Tuesday, May 3, 2022

పుట్టపర్తి నారాయణచార్యులు గారు పంపారు, ఎదో వ్యాఖ్యానం వ్రాయాలట

ఇది 1983 నాటి మాట.

అయ్యగారు నాకు శ్రీశ్రీ మహాప్రస్థానం ఇచ్చి, ప్రతి పేజీ తర్వాత తెల్ల పేపర్ పెట్టి బైండింగ్ చేయించుకుని రమ్మని పంపారు. నేను నేరుగా కైలాస్ ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఆ పని చేసుకొచ్చాను.

అప్పట్లో అది కడపలో నంబర్ ఒన్ ప్రెస్.

నా వయసు అప్పుడు మహా అంటే పదహైదు. అయ్యగారి గొప్పదనం నాకింకా తెలియని వయసు.

పిల్లతనం కొద్దీ మోపెడ్ లో వెళ్ళటానికి ఒక సాకు దొరికింది అని వెళ్లాను, మా అప్ప దగ్గర ఒక టీవీఎస్ ఫిఫ్టీ మోపెడ్ ఉండేది.

కైలాస్ ప్రెస్ వారు ఇలాంటి చిన్న పని చెయ్యం అన్నారు, అప్పుడు చెప్పాను "శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు గారు పంపారు, ఎదో వ్యాఖ్యానం వ్రాయాలట "

అప్పుడు ఆయన దిగ్గున లేచి "మరి మొదటనే చెప్పకూడదా " అని, నాకు ఒక కుర్చీ వేసి, దాన్ని తుడిచి, నన్ను కూర్చోమని చెప్పి, క్షణాలలో పని మొదలెట్టారు.

దాని బైండింగ్ పిన్నులు తీసేసి, ప్రతి పేజీ కి మధ్య రెండు రెండు తెల్ల కాగితాలు వేసి క్షణం లో బైండింగ్ పని పూర్తి చేసి, సభక్తి పూర్వకంగా నా చేతికి ఇచ్చారు.

వారి ప్రవర్తన నాకు కొరుకుడు పడలేదు.

దాన్ని తీసుకుని అయ్యగారి దగ్గరకు వచ్చాను.

ఆయన నన్ను చాలా ఇష్ట పడే వారు. అరుగు మీద కూర్చొని ఉన్నారు ఆయన. 'దా కూర్చో ' అన్నారు.

నా వయసు, నా యోగ్యతా తెలిసినా, ఆయన గొప్పదనం తెలియక అయన పక్కన కూర్చున్నాను.

"ఒరేయ్, ఈ శ్రీ శ్రీ ఛందస్సు నడుము విరగగొట్టు అంటాడు కానీ, ఈ మహాప్రస్థానం అంతా ఛందోబద్దంగా వ్రాసాడు రా. అది నిరూపిస్తూ ఒక బుక్కు వ్రాస్తున్నాను. ఈ శ్రీశ్రీ కి ఛందస్సు మీద మంచి పట్టు ఉందిరా " అంటూ చాలా విషయాలు చెప్పారు. అవి నిజానికి తనలో తను మాట్లాడుకోవటం అనుకుంటా. నా వయసుకు ఆ మాటలు సగం అర్థం కాలేదు. కాకపోతే ఆ వయసులో నేను శ్రీ శ్రీ అభిమాని ని.

శ్రీశ్రీ ని పొగిడారు అన్నది ఒక్కటే అర్థం అయింది నాకు అప్పటికి.

ఇది అంతా గుర్తు వచ్చింది మీ మెసేజ్ చూడంగానే.

ఆ తరువాత ఆయన కొన్ని పేజీలు వ్రాసారు కానీ ఆ గ్రంధం పూర్తి అయినట్టు తోచలేదు నాకు.

 

No comments:

Post a Comment