డాన్స్ శీను
ఒక ఙ్జాపకం
ఈ ఙ్జాపకం లో ఒక విషాదభరితమైన ముగింపు ఉంటుంది.
ఇది వ్రాద్దామా వద్దా అని చాలా రోజులు విచికిత్సకి గురయి చివరికి వ్రాద్దామనే
నిశ్చయం చేసుకుని వ్రాసేస్తున్నా. ఎందుకు విచికిత్స అని మీరు అడగవచ్చు. ఙ్జాపకం
సిరీస్ మొదలెట్టే ముందే నేను ఒక నిర్ణయం తీస్కున్నాను. నా ఙ్జాపకాల ద్వారా ఎవరిని
బాధ పెట్టకూడదు. వీలయినంత వరకు ఆనందం కలిగించే విషయాలు మాత్రమే వ్రాయాలి అని.
కానీ ఈ ఙ్జాపకం ద్వారా ఎవరినీ బాధ పెట్టబోవడం లేదు కానీ నాకే బాధవుతుంది ఇది
తలచుకుంటే.
తమిళ్ లో ఒక పాట ఉంది, చేరన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన
ఆటోగ్రాఫ్ అనే చిత్రంలో ’ఙ్జాపగం వరుదే, ఙ్జాపగం వరుదే..’
అనే పాట అది.
’మొదల్ మొదల్ అళుత్తా స్నేగిదన్ మరణం’ అని .(ఇది తెలుగులో కూడా రవితేజ
అనుకుంటా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అన్న సినిమా గా విడుదల అయింది)
అలా నేను ఊహ తెలిసిన తర్వాత చూసిన మొదటి మరణం అది. ఏమీ చేయలేక నిస్సహాయంగా
ఏడ్చిన సందర్భం అది.
ఈ శీను ఎవరు? అతన్ని డాన్స్ శీను అని ఎందుకు అంటారు?
అతనితో నా పరిచయం ఎలా అయింది? ఎందుగ్గాను అతను
చనిపోయాడు? అతని మరణం సహజమైందా లేదా ఏదయినా ప్రమాద వశాత్తు
జరిగిందా, ఈ ప్రశ్నలన్నింటికీ ఈ ఙ్జాపకంలో సమాధానాలు
లభిస్తాయి.
అవి 1983-85 ప్రాంతాలు.
అవి నేను కడపలో ఉంటున్న రోజులు. మోచంపేటలో ఉన్న శ్రీ రామకృష్ణ జూనియర్
కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుకుంటున్నాను.
నేను ఆ రోజుల్లో బక్కగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉండేవాడిని.
డాన్స్ శీను అనబడే ఈ శీనివాస్ అనే
కుర్రాడు నా కంటే ఒక సంవత్సరం సీనియర్. అతనికెందుకో నా పైన అకారణమైన అభిమానం.
బహుశా నన్ను చూడంగానే జాలి కలిగి, జాలితో కూడిన
అభిమానంతో కూడిన ఇష్టం అనుకుంటా.
ఆ రోజుల్లో అందరూ మాథమేటిక్స్, ఫిజిక్స్,
కెమిస్ట్రీ తదితర సబ్జెక్ట్స్ కి ట్యూషన్లకి వెళ్ళే వారు. అప్పటికి
ఇంకా కార్పొరేట్ కల్చర్ రాలేదు. కడపలో ఇంటర్ మీడియేట్ చదవాలి అంటె, ఒకటి రామకృష్ణ జూనియర్ కాలేజి, లేదా రైల్వే స్టేషన్
దగ్గర ఉన్న ప్రభుత్వ మెన్స్ కాలేజి లో చేరాలి. దాని వ్యవహార నామం ’గవర్నమెంట్
ఆర్ట్స్ కాలేజి’. పేరుకి అది మెన్స్ కాలేజీనే అయినప్పటికి, అది
కో ఎడ్యుకేషన్ కాలేజీనే.
మా నాన్నగారు ఉండుకుని, "ఫిజిక్స్, కెమిస్ట్రీ,
మేథ్స్ ఇంట్లో అక్కయ్యలు కూడా చెప్పిస్తారు, ఇంగ్లీష్
భాష చాలా ముఖ్యం. నువ్వు ఇంగ్లీష్ సబ్జెక్టు కు ట్యూషన్ కి వెళ్ళాలి" అని ఒక
రోజు ప్రకటన చేశారు.
ఇంకేముంది, రెండో రోజే ఇంగ్లీష్ ట్యూషన్ లో చేరటం
జరిగింది. మా వెనుక వీధిలో ఉండే హేమలత అనే
అమ్మాయి, రామశర్మ అనే కుర్రాడు, ఇంకా
కొందరు మార్వాడి కుర్రాళ్ళు, రంగ అనే కుర్రాడు ఇలా ఒక పెద్ద
టీమే ఉండేది మా బాచ్‍లో.
ఇక్కడొక గమ్మతైన విషయం చెప్పాలి.
గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఈ ఇంగ్లీష్ చెప్పే మేష్టారు గారు మా రామకృష్ణా జూనియర్
కాలేజిలోనే లెక్చరర్. ఆయన పేరు సీతారామయ్య గారు.అందులో పెద్ద వింతేమి లేదు, కానీ అసలు విషయం ఏమిటి అంటే, ఆయన మా
కాలేజిలో తెలుగు లెక్చరర్.
ఆయన తెలుగు, ఇంగ్లీష్ లలో కూడా ఎమ్మే చేశారట. అందువల్ల
ఆయనకి ఈ రెండుభాషల మీద సాధికారత ఉంది. కానీ నేను గమనించింది ఏమిటి అంటే, ’నేను పేరుకు తెలుగు లెక్చరర్నే గానీ నాకు ఇంగ్లీష్ కొట్టిన పిండి’
అన్నట్టు ఉండేది ఆయన ధోరణి, ఆయన తనకు ఇంగ్లీష్ బాగా వచ్చు
అని ఎప్పటికప్పుడు గొప్పగా నిరూపణ చేసి చూపిచ్చుకుంటూ ఉండే వారు. కాలేజి లో మాకు
పాఠం చెబుతున్న ఇంగ్లీష్ లెక్చరర్ వద్దకు
వచ్చి గట్టిగా ఇంగ్లీష్ లో కబుర్లు చెబుతూ ఉండేవారు. ఈ లక్షణాన్ని నేను ఆ తర్వాత
చాలా మంది తెలుగు లెక్చరర్ల వద్ద గమనించాను వేరే వేరే ఊళ్ళలో కూడా. ఈ ఒక్క సరదా
అంశం మినహాయిస్తే ఆయన చాలా మంచి వాడు.
ఈయన దగ్గర నేను నేర్చుకున్న పాఠాలలో నాకు బాగా గుర్తుండిపోయిన లెసన్
రవీంద్రనాధ్ టాగూర్ వ్రాసిన "ఏన్ ఐడిల్ మేన్ ఇన్ వర్కర్స్ పారడైజ్". ఈ
లెసన్ ద్వారా బోలెడు కొత్త పదాలు నేర్చుకున్నాను.
రచయిత పరిచయం లో ప్రస్తావించబడ్డ వర్సటైల్ ఆర్టిస్ట్ అనే పదం ద్వారా, వర్సటైల్ అనే పదం మొదటి సారి తెలుసుకున్నాను. ఇలా ఒకటి కాదు,
రెండు కాదు చాలా పదాలు తెల్సుకున్నాను ఆయన వద్ద.
ఈ సదరు సీతారామయ్య గారు కూడా ’వర్సటైల్’ అనే చెప్పవచ్చు. తెలుగులో కవిత్వం వ్రాసేవారు, జాతకాలు చూడ్డంలో కూడా దిట్ట అని పేరు. ఇక ఇంగ్లీష్ గూర్చి
మీకు తెలియంది కాదు.
ఆయన గైడీ మపాసా అన్న పేరుని మోప్పసెంట్ అని ఉఛ్ఛరించే వారు. మా నాన్నగారు
తలపట్టుక్కూర్చున్నారు అది తెలిసి. మా నాన్నగారికి నన్ను ఆంగ్లంలో మహా మేధావిని
చేయాలని ఒక స్వప్నం ఉండేది. అందుకే ఆయన జాగ్రత్తగా ప్రతి రోజు సరదాగా కబుర్లు
చెబుతున్నట్టు మాట్లాడుతునే నా వొకాబులరీ అభివృద్ది చేసేవారు.
ఇదిగో ఇది పాఠం అనే ధోరణిలో చెప్తే నేను వినేవాడిని కాను అనుకుంటా. అందుకే ఆయన
ఇలా సరదాగా కబుర్లు చెబుతూ నా వొకాబులరీ, గ్రామర్,
ప్రనన్సియేషన్ తదితర అంశాలు సానబెట్టేవారు.
మొత్తమ్మీద ఈ సీతారామయ్యగారికి సమాజం లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది.
ఉభయభాషా ప్రావిణ్యం వల్ల ఆయనకి ఒక ప్రత్యేక గౌరవస్థానం లభించేది ఆయన ఎక్కడికి
వెళ్ళినా.
మా నాన్న గారు కూడా ఈ అంశాన్నే హైలైట్ చేస్తూ నన్ను ఆయన దగ్గర చేర్పించారు. మా
ఇంటి ఎదురుగా సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉండేవారు. ఆయనకి
ఇరవై ఒక్క భాషలు కరతలామలకంగా వచ్చు అన్న ప్రశస్తి ఉంది. ఆ తర్వాత మన మాజీ ప్రధాన
మంత్రి శ్రీ పీవీ నరసింహరావు గారికి కూడా ఇలా బహుళభాషలలో సాధికారత ఉంది అన్న విషయం
తెలిసింది.
బహుశా ఇలాంటి వారినందరినీ గూర్చి చూడటం వల్ల, వినటం వల్ల ఒకటికంటె ఎక్కువ భాషలలో ప్రావిణ్యత సంపాయించాలనే స్వప్నం నాలో
కలిగింది అనుకుంటా.
ఇక మళ్ళీ కథలోకి వస్తే,
మా బాచ్ సాయంత్రం పూట ఉండేది. కాలేజి అవంగానే మొహం కడుక్కుని, ఇంత అల్పాహారం స్వీకరించి, హాయిగా
సైకిల్ వేస్కుని బయలుదేరేవారం. దారిలో మా క్లాస్ మేట్స్ హేమలత తదితరులు వెళుతూ
కనిపించేవారు. మేము మాటలు ఆపేసి చాలా బుద్దిమంతులలాగా మొహాలు పెట్టుకుని
వెళ్ళేవారం.
మేము వెళ్ళేటప్పటికి, సీనియర్స్ తాలూకు బాచ్ నడిచేది. వాళ్ళ బాచ్
అయ్యేవరకు మేము బయట అరుగుల మీద ఎదురుచూసేవారం. ఆ రోజుల్లో మేము అక్కడి ఎదురింటిలో
వీసీపీ లో అప్పుడప్పుడూ వీడియోలు చూసే వారం. అది చాలా లగ్జరీ ఆ రోజుల్లో.
సీతారామయ్య గారి ఇల్లు కడప అమ్మవారి శాల దగ్గర గార్డెన్ కాఫీ వర్క్స్ యజమానుల ఇంటి ఎదురుగా ఉండేది. వారు చాలా
స్థితిమంతులు. నాకు తెలిసి ఆ రోజుల్లో కడపలో కలర్ టీవి, వీసీఆర్ ఉన్న అతి కొద్ది మందిలో వారు ఒకరు.
వాళ్ళు దయగల వారు, వరండాలో నిలబడి మమ్మల్ని ఆ సినిమాలు
చూడనిచ్చేవారు.
ఈ కలర్ టీవి ఆకర్షణ ని కూడా మించి మమ్మల్ని ఆకట్టుకునే అంశాలు కొన్ని ఉండేవి అ
రోజుల్లో. సీతారామయ్య గారు సరదాగా విద్యార్థులతో డాన్స్ ప్రదర్శనలు, పాటలు పాడించటం చేసే వారు. మా బాచ్ లో అంతా నాకు తోడు బోయిన
వారే ఉండెవారు. ఈ డాన్స్‌లు పాటలకి మేము
ఆమడ దూరం.
కానీ మాకు ముందు ఉన్న బాచ్ లో కుర్రాళ్ళు పాటలు పాడటం, డాన్స్ లు చేయటం చేసే వారు. అందరూ కాదు కానీ, సన్నగా పొడుగ్గా చలాకిగా ఉండె ఒక కుర్రాడు చాలా చక్కగా స్టెప్పులు
వేసేవాడు. అతనే మన కథానాయకుడు శీను. డాన్స్ అంటే కూచి పూడో కథాకళో కాదు. సినిమా
పాటలకు స్టెప్పులు వేయటం.
ఒక సారి, మేము అరుగుల మీద , వరండాలో,
నిలబడి గ్రిల్ కడ్డీల మధ్యలోంచి, వీడియోలు చూస్తుండగా మా సర్
వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో కోలాహలం వినిపిస్తే వెళ్ళి చూస్తే ఏముందీ, ఈ శీను యమా చలాకీగా డాన్స్ చేస్తున్నాడు. అవి ఖైదీ, వేట
తదితర చిత్రాలు ఒక ఊపు ఊపుతున్న సందర్భాలు.
మేము అసంకల్పితంగా చప్పట్లు కొట్టాము. కళాకారులకు చప్పట్లకంటే మించిన
ప్రొత్సాహం ఏమి ఉంటుంది? అతను ఆనందంగా మాకు కళ్ళతోనే అభినందనలు
తెలిపాడు.
ఇక మా బాచ్ మొదలవ్వాలి కద, వాళ్ళు వెళ్ళి
పోవటానికి ఆయత్తమయ్యారు. అప్పుడు శీను నా వద్దకు వచ్చి, కాస్తా
వంగి (నాకంటే చాలా పొడవు అతను) మెల్లిగా అడిగాడు ’నిజంగా బాగా చేశానా’ అని.
నేను కంగారు పడ్డాను. కంగారు పడ్డప్పుడు నాకు తెలియకుండానే ఇంగ్లీష్
మాట్లాడతానట. (ఇది నా సన్నిహిత స్నేహితుల అభిప్రాయం).’ అన్నా అదరగొట్టావు’ అనే
అర్థంలో ఏదో చెప్పాను.
అబ్బ ఈ కుర్రాడు ఇంగ్లీష్ భలే మాట్లాడతాడు అని అతను నా గూర్చి అప్పటి నుంచి
విపరీతమైన ప్రచారం మొదలెట్టాడు.
ఇది నాకు శీనుకి మొదటి పరిచయం ముచ్చట.
ఆ తర్వాత నేను డిగ్రీ చదవటానికి వేరే ఊరికి వెళ్ళటం వల్ల కడపతో టచ్ లో
ఉండలేదు. ఈ శీను ముచ్చట్లు తెలియవు నాకు.
ఆ తర్వాత 1989-92 మధ్య ప్రాంతాలలో తిరిగి నేను కడపకి వచ్చి ఉంటున్న సందర్భంలో
అతి యాధృచ్చికంగా కలిశాడు ఈ శీను.
పర్సనాలిటీ డెవలెప్ మెంట్ లెసన్స్ విషయంగా నాకు ఆదిగురువు అనదగ్గ సిండికేట్
బాంకు ఎంప్లాయి, స్టాన్లీ
విజయకుమార్ (ఈయన లైప్ ఆధారంగా నేను కల్పన జోడించి ’పునరాగమనం’ అనే కథ వ్రాశాను) ని
తరచు కలిసేవాడిని. , ఇంకో సంగీతం మేష్టారు శ్రీ ఏడుకొండల
వెంకటేశ్వరరావు లను కూడా తరచు కలిసే
వాడిని.
ఆ రోజుల్లో నేను పైచదువులకి వెళ్ళలేదు, ఇటూ
ఉద్యోగ ప్రయత్నాలు చేయటం లేదు. ఒక్క్ ముక్కలో చెప్పాలంటే, ఎందుకో
ఇంట్లో కూర్చుని బోలేడు కథలు వ్రాసే వాడిని.
నాకున్న ఇంకో బలహీనత చెప్పాలి మీకు. నాకు మనుషుల పేర్లు, ముఖాలు గుర్తుండవు. ఏదైనా ఒక విషయం ఙ్జాపకం లేకపోవడానికి
ప్రధాన కారణం ఫోకస్ లేకపోవడమే అని మెమరీ ట్రెయినర్, మిత్రుడు
జయసింహ చెబుతూ ఉంటాడు.
పైకి, ’క్కిక్కిక్కి’ అని నవ్వుతూ ఉంటాను కానీ, బహుశా నేను నిరంతరం నా ఆలోచనల్లో
నిమగ్నమయి ఉంటాను.
సరే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ
రోజుల్లో అటు స్టాన్లీ విజయ్ కుమార్ గారి వద్ద, ఇటు
ఏడుకొండలు మేష్టార్ గారి వద్ద ఓ పొడగాటి కుర్రాడు కనిపించే వాడు. అతను అన్నమయ్య
కీర్తనలకి , ఇతర జావళీలకి , జానపద
గీతాలకి పిల్లలతో నృత్యాలు చేయిస్తూ కాలక్షేపం చేస్తున్నాడని తెలిసింది.
ఆ కుర్రాడు నన్ను పరిశీలనగా చూసి, ఒక
రోజు "హేయ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్!" అనేశాడు. అతను ఏ ముహుర్తం లో అన్నాడో
కానీ నాకు ఆ ఇంగ్లేషే భుక్తిని కల్పిస్తోంది. ఇంతకూ ఆ కుర్రాడు ఎవరో కాదు మన కథా
నాయకుడు శీనునే.
అలా మా పరిచయం రెన్యూ అయింది. అతనికి అకారణమైన అభిమానం నా పై అని చెప్పాను కద.
ఆ రొజుల్లో నేను ఎవ్వరినీ కలిసే వాడిని కాదు. కేవలం బాంక్ పరీక్షలకి తయారు
అయ్యేవాడిని, అక్కడ సాగర్ అనే కుర్రాడితో ఏర్పడ్డ పరిచయం కారణంగా స్టాన్లీ, ఆ స్టాన్లీ ద్వారా ఏడుకొండలు గారు పరిచయం అయ్యారు.
అదిగో అక్కడ వారి నుంచి, ఈ పాత పరిచయస్తుడు
శీను మళ్ళి పరిచయం అయ్యాడు.
ఇక ఈ శీను నన్ను వదిలే వాడు కాదు. అదే
పనిగా మా ఇంటికి సైకిల్ వేసుకుని వచ్చి, నన్ను
మాట్లాడించే ప్రయత్నం చేసే వాడు.
కనీసం అంటే ఓ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు, అప్సరా టాకీస్ ఎదురుగా ఉన్న భాగ్యనగర్ కాలనీ లో ఉండేవాడు
అతను. ఆ రోజుల్లో అది చాలా గొప్ప దూరం. కడప టవున్ లో ఉండే వాళ్ళు , ఇలా కాలనీలో ఉండేవారిని కాలనీ నుంచి వస్తున్నాడు పాపం చాలా దూరం
’నువ్వు ఎందుకు ఎప్పుడు నీలో నీవే ఉంటావు’ అని పట్టు పట్టి నన్ను సినిమాలకి
తీస్కు వెళ్ళేవాడు.
ఆ రోజుల్లో నన్ను అనేక సినిమాలకి తీసుకువెళ్ళే వాడు. నేను టికెట్కి డబ్బులు
ఇస్తానన్నా వద్దనే వాడు.
’నేను డాన్స్ లు చెప్పి సంపాయిస్తున్నాను బాస్. నువ్వు ఇంకా సెటిల్ అవలేదు కద.
అయ్యాకా చూద్దాం’ అనే వాడు .
అతనితో కల్సి, హరీష్, ఛార్మిళ
నటించిన "ప్రాణదాత", రాంగోపాల్ వర్మ
"రాత్రి", కే బాలచందర్ "అక్టోబర్ రెండు"
ఇలా చిత్ర విచిత్రమైన సినిమాలు చూసే వాడిని.
అతను తరచు మా ఇంటికి వచ్చి మా అమ్మానాన్నలతో కూడా బాగా కాలక్షేపం చేసే వాడు.
నా స్నేహితులు ఎవరు వచ్చినా మా అమ్మానాన్నలు చాలా ప్రేమగా మాట్లాడేవారు. నా
స్నేహితులు అందరూ కూడా మా అమ్మానాన్నలతో మాట్లాడటానికే ప్రత్యేకంగా మా ఇంటికి
వచ్చేవారు.
ఆ రోజుల్లోనే గాంగ్ లీడర్ సినిమా కూడా వచ్చింది. శీను ఆ డాన్స్ లు కూడా చక్కగా
చేసి చూపే వాడు అందరికీ. అడగని వాడు పాపాత్ముడు.
ఇవన్నీ ఇలా ఉండగా, నేను
గమనించింది ఏమిటి అంటే, రోజులు గడిచే కొద్ది,ఈ శీను కి డాన్స్ పిచ్చి ముదిరిందే తప్పనిచ్చి తగ్గలేదు. నేను కడపలో లేని,
ఈ అయిదేళ్ళ కాలంలో అతను సశాస్త్రీయంగా గురువు దగ్గర కూచిపూడి నృత్యం
కూడా నేర్చుకుని ఏదో సర్టిఫికెట్ కూడా పొందాడు.
అతను బాంకు పరీక్షలు వ్రాయాలని కానీ, ఇతర
కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయలని కానీ అనుకునేవాడు కాదు. అతని ధ్యాస ఎంతసేపున్నా
నృత్యం మీదనే ఉండేది.
వాళ్ళింటికి కూడా తీసుకువెళ్ళే వాడు అప్పుడప్పుడూ. వాళ్ళ నాన్న గారు ఉండేవారు
కాదు. ఆ వివరం చెప్పలేదు అతను. ఆయన చనిపోయారా, ఏమిటి
అన్నది తెలియదు. ఆ ప్రస్తావన వచ్చినపుడు మౌనం వహించేవారు.
అతనికి ఒక చెల్లెలు ఉండేది. ఆ అమ్మాయికి మహా అంటే పదిహేను ఏండ్లు ఉంటాయి. చాలా
చక్కగా ఉండేది ఆ అమ్మాయి. అకారణంగా ఆ అమ్మాయిని చూడంగానే నాకు కలిగిన మొదటి భావన
జాలి.
ఆ అమ్మాయి కూడా ’అన్నయ్యా’ అంటూ చక్కగా మాట్లాడేది నాతో.
తల్లి బాధ్యత, చెల్లి బాధ్యత ,చూసుకుంటూ
తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుంటాడో కద ఇతను, అనిపించేది
నాకు. అతను చూస్తే అసలు కెరియర్ అనే మాటే ఎత్తుకునే వాడు కాదు.
ఎట్టకేలకు అతనికి కడపలో అప్పట్లో పేరెన్నికగన్న పెద్ద స్కూల్ నిర్మలా
కాన్వెంట్ అనే స్కూల్లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. డాన్స్ టీచర్ గా అని గుర్తు.
ఆ తరువాత కొన్ని రోజులకి ఈతకి వెళ్ళి ఊబిలో ఇరుక్కుని అతను ప్రమాదవశాత్తు
మరణించటం ఒక విషాదం.
ఇది డాన్స్ శీను
ఙ్జాపకం.
No comments:
Post a Comment