ప్రొద్దటూరు
ఒక ఙ్జ్యాపకం 28
ప్రొద్దటూరు లో వెంకటేశ్వరా
లాడ్జి. నేను కడపలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పనిచేసిన అయిదు సంవత్సరాల కాలంలో
నెలకు అయిదారు రోజులు విధిగా ఈ లాడ్జిలో స్టే చేసే వాడిని.
ఇది దాదాపు ముఫై సంవత్సరాల క్రితం సంగతి.
ఈ కథలో ఎటువంటి ట్విస్టులు, కొసమెరుపులు ఉండవు. ఇది ఒక ఙ్జ్యాపకాల పరంపర అంతె.
ఆ లాడ్జి లో ఆడుగు పెట్టగానే మనకు
కొట్టవచ్చినట్టు కనిపించే ప్రధాన అంశం పరిశుభ్రత. గోడలకు చక్కగా ఆయిల్
పెయింటింగ్స్ వేసి ఎక్కడా మరక, మచ్చ అన్నది
లేకుండా తళతళలాడుతూ ఉన్నాయి. నేలపైన ఎక్కడా ధుమ్ము, ధూళీ
లేకుండా పరిశుభ్రతకి మారుపేరులా ఉంది.
చాలా చిన్న లాడ్జి అది.
ప్రొద్దటూరు శివాలయం వీధిలో, శివాలయానికి
కాస్తా ఎదురుగా ప్రధాన వాణిజ్య ప్రధానమయిన వీధిలో ఉంటుంది ఆ లాడ్జి.
కంప్యూటర్, ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ వంటి ఎటువంటి హడావుడి లేకుండా ఓనర్ గారే దగ్గరుండి
నడుపుకుంటూ ఉండేవారు. ఆయనపేరు ప్రసాద్ అనుకుంటా. ఆయన వయసు మహా అంటే ముఫైకి మించి
ఉండదు. ఆయన పేరు ప్రసాద్ అయినా కూడా అందరూ ఆయన్ని స్వామి అని పిలిచే వారు. ప్రసాద్
గారు బ్రాహ్మణులు కావటం వల్లనుకుంటాను ఆ గౌరవం. ఆయన సన్నగా ఆరోగ్యంగా చలాకిగా
ఉండేవారు. కుడికాలు కాస్తా ఎత్తి ఎత్తి నడిచే వారు ఆయన, బహుశా
పోలియో వల్లనుకుంటాను. ఎప్పుడు చూసినా తెల్లటి చొక్కా, తెల్లటి
అడ్డపంచ ధరించి కనిపించే వారు. ఆయన ముఖం పై ఎప్పుడు కూడ చెదరని గంధం బొట్టు,
కుంకుమ బొట్టు విధిగా ఉండేవి. వీటికి తోడు చిరునవ్వుతో కూడిన
ఆప్యాయతతో కూడిన పలకరింపు ఆయన ట్రేడ్ మార్క్.
నిర్వాహణ మొత్తం ఆయన కనుసన్నల్లో
జరిగేది. ఎక్కడా అపశృతి జరగకుండా ఒక పెద్ద సంస్థని అభిరుచి గల సీఈవో ఒక
దార్శనికుడిలా ఎలా నిర్వహిస్తాడో అలా నిర్వహించే వారు. మత్తుపానియాలు వంటి వాటికి
ప్రవేశం లేదు.సిగరెట్లు గట్రా కూడా అఫిషియల్ గా నిషేధం ఉండేది ఆ లాడ్జిలో.
మత్తుపదార్థాలు, సిగరెట్లకు ఆమడ దూరంలో ఉండే నాకు ఆ లాడ్జి స్వర్గధామంలా
ఉండేది. I used to feel at home అన్న మాట చెప్పుకోవచ్చు ఆ
లాడ్జికి సంబంధించి.
ఎక్కువ భాగం మెడికల్
రెప్రజెంటేటివ్స్, ఇతర సేల్స్ రెప్రజెంటేటివ్స్, ఇతర ప్రైవేటు వ్యాపారవర్గాలకు చెందిన వ్యక్తులు స్టే చేసే వారు ఆ లాడ్జ్
లో.
మొదటి అంతస్తులో ఉండేది ఆ లాడ్జ్.
క్రింది అంతస్థు అంతా రోడ్డు ను అనుకుని షట్టర్స్ ని వివిధ షాప్స్ కి బాడుగ
(అద్దెకి) ఇచ్చారు.
ఈ క్రింది ఫ్లోర్లోనే షాపుల
వెనుకవైపు ప్రసాద్ గారు కుటుంబంతో నివాసం ఉండేవారు.
రూమ్స్ కూడా కనీస సౌకర్యాలతో
ఉండేవి. విడ్డూరం ఏమిటి అంటే, రూముకు రూముకు
మధ్యన గోడలకు బదులు ప్లై ఉడ్ షీట్స్ ఏర్పాటు చేసి ఉండేవి. ఇవి ప్రాధమిక స్థాయి
రూములు. ధర కూడా చాలా తక్కువ. అధికభాగం రూములకు అటాచ్డ్ బాత్ రూంలు ఉండేవి
కావు. కామన్ బాత్రూములే దిక్కు. కానీ ఈ
కామన్ బాత్ రూంలు కూడా పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అన్నంత నీట్ గా ఉండేవి.
అ తరువాత స్థాయి రూములు అంటే ఒక
పోర్టబుల్ టీవీ ఉండే రూములు.
వాటి తర్వాత స్థాయి కలర్ పోర్టబుల్
టీవీ, మరియు అటాచ్డ్ బాత్ రూములు ఉన్న రూములు.
వీటి సంఖ్య చాలా తక్కువస్థాయిలో ఉండేవి. ఒకటో రెండో ఏసీ రూములు వుండేవి.
మొత్తం కలిపి ఓ పాతిక ముఫై రూములు
ఉండేవి.
ఈ లాడ్జిలో స్టాఫ్ కూడా పెద్ద
ఎక్కువ ఉండేవారు కాదు. నాకు గుర్తు ఉన్నంత వరకు ఇద్దరు బొయ్స్ ఉండేవారు. నిజానికి
వీరు నడివయసు దాటిన వారు ,పేరుకే బాయ్స్. వాళ్ళపేర్లు చెట్టి
, సుబ్బయ్య. దగ్గర్లో ఉన్న ఏదో పల్లె నుంచి వచ్చి ఇక్కడ పనిలో
కుదురుకున్నారు. వాళ్ళకు ఎంత ఇచ్చినా ఋణంలేదు నాకు తెలిసినంతవరకు. చాలా కష్టపడి
పనిచేసే వారు.
లాడ్జిని నిరంతరం శుభ్రపరుస్తూ
ఉండటం వీరి ప్రధాన విధి. అదికాక లాడ్జిలో దిగిన గెస్ట్స్ కి టీ, కాఫీలు, టిఫిన్స్ ,వార్తా పత్రికలు పట్టుకు రావటం కూడా వీళ్ళ విధిగా ఉండేది. వారు చాలా
గడియారపు ముల్లుతో పోటీ పడుతు శ్రద్ధగా చేసుకుపోయే వారు తమ పనులు.
కాకపోతే ఎప్పుడు తమలో తాము
తగాదపడుతూ ఉండేవారు. కాకపోతే ఆ తగాదా శ్రుతి మించకుండా ఉండేది. గెస్టులకు ఇదో
వినోదం గా ఉండేది. అదికాక ఒక్కోసారి వారు గెస్టులను మర్యాదరామన్న తీర్పుచెప్పమని
వేధించే వారు తమ తగాదాలలో. వారి తగాదా కాస్తా శృతి మించుతున్నది అనంగా ప్రసాద్
గారు ’చెట్టీ’ అని గానీ ’సుబ్బయ్యా’ అని గాని గట్టిగా కేక వేసే వారు తమ గది నుంచే.
అంతే ఎక్కడి దొంగలు అక్కడనే గప్
చుప్ అన్నట్టు రెండు వర్గాల వారు తమ వైషమ్యాలు మరచిపోయి కసువు ఊడ్చటంలోనో, నీళ్ళూ పెట్టి తుడవటంలో నో మునిగిపోయేవారు. కానీ నిశ్శబ్దంగా
ఒకరిని ఒకరు కొరకొర చూసుకోవటం మానుకొనే వారు కాదు.
ఇవన్నీ ఒకెత్తు. ఈ వెంకటేశ్వరా
లాడ్జి ఎదురుగా ఉన్న హోటల్ రాజధాని ఒకెత్తు. స్నానం పానం అవగొట్టి ఉదయాన్నే ఈ
రాజధాని హోటల్ కి వెళ్ళీ మసాల దోశె, ఇడ్లీ,
వడ, కాఫీ గట్రాలు తీసుకుంటే స్వర్గం
కనిపించేది.
మా డ్యూటికి వెళ్ళే టైం పది పయినే
కావటం వల్ల ఇలా ఉదయాలను చాలా ఆనందంగా గడిపెవారం.
డైలీ రిపొర్ట్ వ్రాసి పోస్ట్ చేయటం, వర్క్ ప్లాన్ చేసుకోవటం, న్యూస్ పేపర్లు
చదువుకోవటం ఇలా నింపాదిగా గడిచిపోయేది. ఒక్కోసారి మంచి మూడ్ వస్తే ఉదయాన్నే స్నానం
చేయ్యంగానే ఎదురుగా ఉన్న శివాలయం కి కూడా వెళ్ళే వాడిని. చాలా పెద్ద ప్రాంగణం,
చాలా పురాతన ఆలయం అది. అక్కడనే సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణ
చార్యులు గారు కూర్చుని తమ శివతాండవ స్త్రోత్రం వ్రాశారని చెబుతారు.
నిజానికి కడపజిల్లాలో
ప్రొద్దటూరుని ’సాంస్కృతిక రాజధాని గా’ పేర్కొంటారు. ఈ శివాలయం వీధిలో ప్రధాన రోడ్
జంక్షన్ లో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి కాంశ్యవిగ్రహం కూడా ఉంది. ఆ
విధంగా ఆయన్ని గౌరవించడం ద్వారా ప్రొద్దటూర్ వాసులు తమ ఉత్తమ సంస్కారాన్ని
చాటుకున్నారు అని చెప్పవచ్చు.
ఇక డ్యూటికి వెళ్ళి వచ్చిన తరువాత, ఎక్కడ భోంచేయాలి అన్న విషయం లో మధ్యాహ్నం లంచ్ టయానికి మనకు మూడు నాలుగు
ఆప్షన్స్ ఉండేవి.
ఒకటీ ఈ శివాలయం ప్రక్కనే ఉన్న
మళయాళీ బ్రహ్మణుడు నంబూద్రిగారి మెస్స్ లో భోంచేయవచ్చు.
రెండు వెంకటేశ్వరా లాడ్జి వెనుక
ఉన్న భాష్యకారుల వీధిలో ఉన్న మరో బ్రహ్మిణ్ కృష్ణమూర్తి గారి మెస్స్ లో
భోంచేయవచ్చు.
మూడు పొద్దున్న టిపిన్ తిన్న
రాజధాని హోటల్లోనే తినటం ఇంకో ఆప్షన్.
చివరిగా బస్టాండ్ రూట్ లో ఉన్నమరో
హోటల్ ’తిలక’. ఎందుకో మరి మా చివరి ప్రాధాన్యత తిలక కి ఉండేది.
శ్రీశ్రీగారి కవిత సంధ్యాసమస్యలు
లోకన్నా ఈ మధ్యాహ్న సమస్య చాలా పెద్దదిగా
ఉండేది. మాకు తిలకని మినహాయిస్తే మిగతా మూడు , ఒక
దానితో ఒకటి పోటి పడేవి రుచి విషయంలొ.
ఏది ఏమయినా నంబూద్రి గారి మెస్స్
లో ఎక్కువ గా తినే వాడిని. ఆయన పర్సనలైజ్డ్ అటెన్షన్ పే చేసేవాడు. ’రండి రండి
కాళ్ళూచేతులు కడుక్కోండి అయిపోవచ్చింది భోజనం. ఆలశ్యం అయిందేమి?’ అనో,
’డ్యూటీ ఎప్పుడూ ఉండేదే సర్. వేళకు
తిండి తినాలి’ అనో
”ఎట్లా ఉన్నాయి సేల్స్?" అనో పలకరించేవాడు.
చక్కగా ఆకుపచ్చటి అరిటాకు పరచి, దాని మీద నీళ్ళూ చిలకరించి ఉప్పు, ఎర్రటి
మామిడికాయ ఊరగాయ, పచ్చడి, పప్పు,
ఎప్పుడైనా స్వీట్, అప్పడం,పెరుగు కప్పు ఇలా అన్నీ ఇంటల్లుడికి అమర్చినట్టు అమర్చి, టేబుల్ ఫ్యాన్ ని మన దిశగా వచ్చేటట్టు అమర్చి, వేడి
వేడి అన్నం, కమ్మటి నెయ్యి వడ్డించి ’కడుపు నిండా తినండి,
ఈ వెధవ సేల్స్, టార్గెట్స్ ఎప్పుడు
ఉండేవె" అని ధైర్యం చెప్పేవాడు.
మాలో కేరళా వారితో, తమిళ వారితో మరికొంచెం
ఆప్యాయంగా వ్యవహరించే వారు. మా అందరి కంపెనీలు, మా
ప్రాడక్ట్స్ కూడా గుర్తుఉండేవి ఆయనకి.
మా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఆ
విడత టూర్ కు రాకుంటే వారి గూర్చి అభిమానంగా విచారించుకునేవారు. ఈయన్ని ప్రేరణగా
తీసుకుని నేను వ్రాసిన కథ ’ఇడ్లీ బాబాయి" కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో
ప్రచురితం అయింది కూడా.
ఇంకో మెస్స్ నడిపే కృష్ణమూర్తి
గారు కాస్తా గంభీరం. అయినా టేస్ట్ విషయంలో రాజిపడేవారు కాదు.
నిజం చెప్పద్దు, ఈ మూడు చోట్లా తినటానికి అని అయినా సరే ఒక్కోసారి ఇక్కడ పనేమి
లేకున్నా ’స్టాకిస్ట్ వర్క్’ అని వ్రాస్కుని ప్రొద్దటూర్ కి వెళ్ళే వాడిని.
ఇక సెకండ్ షో సినిమాలు ఇంకో ఎత్తు.
నాకు సినిమాలు చూసే అలవాటే లేదు. కానీ ఈ ప్రొద్దుటురు స్టేలవల్ల నేను సెకండ్ షో
సినిమాలు బాగా చూశాను.
’ఘరానామొగుడు, అల్లరిప్రియుడు, మేజర్ చంద్రకాంత్,
వంశీ ప్రేమ అండ్ కో, నీకు పదహారు నాకు
పద్దెనిమిది ఇలా చూసినవె.
ఆ రోజుల్లో నాకు అలవడిన మరో పెద్ద
దురలవాటు మేగజైన్లు కొనడం. అవుట్ లుక్, ది
వీక్, ఇండియా టుడే, ఫిల్మ్ ఫేర్,
ఆటో ఇండియా ఇలా కొని పారేసే వాడిని.
ఆ రోజుల్లో సెల్ ఫోన్లు ఉండేవి
కావు.
ఇలా గడిచిపోయేవి ఆ రోజులు.
ఇంకా ఏదయినా గుర్తు వస్తే తర్వాత
వ్రాస్తాను.
రైల్వే లైన్ కొత్తగా
వేశారు ఇటీవల, అప్పట్లో రైల్వే స్టేషన్
ఉండేది కాదు ప్రొద్దటురు లో.
ఈ క్రింద ఇచ్చిన ఫోటో
గూగుల్ లో దొరికింది. బహుశా ఇటీవల రైల్వే లైన్ వచ్చిందనుకుంటాను.
No comments:
Post a Comment