Tuesday, May 3, 2022

నాట్యం -తెలుగు సినిమా

 


నాట్యం

-తెలుగు సినిమా

 

ఈ సినిమాని సకుటుంబంగా హాయిగా చూడవచ్చు. కన్నుల పండగగా నృత్యాలు, రంగురంగులతో నిండిన ప్రకృతి దృశ్యాలతో అందమైన కాన్వాస్ తో హాయిగా ఉంది చూడ్డానికి.

నాన్ సీరియస్ ఆడియెన్స్ కి పూర్తి తృప్తిని ఇస్తుంది ఈ సినిమా. సరదాగా వెళ్ళామా, చూశామా, తృప్తిగా సస్పెన్స్ కూడా అనుభవించి మిష్టరీ వీడిపోయాక నిట్టూర్చి వచ్చేశామా అని చూస్తే ఇబ్బందేమి లేదు హాయిగా ఓ రెండు గంటలా పదిహేను నిమిషాలు గడిచిపోతాయి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

చాలా మంది రివ్యూలు అదే వ్రాశారు.

మరి ఎందుకు ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అని ఆలోచిస్తే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. నా దృష్టి కోణం వేరే కద. చెబుతాను అన్ని వివరాలు. విందురు గానీ.

****

ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ అని చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకరు ఉన్నారు , ఆమె ఎవరో కాదు , ఈ సినిమా కథానాయిక పాత్రధారిణి - సంధ్యారాజు బైర్రాజు. ఈమె ఈ సినిమాకి నిర్మాత, నృత్య దర్శకురాలు, కథానాయిక కూడ.

ఈమె ఇంటి పేరు వినంగానే ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా? నాకు అలాగే అనిపించి గూగుల్లో చూశాను. అప్పుడు అర్థం అయింది ఆమె ఎవరో. ఈమె సాక్షాత్తు సత్యం కంప్యుటర్స్ అధినేత బైర్రాజు రామలింగరాజు గారి కోడలు, మేటాస్ కంపెనీ అధినేత బైర్రాజు రామరాజు గారి శ్రీమతి. ఈమె తండ్రి తమిళనాడు  రాంకో సిమెంట్స్ కంపెనీ ఛైర్మన్ పీఆర్ వెంకట్రామ రాజా గారు.

29 సంవత్సరాల ఈ అమ్మాయి వివరాలు ఆసక్తి కలిగించేవిగా ఉండటంతో ఈమెని గూర్చి మరింత తెల్సుకోవాలని అనిపించడం సహజం ఎవరికైనా.

ఈమె ప్రముఖ కూచిపూడి నాట్యగురువు శ్రీ వెంపటి చినసత్యంగారి శిష్యురాలు.

ఈమె 2013 లో హిందీ షార్ట్ ఫిల్మ్ ’యాదోంకీ బారాత్’ లో నటించింది.

2017 లో మలయాళ థ్రిల్లర్ "కేర్ ఫుల్" లో జర్నలిస్ట్ గా ముఖ్య భూమికని పోషించింది.

ఈమె కూచిపూడి నృత్య శిక్షణా సంస్థని స్థాపించింది.

అంతేకాక ఆమె ఒక వ్యాపారవేత్త కూడా. సంధ్యా స్పిన్నింగ్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఈమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

****

ఇక ఈ సినిమాకి సంబంధించి:

ఈ నాట్యం సినిమాకి సంబంధించి ఈమె మూలస్తంభం అని చెప్పాలి.

ఈమె రెగ్యులర్ సినిమా నిర్మాతనో నటో కాదు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేవు. డబ్బు సంపాయించటానికి సినిమా ఈమెకి ఒక మాధ్యమం కాదు. కేవలం తపనతో, సినిమా మీద ప్రేమతోనో పేరు ప్రఖ్యాతులకోసమో మాత్రమే ఈ సినిమా నిర్మించింది అనేది నిర్వివాదాంశం.

ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ నటులు అందరూ ఈ సినిమా నిర్మాణం మొదలయ్యింది లగాయతు ఈ సినిమాకి ప్రచారం కల్పించటంలో ఇతోధిక పాత్ర పోషించారు. కొణిదెల కుటుంబానికి చెందిన ఉపాసన ఈ సినిమా తాలుకు మొదటి పోష్టర్ విడుదల చేయటం గమనార్హం.

ఇంత మంచి వాతావరణం, పేరు ప్రఖ్యాతులు, సినీ రంగంపై ఆసక్తి,  వెసులుబాటు, ప్రొత్సాహం, డబ్బుకు వెదుకులాడే ఆగత్యం లేకపోవడం తదితర కారణాల వల్ల, కమర్షియల్ పరిమితులకి లోబడి మూసధోరణిలో ఒక సాధారణ సినిమా తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు ఈమెకి. కానీ ఇంచుమించు అదే పని చేసి కూర్చుంది.

ఒక కళా ఖండాన్ని నిర్మించగలిగే ఒక చక్కటి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంది అని చెప్పవచ్చు. ఇదే సినిమాని ఏ సాధారణ నిర్మాతనో నిర్మించి ఉంటే ఇంత బాధపడే పని లేదు. ఈమెకి ఉన్న వనరులు, అవకాశాల దృష్ట్యా,  భారత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించి ఉండవచ్చు కద అనుకుంటున్నాను.

 

ఈ సినిమా ఇటు ఒక మామూలు కమర్షియల్ సినిమా కాదు. పోనీ చిత్త శుద్దితో తీసిన కళాత్మక చిత్రం కూడా కాదు. రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది.

వి.శాంతారాం  ’ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్’ ,

సింగీతం శ్రీనివాసరావు ’మయూరి’,

కే.విశ్వనాధ్ ’స్వర్ణకమలం, సాగరసంగమం, సప్తపది,శంకరాభరణం, సిరిసిరిమువ్వ’ ,

వంశీ ’సితార, ఆలాపన’,

జంధ్యాల ’ఆనందభైరవి ’, ఇవి మనకు తెలిసిన నృత్య ప్రధాన చిత్రాలు.

వీటి సరసన నిలబడటానికి ఏ విధమైన అర్హతా లేని ఒక సాదాసీదా చిత్రంగా  మిగిలిపోయింది ఈ ’నాట్యం’

****

మొదట కథేంటో తెలుసుకుందాం:

నాట్యం అనేది ఒక గ్రామం పేరు. ఆ గ్రామం సంప్రదాయ నృత్య కళాకారులకు పెట్టింది పేరు.

ఆ గ్రామంలో ఒక దేవత స్వయంభూ విగ్రహంగా వెలసి, అంతరించి పోయిన నాట్యకళలకి సంభందించిన ఎన్నో గ్రంధాలని ఆ గ్రామస్తులకి ప్రసాదించి ఉండటం వల్ల జనాలు విపరీతంగా ఆ గుడిని దర్శించి, ఆ విగ్రహాన్ని పూజించి పులకించి పోతుంటారు.

ఆ విగ్రహం వెలియడం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంటుంది.

బ్రిటిష్ పరిపాలకులు భారతీయ సంప్రదాయాలన్నింటిని కాలరాయాలనే కుట్రతో వేద పండితులను, నాట్యకళాకారులను ఇష్టారాజ్యంగా అమానుషంగా వధించి, హోమ గుండంలో వారినినిలువెల్లా దహించి వేసి అదే హోమగుండంలో నాట్యశాస్త్ర గ్రంధాలను కూడా ఆహుతి చేస్తారు. అప్పుడు ఆగ్రహించిన దేవత , హోమ గుండంలోంచి వెలువడి, బ్రిటిష్ సైనికులని నిలువరించి గ్రంధాలన్నింటినీ తిరిగి మానవాళికి అందించి తాను అక్కడే స్వయంభూ విగ్రహంగా వెలుస్తుంది.

ఇది టైటిల్స్ కి ముందు జరిగిన కథ.

ఆ తరువాత 1993 ప్రాంతాలలో మన  సినీ కథ ప్రారంభం అవుతుంది.

కథ ప్రారంభం సమయంలో నాట్య గురువు (ఆదిత్య మీనన్) బ్రిటిష్ ఆఫిసర్ గారి డైరీ చదువుతూ కనిపిస్తారు. ఇక అసలు కథ ప్రారంభం అవుతుంది.

ఆయన వద్ద సితార (సంధ్యారాజు బైర్రాజు) నాట్యమే ఊపిరిగా శిష్యరికం చేస్తూ ఉంటుంది. ఆమెకి ఒక స్వప్నం ఉంటుంది, అదేంటంటే చిన్నతనంలో తన గురువు చెప్పిన కాదంబరీ అనే కథని నాట్యరూపకంగా తన తొలి ప్రదర్శనగా అందరికీ చూపాలని.

కానీ ఆ కథని నలుగురి ముందు ప్రదర్శించబోయిన ప్రతిసారి ఎవరో ఒకరికి ప్రాణాపాయం జరగటమో, ఏవో ఇతర ఇబ్బందులు ఏర్పడటమో లాంటి వైపరిత్యాలు ఏర్పడి, గురువుగార్కి ఆ నాటక ప్రదర్శన అంటేనే విముఖత ఏర్పడుతుంది.

రెండవతరం గురువుగా ఆయన కుమారుడు (కమల్ కామరాజు) ఎదుగుతూ రావడం, అదే గ్రామానికి హైదరాబాద్ నుండి రోహిత్ (రోహిత్ బెహల్) రావటం జరుగుతాయి. ఈ రోహిత్ పాశ్యాత్య నాట్యంలో నిపుణుడు. అమెరికాకి వెళ్ళీ తన బృందంతో నాట్య ప్రదర్శన ఇవ్వాలన్నది అతని లక్ష్యం. ఈ పని మీద ఈ నాట్యం గ్రామానికి వస్తాడు.

 

అతని రాకతో సితార జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడి ఆమె జీవితం అల్లకల్లోలం అవుతుంది.

గిల్లి కజ్జాలతో ప్రారంభమైన సితార, రోహిత్ ల స్నేహం ఎటు దారి తీసింది, సరదాగా అతను కాసిన పందెం ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఆమె ప్రాణాలు తీయాలనే అంత పగ గ్రామస్తులలో ఎందుకు రగులుతుంది, ఇంతకూ రోహిత్ ఏమి చేశాడు, ఎలా వీళ్ళందరూ ఈ సమస్యలను అధిగమించారు, ఈ గుడి వెనుక అలుముకుని ఉన్న మిష్టరీ ఏమిటీ ఇవన్నీ తెరపై చూడాల్సిందే.

***

ఈ సినిమా దర్శకుడికి గానీ , కథకుడికి గానీ సీరియెస్ నెస్ లేదు. అది ప్రధానంగా వచ్చిన ఇబ్బంది.

ఇది కూచిపూడి అని గానీ, భరతనాట్యం అని గానీ మరోటి అని గానీ ఇంకోటి అని గానీ చెప్పరు. ఉత్తిగా శాస్త్రీయ నృత్యం అంటూ ఉంటారు. అందుకే అరంగేట్రం అని వాడాల్సిన దగ్గర ’రంగ ప్రవేశం’ అని పదం వాడతారు.

నా లాంటి సామాన్య ప్రేక్షకుడికే తెలిసిపోతూ ఉంటుంది, ఇది శాస్త్రీయ నృత్యం కాదు ఏమీ కాదు , ఉత్తినే సినిమాటిక్ నృత్యం అని. కాకపోతే అసభ్యత లేదు, కన్నులపండగగా ఉంది చూడ్డానికి కాబట్టి ఇబ్బంది లేదు.

 

ఈ సినిమాలో బలమైన కథలేకపోవడం పెద్ద లోపం.

చాలా గొప్ప సస్పెన్స్ మిష్టరీగా మొదలైన కాదంబరి నాట్య ప్రదర్శన అంశం, చివర్లో కారణం తెలియగానే తుస్సుమన్న భావన కలుగుతుంది.

గ్రామస్తులకి సితార మీద కోపం కలిగి ఆమె ప్రాణాలు సైతం తీసేదానికి వెనుకాడనంత ఆగ్రహం కలిగేదానికి దారి తీసిన సంఘటనలు కూడా బలంగా అల్లుకోలేకపోయారు దర్శకులు. ఆ నాట్యం గ్రామం హైదరాబాద్ కి కూతవేటు దూరంలోనే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కథలోని పాత్రల రాకపోకలబట్టి. అయినా వాళ్ళు ఆమె ఆచూకి తెలుసుకుని ఆమెని మట్టుబెట్టే ప్రయత్నం చేయకపోవటమ్ విడ్డూరంగా ఉంటుంది.

కూచిపూడి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కథని అల్లుకున్నారనుకోవచ్చు. కానీ కథాసౌలభ్యం కోసం, హంపీలో, లేపాక్షిలో ఇతరత్ర చారిత్రక ప్రదేశాలలో కన్నులకింపైన లొకేషన్లలో కథ నడుస్తుంది.

ఇంతకూ ఈమె ఏ లక్ష్యంతో ఈ సినిమా తీసిందో అర్థం కాలేదు.

* కథలో నిండుతనం కానీ లోతు కానీ లేదు. ఏదో చందమామ కథలాగా ఎటువంటి లాజిక్ లేకుండా అతుకుల బొంతలా ఉంది. ఈ కథకుడికి ప్రేక్షకుల ఐక్యూ లెవల్స్ పట్ల చాలా చిన్నచూపు ఉన్నది అన్నది నిర్వివాదాంశం. లేకుంటే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఇంత పేలవమైన కథని అందించరు.

గ్రామస్తులకి ప్రాణాలు తీసేంత కోపం రావటానికి కారణం అయిన సందర్భం కానీ, వారికి కోపం పోయి ఒక మహత్తర మలుపు కి, మార్పుకి, కారణం అయిన కాదంబరి నృత్యం కానీ  చాలా సునాయాసంగా తీసేసారు. ఆత్మ లోపించింది ఈ రెండు సందర్భాలలో.

దర్శకత్వం తూతూ మంత్రంగా చేసినట్టుగా తోస్తోంది.

* బ్రిటిష్ వారు మన సంపదని దోచుకోవడం మీద ఆసక్తి చూపారే గానీ ఇలా గుళ్ళని, గోపురాల్ని ధ్వంసం చేయటం, తాళపత్ర గ్రంధాల్ని ధ్వంసం చేయటం, ధార్మికులని సజీవ దహనం చేయటం వంటి పనులు చేయలేదు నాకు తెలిసినంత వరకు. అటువంటి పనులు ఎవరు చేశారో చరిత్ర పట్ల కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. మరి  చరిత్రని నిర్భయంగా చెప్పలేని అశక్తత ఏమిటో ఈ రచయిత కి. మరి అలాంటప్పుడు వక్రీకరించకూడదు కద.

* ఇంకో విడ్డూరం అయిన విషయం చెబుతాను. గుడి ధర్మకర్తలని, విభూతి రేఖలు పెట్టుకున్న బ్రాహ్మణులని చెడ్డవారిగా చూపటానికి ఈ దర్శకుడికి గానీ, రచయితకి గానీ ఏ విధమైన సంకోచం కలగలేదు మరి.

* ఇటీవల పర్సనాలిటీ డెవలెప్ మెంట్ ట్రయినర్స్ అందరికీ ఏదో బుక్ వ్రాసి మార్కెట్ లో విడుదల చేస్తే, గానీ తమకు ట్రెయినర్ గా గుర్తింపు రాదు అనే ఒక చాదస్తం ఏర్పడింది.

ఇదిగో ఇలాంటి చాదస్తం ఏదో ఈ అమ్మాయికి ఉన్నట్టుంది. ఒక డాన్సర్ గా ఇంకా మంచి గుర్తింపు రావాలి అంటే, కొన్ని సినిమాల్లో నటించాలని ఈమె అనుకుంటున్నట్టు తోస్తోంది. అందుకే ఏదో  మొక్కుబడిగా ఈ సినిమా తీసిందే తప్ప ఇందులో సినీ నిర్మాణ విలువల పట్ల గానీ, నాట్యం పట్ల గానీ పెద్ద తపన ఏమీ కనపడలేదు నాకు

కానీ ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది. చూడ ముచ్చటగా ఉంది. నటనలో పరిణతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

****

ఈ సినిమా సంగీతం గూర్చి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేను ఇటీవలే చూసిన ’సేనాపతి’కి కూడా ఈ కుర్రాడే సంగీత దర్శకుడు. శ్రావణ్ భరధ్వాజ్. ఇతనికి ఇటీవల మంచి అవకాశాలే వస్తున్నాయి. ఈ సినిమాలో అతనికి మంచి సంగీతం అందించే అవకాశం ఉన్నప్పటికీ, చేజేతులా ఈ అవకాశాన్ని జారవిడుచుకున్నట్టు అనిపిస్తుంది.

తెలుగేనా అనిపించింది కొన్నిపాటలు వింటుంటే, వింత గొంతులు, వింత ట్యూన్లు అంతా ఒక దుర్భర నరకప్రాయమైన అనుభవం.

కాదంబరీ నృత్య నాటకంలో గానీ, కీలకమలుపుకు కారణం అయిన రాధాకృష్ణుల పాట గానీ, నమశ్శివాయ పాట గానీ,  ప్రాక్ పశ్చిమ ఫ్యూషన్ కి అవకాశం ఉన్న నృత్య శిక్షణ సందర్భంలో గానీ, ఇలా ఎన్నో అవకాశాలు ఈ సినిమా నిండా. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే బాగా నేలబారుగా ఉన్నాయి పాటలు అన్నీ.

****

పాజిటివ్ అంశాలు:

అసభత లేదు. కుటుంబ సమేతంగా కూర్చుని ఒక చక్కని చిత్రాన్ని లాజిక్ ఆలోచించకుండా చూస్తే బాగుంది. ఫోటోగ్రఫీ బాగుంది.

సస్పెన్స్ ఉంది.

ఒక సారి హాయిగా చూడవచ్చు

నెగటివ్ అంశాలు:

కథ చాలా పేలవంగా ఉంది.

****

నటీనటులు:

సంధ్యారాజు బైర్రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, ఆదిత్య మీనన్, హైపర్ ఆది

రచన, దర్శకత్వం, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్:  రేవంత్ కోరుకొండ

 

 

 

 

 

 

No comments:

Post a Comment