.

అదెలాగంటారా చెబుతాను. అది చెప్పాలి అంటే ముందుగా మీకు మదన్ గూర్చి చెప్పాలి.

మదన్ గూర్చి చెప్పాలంటే ఒకటా రెండా ఎన్నో సంగతులు చెప్పాలి , అతని గూర్చి ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని ఆలోచిస్తే, ఎంతకూ ఆలోచనలు తెగటం లేదు. మా పరిచయం కాఫీతో మొదలయ్యింది కాబట్టి కాఫీ గూర్చిన విషయాల దగ్గర మొదలెట్టడమే సబబు.

మదన్ కాఫీ ప్రియుడు.

ఇతను కాఫీ ప్రియుడు అని ఒకే మాటలో చెప్పి వదిలేస్తే సరిపోదు, ఇతను నిరంతర కాఫీ దాత కూడాను.

కాఫీ దాతలు ఉంటారా ఎక్కడైనా అని మీకనుమానం రావచ్చు. మదన్‍ని చూసే వరకు ఇలాంటి పదప్రయోగం ఒకటి చేయాలి నాకు కూడా అనిపించలేదు.

ఇంతకీ అతన్ని కాఫీ దాత అని ఎందుకన్నానంటే, అతను తాను మాత్రమే కాఫీ త్రాగి ఊరికే ఉండే రకం కాదు. ప్రతీ రోజు కనీసం ఓ వందమందికి కాఫీ తాగించే వాడు అని నా అంచనా.

మీరు అన్న దానం గూర్చి విని ఉంటారు, వస్త్రదానం గూర్చి వినిఉంటారు. భూదానం, గోదానం ఇలా రకరకాల దానాల గూర్చి వినిఉంటారు.

అన్న సంతర్పణల గూర్చి కూడా వినే ఉంటారు మీరు. కానీ మీరు ఖచ్చితంగా కాఫీ సంతర్పణ గూర్చి విని ఉండరనుకుంటా.

మదన్ అనే ఈ కాఫీ ప్రియుడ్ని కలిసే వరకు నాకు కూడా తెలియదు ఇలాంటి ఒక వ్యక్తి ఉంటాడని, ఉచితంగా ఇలా వందలమందికి కాఫీలు త్రాగిస్తారని నాకు కూడా తెలియదు.

ఇటీవల కడపకి వెళ్ళినప్పుడు గుర్తు వచ్చాయి ఈ సంగతులన్నీ.

ఈయన ఒక పిల్ల జమిందార్ అని చెప్పవచ్చు. దగ్గర్లో ఉన్న కాజీపేట అనే ఊరి నుంచి వచ్చేవాడు రోజు కడపకి. ఈయన ఒక్కోసారి కైనెటిక్ హోండాలో, ఒక్కోసారి ప్రీమియర్ 118 ఎన్ ఈ అనే కారులో వచ్చేవాడు. ఆయనకి డబ్బుకి కొదవలేదు అన్నది నిర్వివాదాంశం. మంచి మాటకారి. కనుముక్కు తీరుగా, చూడంగానే చక్కగా ఆకర్షణీయంగా ఉండేవాడు.

అంత చక్కగా ఉండే ఆయనలో ఒక అవకరం చూసి నిజంగా అవాక్కయ్యాను ఒకసారి.

ఓ రోజు ఆయన స్కూటర్ పార్క్ చేసి, కాఫీ హోటల్ వంక వచ్చేటప్పుడు చుసి అవాక్కయ్యాను. ఆయనకి పోలియో. ఒక కాలు ఈడుస్తూ నడుస్తాడు.

దేవుడు ఎందుకు ఇలా అన్యాయం చేస్తాడు కొందరికి అని అనిపించింది నాకు క్షణంలొ.

 

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేమి కోరేది

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది

 

తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది

ఎంత బాధపడకుంటే సీతారామ శాస్త్రి గారు ఈ తరహా  పాట వ్రాసి ఉంటారు. ఇలాంటి ఏదో సంఘటన ఆయనతో ఆ పాట రాయించి ఉంటుందనుకుంటా.

మదన్  వయస్సు దాదాపు ముఫై ఉంటుంది, అప్పటికి. నాకు తెలిసి ఆయనకి పెళ్ళి కాలేదు.

ఆయనికి ఆటోమొబైల్స్ అంటే పిచ్చి. వాహనాల గుర్చి ఆయనకి తెలియని విషయాలు ఉండేవి కావు. టూ స్ట్రోక్, ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ల గూర్చి, ఆటో స్టార్ట్ , ఆటో గేర్, జర్మన్ డిజైన్, జపనీస్ డిజైన్ ఇలా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కి సంబంధించి కూలంకషంగా మాట్లాడుతూ ఉండేవాడు నాతో. నాక్కూడా ఆటోమొబైల్స్ అంటే ఇష్టం కాబట్టి అతనితో జోరుగా మాట్లాడేవాడిని.

ఆ తర్వాత  నేను గమనించింది ఏమిటి అంటే, ఎవరికి ఏ విషయం ఆసక్తో గమనించి వారితో సాధికారికంగా ఆ విషయం గూర్చి లోతుగా మాట్లాడేవాడు. పొలాల్లో నాట్లు, ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, క్రికెట్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ , టెలికాం ఇండస్ట్రీలో రాగల పెనుమార్పులు ,ఇలా ఆయన మాట్లాడే మాటల్లో వివిధ అంశాలు దొర్లేవి.

అప్పటికింకా ఇంటర్ నెట్ విప్లవం రాలెదు దేశంలో . ఇంకా బీఎస్‍ఎన్‍ఎల్ మాత్రమే రాజ్యం చేస్తున్న రోజులు అవి. భారత్ లో రాగల పెనుమార్పుల గూర్చి ఆయన చేసిన ఊహలు చాలా మట్టుకు నిజం అయ్యాయి.

ఈయన రాయలసీమ గ్రామీణ బ్యాంకులో పని చేసి, వాలంటరీ రిటయిర్మెంట్ తీస్కుని, ఏదో వ్యాపారాలు చేసే వాడు. రిజైన్ కాదు-పాడు కాదు ఏదో ఫ్రాడ్ లో ఇరుక్కున్నాడు ఆయన్ని సస్పెండ్ చేశారు అని గిట్టని వాళ్ళు చెవులు కొరుక్కునే వారు. ఏది ఏమైనా అతని ముందు అందరూ చాలా తీయగా మాట్లాడి అతనందించే తియ్యటి కాఫీ త్రాగి వెళ్ళే వారు.

ఆ రోజుల్లో సెల్ ఫోన్లు అవీ ఉండేవి కావు. కానీ ఈయన్ని కలుసుకోవాలి అంటే ఎక్కడ ఉంటాడబ్బా అని కంగారు పడాల్సిన పని లేదు.. కడప  పట్టణం  నడిబొడ్డున మద్రాసు రోడ్డులో ఉండే మిధున్ రెఫ్రెష్‍మెంట్స్ అనే రెస్టారెంట్ ఇతని అడ్డా.

నేను ఆ రోజుల్లో కడపలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తూ ఉండేవాడిని.

నెను మిత్ర బృందంతో తరచు అక్కడికి వెళ్ళే వాడిని. అక్కడ కాఫీ చాలా బాగా ఉంటుంది.

కడపలో ఈ మిథున్ రెఫ్రెష్ మెంట్ లోనే కాదు, మణీ హోటల్, సుజాత హోటల్, అశోకా హోటల్, మయురా టిఫిన్స్ , ఇలా ప్రతి చోటా కాఫీ బాగా ఉండేది. అప్పట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సందు ఎదురుగా క్రిష్టియన్ లేన్ ప్రారంభం మలుపులో,ఒక హోటల్  ఉండేది, పేరు గుర్తు లేదు, అక్కడ కూడా కాఫీ చాలా బాగా ఉండేది.

ఇన్ని హోటళ్ళు ఉన్నా మన మదన్ మాత్రం మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ వద్దనే ఉండేవాడు. ఈ మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ అనే హోటల్ కి ఇతను మహరాజ పోషకుడు అని చెప్పవచ్చు. ఇక్కడ కాఫీ, టీ, టిపిన్స్ మాత్రమే దొరికేవి. భోజన సౌకర్యం లెదు.  అక్కడ దొరికే పదార్థాలు అన్నీ ఆరగిస్తూ , ఆరారా కాఫీ సేవనం చేస్తు కులాసాగా గడిపే వాడు. లోపల టేబుల్ వద్ద కాసేపేమన్నా కూర్చుంటాడేమో, అధిక భాగం,. బయట రోడ్డు కనపడేలా నిలుచుని కాఫీ త్రాగే వాడు. నిలువెత్తు రౌండ్ టేబుల్స్ రెండు ఉండేవి బయట.  ఆయన చుట్టూ ఎప్పుడు మిత్రులు ఉండేవారు. ఆయన ఎన్ని సార్లు కాఫీ త్రాగుతాడో లెక్కలేదు.  ఎప్పటి లెక్క అప్పుడే తేల్చేసేవాడు, అప్పు గిప్పు వంటి తలకాయ నొప్పులు ఏమి పెట్టుకునే వాడు కాదు. అందుకే హోటల్ వారు కూడా ఆయన్ని గౌరవంగా చూసుకునేవారు.

కొత్త వారితో పరిచయం చేసుకోవడంలో నేను పెద్ద నైపుణ్యం ఉన్న వాడిని కాను. ఆయనతో నా పరిచయం కూడా ఆయన స్నేహశీలత వల్లనే సాధ్యమయింది అని చెప్పటంలో సందేహం లేదు.

మెడికల్ రెప్రెజెంటేటివ్స్ అంటే ఆయనకి ప్రత్యేక అభిమానం కద్దు.

అందునా అతనికి నేనంటే చాలా అభిమానం ఎందుకో. ఒక సారి ఆ రహస్యం కూడా బయట పెట్టేశాడు. ’మీ కులపోళ్ళు అంటే నాకు చాలా గొరవం , మీరు గురువులు సర్’ అని అనేశాడు  అందరి ముందూ ఒకసారి. ఆ మాట తరచు అనే వాడు. నాకు ఇబ్బందిగా అనిపించేవి అతని ఆ మాటలు.

నేననే కాదు, రోడ్డు మీద మిత్రులు ఎవ్వరు వెళుతూ కనిపించినా "అన్నా, అన్నా, ఇది అన్యాయం...చూడకుండా వెళుతున్నావు" అన్బి కేకలు వేసి మరీ పిలిచే వాడు. వారు మోటార్ సైకిల్ పార్క్ చేసి వచ్చేలోగా కౌంటర్లో వ్యక్తికి సైగ చేసి కాఫీ కి ఆర్డర్ ఇచ్చేవాడు. మనం ఆ రోడ్డు గుండా ఎన్ని సార్లు వెళ్ళీనా ఇలా బలవంతంగా కాఫీ ఇప్పించే వాడు

వద్దంటే వినడు. అలుగుతాడు. మనం డబ్బివ్వబోతే "ఏదీ ఇవ్వు చూద్దాం" అని చిలిపిగా నవ్వుతూ అనేవాడు. మనం ఇవ్వబోయినా ఆ కౌంటర్ లో వ్యక్తి తీస్కునే వాడు కాదు.

వయసుతో నిమిత్తం లెదు అందర్నీఅన్నా అనే పిలిచే వాడు, పెద్దవారినీ, చిన్నవారిని కూడా అన్నా అని పిల్చే వాడు.

ఇలా ఉదయం నుంచి, సాయంత్రం దాకా కాఫీ సంతర్పణ జరిగేది మదన్ ఆధ్వర్యంలో.  మధ్యాహ్నం ఏదయినా హోటల్లో స్నేహితులకు, లంచ్ పెట్టించి, తానూ లంచ్ ముగించి ఏదయినా మాటినీ ఆట చూసుకుని, మళ్ళీ సాయంత్రానికల్లా మిధున్ రిఫ్రెష్‍మెంట్స్ ముందు వాలిపోయేవాడు. రాత్రి తొమ్మిది గంటల  ప్రాంతంలో ఇంటి ముఖం పట్టే వాడు. ఇది అతని దినచర్య.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐనిస్టీన్ గాంధీ మహాత్ముడి గూర్చి ఇలా చెప్పాడు అంటారు "గాంధీ అనే వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడు అని చెప్పినా రాబోయే తరాల వారు అసలు  నమ్మరేమో అని నేను బాధపడుతున్నాను" అని.

నేను మదన్ గూర్చి ఇంచుమించు ఇలాగే చెప్పాల్సి వస్తుంది. ఇలా జనాలకు ఉచితంగా నిరంతరం కాఫీలు వితరణ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఎవ్వరూ నమ్మరేమో. ఇలా నిరంతర కాఫీ యఙ్జానికి అతను ఎంత డబ్బు తగలేసేవాడో నాకు అర్థం కాదు ఎప్పటికీ.

కడపలో ఫాక్షనిస్టులు ఉన్నారు అని చెప్పి, సినిమాలు తీసే దర్శకులకు ఈ మదన్ ని చూపాలి అనిపిస్తు ఉంటుంది.

ఇతని గూర్చి తెలియని మిత్రులకు నేను మదన్‍ని గూర్చి, అతని జీవిత శైలి గూర్చి చెబితే నమ్మలేక దిగ్భ్రాంతి చెందారు. ఆహా, ఇది కద లైఫ్ అంటే ఆని తెగ ఎక్సైట్ అయిపోయారు.

ఈ సంతర్పణ లో కాఫీ కప్పు ఎవరి చేతిలో అయినా  వాలాలంటే, వారు మదన్‍కి పరిచయస్తులే అయి ఉండనక్కరలేదు. నాతో బాటు ఎవరైనా స్నేహితులు ఉన్నారంటే, నేను మొహమాటంగా మెహం అటు చేసి రోడ్డు మీద వెళుతుంటే కూడా వదిలే వాడు కాదు. ’అన్నా ... అన్నా’ అని కేకలేసి మరీ పిలిచే వాడు. మేము మోటార్ సైకిళ్ళు  పార్క్ చేసి వచ్చే లోగా మేం ఎంత మందిమి ఉన్నామో అన్ని కాఫీలు బయట ఉన్న నిలువెత్తు గుండ్రటి బల్ల మీద వాలి పోయేవి. ఆయన మనం వచ్చే లోగానే కౌంటర్ లోని వ్యక్తికి ఫలాన అన్ని కాఫీలు కావాలని ముందే సైగల భాషలో చెప్పేస్తాడు.

నాతో పాటు వచ్చిన ఓ మిత్రుడు  ఓ పెద్ద మాటనేశాడు ఒకసారి.

"నీకు శాశ్వతంగా ఒక విగ్రహం పెట్టించాలి మదన్, అది కూడా ఎలాగంటె అంబేద్కర్ గారి విగ్రహం లా ఒక వేలు  పైకెత్తి చూపుతూ ఉండాలి. ఆయన లాగా నీకు అందరూ ఒక్కటే, అలాగ కూడా సెట్ అవుతుంది విగ్రహం, అదే విధంగా ఒకటి కాఫీ అని ఆర్డర్ ఇస్తున్నట్టు ఉంటుంది" అని

ఏదో కాఫీ త్రాగి వెళ్ళకుండా ఈ విధమైన అప్రస్తుత ప్రసంగం చేస్తున్న మిత్రుడి వంక చూస్తూ తలపట్టుక్కూర్చున్నాను.

కానీ ఈ భోళా శంకరుడు తెగ ఆనందపడిపోయాడు అ ప్రశంశకి.

"ఏదో అన్న మీ అభిమానం, ఇంకో కాఫీ చెప్పమంటావా" అని అడిగాడు ఆ అనందంలో. ఖర్మ.

ఈయన అభిమానం చల్లగుండా.  తప్పించుకుని పోబొతే పోనీడు. బిల్లు కట్టబోతే కట్టనీడు. వద్దు అంటె వినడు. మనం బండి పార్క్ చేసి అతని దగ్గరికి వెళ్ళేలోగా టేబుల్ పై కాఫీ రేడీగా ఉంటుంది.  మనం వద్దు అంటే, ’సరేలే అన్నా పారేద్దాము’ అంటూ నిష్టూరం చేస్తాడు. మనం కాఫీ త్రాగితే ఆయనకి తృప్తి. టీ త్రాగే వారంటే ఆయనకి ఒక విధమైన చిన్న చూపుకూడా కద్దు.  ఆ హోటల్లో టీ రేటు కూడా తక్కువ నిజానికి.

"అసలు మనిషనే వాడు టీ ఎలా త్రాగుతాడు అన్నా!" అని అనేశాడు ఒకసారి. నిజానికి నాకు వ్యక్తిగతంగా టీ త్రాగటమే ఇష్టం. కానీ కాఫి పట్ల అయిష్టత లేదు. కానీ మదన్ అలా మధ్యే మార్గం ఎన్నుకున్నవాడు కాదు. టీ త్రాగే వారి పట్ల చిన్న చూపు, కాఫీ తాగేవారి పట్ల గౌరవభావం బాహటంగానే వ్యక్త పరిచేవాడు.

మొత్తానికి కొన్ని వందల కాఫీలు త్రాగి ఆయనకి ఋణపడి ఉన్నాను నేను. సరే ఆయన ఋణం తీర్చుకునే అవకాశం రానే వచ్చింది ఒక సారి.

నాకు తెలియకుండానే నేను ఆయనకి ఒక సాయం చేశాను. సామాన్యమయిన సాయం కాదు నేను చేసింది. కాకపోతే అది అనుకోకుండా జరిగింది.

ఒక పెద్ద బ్యాంకు ఫ్రాడ్ కి కుట్ర జరిగింది ఈయన వెనుక అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మంచి మనిషిని ముంచేందుకు తెగబడిన వారు ఊరికి చెందిన దగ్గరి బంధువులే కావడం విశేషం.

నాకు సిండికేట్ బ్యాంకులో స్టాన్లీ అని ఒక మిత్రుడు ఉండేవాడు. ఆయన్ని కలవటానికి తరచు స్టేషన్ రోడ్డు లోని సిండికేట్ బ్యాంకు కి వెళ్ళే వాడిని.

ఇలాగే ఒకసారి సిండికేట్ బ్యాంక్ కి నేను వెళ్ళగా, మదన్ తో ఎప్పుడు కలిసి తిరిగే ఇద్దరు మిత్రులు అక్కడ తారస పడ్డారు.

వాళ్ళిద్దరూ మదన్ వాళ్ళ ఊరి వాళ్ళే. నిజానికి వారు మిత్రులు కాదు, ఆయన దగ్గర బంధువులు అని తర్వాత తెలిసింది. . వీళ్ళిద్దరు బ్యాంకులో,  శర్మ అనే మేనేజర్ తో ఏదో సీరియస్ గా మాట్లాడ్తూ కనిపించారు వారు.

నాకు ఈ శర్మ గారు పరిచయమే. నేను ఊరకే ఉంటే ఏ ఇబ్బంది ఉండకపోయేది.శర్మ గారిని చిరునవ్వుతో పరామర్శించి, వీరిద్దరి వంక చూస్తూ  "హలో మదన్ గారు రాలేదా" అని అడిగాను.

చచ్చిన ఎలకను  మ్రింగిన వారిలా మొహం పెట్టారు వారిద్దరూ తక్షణం.

నేను  ఆ సమయంలో అక్కడికి రావడం వారు అస్సలు ఊహించలేదు. నా రాక వారికి ఏ మాత్రం నచ్చలేదన్నది అర్థం అయింది. దానికి తోడు నా మాటలతో వాళ్ళ పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళ భంగిమ చూస్తూనే నాకర్థం అయింది ఆ విషయం. కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు వారిద్దరి మొహాలలో.

వారిద్దరూ తెగ కంగారు పడ్డారు నా పలకరింపుతో. నేను ఏమంత తప్పు మాట అన్నానబ్బా అని మరొక్కసారి నా మాటలని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

ఎవ్వరూ ఊహించని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

బ్యాంకు మేనేజర్ శర్మ గారు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడి, కళ్ళు పెద్దవి చేసి, వారిద్దరిలో బక్క పలచటి వ్యక్తి వంక చూస్తూ "ఏమిటి, మీరు మదన్ కాదా?" అని కీచుగా అరిచారు.

ఆయన చటుక్కున వారి చేతిలోంచి పత్రాలు లాక్కుని, "ఏమిటి ఈయన మదన్ కాదా?"  నా వంక చూస్తూ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో అదే ప్రశ్నని సంధించారు.

నా అయోమయం పతాక స్థాయికి చేరుకుంది. "ఈయన మదన్ ఏమిటి నాన్సెన్స్. ఈయన సంజయ్ రెడ్డి కద" అని అన్నాను నేను నింపాదిగా.

ఆ సదరు సంజయ్ రెడ్డి మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. దొరికి పోయిన దొంగలా అతను నీళ్ళు నమలడం మొదలెట్టాడు.

తాను మదన్ అని బొంకి, అకౌంటు తెరిచే ప్రయత్నానికి తెర ఎత్తాడు పిల్లికి ఎలక సాక్ష్యం అని, ఇతనికి తోడుబోయిన మరొక బంధువు వచ్చి సాక్షి సంతకం పెట్టబోతున్నాడు.

అదిగో సరిగ్గా ఆ టైంకి నేను అడుగుపెట్టాను అక్కడికి.

ఇంతకూ విషయం ఏమిటి అంటే, మదన్ పేరిట వచ్చిన ఒక లక్ష రూపాయల చెక్కుని చేతబట్టుకుని వచ్చి వీరు, బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయబోతున్నారు. ఫోటో ఐడీ, అడ్రెస్ ప్రూఫ్ ఇలా ఏవో  దొంగ డాక్యుమెంట్లు పట్టుకుని వచ్చి పని మొదలెట్టారు. ఇంతకూ చెక్కు వచ్చింది మదన్ కి. వీళ్ళు దానిని తస్కరించి పెద్ద పన్నాగమే పన్నారు.

నిజానికి అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ కంటే ముందరి  డేట్ తో జారీ చేయబడ్డ  చెక్కుని స్వీకరించకూడదు. వీరు ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి అకౌంటు ఓపెన్ చేసి చెక్ ని కూడా డిపాజిట్ చేయబోతున్నారు. అప్పట్లో ఇలా అధార్ కార్డ్, పాన్ కార్డ్ గట్రాలు ఏమీ ఉండేవి కావు. ఇంటర్ నెట్ లేదు.

బాంక్ వారు అసలైన మదన్ ఎక్కడుంటాడో నన్ను అడిగి కనుక్కున్నారు.

చూస్తుండగానే మేనేజర్ గారు, ఇతర స్టాఫ్ అలర్ట్ అయిపోయారు. సెక్యూరిటీ ని పిలిపించారు. ఎవరో వెళ్ళి మదన్ ని పిలుచుకు వచ్చారు.

ఆయన వద్ద స్టేట్ మెంట్ తీసుకున్నారు ఆయనే మదన్ అని. డ్రైవింగ్ లైసెన్స్ వగైరా పత్రాల ద్వారా నిర్దారించుకున్నారు. క్షణాలలో పోలీసులు వచ్చారు. వారందరినీ  వ్యాన్ ఎక్కించుకుని వెళ్ళారు. ఆ ఇద్దరికీ కటకటాలు తప్పవని నిర్దారణ అయింది.

నన్ను ఆ ఇద్దరూ గుర్రు గుర్రు మని చూస్తూ వెళ్ళీపోయారు రక్షక భటుల వెంబడి.  నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది.

బ్యాంకు స్టాఫ్ అంతా నన్ను అభినందనలతో ముంచెత్తారు, ఓ పెద్ద మోసాన్ని అరికట్టడంలో నేను ప్రముఖ పాత్ర పోషించానని. రిటైర్ అవబోతున్న శర్మ గారి ఉద్యోగ జీవితంలో ఏర్పడబోయిన పెద్ద ఇబ్బంది ని నా చాకచక్యం వల్ల తప్పించానని, అసలు సరైన టైం కి  నేను అక్కడికి రావడం దైవ లీల అని ... ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు.

వీళ్ళ అభినందనలు నన్ను ఆనందపరచలేదు, చూపులతో బెదిరిస్తూ వెళ్ళీన ఆ ఇద్దరి చూపులు భయపెట్టలేదు. ఒక విధమైన అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాను నేను.

****

ఇవన్నీ ఒకెత్తు అయితే,  మదన్ చేసిన ఒక పని గూర్చి చెప్పాలి.

ఈయన్ని మంచి మనిషి అనాలా , పిచ్చి మనిషి అనాలా నాకైతే ఏమీ అర్థం కాలేదు.

"అన్నా అసలు ఇంత ద్రోహం ఎట్లా చేస్తారన్నా, మనుషులు ఎందుకు అందరూ మంచివాళ్ళుగా ఉండరన్నా. నన్ను అడిగితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేనే ఇస్తా కద అన్న ఇలా ఎందుకు చేశారన్నా?" అని వాపోయాడు ఈ కాఫీ దాత. పోలిసు వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం స్టేషన్ లో సాక్ష్యం చెప్పటానికి వ్యాన్ ఎక్కే ముందు అయోమయంలో అతనన్న మాటలు అవి.

నేను కూడా వెళ్ళాను స్టేషన్ కి. ఈయన అసలే షాక్ లో ఉన్నాడన్చెప్పి.

వ్యాన్ స్టేషన్ చేరే వరకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

ఒన్ టవున్ పోలీస్ స్టేషన్ లో నన్ను వరండలోనే ఉండమన్నారు. కానీ నాకు లోపలి నుండి వాళ్ళ మాటలు వినిపిస్తునే ఉన్నాయి.

వాళ్ళ మీదకి నింద రాకుండా అక్కడ మదన్ చూపిన ఔదార్యం చూసి నాకు కళ్ళు చెమర్చాయి.

తానే వాళ్ళని చెక్ మార్చుకుని రమ్మని పంపానని, వాళ్ళదేమి తప్పు లెదని, బ్యాంకు లో ఏదో కమ్యూనికేషన్ గాప్ ఏర్పడింది అని, తాను వాళ్ళ మీద కేసు పెట్టటం లేదని, వాళ్ళని వదిలియ్యమని చెప్పి, బయటకు వచ్చేశాడు ఈ కాఫీ దాత.

నేను గుడ్లప్పజెప్పి ఆయన్నే చూస్తూ ఆయన వెనకే మిధున్ రెఫ్రెష్‍మెంట్స్ కి వచ్చి చేరుకున్నాను.

మా వెనుకే వచ్చారు చెక్కుతో కుట్ర పన్నిన ఆ ఇద్దరు.

"డబ్బు అవసరం ఉంటే నన్ను అడగవచ్చు కద సంజయ్ రెడ్డి నేను ఇచ్చే వాడిని కద, ఇప్పుడు కేసయ్యుంటే నీకు ఎంత నామార్దా?"

ఇంత జరిగినా సంజయ్ రెడ్డి కి చెడ్డ పేరు వస్తుందేమో అని  బాధపడుతున్నాడు ఈ బుద్ది మంతుడు.

నిర్లిప్తంగా పై మాటలని అనేసి "నాలుగు కాఫీ" అని ఆర్డర్ ఇచ్చాడు.

వాటిలో ఒక కాఫీ నాకు అన్నది ప్రత్యేకంగా చెప్పే పనే లేదు కద.

కాఫీ రాకముందే గుటకలు మింగాను ఈయన వింత ప్రవర్తనతో.

మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈయనకి చెక్ ఈయన ఇదివరకు పని చేసి రిజైన్ చేసిన బాంక్ వారు పంపారు. అది రిజైన్ కాదు ఆయన సస్పెన్షన్ కి గురయ్యాడు అని ప్రచారం చేసింది కూడా ఈ సంజయ్ రెడ్డి , అతని మిత్రులే అన్న విషయం నాకు ఆ తర్వాత మదన్ ద్వారానే తెలిసింది.

"అందరూ మంచి వాళ్ళుగా లేరని మనం కూడా మంచితనం వదిలేద్దామా అన్నా! మన తత్వం మనం మానద్దు. వాళ్ళ తత్వం వాళ్ళు మార్చుకోవాలని ఆశిద్దాం" ఇవి ఏ ప్రవచనకారుడో వేదిక మీద నుంచి చెబితే వింటానికి బాగుంటాయి.

కానీ ఒక సామాన్యుడు తన జీవిత విధానం ద్వారా ఈ మాటల్ని పాటించి చూపుతున్నాడంటే నమ్మలేము కద.

*******

 

Published in Sanchika Web Magazine: 05.06.2022 Sunday

 


Sunday, April 24, 2022

నిరీక్షణ

 

నిరీక్షణ

-డా.రాయపెద్ది వివేకానంద్


సమయం సాయంత్రం: ఆరు గంటలవుతోంది.

ఆకాశం కాషాయరంగు సంతరించుకుంది.

తుఫాను ముందరి ప్రశాంతి లాగా ఉంది వాతావరణం.

ఆ రాత్రి జరగబోయే ఘోర పరిణామాల గూర్చి ఏ మాత్రం  తెలియని అహల్య, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మూడంతస్తుల ఫార్మ్ హవుసు డాబాపై అటు ఇటూ పచార్లు చేస్తూ ఉంది. ఇరవై ఏళ్ళ ఆ అమ్మాయి ఉత్సాహానికి మారుపేరులా లయబద్దంగా ఊగిపోతూ ఆనందంగా సంగీతాన్ని ఆస్వాదిస్తోంది.

అహల్య తండ్రి నాగేశం. అతను ఒక పారిశ్రామిక వేత్త. ఆయన ఎంతో ఇష్టపడి ఈ ప్రశాంత వాతావరణంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ఫార్మ్ హవుస్ ని విశ్రాంతికై నిర్మించుకున్నారు.

నగర కాలుష్యానికి చాలా దూరంలో హైవే పక్కన  పొలాల మధ్య ఉన్న ఆ ఫార్మ్ హవుసు చాలా ఇష్టం ఆ కుటుంబ సభ్యులందరికీ. కనుచూపు మేరలో ఏ విధమైన నిర్మాణాలు లేవు, కాలుష్యం అసలే లేదు, అక్కడి వాతావరణం అందుకే చాలా ఇష్టం అహల్యకి.  ఆ ఫార్మ్ హవుసు కి ఒక వైపు దూరంగా వారి ప్రహారి గోడని తాకుతూ వెళ్ళే నది ఒక ప్రత్యేక ఆకర్షణ.

కాకపోతే ఏ చిన్న వస్తువు కావాలన్నాదగ్గర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాలి.

కనీసం కొన్ని పదుల కిలోమీటర్లు  వెళితే కానీ అతి దగ్గరగా ఉండే మొదటి గ్రామం రాదు.

హైవే పక్కన ఉన్న వారి స్వంత తోటల తాలూకు మెయిన్ గేటు వద్ద నున్న సెక్యూరిటీ సిబ్బందిని  దాటుకుని, తోట మధ్య ఉన్న ఫార్మ్ హవుసుకి చేరుకోవాలంటే, దాదాపు ఒక కిలోమీటర్ దూరం సిమెంట్ రహదారిలో ప్రయాణించి, ఫార్మ్ హవుసు చేరుకోవాలి.

హైవే పక్కగా ఆ తోట చుట్టు రక్షణగా నిర్మించిన రాతి గోడల అవతల ఇంత ప్రపంచం ఉందని రోడ్ పైనుంచి ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు

ఇక అదే హైవే పై తోటలోకి మలుపు తీసుకోకుండా, నేరుగా కాస్త ముందుకు వెళితే ఓ పెద్ద  వంతెన వస్తుంది. ఆ వంతెన కింద ఉన్న నది గట్లు తన్నుకుని ప్రవహిస్తు భీతి గొలుపుతోంది.

ఆ నదే వారి భవంతి పైనుంచి కనిపిస్తుంది.

రోడ్  బ్రిడ్జి పై నుంచి ఆ  నది చూడ్డానికి అమాయకంగా కనిపిస్తూ ఉన్నా, దాని  ఉధృతికిఆ వంతెన సగం తెగి పోయింది. అందువల్ల  గత రెండు రోజులుగా ఆ హైవే పై రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.

సూర్యుడు అస్తమించబోతున్న సమయం కావటన ఆకాశం చాలా అందంగా ఉంది.

ఆ భవంతికి వెనుక భాగాన కూతవేటు దూరంలో ఆకాశాన్ని చుంబిస్తూ ఉన్న కొండలు,  దూరంగా నిండు గర్బిణీలా ప్రవహిస్తున్న నది, గూళ్ళకి వెళుతున్న పక్షులు. మొత్తంగా ఒక అనుభవఙ్జుడైన చిత్రకారుడు చిత్రించిన చిత్రంలాగా  ఉంది అక్కడి వాతావరణం.

పక్షుల అరుపులు, గాలి వీచే చప్పుడు మినహాయించి పశాంతత అలుముకుని ఉంది అక్కడ.  ప్రకృతి ఒడిలో ఉన్న ఆ భవంతిలో  అహల్య, ఆమె  తలితండ్రులు మాత్రమే వచ్చి ఉన్నారు ప్రస్తుతం. వారు వచ్చి ఇంకా నాల్గు రోజులు కూడా కాలేదు.

అహల్య తండ్రి నాగేశం ఆర్థిక పరిస్థితి ఒకప్పటి లాగా లెదు. కొన్ని రోజుల క్రితం వరకు అందరూ అతన్ని చూసి అసూయపడే పరిస్థితి ఉండేది. పట్టిందల్లా బంగారం అయ్యేది ఆయనకి.  కానీ ఇదంతా కరోనా లాక్ డవున్ పూర్వం. ఇప్పుడు ఆయన వ్యాపారాలన్నీ కరోనా అనిశ్చితి కారణంగా అగమ్యగోచరంగా తయారయ్యాయి.

ఎటు చూసినా అప్పులు, ఆదాయం చూస్తే నానాటికి తీసికట్టు అన్నట్టు ఉంది. సిబ్బందికి కూర్బోబెట్టి జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, అలాగని అన్ని సంవత్సరాల నుంచి తనని నమ్ముకున్న వారికి ఉద్వాసన పలకటానికి మనసు ఒప్పటం లేదు. కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఖర్చులు తగ్గించుకోవటం వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది ఆయనకి. తన వ్యాపార సముదాయ భవనాలకి చెల్లించాల్సిన అద్దెలు, ఇతర ఖర్చులు, జీతాలు ఇవన్నీ ఆయనకి పెద్ద గుదిబండగా తయారు అయ్యాయి.

ఫాం హవుసు ప్రవేశద్వారం వద్ద ఉండే సెక్యూరిటి సిబ్బందికి సైతం జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆయన. అందుకే వారికి ఉద్వాసన పలికి రెండురోజులు అవుతోంది.

ఆర్థిక కారణాల వల్ల ఏర్పడ్డ  ఈ అశాంతి నుంచి కాస్త ఉపశమనం కోసం  వచ్చారు ఆ కుటుంబ సభ్యులు అక్కడికి.

"టప్" మని తనపై పడ్డ చినుకు తాకిడికి పాటల పారవశ్యంలో ఉన్న అహల్య ఉలిక్కి పడి ఆకాశం వంక చూసింది.

అప్పటి దాకా ప్రశాంతంగా తేలికగా ఉన్న ఆకాశం ఎప్పుడు నిండిపోయిందో, నల్లటి మబ్బులతో నిండిపోయింది.

చిక్కటి చీకటి తెరలు ఆవరించుకుంటున్నాయి నలుదిక్కులా.

కింద కాంపౌండ్ లో మేలుజాతి శునకం లియో  అరుస్తున్న అరుపులు ఆ నిశ్శబ్ద వాతావరణంలో వికృతంగా వినిపిస్తున్నాయి.

ఎడమ కన్ను అసంకల్పితంగా అదిరింది అహల్యకి.

ఏదైనా పెను ఉత్పాతం జరగబోయే ముందు  అలా ఎడమ కన్ను అదురుతుందని ఎక్కడో చదివిన మాట గుర్తు వచ్చింది. ఈలోగా  కీంది నుంచి తల్లి పిలుపు వినిపించింది.

"అహల్యా చీకటి పడుతోంది కిందకి రామ్మా!"  తల్లి పిలుపుతో  ఊహల్లోంచి బయట పడి మేడ దిగి కిందకి వచ్చేసింది.

****

భోజనాలకు కూర్చున్నారు.

తండ్రిని చూస్తుంటే చాలా బాధగా ఉంది అహల్యకి. ఒక్క సారిగా వృద్ధాప్యం మీద పడ్డట్టు ఉన్నారు ఆయన. ఎక్కువ సమయం మౌనం లోనే గడుపుతున్నాడు.

వెదుక్కుంటూ వెళితే ఆనందం అన్నది  బయట ఎక్కడా దొరికేది కాదని, అది మనలోనుంచే సృష్టించుకోవాలని ఆయనకి తెలియంది కాదు. ప్రశాంతత కొరకు అక్కడికి వచ్చారు కానీ అశాంతి తనలోంచి నీటి చెలమలో నీరు ఊరినట్టు ఊరుతుంటే ఎక్కడికి వెళితే మటుకు ప్రశాంతత లభిస్తుంది?

ఉన్న స్థిర చర ఆస్తులను అన్నింటినీ అమ్మేసి, ఉన్న అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ ఏదైనా వ్యాపారం కొత్తగా ఓ కుర్రాడిలా ఉత్సాహంగా ప్రారంభించాలి. అది ఒక్కటే ఆయన ముందున్న పరిష్కారం. అది ఆయనకి ఎందుకో నచ్చటం లేదు. పూలమ్మిన చోట కట్టెలమ్మటం ఎవరికైనా కటువైన పరిష్కారమే కద.

అది ఏమంత సులభంగా జరిగే పని కాదు. తమ ఆస్తులకి సరైన ధర ఇచ్చి కొనే నాధుడు ఈ గడ్డు కాలంలో దొరకడం అంత సులభం కాదు.

లేదూ పరిస్తితులు అనుకూలించే వరకు ఎదురు చూసి, మళ్ళీ అప్పో సొప్పో చేసి ఖాయిలా పడ్డ తన వ్యాపార సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నించుకోవడం ఇంకో పరిష్కారం. ఆయనలోని వ్యాపారవేత్త ఈ రెండో పరిష్కారం వైపే మొగ్గుచూపుతున్నాడు. కళ్ళు తిరిగే ఒక పెద్ద మొత్తం దేవుడు ఏదో ఒక రూపంలో తనకు అందిస్తే తన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది కద అన్న ఆశావహ ధృక్పధం కూడా  ఉండుండి కలుగుతోంది ఆయనలో.

ఆయన భావించినట్టే కళ్ళు చెదిరే స్థాయిలోపెద్ద సంపద తమను చేరబోతోంది అని ఆయనకి తెలియదు ఆ క్షణం. ఆ సంపదని అందుకునే క్రమంలో తాను హంతకుడిని అవుతానని ఆయన కలలో కూడా ఊహించి ఉండడు.

***

రాత్రి పదకొండు అవుతోంది.

అసలు నిద్ర పట్టడం లేదు అహల్యకి. తండ్రి పడుతున్న దిగులు ఆమెకి అర్థం అవుతూనే ఉంది. ఎప్పుడు తమ ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయో ఆమెకి అర్థం కావడంలేదు.

బయట పెద్ద వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది.

పక్కపై ఉండలేక ఆమె లేచి కిటికీ వద్దకొచ్చి నిలబడి కిటికీ అద్దంలోంచి బయటకిచూస్తూ నిలబడింది.

జరగబోయే పెను ఉత్పాతానికి నాందిగానో ఏమో, పెద్ద వెలుగుతో పిడుగు పడింది, పొలాల మధ్య దూరంగా కనిపిస్తున్న ఎత్తైన తాటి చెట్టు క్షణాలలో బూడిద అయింది పిడుగుపాటుకి.

కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూసిన అహల్య కళ్ళు పెద్దవయ్యాయి భయంతో.

అసంకల్పితంగా ఆమెకి ఒళ్ళు జలదరించింది. ఈ వర్షం రాత్రి ఏదో భయంకరమైన సంఘటన జరగబోతోంది అని అనిపించింది అహల్యకి. అలా ఎందుకు అనిపించిందంటే ప్రత్యేకమైన కారణమేమి లేదు.

పిడుగు పడిన వెలుగులు సద్దుముణిగిన కాసేపటికి చెవులు చిల్లులు పడేలా భూనభొంతరాళు దద్దరిల్లేలా మేఘాల ధ్వని వినిపించింది.

ఆమె మనసు ఆందోళనగా ఉంది.

మామూలప్పుడైతే ఆ ఫార్మ్ హవుసు చాలా ఆనందాన్ని ఇస్తుంది కానీ ఇలా ఈ తుఫానులో వెన్నులో వణుకు పుట్టిస్తోంది.  సెక్యూరిటీ గార్డులు కూడా లేరు తమ బంగళాకి అన్న సత్యం తెలుసు ఆమెకి.

ఇంతలో ఆమెకి ఓ దృశ్యం కనిపించింది.

ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

తమ భవంతి వైపు ఓ కార్ వస్తూ కనిపించింది సిమెంట్ రోడ్డుపై. హైవే పై వెళ్ళే వ్యక్తులకు, అసలు ఇక్కడ ఒక భవంతి ఉన్న విషయం  తెలిసే అవకామే లేదు. హైవే పైనుంచి  లోనికి కిలోమీటర్ ప్రయాణించి వస్తేనే తప్ప గుబురుగా ఉన్న తోటల మధ్య ఉన్న తమ భవంతి కనిపించదు. తమ ఆప్తులు, బంధువులు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చే అవకాశం లెదు. రాత్రే అందరితో ఫోన్ లో మాట్లాడారు కూడా. ఈ వస్తున్నది ఎవరబ్బా?

పెద్ద వర్షం తాలూకు చినుకులు కార్ దీపాల కాంతిలో గాజు ముక్కలు విరిగి ఆకాశం నుంచి పడుతున్నాయా అన్నట్టు కనిపిస్తున్నాయి. క్రమంగా ఆ కార్ భవంతికి దగ్గరయ్యింది. ఫలాన కంపెనీది అని తెలియటం లేదు కానీ అది చాలా ఖరీదైన కార్ గా పోల్చుకుంది అహల్య.  మంచు తెరలు అలుముకున్న కిటికీలోంచి ఆమెకి అస్పష్టంగా కనిపిస్తున్నాయి బయటి దృశ్యాలు.

ఒక దశలో ఆ కార్ మలుపు తీసుకుని, భవంతి ముందు భాగం వైపుకి వెళ్ళింది. అహల్యకి కార్ కనిపించడం లేదు ఇప్పుడు.

తాను కలగానీ కనలేదు కద. ఈ సమయంలో , ఈ వర్షంలో తమ ఇంటికి ఎవరు వస్తారు. ఆశ్చర్యంలో మునిగిపోయింది అహల్య. అందుకే అది నిజం కాదు, తన భ్రమ అని తీర్మానించుకుంది.

ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టు కుంభవృష్టిగా వర్షం కురుస్తూనే ఉంది.

***

జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన లియో తో పాటు, హౌండ్ తరగతి కి చెందిన ఇంకో రెండు మేలు జాతి శునకాలు బిగ్గరగా అరవడం వినిపిస్తోంది.

కింద గదిలో లైట్లు వెలిగాయి.

నాగేశం, ఆయన శ్రీమతికి ఇద్దరికి మెలకువ వచ్చింది ఆ శునకాల అరుపులకి.

బయట పోర్టికోలో కారు హారన్ మ్రోగిస్తూ ఉన్నారు ఎవరో.

శునకాల అరుపులు, కారు హారన్ తాలూకు చప్పుడు తో కాసేపు భీబత్సమైన వాతావరణం ఏర్పడింది అక్కడ.

మెయిన్ డోర్ తలుపులు తెరిచి నాగేశం బయట వరండాలోకి అడుగు వేశారు.

బయట పోర్టికోలో ఒక ఖరీదైన కారు ఆగి ఉంది. కారులోని వ్యక్తులని కార్ దిగనీయకుండా ఆ కారు చుట్టు చురుగ్గా తిరుగుతూ అటాక్ చేయటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ మూడు శునకాలు.

నాగేశం వాటిని సముదాయించి ’ఎవరదీ’ అని అడిగాడు.

కార్ తాలూకు కిటికీ అద్దం కిందకి దించి అందులోంచి తల బయటకి పెట్టి ఒక యువకుడు గ్రీట్ చేశాడు నాగేశం వంక చూస్తూ

"సర్! నేను హైవేపై వెళుతున్నాను. బ్రిడ్జీ మీద ముందుకు వెళదామంటె బ్రిడ్జి కూలిపోయింది. వెనక్కు వెళ్ళాలి అంటె కనీసం ఓ వందా యాభై  కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఒక డీసెంట్ లాడ్జ్ ఉండే ఊరికి చేరుకోవాలంటె. కార్లో అంత పెట్రోల్ కూడా లేదు. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం దొరుకుతుందా?"

అతను అడిగిన విధానం లో సంస్కారం ఉట్టి పడుతోంది. అతన్ని చూడగానే సదభిప్రాయం ఏర్పడుతుంది ఎవరికైనా. అతన్ని అనుమానించాల్సింది ఏమీ కనపడలేదు నాగేశానికి.

’అరెరె అదెంత భాగ్యం! మీరు నిరభ్యంతరంగా ఈ రాత్రి మా ఇంట్లో ఉండవచ్చు. రండి రండి" అంటూ ఆహ్వానించాడు నాగేశం ఆ యువకుడిని.

కార్లో నుంచి దిగటానికి సందేహిస్తున్నాడు ఆ యువకుడు. శునకాలని చూసి కాస్త వెనుకంజ వేస్తున్న ఆ యువకుడిని చూసి చిరునవ్వు నవ్వుతూ, వాటిని కట్టేశాడు నాగేశం.

అతను ఇంటిలోనికి వచ్చేలాంటి అనుకూల వాతావరణం కల్పించాడు, కానీ ఆ నిర్ణయం వల్ల ఒక నిండు ప్రాణం గాల్లో కలిసి పోబోతోంది అని ఎవ్వరూ ఆ క్షణం ఊహించి ఉండరు.

ఆ కుర్రాడు కారు దిగాడు. మాటల మధ్యలో అతని పేరు అనిల్ అని తెలిసింది.

ఈ లోగా ఈ సందడి విని మేడ దిగి అహల్య లోపలి గదినుండి, వాళ్ళ అమ్మ ఇద్దరూ పోర్టికోలోకి వచ్చేశారు. వేళకాని వేళలో వచ్చిన ఆ అతిధి ఎవరైంది అర్థం కాలేదు ఆ అమ్మాయికి.

అనిల్‍ని చూడంగానే ఎవరికైనా మొదటి చూపులోనే సదభిప్రాయం ఏర్పడుతుంది.

ఆరడుగుల ఎత్తు, ఎత్తుకి తగ్గ అందమైన విగ్రహం. తెల్లటి తెలుపు. నుదురుమీద పడుతున్న వంకీలు తిరిగిన జలపాతం లాంటివత్తైన జుత్తు. కోటేరులాంటి ముక్కు. చురుకైన కన్నులు.

ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా అనిల్ నాటకీయంగా నాగేశం దంపతుల పాదాలకి నమస్కారం చేశాడు. అహల్య వంక చూస్తూ చిరునవ్వుతో ’సారీ అండీ మిమ్మల్ని అందర్నీ ఇలా వేళ కాని వేళలో ఇబ్బంది పెడుతున్నాను"

"అయ్యో అదేం మాట నాన్నా. మనమంతా మనుషులం. చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు సైతం ఒకరికొకరు సాయం చేసుకోకుంటే ఎలా?"

"ఎక్కడో ఉన్న మా అమ్మానాన్నలు గుర్తు వచ్చారండీ మిమ్మల్ని చూడంగానే" కాస్త ఎమోషనల్ గా చెప్పాడు అనిల్.

గ్రౌండ్ ఫ్లోర్ లోనే డైనింగ్ హాల్ పక్కగా ఉన్న పెద్ద బెడ్ రూం, సాధారణంగా అతిధులకు ఇస్తుంటారు. అతనికి ఆ గదినే గెస్ట్ రూం గా కేటాయించారు. అతనికి ఆ గది చూపించి ఆ రాత్రి హాయిగా విశ్రాంతి తీస్కోమని చెప్పారు.

అతను కార్లో నుంచి మూడు పెద్ద పెద్ద సూట్ కేసులు దింపాడు.

తలా ఒక చేయి వేసి అతని సూట్ కేసులని గెస్ట్ రూంలోకి చేర్చారు. అతన్ని సేద తీరమని చెపుతూ "ఎప్పుడనంగా భోంచేశావో నాన్నా! కాస్త అన్నం తింటావా?" ఆప్యాయంగా పరామర్శించారు ఆవిడ.

"థాంక్స్ అమ్మా! నాకు ఆకలిగా ఏమి లేదు. బాగా రాత్రయిపోయింది కద.  మీరేమి అనుకోనంటే, కాస్తా వేడి పాలు ఒక గ్లాసెడు ఇవ్వండి చాలు తాగి పడుకుంటాను" అన్నాడు ఆ యువకుడు.

"అయ్యో అదేం భాగ్యం. నువ్వు కాళ్ళు మొహం కడుక్కుని సేద తీరు బాబు. నేను ఈ లోగా పాలు వేడిచేసి తీస్కుని వస్తాను" ఆవిడ చెప్పారు.

అహల్య అందరివంక చూసి ’గుడ్ నైట్’ అని చెప్పేసి తిరిగి మేడ మీదకి వెళ్ళిపోయింది.

బయట నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. ఉండుండి మెరుపులు, ఉరుములు వాతావరణాన్ని భయానకంగా మారుస్తున్నాయి.

ఎక్కడో మరో పిడుగు పడిన ధ్వని వినిపించింది. ఆ మోతకి ఒక్కసారిగా ప్రపంచం అంతా స్థంభించిపోయిన అనుభూతి. కాసేపు నిశ్శబ్దం.

తిరిగి మళ్ళీ వర్షం చప్పుడు వినిపించడం మొదలయింది

వంట గదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ పై పాలగిన్నె పెట్టి ఆవిడ పాలు కాస్తున్నంత సేపు నాగేశం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు నిశ్శబ్దంగా.

ఆయన మౌనానిని ప్రత్యేక కారణం లేదు.

ఓ అయిదు నిమిషాలలో ఆవిడ పాల గ్లాస్ తీస్కుని,  అనిల్ గది తలుపు పై మృదువుగా ’టక్ టక్’ మని చప్పుడు చేసి లోనికి ప్రవేశించింది.

మరి కాసేపట్లో ఆవిడ తిరిగి వచ్చింది డైనింగ్ టేబుల్ వద్దకు.

ఆవిడ కళ్ళలో ఒక ఉద్వేగం.

మాటల్లో చెప్పటానికి వీలు లెని ఏదో గుర్తు తెలియని భావాల పరంపర ఆమె వదనంలో.

గది బయటకు వచ్చే వరకు నింపాదిగా వచ్చిన ఆవిడ నడక తన వెనుకే తలుపు మూసేసి, డైనింగ్ టేబుల్ వద్దకు వడి వడిగా వచ్చేసింది.

ఆవిడ వంక చూస్తూ నాగేశం ’ఇక పడుకుందామా’ అన్నాడు

ఆవిడ ఆయన పక్కనే కుర్చీ లాక్కుని కూర్చుంటూ ఆయన చెవిలో గుస గుస గా చెప్పడం మొదలెట్టారు.

ఆవిడ కళ్ళలో ఒక విచిత్రమైన మెరుపు.

మొదట యధాలాపంగా వినడం మొదలెట్టిన నాగేశం ఆమె మాటలకి చివ్వున తలెత్తారు. ఆయన వదనం అంతా స్వేదంతో తడిసి పోయింది.

పెదాలు వణకడం మొదలెట్టాయి.

’తప్పుకద. అలా చేయవచ్చునా. తప్పుకద’

ఆయన గొణిగారు.

****

ఆ రాత్రి సరిగ్గా మూడు గంటల సమయంలో ఆ బంగ్లా నుంచి రెండు కార్లు బయలు దేరాయి. ఒకటి అనిల్ కారు. ఇంకోటి నాగేశం కారు.

అనిల్ కారులో అనిల్ కూర్చుని ఉన్నాడు కానీ డ్రైవింగ్ సీట్లో కాదు.  ముందరి సీట్లో విగతజీవుడిగా కూర్చుని ఉన్నాడు. ఆ కారుని డ్రైవ్ చేస్తున్నది నాగేశం.

వెనుకే నాగేశం కార్‍ని డ్రైవ్ చేస్తున్నది ఆయన శ్రీమతి. ఆ రెండు కార్లు విరిగిపోయిన బ్రిడ్జ్ వంక నెమ్మదిగా వెళుతున్నాయి. మొదట నాగేశం నడుపుతున్న కారు. ఆ వెనుకే ఆయన శ్రీమతి నడుపుతున్న కారు.

ఇవేవి తెలియని అహల్య ప్రశాంతంగా నిద్రపోతోంది మేడ మీద గదిలో.

మూడు శునకాలు జాగ్రత్తగా ఆ భవంతిని కాపాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాయి.

****

ఓ పాఠకుడా, అసలేం జరిగిందో తెల్సుకోవాలంటే ఒక మూడు గంటలు వెనక్కు వెళ్ళాలి.

 

డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న నాగేశం పక్కన కూర్చుంటూ విభ్రాంతితో చెప్పింది ఆవిడ

"ఏమండి  నేను గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయి మంచం మీద కూర్చుని తన సూట్‍కేసు తెరిచి ఉంచుకుని అందులో ఏదో సర్దుకుంటు ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి ఏ మాత్రం తడబడలేదు. ఆ సూట్ కేసు మూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ సూటుకేసు నిండా బంగారు బిస్కట్లు ఉన్నాయండి."

’నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాయించిన సంపదమ్మా ఇదంతా. ఇంకా ఈ రెండు సూట్‍కేసులలో కూడా విలువైన ఆభరణాలు, ధనం ఉన్నాయ’ ని  అమాయకంగా చేప్పేశాడు

అతను ముంబాయిలో వ్యాపారాలు అన్నీ కట్టేసి, తన స్వగ్రామానికి వెళుతున్నాడట. వాళ్ళ నాన్నగారు వ్యాపారంలో దెబ్బతిన్నారట. ఈ కుర్రాడు వెళ్ళి వాళ్ళ నాన్నగారికి సాయంగా ఉండటానికి వెళుతున్నాడట..

నా కైతే అదంతా ఏమీ నమ్మబుద్ది అవటం లేదు. ఈ కుర్రాడు పెద్ద దొంగ అనిపిస్తోంది. ఎక్కడో పెద్ద దోపిడీ చేసి దోచుకున్నధనాన్ని ఈ మూడు సూట్ కేసులనిండా తీస్కువెళుతున్నాడు అనిపిస్తోంది. నన్ను చూడంగానే ఏదో కథ చెబుతున్నాడు అనిపిస్తోంది.

నేను ఇచ్చిన పాల గ్లాస్ అందుకుని పాలు త్రాగుతూ హాయిగా కబుర్లు చెప్పాడు.

అతను పాలు త్రాగినంత సేపట్లో నా మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుందండీ.

మన కష్టాలన్నీ తీరిపోయే ఏకైక అవకాశం ఇది.

అతను మన అదృష్టం కొద్దీ మన ఇంటి గడపతొక్కి వచ్చాడు. అతనెవరో ఇక్కడ ఎవరికీ తెలియదు. అతను మన ఇంటికి వచ్చినట్టు కూడా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు.

పైగా వాడో పెద్ద దొంగ వెధవ అనిపిస్తోంది.  ఇంకో గంటా రెండు గంటలు గడిచాక నెమ్మదిగా మనం అతనిగదిలోకి వెళ్ళీ అతన్ని హతమారుద్దాం. ఆ తరువాత గట్లు తెగి పారుతున్న నదిలోకి అతన్ని అతని కారుతో సహా తోసేద్దాం. అతను కార్ ప్రమాదంలో చనిపోయాడనుకుంటారు ఎవరైనా. ఈ సంపద యావత్తు మన స్వంతమవుతుంది.

ఒకే ఒక్క సారి నీతి, న్యాయం, ధర్మం అనే మాటలు పక్కన పెట్టేద్దాం. పైగా వాడు ఏదో మహాత్ముడు అయినా కాకపోయే. వాడో పెద్ద గజదొంగ. అలాంటి వాడిని హతమార్చటం తప్పే కాదు. మనలాంటి మంచి వాళ్ళ దగ్గర ధనం ఉంటే సద్వినియోగం అవుతుంది. మనం ఇన్నాళ్ళు ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నామో ఆ భగవంతుడికి తెలుసు. అందుకే ఆయన మన కష్టాలని తీర్చటానికి ఈ అవకాశం కల్పించాడు.

ఇక మన కష్టాలు అన్నీ తీరిపోతాయి.

మీకు ఎలాగు మంచి పేరు ఉంది. మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అతనెవరో బాటసారి. అతనిపాటికి అతను ఎక్కడికో బయలుదేరాడు. కారు నడుపుకుంటు అలాగే ముందుకు వెళ్ళి తెలియక కూలిపోయిన బ్రిడ్జి మీద నుంచి కార్ తో సహా నదిలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

అతను మనింటికి వచ్చినట్టు, ఇక్కడ ఇలా ఆశ్రయం పొందినట్టు ఫాలాక్షుడికి కూడా తెలియదు ఈ చీకటి రాత్రి.

మన కష్టాలు కడతేరేందుకు ఇలా అదృష్టం మన తలుపుతట్టి వచ్చినట్టు నేను భావిస్తున్నాను.

మీరు మీనం మేషం లెక్కపెట్టుకుంటూ ఉంటే తెల్లారి పోతుంది. ఏమి చేసినా మనం ఇంకో గంటా రెండు గంటల్లో మన ప్లాన్ అమలు చేయాలి"

----

అనుకున్న ప్రకారం అనిల్‍ని స్టీరింగ్ ముందు కూర్చోబెట్టి కార్ డోర్ వేసేశాడు నాగేశం. కార్‍ని న్యూట్రల్ గేర్‍లో ఉంచాడు.

జరుగుతున్న ఘోరాన్ని మెరుపులు ఉరుములతో నిండిన ఆకాశం చూస్తూ ఉంది.

కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది.

తెగి పోయి పిల్లర్ మీద నుంచి  ఏటవాలుగా జారే బండలాగ ఉన్న రోడ్డు అంచున  కారుని తీసుకుని వచ్చి నిలబెట్టాడు. న్యూట్రల్ గేర్లో ఉన్న ఆ కార్ ని కొద్దిగా తోసేస్తే, ఓ ఇరవై అడుగులు దొర్లుకుంటూ వెళ్ళి, వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి పడిపోతుంది.

ఒక సారి చుట్టూ చూశాడు నాగేశం.

ఆ నిశీధిలో తమను ఎవ్వరూ చూసే అవకాశం లేదని ఆయనకి తెలుసు.

కానీ ఆయనకి తెలియదు, మనలోని మనస్సు భగవత్ స్వరూపం అని అన్నిటికీ సాక్షంగా చూసే అవకాశాన్ని భగవంతుడు ఆ రూపంగా పొందుతున్నాడని. అంతే కాదు, ఎవ్వరూ చూడలేదు అనుకున్న సమయాలలో కూడా భగవంతుని ప్రతిరూపాలైన పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయని ఆయనకి తెలియదు. ఈ పాటి ఙ్జానం అందరికీ ఉంటే ప్రపంచం లో ఇన్ని నేరాలే జరగవు కద.

ఆధ్యాత్మిక విద్య కరువై , స్వార్థమే ప్రధానం అనుకునే ప్రవృత్తే ప్రతి నేరానికి కారణం . ఇక్కడ కూడా అదే జరుగుతోంది. తనను ఎవ్వరూ చూడటం లేదని ఒక సారి నిర్ధారించుకున్న పిమ్మట, నెమ్మదిగా శ్రీమతి వంక చూశాడు. ఆమె ఆయనకి గొడుగు పట్టి ఉంది. తమ కారు ని దూరంగా రివర్స్ చేసి ఉంచింది అప్పటికే.

ఇప్పుడు వారి ప్రణాళికలో చివరి అంకానికి రంగం సిద్ధం అయ్యింది.

 

ఎప్పుడో చదివిన శ్రీశ్రీ కవితలో పంక్తులు గుర్తు వచ్చాయి ఆయనకి. ఆయన పెదాలు ఉఛ్చరిస్తున్నాయి

 

ఏది చీకటి ఏది వెలుతురు

ఏది జీవితమేది మృత్యువు

ఏది పుణ్యం ఏది పాపం

ఏది నరకం ఏది నాకం

ఏది సత్యం ఏదసత్యం

ఏదనిత్యం ఏది నిత్యం

ఏది ఏకం ఏదనేకం

ఏది కారణమేది కార్యం

ఓ మహాత్మా ఓ మహర్షి

 

ధైర్యాన్ని కూడగట్టుకుని, విరిగిపోయి ఏటవాలుగా ఉన్న బ్రిడ్జి రోడ్డుపై కార్‍ని వెనుకనుండి తోయటం మొదలెట్టాడు.

రోడ్డుపై ఉన్న తెల్లని గీత వెంబడి నెమ్మదిగా జారడం మొదలెట్టింది కారు.

విగతజీవుడిగా ఉన్న అనిల్ దేహం నిమిత్త మాత్రలా స్టీరింగ్ ముందు కూర్చునున్న భంగిమలో శూన్యంలోకి చూస్తోంది.

లిప్తపాటులో మెరిసిన మెరుపు కాంతిలో అతని కుడి చెంప మీద  చెవి పక్కగా ఉన్న బఠానిగింజ అంత మచ్చ చూశాడు నాగేశం.

ఆ పుట్టు మచ్చ ఒక క్షణం పాటు అతనిలో ఏదో అలజడి రేపింది. అది క్షణకాలం మాత్రమే.

అతనికి చాలా అశాంతిగా ఉంది.

కార్ అప్పటికే వారి అధీనంనుంచి దాటి పోయింది.

వాలు వెంబడి దొర్లుకుంటూ దబ్బుమని చప్పుడు చేస్తూ నీళ్ళలో పడటం , వేగంగ ప్రవహిస్తున్న ప్రవాహం లో కొట్టుకుని పోవడం క్షణం లో జరిగాయి.

వాతావరణం మరింత భయంకరంగా మారింది.

వర్షం హోరు పెరిగింది.

తమ ప్రణాళికలోని ఈ చివరి అంకపు ఈ దృశ్యాన్ని అ మసక చీకటిలో చూసి, ఒక క్షణం ఆలశ్యం చేయకుండా వెనుదిరిగారు ఆ దంపతులు.

***

వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది.

కార్ వాళ్ళ కాంపౌండ్ వాల్ వద్దకు వచ్చేసింది.

కార్ హెడ్‍లైట్స్ కాంతిలో కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ ఒక సారి గతుక్కుమన్నారు.

గేట్లు బార్లా తెరచి ఉన్నాయి.

వారికి బాగా గుర్తు తాము బ్రిడ్జి దిశగా వెళ్ళేటప్పుడు  గేట్లు మూసి వెళ్ళారు.  మరి ఇప్పుడు గేట్లు ఎందుకు తెరచి ఉన్నాయి?

కార్ గేట్లు దాటి తమ ఫార్మ్ హవుసు తాలూకు సిమెంట్ రోడ్డు మీదకి తెచ్చాడు నాగేశం.

కారాపి, వెళ్ళి గేట్లు మూసేసి మళ్ళీ కార్ నడపటం ప్రారంభించాడు.

వారిద్దరిని ఆశ్చర్య పరుస్తూ ఎదురుగా ఇంకో వాహనం తాలూకు హెడ్‍లైట్లు కనిపించాయి. అది ఎవరిదయింది అర్థం కాలేదు మొదట.

ఆ వాహనం క్రమంగా దగ్గరయింది.  అప్పుడు అర్థం అయింది వారికి అది పోలీస్ పెట్రోలింగ్ వాహనం అని. దానిపై నీలం ఎరుపు రంగు దీపాలు వెలిగి ఆరుతూ వింత శబ్దాలు చేస్తూ ఒక విధమైన భీతిని కల్గిస్తున్నాయి.

ఎదురుగా వచ్చిన ఆ వాహనం వారి పక్కగా వచ్చి ఆగింది.

పెట్రోలింగ్ వాహనంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వాహనం దిగి నాగేశం పక్కగా వచ్చి నిలబడి గ్రీట్ చేశాడు.

"మీ అబ్బాయిని గ్రీట్ చేద్దామని వచ్చాము, క్షేమంగా చేరాడా ఇల్లు?"

"అబ్బాయి ఏమిటి? నాగేశానికి అసలేం అర్థం కాలేదు. వాళ్ళబ్బాయి తన ఆరవ ఏట హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో తప్పిపోయి దాదాపు ఇరవై ఏళ్ళవుతోంది.

ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పుకుపోతున్నాడు

"నిన్న రాత్రి హైవే పై చెక్ పోస్ట్ వద్ద కనిపించి మీ చిరునామ ఇప్పించుకున్నాడు నావద్ద. ఎప్పుడో ఇరవై ఏళ్ళనాడు తన ఆరో ఏట తప్పి పోయిన మీ అబ్బాయి ఇప్పుడు ఇంత పెద్దవాడై వచ్చాడు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావటం అంటే ఇదే కద. మీ వాడు భలే మాటకారి సర్. ఇప్పుడు ముంబాయిలో చాలా పెద్ద బిజినెస్ మేన్ మీ వాడు.

నేను ఇటు వేపు పెట్రోలింగ్ కి వచ్చాను. ఎలానూ ఇంత దాకా వచ్చాను కద. మీ అందర్నీ కలిసి మీరు ఎలా ఆనందపడుతున్నారో చూద్దాం అని వచ్చాను. మీ వాడు తెల్లవారే దాకా మీకు అసలు విషయం చెప్పకుండా సర్‍ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాడట. ..........."

ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూనే ఉన్నాడు.

నోట మాట పెగలడం లేదు నాగేశం దంపతులకి.

దూరంగా మేలు జాతి శునకాలు బిగ్గరగా అరుస్తూ ఉన్నాయి.

వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది.

 

(రష్యన్ ఏకాంకి నాటిక ’లిథువేనియా’ ప్రేరణగా)

------

సమాప్తం.

 

Published in Sanchika.com on 13.03.2022 Sunday

https://sanchika.com/nireekshana-dr-vrp-story/