Tuesday, May 3, 2022

అరుణ్ అలియాస్ గోపాల కృష్ణ Part 2

 అరుణ్ అలియాస్ గోపాల కృష్ణ

ఒక ఙ్జాపకం-37

 

మామూలుగా ప్రారంభం అయిన ఆ ప్రయాణం నాకు ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుందని నేను చూచాయగా కూడా ఊహించలేదు ఆ రోజు.

అదేదో సినిమాలో త్రివిక్రం శ్రీనివాస్ మాటలు గుర్తువస్తున్నాయి. ’అద్బుతం జరిగే ముందు ఎవరికీ తెలియదు, జరిగాకా చెప్పల్సిన పని లేదు’ అని. సరిగా నా కళ్ళముందరే అద్భుతం ఆవిష్కృతం అయింది ఆ రోజు.

ఇది ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి అనుభూతినే కలిగిస్తుంది. చివరిదాకా చదవండి. మీకు విస్మయం కలగటం ఖాయం.

*****

హిందూపురం రైల్వే స్టేషన్. సమయం సాయంత్రం ఏడు దాటి ఉంటుంది.

చిన్న ఊళ్ళలో రైల్వే స్టేషన్లు చాలా ఇష్టం నాకు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడి వాతావరణం.

కుర్ల (ముంబయి) నుంచి కోయంబత్తూరుకు వెళ్ళే రైలు కోసం ఎదురుచూస్తున్నాను.  నన్ను స్టేషన్ లో వదిలిపెట్టే దానికి మా మామయ్య వచ్చారు.

మా శ్రీమతి మొదటి కాన్పుకై వచ్చి మాపెద్దమ్మాయి శ్రావ్యకి జన్మనిచ్చిన సందర్భం అది. నేను కోయంబత్తూరు లో పని చేస్తున్నాను అప్పట్లో.

నెలకు ఒక సారి బెంగళూరులో కాన్ఫరెన్సు ఉండేది, అది చూసుకుని అట్నుంచి అటే దగ్గర్లో ఉన్న హిందూపురం కి వచ్చేసే వాడిని. పతి నెలా ఒకసారి కంపెనీ పని మీద ధర్మపురి (హొగినెక్కల్ జలపాతం) వరకు వచ్చేవాడిని, అప్పుడు కూడా హొసూరు బెంగళూరు మీద హిందూపురంకి వచ్చేసేవాడిని. ఒక్కడికే బోరుకొట్టేది కోయంబత్తూరు లో. ఏతావాతా  దాదాపు పదహైదు రోజులకు ఒకసారి వచ్చి పాపను చూసే మిష మీద అత్తగారింటికి వచ్చి ఒకట్రెండు రోజులు గడిపి వెళ్ళేవాడిని.

ఇదిగో ఆ పరంపరలో భాగంగానే ఇప్పుడు తిరిగి కోయంబత్తూరు రైలు ఎక్కడానికి ఎదురు చూస్తూ ఉన్నాను.

ఈ కథకి సంబంధం లేకున్నా హిందూపురం రైల్వే స్టేషన్ గూర్చి నాలుగు ముక్కలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. 

లేపాక్షి కి వెళ్ళే మార్గంలో, ఊరికి కాస్తా దూరంగా  ఉంటుంది హిందూపురం రైల్వే స్టేషన్. నేను ఎప్పుడు చూసినా సాయంత్రాలే చూడ్డం వల్ల నాకు ఆ చల్లటి వాతావరణమే గుర్తు వస్తుంది.

ఆ వేళ వాతావరణం చిరు చలిగా ఉంది. పల్చటి వెన్నల చాలా ఆహ్లాదంగా ఉంది. జనం చాలా తక్కువగా ఉంటారు సహజంగానే ఆ స్టేషన్ లో. మా కోచ్ ఎక్కడ ఆగుతుందో తెల్సుకుని అక్కడే ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నాము నేను మా మామయ్యగారు.  దూరంగా ఎక్కడో గుడి నుంచి లీలగా భక్తిగీతాలు వినిపిస్తున్నాయి.

అంతటి ప్రశాంతమైన వాతావరణం వదిలి మళ్ళీ రణగొణ ధ్వనులతో నిండిన నగరవాతావరణానికి వెళ్ళాలి అంటే ఏదో లాగా ఉంటుంది మనసుకు, కాని తప్పదు కద.

కాసేపట్లో రైలు రానే వచ్చింది. ముందరే రిజర్వ్ చేసుకున్న స్లీపర్ క్లాసు కంపార్టెమెంట్ లోకి చేరుకుని మామయ్యకి వీడ్కోలు పలికి రైల్లో సెటిల్ అయ్యాను.

రైలు బయలుదేరింది.

"వివేక్ జీ" అన్నపిలుపు విని ఆశ్చర్యంగా తలతిప్పి చూశాను.

"హిందూపురం లో మీరు ఎక్కుతారు అని నాకు బలంగా అనిపిస్తూ ఉండింది. రైలు తెలుగు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి మీ కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ కంపార్ట్ మెంట్ లో  నా ప్రక్కనే నిలబడి ఉన్నాడు అరుణ్. మీకు గుర్తు ఉండే ఉంటుంది ఇతని గురించి నా ఙ్జాపకం 35 లో చెప్పుకున్నాము.

"హెల్లో అరుణ్, వాటే సర్పైజ్. మీరు ఇలా ఈ ట్రెయిన్లో ఇలా ఇక్కడ, అయాం ప్లెజంట్లీ సర్పైర్జ్" అన్నాను

మా సంభాషణ యావత్తు హిందీ, తమిళ్, ఇంగ్లీష్ లలో సాగుతోంది. అతనికి తెలుగు రాదు మరి.

"ఎస్. మేము చిన్మాయా యువకేంద్ర వారి ’చిక్’ (CHYK) కార్యక్రమంలో పాల్గొని వస్తున్నాము. అది చాలా పెద్ద ఈవెంట్. భారతదేశం నుంచి అన్నిప్రాంతాల నుంచి చిన్మయా మిషన్ యువ కార్యకర్తలం అందరం పాల్గొన్నాము. మేమంతా కూడా తమిళనాడు నుంచి వెళ్ళాము. మూడు బోగీల తర్వాత మా కంపార్ట్మెంట్ ఉంది. అక్కడికి తీసుకువెళదాము మిమ్మల్ని అని వచ్చాను" అని  ఉత్సాహంగా చెప్పాడు.

"నేను ఈ కంపార్ట్మెంట్ లో ఉన్నానని మికు ఎలా తెల్సు?" ఆశ్చర్యంతో అడగటం నా వంతయ్యింది.

"చెప్పాను కదా. రైలు తెలుగు రాష్ట్రంలోకి ప్రవేశించింది లగాయతు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటున్నాను. హిందూపురం స్టేషన్ అనంగానే అప్రమత్తంగా ప్లాట్ ఫాం వంక చూస్తుండి పోయాను మా బోగీ డోర్ దగ్గర నిలబడి. మీరు కనపడానే కనపడ్డారు. మీరు ఈ బోగీ లోకి ఎక్కడం చూసి, నేరుగా వచ్చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు అరుణ్.

ఆ తర్వాత అతను చేసిన హడావుడి మాటల్లో చెప్పలేను. వాళ్ళ బోగీ లోంచి ఒక వంటరి ప్రయాణీకుడిని ఈ కంపార్ట్ మెంట్ కి మారటానికి ఒప్పించి, అతని లగేజితో సహా అతన్ని కొన్ని నిమిషాల వ్యవధిలో తీస్కుని వచ్చి నన్ను ఉన్నపళంగా వాళ్ళ కంపార్ట్ మెంట్ కి చేరవేశాడు.

ఆ కంపార్ట్ మెంట్ లో ని వాతావరణం గూర్చి చెప్పాలి అంటే ఒకే ఒక ముక్కలో సంస్కార భరితమైన చైతన్యానికి ప్రతి రూపంలాగా ఉంది అక్కడ.

వాళ్ళంతా ఇరవై ఇరవై అయిదు సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులు. అందరూ ఉత్సాహానికి మారుపేరులా ఉన్నారు.

దాదాపు సగం కంపార్ట్ మెంట్ వారే ఉన్నారు.

అరుణ్ చేసిన మొదటి పని నన్ను వారందరికీ పరిచయం చేశాడు. వారంతా ఎంతో పద్దతిగా నమస్కారం చేశారు.  వారందరిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న మరో సుగుణం చక్కటి సంస్కారం.

వీళ్ళలో కాస్తా లీడర్ లాగా కనిపిస్తున్న ఆయన కూడా యువకుడే. ఆయన వస్త్ర ధారణ బట్టి చూస్తే ఏదో పీజీ చేస్తున్న కాలేజీ స్టూడెంట్ లాగా ఉన్నాడు. కానీ అయన సన్యాసం స్వీకరించబోతున్నారని తెలిసింది, అరుణ్ ఆయన్ని పరిచయం చేసినప్పుడు. ఆయన మొహం ఎంతో ప్రశాంతత ఉంది. ఆయన మొహం పై చిరునవ్వు చెదరడం లేదు. ఆయన చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆయన మాటల్ని ఆ యువతీ యువకులు అందరూ శిరసావహిస్తున్నారు. అలాగన్చెప్పి ఆయన గట్టిగా కేకలు వేసి ఏమి చెప్పడం లేదు.

ఇంకాసేపట్లో ఆయన విశ్వరూపాన్ని నేను చూడబోతున్నానని నాకా క్షణంలో తెలియదు.

ఆయన్తో మాట్లాడినంత సేపు చాలా  ప్రశాంతంగా అనిపించింది. ఆయన పెద్ద చదువులు చదువుకుని, విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా వదిలేసి, ఇప్పుడు పూర్తి స్థాయి లో సన్యాసాశ్రమం తీసుకోబోతున్నారని అని నాకు తెలిసింది.

నాకు చిన్మయా మిషన్ సంస్థ గూర్చి తెలిసింది చాలా తక్కువ.  ఆ తర్వాత కూడా నేను వారిని ఎవ్వరిని కలువలేదు. కాకపోతే చాలా మంచి సంస్థ అని అభిప్రాయం కలిగించి.

కళ్ళు చెదిరే లాంటి అందం ఉన్న అమ్మాయిలు ఉన్నారు ఆ సమూహంలొ. అయినా ఏ ఒక్కరూ హద్దులు మీరి ప్రవర్తించటం, వెకిలిగా మాట్లాడటం చేయటం లేదు.

వాస్తవానికి వారందరూ కూడా ప్యాంట్లు, టీ షర్టులు లాంటి ఆధునిక దుస్తులు ధరించి ఉన్నారు అయినా వారిలో ఏ ఒక్కరూ అసభ్యంగా లేరు.

యువతీ యువకులు జట్టుగా  ఉంటే వాతావరణం ఎలా ఉంటుంది అని మనకు సినిమాలు నిత్యం బోధిస్తూ ఉన్నాయి కద. ఈ వతావరణం అందుకు భిన్నంగా ఉంది. నాకు మన సినిమా డైరెక్టర్లకు ఈ వాతావరణం చూపాలని అనిపించింది.

అందరూ కలిసి కాసేపు ఏదో భజన చేసుకున్నారు, సత్సంగం లాగా ఏదో మాటలు చెప్పుకున్నారు. జోకులు వేసుకున్నారు, అంత్యాక్షరీ ఆడుకున్నారు.

ఇంతలో డిన్నర్ టయిం అయిందని చెప్పి అమ్మాయిలు చక చక వడ్డనలకు దిగిపోయారు.

ఆ వాతావరణం నాకు చాలా నచ్చింది.

ఒక మంచి వాతావరణం కల్పిస్తే యువత ఎంత చక్కగా మసలుకుంటారు కద అని అనిపించింది నాకు. ఆ తరువాత ఇదే అభిప్రాయం శ్రీ శ్రీ రవిశంకర్ మాష్టర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసుల్లో కూడా చూశాను, ఇటీవల సద్గురు జగ్గీవాసుదేవ్ గారి అనుయాయులుగా ఉన్న యువతీ యువకులలోనూ చూశాను.

నేను చురుగ్గా పాల్గొంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో కూడా యువకులలో ఉత్తమ సంస్కారాలను పాదుగొలిపే ప్రక్రియ చూశాను. (ఆరెస్సెస్ లో స్త్రీలకు వేరె ప్రత్యేక విభాగం ఉంటుంది).

 

సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి గురించి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తో నా అనుభవాలు, బ్రహ్మకుమారీస్ సంఘంతో నా అనుభవాలు రాగల ఙ్జాపకాలలో పంచుకుంటాను. అలాగే నేను దర్శించిన అమృతానందమయి మాత , ఇతర సద్గురువులు, దత్త క్షేత్రాలు, వీటన్నింటిని గూర్చి కూడా రాగల ఙ్జాపకాలలో వ్రాస్తాను.

 

సరే మళ్ళీ కథలోకి వద్దాం.

అప్పటికి సమయం రాత్రి పది దాటి ఉంటుంది.

భోజనాలు అయ్యాయి. అంతా ఇక బెర్తులు వాల్చుకుని పడుకుందాము అనుకునే లోపు ఒక సంఘటన జరిగింది.

ఆ కంపార్ట్‍మెంట్ లో వేరే ఇతర ప్రయాణీకులు కూడా ఉన్నారు కద. వారిలో ఒక నడి వయస్కుడు మొదటి నుంచి కూడా కాస్తా తేడాగా ఉన్నాడు. అతడు కోయంబత్తూరులో స్థిరపడిన మళయాళీ అన్నది అర్థం అయ్యింది అతని మాటల్ని బట్టి.

సరే అరుణ్ వాళ్ళ లీడర్ లాంటి యువకుడు బ్రహ్మచారి అన్నాను కద, ఆయన బెర్తు ఎదురుగా కూర్చున్నాడు ఈ మళయాళి అతను.

అతను ఈ బ్రహ్మచారి వంక చులకనగా చూస్తూ ’దేవుడు లేడు, గీవుడు లేడు. మీరు ఇలా యువతీ యువకులని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు" అంటూ ఒక లూజ్ కామెంట్ చేశాడు.

ఇందాకే చెప్పాను కద ఈ గురువు గారు ఉద్రేక పడరని. చిరునవ్వు తో తల పంకింస్తూ

"మీ సందేహాలన్నీ చెప్పండి". అని ఆయన్ని ప్రోత్సహించారు.

భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో అర్జునుడు మాత్రమే మాట్లాడతాడు. అతని సందేహాలన్నీ విన్న తరువాత శ్రీ కృష్ణుడు మాట్లాడటం మొదలెడతాడు. ఎందుకో ఆ పోలిక గుర్తు వచ్చింది ఆ క్షణంలో.

అవకాశం దొరికిందే చాలని ఆ నాస్తిక శిఖామణి దైవ దూషణ చేస్తూ వీలయినంత చౌకబారు భాషలో తన హైందవ ద్వేషాన్నీ, సాధువులపట్ల వ్యతిరేకతని వ్యక్త పరిచాడు.

ఆయన చెప్పిందంతా వింటుండి పోయారు ఈ బ్రహ్మచారి గురువు గారు.

మధ్య మధ్యలో చిరునవ్వుతో ’ఇంకా చెప్పండి’ అంటూ అతన్ని ప్రోత్సహించారు.

ఆ దైవ ద్వేషి తన అక్కసునంతా వెళ్ళగక్కి వెళ్ళగక్కి అలసి పోయాడు.

"ఇంక మీ పని అయిపోయిందిలే స్వాములూ" అంటూ వెటకారంగా అని కాలి మీద కాలు వేసుకుని బెర్తుకు చేరగిలబడి కూర్చున్నాడు.

సమయం దాదాపు పదిన్నర అయుంటుంది. చీకటిని చీల్చుకుంటూ  రైలు వేగంగా వెళుతూనే ఉంది.

ఈ బ్రహ్మచారి గురువు గారు గొంతు సవరించుకుని ప్రేమ ,అర్ద్రత నిండిన కంఠంతో మాట్లాడటం ప్రారంభించారు.

ఆయన మాటల్లో కోపం గానీ, ద్వేషంగానీ, వెటకారం గానీ లేవు. అఙ్జానంతో ఉన్న కొడుకుతో ఒక తల్లి ఎలా అనునయంగా మాట్లాడుతుందో అలా మొదలెట్టారు.

ఆయన చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతు మధ్య మధ్యలో ఆ నాస్తికుడితో "ఏమంటారు?" అని అడుగుతూ, ప్రతి సారి ఆ నాస్తుకుడు అయనతో ఏకీభవించిన తర్వాతనే తన తదుపరి వాక్యాలని ప్రారంభిస్తూ తన ఉపన్యాసాన్ని కొనసాగించారు.

ఆయన గొంతులో ఏదో మాయాజాలం ఉంది.

నిద్రకుపక్రమించబోతున్న యువతి యువకులు అందరూ ఇతర కూపేలలోంచి వచ్చి ఈ కూపేలో గుమిగూడటం ప్రారంభించారు. నేల మీద కూర్చుని కొందరు, నించుని కొందరు, అందరూ శ్రద్ధగా ఆయన మాటలు వినడం ప్రారంభించారు.

అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు విస్తృతంగా వ్యాప్తిలోకి రాలేదు. ఒకరిద్దరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నా మామూలు నోకియా బేసిక్ ఫీచర్ ఫోన్లు.

ఆయన మాటల్ని వీడియోలో బంధించలేకపోయానే అన్న వెలితి నాకు ఉండి పోయింది.

ఒక మూర్ఖుడి కోసం ఆయన తన శక్తి యుక్తుల్ని వృధా చేసుకుంటున్నాడే అన్న భావం కలిగింది నాకు. ఆయన ఎక్కడా కూడా బాలన్స్ కోల్పొకుండా , సంయమనంతో సరిఅయిన ఉదాహరణలు ఇస్తూ, మాట్లాడుతూ ఉండిపోయాడు.

ఆయన మాటలు యధాతథంగా నాకు గుర్తు లేవు కానీ ఆయన వాక్పటిమ, ఎదుటువారిని నచ్చజెపుతూ వారికి అర్థమయ్యేవిధంగా విషయం చెప్పే విధం చూసి డంగైపోయాను.

మొదట చిన్న చిన్న ఉదాహరణలు గాలిని మనం చూడలేము కద ,గాలి లేదనలేము కద అన్నట్టు మొదలెట్టి, మనకు తెలియని , మన అనుభవం లో లేని ప్రతిదీ లేదనకూడదు కద అంటూ విషయంలోకి నేరుగా వెళ్ళారు.

ఎడారి దేశాలవారికి వాన అన్న , నదులు అన్నా అనుభవం లో లేని విషయం అంత మాత్రాన వారు నదులను నమ్మము, వానను విశ్వసించము అని అనుకోరాదు కద అంటూ మామూలుగానే చిన్న చిన్న లాజిక్ లు తీశారు.

వింటూండి పోయాము. సంభాషణ యావత్తూ ఆంగ్లంలో , అప్పుడప్పుడూ తమిళ్ లో, హిందిలో సాగుతోంది.

ఆయన ఉన్నట్టుండి రామాయణం మొత్తం కట్టు కథ అనుకుందాము అని బాంబు పేల్చారు. అసలు రాముడు అనేవాడే పుట్టలేదు అనుకుందాము అని మరో బాంబు పేల్చారు.

కానీ ఒక ఆదర్శపురుషుడు ఎలా ఉండాలో ఆ కథ ద్వారా తెలుసుకుంటే తప్పేమి లేదు కద అని తర్కం తీస్తూ సంభాషణను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళారు.

యధా ప్రకారం ఆ నాస్తిక శిఖామణీ, రాముడు వాలిని చాటుగా చంపటం గూర్చి, సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించటం గూర్చి, కడుపుతో ఉన్న స్త్రీని అడవుల పాల్జేయటం గూర్చి తర్కం లేవనెత్తాడు.

ఆ బ్రహ్మ చారి గారికి అర్థం అయింది తన ఎదురుగా ఉన్నది కరడు కట్టిన నాస్తిక శిఖామణి అని. మామూలు తర్కాలు వివరణలు పనిచేయవని అర్థం చేసుకుని ఆయన కొన్ని శ్లోకాలను ఉటంకిస్తూ ఆయా చర్యల వెనుక ఉన్న తార్కిక అర్థాలను వివరిస్తు ఆ నాస్తిక శిఖామణీని నోరెత్తలేనివిధంగా సమాధానం చెప్పారు. అవన్నీ నేను నోట్ చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అన్న కొదవ, ఆ యావత్తు సంభాషణనీ వీడియో తీయలేకపోయానే అన్న కొదవ, కనీసం ఆయన ఫోటో తీసుకోలేకపోయానే అన్న కొదవ నాకు ఇప్పటికీ ఉంది.

ఇవన్నీ ఒకెత్తు. రామాయణాన్ని ఆయన మానవ శరీరంతో సరిపోలుస్తూ  చెప్పిన తీరు ఒక్కటీ ఒకెత్తు. మనసుని ఏకాగ్ర చిత్తంతో ఙ్జానం పొందటం పట్ల కేంద్రీకరిస్తే మనము సాధించలేని అద్భుతాలు లేవని చెపుతూ, రామాయణం లోని లంకలో బంధింపబడ్డ సీతాదేవిని మనం పొందాల్సిన ఙ్జానంగా పేర్కొంటూ, దాన్నే యోగులు కుండలినీ జాగృతం కావటం అంటారని, అతనికి అర్థం అయ్యేలా ’అవేకెనింగ్ ది జెయింట్ వితిన్’ అంటూ చెప్పుకోచ్చారు.  దాదాపు ఇరవై ఒక్క ఏళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటనలో ఆయన చెప్పిన విషయాలు యధాతథంగా గుర్తు లేకున్నా చివరగా రామాయణంతో మన శరీర నిర్మాణాన్ని మెదడుని, మనస్సుని పోల్చి చెప్పిన అంశాలు నాకు చూచాయగా గుర్తు ఉన్నాయి.  ఇటీవల సుందరకాండ ప్రవచనంలో ఇదే విషయాల్ని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పగా విని నాకు ఒళ్ళు గగుర్పొడిచింది.

మన ఋషులూ, యోగులు అందరూ సైంటిస్టులే అని ఆయన చెప్పారు, ఈయనా చెప్పారు. నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. వేదాల్లో ఉన్నవి నిత్య సత్యాలు అని. అర్థం కాని వారి గూర్చి నేనేమి చేయలేను, ఆ బ్రహ్మచారి గారిలాగా ఎవ్వరిని ఓపిగ్గా కన్విన్స్ చేయలేను.

మొత్తం మీద ఈ సంభాషణ, సంవాదం జరుగుతున్నంతసేపు మాకు ఎవ్వరికీ కాలం తెలియలేదు. ఆ రైలు బెంగళూరులో దాదాపు నలభై అయిదు నిమిషాలు ఆగుతుంది. అయినా ఎవ్వరూ దిగటంకానీ ప్లాట్‍ఫాంపై తిరగటం కానీ చేయలేదు. శ్రద్దగా కూర్చుని వింటుండి పోయారు.

నాకు గురుతు ఉన్నంత వరకు తెల్లవారు ఝామున మూడింటి వరకు సాగింది ఈ సంవాదం.

ఆ నాస్తికుడు కూర్చున్న విధానమ్ మారిపోయింది. కాలి మీద కాలు తీసేశాడు. లుంగీ పాదాల దాకా సర్దుకుని కూర్చున్నాడు. కాసేపట్లో అతని ప్రవర్తనలో విపరీతమైన మార్పు వచ్చింది.

చేతులు కట్టుకుని భక్తిగా కూర్చున్నాడు.

కాసేపటికి అతనికి గొంతు పెగలలేదు. కళ్ళు సజలమయ్యాయి. శరీరం ఒక విధమైన భావోద్రేకం తో వణకటం మొదలెట్టింది. కూర్చున్న వాడల్ల హటాత్తుగా లేచి నిలబడి  బ్రహ్మచారి కాళ్ళమీదపడిపోయి కాళ్ళని గట్టిగా వాటేసుకుని "స్వామీ నన్ను క్షమించండి. అఙ్జానం వల్ల కళ్ళూ పొరలు కమ్మాయి నాకు ఇన్నాళ్ళూ. నాకు మీరు కళ్ళూ తెరిపించారు దైవదూషణ, గోమాంస భక్షణ, సాధువులని అవమానించటం ఇదే నా జీవన విధానంగా గడిపాను ఇన్నాళ్ళూ. మీరు నాకు ముందే ఎందుకు తారస పడలేదు? ఇన్నేళ్ళు నేను ఎంత పాపం మూటగట్టుకున్నానో" అంటూ భోరున ఏడవటం ప్రారంభించారు.

యువతీ యువకులు అందరు ఒక్కుమ్మడిగా చప్పట్లు కొట్టబోయారు. ఆయన ఒక్క కంటి సైగతో వారందరినీ నిలువరించారు.

ఈ సంఘటనను నేను ప్రత్యక్షంగా చూడకుండా ఉండుంటే, నేను అస్సలు నమ్మేవాడిని కాదు. కేవలం సంభాషణతో ఒక మనిషిలో ఇంత మార్పు కలగడం అన్నది నేను కళ్ళార చూసిన క్షణాలు అవి.

నేను కూడా రైలు దిగే ముందు ఆయన పాదాలకు నమస్కరించి ’ఒక్కడి కోసం (ఒక్క మూర్ఖుడి కోసం) విశ్రాంతి తీస్కోకుండా, రాత్రంతా అంత ప్రయాస ఎందుకు పడ్డారు?’ అని అడిగాను.

ఆయన మందహాసంతో చెప్పారు. "మామూలు మూర్ఖ భక్తులకన్నానాస్తికులలోనే సత్యాన్వేషణ తీవ్రంగా ఉంటుందని, వారు చెడ్డవారు కాదని, వారికి సరి అయిన విధంగా మార్గదర్శనం చేస్తే వారు వేగంగా ఙ్జానంలోకి వస్తారు అని, లేకుంటే వారు నిత్యకృత్యంగా అనేక మంది సన్మార్గులను పెడత్రోవ పట్టిస్తారు అని, కాబట్టి భక్తులకు ఙ్జానబోధ చేసినా చేయకున్నా నాస్తికులకు ఙ్జానబోధ చేయటం ఆవశ్యకమని ఆయన చెప్పారు. నాకు నిజమే కద అనిపించింది. నేను ఎలాగు ఆ పని చేయలేను తగినంత ఙ్జానం లేక పోవటం వల్ల.

ఆ బ్రహ్మ చారి గారి పేరు, ఆయన అడ్రసు, ఫోన్ నెంబర్, ఫోటొ ఏవీ నేను సేకరించలేకపోయానే అని నేను ఇప్పటికీ బాధపడుతుంటాను.

 

అదండీ విషయం.

 

 

 

 

No comments:

Post a Comment