Tuesday, May 3, 2022

పుస్తకాలతో నా ప్రయాణం (part 1)

 పుస్తకాలతో నా ప్రయాణం (part 1)

ఒక ఙ్జాపకం 42

 

ఇది 1980 ల నాటి సంగతి.

పత్రికలు, సినిమాలు, ఆకాశవాణి మాత్రమే ప్రధాన వినోద సాధనాలు ఆ రోజుల్లో.

ఆ రోజుల్లో మనం ఒక వారపత్రిక తెప్పించుకుంటే, పక్కింటివారు ఇంకో వారపత్రిక తెప్పించుకుని రెండు ఇళ్ళ వాళ్ళు వాటిని మార్చుకుని రెండు పత్రికలు చదవగలిగే వారు. ఆ ఊరికి కొత్తగా రావటం వల్ల మాకింకా ఆ స్థాయి పరిచయాలు కలగలేదు ఎవరితో . అందుకే రెండు వారపత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఈనాడు దినపత్రిక  తెప్పించే వారం. రోజుల్లో ఆ రోజుల్లో ఆంధ్రప్రభ అత్యధిక సర్క్యులేషన్ గలవారపత్రికగా ఉండేది.

అవి మేము జమ్మలమడుగు లో ఉంటున్న రోజులు. నేను అప్పుడు ఏడవ తరగతి చదువుకుంటున్నాను. ఆ ఒక్క సంవత్సరమే మేము జమ్మలమడుగులో ఉండినది. ఆ తరువాత మా నాన్నగారికి బదిలి అవడంతో నూజివీడు కి వెళ్ళిపోయాము.

ఆంధ్రభూమిలో కొన్నివారాలుగా ప్రకటనలు వచ్చేవి త్వరలో యండమూరి వీరేంద్రనాధ్ వ్రాసిన తులసిదళం రాబోతోందని.

ఇంట్లో అంతా ఒకటే చర్చలు, ముగ్గురక్కలు అన్నయ్యా చాలా ఉద్విగ్నంగా మాట్లాడుకుంటున్నారు. అబ్బ చాలా బాగా వ్రాస్తారు యండమూరి వీరేంద్రనాధ్ గారు. తప్పక ఈ సీరియల్ ఫాలో కావాలి అని .

పేపర్ కుర్రాడికి కూడా చెప్పి పెట్టారు ఎట్టిపరిస్థితులలోను ఆంధ్రభూమిని మిస్ చేయకుండా వేయమని. మేము ఆ

ప్రకటన వెలువడగానే యండమూరి గారు వ్రాసిన పాత పుస్తకాలు ’చెంగల్వపూదండ, పర్ణశాల’ శాఖా గ్రంధాలయం నుంచి తెప్పించుకుని మరొక్క సారి చదివాము.

జమ్మలమడుగు నుంచి మైలవరం వెళ్ళే దారిలో ఉన్న శాఖా గ్రంధాలయంకి వెళ్ళి బుక్స్ తెచ్చే బాధ్యత నాదే. ఇంట్లో అందరికంటె చిన్నపిల్లాడిని నేనే కద.

ఇంట్లో ఇలాంటి వాతావరణం కారణంగా బుక్స్ చదివే అలవాటు నాకు ఆ రోజుల్లోనే ఏర్పడింది.  ఆ రోజుల్లో నేను విపరీతంగా బుక్స్ చదివే వాడిని.

వంశీ (పసలపూడి) వ్రాసిన గజం మిధ్య పలాయనం మిధ్య, కర్మసాక్షి ఆ రోజుల్లో చదివి ఈయన భలే వ్రాస్తాడే అని అనుకున్నాను. రైల్వే స్టేషన్ అన్నా, రైలు పట్టాలన్నా, సూర్యోదయం, సూర్యాస్తమయం అన్న ఒక విధమైన అనురక్తి ఏర్పడటానికి, ప్రపంచాన్నివివిధ కోణాల్లో ఫోటో తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో పరికించి  చూడటానికి వంశీ బుక్స్ నాకు ప్రేరణ కల్పించాయి.

అదే విధంగా యద్దనపూడి గారి పుస్తకాలన్నీ చదివాను ఆ రోజుల్లోనే. పార్థూ అన్న పుస్తకం నన్ను బాగా కదిలించింది. వాసిరెడ్డి సీతాదేవి, ఆరెకపూడి కోడూరి కౌసల్యాదేవి, సి.ఆనందరామం, మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవీ, మాలతీ చందుర్ ఇలా ఒకరేమిటి అందరి నవలలూ చదివి పక్కన పెట్టేసే వాడిని.

ఇవి కాక కన్నడ నవలల అనువాదాలు వ్రాసే త్రివేణీ-శర్వాణీ గార్ల నవలలు కూడా చదివేవాడిని.

ఇవికాక అపరాధ పరిశోధన, జ్యోతి, స్వాతి మాసపత్రికలు, చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, సితార, జ్యోతి చిత్ర ఇవి కాలక్షేపానికి చదివే వాడిని. మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఇవి చదువు ఇవి చదవద్దు అని దేనికీ నన్ను అభ్యంతరపెట్టే వారు కాదు.

మా నాన్నగారు కోరిన ఒకే ఒక కోరిక గుడిపాటి వెంకట చలం రచనలు చదవద్దు అని. ఆయన నిర్ణయాన్ని గౌరవించి ఇప్పటి దాకా చలం నవలలు ముట్టుకోలేదు.  ఇకపై చదవను కూడా . ఇది మా నాన్న గారికి నేను అందించే గౌరవం అనుకోవచ్చు.

1978 ప్రాంతాలలో మేము కర్నూలులో ఉండేవారం. అప్పట్లో, డోర్ డెలివరీ లైబ్రరీ కుర్రాడు వచ్చి ఇంటింటికి పుస్తకాలు ఇచ్చి వెళ్ళేవాడు.

ఒకసారి ఇలాగే చలంగారి ’మైదానం’ ఇచ్చాడు. దాన్ని చూడంగానే మా నాన్న గారు షాక్ అయ్యారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయన దాన్ని ఎత్తి బీరువా పైన ఉన్న అట్టపెట్టె మీద పెట్టి, ’రేపు ఆ కుర్రాడు వచ్చి తీసుకెళ్ళే దాకా దీన్ని ఎవ్వరూ తాకవద్దు’ అని హెచ్చరించారు.

"భోజనాలప్పుడు మా అమ్మ గారు చదివితే చదువుతారు లెండి, ఎందుకలా చేస్తారు?" అని అడిగింది.

’పిల్లలు ఏమయిపోతారు? చలం గారి భావాలు చదివి అర్థం చేసుకునే మెచ్యూరిటీ పిల్లలకు ఉండదు. దురదృష్ట వశాత్తు దేవుడు ఆయనకి అద్భుతమైన  శైలిని ఇచ్చారు. దేవుడా కాపాడు నా దేశాన్ని, నా పిల్లల్ని’ అని విచలితుడు అయిపోయాడు మా నాన్న. ఆయనని నొప్పించడం ఇష్టం లేక నేను జీవితకాలంలో చలం నవలల్ని చదవకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను.

ఇదొక్క విషయంలో మాత్రమే మా నాన్నగారు మా స్వేఛ్ఛని అడ్డుకున్నారు అంతె.

నా స్నేహితుల ఎన్నికలో గానీ నా ఇతర అభిరుచులలో గానీ ఆయన దేనికీ అభ్యంతరపెట్టలేదు ఎప్పుడు. నాకు అన్నీ మతాల స్నేహితులు, అన్ని వర్గాల స్నేహితులు ఉండేవారు చిన్నప్పటి నుంచి.

ముఖ్యంగా నేను ఎదుగుతున్న క్రమంలో  తీవ్రవాద వామపక్ష భావాలున్న మిత్రులతో తిరిగినా నన్ను ఆయన అడ్డుపెట్టలేదు. అన్నీ చూడాల్సిందే అన్నారు.

సరే మళ్ళీ జమ్మల మడుగుకు వద్దాం.

మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి పారిపోయిన ఖైదీలు, మిష్టర్ సంపత్, పడమట సంధ్యారాగం అన్న నవలలు కూడా ఆ రోజుల్లోనే చదివాను. ముఖ్యంగా పడమట సంధ్యారాగం నవల  చదివి బాగా దిగులుపడ్డాను. భార్య తనకు నమ్మకద్రోహం చేసింది అన్న కారణంగా అందులోని పాత్ర సన్యాసిగా మారిపోయిన వైనం నన్ను బాగా కదిల్చివేసింది. ’ఇది’ అని మాటల్లో చెప్పలేని దిగులు నన్ను ఆవరించింది.

నండూరి రామమోహన రావు గారు తెలుగులోకి అనువదించిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్, ట్రెషర్ ఐలాండ్, మార్క్ ట్వెయిన్ వ్రాసిన విచిత్ర వ్యక్తి, ,ఎనభై రోజుల్లో ప్రపంచ యాత్ర,  ఇలా బాల సాహిత్యం కూడా చదివే వాడిని. ఎందుకో రష్యా వారు ప్రచురించిన బాలల సాహిత్యం నాకు నచ్చేది కాదు ఆ తెలుగు కొరుకుడు పడేది కాదు.

రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం, తెన్నేటి హేమలత గారి రామాయణ విషవృక్ష ఖండన కూడా ఆ రోజుల్లోనే చదివాను.

ఆ తరువాత నా వయసు పెరిగేకొద్ది ఆలోచన విస్తృతం అయ్యేకొద్ది రాచకొండ విశ్వనాథ శాస్త్రి, మధురాంతకం రాజారాం, గోపీచంద్, బీనాదేవీ, వసుంధర, అంపశయ్య నవీన్, ఓల్గా, దేవరకొండ బాలగంగాధర తిలక్, శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్ర శర్మ తదితరుల రచనలు, కవిత్వం చదివాను.

ఎన్ని చదివినా నాకు నిజమైన సాంత్వన మధురాంతకం రాజారాం గారి రచనల్లో మాత్రమే లభించేది.

ఇక యండమూరి వీరేంద్రనాధ్ గారి రచనల విషయానికి వస్తాను.

నా మీద అత్యంత ప్రభావం చూపిన రచయిత నిస్సందేహంగా యండమూరి వీరేంద్రనాధ్ గారే.

ఆంధ్రభూమి వారపత్రిక లో అత్యంత సాధారణంగా ప్రారంభమయిన ’తులసిదళం’ సీరియల్ తెలుగు సాహిత్యంలో ఒక సునామిని సృష్టిస్తుందని మాకు చూచాయగా కూడా తెలియదు.

మొదటివారంలొనే, అందునా మొదటి వాక్యంతోనే ఆ నవల తాలుకు జానర్ ని ఆయన ప్రకటించేశారు.  శ్రీధర్ బృందం సివిల్ ఇంజినీరింగ్ పనుల్లో భాగంగా త్రవ్వకాలు జరుపుతూ బీసీకాలం నాటి ఒక మమ్మీఉన్న శవపేటికను త్రవ్వి తీయటం ఆ తర్వాత అది ఒక ప్రాంక్ అని తెలుసుకోవడం తో ప్రారంభం అవుతుంది.

ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేనంత వేగం పుంజుకుంటుంది నవల.

యండమూరి గారి రచనలు నా మీద ఎలా ప్రభావం చూపాయి, చిన్న వయసులోనే నేను రచయిత గా కలం పట్టటానికి ఎలా ప్రేరణ ఇచ్చాయి అన్నది వచ్చే భాగంలో వ్రాస్తాను.

 

No comments:

Post a Comment