Thursday, April 23, 2020

నాన్నా పులి! ..........., నిజంగానే



నాన్నా పులి! ..........., నిజంగానే

-రాయపెద్ది వివేకానంద్


పెద్ద పులి నిలబడి వుంది జానకి ఎదురుగా.
కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తోంది. ఇద్దరూ కదలటం లేదు. దాని కళ్ళలోకే చూస్తూ నిలుచుంది జానకి. పులి చాలా అలర్ట్‌గాచూస్తూ, తన తోకని బిర్రుగా చేసి కొరడాలా గాలిలోనెమ్మదిగా కదుపుతోంది.  ముందరి పాదాల్ని నేలకి బలంగా ఆన్చి దూకడానికి సన్నద్ధంగా వుంది. కాలి చివర పంజాల్నించి బయటకి రావటానికి కూచిగా వున్న గోళ్ళూ సిద్దంగా వున్నాయి. అప్పుడప్ఫుడూ తన నాలుక బయటకు చాచి తన మూతిచుట్టూ రాచుకొంటోంది.
పులిని అంత దగ్గరగా చూసేసరికి పైప్రాణాలు పైనేపోయాయి జానకికి. అదేమన్నా అడవా అంటే కాదు మహానగరం, అందులోనూ  నగరానికి నడిబొడ్డులో,అత్యంత సంపన్నులు నివసించే ఖరీదైన ప్రాంతంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణ. మధ్యాహ్నం పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ ఇవ్వటానికి ప్రతిరోజు రావటం ఒక వ్యాపకంగా పెట్టుకుంది జానకి. కావాలంటే కారు డ్రయివర్‍తోనో, పనివారితోనో పంపవచ్చు. తనే సరదాగ స్కూటీలో వచ్చి వెళ్ళటం, నలుగురితో పరిచయాలు, కాస్తా మాటా, మంతి బావుంటుందని తనే రావటం అలవాటుగా పెట్టుకుంది. ఏదో చిన్న ఊర్లో సాధారణ డిగ్రీ చదివిన జానకి, పెళ్ళయ్యాక సాఫ్ట్ ఇంజినీర్ అయిన భర్తతోటి వచ్చి నగరంలో ఉంటోంది. చిన్న చిన్న సరదాల్తొ ఉల్లాసంగా ఎప్పటికప్పుడు ఆనందంగా ఉండకుంటే నగరజీవితం మనిషిని ఎంత యాంత్రికంగా మార్చేస్తుందో తెలియంది కాదు జానకికి. ఎప్పట్లాగే లంచ్ బాక్స్ తెచ్చి, కాసేపు నీటి తళ తళలని చూద్దామని చిన్ని గేటుతీసుకొని స్విమ్మింగ్‍పూల్‍వైపు వచ్చింది. కానీ ఈ రోజు ఇంత భయంకరంగా మారుతుందని కలలో సైతం ఊహించలేదు జానకి. ఒక్కోక్క క్షణము ఎంత విలువగలిగనదోనన్న విషయం తెలిసొచ్చిన రోజిది తనకి.
అసలిక్కడికిఎలా రాగలిగింది ఈ పెద్ద పులి? అయినా ఇప్పుడది కాదు ముఖ్యం, ఎలా తప్పించుకోవాలనేది ఆలోచించాలి తానిప్పుడు.
స్కూల్ తాలూకు ప్రచారచిత్రం తీయటానికి వచ్చిన కెమెరాబృందం కూడా ఒకటి ఉందక్కడ, ఒక డైరెక్టర్ లాంటి వ్యక్తి, ముగ్గురు కేమెరామెన్, జానకితోపాటు వీళ్ళూ చిక్కుకుపోయారు ప్రమాదంలో అదే స్విమ్మింగ్‍పూల్ ఆవరణలో.
పారిపోవటానికి వారికి ఉన్న ఒకే ఒక మార్గం వెనుక వైపున్న చిన్న గేటు మాత్రమే. కేవలం కొద్ది నిమిషాల ముందే స్విమ్మింగ్‍పూల్ తాలూకు మెయిన్ గేట్ మూసేయ్యటం జరిగింది. అదెలాగ జరిగిందో తెలుసుకోవాలంటె,  ఒక గంట వెనక్కు వెళ్ళాలి.

****                       ****                          ****

ఎప్పట్లాగే ఉదయాన్నే ప్రార్థనానంతరం పిల్లలందరూ ఎవరి తరగతి గదులకి వారెళ్ళిపోయి శ్రద్ధగా పాఠాలు చదువుకుంటున్నారు. ఎవరిపనులలో వారు నిమగ్నమయ్యారు. బాత్రూంలు శుబ్రపరచటానికి వెళ్ళిన రాజవ్వ చూసింది మొదట పులిని. బ్రష్‍లు, చీపుర్లు, బకెట్ పట్టుకుని వెళ్ళి ఓరగా మూసిన బాత్రూం తలుపు తీసింది రాజవ్వ.
చీకటి గదిలో మిణుగురుపురుగుల్లా మెరిసిపోతూ రెండు కళ్ళు కనిపించాయి మొదట.
గుర్‍ర్‍ర్ర్ మన్న చప్పుడు వినిపించింది నెమ్మదిగా. కుర్రాళ్ళేమయినా ఆటపట్టిస్తున్నారేమోననుకుంది మొదట. స్విచ్చాన్ చేసి, తనెదురుగా వున్న పెద్దపులిని చూసి అవాక్కయింది. ఆమె గొంతులోంచి మాట రాలేదు మొదట.
పిల్లి రావటం కద్దు, కుక్క రావటం కద్దు. ఇదేంటి పులి వచ్చింది, ఇది కలా నిజమా? కాసేపు తన కళ్ళని తను నమ్మలేకపోయింది రాజవ్వ. ఓ మూలన నక్కి పడుకుని ఉంది పెద్ద పులు. అసలెలా వచ్చిందో అది నగరం నడిబొడ్డున ఉన్న స్కూలు ఆవరణలోకి?
భయవిహ్వల అయి ఆమె పెట్టిన ’పులి...పులి’ అన్న వెర్రి కేకకి బిల్డింగ్ మొత్తం అప్రమత్తమయ్యింది. 
స్విమ్మింగ్ పూల్‍కి మూడువైపుల ప్రేక్షకులకై గ్యాలరీలు, నాలుగోవైపు ప్రధాన ద్వారం వుంటాయి.  ప్రధాన ద్వారం దాటి పూల్ ఆవరణలోకి రాగానే ఆహ్లాదకరంగా పచ్చని పచ్చికతో కూడిన లాన్ల్, పెద్ద పెద్ద వృక్షాలు వుంటాయి.  ఈ లాన్‍కి స్విమ్మింగ్‍పూల్‍కి మధ్యలో విశాలమైన వెయిటింగ్ హాలు,వరండా, దాని తర్వాత షవర్ బాత్ చేయటాన్కి సౌకర్యాలు, బట్టలు మార్చుకోవటానికి గదులు, బాత్‍రూంలు, ఇతర గదులు వుంటాయి.
ఇవన్నీ దాటాక స్విమ్మింగ్ పూల్. చాలా పెద్దది అది. వంద ఆడుగుల పొడవు, దాదాపు యాభై అడుగుల వెడల్పుతో వినీలాకాశం క్రింద స్వచ్చమైన జలాలతో చూడంగానే ఆహ్లాదంగా వుంటుంది.
ఆమె పెట్టిన కేకలతో ప్రమాదం పసిగట్టిన సెక్యూరిటి గార్డ్ స్విమ్మింగ్‍పూల్ తాలూకు ప్రధాన ద్వారం మూసేశాడు. కేకలు పెడుతూ బాత్రూం నుంచి బయటకు వచ్చిన రాజవ్వ ప్రధానద్వారం వైపే పరుగు తీసింది. పెద్దపులి కూడా ఆమెని వెంబడిస్తూ పరుగులు తీస్తూ వచ్చి ప్రధానద్వారం వద్దకు వచ్చి చేరుకుంది. గేటు మూసి వుండటం వల్ల ఆగాల్సొచ్చింది రాజవ్వ.
నిజమైన ఇరకాటంలో ఇప్పుడు పడ్డాడు సెక్యూరిటీ గార్డ్. గేటుతీయటమంటే సాక్షాత్తు మృత్యువుని స్కూల్లోకి ఆహ్వానించి, వందలాది ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాల్ని పణంగా పెట్టడమే అని అతనికి తెలుసు. గేటు తీసినాకూడా అది రాజవ్వని వదుల్తుంది అని ఏమీ నమ్మకమేమీ లేదు. ఆమెని ఎటు తిరిగీ ఎటాక్ చేస్తుంది ఆమెకి అది అతి సమీపంలో వుండటం వల్ల. గేటు తీయకుండా వుంటే కనీసం పిల్లలన్నా క్షేమంగా వుండొచ్చు. చివరికి పిల్లల్ని రక్షించటానికే నిర్ణయించుకొన్నాడు.క్షణంలో వెయ్యవవంతు పాటు ఆలోచించుకుని అతను నిర్ణయం తీసేసుకున్నాడు. గేటు మూసి వుంచటానికే  అతను తీసుకున్న నిర్ణయం వందలాది చిన్నారులను కాపాడింది.
కాకపోతే ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది.
తన ముందరేదయినా వస్తువు కదుల్తూ కనిపిస్తే దాన్ని పట్టుకోవటానికి దానివెంబడి పరిగెత్తే మన ఇళ్ళలోని పిల్లిలా,  ఈ పులి కూడా  తన సహజ సిద్దమయిన ప్రవృత్తి వల్ల రాజవ్వని వెంబడించింది,  అంతేగానీ ఆమెకి హాని చేసే ఉద్దేశ్యం ఉన్నట్టు లేదు దానికి నిజానికి.
రాజవ్వ అకస్మాత్తుగా ఆగిపోవటంతో,  పెద్దపులి కూడా ఆగిపోయింది. ఒక సారి ఆమె దగ్గరగా వచ్చి ఆమెని వాసన చూసింది. ఆ తరువాత పంజాతో ఆమెని ఒక్క తోపు తోసేసి ఓ మూలనున్నచెట్టు చాటుకు వెళ్ళిపోవటానికి ఉద్యుక్తురాలైంది. అయితే అది మేనీటర్ కాదన్నమాట. గతంలో ఆర్మీ శిక్షణ ద్వారా తెలుసుకున్న అంశాల్ని బేరీజు వేసుకుంటూ గేటు తీసి రాజవ్వని బయటకు రానిద్దాం అని సెక్యూరిటి గార్డు ఉద్యుక్తుడయ్యేలోగా, అప్పుడు జరిగింది ఆ సంఘటన.
గేటు చుట్టూ చేరి ఈ యావత్తు ఉదంతాన్ని శ్రద్ధగా చుస్తున్న టీచర్లు, ఇతర స్టాఫ్ మెంబర్లలో ఎవరో ’రాజవ్వా! కొట్టేయ్, కొట్టేయ్’ అని అరుస్తూ ఓ దుడ్డుకర్రను గేటుపైనుంచి లోనికి విసిరారు.
రాజవ్వకి సాయం చేస్తున్నామనుకుని, చిన్న చిన్న కంకర రాళ్ళని పులి మీద విసుర్తూ ’థేయ్,థేయ్’ అని అరవసాగారు.
లేని ప్రమాదాన్ని శంకించి, రాజవ్వని శత్రువుగా భావించిన పెద్దపులి, ఎగిరి దూకి రాజవ్వ మెడ కరిచి పట్టుకుంది. అప్పుడు వచ్చింది జానకి. గ్యాలరీల క్రింద కేవలం ఓ మనిషి పట్టేటంత చిన్న గేటు వుంది స్విమ్మింగ్‍పూల్‍కి వెనుకవైపు. అది తెరుచుకుని వచ్చి కాసేపు నీళ్ళని చూట్టానికి వచ్చింది ఆమె. రాజవ్వపైకి లంఘించిన పులిని చూసి అవాక్కయింది జానకి. ఆ అయోమయంలో మరింత ముందుకే పదడుగులు వేసింది మంత్రవశురాలిలా.
ఇప్పుడు ఆ ఆవరణలో పులినోట ప్రత్యక్షంగా చిక్కుకుపోయిన రాజవ్వ, కేమెరా ఏంగిల్స్ సరిచేసుకుంటున్న వీడియో బృందం, జానకి వీళ్ళు మాత్రమే మిగిలిపోయారు.
రాజవ్వమెడని బలంగా కరచిపెట్టుకుని లాక్కుంటూ ఓ పొదచాటుకు వెళ్ళి,ఆమె శరీరంపై ఓక కాలు అదిమిపెట్టి పరిసరాల్ని అప్రమత్తంగా గమనిస్తూ ’గుర్ర్, గుర్ర్’ అంటు చూస్తోంది పెద్దపులి.
రాజవ్వ ’పులి పులి’ అని మొదటి సారి కేకలు పెట్టినప్పుడు కెమెరాబృందం చిన్న గేటుకు కేవలం అయిదడుగుల దూరంలో మాత్రమే ఉండినారు. పారిపోవటానికి అది మహదావకాశం వారికి. కానీ రాజవ్వ తమవైపు కాక ప్రధాన ద్వారం వెళ్ళటంతో వారు కాస్తా తెరిపినపడ్డారు.
వృత్తిపరమైన ఆసక్తితో రాజవ్వ అరచుకుంటూ బయటకు వచ్చినది లగాయతు వీడియోలో రికార్డు చేయటం మొదలెట్టారు. పులి ఇటు వైపు వస్తే పారిపోదాములెమ్మని కాస్తా తాత్సారం చేశారు. చిన్నగేటు దగ్గరగానే వుండటం వారి ధైర్యానికి కారణం.
పెద్దగేటు వైపునుంచి ఇక్కడి దాకా రావటానికి కనీసం అంటే ఓ రెండొందల ఆడుగులదూరం వుంది కద, పులి ఇటువైపు రావటం మొదలంటూ పెడితే  క్షణాలలో చిన్న గేటుద్వారా బయటికిపారిపోయి, ఆ చిన్న గేటు మూసేస్తే, ఇక పులి బయటకు ఎంతమాత్రమూ రాలేదని వారి అంచనా. అది నిజానికి సరయిన అంచనానె. ఎందుకంటే చుట్టూ ఎత్తైన గ్యాలరీలు, మరో వైపు పెద్ద గేటూ ఇలా ఎటూ పారిపోవటానికి దానికి అవకాశం ఉండదు కూడాను.
అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?
అందరి అంచనాల్నీ తలక్రిందులుచేస్తూ జానకి రంగప్రవేశం చేసింది సరిగ్గా అదే సమయానికి. రావటం రావటమే ఓ పదడుగులు ముందుకు దూసుకువెళ్ళి పెద్దపులి దృష్టి ఇటుపడేలా చేసింది.
రాజవ్వ శరీరం నిర్జీవం అయ్యేవరకు అలాగే ఒడిసిపట్టుకుని, ఆ వృద్దురాలు నిశ్చేతనంగా తలవాల్చాక, ఆమెని వదిలేసి ఇటువైపు నింపాదిగా అడుగులు వేయటం మొదలెట్టింది. కదలటం కూడా మరచిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది జానకి.
పెద్దగేటు దగ్గరి పచ్చిక బయలు దాటి, హాలు - వరండా దాటి, షవర్ బాత్ చేసే స్థలం దాటి నీరెండలోకి వచ్చి నిలబడింది. ఇప్పుడు పులి ఎదురుగా నీలిరంగు ఆకాశాన్ని ప్రతిఫలిస్తున్న స్విమ్మింగ్ పూల్. పూల్‍కి ఒక వైపు జానకి పులికి కాస్తా దగ్గరలో, పూల్‍కి రెండవవైపు వీడియోబృందం పులికి కాస్తా దూరంలో.
 చిన్న గేటు జానకి వచ్చిన వైపు వుంటుంది. ఇంకో రెండడుగులు ముందుకేసింది పులి. స్థాణువులా నిలబడిపోయింది జానకి.
పులి గాండ్రింపుతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది ఆమె.
ఇంకో రెండడుగులు ముందుకు వేసి , ఈతకొలను దగ్గర ఆగి, ముందరికాళ్ళు మడిచి, ముందుకు వంగి నింపాదిగా నీళ్ళు త్రాగింది పులి. దానిలో ఎటువంటి భీతి కనపడటంలేదు. మంచి యవ్వనంలో వుందది. ఆరోగ్యంగా నీరెండలో మిసమిసలాడుతున్న పచ్చటి శరీరం. నల్లరంగు చారలు దాని అందానికి తుదిమెరుగులు దిద్దుతున్నాయి.
రాయల్ బెంగాల్ టైగర్ అంటే ఇదే అనుకుంటా’ గేటు వద్ద నుంచుని ఉత్కంఠగా చూస్తున్న టీచర్ ఎవరో ప్రక్కనున్న వారికి చెపుతోంది. పెద్ద గేటు వైపు చేరిన జనాల సంఖ్య ఎక్కువయింది. చుట్టూ బిల్డింగ్స్ పై చేరిపోయి ఆందోళనగా చూస్తున్నారు టీచర్లు ఇతర స్టాఫ్ మెంబర్లు.
కొలనుకి ఒక అంచున సరిగ్గా మధ్యలో పెద్దపులి. దానికి యాభై అడుగుల దూరంలో ఒక వైపు జానకి. మరో వైపు అటుచివర ఓ వంద అడుగుల దూరంలో వీడియో బృందం. కాన్ఫరెన్సు హాల్లో బాస్ కి ఎదురుగా ఉన్న పొడగాటి టేబుల్‍కి అటుఇటూ కూర్చున్న ఇతర ఉద్యోగస్తులలా వున్నారు వారు. మధ్యలో స్విమ్మింగ్‍పూల్.
నీళ్ళు త్రాగటం ముగించి, ఒక సారి తల విదిల్చింది. మూతికి అంటుకున్న నీటిని పొడవైన నాలుక బయటకు చాచి,, మూతి చుట్టూ తుడుచుకుంది. కుడికాలు పైకెత్తి, పంజాని నాలుకతో తడిచేస్కుని, మొహం మొత్తం తుడుచుకుంది.
తరువాత ముందు కాళ్ళు చాచి ఒళ్ళు విరుచుకుంది. ఇప్పుడది ఎంతో ఉత్సాహంగా వున్నట్టు కనిపిస్తోంది. కెమెరా బృందం ఈ కదలికల్ని యావత్తు తమ కెమెరాలో బంధిస్తున్నారు.
తిరిగి నడక ప్రారంభించింది పులి. అది జానకి ఉన్న వైపుకి రాకుండా కెమెరామెన్లు ఉన్న వైపుకి నడకమొదలెట్టింది.
ఇప్పుడు కొలనుకి అటువైపు పులి, ఇటువైపు జానకి. మధ్యలో తళతళలాడుతూ నీలిరంగు నీళ్ళు. మధ్యలో ఆగి అది ఓసారి  జానకి వంక తేరిపార చూసింది, ఝల్లుమంది ఆమెకి. కాసేపలాగే నిలబడి ఆమె వంకే చూసి, తిరిగి నడక కొనసాగించింది పులి. వళ్ళంతా చల్లగా అయినట్టయింది జానకికి.
 కెమెరావారికి పులికి మధ్యలో దూరం తగ్గిపోతోంది.
"మేడం! చిన్న గేటు వైపు వచ్చేయండి. పారిపోదాం" కేకలు పెడుతూ పరుగులంకించుకున్నారు కెమెరా బృందం వారు. చెవుల్లొ ఆ అరుపులు చేరుకుంటున్నాయి కానీ, ఊహించని విధంగా కంటి ముందు జరిగిపోతున్న దృశ్యాల వల్ల బహుశా ఆమె మెదడు స్థంబించిపోయింది కాసేపు.
వెనక్కు తిరిగి కొన్ని క్షణాలు ఆలశ్యంగా పరుగు మొదలెట్టింది జానకి. ఆ కొన్ని క్షణాల ఆలశ్యంవల్ల చాలా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సొస్తుందని ఆమెకి ఊహామాత్రంగా కూడా తెలియదు.
పరుగందుకున్న వారిని చూసి అమితోత్సాహంతో వెంబడించింది పులి.దానికి అంతా ఆటలా వుంది. పూల్ ఆ చివరనుంచి నలుగురూ  జానకి ఉన్న వైపుకి వచ్చేసి చిన్నగేటులోంచి  బయటపడాలి.
మొదటి ముగ్గురూ క్షేమంగా బయటపడ్డారు. నాలుగో వాడు గేటుదగ్గరికి చేరుకోవటంలో మిగతా వారికంటే కాస్తా వెనుకబడ్డాడు.
వాడు చిన్నగేటుదగ్గరకు చేరుకునే లోగా వాడి పిరుదుని ఒడిసి పట్టేసింది పులి. ప్రాణభయంతో పరిగెత్తుతున్నఅతడెలాగోలాగ దాని బారినుంచి తప్పించుకుని రక్తమోడుతూ , చావు తప్పి కన్నులొట్టబోయినంతపనై , కుంటుతూ ఆ చిన్న గేటుని దాటి బయట పడగలిగాడు.
ఒకే ఒక క్షణం తేడాతో జానకి కూడా చిన్నగేటు దగ్గరికి చేరగలిగింది. ఇప్పుడు జానకికి పులికి మధ్య కేవలం ఒక నాలుగడుగుల దూరం మాత్రమే ఉంది. గేట్ దాటి బయటకు అడుగేసి , గేటు మూయటానికి ఆ సమయం చాలు నిజానికి. కాబట్టి జానకి కూడా క్షేమంగా బయట పడిగలిగేదే, ఒక చిన్న అపశృతి దొర్లకుండా వుండుంటే.
విధి వింతనాటకం ఆడటమంటే అదే కావచ్చు బహుశా.
చివరిగా పరిగెత్తిన వాడు గాయం కారణంగా కావచ్చు ఇరుకైన ఆ చిన్నద్వారాన్ని దాటుతుండంగానే స్పృహతప్పి పడిపోయాడు, ఆ పడటంలో అతను గేటును ఆసరాచేసుకుంటూ బరువంతా దానిపై వేసి నేలపై పడిపోయాడు. వాడలా పడటమేమిటి, ఆ పాత గేటు పూర్తిగా ఊడిపోవటమేమిటి క్షణాలలో జరిగిపోయాయి. ఇప్పుడు మూద్దామన్నా గేటు లేదు. పారిపోతున్న వారితో పాటుగా పులి కూడా స్వేఛ్చగా బయటకు రావటానికి ఆస్కారం ఏర్పడింది.
ఇప్పుడు జానకి సరిగ్గా ఆ ఇరుకైన గేటు వద్దకు వచ్చేసింది, అది  దాటంగానే తాను బయట పడ వచ్చు. పులి జోరుగా కదిలి వస్తోంది. నిజానికి  ఇంకా కూడా పులికి తనకి సేఫ్ డిస్టేన్స్ వుంది .
ఈ క్షణందాకా ఆ చిన్నగేటు దాటంగానే తను సేఫ్ అనుకుంటు వచ్చింది . ఇప్పుడు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఏ గేటయితే తనకు రక్షణ ఇవ్వగలిగివుండేదో అది ఇప్పుడు ఊడిపోయింది. తానిక పూల్ లోపలవైపున ఉన్నా, బయటకి వెళ్ళినా రక్షణలేదిక తనకి.  ఆ ఇరుకైన చిన్న ద్వారం వద్దనే ఆగిపోయి, అడ్డుగా నిలబడిపోయింది.
పులికి తాను చిక్కటం ఖాయం అని అర్థం అయిపోయింది జానకికి. తన మృత్యువు గేటుకి ఇవతలా లేదా గేటుకి అవతలా అన్న విషయంలో మాత్రమే తానిక నిర్ణయం తీసుకోగలదు.
తాను ఇరుకైన ఆ గేటుకి అడ్డుగా నిలబడినంతసేపు పులి బయటికి వెళ్ళలేదు. తన్ని తరుముకుంటూ ఎప్పుడైతే పులి గేటు దాటి స్కూలు ఆవరణలోకి వచ్చేస్తుందో పరిస్థితి మరింత భయంకరంగా తయారవుతుంది. అందర్నీ తను మాత్రమే కాపాడగలదు.

ఆ చిన్న గేటు అవతలంతా తోట, పెద్ద పెద్ద వృక్షాలు, పచ్చిక బయలు వున్నాయి. దాని తర్వాత పెద్ద ఎత్తుగాలేని కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ దాటితే కాలనీలోకి కూడా వెళ్ళిపోవచ్చు పులి కావాలనుకుంటే. కాంపౌండ్ వాల్‍లోపలి వైపునంతా  బ్లాకులు, బ్లాకులుగా స్కూలు భవనాలు, ఆఫీసు గదులు, క్యాంటీన్, టెన్నిస్ కోర్ట్, సర్వెంట్ క్వార్టర్స్, పార్కింగ్ ప్లేసు, ఇలా విస్తరించి ఉంది స్కూలు.
కాలం ఇప్పటిదాకా ఎంత వేగంగా పరిగెత్తిందో, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు క్షణమొక యుగంలాగా గడుస్తోంది జానకికి.
రాజవ్వ పులిని గుర్తించటం,  అటువైపు పెద్ద గేటు మూసి వేయటం, రాజవ్వ పులి చేతికి చిక్కి హతమవటం, తనప్పుడే చిన్న గేటు ద్వారా ఈత కొలను ప్రాంగణంలోకి రావటం, పులి ఇటు వైపు వచ్చి కెమెరా వారిపై దాడి చేయటం, చిన్న గేటు ఊడిపోవటం, ఇదంతా సినిమా రీల్లా కొన్ని నిమిషాలలో జరిగి పోయాయి.
మీడియాకి వార్త వెళ్ళలేదింకా. ప్రిన్సిపాల్ ఫోన్ మీద ఫొన్ చేసి అన్ని శాఖలనీ అప్రమత్తం చేస్తున్నారు. పిల్లలెవర్నీ తరగతి గదులనుంచి బయటకు రానియ్యవద్దని మైకులో అన్ని క్లాసుల్లో ప్రకటనలు చేయిస్తున్నారు. అవసరమయితే పులిని షూట్ చేయటానికి సెక్యూరిటీ గార్డులు ఆయుధాలు సిద్ధం చేసుకుని చిన్న గేటు వద్దకు వచ్చేశారు.
జూ పార్క్ వారికి విషయం తెలిపారు.
"దయచేసి పులిని చంపవద్దు." ఛీఫ్ క్యూరేటర్ పాణిగ్రాహి ఫోన్లోనే అభ్యర్థించారు ప్రిన్సిపాల్ని. "కేవలం అరగంటలో ట్రాంక్విలైజర్లను తీసుకుని మాషూటర్స్ అక్కడికి చేరుకుంటారు. దయచేసి ఓపిక పట్టండి" పాణిగ్రాహికి జంతువులంటే ప్రాణం. పులికి అంతా ఓ ఆటలాగా వుంది. ఎవరైనా పారిపోతుంటేనే వెంటాడె గుణం కల్గిన ఆ పులి కూడా ఆగిపోయింది. జానకి చూపుని స్థిరంగా నిలిపి పులి కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది.
మంత్ర ముగ్ధలా పులి కూడా జానకి కళ్ళలోకి చూస్తూ వుండిపోయింది. ఒక్కొక్క అడుగే వెనక్కు వేస్తూ నెమ్మదిగా తోటలోకి జారుకోవచ్చు తను కావాలంటే. కానీ జానకి ఆలొచన వేరే లాగా వుంది. ఆమె మనస్సులో కొన్ని స్థిరమైన ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి.
తాను ఈ వేళ బలి అవటం ఖాయం. ఆ తరువాత పులి బయటకు వెళ్ళి తన నరమేధాన్ని కొనసాగించనూవచ్చు లేదా ఆవేశపరులైన మానవులచేతిలో హతమారిపోనూ వచ్చు. ప్రకృతి ప్రేమికురాలైన జానకికి ఈ రెండు పరిణామలూ ఇష్టం లేదు.
తను ఇక్కడే వీలయినంత ఎక్కువ సేపు నిలబడితే, అందరికీ కాస్తా ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది.ఏదో మంచి పరిణామం చోటు చేసుకోవచ్చు. ఇలా సాగుతున్నాయి జానకి ఆలోచనలు.

సర్వే భవన్తు సుఖినః, సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దుఃఖ భాగ్భభవేత్
ఓమ్ శాంతి శాంతి శాంతిః

తండ్రి  పెంపకంలో చిన్నప్పటి నుంచి తాను పొందిన సంస్కారాలు జానకిని ఒక పరిపూర్ణ జ్ఞానవంతురాలిగా చేశాయి.  ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వుండటమే నిజమైన జీవన విధానమని విశ్వసిస్తుంది జానకి.
పులిని వీలయినంత ఎక్కువసేపు నిలిపి ఉంచితే అనేక మంది పిల్లల్ని కాపాడినట్టవుతుంది, అందరు పిల్లలూ తన పిల్లల్లాంటి వారేకద.  ఈ పులి సైతం అకారణంగా తనకి హాని తలపెట్టదని ఎందుకో ధృఢవిశ్వాసం కలుగుతోంది. తన మనస్సు శాంతిమయంగా వున్నంత సేపు ఏజీవీ హాని తలపెట్టదు అని ప్రగాఢంగా నమ్ముతుంది ఆమె. మనలోని వ్యగ్రత తరంగాల రూపంలో మనచుట్టూ వున్న ప్రకృతిని ప్రభావితం చేయగలదని ఆధునిక కిర్లియన్ ఫోటోగ్రఫీ మరియు ’స్టడీ ఆఫ్ హ్యూమన్ ఆరా’ మనకు చెపుతున్నాయి. ఇవేవీ మూఢనమ్మకాలు కావని సైన్స్ చెబుతోంది.
మనం మన మనస్సంతా శాంతి మయంగా ఉంచుకుని ఎదుటి జీవి కళ్ళలోకి ప్రశాంతంగా చూపు నిలిపి ఉంచితే ఎంత కౄర జంతువైనా మనపై దాడి చేయదు అని చిన్నప్పుడు తండ్రి చెప్పిన పలుకులు వేద మంత్రాలలా  ఆమె స్మృతిలో మెదలుతూవున్నాయి స్పష్టంగా.
ఆ నమ్మకాన్ని ధృడపరిచే వీడియోలు ఇటివల్ యూట్యూబులో చూడటం జరిగింది తాను.
పులిని సైతం తన బిడ్డే అన్న భావాన్ని మదినిండా నింపుకొని దానికళ్ళలోకి స్థిరంగా చూస్తూ "బంగారూ ఏది ఏమయినా ఈవేళ నిన్ను బయటికి వెళ్ళనివ్వను, నీకూ హాని వద్దు, నీ వల్ల ఇతరులకూ హాని వద్దు" అన్న మాటల్ని స్పష్టంగా ఉచ్చరించింది జానకి. ఒక మాతృమూర్తి తన బిడ్డతో మాట్లాడుకుంటున్నటువంటి  తాదాత్మ్యత వుందా కంఠంలో.
పసుపు పచ్చ కాటన్ చీర, ఏర్రటి జాకెట్లో పవిత్రతకి మారుపేరులా వుందా క్షణంలో జానకి. ఇల్లు దగ్గరే కావటాన పెద్దగా మేకప్ కూడా ఏమీ చేసుకుని రాలేదు తాను. పసిమి చాయలో వుంటుంది జానకి. ఆమె సహజంగానే చాలా అందంగా వుంటుంది. అయిదున్నర అడుగుల ఎత్తు, ఎత్తుకి అనుగుణమైన్ శరీర సౌష్టవం, సభ్యత ఉట్టిపడే వస్త్రధారణ.
ఒళ్ళంతా చెమట్లు పట్టేసి వుండటాన నుదుటనున్న కుంకుమ కొద్దిగా చెదిరి వీరతిలకంలాగా వుండి ఆమె రూపానికి మరింత తేజస్సును ఇస్తోంది.
చీరకొంగు నడుమున దోపుకుని, రెండు చేతులూ నడుంపై వుంచుకుని, తొణకని బెణకని గాంభిర్యంతో చూపరులందరినీ అబ్బుర పరుస్తోంది.
తల్లి తండ్రుల దగ్గర తాను నేర్చుకున్న సంస్కారం, తండ్రి, గురువులు అందించిన విద్యలూ ఆమెకి సరయిన సమయంలో సరయిన విధంగా ఉపయోగపడుతున్నాయి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పేదదే. మన మెదడుని చెత్తతో నింపుకుంటే, అవసరమైన సమయాలలో మనిషికి తనలోనుంచి ఆత్మస్థైర్యం అందే బదులుగా, ఆత్మఘాతకమైన ఆలోచనలు ఉద్భవిస్తాయి అని. దేశంలో ఇప్పుడు ఇన్ని ఆత్మహత్యలు పెరిగిపోవటానికి ఇదే కారణం. మార్కులే లక్ష్యంగా సాగుతున్న విద్యావిధానం యొక్క ఫలితం ఇది.
ఎక్కడో చదివిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి మాటలు అసంకల్పితంగా గుర్తొచ్చాయి జానకికి ఆ క్షణంలో. "అడవిలో అయితే పులిదే రాజ్యం, కానీ మనిషి జీవితంలో కూడా అదే పెత్తనం చేస్తే ఎలాగా, మనిషి న్యాయం వేరు, పులి న్యాయం వేరు."
చిన్నగా నవ్వుకుంది జానకి. పులి అడవిలోనే వుండాలి, మనిషి ఊర్లోనే ఉండాలి. ఆడవికి ఊరికి తేడా వుండాలి కద. తనని తాను కూల్‍గా వుంచుకోవటానికి మనస్తత్వశాస్త్రవేత్తలు ఏవయితే పాఠించాలని చెప్తారో సరిగ్గా అవే పనులు చేస్తోంది ఆమె. దీన్ని థాట్ హైజాకింగ్ ప్రాసెస్ అంటారు. ఒక సాధారణ గ్రాడ్యుయేట్ ఆమె. నిజానికి ఆమెకి ఇవేవీ తెలియదు కూడా. 
మనస్సును కాసేపు మనమేమీ చేయలేని సమస్య నుంచి మళ్ళించి ఇతర ఆహ్లాదకరమైన విషయాల గురించి ఆలోచిస్తే, కాస్మిక్ ఎనర్జీతో నిండిన విశ్వం నుంచి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది అని చెప్తుంది ’ది సీక్రెట్’ అన్న పుస్తక రచయిత్రి ’రోండా బైర్నే’.
"నాన్నా పులి , నిజంగానే పులి వచ్చింది నాన్నా మాస్కూల్లోకి. అమ్మ ఆ పులికి ఎదురుగా నిలబడి వుంది నాన్నా. భయంగా వుంది నాన్నా. నీవు త్వరగా వచ్చేయి నాన్నా" కాసేపు తనేం వింటున్నాడో అర్థం కాలేదు ప్రకాష్‍కి.
పిల్లల చేతిలోంచి ప్రిన్సిపాల్ ఫోనందుకుని ఆ విషయం నిజమేనని కన్ఫర్మ్ చేయటంతో అదిరి పడ్డాడు. హైటెక్ సిటీనుంచి హుటాహుటిన బయల్దేరాడు.
పబ్లిక్ అడ్రస్ సిస్టెం ద్వారా ప్రిన్సిపాల్ జానకిని ధైర్యంగా వుండమని ప్రకటన చేశారు. ’జానకి గారు మీరు తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. మేమందరం మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాము. మిమ్మల్ని రక్షించటానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాము. ఏ క్షణంలోనైనా జంతుప్రదర్శన శాల అధికారులు రావచ్చు. మీరు స్థైర్యం కోల్ఫోవద్దు. మీరు నెమ్మదిగా ఒక అడుగు వెనుకకు వేస్తే చాలు. మన సెక్యూరిటీ గార్డులు దాన్ని షూట్ చేయటానికి సిద్ధంగా వున్నారు"
దూరంగా కనిపిస్తున్న ప్రిన్సిపాల్ గది వైపు చూస్తూ ’వద్దన్నట్టు’ తల నెమ్మదిగా ఊపింది జానకి.
అప్పుడర్థమైంది అందరికీ ఆగిపోవాలని జానకి తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా తీసుకున్నది కాదని. స్కూలు పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, అవతల కాలనీ ప్రజల్నీ ఇలా అందర్నీ కాపాడగలిగే అవకాశం పులిని అక్కడ ఆపిఉంచినంత సేపు మాత్రమే వుంటుందని, ఇలా అందర్నీ కాపాడే బాధ్యత తనొక్కతే ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తన భుజస్కంధాలపై వేసుకుందని అందరికీ అర్థం అయిపోయింది.
అదృష్టవశాత్తు పులి కూడా కాస్తా నెమ్మదిగా వుంది.
పులి ఒకడుగు వెనుకకు వేసి వెనుక కాళ్ళని మడిచి తోక భాగం నేలకు ఆన్చి, యజమాని ముందు కూర్చునే పెంపుడు పిల్లిలా కూర్చుంది. నాలుక బయటకు వేలాడేసి ఊపిరి వేగంగా తీసి వదుల్తూ వుంది. అదలా విశ్రాంతిగా కూర్చోవటం ఆశ్చర్యమే.
జానకి చిరునవ్వుతో ప్రేమ నిండిన పలుకులను వల్లె వేస్తూనే వుంది. ఎంతో దగ్గరిబంధువులనో, పసిపిల్లలనో పలకరించినట్టు దానిని పరామర్శిస్తోంది. ఆమె గుండెనిండా ప్రేమే. అందులో ఇసుమంతయినా కపటత్వం లేదు.
జానకి మదినిండా ఎడతెగని ఆలోచనలు.
అడవులని సైతం ఆక్రమించుకుంటున్న మానవుడు జంతువులకు నిలువనీడలేకుండా చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలలో పొలాల్లోకి ఏనుగులు రావటాలు, ఊర్లలోకి పులులు రావటాలు ఇవన్ని దాని ఫలితాలే.
తను కూర్చున్న చెట్టు కొమ్మ తానే నరుక్కోవటం మనిషి ఆపనంతవరకు మనిషి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓజోన్ పొరలో చిల్లి ఏర్పడితే తన ఉనికికే ముప్పు వచ్చే విషయం మానవుడికి తెలియంది కాదు. అయినా ఏసీలు ఆపడు, వాహన కాలుష్యాన్ని తగ్గించుకోడు.
చర్య అన్నది ఉన్నాక దానికి తగిన ఫలితం కూడా వుంటుంది కద.
అంతరిక్ష శాంతిః, పృథ్వీ శాంతిః, ఆపః శాంతిః, ఔషధస్యహ్ శాంతిః, వనస్పతయహ శాంతిః, విశ్వే శాంతిః.
తండ్రి చిన్నప్పుడు వల్లె వేస్తుండిన వేద మంత్రాలు గుర్తొచ్చాయి జానకికి. వంట చెరకుకోసం సైతం క్రిందపడిన ఎండుకొమ్మల్నే ఏరుకుని, చెట్టుకి హాని చేయని సంస్కృతి మనది. ఇదంతా మూఢనమ్మకం కాదు. ఏకలాజికల్ బ్యాలెన్స్ అని ఈ వేళ ఏదయితే అంటున్నారో అది మన సంస్కృతిలోనే వుంది. ఎప్పుడైతే మానవుడు దీనికి తిలోదకాలు ఇచ్చాడో ప్రకృతి వైపరిత్యాల్ని ఎదుర్కోవటాలు నిత్యకృత్యాలు అయ్యాయి.
జానకికి ఆ పులిని చూస్తున్న కొద్ది భయం కలగటం పోయి ఆ స్థానే జాలి, అంతకు మించిన ప్రేమ కలుగసాగాయి.
"ఏం భయపడకు బంగారు. నేనున్నాను కద. నిన్నెవరూ ఏం చేయరు. సరేనా!" ఆమె కంటి చూపునుంచి జాలువారుతున్న ప్రేమ, కంఠంలోంచి పొంగిపొర్లుతున్న వాత్సల్యం, పెదవులపై తటిల్లతలా మెరుస్తున్న మందహాసం, ఆమె గుండెల్నిండా నిండిన ప్రశాంతత ఆ కౄరజంతువుకు అర్థమవుతున్నట్టే వున్నాయి.
నెమ్మదిగా అది ఒక సారి కండ్లు మూసి తెరిచింది.  భయం కలిగించేలా నోరంతా ఒక సారి తెరిచి దాని కోరపండ్లు కనపడేలా అవులించింది.
జానకి దాన్నే చూస్తూ వుంది.
ఈ లోగా పెద్ద గేటు వైపు కొద్దిగా హడావుడి, కోలాహలం మొదలవటంతో అటు వైపు దృష్టి సారించింది ఆమె. ఖాఖీ యూనీఫాంలో వున్న నలుగురయిదుగురు ఆజానుబాహులైన వ్యక్తులు, జూ అధికారుల్లాగున్నారు, ఆమె వైపు చేతులు ఊపుతూ కనిపించారు.
మైకులో ప్రకటన వినిపిస్తోంది. " జానకి గారు. మీరింకేమీ కంగారు పడవలసిన పని లేదు. జంతుప్రదర్శన శాల అధికారి పాణిగ్రాహి గారు, వారి టీంతో సహా వచ్చేశారు. వారు మత్తుమందు(ట్రాంక్విలైజర్స్) కలిపిన బుల్లెట్లతో దాన్ని అదుపులోకి తీసుకుంటారు. వారు నెమ్మదిగా మీరున్న చిన్నగేటువైపుకి వస్తారు. మీ వెనుక నుంచి వారు వచ్చిన సమయానికి మీరు కొద్దిగా ప్రక్కకు తప్పుకుంటే వారు గన్స్ తో షూట్ చేస్తారు. మీరు కొద్దిగా సహకరించాలి. మీకు పాణిగ్రాహి గారు ఎప్పటికప్పుడు సూచనలని అందిస్తారు"
వారు స్విమ్మింగ్ పూల్‍చుట్టూ తిరిగి నెమ్మదిగా వెనుక వైపున్న చిన్న గేటు వద్దకు చేరారు. వారెంత నెమ్మదిగా వచ్చినా గాలిలో వచ్చిన మార్పులని గమనించగలిగింది ఆ జంతువు.
అది లేచి నెమ్మదిగా జానకికి దగ్గరగా వచ్చింది. ఎంత మాట్లాడినా అది కౄర జంతువు. కానీ జానకి దాన్ని ప్రేమతో పలకరిస్తూనే వుంది.

****
ఇక వర్తమానంలోకి వస్తే,
పెద్ద పులి నిలబడి వుంది జానకి ఎదురుగా.
కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తోంది. ఇద్దరూ కదలటం లేదు. దాని కళ్ళలోకే చూస్తూ నిలుచుంది జానకి. పులి చాలా అలర్ట్‌గాచూస్తూ, తన తోకని బిర్రుగా చేసి కొరడాలా గాలిలోనెమ్మదిగా కదుపుతోంది.  ముందరి పాదాల్ని నేలకి బలంగా ఆన్చి దూకడానికి సన్నద్ధంగా వుంది. కాలి చివర పంజాల్నించి బయటకి రావటానికి కూచిగా వున్న గోళ్ళూ సిద్దంగా వున్నాయి.

అది ఒకడుగు ముందుకేసింది. జానకి దానినే చూస్తూ వుంది.
అప్పుడు జరిగింది ఆ సంఘటన.
ముందుకు రాబోతున్నదల్లా నెమ్మదిగా నేలపైకి వాలిపోయిందది. దాని కళ్ళు క్రమంగా మూతలు పడ్డాయి. విక్టరీ సింబల్ చూపిస్తూ చెప్పాడు పాణిగ్రాహి "కంగ్రాచ్యులేషన్స్ మేడం! కేవలం ప్రేమ అనే బలమైన ఆయుధంతో మీరు దీన్ని సరిగ్గా గంటసేపు ఆపగలిగారు. అరగంటలో రావలసిన వాళ్ళం ట్రాఫిక్ వల్ల ఆలశ్యం అయ్యింది.  మేమిచ్చిన డోస్ కి కనీసం ఇంకో మూడు గంటలు లేవదు అది"
బిలబిల లాడుతూ లోనికి వచ్చేశారు జర్నలిస్టులు,కెమెరాల వాళ్ళు. కానీ జానకి చూపు తన పిల్లల కోసరం వెదుకుతోంది.
"అమ్మా" అంటూ వచ్చి అక్కున చేరారు జానకి పిల్లలిద్దరు. ప్రకాష్ జానకిని అభినందిస్తూ బొటనవేలిని పైకి చూపిస్తూ దూరం నుంచే అభినందిస్తున్నాడు.  పిల్లలిద్దర్ని పొదివిపట్టుకుని జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి సిగ్గు పడుతూ సమాధానాలు చెపుతోంది జానకి, చూపంతా ప్రకాష్ వైపే వుంది.
 -----సమాప్తం-------

-Published in Telugu Velugu Monthly Magazine May 2019

1 comment:

  1. Beutiful narration and sound princle base. Congratulations sir, Thank you for sharing a good story

    ReplyDelete