ఒక ఙ్జ్యాపకం - 25
ఇష్ట కామేశ్వరీ దేవత
గుడి - పార్ట్ 1
"ఇదిగో నా మాటిను, ఆ అమ్మాయిని నాకు ఇవ్వు, ఈ ఆంటీని నీవు
తీసుకో"
"అస్సలు కుదరదు, ఆ లావాటి సార్ ని ఇస్తాను, ఆయన బదులుగా
నాకు ఆ బట్టతల సార్ ని ఇవ్వు"
"ఇదిగో ఈ కుర్రాడిని కూడా
నీవే ఉంచేసుకో,నాకు ఆ అంటీని ఇవ్వు, సరిగ్గా
సరిపోతుంది బాలెన్స్"
మీరు ఈ సంభాషణ విని
అవాక్కవుతున్నారా? కంగారు పడకండి.
భయంకరమైన రహదారిలో ప్రయాణం
చేయబోతున్న జీపుల్లో బాలెన్స్ తప్పకుండా ఉండటానికి ఆ జీపుడ్రైవర్లు ప్రయాణీకుల్ని
ఆ విధంగా పంచుకుంటున్నారు.
శ్రీశైలం రక్ష్తిత అరణ్యంలో
ఉన్నటువంటి క్షేత్రం ’ఇష్టకామేశ్వరీ దేవత’ మందిరం మీరు చూశారా? నేను రెండేళ్ళ క్రితం చూడటం తటస్థించింది.
చిన్నప్పటి నుంచి కర్నూలు జిల్లాలో
పెరగడం వల్ల శ్రీశైలం అనేక మార్లు దర్శించటం జరిగింది. కానీ ఇటీవల యూట్యూబ్ లో
యాధృఛ్చికంగా చూసే వరకు ఈ ఇష్ట కామేశ్వరీ దేవి గుడి గురించి తెలియలేదు.
అది కూడా ఒక సాహసయాత్రని మించి
ఉండటం వల్ల ఆసక్తి పెరిగింది. ఆ తరువాత యూట్యూబ్ లో గాలించినప్పుడు శ్రీ చాగంటి
గారి ఉపన్యాసాలలో కూడా ఆ గుడిగురించి గొప్పగా వినడం జరిగింది.
తెలిసిన వారు వెళ్ళవద్దు
అని భయపెట్టారు. అయినా సరే ఆ సాహసం చేద్దాం అని డిసైడ్ అయ్యాను.
సరే మా ఆవిడ, నేను పిల్లలిద్దరు కార్లో శ్రీశైలం
వెళ్ళాం. మొదటి రోజు దర్శనం చేసుకుని, రెండో రోజు ఉదయాన్నే
ఎనిమిదికల్లా జీపులు ఆగే దగ్గరికి చేరుకున్నాం.
ముందు రాత్రే
కనుక్కుని పెట్టుకున్నాం ఎక్కడ బయల్దేరుతాయో జీపులు అన్జెప్పి. మెయిన్ రోడ్ మీద
జంక్షన్ దగ్గర బస్టాండ్ కు మలుపు తిరిగే దగ్గరే ఆ జీపుల స్టాండ్ ఉంది.
రిజర్వ్ ఫారెస్టు
వారిచే అనుమతించబడ్డ కొన్ని మహీంద్ర కంపెనీ జీపులు మాత్రమే వెళతాయి అక్కడికి.
రోజుకు ఏడో పదో వాహనాలు మాత్రమే అనుమతిస్తారు అట.
ఇక్కడ చాలా గందరగోళం
ఏర్పడింది. మేము ఎనిమిదింటికే వెళ్ళినప్పటికీ , దాదాపు పది పదిన్నరకి బయలుదేరాయి
జీపులు. అక్కడ తెలంగాణా జీపు డ్రయివర్ల అసోశియేషన్, ఆంధ్రా
జీపు డ్రయివర్ల అసోసియేషన్ అని రెండు వర్గాలు ఉన్నాయి. వారిలో వారికి పూర్తి
ఘర్షణపూర్వక వాతావారణం నెలకొని ఉంది. శ్రీశైలం నిజానికి కర్నూలు జిల్లా అంటే
ఆంధ్రప్రదేశ్ పరిదిలోనిది. ఈ జీపు డ్రయివర్ల
గొడవ ఏమిటో మాకు అర్థం కాలేదు.
మేము ఒక జీపు ఎక్కి
కూర్చోనే లోగా వాళ్ళలో వాళ్ళు ఘర్షణ పడి మమ్మల్నందర్నీ జీపు దిగమని హెచ్చరించి
ఇంకో జీపు ఎక్కించారు. ఎక్కించటం అయితే ఎక్కించారు గానీ వైరివర్గం జీపు డ్రయివర్
అసోశియేషన్ వారు దానికి అడ్డం పడి దానిని కదలనివ్వలేదు.
ఈ లోగా కొందరు
అతితెలివి జీపు డ్రయివర్లు ఈ గొడవలో పాల్గొనకుండా దొరికిన ప్రయాణీకులని
దొరికినట్టు ఎక్కించుకుని చల్లగా ప్రయాణం మొదలెట్టేశారు . ఈ గొడవలో మాకంటే
వెనుకవచ్చిన వారు కూడా వెళ్ళీపోవడం జరిగింది, మేము మరియు మాతో పాటు అనేక మంది ప్రయాణీకులు ఇరుక్కుపోయారు.
చివరకు ఎలాగో మాకు
ముక్తి లభించి మా జీపు కదిలింది.
ఆ ప్రమాదకర రహదారిలో
వీడియో తీస్తానని ముచ్చట పడి మా వాడు ముందరి సీటు కావాలని కోరాడు. సీటు దొరకటమే ఇబ్బందిగా
ఉంటే ఈ ముందు సీటు గోల ఏమిట్రా భగవంతుడా అని అనుకునేలోగా అదృష్టవశాత్తు వాడికి
ఇంకొక జీపులో ముందు సీటు దొరికింది. వాడి జీపు కూడా మా జీపు కంటె ముందరే
వెళ్ళిపోయింది.
మెల్లిగా మా జీపు కూడా
బయలు దేరింది.
కర్నూలు కు దారితీసే
రోడ్లో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించింది. ’ఓస్ దీనికేనా ఇంత భయపెట్టారు హాయిగా
ఉందిగా రోడ్డు’ అని అనుకునేలోగా ఇంతకు
ముందు బయలుదేరిన జీపులన్నీ బారులు తీరి ఒక దగ్గర నిలబడి కనిపించాయి.
మా జీపు కూడా వాటి
వెనుకే వెళ్ళి నిలబడింది.
రోడ్డుకు కుడివయిపు ఒక
గేటు గుండా ఒక్కొక్కటే వాహనం రిజర్వ్ ఫారెస్ట్ లోనికి ప్రవేశిస్తున్నాయి.
అక్కడ పెద్ద తతంగమే
ఉంది.
రిజర్వ్ ఫారెస్టు
అధికారులు జీపులోని ప్రయాణీకులు అందరినీ జీపు ముందు జీపు నెంబర్ ప్లేట్ కనపడేలా
నిలబెట్టి ఒక గ్రూప్ ఫోటో తీశారు. ఆ తర్వాత ఒక్కొక్కర్నిని ఆఫీసు రూంలోకి
తీస్కువెళ్ళీ వెబ్ కాం తో ఫోటో తీసుకుని, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఒక పత్రం లో సంతకం
తీసుకున్నారు.
’ఆ యాత్ర ని పూర్తి మా
పూచికత్తుపై మొదలు పెట్టామని, తద్వారా
రాబోయే ఎటువంటి ప్రమాదాలకు మాదే బాధ్యత అని, అటవీ సంపదకి
హాని తలపెట్టము అని, ఆటవీకులని బాధపెట్టం అని వ్రాతపూర్వకంగా
ఆ పత్రంలో వ్రాయించుకుని సంతకం చేయించుకున్నారు.
నాకు ఈ తతంగం
చూస్తుంటే పైప్రాణాలు పైనే పోయాయి.
ఇంత హైప్ అవసరం లేదేమో
అని అనిపించింది ఆ తర్వాత.
ఇక ఈ తతంగం తర్వాత మా
యాత్ర ప్రారంభం అయ్యింది.
ముందుగా సాహసోపేతమైన ఆ ప్రయాణం ఎలా
ఉంటుందో చెబుతాను.
రోడ్డు అన్నది అస్సలు ఉండదు. పోనీ
సాఫీగా మట్టి రోడ్డులాగా ఉంటుందా అంటే అదీ ఉండదు. వర్షం నీళ్ళు ఒక వంకలాగా పారుతూ రాళ్ళలో, బండల్లో, గుండ్లలో, చెట్లమధ్య మెలికలు తిరుగుతూ వెళ్ళటం వల్ల
ఏర్పడిన దారి గుండా వెళ్ళాలి. రిజర్వ్
ఫారెస్టు వారు అనుమతించిన కొన్ని ప్రత్యేకమైన మహీంద్రా కంపెనీ వారి జీపులు మాత్రమే
వెళ్ళగలవు ఆ దారిలో.
ఏక కాలంలో జీపు తాలుకు నాలుగు
చక్రాలు ఒకే సమతలం అయిన భూమి మీద ఉంటే ఒట్టే ఆ దారిలో.
పెద్ద గుండుపైనుంచి దూకుతుంది జీపు, ఇంతలో ఒక గుంతలో పడి గెంతుతుంది, దట్టమైన
చెట్ల మధ్య సాక్షాత్తూ చిరుతలా దూరివెళుతుంది. కండ్లెదుట ఒక పెద్ద బండ అడ్డుగా
నిలబడుతుంది, ఇక జీపెలా వెళుతుంది అని మనం నివ్వెరపోయెలోగా ఆ
గుండుని జీపు పునుగు పిల్లిలా ఎక్కేస్తుంది, అలా ఎక్కాలి
అంటే దానివేగం అపరిమితంగా ఉండాలి, లేదంటే వెనక్కు
విరుచుకుపడుతుంది. ఆ గుండుని ఎక్కీ ఎక్కంగానే అంత వేగాన్నీ ఒక్క సారిగా అదుపులోకి
తెచ్చుకొని నెమ్మదిగా లోతైన గుంతలోకి
దిగాలి. లేదంటే నిట్టనిలువుగా బోర్లా పడటం ఖాయం.
మూత మూసిన స్టీలు డబ్బాలో వేరు
శనక్కాయలు వేసి డబ్బాని పైకి క్రిందికి ఆడిస్తే ఆ డబ్బా లోని వేరు శనగ గింజలు ఎలా
ఎగురుతాయో, జీపు
తాలుకు ఈ విన్యాసాలన్నీ జరుగుతూ ఉండగా, మనం జీపులో సాటి
ప్రయాణీకులతో పాటు ఆ డబ్బాలొని వేరు శనగ గింజల్లా పైకి క్రిందికి ఎగిరి దూకుతూ
ఉంటాము.
కుదురుగా మనం మన సీట్లో కూర్చోవటం
కలలో మాటే. ఈ గందరగోళంలో ఆ కుదుపుల్లో నా తలకు జీపు రాడ్స్
కు బిగించిన స్క్రూలు తగిలి తలనుంచి రక్తస్రావం జరిగింది. కర్చీఫ్ తో అదిమి
పెట్టుకుని ప్రయాణం కొనసాగించాము.
మనల్ని అయ్యో అనే వాడు ఉండడు.
ఒక భయస్తుడు ధైర్యం చేసుకుని
డ్రైవర్ ని అడిగాడు "ఇక్కడ ప్రమాదాలు ఏమీ జరగవు కద" అని
"నిక్షేపంగా జరుగుతాయి. మీరు
చనిపోయినా చనిపోవచ్చు" అని నింపాదిగా చెప్పాడు ఆ డ్రయివర్.
ఆయన ఇంకేదో అడగబోతే "ఊర్కోండి
మేష్టారు, చచ్చేదుంటే ఎలాగు చస్తాం. వాడి మాటల్తో
ఇప్పుడే పోయేటట్టు ఉన్నాం" కోప్పడ్డారు మిగతా ప్రయాణీకులు.
జీపులో నేను చివర
వెనుక వరుసలో ఎదురెదురు ఉండే సీట్లలో ఒకవైపు కూర్చోవలసి వచ్చింది డ్రయివర్ల సూచనల
మేరకు సీటింగ్ అరెంజిమెంట్లు జరిగాయి.
మా ఆవిడ మా అమ్మాయి
మధ్య వరుసలో కూర్చున్నారు.
దేవుని దయవల్ల
ఎవరికేమి ప్రమాదం జరగలేదు కానీ తిరుగు ప్రయాణంలో
జీపుకే చాలా పెద్ద
ఉత్పాతం జరిగింది.
No comments:
Post a Comment