Tuesday, May 3, 2022

ఆదోని పోస్టాఫీసు - ఆరెమ్మెస్

 ఆదోని పోస్టాఫీసు - ఆరెమ్మెస్

ఒక ఙ్జాపకం - 46

 

ఈ ఉదయం యధాలాపంగా యూట్యూబ్ వీడియోలు అలా తిరగేస్తుంటే, ఎస్ ఎస్ రాజమౌళీతొ ఇంటర్వ్యూ తారసపడింది. ఆసక్తిగా చూస్తుండిపోయాను కాసేపు. ఆయన తన బాల్యం గూర్చి చెప్పుకొస్తూ, కర్ణాటకలో తను పుట్టి పెరిగిన రాయచూరు జిల్లా గూర్చి, సినిమాలు చూడ్డానికి బళ్ళారి, వెళ్ళటం గూర్చి చెప్పుకొచ్చారు.  అయన మాటల్లో బళ్ళారి, సింధనూరు, రాయచూరు, ఆదోని ల గూర్చి వింటుంటే ఆనందం వేసింది.

ఈ ఊళ్ళన్నీ నేను తిరిగినవే. నవలాకారుల భాషలో చెప్పాలి అంటే,   నాకు తెలియకుండానే నా ఆలోచనలు గతంలోకి జారిపోయాయి.

 

ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్న ఙ్జాపకాలు దాదాపు 1987-92 ల మధ్య కాలంలోనివి.

ఈ కథనంలో, ఎలాంటి ట్విస్టులు, కొసమెరుపులు ఉండవు. ఇది ఒక ఙ్జాపకాల పరంపర అంతే. ఆ రోజుల గూర్చి, ఆదోని గూర్చీ, పోస్టల్ వ్యవస్థ గూర్చి తెలుసుకోవచ్చు. మీరు సరదాగ.

నేను డిగ్రీ చదువుకుంటున్న రోజులు అవి. నేను ఎందుకో కథలు విపరీతంగా వ్రాసే వాడిని ఆ రోజుల్లో.  ఆ రెండు మూడేళ్ళ కాలంలో నావి దాదాపు అరవై దాకా కథలు వెలుగు చూశాయి. ఆ తర్వాత 1992 లో ఇప్కా లాబొరేటరీస్ అనే కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా ఉద్యోగం లో చేరిన తర్వాత కెరియర్ మీద దృష్టి నిలపటం వల్లనుకుంటాను కలం పక్కన పెట్టేశాను. నేను నా ఉద్యోగ జీవితాన్ని మీడియతో గానీ, రచనలతో సంబంధం ఉండే రంగంతో గానీ  ముడి వేసి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో. ఏది మన చేతిలో లేదు కద.

ఆ తరువాత మళ్ళి 2015 లో ’హొగిన్నెక్కల్ జలపాతం’ కథ ద్వారా కథలు వ్రాయటం మొదలెట్టాను.

నా కథలకి ఆదోని ఆరెమ్మెస్ కి ఉన్న అనుబంధం గూర్చి చెబుతాను.

ఇక మనమందరం ఆదోనికి వెళదాం.

ఇది ఒక చిత్రమైన ఊరు. ఇది పేరుకు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ, కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో  కర్ణాటక సరిహద్దులు ఆవరించి ఉంటాయి. కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు, సింధనూరు పట్టణాలు ఆదోనికి అతి దగ్గరగా ఉంటాయి. ఈ కారణంగా ఇక్కడ కన్నడ భాష చాలా మందికి వచ్చు, తెలుగు అసలు రాని వారు కూడా ఇక్కడ మీకు తారస పడతారు. తెలుగునేలపైనే ఉన్నప్పటికీ , కర్ణాటక లో ఎక్కువ మంది భక్తులు ఉన్న శ్రీ రాఘవేంద్రస్వామి వారి మఠం మంత్రాలయం కూడా ఈ ఊరికి దగ్గరే. ఈ కారణంగా ఇక్కడ ఒక రకంగా కన్నడ భాష విస్తృతంగా వినిపిస్తుంది.

ఇంకా చిత్రమైన విషయం ఏమిటి అంటే  గుంటూరు జిల్లా, కృష్ణా , ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కష్టించే గుణం ఉన్న అనేక రైతు కుటుంబాలు , కర్ణాటకలోని ఈ సింధనూరు చుట్టుప్రక్కల భూములు కొనుక్కుని వాటిని సస్యశ్యామలమార్చి ఇక్కడే స్థిరపడ్డారు. కాస్తా చరిత్ర లోకి వెళితే, వాళ్ళు భూములు కొనుక్కునే నాటికి అవన్నీ ఇంచుమించు ఏమీ పండని బీడు భూములు. వారి అదృష్టవశాత్తు తుంగభద్ర డ్యాం తాలూకు ఎడమ కాలవ జలాలు ఆ తరువాత అందుబాటులోకి రావడం, వారి శ్రమ అంకిత భావం కూడా తోడవడం వల్ల వాళ్ళు అందరూ అక్కడ బంగారు పండిస్తున్నారు. యధాప్రకారం వారిని విమర్శించే వారు లేకపోలేదు. భూమి మాది, లాభం మీది అన్న విధంగా వారు విమర్శలు ఎదుర్కొంటు ఉంటారు. స్థానికులు మన ఈ తెలుగు వారిని ’క్యాంపుల వాళ్ళు’ అని పిలవటం కద్దు.

ప్రఖ్యాత సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళీ తన బాల్యం ఇక్కడే గడిచిందని చెబుతారు. వారి కుటుంబం ఈ ప్రాంతాలలో ఉండేవారని ఆయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. మరీ ఈ కోస్తా జిల్లాల ఆంధ్రులు అక్కడికి వెళ్ళాలి అంటే, ఆదోనిగుండానే వెళ్ళాలి. ఈ కారణంగా ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్టీసి బస్సులు విపరీతంగా వెళుతు కనిపిస్తాయి ఆదోనిలో.

ఇక ఆదోనిలో భాషల విషయానికి వస్తే ఒక విధమైన యాసతో కూడిన మరాటీ భాష, మార్వారీ భాష కూడా ఎక్కువ మంది మాట్లాడతారు ఇక్కడ.  ఉర్దూ భాష మాట్లాడే వారు కూడా ఎక్కువే ఇక్కడ. కారణం ఇస్లామ్ జనాభా కూడా ఎక్కువే ఈ ఊర్లో.నేను అక్కడ నివాసం ఉన్న సమయానికి, ఇది పోలీసు రికార్డుల ప్రకారం సున్నితమైన ప్రాంతం. అప్పటికి చాలా సంవత్సరాల నుంచి, హిందుమతం తాలూకు పండగల బహిరంగ ఊరేగింపులు, పెద్ద ఎత్తున  ఉత్సవాలు, వినాయక మండపాలు,నిమజ్జనాలు, దీపావళీ బాణసంచాపేల్చటాలు తదితర సరదాలపై నిషేధం ఉండేది, శాంతి భద్రతల దృష్ట్యా.   ముసుగులో గుద్దులాట ఎందుకు గానీ, కొన్నేళ్ళ క్రితం ఎప్పుడో ఇక్కడ ఒక సారి మతకలహాలు జరిగాయట. మా పెద్ద వాళ్ళు చెపుతూ ఉండే వారు. ఆ కారణంగా ఇక్కడ పోలీసులు హిందువులని ఒళ్ళు దగ్గరపెట్టుకుని పండగలని జరుపుకొమ్మని పురమాయించే వారు.

ఆదోని కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న ఒక పెద్ద దర్గా ఉంటుంది. కూరగాయల మార్కెట్‍కి ఇటుపక్క మహాయోగి లక్షమ్మ దేవాలయం , కళ్యాణ మండపం ఉంటాయి. ఈ దర్గా ఎదురుగా భాజా భజంత్రీలు మ్రోగించడం నిషేదం.  మా రెండో అక్కయ్య పెళ్ళి సందర్భంగా అనంతపురం నుంచి వచ్చిన వియ్యాలవారిని స్వాగతించటంలో భాగంగా మేళతాళాలతో మేము బస్సు వద్దకు వెళ్ళి వియ్యాలవారిని బస్సు దింపుకుంటున్నాము. అప్పుడే పెద్ద పెద్ద కేకలు వేస్తూ కొందరు ఇస్లాం సోదరులు వచ్చి తక్షణమే భాజా భజంత్రీలు ఆపమని చాలా సౌమ్యంగా చెపుతున్నాము అని, వారి మాట వినకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరిక కూడా ఒకటి జోడించారు. మా నాన్నగారు చాలా మంచి మనిషి, వివాదాలకు ఆమడ దూరాం ఉండాలి అనే తత్వం. ఆయన తక్షణమే వారి ’విన్నపాన్ని’ అమోదించి భజంత్రీలు ఆపించారు.  సరే కళ్యాణ మండపం లోపల భజంత్రీలు వాయించుకోండి అని దానపత్రం వ్రాసిచ్చినట్టు చెప్పి వెళ్ళిపోయారు ఇస్లాం సోదరులు.

ఈ మహాయోగి లక్షమ్మ గుడి గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈవిడ ఒక అవధూత , సమాధి చెందారు. ఈమెని భక్తులు అవ్వ అని , తొట్టి లక్షమ్మవ్వ అని, తిక్క లక్షమ్మ అని పిలుచుకుంటారు. ఆమె సశరీరురాలిగా ఉన్నప్పుడు ఆవిడ చూపిన మహిమలు అనేకమట. ఇప్పుడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆవిడ తాలూకు మహిమలు చవిచూస్తున్నామని భక్తులు చెపుతూ ఉంటారు. స్థానిక వ్యాపారవేత్త, మాజి ఎమ్. ఎల్.ఏ శ్రీ రాచోటి రామయ్య గారు ఈమెకి పెద్ద గుడి కట్టించాడు. స్థానిక ఆర్య వైశ్య సంఘం వారు కూడా ఈ గుడి అభివృద్దికి అనేక చర్యలు చేపడుతున్నారు అని విన్నాను. నాకు అప్పుడు తెలియలేదు కానీ, ఇటీవల వెళ్ళీనప్పుడు ఈ గుడిలో చాలా ప్రశాంతత అనుభవించాను. ఈ గుడిని దర్శించటానికి మా బంధువులు చాలామంది వివిధ ఊళ్ళ నుంచి వచ్చే వారు.

ఈ అవధూత / యోగిని కారణంగా ఆదోనిలో ఉన్న అనేక వ్యాపార సంస్థలకు అవ్వ అన్న పేరు పెట్టుకుంటారు. అవ్వ బ్యాంకు, అవ్వ కిరాణా స్టోర్ ఇలా అన్న మాట. ఆదొని ఆర్టీసీ డిపో సింబల్ కూడా ఈ అవ్వనే.

ఈ ఊళ్ళో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన  మరో పుణ్యక్షేత్రం ఎత్తైన రణమండల కొండలపైన వెలసిన ఆంజనేయస్వామి దేవాలయం. వర్షాకాలంలో అక్కడికి వెళ్ళటం ఒక మధురమైన అనుభూతి. శ్రావణమాసం అంతటా, ప్రత్యేకించి శ్రావణ శనివారాలు ఈ దేవాలయంలో పూజలు చాలా ఘనంగా జరుగుతాయి.

ఇక ఈ ఊరి గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అక్కడి ప్రకృతి సౌందర్యం గూర్చి. రాతి కొండలని అంత దగ్గరగా నేను ఎప్పుడూ చూసింది లేదు. ఆ ఊరికి నలువైపులా పెద్ద పెద్ద రాతి కొండలు ఉండేవి. చాలా ఎత్తైన ఆ కొండలు సాహసప్రవృతి ఉన్న వారికి చాలెంజ్ విసిరేవి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, సాధారణంగా కొండలపై వృక్షాలు,మొక్కలు పెరగడం సహజం కద, కానీ,  ఈ కొండలు పూర్తిగా రాతితో నిండి ఉండటం వల్ల ఒక్క వృక్షం కూడా కనిపించక పూర్తిగా కొన్నివందలాది అడుగుల ఎత్తుతో, టన్నుల కొద్ది ఏకశిలలతో కొండలు కనిపిస్తాయి. ఇది చూడవలసిన దృశ్యమే కానీ మాటలతో చెప్పేదానికి రాదు. ఇక వర్షాలు కూడా విపరీతంగా కురిసేవి ఆ రోజుల్లో. వర్షం కురిసేటప్పుడు తాత్కాలికంగా ఏర్పడ్డ జలపాతాలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఇక చలి కూడా ఎక్కువే ఆ ఊర్లో. నాకు ఆ ఊరు ఒక అద్భుతంగా గోచరించేది.

ఆదోనిని సెకండ్ బాంబే అని పిల్చే వారు. విస్తిర్ణంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా బాంబేలో ఒక చిన్న కాలనీ అంత కూడా ఉండదు ఈ ఊరు. మరి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే బ్రిటీష్ వారి జమానాలో ఇది ఒక పెద్ద ఆర్థికకూడలి గా ఉండి ,అన్ని వ్యాపారాలాకు కేంద్ర బిందువుగా ఉండేది అట. ఇప్పుడు అలా లేకున్నా, ఇక్కడి రైల్వే లైన్ చెన్నయ్ - ముంబాయి ప్రధాన నగరాలను కలుపుతూ ఉండటం వల్ల ఇప్పటికీ ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఇక్కడ పత్తి , పొద్దు తిరుగుడు పూలు ప్రధాన వ్యాపార పంటలు. గూగుల్ ఇచ్చిన ఙ్జానం ఏమిటి అంటె, ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో పత్తికి అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఆదోనిలోనే ఉందట.

ఇక నా కథల విషయానికి వస్తాను.

ఆ రోజుల్లో పోస్టాఫీస్ లతో, ఆర్ ఎం ఎస్ లతో అనుబంధం ఎక్కువ ఉండేది. కొరియర్ వ్యవస్థ ఇంకా అంత వ్యాప్తిలోకి రాలేదు.

మీకు ఆర్ ఎం ఎస్ అంటే తెలుసో లేదో. ఎందుకంటే ఇప్పుడు ఆరెమ్మెస్ వ్యవస్థ ఉందో లెదో కూడా నాకు తెలియదు. ఆరెమ్మెస్ వ్యవస్థ అంటే రైల్వే మెయిల్ సర్వీస్.

కాగితానికి ఒక పక్కనే కథ వ్రాసి, హామీ పత్రం జోడించి ఒక విధమైన సంపెంగ రంగు ఎనవలప్ లో ఈ కాగితాల్ని చక్కగా మడిచిపెట్టి సాయంత్రానికల్లా ఆదోని రైల్వే స్టేషన్ కి చేరుకునే వాడిని.

ఆదోని రైల్వే స్టేషన్ ఊరికి ఒక చివర ఉండేది.  మేము ఊరికి  ఇంకో చివర ఎమ్మిగనూరు రోడ్లో కాలనీలో ఆర్ట్స్ కాలేజికి ఎదురుగా  ఉండేవారం. .నేను సైకిల్ తొక్కుకుంటూ రైల్వే స్టేషన్ కి ఒక చివర ఉన్న ఈ ఆరెమ్మెస్ చేరుకునే వాడిని.  ఈ ఆరెమ్మెస్ పోస్టాఫీస్ లో ఇస్తే వేగంగా హైదారాబాద్ కి, బోంబాయికి ఉత్తరాలు చేరుతాయి అని ఒక విశ్వాసం. ఎందుకంటే ఇక ఆ ఉత్తరాలు రైలు ఎక్కటమే ఆలశ్యం.

ఆ కవర్ పైన ’ప్రెస్ మాటర్/ బుక్ పోస్ట్’ అని వ్రాసి, ఎనవలప్ ని బంకతో అతికించకుండా ఓపెన్ గానే పెట్టి వదిలేయ్యాలి. కథల బొత్తి ఈ కవర్ లోంచి బయటకి వచ్చేస్తుందేమో అని అనుమానం ఉండేది. ఒక వైపు మూలగా స్టాప్లర్ తో పిన్నును కొట్టే వాడిని, చట్టపరంగా అయితే కొట్ట కూడదు. అదొక నేరం చేసే వాడిని. ఎందుకు ఈ కక్కుర్తి అంటే కేవలం పావలా స్టాంప్ వేస్తే సరిపోతుంది ఇలా బుక్ పోస్ట్ అయితే. లేదంటే దాన్ని తూకం వేసి నాలుగు రూపాయలో అయిదు రూపాయలో వసూలు చేసే వారు. ఒకట్రెండు సార్లు అలా పంపించాను కూడా. ఎవరో మిత్రులు సలహా ఇస్తే అప్పటి నుండి బుక్ పోస్ట్ లో పంపటం సాధన్ చేసే వాడిని.

ఆ రోజుల్లో ఎడాపెడా వ్రాసే వాడిని. ప్రోలిఫిక్ రైటర్ అంటారు చూడండి అలాగన్న మాట. ఆ ఊపు ఉత్సాహం అలాగే ఆపకుండా కొనసాగించి ఉంటే ఎలా ఉండేదొ . నేను రిగ్రెట్ అయ్యే అంశం ఇదొక్కటే జీవితంలో.

ఆ రోజుల్లో ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో క్రైం కథ అని ఒక శీర్షికగా ఓ కథ వేసే వారు. ఆ శీర్షిక కింద నావి బోలెడు కథలు పడ్డాయి. నాకు ఎందుకో సరదా థ్రిల్లర్ జానర్ లో వ్రాయటం.

ఆంధ్రప్రభ వారపత్రికలో నావి కథలు రెగ్యులర్ గా వచ్చేవి. ఆకాశవాణి కడపకేంద్రం నుంచి నేనే చదవగా నా కంఠంతో కథలు ప్రసారం అయ్యేవి. అదొక థ్రిల్.

ప్రసవానంతరం స్త్రీలు ఒక విధమైన తృప్తిని అనుభవిస్తారట. ఆరెమ్మెస్ కి వచ్చి కవర్ పై స్టాంపులు అతికించి ఆ కవర్ ని కిటికి గుండా ఆరెమ్మెస్ ఆఫీస్ క్లర్క్ కీ ఇచ్చాక ఒక విధమైన నిశ్చింత ఏర్పడేది.అక్కడితో ఒక భారం దిగిపోయిన అనుభూతి కలిగేది.

సినిమాలు ఎక్కువగా చూసే వారికి, పసలపూడి వంశీ సినిమాలలో రైల్వే స్టేషన్ అనంగానే చూపించే నిలువుగా పాతిన కూచి మొన కలిగిన ఇనుప బద్దలు గుర్తుండే ఉంటాయి. అదిగో ఈ ఆరెమ్మెస్ అఫీస్ కిటికీ పక్కనే రైల్వే ప్లాట్ ఫాం తాలుకు ఇనుప బద్దలు ఉండేవి. ఆ బద్దలను ఓ రెండింటిని ఊడబెరికి ఎవరో మార్గం చేశారు. అలా రైలు దిగిన వారు టీటీఈ వరకు వెళ్ళకుండా ఇలా షార్ట్ కట్ లో బయటకు రావటానికి ఉపయోగపడుతుంది ఈ బద్దలు తొలగించటం వల్ల ఏర్పడ్డ ఖాళి.

అదిగో సరిగ్గా ఆ ఖాళీ గుండా నేను రైల్వే ప్లాట్ఫాం పైకి వెళ్ళే వాడిని. ఆ సమయంలో వచ్చే రైళ్ళు ఏవి ఉండని కారణంగా ప్లాట్ ఫాం చాలా ప్రశాంతంగా ఉండేది. ఊరి చివర ఉండటం వల్ల  స్టేషన్ చాలా ప్రశాంతంగా ఉండేది.  పశ్చిమాద్రిన కృంగుతున్న సూర్యుడు, పక్ష్జుల కిలకిలా రావాలు, పల్చటి గాలి తెరలు, ఎక్కడో దూరంగా గుడి నుంచి వినిపించే శ్రావ్యమైన భక్తి గీతాలు , మంచు తెరలు కమ్ముకుంటున్న చల్లటి వాతావరణం,  ప్రత్యేకమైన అనుభూతిని కలిగించేవి.

 తేలికైన మనస్సుతో చాలా సేపు అలా ప్లాట్ ఫాం మిద పచార్లు చేసి మళ్ళీ సైకిల్ ఎక్కి ఇంటికి వచ్చే వాడిని.

ఈ అదోని నేపథ్యంలో ఎవరైన  సినిమాలు తీస్తే కూడా చాలా బాగుంటుంది.

 

 

 

No comments:

Post a Comment