Sunday, April 26, 2020

"ఎలుకకి ప్రాణ సంకటం" (ఒక జ్ఞాపకం-10)



ఎలుకకి ప్రాణ సంకటం"
(ఒక జ్ఞాపకం-10)
"పాండురంగం గారున్నారా" అన్న నా ప్రశ్నకి అక్కడున్న రిసెప్షనిస్ట్ లాంటి వ్యక్తి ఒక్క సారి తను చేసుకుంటున్న టైపింగ్ పని ఆపి ఒక సారి నా వంక తేరిపారా చూసి, ఏదో నిర్ణయానికి వచ్చిన వ్యక్తిలాగా లేచి నిలబడి
"నాతో రా బాబూ" అంటూ అక్కడే వున్న ఓ పెద్ద గది వంక తీసుకువెళ్ళాడు. 
చూడంగానే బయటనుంచే అర్థమౌతోంది ఓ పెద్ద ఆఫీసర్ గారి గది అని;
అప్పటికి నావయసు మహా అంటే పదిహేను నిండి పదహారు నడుస్తూ వుంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను అప్పటికి. 
కాలేజి అవగానే బుక్స్‌తో సహా All India Radio Cuddapah Station (ఆకాశవాణి కడప కేంద్రం) కి సైకిలెక్కి వెళ్ళిపోయాను. అప్పటికి కడప ఆకాశవాణి కడప కేంద్రం బస్టాండ్ రోడ్లో ఇప్పుడున్న కొత్త బిల్డింగ్‍లో వుండేది కాదు. రమేష్ థియేటర్ ప్రక్కనున్న సందులోంచి వెళితే వచ్చే ఎన్.జీ.వో కాలనీలో అద్దె భవంతిలో వుండేది. ఇదంతా 1984 ఆ ప్రాంతాలలో విషయం.
"ఇదే సర్ గది. లోనికి వెళ్ళండి" అని చెప్పి వెళ్ళిపోయారాయన.
నేను స్టేషన్‍లోనికి అడుగుపెట్టే ముందే బయట డిస్‌ప్లే బోర్డ్‌లొ అక్కడి ఆఫీసర్ల పేర్లు చూసి నోట్ చేసుకుని ఈ పాండురంగం గారి పేరు గుర్తుపెట్టుకుని లోనికి వెళ్ళాను. అంతే. ఆయన స్టేషన్ డైరెక్టరా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివా కూడా నాకు తెలియదు.
నేను లోనికి అడుగు పెట్టగానే ఏదో వ్రాసుకుంటున్న ఆయన తలెత్తి ఒక సారి నన్ను చూసి ఖంగు తిన్నారు. పట్టుమని పదహారు ఏండ్లు లేని నేను, ఏ అప్పయింట్ మెంట్ లేకుండా , కాన్ఫిడెంట్ గా ఆయన చాంబర్ లోకి వెళ్ళి ఎదురుగా నిలబడి వుండటం ఆయన అస్సలు ఊహించి ఉండలేదట, తర్వాత మా పరిచయం పెరిగిన తర్వాత చెప్పారాయన. 
"ఎవరు బాబు నువ్వు?" అని అడిగారు ఆయన దయగా.
"నేను కథలు వ్రాస్తుంటాను.మన ఆకాశవాణి కడపకేంద్రంలో అప్పుడప్పుడు కథానికలు వస్తుంటే విన్నాను. పత్రికలకు పంపాలంటే సరయిన ప్రొసీజర్ తెలీదు. సరే, మన ఊర్లోనే వుంది కద ఆకాశవాణి కేంద్రం, ఇక్కడే చదివి వినిపిద్దాం అని వచ్చాను" అని నింపాదిగా చెప్పాను.
అక్కడికి నేనేదో ఆయనకి మెహర్బాని చెయ్యటానికి వచ్చానన్నట్టు చెప్పాను. నిజానికి నాభావం కూడా అదే. అమాయకత్వం అంటే అదే. అప్పటికి నాకున్న ధృఢమైన అభిప్రాయం ఏంటంటే, పత్రికలలో పడితేనే రచయితకి నిజమైన గౌరవం అని, మిగతావన్నీ రాజీ పడటమేనని.
పక్కలో బాంబు పడ్డట్టు అదిరి పడ్డారాయన.
"ఏంటి నువ్వు కథలు వ్రాస్తావా, అవి చదివిపెడ్తావా? బాగుంది. ఇప్పటి దాకా ఏమయినా వ్రాశావా?"
ఆయన అడగటమే తరువాయి, వెంటనే నా కాలేజీ నోట్ బుక్స్ తీసి, వాటిలో అక్కడక్కడా వ్రాసుకున్న కొన్ని రాతలని ఆయనకి చూపించాను. మొదట కాస్తా అనాసక్తిగా తిరగేసినా క్రమంగా ఆయనలో ఆసక్తి పెరగటం గమనించాను.
"ఇవన్నీ నువ్వే వ్రాశావా, లేదంటే లైబ్రరీకి వెళ్ళి ఏవయినా పుస్తకాలు చూసి వ్రాశావా?" చివరికి ఆయన ప్రశ్నించారు. నేను గాయపడ్డ వాడిలా చివ్వున చూశాను, నా రియాక్షన్ ఆయన గమనించారు.
"సరే, నేను ఒక థీమ్ చెప్తాను. ఇప్పటికిప్పుడు వ్రాస్తావా?" అడిగారాయన.
"సరే" అన్నాను
ఆయన ఒక సారి చుట్టూ చూసి, టేబుల్ పైవున్న ఆవేళ్టి న్యూస్ పేపర్ అందుకుని, ఏదో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఉరి వేసుకుని చనిపోయిన కుర్రాడి గురించిన వార్త ఒకటి చూపించి, 
"దీని ఆధారంగా వ్రాయి ఇప్పటికిప్పుడే, నాకు నచ్చితే నీచేతనే యువవాణి కార్యక్రమంలో చదివింపజేస్తాను" అన్నారాయన. 
అందులో ఇబ్బందేముంది అనుకుని, నా కాలేజి నోట్ బుక్ ఒకటి ఓపెన్ చేసి వ్రాయటానికి సిద్ధ పడిపోయాను.
"ఆగాగు" అని ఆయన్ బజ్జర్ ప్రెస్ చేసి ఇందాకటి ఫ్రంట్ డెస్క్ ఆయన్ని కేకేసి పిలిపించి, "ఇదిగో ఈ కుర్రాడిని నీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని, అతనికి కొన్ని A4 షీట్లు ఇచ్చి, కాస్తా కాఫీ, టీ ఏమన్నా కావాల్నేనేమో కనుక్కుని, ప్రశాంతంగా వ్రాసుకునేలాగా వాతావరణం కలిపించు" అని చెప్పారు.
నేను వెళ్ళి కూర్చుని వ్రాయటం ప్రారంభించాను. లోపల్నుంచి ఆయన కంఠం వినిపిస్తోంది.
"ఇంతకూ ఎవరయ్యా ఈ కుర్రాడు?"
"నాకు తెలియదు సార్, హుందాగా వచ్చి మీ పేరు పెట్టి అడిగితే మీ బంధువుల కుర్రాడేమోననుకున్నాను" ఆయన చెపుతున్నాడు , లోపల్నుంచి ఈ సంభాషణ నా చెవుల్లో పడుతోంది.
’రిజర్వేషన్ సిస్టం గురించి, ర్యాగింగ్ లగురించి, ప్రేమ ఆకర్షణల గురించి కొన్ని థీంలు నా మెదడులో ఆల్రెడీ వుండటం వల్లా చకచకా వ్రాసేసి, ఓ అరగంటలో ఆయన ముందు వాలి పోయాను.
’ఓ పల్లెటూరి పేద కుర్రాడు, అగ్ర వర్ణాల వాడు, కష్టపడి చదువుకుని ఎమ్‍సెట్ వ్రాసి ప్రతిభ ఆధారంగా మెడిసిన్ లో సిట్ తెచ్చుకుని, ధన మదంతో అహంకారంతో ప్రవర్తించే సీనియర్ స్టూడెంట్ల కారణంగా, ఆత్మగౌరవం దెబ్బ తిని, ఆత్మ హత్య చేసుకుని చనిపోతాడు. అదీ నేను వ్రాసిన కథ. దానికి ఓ చిత్రమైన టైటిల్ పెట్టాను, "------ఎలుకకి ప్రాణ సంకటం" అని. ఆ గ్యాప్ లో "పిల్లికి చెలగాటం" అన్న భావాన్ని ధ్వనింపజేస్తూ.
"అబ్బాయి అంతా బాగుంది కాని, ఈ ’ఎలుకకి’ అన్న పదం తీసేద్దాం, నీ ఉద్దేశ్యం నాకర్థమయింది కానీ, ప్రింట్ లో అయితే చుక్కలు వ్రాయచ్చు, మనది ఆకాశవాణిలో చదివే కథానిక కద, ఆ భావాన్ని ఎలా చెప్పగలం? అందుకే ఉత్తి ’ప్రాణ సంకటం’ అని ఉంచేద్దాం. అదీ కాక ఆ అబ్బాయిని అగ్రవర్ణాల పేద వాడిగా కాక, వెనుకబడ్డ పేదవాడిగా మారుద్దాం, ఆ పాత్ర పట్ల శ్రోతలకు ఇంకా సానుభూతి కలుగుతుంది."
అలా ప్రారంభమైంది నా అనుబంధం ఆయనతో. ఆయనకి నాకు దాదాపు నలభై ఏళ్ళ అంతరం వున్నా వయస్సులలో నన్ను ఒక రచయితగానే ట్రీట్ చేసే వారాయన. 
’సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు, కథల మేష్టారు శ్రీ మధురాంతకం రాజారాం, శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి గారు’ వంటి మొదలగు మహా మహుల గళాలు వినిపించిన ఆకాశవాణి కడప కేంద్రం నుండీ అలా నా కంఠం కూడా వినిపింపబడటం నా పూర్వ జన్మ సుకృతం.
ఆ తర్వాత నేను ఆదోనికి చదువు నిమిత్తం వెళ్ళినప్పటికీ, అక్కడి నుండీ కూడా నాకు రైలు చార్జీలు చెల్లించి మరీ నన్ను పిలిపించి నా కథలు చదివి వినిపించే వారు శ్రీ పాండురంగం గారు.
ఆ తర్వాత వరుసగా నా కథలు ఆంధ్రప్రభ వారపత్రికలొ, ఆంధ్రప్రభ దిన పత్రిక ఆదివారం అనుబంధంలో, ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమ్ అవటం మొదలయ్యాక, నేను ఆకాశవాణికి పంపటం మానుకున్నాను. పాపం అక్కడీకీ శ్రీ పాండురంగం గారు నాకు ఎన్నో ఉత్తరాలు వ్రాసి వ్రాసి విసుగెత్తి చాలించుకున్నారు.
ఆ పై ఓ మూడేండ్ల తర్వాత, కడపకి వచ్చినప్పుడు యధాలాపంగా ఆకాశవాణికి వెళ్ళాను. అప్పటికల్లా వారు బస్టాండ్ రోడ్లోని తమ స్వంత భవనాలలోకి మారారు. ఇప్పుడు శ్రీ పాండురంగం గారు కనపడలేదు, బహుశా ఎక్కడికో ట్రాన్స్‌ఫర్ అయ్యుంటారు. నాకు ఈ మారు శ్రీ ఆకుల మల్లేశ్వర రావు గారు పరిచయం అయ్యారు. ఈ విడతలో కూడా బోలెడు కథనికలు, నాటికలు వ్రాయటం జరిగింది. వారికి నేను శ్రీ మధురాంతకం మహేంద్రగారిని పరిచయం చేయటం జరిగింది ఆ రోజుల్లోనే. శ్రీ మహేంద్ర గారు ఇటీవలే స్వర్గస్తులవటం విషాదం. ఈ ముచ్చట్లన్నీ ఇంకో సారి చెప్పుకుందాం.
చాలా విరివిగా వ్రాశాను ఆ రోజుల్లో, నాకు ఇరవై ఏండ్ల వయస్సు వచ్చేటప్పటికే నా కథలు దాదాపు అరవై దాకా వెలుగు చూశాయి, అదీ ప్రముఖ పత్రికలలో. అకారణంగా అస్త్ర సన్యాసం చేసేశాను. 1989 నుంచీ 1992 వరకు నేను కథలూ విరివిగా వ్రాసిన రోజులూ అవే, నేను శాశ్వతంగా మరచిపోదలుచుకున్న రోజులూ అవే నా జీవితంలో. కొన్ని వ్యక్తిగత వైఫల్యాలు, పిన్నవయస్కుడైన బావగారి మరణం ఇలా కొన్ని సంఘటనలు నన్ను మరి కోలుకోనీకుండా చేశాయి ఆ రోజుల్లో.
ఆ తర్వాత ఒక విధమైన కసితొ ఫార్మా రంగంలో ఏకాగ్రతగా పని చేసుకోవటం, జరిగి పోయింది. 
దాదాపు ఓ ఇరవై మూడుసంవత్సరాలు కలం పట్టలేదు. నేను కలం పక్కన పెట్టకుండా వ్రాస్తూనే వుండుంటే ఏమయ్యేదో? ఏమో విధి అన్నది మన చేతిలో లేదు కద.మరలా హొగినెక్కల్ జలపాతం ద్వారా 2015 లో వ్రాయటం మొదలెట్టాను.ఇదండీ ఆకాశవాణిలో నా మొదటి కథ యొక్క కథ.

No comments:

Post a Comment