Tuesday, May 3, 2022

చతుర్ముఖం- తెలుగు సినిమా

 


చతుర్ముఖం- తెలుగు సినిమా

 

మీ సెల్ ఫోన్ లోంచి ఒక దుష్ట శక్తి వచ్చి మీ జీవితాల్ని నరక ప్రాయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఊహ వచ్చిందా మీకు ఎప్పుడైనా?

మీరు కొత్త సెల్ ఫోన్ ఆన్‍లైన్ లో ఆర్డర్ పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఈ సినిమా చూశాక.

ఈ సినిమా తాలూకు ఙ్జాపకాలు చాలా రోజులు మిమ్మల్ని వెంటాడుతాయి.

నాకు చాలా నచ్చింది ఈ సినిమా.

ఇటీవల కాలంలో నేను చూసిన సినిమాలు తక్కువ.

తమిళ్ లో అసురన్ చూసి మాటలు రాక కొయ్యబారిపోయాను, అద్భుతం. అంతకు మించి ఇంకేమి చెప్పలేను. చిన్నప్పటి నుంచి నాకు పరిచయం లేని వాతావరణం ఒకటి,  సామాజిక సమస్యల మీద నాకున్న అవగాహన తక్కువ ఇంకోకటి కావటాన ఈ సినిమా గూర్చి రివ్యూ వ్రాయటం న్యాయం అని అనిపించలేదు , వ్రాయలేదు.

మొత్తం మీద అసురన్ లో జీవం ఉంది.  

మలయాళం లో అయ్యప్పనుమ్- కోషియుమ్ చిత్రం చూసి తిరిగి ఇలాగే నివ్వెర పోయాను. ఇంత చిన్న కథ తో, వ్యక్తుల ఈగోలని ప్రధాన కథగా తీస్కుని ఎక్కడా బోర్ కొట్టకుండా తీసిన వైనం నన్ను నివ్వెర పరచింది. చాలా బాగ ఉంది.చెప్పాను కద, నాకు సామాజిక సమస్యల పట్ల అవగాహన తక్కువ. దళిత పాత్ర యొక్క కోపం, ఆవేశం మీద తీయబడ్డ ఈ చిత్రంలో కూడా నిజాయితీతో కూడిన ఆత్మ ఉంది. ఈ రెండు సినిమాల మీద రివ్యూ వ్రాసేంత ఙ్జానం నాకు లేదు.

మొత్తం మీద ఈ రెండు సినిమాల తరువాత బాగా గాప్ తీసుకున్నాను, ఇటీవల ఏమి చూడలేదు. మొన్న నారప్ప చూడ సాహసించి ధైర్యం లేక ఒక అయిదు నిమిషాలలో కట్టేశాను. భాష, వస్త్రధారణ ఇలా ఏ విభాగంలో కూడా జీవం లేక పోగా ఒక చెత్త అనుసరణగా అనిపించింది. ఆత్మ లేదు నారప్పలో. సర్పాట్ట అప్పుడప్పుడు చూశాను. నో కామెంట్స్.

నాకు నచ్చే జానర్లు  థ్రిల్లర్, హారర్, అడ్వంచర్, సున్నిత హాస్యం, భావుకత్వంతో కూడిన దృశ్యకావ్యాలు అని ఇటీవల నాకే అర్థం అయింది.

కథ విషయానికి వస్తే:

ఈ చతుర్ముఖం కాస్త హారర్, అధిక భాగం థ్రిల్లర్ అని చెప్పవచ్చు.

తేజస్విని (మంజు వారియర్) ఎంటెక్ చదివిన విద్యాధికురాలు. ఆమె తన మిత్రుడు ఆంటోని (సన్నీ వేన్) తో కల్సి, పెద్ద పెద్ద సంస్థలకు  సీసీ కెమరాలను అమర్చే బిజినెస్ ప్రారంభిస్తుంది. ఈ బిజినెస్ ఇంకా ప్రారంభ దశలొ ఉంటుంది.  ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో తలమునకలుగా ఉంటూ తన సెల్ ఫోన్ ని ప్రాణ సమానంగా చూసుకుంటూ ఉంటుంది.

ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళీనప్పుడు గ్రామ జాతరలో దెయ్యం పట్టిన స్త్రీలని వీడియో తీసే సందర్భంగా , పూనకాలు వచ్చిన ఒక  స్త్రీ విసిరిన విసురుకు ఈమె సెల్ ఫోన్ వెళ్ళీ కోనేట్లో పడి పనికిరాకుండా పోతుంది. విధిలేని పరిస్థితులలో ఆమె ఒక కొత్త సెల్ ఫోన్ ని ఆన్ లైన్ లో కొనాల్సి వస్తుంది. ఆమె బిజినెస్ ఇంకా పుంజుకోకపోవటాన, ఎక్కువ డబ్బులు పెట్టి ఫోన్ కొనలేక, బాగా తక్కువ ధరలో ఏదో కొత్త కంపెనీ ’లిజా’ అనే బ్రాండ్ కి చెందిన ఫోన్ కొంటుంది.  ఆ ఫోన్ వచ్చినప్పటి నుండి ఆమెకి విచిత్రమైన కష్టాలు ప్రారంభం అవుతాయి.

ఆ సెల్ ఫోన్ తోనే తనకు ఈ ఇబ్బందులు అన్నీవస్తున్నాయి అని  ఆమెకి తెలిసి వచ్చేలోగా చాలా ఇబ్బందులే ఎదుర్కొంటుంది. ఆమెకు నికరంగా ఆ విషయం అర్థం అయ్యాక దాన్ని వదిలించుకోవటానికి విఫల యత్నాలు ఎన్నో చేస్తుంది. ఆ ఫోన్ ని ఆమె దూరంగా కోనేటి నీళ్ళలోకి విసురుతుంది తొలిగా. ఆ తరువాత ఏమి తెలియని దానిలా ఇంటికి వచ్చేస్తుంది. కానీ, తక్షణం ఆమె చేతి పైన, మొహం పైన విచిత్రమైన రీతిలో దద్దులు వచ్చి బాధిస్తాయి.

ఆ ఫోన్ ని ఇంతలో వాళ్ళ ఫామిలీ ప్రెండ్ తీసుకుని వచ్చి ఇచ్చి,

"కోనేటి గట్టున పడి ఉందమ్మాయి ఇది, ఇంత నిర్లక్ష్యం అయితే ఎలాగా?" అని ఇచ్చి వెళతాడు

దాన్ని ఆమె తాకిన తక్షణం ఆమె దద్దులు తగ్గి పోతాయి. ఇది మొదటి అనుభవం.

ఇలా ఎన్నో విఫల యత్నాలు చేస్తుంది ఆ అమ్మాయి. కొన్ని సార్లు ఆమెకి ప్రాణా పాయ స్థితి కూడా కల్గుతుంది ఆ ప్రయత్నాలలో.

అన్నింటికన్నా అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, ఆమె ఆ ఫోన్ తో తీస్కున్న సెల్ఫీలలో ఏదో ఒక మూల ఒక అంకె వస్తుంది. మొదటి సారి 21 అనే సంఖ్యని ఆమె గమనిస్తుంది.  21 అనే సంఖ్యతో మొదలై , రోజుకు ఒక అంకె తగ్గుతూ వస్తుంది. ఆ సంఖ్య భూమ్మీద ఆమెకి మిగిలి ఉన్న రొజులు అని ఆమెకి కొన్ని సంఘటనల ద్వార అర్థం అవుతుంది.

ఒక సారి ఆమె ఫోన్ ని అపార్ట్ మెంట్ పై అంతస్తు టెర్రస్ మీద మరచి పోయి వస్తుంది. ఆ రాత్రి ఆమెకి కాళరాత్రే అవుతుంది. అప్పటికి కౌంట్ డవున్ సంఖ్య 12 వరకు వచ్చి ఉంటుంది. కానీ ఈ సంఘటనతో ఆ ఫోన్ లోని ’నెగటివ్ ఎనెర్జీ’ ఆమె పై  అలిగి, ఎకాఎకి ఆమె ఆయువు ఇంకో నాలుగు రోజులే అని డిసైడ్ చెస్తుంది, సెల్ఫీలో అంకె నాలుగుని చూపించటం ద్వారా.

ఇలాంటి ఫోన్ లు ఇంకా మూడు ఉన్నాయి ఈ సినిమాలో, వాటిని స్వంతం చేసుకున్న వారు ఒక్కొక్కరుగా మరణిస్తూ పోతారు. ఈ నాలుగు ఫోన్ల ద్వారా దుష్ట శక్తి (నెగటివ్ ఎనర్జీ) తన నాల్గు ముఖాలని చూపుతుంది, కాబట్టి చతుర్ముఖం అనుకుంటా టైటిల్.

మరి మన హీరోయిన్ ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కుంది? బయట పడిందా? ఎందుకు ఈ సెల్ ఫోన్లు ఇలా విచిత్రంగా తయారు అయ్యాయి? ఇందులోని ఫిజిక్స్ లాజిక్ ఏమిటి? 21 సంఖ్య కున్న ప్రాధాన్యత ఏమిటి?

ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

 

ఇది స్థూలంగా కథ. ఇంతకు మించి ఒక్క ముక్క చెప్పినా సస్పెన్స్ పోతుంది.

 

మిగతా విశేషాలు:

ఇది పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని చెప్పవచ్చు. మంజు వారియర్ నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు ఈ పాత్రకి. ఆమె ఈ సినిమా నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నట్టు అర్థం అయింది టైటిల్స్ ద్వారా.

ఈ కథని మనం ఎటువంటి లాజిక్ ఉపయోగించకుండా థ్రిల్ కోసమే చూడాలి. అంటే నా ఉద్దేశం, ఇంగ్లీష్ లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి అభూత కల్పనలతో, మరమనుషులతో, విచిత్రప్రాణులతో, గ్రహాంతరవాసులతో, అంతరించి పోయిన జంతువులతో, పెనుప్రమాదాలు జరిగితే ఎలా అనే థీమ్స్ తో, మనం అవన్నీ లాజిక్ ని పక్కన పెట్టి  చూశామా లేదా? ఇదీ అలాగే.

ఒక సెల్ ఫోన్ లో ఒక దుష్ట శక్తి లేదా అసంతృప్త ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలోని ప్రధాన కథ. అంతే ఇక ఏ లాజిక్ లు అడగకుండా చూడాలి. చూస్తే పూర్తిగా తృప్తిపొందుతారు, నాది గ్యారంటీ.

కథలో ప్రధాన పాత్ర ధారి ఒకాయన ఫిజిక్స్ టీచర్. ఆయన ఈ సినిమా ప్రారంభ సన్నివేశాలలో శక్తి నిత్యత్వ సూత్రాన్ని (లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనెర్జీ) ప్రస్తావిస్తూ, శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము, కేవలం ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకో రూపంలోకి మార్చవచ్చు. అని చెప్తాడు.

అదే సూత్రాన్ని అనుసరించి, మానవుడు చనిపోయాక మానవునిలో ఉన్న శక్తి నశించదు, అది ఏరూపంలోకి అయినా మారవచ్చు అనే కీలకం మీద యావత్తు కథ నడుస్తుంది.

దేవుడు, దెయ్యం అనే పదాలు వాడకుండా, నెగెటివ్ ఎనెర్జీ, పాజిటివ్ ఎనెర్జీ అనే పదాలు వాడతారు. అదే విధంగా ఫిజిక్స్ తో సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తారు.

అందుకే దీన్ని వాళ్ళు టెక్నో థ్రిల్లర్ అని కూడా పేర్కొన్నారు.

తను తీయదలచుకున్న కథని , చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితిగా, నిబద్దతతో తీశారు. ఎక్కడా బోర్ కొట్టదు. ప్రతీ క్షణం ఉత్కంఠని అనుభవిస్తూ అసలు టైం ఎలా గడిచిపోయిందబ్బా అని అనిపించేలా తీశారు. ఈ విషయంలో దర్శకత్వ శాఖకి నూటికి నూరు మార్కులు ఇవ్వచ్చు.

ఎక్కడా అనవసరమైన ప్రేమ దృశ్యాలు, పాటలు, ఫైట్లు, దేవుడి సెంటిమెంట్లు, తాయెత్తులు, మంత్రగాళ్ళు గట్రా తతంగాలు లేవు.

ఈ సమస్యనుంచి బయటపడటానికి ఇందాకటి ఫిజిక్స్ టీచర్, ఈ అమ్మాయి బిజినెస్ పార్ట్నర్ ఆంటోని చక్కగా సహకరిస్తారు. వారు కూడా ఎక్కడా అవధులు దాటి నటించక సహజంగా నటిస్తారు. ఆ సమస్యకి దర్శకుడు చెప్పబూనిన పరిష్కారం వల్ల కథ ఒక కొలిక్కి వస్తుంది అని విశ్వసించి,  మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయి సినిమాని చూస్తే థ్రిల్ పొందుతారు. ఆ వీడి బొంద నాకు ఫిజిక్స్ బాగా వచ్చు, అని అనుకుని చూస్తే, మీకు నచ్చక పోవచ్చు, చెప్పాను కద, లాజిక్ లు అడగకుండా చూడాలి అని,

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం, ఆంటొనికి తేజస్విని కి మధ్య ఉన్న స్వచ్చమైన స్నేహం గూర్చి చెప్పుకోవాలి . ఎక్కడా అవధులు దాటని నిజమైన స్నేహం వారిది. తన స్నేహితురాలిని విసుక్కుంటాడు, కోపగించుకుంటాడు. కానీ అతను కూడా ప్రత్యక్షంగా ఆ ఫోన్ తాలూకు దుష్ట శక్తి ప్రతాపాన్ని చవి చూస్తాడు. ఒక్కసారిగా ఆమెది భ్రమనో, మూఢనమ్మకమో కాదు అని నిశ్చయంగా తెలిశాక ఆమెని రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా పోరాడుతాడు.

ఫిజిక్స్ టీచర్ వ్యవహారం కూడా అంతే. మొదట ఆయన చాలా హేతువాదంగా మాట్లాడి, ఈ పిల్లకి పిచ్చి అని కూడా అనుమాన పడతాడు. కానీ ఆయన కూడా ఒకట్రెండు సంఘటనలు చూశాక ఇక ఆ అమ్మాయిని రక్షించే ప్రయత్నం చేయటం మొదలెడతాడు.

మన తెలుగు  దర్శకులు ఖచ్చితంగా ఇలాంటి సున్నితమైన అంశాల్ని  తెరకెక్కించలేరు అనిపిస్తుంది.

స్వగ్రామం లో ఆమె తండ్రి మాట్లాడె ఒకట్రెండు మాటల్లో చాలా లోతు ఉంది. ’ఈ తరం పిల్లలు సెల్ ఫోన్ తోనే ఇరవై నాలుగ్గంటలూ గడుపుతారు, పక్కనున్న తండ్రిని పట్టించుకోరు’ అనడంలో, ఒక సారి ఈ పిల్ల సెల్ ఫోన్ అంటేనే భయం వేసి దాన్ని దూరంగా పెట్టేసి ఉంటే "ఏమ్మా ఫోన్ చెడిపోయిందా?" అని అనడంలో చాలా సందేశాలు ఉన్నాయి నేటి యువతకి.

మలయాళం సినిమాలో ఒక హిందూ కుటుంబాన్ని చూడటం ఒక అరుదైన దృశ్యంగా అనిపించింది ఇటీవల.

వారి కుటుంబ వాతావరణంలో అన్నా చెల్లి మధ్య ఏర్పడ్డ  అలకలు , పోట్లాటలు కూడా చాలా సున్నితమైన విధానంలో చూపారు దర్శకులు. మన వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవాలి.

 

ఈ సెల్ ఫోన్ లలో ఒక ఫోన్  కారణంగా పోలీస్ ఆఫీసర్ గారు చనిపోయే దృశ్యంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా ఒక్కొక్కరూ ఈ నెగెటివ్ ఎనర్జీతో ఉన్న నాల్గు ఫోన్ల వల్ల ఎలా మరణ యాతన పడ్డారు అన్న దృశ్యాలని చిత్రీకరించడంలో కాస్తా హారర్ ఎలిమెంట్ ఉంది. బలహీన మనస్కులు భయపడే అవకాశాలు ఉన్నాయి.

 

మొత్తం మీద చెప్పదలచుకున్న విషయాన్ని ఎక్కడా బిగి సడలనివ్వకుండా, చక్కగా చెప్పారు. ఓపెన్ మైండ్ తో చూస్తే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది.

ఏప్రిల్ లో మలయాళంలోను, వారం క్రితం తెలుగులో ఆహా వేదిక గా ఓటీటీ గానూ విడుదల  అయింది.

ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం అయిదు కోట్లే అంటే మనం నోరు వెళ్ళబెట్టక తప్పదు. చక్కటి టెక్నికల్ వేల్యూస్ ఉన్న చిన్న చిత్రం అని చెప్పవచ్చు. ఎక్కడా మీకు బోర్ కొట్టదు.

 

టెక్నికల్ బృందం తాలూకు వివరాలు:

దర్శకత్వం: రంజీత్ కమలా శంకర్, సలీల్ వీ

కథ:  కే అభయ్ కుమార్, అనిల్ కురియన్

 

నటీ నట బృందం: మంజూ వారియర్, సన్నీ వేయిన్, అలెన్సియర్ లే లోపెజ్ తదితరులు

నిర్మాతలు: జిస్ థామస్, జస్టిన్ థామస్

సంగీతం:  డాన్ విన్సెంట్

సినిమాటోగ్రఫీ: అభినందన, రామానుజన్

 

 

 

No comments:

Post a Comment