ఇష్ట కామేశ్వరి దేవి క్షేత్రం - పార్ట్ 2
(ఒక ఙ్జ్యాపకం - 26)
దుర్గమ అరణ్యంలొ రహదారి అనేది లేని
చోట వాగో, వంకో పారడం వల్ల ఏర్పడిన బాటనే దారిగా
మలచుకుంటూ బండలమధ్య, గుండ్ల మధ్య, దట్టమైన
అడవిలో ప్రయాణం చేస్తూ మా జీపు చివరికి మేము చేరాల్సిన గమ్యం అయిన ’ఇష్టకామేశ్వరీ
దేవి క్షేత్రం " చేరుకుంది.
క్షేత్రం అనంగానే మీరు మరీ పెద్దగా
ఊహించుకోకండి. మన హైదరాబాద్ లో ఒక్కోదగ్గర ట్రాఫిక్ మధ్యలో , ఏ చెట్టుకిందో వెలిసిన చిన్న చిన్న గుళ్ళు మీరు చూసే ఉంటారు.
సైజు విషయంలో ఈ గుడి వాటికంటె కూడా చిన్నదే. చాలా చిన్న గుడి. మేము మొదట
ఆశ్చర్యపోయాము. ఇంత చిన్న గుడికి ఇంత ప్రాశస్త్యం ఎలా వచ్చిందా అని నమ్మశక్యం
కాలేదు మాకు.
మాకంటే ముందరే చేరుకున్న జీపుల
వల్ల యాత్రీకుల రద్దీ బాగానే ఉంది. ఆ జీపుల్లోముందుగానే చేరుకుని మాకై
ఎదురుచూస్తున్న మా అబ్బాయి కూడా మాతో జతకలిశాడు.
మొదటగా ఆ చుట్టుపక్కల వాతావరణం
గూర్చి నాలుగు ముక్కలు.
ఇంతకూ జీపు గుడి దాకా రాదు. మేము
ప్రయాణం చేసిన బాట అంతా ఒకెత్తు. జీపు ఆపేసిన దగ్గరనుంచి బండరాళ్ళు, కఠిన శిలలపై నడచుకుంటూ, చిన్న పాటి నీటి
ప్రవాహం దాటుకుంటూ, పాచి పట్టిన బండలపై జారకుండా ఒకర్నొకరు
పట్టుకుని బ్రతుకుజీవుడా అని గుడి దాకా దాదాపు ఒక కిలోమీటరు దూరం నడిచిపోవాలి జీపు
దిగాక.
అక్కడి వాతావరణం చాలా చల్లగా
ఆహ్లాదంగా ఉంది. దట్టమైన చెట్లు దాదాపు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టు ఉన్నాయి.
కాలుష్యం అంటని ప్రకృతి తాలుకు నిజమైన అందాన్నికనులారా చూడొచ్చు అక్కడ. ఒక చిన్న
వాగు స్వచ్చమైన నీటితో చాలా హాయిగా ఉంది చూట్టానికి. అందులో దిగి కాళ్ళు కడుక్కుని
వచ్చి దేవి దర్శనం చేసుకొనమని మా జీపు డ్రయివర్ కం గైడ్ సూచన ఇచ్చాడు మొదటే.
ఆ స్వచ్చమయిన నీటిలో చిన్ని చిన్ని
చేపలు ఈత కొడుతూ ఆహ్లాదంగా ఉన్నాయి.
వాగు నీటిలో కాళ్ళు కడుక్కుని
గుడికి చేరినంత సేపు బాటకిరువైపులా అక్కడి స్థానిక ఆటవికులు చిన్న చిన్న దుకాణాలు
పెట్టారు. అడవిలో దొరికే వనమూలికలు, తేనె,
మిరియాలు మొదలైన సామాగ్రి అమ్ముతున్నారు ఆ దుకాణాల్లో. వారు ధరలు
బాగా ఎక్కువ చెబుతున్నారు నిజానికి. ఆటవికులు అనంగానే మనం అంచనా వేసే అమాయకత్వం
ఏమీ కనిపించలేదు వారిలో.
మనకు నగరంలో శిల్పారామంలో కనిపించే
గ్రామీణుల్లా వీరు కూడా బాగా వ్యాపారకళని ఒంటపట్టించుకున్నారు. వారే చిన్న చిన్న
టిఫిన్ సెంటర్లను కూడా నడుపుతున్నారు. పూరీలు, ఇడ్లీలు,
దోశేలు, టీ కాఫీలు ఇలా దొరుకుతున్నాయి అక్కడ.
సిగరెట్లు, పాన్ లు సరే సరి.
అక్కడ మమ్మల్ని నిజంగా ఆకట్టుకున్న
అంశం ఆటవికుల విలువిద్యా ప్రదర్శన. వారు విల్లుబాణం మనచేతికి ఇచ్చి తోచిన కాయనో
కొమ్మనో కొట్టమని చెబుతారు. మనవల్ల కాదు. ఆ తరువాత ఆ ఆటవికులు తమ విలువిద్యా
ప్రదర్శన చూపిస్తారు. కేవలం వెదురుబద్దతో చేసిన విల్లు, వెదురుముక్కలతో చేసిన బాణాలతోనే వారు అంతటి పరిపక్వత
సాధించారు అంటే పాపం వారికి నిజమైన శిక్షణ ఇస్తే ఒలింపిక్స్ లో బంగారు పతకాలకు
కొదవ ఉండదు కద అని అనిపించింది. వారు మన నుంచి ఇంతకూ ఆశించేది ఓ అయిదో పదో అంతే.
గురి చూసి కొట్టడంలో నైపుణ్యం ఉన్న మా అబ్బాయి కూడా వారి నైపుణ్యాన్ని బాగా
అభినందించాడు. అదివరకు మా అబ్బాయి పాపి కొండలు ట్రిప్ లో బుల్స్ ఐ ని కొట్టి గురి
చూడటంలో తన ప్రావిణ్యాన్ని నిరూపించుకుని ఉన్నాడు. (నిజానికి మా అబ్బాయికి రైఫిల్
షూటింగ్ లో అనుభవం ఉంది ఆసక్తి ఉంది, వాడికి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది.)
సరే చివరికి గుడికి చేరుకున్నాం.
చాలా చిన్నగా ఉంది గుడి అని
చెప్పాను కద ఇందాకే. గుడి కూడా నేల మట్టానికి ఉండదు. అమ్మవారి విగ్రహం భూమి లెవల్
కన్నా కాస్తా కిందుగా ఉంటుంది. ఆ విగ్రహం పైన చిన్నగా ఓ మందిరం కట్టారు. లోనికి
వెళ్ళి కూర్చుని పూజ చేసుకోగలిగేది మహా అంటే ఒక నలుగురో అయిదుగురో ఒక్కసారి.
అక్కడలోపలే పూజారి కూర్చుని ఉంటారు, యాత్రీకులు
ఒక బాచ్ బయటికి రాగానే మనం ఇంకో బాచ్ గా లోనికి వెళ్లాలి.
మా వంతు కోసం ఎదురుచూస్తు మేము బయట
కూర్చున్నాము.
ఆ గుడి గూర్చి మేము అదివరకు విన్న
విషయాలు గుర్తు చేసుకుంటూ కూర్చున్నాము, చాగంటి
కోటేశ్వరరావు గారి ప్రసంగాల ద్వారా, ఇది వరకు వెళ్ళివచ్చిన
యాత్రీకుల యూట్యూబ్ వీడియోల ద్వారా, గూగుల్ ద్వారా ఇలా మాకు
తెలిసిన విషయాలు కొన్ని ఏమిటి అంటే,
1) అక్కడి అమ్మ వారు మహా శక్తి
శాలి. మనం ఏదన్నా అనుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుంది . అందుకే ఆమె పేరు
ఇష్టకామేశ్వరి దేవి అని వచ్చింది.
2)అక్కడి అమ్మవారి నుదురుపై మనం
కుంకుమ బొట్టు పెట్టవచ్చు. అలా పెడుతున్నప్పుడు అమ్మవారి నుదురు సాక్షాత్తూ ఒక
సజీవ మూర్తిలాగా మనకు అనుభవం అవుతుంది. అంటే జీవం ఉన్న మనిషికి బొట్టు పెడితే మనకు
ఎలా స్పర్శ తెలుస్తుందో అలా ఉంటుంది అని తెలుపబడింది మాకు
సరే మా వంతు వచ్చింది.లోపలికి
వెళ్ళాం. ఇక్కడ పూజారులు అంటే బ్రాహ్మణులు కాదు. అక్కడి స్థానిక ఆటవికుల కుటుంబం
ఒకటి వంశపారపర్యంగా పూజలు చేస్తున్నారు. వారు చక్కగా పూజాదికాలు చెయించి అర్చన
చేయించి మనతో బొట్టు పెట్టించి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపారు. చాలా తృప్తిగా
అనిపించింది.
మేము కోరుకున్నవి నెరవేరాయా అని
మీరడగవచ్చు, నిజానికి క్షేత్రం చూడాలి ఆ సాహసోపేతమైన ఆ
ప్రయాణం చేయాలి అన్న ఫోకస్ తో వెళ్ళాం ముఖ్యంగా తప్పనిచ్చి ఫలానిది కోరుకున్నామా
అన్నది గుర్తు లేదు.
ఇక అమ్మవారి నుదురు మాకు ఒక
శిలలాగానే తోచింది తప్పనిచ్చి మెత్తగా స్పర్శకు తోచలేదు. బహుశా సంవత్సరాల తరబడి
అనేక మంది తాకుతూ ఉండటం వల్ల ఆ ప్రత్యేకత కోల్పోయిందేమో ఆ శిల.
ఇక తిరుగు ప్రయాణంలో
ప్రమాదఘంటికలు:
తిరుగు ప్రయాణంలో ఆ ప్రమాదభరిత
దారిలో మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. ఈ సారి జీపు ఎగరటం ఇంకా ఎక్కువ అనిపించింది.
ఎక్కడా ఆగటం లేదు. చాలా
ప్రమాదభరితంగా సాగింది మా ప్రయాణం.
చివరికి రిజర్వ్ ఫారెస్ట్ చెక్
పోష్టు వరకు తీసుకువచ్చాడు. ఈ లోగా
పరిగెత్తుతున్న జీపులోంచి క్లీనర్ కుర్రాడు దిగి పెద్ద బండరాయి ఒకటి
ముందుచక్రానికి అడ్డుపెట్టాడు.
జీపు నెమ్మదిగా ఆగింది.
అప్పుడు చెప్పాడు మా డ్రయివర్, తిరుగుప్రయాణంలో బ్రేక్ ఆయిల్ ట్యాంకు లీకయి క్రమంగా బ్రేక్
పడటం మానేసింది అట. "బండలు గుండ్లు ఉన్న దారే కాబట్టి తిన్నగా తీస్కువచ్చాను
ఇక్కడి దాకా. ఇక ఇక్కడి నుంచి ఘాట్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. నేను మీ అందరి
ప్రాణాలు రిస్కులో పెట్టదల్చుకోలేదు. మీరు ఏదో ఒక వాహనంలో వెళ్ళండి" అని
మ అబ్బాయి కూడా మాతో కలిసాడు ఈ
లోగా.
ఈ జీపు డ్రయివర్ తో ఏమి మాట్లాడినా
ప్రయోజనం లేదు అని గ్రహించి అతనికి చెల్లించాల్సిన డబ్బు పూర్తిగా చెల్లించి మా
తిప్పలు మేము పడదాం అని నిర్ణయించుకున్నాం.
ఈ ప్రయాణంలో మాకు అదే జీపులో మాతో
పాటు ప్రయాణం చేసిన శ్రీ గుప్తా గారు మరియూ వారి కుటుంబం బాగా ఆప్తులయ్యారు. వారి సాయంతో మేము క్షేమంగా శ్రీశైలంలో కాటేజీ
చేరుకున్నాము.
శ్రీ గుప్తా గారు రాజమండ్రీలో కార్
డెకార్స్ షోరూం నడుపుతున్నారు అట. వారు తమ స్వంత వాహనం టాటా వింగర్ లో రాజమండ్రి
నుంచి వచ్చారు. ఆ వ్యాన్ లో వాళ్ళపిల్లలు పాతాళ గంగకి వెళ్ళారట.
వారు ఫోన్ చేసి ఆ వాన్ ని
పిలిపించారు. అది వచ్చేదాకా కబుర్లు చెప్పుకుంటూ గడిపేశాము.
ఆ రోజు ఆ కుటుంబం చూపిన ఆదరణ
మరువలేనిది. శ్రీశైలం లో అన్నీ కులాల వారి సత్రాలు కద. మా సత్రం వారు అంత్య
నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అన్చెప్పి మేము బయలు దేరేటప్పుడే చెప్పారు, రెండు పైన వస్తే భోజనం ఉండదని. ఈ బ్రేకఫెయిల్ ఉదంతం వల్ల మేము
చేరేటప్పటికి మధ్యాహ్నం మూడున్నర దాటింది.
గుప్తా గారు అక్కడికి వారి కులపు
సత్రానికి ఆహ్వానించారు.
"మా కులపు సత్రంలో భోజనం
దొరకని పక్షాన తప్పక వస్తాం" అని చెప్పి వచ్చాం మా కాటేజి/ సత్రానికి. దేవుని
దయ వల్ల మాకు భోజనం ఉంది రెడీగా.
పాపం మాట మాత్రమే కటినం, అన్నం మాకు సిద్దం చేసి ఉంచారు.
గుప్తాగారు ఫోన్ మీద ఫోన్ చేసి మాకు
భోజనం అందిందా లేదా అని కన్న తల్లిలాగా విచారించుకున్నారు. మాకు ఎంతో ఆనందం అయింది
ఆయన ఆదరణ పట్ల.
శీ గుప్తా గారితో కొన్ని రోజులు
వాట్సాప్ ద్వారా టచ్ లోనే ఉన్నాను కానీ ఆ తర్వాత వారి నెంబర్ మిస్స్ అయింది.
ఈ వ్యాసం ద్వారా వారికి మరొక్క
సారి కృతఙ్జ్యతలు తెలుపుకుంటున్నాను.
No comments:
Post a Comment