Tuesday, May 3, 2022

సిరీస్ కంపెనీ Part 1

 సిరీస్ కంపెనీ

ఒక ఙ్జాపకం - 64

================================= 

ఎల్ బీ నగర్ మీదుగా దిల్ సుఖ్ నగర్ వెళ్ళే ప్రతీ సారి  రోడ్డుకు ఎడమ వైపు కనిపిస్తుంది ’సిరీస్’ ఫాక్టరి.

కాకతీయ రాజుల నిర్మాణ శైలిలో స్వాగత తోరణం ప్రధాన ద్వారం వద్ద ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ ఫాక్టరీ భవనాలకి. కొన్నాళ్ళ క్రితం వరకు కనిపించేది ఈ కంపెనీ. ఇప్పుడు ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు తీసేసుకుని  మొత్తం కూలగొట్టి భవనాలు నిర్మిస్తున్నారు.

సిరీస్ కంపెనీ నాకు ఉద్యోగం ఇచ్చిన మొదటి కంపెని.

సరిగ్గా ముఫై ఏళ్ళ క్రితం ఇదే కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా చేరి , ఇదే కార్యాలయంలో ఓ పది రోజులు ప్రాడక్ట్ ట్రెయినింగ్ తీస్కుని అనంతపురం హెడ్ క్వార్టర్స్ కి విధి నిర్వాహణ నిమిత్తం వెళ్ళాను.

’మేరా నామ్ జోకర్’ లాగా పాంట్లోకి షర్ట్ టక్ చేసుకుని, మెడకి టై ఒకటి తగిలించుకుని,కాళ్ళకి మాత్రం చెప్పులతో ఇంటర్వ్యూకి వచ్చిన అనుభూతి ఇంకా గుర్తు ఉంది.

****

"కూర్చో! ఇక్కడ సైన్ చెయ్యి... మీరంతా పెద్దోళ్ళు ఇప్పుడు మాకు!" నాకు కుర్చీ చూపిస్తూ అన్నాడా వ్యక్తి.

నేను అవాక్కయ్యాను. ఏమిటి ఇంత అమర్యాద, ఎందుకింత తిరస్కార భావన?

నేను నిశ్శబ్దంగా కుర్చీ లాక్కుని కూర్చుని ఆయన చెప్పిన దగ్గర సంతకం చేసి మెడికల్ శాంపిల్స్ కన్సైన్‍మెంట్ తాలూకు ఎల్ ఆర్, అపాయింట్‍మెంట్ లెటర్ అందుకుని మౌనంగా బయటకి వచ్చాను.

ఆయన హెచ్చార్ మేనేజర్ కూడా ఏమీ కాదు. అడ్మిన్ సెక్షన్ లో ఒక సీనియర్ క్లర్క్. ఆ కంపెనీలో  వర్క్ కల్చర్ అంతేనని ఆ తర్వాత రోజులలో అర్థం అయింది నాకు.

ఈ సంఘటన 1991 డిశెంబర్ లో హైదరాబాద్ ఎల్‍బీ నగర్ సిరీస్ (SIRIS)  కార్పొరేట్ హెడ్ ఆఫీస్ లో జరిగింది. అది నా మొదటి ఉద్యోగం. ఎన్నో కలలు కని ఇష్టపడి మెడికల్ రెప్రెజెంటేటివ్ గా చేరాను. పది రోజుల శిక్షణ కార్యక్రమం అనంతరం చివరి రోజు ఈ గౌరవం లభించింది నాకు.

నాకు మెడికల్ రెప్రెజెంటేటివ్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం ఉండేది ఆ రోజుల్లో. వారి వస్త్ర ధారణ కావచ్చు, మోటార్ సైకిల్ ఎక్కి ఆత్మ విశ్వాసం నిండిన కండ్లతో దూసుకుపోయే విధానం కావచ్చు, ముఖ్యంగా వారి మెడలో ఎప్పుడూ వేలాడే టై కావచ్చు, నోరు తెరిస్తే ఇంగ్లీష్ మంచినీళ్ళప్రాయంగా మాట్లాడే ధోరణి కావచ్చు, ఇలా వాటిలో ఏది నన్ను ఆకట్టుకుందో నాకే ఇదమిత్తంగా తెలియదు. కానీ నాకు చాలా క్రేజ్ అయితే ఉండేది ఆ వృత్తి పట్ల.

నిజానికి మా అప్పకి నేను సివిల్స్ చదివి చక్కగా కలెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. నేను ఏనాడు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. ఆయన నా పై ఒత్తిడి కూడా తీస్కురాలేదు. నా నిర్ణయాన్ని గౌరవించారు. కాకపోతే ఒక్కటె అనేవారు,

’నీకు తెలివి తేటలు ఉన్నాయి, చక్కటి భాషా ఙ్జానం ఉంది. నిన్ను చదివించగల స్థోమత నాకు ఉంది, డిప్యూటి కలెక్టర్ గా రిటైర్ అయిన హోదా ఉంది. నీవు ఇదే రంగంలో రాణిస్తే బాగుంటుంది కద." అని. నేను ఎందుకో ఆయన మాటలని సీరియస్గా తీసుకోలేదు.  నేను మా అమ్మానాన్నలని తీవ్రంగా నిరాశపరచిన అంశం ఇదొక్కటే అనుకుంటా.

నేను మెడికల్ రెప్ అవతారం ఎత్తే ముందు ఓ రెండు మూడు బాంక్ ప్రవేశ పరీక్షలు వ్రాసి , ఒక పరీక్షలో ఇంటర్వ్యూ వరకు వచ్చి, తీరా ఇంటర్వ్యూ సమయానికి తీవ్రమైన సైనసైటిస్ రావటం వల్ల గొంతులోంచి మాట పెగలక ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను.

చెప్పాను కద, లోలోపల మెడికల్ రెప్ అవ్వాలనే స్వప్నం ఉండేదని. ఓ రోజు హిందూ దినపత్రికలో ’లుపిన్’ అనే కంపెనీ వారి ’వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనే ప్రకటన చూసి, ఇక ముందు వెనుకలు ఆలోచించకుండా ప్రయాణానికి సిద్దం అయిపోయాను. ఎక్కడ కడప, ఎక్కడ కోయంబత్తూరు. అయినా నా పట్టుదలే నెగ్గింది. రైలెక్కి కోయంబత్తూరు చేరుకున్నాను.

కదిలే రైల్లోంచి చూస్తూనే ఉన్నాను.

నన్ను రైలెక్కించటానికి వచ్చి ప్లాట్ ఫాం మీద నిలబడి, చేతులు ఊపుతూ నిలబడిన మా అప్ప రూపం  క్రమక్రమంగా మసకబారుతొంది .

నా కళ్ళలో నీళ్ళు నిండాయి అని నాకర్థం అయింది ఆ క్షణంలో. రోజుకి కొన్ని గంటలు స్థిమితంగా కూర్చుని గట్టిగా చదువుకుని ఉండుంటే ఆయన స్వప్నాన్ని సాకారం చేసి ఉండవచ్చు కద.

నేను చదివిన వామపక్ష పుస్తకాలు, కమల్ హాసన్ నటించిన ’ఆకలి రాజ్యం’ లాంటి చిత్రాల ప్రభావం వల్ల పెద్దలను ఎదిరించటం ఏదో గొప్ప అన్న భావన నాకు తెలియకుండా నా మీద బలంగా ఉండేదనుకుంటా ఆ రోజుల్లో. 

ఊరు కొత్త, భాష కొత్త. ఎలాగో అవస్తలు పడి కోయంబత్తూరు స్టేషన్ ఎదురుగా ఉన్న వైఢూర్య లాడ్జి అనే దాన్లో దిగి, మరుసటి రోజు ఉదయాన్నే, రేస్ కోర్స్ రోడ్ లో ఉన్న సూర్యా ఇంటర్నేషనల్ అనే హోటల్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాను.

అంత పెద్ద హోటల్ చూడటం అదే మొదటి సారి.

ఏతావాతా ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాను. వాళ్ళు నా ప్రయాణం ముచ్చట విని ఆశ్చర్య పడ్డారు. అడ్వర్టైజ్‍మెంట్ ఇవ్వటం అయితే ఇచ్చాం కానీ ఒక వ్యక్తి అంత దూరం నుంచి వస్తారా ఎక్కడైనా అని మందలించారు. నేను ఎన్నికైనట్టు ప్రకటించి, "మేము ఇక్కడ స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్నాము. నీకు భాష రాదు, వయసు కూడా చిన్నది, ఇక్కడ అవస్తలు పడతావు. నీవు ఎన్నుకోబడినప్పటికీ, నీకు మేము ఉద్యోగం ఇవ్వటం లేదు.  కాకపోతే కడపలో మా రెప్రజెంటేటివ్ చిరునామ ఇస్తాము. ఆయనతో టచ్ లో ఉండు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఖాళీలు ఏర్పడితే నీకే ప్రాధాన్యత ఇస్తాము" అని చెప్పి పంపారు.

ఆ ఇంటర్వ్యూ సంధర్భంగా నాకు పరిచయం అయిన నవీన్ కుంబ్లే ఇప్పటికీ నాతో టచ్ లో ఉన్నాడు. అతను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ టెక్నాలజీ లో ఇంజినీరింగ్ చేసి, ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు.

లుపిన్ కంపెనీ వారిచ్చిన చిరునామా పట్టుకుని కడపలో వాళ్ళ రెప్ రాజు గారిని కలిశాను.

ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అని కడపలో శ్రీ రాజు గారు పరిచయం అయ్యారు. ఆయనతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. వాళ్ళు మేము ఫామిలీ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నాము. ఆయనకి మా అప్ప అంటే చాలా గౌరవం ఏర్పడింది.  ఆ తరువాత ఎన్నో సార్లు ఆయన తన కుటుంబాన్ని తీస్కుని వచ్చేవారు మా ఇంటికి.

****

సరే! మళ్ళీ సిరిస్ కంపెనీ విషయానికొద్దాం.

లుపిన్ కంపెనీ ఇంటర్వ్యూ ముగించుకుని కడపకి వచ్చిన కొన్ని రోజులకీ ఈ సిరీస్ కంపెనీ వేకెన్సీ గూర్చి తెలిసింది. ఇదివరకటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి టై తగిలించుకుని వెళ్ళాలని నిర్ణయం తీసుకుని మా వీధిలో ఉన్న సన్ ఫార్మా రెప్ లక్ష్మీ నారాయణ ని అడిగి టై ఇప్పించుకుని , కడప లో క్రిష్టియన్ లేన్ లో ఉన్న ప్రతాప్ లాడ్జికి వెళ్ళాను. అక్కడే సిరిస్ కంపెనీ ఏరియా మేనేజర్ గారు దిగారన్న మాట.

నేను ఇంకో మిత్రుడు గౌరీ శంకర్ అనే అతను ఇద్దరం కలిసి వెళ్ళాము. అతను నేను నెల్లూర్ కి యురేకా పోర్భ్స్ కంపెనీ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు పరిచయం అతను. ఇతని గూర్చి ఓ ప్రత్యేక ఙ్జాపకం వ్రాయాలి. స్నేహానికి ప్రాణం ఇచ్చే మిత్రుడు ఈ గౌరీ శంకర్. ఇతను ఇప్పటికీ టచ్ లో ఉన్నాడు నాతో.

ఆ ప్రసాద్ గారు కాస్తా పొట్టిగా చలాకిగా ఉన్నారు. ఇద్దర్ని ఒకటే సారి రూంలోకి పిలిపించుకుని యధాలాపంగా నాలుగు మాటలు మాట్లాడి, ఏమనుకున్నాడో ఏమో "ఇద్దర్నీసెలక్ట్ చేస్తున్నాను. మీరు ఎల్లుండి ఈ పాటికల్లా విజయవాడలో ఉండాలి" అని ప్రకటించాడు

ఈ గౌరీ శంకర్ చాలా సిస్ఠమేటిక్. "ఉత్తినే అలా ఎలా వెళతాం. పద ఈ కంపెనీలో ఇదివరకు పని చేసి రిజైన్ చేసిన రెడ్డి అని ఒక రెప్ ఉన్నాడు. అతని దగ్గరకి వెళ్ళి మెళకువలు నేర్చుకుందాం" అని వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళాడు.

అయన చాలా మంచి వాడు. దయతో మాకు ఎన్నో విషయాలు చెప్పాడు. తాను ఏవో వ్యక్తిగత కారణాల వల్ల మానేస్తున్నానని, సిరిస్ చాలా మంచి కంపెనీ అని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడండి అని, విజయవాడ ఆఫీస్ లో ఎవ్వరు కనపడ్డా రెస్పెక్ట్ ఇవ్వమని, అందరి పేర్ల ముందు మిష్టర్ అని తగిలించి మాట్లాడమని చెప్పి ఇలా ఓ గంట సేపు మాకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించాడు.

పని పడి వెళ్ళినవారి మానసిక స్థితిని అర్థం చెసుకుని వారి కోసం సమయం కేటాయించి, వారిలో ధైర్యాన్ని నింపేలా మాట్లాడిన ఆయన సంస్కారం నాకు చాలా నచ్చింది.

ఇక సీన్ మారిస్తే మరుసటి రోజు విజయవాడలో ఉన్నాం. ఈ మారు వంటరి వాడిని కాను. ఈ గౌరీ శంకర్ తోడుంటం వల్ల  వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టయింది నాకు. స్నేహంలో ఉండే బలం అదేకద.

మేము ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. ఉత్సాహంగా షాపింగ్ చేశాం. నాకు తెలిసిన ఓ ఫార్మా మేనేజర్ గారింటికి వెళ్ళి ఆయన సలహాలు కూడా తీసుకున్నాం. విజయవాడ ఊరు మొత్తం మాదే అన్నట్టు తిరిగాం ఓ రోజంతా.

తరువాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళాం.

ఆ రెడ్డి గారు చెప్పినట్టు అందరి పేర్ల ముందు మిష్టర్ అని తగిలించాము, నక్క వినయాలు పోయాము, ఇంగ్లీష్ మంచి నీళ్ళ ప్రాయం మాకు అన్నట్టు బిల్డప్ ఇచ్చాం. చివరికి ఫలితమే తేడాగా వచ్చింది.

"కడప మార్కెట్ కి బలంగా ఉండే వ్యక్తి అవసరం. ఈ గొరీ శంకర్ ని ఎన్నుకుంటున్నాము. చూడంగానే సుకుమారంగా ఉన్న నిన్ను ఇప్పటికైతే ఎన్నుకోవటం లేదు" అని ప్రకటించారు.

***
ఆ తర్వాత ఓ పది రోజులకి గౌరీ శంకర్
, వాళ్ళ మేనేజర్ ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారు.

"ఆనంద్! నివ్వు కూడా సెలెక్టెడ్. నీకు అనంతపురం పోష్టింగ్ ఇచ్చారు. రేపే నీ ప్రయాణం హైదరాబాద్ కి. ఓ పది రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఇదిగో హైదరాబాద్ లో వారి కంపెనీ అడ్రస్"

 ప్రసాద్ గారు చిరునవ్వు నవ్వుతూ, షేక్ హాండిచ్చి "ఆల్ ది బెస్ట్" అన్నారు.

మిగతాది పార్ట్ టూ లో.

 

 

No comments:

Post a Comment