పుష్పగిరి
ఒక ఙ్జాపకం - 48
మనల్ని, మన జీవితాల్ని శాసించే ఒక మహత్తర శక్తి
ఉంది అని నమ్మితే కొన్ని సంఘటనల్ని మహిమలు
అని, అద్భుతాలు అని చెప్పుకుంటాం.
ఇవేవి నమ్మని వారు అవే సంఘటనలని యాధృచ్చికాలు అని తేలిగ్గా అనేస్తారు.
ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని వారు ఎలా
పరిగణీస్తారు అన్నది వారి వారి విశ్వాసాల బట్టి ఉంటుంది.
ఈ ఙ్జాపకం అలాంటిదే.
కాకపోతే నేను అది యాధృచ్చికం అనే నమ్మే మానసిక స్థితిలో ఉండినాను అప్పట్లో.
ఇప్పుడు తలచుకుంటే అది అద్భుతం అని నిశ్చయంగా చెప్పగలను.
ఇక విషయంలోకి వద్దాం.
కర్మ సిద్దాంతం అనే పదం ప్రత్యేకంగా తెలియకున్నా, మనం చేసే మంచి పనుల వల్ల మనకి తప్పక మంచి జరుగుతుందని నమ్మే
వాడిని. తదనుగుణంగానే ఉండేది నా జీవన విధానం. తెలిసి ఎవ్వరిని నొప్పించకూడదని,
చేయి చాచిన వారిని నిరాశపరచకుండా చేతనైనమేరకు నిష్కామకర్మగా సాయం
చేయాలనే నియమాలని పాటిస్తూ ఉండేవాడిని.
సరదాగా ఒక ఆదివారం స్కూటర్ల మీద పుష్పగిరి మఠంకి వెళదాం అని బయలుదేరాం నేను మా
మిత్రుడు భాస్కర్. నాకు పెళ్ళయిన కొత్తలు అవి. భాస్కర్ కింకా పెళ్ళి కాలేదు
అప్పటికి.
నా వద్ద కైనెటిక్ హోండా స్కూటర్ ఉండేది. అతని వద్ద బజాజ్ చేతక్ ఉండేది. కడప
గాడిచర్ల రామారావు వీధిలోఉండేది మా ఇల్లు. మా ఇంటి మీదనే వెళ్ళాలి పుష్పగిరికి
వెళ్ళాలంటే. ఉదయాన్నే భాస్కర్, భాస్కర్ వాళ్ళ
నాన్నగారు శ్రీ కాంతారావు గారు
వచ్చేశారు. లాంచన పరిచయాలు, టీలు , స్నాక్స్ ముగిసాక, మేము
బయలుదేరాము.
నేను మా శ్రీమతి కైనెటిక్ హోండాపై, వారిద్దరూ వారి బజాజ్ చేతక్ పై
బయలుదేరాం. బిల్టప్ జంక్షన్ వద్ద ఎడం వేపుకి తిరిగి హైదరాబాద్ హైవేపై సాగిపోతోంది మా ప్రయాణం,
ఇది 1995
ప్రాంతాలలో జరిగినట్టు గుర్తు.
పుష్పగిరి
మఠానికి రెండు మార్గాలలో వెళ్ళవచ్చనుకుంటాను. నాకు ఇప్పటికీ సరయిన అవగాహన లేదు.
చెన్నూరు రాక
ముందే ఎడమ వైపు మలుపుతీసుకుని మట్టి బాటలో
ప్రయాణం చేసి వాహనాల్ని ఆపేసి, పెన్నా నదిలో నడుచుకుంటూ వెళ్ళి
గుడి చేరుకోవాలి. ఇది ఒక్కటే నాకు తెలిసిన మార్గం. కడప వైపు నుంచి వచ్చే
వారికి ఇది దగ్గరి దారి. కానీ ప్రమాదభరితమైనది.
ఎందుకంటే, ఈ మార్గంలో వెళ్ళి నది దాటేటప్పుడు ఊబిలో
ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయి. అలా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన
వారున్నారుట.
కానీ ఈ విషయాలు
ఏవీ మాకు తెలియదు అప్పటికి.
హైవే మీద
ప్రొద్దటూరుకి వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు పుష్పగిరి మఠం తాలూకు ఆర్చి చూసి ఉండటం
వల్ల ఇదే అసలు మార్గం అని అనుకున్నాం. ఆ ఇంకో మార్గానికి ఆర్చి ఉన్నట్టు నాకు
గుర్తు లేదు, అసలు ఇంకో మార్గం
ఉన్నట్టు నాకు తెలియదు.
మాకు దారి తెలుసు
అనే ఆత్మ విశ్వాసం ఉండటం వల్ల ఎవ్వర్నీ అడిగి సరి అయిన దారి కనుక్కునే ప్రయత్నం
చేయలేదు, బయలుదేరే
ముందు.
సరే ఆర్చి గుండా
ప్రయాణించి నది ఒడ్డుకు చేరుకున్నాము. అది పేరుకు నదే కానీ అందులో అరుదుగా నీరు
ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడన్నా అరుదుగా చిన్న పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది.
కడప జిల్లా
వారికి ఇది సాధారణ దృశ్యమే. నదుల్లో నీరు ఉండదు, రైతుల కళ్ళలో కన్నీరు ఉంటుంది.
ఎండిపోయిన పొలాలు, ఎకరాల కొద్దీ బీడు పడిన భూములు, కనుచూపు మేరా కలికానికైనా కనిపించని పచ్చదనం, చాలనిదానికి
భూమిలో ఉండే కొద్దోగొప్పో తేమని పీల్చేసేదానికి రాక్షసి మొక్క సర్కారు తుమ్మ
విస్తారంగా కనిపించేది.
ఇది రాయలసీమలో
సాధారణంగా కనిపించే దృశ్యం. ఎక్కడో అదృష్టవంతుల పొలాలలో బోరుబావుల్లో నీరు
పడుతుంది. మిగతావారికి అది కూడా దక్కదు.
నేను కేరళ, తమిళనాడు, మన కోనసీమ,
షిమోగా, దేశంలోని ఇతర సస్యశ్యామల ప్రాంతాలకు
వృత్తిరిత్యా వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతిని పచ్చదనాన్ని చూసి ఆనందించలేకపోయాను.
నిజం చెపుతున్నాను, కన్నీళ్ళు పెట్టుకున్నాను. భగవంతుడా
రాయలసీమ జిల్లాలని ఎందుకు చిన్నచూపు చూశావు, మేము నీ బిడ్డలం
కామా అని ఏడ్చేశాను. ఇది అసూయ కాదు. నా
సీమ రైతులకెందుకు ఈ కష్టాలు అనే వేదన.
నాకు పెన్నా
నదితో అనుబంధం విడదీయరానిది. కడపలో, తాడిపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి వెనుక,, జమ్మలమడుగులో, మైలవరం రిజర్వాయర్ వద్ద, గండికోట వద్ద, నెల్లూరు జిల్ల జొన్నవాడ వద్ద, బద్వేలు వెళ్ళే
దారిలో, నెల్లూరు రంగనాథ స్వామి గుడి వెనుక, లో ఇలా వివిధ ప్రాంతాలలో నాకు పెన్నతో ఙ్జాపకాలు ఉన్నాయి.
తాడిపత్రిలో
గాజుల కిష్టయ్య వీధి చివరి దాకా వెళ్ళి, చిన్మయా స్కూలు పక్కనున్న ఇరుకు మార్గం గుండావెళ్ళి ఎండిపోయిన పెన్ననది
ఒడిలో ఇసుకలో కాస్తా తవ్వి తవ్వంగానే తియ్యటి చెలమలు ఏర్పడేవి. ఆ నీటిని ఆనందంగా
తాగే వారం. అప్పడు నా వయసు మహా అంటే ఎనిమిదేళ్ళు ఉంటాయి. మా నౌకర్లతో పంపేది మా
అమ్మ నన్ను నదీ తీరానికి.
అదే విధంగా
జమ్మలమడుగులో కూడా చెలమలు తవ్వి నీళ్ళు త్రాగిన అనుభూతులు ఇంకా ఙ్జాపకం ఉన్నాయి
నాకు.
నందలూరు దాటాక
వచ్చే చెయ్యేరు, గండి క్షేత్రంలో
తారస పడే పాపాఘ్ని ఇలా దాని ఉపనదులు కూడా పరిచయమే.
కర్ణాటకలోని చిక్
బళ్ళాపూర్ వద్ద ఉన్న నంది కొండలలో పుట్టి, అనంతపురం, కడపల మీదుగా నెల్లూరు వద్ద బంగాళాఖాతంలో
కలిసే ఈ పెన్నా నదిలో నిత్యం ఏమీ నీళ్ళు ఉండవు. ఎగువ ప్రాంతాలలో ఎక్కడైనా పెద్ద వర్షాలు కురిస్తే, పెన్నా నదిలో నీళ్ళు ఉంటాయి.
కర్నూలు జిల్ల ఓర్వకల్లు మండలంలో పుట్టే కుందేరు (కుందూ నది) ఈ పెన్నకి ఉపనది. ఈ
కుందూనదిని నంద్యాల దుఃఖదాయని అంటారు. కోయిలకుంట్ల, నంద్యాల
ప్రాంతాలని హటాత్తుగా ముంచెత్తే దుర్గుణం ఈ కుందునది స్వంతం. నల్లమల అడవులు,
కొండలనుండి కాస్తా వర్షం రాగానే, ఊహించని
విధంగా వరదలాగా వచ్చేస్తాయి ఈ కుందూ నదికి నీరు. సైలెంట్ కిల్లర్ అని, ది మోస్ట్ డేంజరస్ రివర్ అని కూడా పేరు ఈ కుందూ నదికి. ఉపనది అయిన కుందూ
నదికి వరదవచ్చిన సందర్భాలలో కూడా పెన్నా
నదికి హటాత్తుగా నీరువచ్చేస్తాయి.
మాకు అప్పటికి ఈ
విషయాలు ఏవీ తెలియవు. అఙ్జానమే ఆనందం అంటారు కద. అలా ఆనందంగా నది దాటటానికి
ఉద్యుక్తులం అయి నది ఒడ్డున మా స్కూటర్లను ఆపుకున్నాము.
భాస్కర్ నాకు
చాలా ఆప్తుడైన మిత్రుడు. మా ఇద్దరినీ కలిపే ఒక ప్రధాన గుణం హాస్యప్రియత్వం. ఎలాంటి
పరిస్థితిలోకూడా ఆందోళనపడకుండా నింపాదిగా
ఉండగలగడం, నవ్వుతు, నవ్విస్తూ
ఉండటం అతనిలో నాకు నచ్చే గుణం.
’మేము కోబ్రాలం’
అన్నాడు ఒక సారి హఠాత్తుగా. నాకేమీ అర్థం కాలేదు. తెల్లమొహం వేశాను. తనే నవ్వి
మళ్ళీ వివరించాడు, ’మేం
కోస్తా బ్రాహ్మలం’ అని. వారు నిజానికి
కోస్తాంధ్రా ప్రాంతాలకు చెందిన వారు. కానీ అనంతపురంలో స్థిరపడి ఇక్కడి ప్రాంతాలతో
మమేకం అయ్యారు.
పుష్పగిరి పీఠం
గూర్చి భాస్కర్ వాళ్ళ నాన్నగారు భక్తిభావనతో మాకు వివరాలు చెబుతున్నారు. ఆయన
చెప్పిన వివరాలు నాకు బాగా గురుతు ఉన్నాయి.
ఈ పుష్పగిరి
క్షేత్రం లోని దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మింపబడింది. ఈ క్షేత్రం తాలుకూ స్థల
పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విష్టుదేవుని వాహనం అయిన గరుడపక్షి తన తల్లిని
కాపాడుకునే నిమిత్తం అమృతభాండం తీస్కుని వెళుతున్నప్పుడు కొన్ని చుక్కల అమృతం
ఇక్కడ ఒక సరస్సులో పడ్డాయట. ఈ కోనేట్లో స్నానం ఆచరించిన వారు నిత్య యవ్వనులుగా, నిత్య ఆరొగ్యంతో ఉంటారని ప్రతీతి అట.
ఇక్కడ శైవ, వైష్ణవ దేవాలయాలు రెండు అతి సమీపంలో
ఉన్నాయి. ఇక్కడి శిల్పసంపద అపురూపంగా ఉంటుంది.
మేము ఆ నది
ఒడ్డుకు చేరేటప్పటికి ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర అవుతూ ఉంది. సూర్యుడు అప్పటికే
తన ప్రతాపం చూపిస్తున్నాడు.
వేడి గాలి
మెల్లిగా వీస్తోంది. అక్కడక్కడా మబ్బు తునకలున్న నీలి రంగు ఆకాశం ప్రశాంతంగా ఉంది.
రాయలసీమ యావత్తు నీటి కట కటతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పుష్పగిరి క్షెత్రం చుట్టూ
భూగర్భజలాలు చాలా సమృద్దిగా ఉండటం విశేషం. ఇక్కడ వరిపొలాలు విశేషంగా
కనిపిస్తున్నాయి ఎటు చూసినా.
ఎదురుగా ఇసుక
కనిపిస్తూ విశాలంగా పెన్నా నది. అక్కడక్కడా చిన్న నీటి పాయలు పారుతున్నాయి. వాటిని
సునాయాసంగా దాటవచ్చు అని అంచనా వేశాము, పెద్దగా లోతేమీ లేదని తెలుస్తోంది కంటికి .
ఎక్కడా మనుష్య
సంచారం లేదు. దూరంగా ఒక చిన్న నది పాయ వద్ద ఒక అమ్మాయి బట్టలు ఉతుక్కుంటు
కనిపించింది.
మా రాకను గమనించి, ఆమె బట్టలు ఉతకటం ఆపేసి, మా వంక ఆసక్తి గా చూడటం ప్రారంభించింది. మేము ఎప్పుడైతె స్కూటర్లు ఆపి,
ఇసుకలో కాలు మోపి నడవటం ప్రారంభించామో ఆ అమ్మాయి సర్పదష్టలా కంగారు
కంగారు గా కేకలు పెట్టడం ప్రారంభించింది.
అంత దూరం నుంచి ఆ
అమ్మాయి మాటలు మాకు స్పష్టంగా వినిపించకున్నా ఏదో ప్రమాదాన్నయితే శంకించాము. ఆమె
గాల్లోకి చేతులు విసురుతూ చాలా ఆందోళనగా మమ్మల్ని ఆగమని చెబుతోంది. మాకు విషయం
అర్థం కాలేదు.
మా మిత్రుడు
భాస్కర్ ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుని ఒక జోక్ వేస్తాడు. అతడు కూడా ఆ అమ్మాయి
ఆందోళనని గమనించి, నిశ్శబ్దంగా
ఆగిపోయాడు జోక్స్ కట్టిపెట్టి. మమ్మల్ని ఆగమని చెప్పిన , ఆ
అమ్మాయి ఒక వృద్దుడిని మా వద్దకు పంపింది. అతడు అవసరమైన దానికన్నా ఎక్కువ
జాగ్రత్తగా నది నీళ్ళలో నడచుకుంటూ వచ్చి మా ఎదుట నిలిచాడు.
కావి రంగు పంచ
గోచి పోసి కట్టాడు. కావి రంగు ముతక చొక్కా ధరించి ఉన్నాడు అతడు. వయస్సు డైబ్బై
దాకా ఉంటుంది. అతడేమి మాట్లాడటం లేదు ఎక్కువ. అతని శరీరం నల్లగా ఉండి, తలమీద తెల్లటి జుత్తు పల్చగా ఉంది, చేతులమీద జుత్తు , మీసాలు, పల్చటి
గడ్డం, తెల్లరంగులో ఉన్నాయి.
అతని కళ్ళలో ఏదో
మెరుపు ఉంది. కొంతమంది పల్లెటూరి వారు అడ్డు అదుపు లేకుండా పెద్ద గొంతుతో
మాట్లాడటం చూస్తుంటాం. కానీ అతడు చాలా ముభావి. అతను ఎలాంటి అలసట లేకుండా
జింకపిల్లలా ఉత్సాహంగా ఉన్నాడు.
’ఎవరు మీరు?’ అన్న ప్రశ్నని కనుబొమలు ఎగరేయటం ద్వారా
సంధించాడు. దేశంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులను నిలదీసి ప్రశ్నిస్తున్న
సరిహద్దు కాపలా సైనికుడిలో ఉండే గాంభిర్యం అతనిలో కనిపించింది మాకు.
మా పరిచయాలు
పూర్తయ్యాక మేము పుష్పగిరి గుడిని చూడాలని వచ్చామని తెలుసుకుని ’అఘోరించారులే’
అన్నట్టు ఒక చూపు మా వైపు విసిరి ’సరే నా వెంబడి జాగ్రత్తగా రండి, అటూ ఇటూ అడుగు వేయవద్దు’ అని నడవడం
ప్రారంభించాడు.
యుద్దభూమిలో
లాండ్ మైన్స్ పై అడుగుపడకుండా నడిచే సుశిక్షితుడైన సైనికుడిలా నడుస్తున్న అతని
వెంబడి మేము కూడా బుద్ధిమంతులైన విద్యార్థులలాగా నడవటం ప్రారంభించాము.
అవతల ఒడ్డుకి
చేరాక అతను అన్నాడు "తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే వచ్చిన దారిన తిన్నగా
వెళ్ళండి. అటు ఇటూ అడుగు వేయకండి" అని.
’ఎందుకు ఇంత
ఓవరాక్షన్ చేస్తున్నావ్?’ అన్న
అర్థం వచ్చేలా మా మిత్రుడు భాస్కర్ అతన్ని ప్రశ్నించనే ప్రశ్నించాడు. మా భాస్కర్
అంతసేపు మౌనంగా ఉండటమే విశేషం.
అప్పుడు చెప్పాడు
ఆ వృద్ధుడు. ’మీరు ఈ దారిలో రావడం చాలా పొరపాటు అయింది. ఈ దారంతా ఊబులున్నాయి.
దర్శనం అయ్యాక తిన్నగా వచ్చిన దారిలో వెళ్ళిపోండి. ప్రమాదంలో పడకండి"
నిజానికి మేము
అతని మాటలకు పెద్ద విలువ ఇవ్వలేదు. మమ్మల్ని భయపెట్టి డబ్బులు రాబట్టటానికి ఇలా
డ్రామా ఆడుతున్నాడేమో అని కూడా అనుమాన పడ్దాం.
గుడి చూశాము. దర్శనం
బాగా జరిగింది. అక్కడి శిల్ప సంపదని చూసి మాటలు రాలేదు. నాకు అనిపించిన మాటలు
యధాతథంగా చెప్పనివ్వండి. ఇదే గుడి, ఇలాంటి శిల్ప సంపదతో ఏ తమిళనాడులోనో, కేరళలోనో
ఉండుంటే దీనికి విస్తృతమైన ఖ్యాతి వచ్చి ఉండేది ఏమో అని.
సరే గుళ్ళు రెండింటినీ, పుష్పగిరి
పీఠాన్ని సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యాం. తెలుగునేలపై ఆది శంకరాచార్యులవారి
ఆశీస్సులతో నెలకొల్పబడ్డ పీఠం ఇదొక్కటే అంటారు. సాక్షాత్తు శంకరాచార్యులవారు
నడయాడారట ఇక్కడ.
మేము అక్కడ ఓ రెండు
మూడు గంటలు గడిపి ఉంటామేమో. తిరుగు ప్రయాణంలో నది ఒడ్డుకు వచ్చినప్పుడు ఎక్కడే
గానీ మనుష్య సంచారం లేదు. ఇందాకటి వృద్ధుడుగానీ, బట్టలు ఉతుక్కుంటున్న ఆ అమ్మాయిగానీ మాకు ఎక్కడా కనిపించలేదు.
ఎందుకయినా మంచిది అని చెప్పి, ఆ ముసలాయన ఇచ్చిన హెచ్చరిక
మేరకు, మేము అత్యంత జాగ్రత్తతో అడుగులో అడుగు వేసుకుంటూ
వచ్చిన దారినే బ్రతుకు జీవుడా అని నడచి వచ్చి అవతలి ఒడ్డున మా స్కూటర్లను
చేరుకున్నాము.
ఆ ముసలాయన ఎవరూ, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది , నాకు ఇప్పటికీ
ఆశ్చర్యమే.
***
ఈ సంఘటన జరిగిన కొన్ని
నెలలకు, కడప జిల్లాకి చెందిన డాక్టర్. గ్రేస్
నిర్మల గారి భర్త, కుమారుడు సరిగ్గా ఈ ప్రాంతాలలోనే ఊబిలొ
చిక్కుకుని అక్కడికక్కడే మరణించడం గమనార్హం.
మేం బ్రతికి బయట పడటం
యాధృచ్చికం అని అప్పుడనుకున్నాను.
మమ్మల్ని కాపాడింది
దైవశక్తి అని ఇప్పుడు బలంగా నమ్ముతున్నాను.
---సమాప్తం----
No comments:
Post a Comment