Tuesday, May 3, 2022

గురువు - గూగుల్ మ్యాప్

 ఒక ఙ్జాపకం - 32

గురువు - గూగుల్ మ్యాప్

 

"సద్గురువులు ఎన్నడూ పరాచికాలు ఆడరని, మనకు ఏది మంచిదో  ఆ దిశగా మనల్ని నడిపిస్తారు, కానీ మనల్ని ఆ దిశగా వెళ్ళమని వత్తిడి చేయరని, సూక్ష్మంగా మనకు మార్గం సూచిస్తారని చెబుతారు.  వారు చెప్పిన మార్గంలో పయనిస్తే మనకు మంచి జరుగుతుందని, లేనిచో మన కష్టాలు మనకు తప్పవు"

శ్రీ ఎక్కిరాల భరధ్వాజ గారి ప్రియ శిష్యుడు శ్రీ పెసల సుబ్బరామయ్య గారు వ్రాసిన ’అవధూతలీల’ గ్రంధంలోని ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం.

గూగుల్ మ్యాప్స్ సెట్ చేసుకుని గమ్యం మాత్రమే తెలిసి దారి తెలియని ప్రయాణాలు చేస్తున్న అనేక సందర్భాలలో ఈ వాక్యాలు నాకు గుర్తు వస్తుంటాయి.

సద్గురువులగూర్చి చెప్పబడ్డ పై వాక్యాలు గూగుల్ డైరెక్షన్స్ కీ కూడా వర్తిస్తాయి అని నాకు చాలా సార్లు అనిపించింది.

ఒక గమ్యాన్ని  సెట్ చేసుకుని మనం బయలుదేరాక అది వీలయినంత దగ్గర దారిలో, ఎక్కువ రద్దీలేని రహదారిలో, ఆడ్డంకులు ఏవీ లేని దారిలో మనల్ని నడిపిస్తూ పోతుంది.

ఆ అపరిచిత వ్యక్తి చెప్పే భాష , ఉఛారణ మనకర్థం కాకున్నా, మనం శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుని పాఠిస్తే మనకు లాభం. ’ఆ! పోనీలే ఏదో చెప్పారు, మనకర్థం కాలేదు’ అని వదిలేస్తే  మనం గమ్యం చేరుకోవటంలో ఇబ్బంది పడతాము. మన తిప్పలు మనకు తప్పవు.

సద్గురువులు, అవధూతలు చెప్పే మాటలు అర్థం కాలేదు అని వదిలేస్తే సరిగ్గా ఇలాగే ఇబ్బంది పడతాము కద.

సద్గురువులు, అవధూతలు చెప్పే మాటల్ని మనం నిర్లక్ష్యం చేసి వారి మాటలు పెడచెవినపెడితే,  వారేమి నిందించరు.  దాని వల్ల ఏర్పడే కష్టనష్టాలు, ఇబ్బందులు మనమే అనుభవిస్తాము. కానీ సద్గురువు మన వేలిని పట్టుకున్న తర్వాత ఇక వదలరు. వారే తిరిగి కన్న తల్లి వలే, పదే పదే మనము ఏ మార్గంలో పయనించాలో చెప్పి తమ కృపని మనపై వర్షింపజేస్తారో గురుకృప అనుభవమున్నవారికి ఎరుకే.

గూగుల్ మాప్ వాడుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు , మనం ఏమరుపాటులో వాళ్ళు చెప్పిన దగ్గర మలుపు తీసుకోవటం మరచిపోతే వాళ్ళేమి నిందించరు, కేకలు వేసి అలగరు (భార్య లాగా). కాకపోతే తిరగాల్సిన దగ్గర మలుపు తిరగకపోవటం వల్ల ఎదురుయ్యే ఇబ్బందులు, శ్రమ, తిప్పట, పెట్రోలు ఖర్చు మనం అనుభవించక తప్పదు కద.

సద్గురువు కృప చూపినా మనం మనబుద్ది చూపిచ్చి ఇబ్బంది పడటంతో సరిపోల్చవచ్చు దీన్ని.

సరే గూగుల్ మాప్ సద్గురువులాంటిది అని చెప్పాను కద. మనం టర్న్ తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోయినా, కుడివైపుకు తిరగాల్సిన దగ్గర ఎడమ వైపుకు తిరిగినా మనల్ని అది నిందించక, అక్కడ నుండి మనం తిరిగి మనం గమ్యం చేరుకోవాలంటే ఏ మార్గంలో ప్రయాణించాలో చాలా ఓపిగ్గ చెపుతుంది. మనం మన గమ్యం చేరే దాకా కన్నతల్లి కంటె ప్రేమగా, ఓపిగ్గా మనకు మార్గాంతరం చూపుతూనే ఉంటుంది.

గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణాలు చేసిన ప్రతి సారి , ఈ పోలిక తోస్తూ ఉంటుంది నా మనసుకు. తీరా ప్రయాణం అయిపోయాక వ్రాయటం మరచిపోతూ ఉంటాను.

ఈ రోజు ఎలాగో తీరిగ్గా ఇంట్లో ఉన్నప్పుడే గుర్తు వచ్చింది.

 

No comments:

Post a Comment