సద్గురు దర్శనం
ఒక ఙ్జాపకం - 31
"టెల్ మీ యువర్ ఫ్రెండ్ , ఐ విల్ టెల్ యూ" అని .
అలా చెప్పుకుంటూ పోతే ఉత్తమ మిత్రులు నాకు చాలా మంది ఉన్నారు. కాబట్టి కంగారు
పడిపోయి మీరు నన్ను కూడా గొప్పవాడిగా జమ కట్టేయకండి. నేను అతి సామాన్యుడిని.
కాకపోతే నాకు ఏ దురలవాట్లు లేవు, నూటికి నూరు పాళ్ళు శాకాహారిని, మరీ హరిశ్చంద్రుడిని
అని చెప్పను గానీ అబద్దాలు ఆడను. తెలిసి ఎవ్వరికీ హాని చెయ్యను. ఇలా కొన్ని
సుగుణాలు ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే ఈ సుగుణాలు చూస్కుని విర్రవీగి పోయే వాడిని,
ఓ పదేళ్ళ క్రితం వరకు. కాని నాకు కళ్ళు ఎలా తెరచుకున్నాయో చెబుతాను.
ఓ పదేళ్ళ క్రితం కులకర్ణి అనె మిత్రుడు నన్ను ఉప్పల్ లో ఉంటున్న ఒక
సద్గురువుకు పరిచయం చేశారు. వారి పేరు ’నిటుర్కర్ హరి బాహు జోషి’ అన్నట్టు గుర్తు.
ఆయన ’శ్రీ పాద శ్రీవల్లభ చరితామృతం’ ని మరాఠీ భాషలోకి అనువదించారు. వారు ప్రతి
పౌర్ణమికి ప్రత్యేక ప్రవచనం చెబుతారని కూడా మా మిత్రుడు తెలిపాడు. నేను వారిని
కేవలం ఒక్కసారి మాత్రమే దర్శించాను. ఆ తర్వాత ’మళ్ళీ వెళ్ళాలి ఒకసారి’ అనుకుంటూనే
కాలం గడిచిపోతోంది.
వారిని మొదటి సారి చూసినప్పుడు నిజం చెప్పొద్దూ "ఈయనేమిటి ఇంత సింపుల్ గా
ఉన్నారే" అని అనుకున్నాను.
ఆయనేదో కాషాయవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని ఏమి లేరు. మాములుగా తెల్ల
కుర్తా, పైజామ ధరించి ఉన్నారు.
కాకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వారి వదనంలో తేజస్సు. ప్రశాంతమైన చిరునవ్వు.
ఆయన ఇంతకూ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అట. ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది మన చాగంటి
కోటేశ్వరరావు గారి లాగా అనుకుంటా. మహారాష్ట్రా లో ఈయనకి చాలా మంది శిష్యులు
ఉన్నారట. వీరి ప్రవచనాలు మరాఠీ టీవీల్లో రెగ్యులర్ గా వస్తాయట.
నేను, మా శ్రీమతి ఇద్దరం, కులకర్ణి గారితో కలిసి వెళ్ళాము. నిజానికి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం
అనే తెలుగు పుస్తకం గుర్చి మొదటి సారిగా విన్నది శ్రీ కులకర్ణిగారి నుంచే. నా
ఆసక్తి గమనించి నాకు ఆ పుస్తకాన్ని బహుమతి గా తెచ్చిచ్చాడు ఆయన . ఆ పుస్తకం చదివి
నేను చాలా ఉత్తేజితుడు అవడం గమనించి, "ఈ గ్రంధాన్ని
మరాఠీలోకి అనువదించిన ఒక సద్గురువుగారు ఉన్నారు.వారి దర్శనానికి వెళదాము
రండి" అని ఉత్సాహ పరచి వారి వద్దకు తీసుకువెళ్ళిన పుణ్యంకూడా శ్రీ కులకర్ణి
గారిదే.
మా మిత్రుడు కులకర్ణి గారికి గురువుగారితో చుట్టరికం కూడా ఉందనుకుంటా. వారిని
"కాకా" అని వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి చనువుగా వెళ్ళిపోయాడు. వారి
వద్ద ఆయనకు బాగా చనువు ఉంది అనుకుంటాను. అంత మంది భక్తులు అక్కడ బయటే వారి దర్శనం
కొరకు ఎదురుచూస్తున్నా మమ్మల్ని నేరుగా వారి ఇంట్లోకి తీసుకువెళ్ళారు.
"ఈయన మా బాస్, ఈయన రాయల్ సంస్థకి అధినేత, ఈవిడ వారి శ్రీమతి" అంటూ పరిచయం చేశాడు కులకర్ణి. నిజానికి అతను మా
ఇన్స్టిట్యూట్ లో సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్. తక్కువ టైం లో ఎక్కువ మంది
విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నాడు. అతను ఎంప్లాయిగా పని చేస్తున్నప్పటికి
అతన్ని నేను మిత్రుడుగానే ఎక్కువ గౌరవిస్తాను.
మంచి మిత్రులు మన ప్రాప్తత బట్టి లభిస్తారు అని నేను బలంగా విశ్వసిస్తాను.
కులకర్ణిగారి లాంటి వ్యక్తులు అరుదుగా లభిస్తారు. ఆయన వినయమే ఆయన ఆభరణం. వాళ్ళ
నాన్నగారు ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ డైరెక్టర్ స్థాయిలో పని చేసి రిటైర్
అయ్యారు. వారి కుటుంబం మొత్తం సింప్లిసిటీ కి నిలువెత్తు నిదర్శనం లాగా ఉంటారు.
ఆడంబరమైన మాటలు, హడావుడిగా ప్రవర్తన వారికి
ఆమడ దూరం.
సరే మేము నేరుగా సద్గురువు గారి ఇంటిలోకి వెళ్ళిపోయాము, కులకర్ణిగారి పుణ్యమా అని. ఆయన ఒక కుర్చీలో
కూర్చుని ఉన్నారు.
మమ్మల్ని కూర్చోమని చిరునవ్వుతో ఎదురుగా ఉన్నకుర్చీలు చూపిస్తూ చెప్పారు.
నాకు బుర్ర కాస్త పని చేసింది. ’వద్దు వద్దు’ అని ఆయన ఎదురుగా నేలపై
కూర్చున్నాను. నాతో పాటే మా శ్రీమతి. అప్పటికే కులకర్ణి గారు ఆయన పాదాల వద్ద
సెటిల్ అయ్యారు.
ప్రశాంతమైన వదనంతో ’చెప్పండి’ అన్నారు ఆయన. కళ్ళు మాట్లాడటమంటే ఏమిటో, దయ వర్షించటం అంటే ఏమిటో మరొక సారి
అనుభవమైంది నాకు. దత్తాత్రేయ కృప వల్ల నాకు ఇదివరకు కూడా సద్గురువులని
దర్శించుకునే ప్రాప్తత కలిగి ఉండింది.
ఆయన సమక్షంలో మనసు ప్రశాంతతని అనుభవిస్తోంది.
కాని చెప్పాను కద నాలో అహం ఉండేది అని.
’ఏమి ప్రత్యేక కోరికలు అడగటానికి రాలేదండి. మిమ్మల్ని ఊరికే చూసి పోదామని
వచ్చాము" అని నాదైన బాణిలో అహం ప్రదర్శించాను.
ఆయన అదే దయ వర్షిస్తూ " మీ గురించి చెప్పండి" అన్నారు
"నాకు ఏ దురలవాట్లూ లేవు. పూర్తిగా శాకాహారిని. తెలిసి ఎవరికి చెడుపు
చేయను. చేతనయినంతవరకు ఇతరులకు సహాయం చేస్తాను" అంటూ ఒక విధమైన అతిశయంతో ఆయన
వంక చూశాను. చెప్పాను కద నాలో అఙ్జానం పాలు అధికం అని. అఙ్జానం యొక్క బాహ్య ప్రకటననే
అహంకారం అని ఆ రోజు తెలుసుకున్నాను. ఆయనేదో నన్ను గూర్చి చాలా ఉత్తమంగా ఆలోచించాలి
అన్న అహం నాలో ఉండి పోయిందనుకుంటాను.
వారికి తెలుగు వచ్చు. మా సంభాషణ యావత్తు తెలుగులోనే సాగిపోతోంది.
అప్పుడాయన ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా "అది మానవత్వం" అనేసి చిరునవ్వు
నవ్వుతూ ఉండి పోయారు. ఒక అఙ్జానికి చూసి ఙ్జాని నవ్వేలాంటి నవ్వు అది. నాకు నాలోని
అతిశయం అర్థం అయింది.
ఆయన పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఏమి ఇవ్వలేదు. నాకు ఆత్మబోధ జరిగింది. ’మీ ప్రవర్తన ఇలా ఉండటం మంచిదే. కాని అది
మానవత్వం. అంతకు తక్కువగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే అది రాక్షసత్వం, అంతకు మించి మీరు ప్రవర్తిస్తూ ఉంటె అది దైవీ గుణం. కాబట్టి మీరు సరిగ్గా
ఒక మనిషి ఎలా ఉండాలో అలా ఉన్నారు." అన్న సందేసం నాకు లభించింది.
"నీ పేరేంటమ్మా" అని అడిగారు మా శ్రీమతిని. ఇంకా ఏవో ప్రశ్నలు వేశాడు.
ఆమె వినయంగా తూచినట్టు సమాధానాలు చెప్పింది. ఎక్కడైనా కూడా ఆమె పద్దతి అదే.
ఆయన మా ఆవిడ ప్రవర్తన పట్ల ప్రసన్నులయ్యారు.
ఆయన మా ఇద్దరినీ విశేషించి ఆశీర్వదించారు.
చాలా ఆనందం పొందిన మనస్సులతో మేము తిరిగి వచ్చాము.
ఇదండీ నా అనుభవం.
No comments:
Post a Comment