"బన్నేర్‍ఘట్ట"
ఇది ఒక మళయాళ చిత్రం. ఇటీవలే
అమెజాన్ ప్రైంలో చూశాను.
వెరైటీ సినిమాలు ఇష్టపడేవారికి
నచ్చుతుంది. షార్ట్ ఫిలింస్ తీయాలనుకునే ఉత్సాహవంతులైన యువ దర్శకులు, టెక్నిషియన్లు కూడా ఈ సినిమాని చూసి ఎంతో కొంత నేర్చుకోవచ్చు.
క్లుప్తంగా కథ:
ఓ చీకటి రాత్రి, ఆషిక్ అనే యువకుడు ఒక మారుతీ ఆమ్నీ కార్‍ని డ్రైవ్ చేసుకుంటూ
వెళుతుంటాడు. ఈ సినిమా చివరి సీన్ వరకు ఇతని కార్ ప్రయాణం సాగుతుంది. వేరే ఏమీ
ఉండదు. ఇది ఒక ప్రయోగం అని చెప్పవచ్చు. కార్ నడిపినంత సేపు ఇతనికి ఫోన్ కాల్స్
వస్తుంటాయి. ఇతని భార్య, మిత్రులు, వృత్తిలో
ఇతని సహచరులు, అప్పు ఇచ్చి వసూలు చేసుకోవటానికి తంటాలు
పడేవారు ఇలా రకరకాల వ్యక్తులు ఫోన్స్
చేస్తూ ఉంటారు. ఇతనికి ఇతని భార్యకి చిన్న, చిన్న మనస్పర్థలు
ఉన్నాయని అర్థం అవుతుంది ఈ కాల్స్ లోని
సంభాషణలద్వారా.
తను చేసే వృత్తికి కార్ చాలా అవసరం
అని, అనుకోకుండా వచ్చిన డబ్బుతో, అందుకే కార్ కొన్నానని, భార్యకి తెలపనందుకు
మన్నించమని ఆమెని వేడుకుంటాడు. ఆమె అలుగుతుంది.
అదే ఫోన్ కాల్ ద్వారా, ఇతను తన బిడ్డని నిద్ర పుచ్చేదానికి ఒక హారర్ కథ (?) చెపుతాడు.
ఇవన్నీ కార్ నడుపుతూనే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
ఇంతలో అతని చెల్లెలి నుంచి ఫోన్
వస్తుంది. ఆ అమ్మాయి బెంగళూరుకి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళి
ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ వర్షం వస్తోందని, బస్టాప్
నిర్మానుష్యంగా ఉందని, భయంగా ఉందని చెపుతూ ఉంటుంది. ఇంతలో,
ఆ కాల్ మధ్యలో ఆ అమ్మాయిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేసినట్టు అర్థం
అవుతుంది ఆ అమ్మాయి కేకల ద్వారా.
ఇక్కడ నాలుగు వందల కిలోమీటర్ల దూరం
నుంచి అతను రకరకాల వ్యక్తులకు, ఫ్రెండ్స్ కి
ఫోన్స్ చేసి ఆ పిల్లని రక్షించే ప్రయత్నం చేస్తాడు.
ఆ చీకటి రాత్రి బెంగళూరులో ఎక్కడా
వర్షం కురియలేదని, ఒక్క బన్నేర్‍ఘట్ట అటవీ ప్రాంతంలో మాత్రమే
వర్షం కురిసిందనేది మాత్రమే అతని ఫోన్ కాల్స్ ద్వారా తెలియవచ్చిన ఉపయోగపడే ఒక ఆధారం.
ఇంతలో అనుకోకుండా ఓ ప్లై ఓవర్
పక్కన అతని కార్ చెడిపోతుంది. అది అర్దరాత్రి సమయం. పలికే దిక్కు ఉండదు. ఒక వైపు
చెల్లెలి గూర్చి టెన్షన్. ఇంకో వైపు భార్య అలక, ఇంకో
చిన్న ఫోన్ లో వ్యాపారంలో భాగస్వామ్యుల వత్తిడి. ఇలా అతని తల పేలి పోతు ఉంటుంది.
ఇంతలో పోలీస్ పెట్రోల్ వాన్ వచ్చి
ఇతన్ని అనుమానించి ఇతన్ని ఫోన్ స్వాధీన పరచుకుని, వేధిస్తారు.
చివరికి ఏమవుతుంది? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మీకు నచ్చకపోతే నన్ను
తిట్టుకోవద్దండి.
చెప్పాను కద ఔత్సాహిక దర్శకులు, షార్ట్ ఫిలింస్ తీయాలనుకునేవారు, వైవిధ్య
భరితమైన సినిమాలు చూడాలనుకునే వారు మాత్రమే చూడండి.
ఒక సారి చూడవచ్చు ఎవ్వరైనా. నిరాశ
కలగదు. కాస్తా స్లో నేరేషన్. అదొక్కటే లోటు.
డా.రాయపెద్ది వివేకానంద్
30.04.2022 శనివారం
హైదరాబాద్
No comments:
Post a Comment