Tuesday, May 3, 2022

సుందరమూర్తి

సుందరమూర్తి

ఒక ఙ్జాపకం 52

 

నా దగ్గర లేత స్కై బ్లూ రంగులో స్పన్ మటీరియల్ చొక్కా ఒకటి ఉంది.

ఓ రెండేళ్ళ క్రితం ఆ చొక్కా వేసుకుని ఆఫీస్ కెళ్ళాను. ఆ రోజు ఆఫీస్ కెళ్తూ వెళ్తూ కార్ ని సర్వీసింగ్ కి ఇచ్చి వెళదాం అని ఒక ఆలోచన వచ్చింది.

నేరుగా కార్ ని మలక్ పేట లో సాబూ వారి సర్వీసింగ్ కి సెంటర్‍కి తీస్కువెళ్ళాను.

కార్ సర్వీస్ కిచ్చిన అనంతరం "బాబ్బాబు నన్ను కాస్త దిల్‍సుఖ్‍నగర్ లోని మా ఆఫీస్ లో డ్రాప్ చెయ్యరా" అని అడిగితే సరె అని ఒప్పుకున్నారు.

వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం అవుట్ పాస్ ఏదో రాయించుకుని రావటానికి వెళ్ళాడు ఆ సర్వీస్ సెంటర్ కుర్రాడు.

నేను గేట్ దగ్గర నిలబడి ఆ కుర్రాడి కోసం ఎదురుచూస్తున్నాను.

ఈ లోగా బయట నుంచి ఓ  పెద్దాయన కొత్త కారెసుకుని వచ్చి నా పక్కనే ఆపి, కాస్త పెద్ద గొంతుకతో నాపై కేకలు వేయటం మొదలెట్టాడు.

ఒక క్షణం నాకేమీ అర్థం కాలేదు.

ఆయన క్రితం సారి సర్విస్ కి ఇచ్చినపుడు వాళ్ళేదో కొద్దిగా తేడాగా చేశారట. అది ఆయన ఆక్రోశం.

అంతా బాగుంది. నామీద ఎందుకు ఎగరటం నాకు అర్థం కాలేదు మొదట. ఆ తరువాత ఆలోచిస్తే అర్థం అయింది అది నా స్కై బ్లూ కలర్ షర్ట్ మహిమ అని.

సాబూలో సర్వీస్ ఇంజినీర్ల యూనిఫాం షర్ట్ కలర్ ఇంచుమించు నా షర్ట్ కలర్ లోనే ఉంది.

దాంతోటి ఆయన నన్ను అక్కడి స్టాఫ్ అనుకుంటున్నాడులా ఉంది.

నేను ఆయన మాటలు విన్నంత సేపు విని, ఆయన చెప్పటం ఆపాక, చిరునవ్వు నవ్వుతూ చెప్పాను. "అవునండి, వీళ్ళకు  పని వత్తిడి ఎక్కువ అయింది,  మీరెళ్ళి కాస్త సావధానంగా చెప్పండి లోపల సర్వీస్ ఇంజినీర్స్‌తో, ఇబ్బందేమి లేదు. వాళ్ళు సరి చేయగలరు" అని.

అంటే ఏమిటి, ఆయన నన్ను సర్వీస్ ఇంజినీర్ అని అనుకుని పొరపడ్డారు అని నాకు తెలియనట్టు, సాటి కష్టమర్ గా ఆయన తన కష్టాలు నాకు చెప్పుకుంటుంటే, నేను సానుభూతితో నేను ఆయన కష్టాలు విన్నట్టు పిక్చర్ ఇచ్చాను.

ఆయన కూడా నాలుక కరచుకుని, వెంటనే "చూద్దాం ఈ సారి ఎలా చేస్తారో, హావ్ ఎ నైస్ డే" అనేసి లోనికి వెళ్ళి పోయాడు కార్‍తో.

ఇదంతా చూస్తున్న మిత్రుడు "నీకు కోపం రాలేదా ఆయన అంతలేసి మాటలంటుంటే" అన్నాడు

నెను అవును కి, కాదుకి మధ్యగా తలూపాను.

నా ఆలోచనలు అన్నీ కోయంబత్తూరు కి పరుగులు తీశాయి.

****

1997 లో కోయంబత్తూరుకి (కోవై అని కూడా అంటారు ఈ ఊరిని) ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు మొదటి సారి సుందరమూర్తిని చూడ్డం జరిగింది. అసలాయన్ని మొదటి సారి కలవడమే చాలా గమ్మత్తుగా జరిగింది.

ఇప్కా లాబ్స్  కోయంబత్తూర్ సేల్స్ బృందానికి కొత్త మేనేజర్ గా నన్ను పరిచయం చేసిఓ గెట్ ట్ గెదర్ ఏర్పాటు చేసే ఉద్దేశంతో మా రీజనల్ మేనేజర్ వెంకటేశం నన్ను చెన్నై నుంచి కోవై కి పిల్చుకు వచ్చారు.

క్రాస్ కట్ రోడ్ లో ఉన్న ట్రావెలర్స్ లాడ్జి లో నేను ఇతర ఏరియా మేనేజర్లు దిగాము, దానికి ఎదురుగా ఉన్న స్టార్ హోటల్ శ్రీ లక్ష్మిలో వెంకటేశం గారు దిగారు.

ఫార్మా మార్కెటింగ్ లో ఇలాంటి ప్రొటోకాల్స్ ఎక్కువ. హోదా మరియు రాంక్ ఆధారంగా కంపెనీ తరఫున అకామడేషన్ రిజర్వ్ అయిపోతుంది.

ఇక సుందర మూర్తిని ఎలా కలిసానో చెప్తాను.

బస్సు దిగి నేను లాడ్జ్ లో దిగిందే ఉదయం అయిదింటికి .  సమావేశం తొమ్మిదింటికి. అదే లాడ్జిలో ఇతర నా కొలీగ్స్ కూడా దిగారు. వారు తమిళనాడులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఏరియా సేల్స్ మేనేజర్లు. వారెవ్వరు నాకు ముఖ పరిచయం కూడా లేదు ఇది వరకు. కాబట్టి వారు ఎవరు, ఏఏ రూంలలో ఉన్నారు, వారెవరు ఇలా ఆరా తీసి వారిని కలిసే పని పెట్టుకోకుండా, మీటింగ్ కి తయారవడంలో నిమగ్నం అయ్యాను. మీటింగ్ లో ఎలాగూ పరిచయం అవుతారు కద అందరూ.

ఉదయం తొమ్మిదింటికి శ్రీలక్ష్మీ హోటల్లో సమావేశం, ఒక్క నిమిషం ఆలశ్యం అవకూడదు అని చెప్పి వెళ్ళాడు వెంకటేశం గారు. ఆయన చాలా మూడ్స్ మనిషి అని, డిసిప్లిన్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని నాకు బయలుదేరేటప్పుడే చెప్పారు.

ఈయనతో ఎందుకు గొడవ- సరయిన టైం కే వెళదాం అని చెప్పి,  తయారయ్యే హడావుడిలో ఉన్నాను. దంతధావనం, షేవింగ్ పూర్తయింది. స్నానం చేద్దామంటే, లాడ్జ్ బాయ్ వేడి నీళ్ళు తెస్తాను అని వెళ్ళిన వాడు ఇదిగో అదిగో అని నానుస్తున్నాడు. రెసెప్షన్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ’ఇదిగో పంపిస్తున్నాము సర్’ అని సమాధానం వస్తోంది.

బాయ్స్ కి వేడి నీళ్ళు అంటే అర్థం అవలేదు మొదట. వాళ్ళకి హాట్ వాటర్ అంటె కూడా అర్థం అవలేదు లేదా అలా నటించారో తెలియదు.   పక్క గదిలో ఎవరో ఉంటే వాళ్ళని అడిగి తమిళ్ లో వేణ్ణీళ్ళని ’సూడ తన్నీర్’ అంటారని నేర్చుకుని, లుంగీ కట్టుకున్న ఆ కుర్రాడికి సూడ తన్నీర్ అని చెప్పాను. నాలో ఒక అతిశయం, ఒక తమిళ పదం నేర్చుకున్నానని.

సన్నగా, నల్లగా రివటలా ఉన్న ఆ కుర్రాడు నా ఉచ్చారణకి నవ్వుకుంటూ ’చుడ తన్నీ’ అని అనాలని చెప్పాడు.

ఆ తరువాత అది గ్రామ్యం అని, సూడ తన్ని అనే పద ప్రయోగమే సరిఅయినది అని విఙ్జులు చెప్పారు.

కానీ ఆ కుర్రాడు మాత్రం, మూగ మనసులులో, చిలకా కాదు, సిలకా అనాలని  అని నాగేశ్వరరావు సావిత్రికి చెప్పినట్టు చెప్పాడు.

అది వేరే సంగతి. అలా నాకు తమిళ ఉఛ్చారణ బొధించి వెళ్ళాడు ఈ అపర నాగేశ్వరరావు.

సరే చుడతన్నీగా పిలవబడే ఈ సూడ తన్నీర్ ఏదైతే ఉందో అది ఎంత సేపటికి నా గది చేరలేదు. ఉండేది ఉండంగా ఆ లుంగీ నాగేశ్వరరావు నా గదిలో ఉండే బకేట్ కూడా తీసుకెళ్ళాడు కాబట్టి . సూడవో, చల్లవో స్నానం చేద్దాం అంటే బకెట్ కూడా లెదు ఇప్పుడు గదిలో. పోనీ కొళాయి కింద కూర్చుని చేద్దాం అంటే అది  తక్కువ ఎత్తులో ఉంది.

కుడితిలో పడ్డ ఎలకలాగా తయారయ్యింది నా పరిస్థితి.

ఇక చివరి సారిగా ప్రయత్నం చేద్దామని, ఫోన్ చేసే పని పెట్టుకోకుండా, రూంలోంచి బయటకి వచ్చి, నేరుగా రిసెప్షనిస్ట్ దగ్గరికి యుద్దోన్మాదంతో బయలుదేరాను.

రెండు మెట్లు దిగగానే లుంగీ కట్టుకుని ఎదురయ్యాడు ఇంకో అతను. ఇతని చేతిలోనన్నా చుడ తన్నీ ఉన్న బకెట్ ఉందేమో అని దింపుడు కళ్ళం ఆశగా చూశాను. అతని చేతిలో చుడతన్నీ ఉన్న బకెట్ లేదు. నాకు కోపం వచ్చేసింది. ఆ కోపంలో, తెలుగులో అరిచేశాను.

"ఎంత సేపయ్యా, బకెట్ కూడా తీసుకెళ్ళి పోయారు. వేడి నీళ్ళు తేవటానికి ఎంత సేపు. ఇదేమన్నా పద్దతిగా ఉందా?" అని గట్టిగా ఆరిచేశాను అతన్ని

అతను చిరునవ్వు నవ్వుతూ, "ఏంటి రాయపెద్ది గారు, వేడి నీళ్ళు ఇంకా ఇవ్వలేదా వీళ్ళూ మీకు? ఉండండి. కనుక్కుందాం" అని మెట్ల కున్న రెయిలింగు మీదుగా వంగి, కిందకు చూస్తూ స్వచ్చమైన తమిళంలో రిసెప్షనిస్ట్ ని గద్దించాడు.

అప్పుడు అర్థమయింది నా పొరపాటు. ఇతను లుంగీలో ఉన్నాడే కానీ హోటల్ కుర్రాడు కాదు , తెలుగులో మాట్లాడటమే కాక నన్ను కంపెనీలో అందరూ పిలిచే విధంగా ఇంటి పేరుతో పిలుస్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా మా కొలీగ్ అయి ఉంటాడు.

అతను మెట్ల మీదనుండి వంగిన భంగిమని ఉపసంహరించుకుని, తిరిగి నా వైపుకి చూస్తూ, చిరునవ్వుతో, తన కుడి చేయి చాచుతూ "అయాం సుందరమూర్తి, మధురై హెడ్ క్వార్టర్స్" అని తనను తాను పరిచయం చేసుకున్నాడు.

అతను తెలుగు వాడు కూడా కావడం విశేషం. వాళ్ళ పూర్వీకులు తమిళనాడుకి వచ్చి స్థిరపడ్డాకూడా ఇంట్లో తెలుగు చక్కగా మాట్లాడేవారు.

తెలుగు వాడినన్న అభిమానంతో రూం నెంబర్ కనుక్కుని, నన్ను కలవడానికి వచ్చి ఆ విధంగా భంగపడ్డాడన్నమాట ఆ రోజు సుందరమూర్తి గారు.

ఆ తర్వాత అతను నేను చాలా ఆప్తులం అయ్యాం.

ఆ వేళ అతని ప్రవర్తనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, నేను అతన్ని హోటల్ బాయ్ గా భ్రమపడుతున్నానని అర్థం అయి కూడా, అతను ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నా ఇబ్బందిని అర్థం చేసుకుని కూల్‍గా స్పందించిన విధానం నాలో ముద్రించుకుపోయింది.

***

బహుశా  వేళ సాబూ సర్విస్ సెంటర్ లో నాకు తెలియకుండానే సుందరమూర్తి యొక్క ప్రభావం వల్ల నేను కూల్ గా బిహేవ్ చేశాను అనుకుంటాను.

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment