కొమ్మా శివశంకర రెడ్డి.
ఒక ఙ్జాపకం - 38
వీరి గూర్చి ఎక్కడ మొదలుపెట్టాలో
అర్థం కావటం లేదు.
మొదట ఈ ఙ్జాపకం గూర్చి ఒక డిస్
క్లెయిమర్.
ఈ కథలో ఎలాంటి ట్విస్టులు, కొసమెరుపులు ఉండవు. ఇది ఒక ఙ్జాపకం అంతే.
కొమ్మాశివశంకర రెడ్డి గారు
జమ్మలమడుగు లో హిందీ టీచర్. ఆయన దక్షిణ
భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు.
మా అమ్మకి తన పిల్లలు అందరూ హిందీలో బాగా మాట్లాడాలి అని
ఒక బలమైన కోరిక ఉండేది. మా మేనమామలు
ఇద్దరూ హిందీ పండిట్లు కావడం వల్ల మా అమ్మగారికి హిందీ మీద అలా గౌరవభావం ఏర్పడి
ఉంటుందనుకుంటాను.
మేనమామలు అంటే స్వయాన మా అమ్మగారి
అన్నయ్యలన్న మాట. వీరి గూర్చి కూడా ఙ్జాపకాలు పంచుకోవాలి మీతో.
ఇక కథలోకి వస్తే, ఈ కొమ్మా శివశంకరరెడ్డి మేష్టారు గారు ఎప్పుడు చూసినా తెల్లటి
చొక్కా, తెల్లటి ప్యాంటు వేసుకుని ఉండేవారు. చాలా సౌమ్యులూ,
నెమ్మదస్తులు వారు.
ఆయన్ని గడ్డం మాసి ఉండగా చూసిన
వారు ఎవరూ లేరు. కాస్తా బట్టతల
ఉన్నప్పటికీ చాలా చక్కగా తల దువ్వుకుని , కోలమొహంతో,
ఎప్పుడు చూసినా చెదరని చిరునవ్వుతో ఉండేవారు. అయన్ని కొందరు ఆయనకు
తెలియకుండా మిష్టర్ టినోపాల్ అనే వారు. తెల్లబట్టల్ని ఉతకడంలో వాడే ఒక డిటర్జెంట్
బ్రాండ్ అది ఆ రోజుల్లో.
ఆ రోజుల్లో జమ్మలమడుగులో ఆయన ఒక
హిందీ విప్లవం తెచ్చారు అని చెప్పవచ్చు. ప్రతి విద్యార్థి విధిగా ఆయన దగ్గర
ప్రాథమిక తో మొదలుపెట్టి, ప్రవీణ విశారద వంటి హైఎండ్ కోర్స్ లు కూడా
చేసేవారు ఆయన దగ్గర.
ఆయన దగ్గర నేను ప్రాథమిక చేరలేదు.
నన్ను ఎకాఎకిన మధ్యమా అనే కోర్సుకు తీసుకున్నారు, ఆయన దగ్గరే రాష్ట్రభాష అన్న కొర్స్ కూడా చేశాను. ఈ రెండు కోర్సులూ కూడా
బొటాబొటి మార్కులతో ప్యాసయ్యాను. ఆ తర్వాత మా నాన్నగారికి నూజివీడు కి ట్రాన్స్పర్
అవటంతో నా హిందీ భాష అధ్యయనం అంతటితో కొండెక్కింది.
ఆయన ఇంచుమించు ఒక వన్ మాన్
ఆర్మీలాగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళే వారు. వివిధకోర్సులకు అటెండ్ అయ్యే
విద్యార్థులకు వివిధ బాచ్ సమయం కేటాయించడం మొదలు పెట్టి, ఆయా బాచులకు కఠోర శిక్షణ ఇవ్వడం, వాళ్ళతో
పరీక్షలు విజయవంతంగా వ్రాయించడం వరకు ఆయన చాలా శ్రద్ధగా చేసేవారు.
అక్కడితో ఏమయింది, కోర్స్ లో చేరిన వాళ్ళకు అయా కోర్సులకు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ దగ్గర్లో ఉన్న
ప్రొద్దుటూరు ఆయనే వెళ్ళీ కొనుక్కొచ్చి ఇవ్వటం, పరీక్షలకు
సంబంధించి అప్లికేషన్ ఫారమ్ నింపటంలో సాయం చేయటం, వారి హాల్
టిక్కెట్లు రాంగానే అందరికి వాటిని పంచి పెట్టటం, పరీక్షలు
వ్రాశాక వారి మార్కుల లిస్టులు, సర్టిఫికెట్లు అన్నీ ఎవరివి
వారికి అందివ్వటం ఇలా ఆయన ఒక యంత్రం లాగా పని చేసుకుపోయేవారు.
ఆ రోజుల్లో రాష్ట్రభాషా పరీక్ష
వరకూ మాత్రమే జమ్మలమడుగులో సెంటర్ కి అనుమతి ఇచ్చారు దక్షీణ భారత హిందీ ప్రచార
సభవారు. ఆ పై పరీక్ష వ్రాయదలచుకున్న అభ్యర్థులను ఆయన దగ్గర ఉండీ ప్రొద్దుటూరుకు
తీసుకెళ్ళి వ్రాయించి తీస్కువచ్చేవారు.
ఇప్పుడు ఆలోచిస్తే అర్థం అవుతోంది
ఆయన అనవసరంగా అంత శ్రమ నెత్తికెత్తుకునే వారేమో అని. ధరఖాస్తు నింపేటప్పుడే ఆ
పత్రంలో ఎవరి చిరునామా వారే ఇచ్చుకుంటే పోయేదానికి, ఆయన అందరిని తన చిరునామాని ఇవ్వమని చెప్పేవారు. దాని వల్ల ఈ శ్రమంతా ఆయన
భరించాల్సి వచ్చేది.
ఆయన కమ్యూనిస్టు అని అందరూ
చెప్పుకునే వారు. బొట్టు పెట్టుకోవడమ్, గుడికెళ్ళటం
లాంటివి చేయరు ఆయన అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో.
చిత్రం ఏమిటంటే ఆయన
కూర్చునేటప్పుడూ, నించునేటప్పుడు ’అమ్మయ్య’ అనుకునే బదులుగా
’హే!రాం" అని అనే వారు. ఈయన గాంధేయవాదేమో అని కూడా కొందరు అనుకోవడం కద్దు.
ఇప్పుడు నేను హింది బాగానే
మాట్లాడగలను. కానీ నేను చదువుకున్న ఈ
మధ్యమ, రాష్ట్రభాష అన్న కోర్సులవల్ల హిందీలో మాట్లాడే ప్రావిణ్యం నాకేమాత్రం
వంటబట్టలేదు అని ఘంటాపదంగా చెప్పగలను.
అంటే ఆయన్ని విమర్శించటం నా
ఉద్దేశం కాదు.
మన స్కూళ్ళలో, కాలేజిల్లో హిందీ , ఇంగ్లీష్ నేర్పించే
విధానం లో లోపాలు ఉన్నాయి.
ఒక పరాయి భాష అది ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, అయా పరాయి భాషల్లో మనం
అనర్ఘళంగా మాట్లాడగలగాలి అంటే ఆ భాషలను ఇప్పుడు మనం నేర్చుకుంటున్న పద్దతుల ద్వారా
నేర్చుకుంటే మనకు మాట్లాడగలిగే ప్రావిణ్యం రాదుగాక రాదు.
నేను కనిపెట్టిన "పేపర్ లెస్
ఫ్లూయెన్సీ" అన్న మోడ్యుల్ కి ఈ అనుభవాలు అన్నీ కూడా దోహద పడ్డాయి.
అంటే వీరు పాటించిన విధానాల వల్ల
ఒక విద్యార్థిగా నేను ఎలా ఇబ్బంది పడ్డానో ఆ ఇబ్బందులు నా విద్యార్థులకు కలగకూడదు
అన్నది నా అభిప్రాయం.
అఫ్ కోర్స్, హిందీలో మమ్మల్ని మాట్లాడించడం ఆయన లక్ష్యంగా ఉండేది కాదు.
మమ్మల్ని ఆయా పరీక్షలలో పాస్ చెయించడం ఒక్కటే గమ్యం అక్కడ.
ఇంకా ఘోరం ఏమిటంటే ఆయనకి ఒక
సీక్రెట్ ఫార్ములా ఉండేది. అదేమిటంటే పొయిన సారి పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు
సంబంధించిన పాఠాలు ఆయన అస్సలు ముట్టుకునేవారు కాదు, బోధించేవారు కాదు. ఆయా పాఠాలకు సంబంధించిన ప్రశ్నలని ఈ మారు పరీక్షలో టచ్
చేయరు అని ఆయన బలంగా విశ్వసించే వారు.
ఒక చిత్రాతి చిత్రమయిన సంఘటన
జరిగింది నేను రాష్ట్ర భాషా పరీక్ష వ్రాసినప్పుడు.
ఆయన అంచనాల్ని తలక్రిందులు చేస్తూ
సరిగ్గా పోయినసారి పరీక్షా పత్రంలోని ప్రశ్నలే ఇంచుమించు పునరావృతం అయ్యాయి. ఆయన
షరామాములుగా మాకు ఆ పాఠాలు చెప్పలేదు కాబట్టి చాలా మంది ఆ పరీక్షలో గట్టే
ఎక్కలేదు. జమ్మలమడుగులో అదొక పెద్ద చర్చనీయాంశం అయింది ఆ రోజుల్లో. నా అలవాటు
ఏమిటి అంటే పరీక్షకోసం చదువుకోవటం అన్న ప్రక్రియకి వ్యతిరేకిగా ఉండే వాడిని.
పుస్తకాలని సరదాగా అటూ ఇటూ తిరిగేస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. ఆ అలవాటు వల్ల
నాకు ఆ పరీక్ష పెద్ద సవాలుగా పరిణమించలేదు.
ఒక భాష కావచ్చు, ఒక సబ్జెక్టు కావచ్చు విద్యార్థిలో ఙ్జానం పెంపొందించే విధంగా
బోధించాలి అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు మా పిల్లలు పెద్దయ్యారు, ఏమ్.బీ.ఏ, బీటెక్ చేస్తున్నారు. కానీ మా పిల్లలు
స్కూలు చదువులు చదువుకున్నన్నాళ్ళు వాళ్ళ స్కూలు టీచర్లతో ఈ విషయంగా వెళ్ళీ
దెబ్బలాడి వచ్చేవాడిని. పరీక్షలు, మార్కులు మాత్రమే పరమావధి
కాదు,ఙ్జానం పెంపొందించండి అని అడిగే వాడిని . వారికి నా
మాటలు రుచించేవి కావు. నేను పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు టీచర్లని
ఇదే అడిగే వాడిని. కొన్ని కొన్నిసార్లు మా ఆవిడ. ’మీరేమి రావద్దు స్కూలుకు నేను
వెళ్ళొస్తాను పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి ’ అనేది
సరే మళ్ళీ కథలోకి వద్దాము.
పరీక్షల్లో పాస్ చేయించాలి
అన్నలక్ష్యం పరంగా తీసుకుంటే, పాపం ఆయన పాఠాలు
బాగా చెప్పేవారు. నాకు కొన్ని పాఠాలు
ఇప్పటికి గుర్తున్నాయి. ’బిల్లీ చలీ ప్రయాగ’, ’కసౌటీ -ఏకాంకీ
నాటక్’, ’వారణాసి కే వ్యాపారి’ (ఇది షేక్స్పియర్ నాటకం మెర్చన్ట్
ఆఫ్ వెనిస్ కి స్వేచ్చానువాదం అని గుర్తు)
ఇలా కొన్ని బాగా గుర్తుఉండిపోయాయి.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి - హిందీ
విషయంగా స్కూల్లో మా ఇతర క్లాసు మేట్స్ మీదకి నేను ఒక మెట్టు ఎత్తులో ఉన్నట్టు
అనుభూతి కలిగేది.
ఒక పరాయి భాషలో మాట్లాడాటానికి
సంబంధించి భయం అనేది పెద్ద అడ్డంకి. ఈ కొమ్మా శివశంకరరెడ్డిగారి దయ వల్ల నాకు ఆ
భయం, బెరకు అన్నవి తొలగిపోయి, ఈ హిందీ ఏదో మనకు లొంగే భాషే సుమా, అన్న అభిప్రాయం
కలిగింది.
ఆ తరువాత ఆరేడేళ్ళకు ఇందిరాగాంధి
గారి పుణ్యమా అని ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ ప్రసారాలు వచ్చేశాయి. అవన్నీ తొంభై శాతం
హిందీలోనే ఉండటం, ఆ పాత్రలు మాట్లాడుకునే మాటలు యావత్తు
అర్థం కావడం అన్నది రెండో మెట్టు.
ఆ తరువాత నార్త్ ఇండియన్ మిత్రులతో
గంటల తరబడి సంభాషణల్లో పాల్గొనడం వల్ల నాకు వ్యవహార ఙ్జానం వచ్చింది అని
చెప్పవచ్చు.
ఆ కోర్స్ కి సంబంధించిన
టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మొదటి పేజిపై విద్యార్థులందరూ ఆయనతో పేరు
వ్రాయించుకునేవారు. ఆ రోజుల్లో జమ్మలమడుగులో గులాబి రంగు ఇంకు తో వ్రాయడం
ట్రెండింగ్ లో ఉండేది. ఈ ట్రెండ్ కీ కారణభూతుడు ’ఐఎల్ సార్’ అని పిలవబడే
ఐ.లక్ష్మినారాయణ అనే ఒక మేష్టారు గారు. అయన గురించి వివరంగా ఒక ఙ్జాపకం వ్రాయాలి.
చాలా సరదాగా ఉంటుంది.
సరే మళ్ళీ మన కథలోకి వద్దాము.
మన హిందీ మేష్టారు గారు హిందీలో మా
పేర్లు వ్రాసేవారు. అందులో వింత ఏమీ లేదు. కాకపోతే హిందీలో ప్రతి పదం పైన అడ్డంగా
గీత గీయాలి కద. ఆ గీత స్థానం లో ఈయన తనదైన ఒక ప్రత్యేక స్టైల్ పాఠించేవారు.
అదేమిటింటే గీత స్థానే, ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఇలా
డిజైన్ గీసి ఇచ్చేవారు. విద్యార్థులు అందరూ తెగ సంబర పడిపోయేవారు.
ఇక పరీక్షల ముందు ఆయన ఇంట్లో ఉండి
రాత్రి పది దాకా చదువుకోవచ్చు. (ఆ రోజుల్లో టీవీలు ఉండేవి కావు, చిన్న ఊర్లలో ఎనిమిది -ఎనిమిదిన్నరకల్లా పడుకునే వారు. రాత్రి
పది అంటే చాలా పెద్ద విషయం ఆ రోజుల్లో). ఆయన మాతో బాటు ఉంటూ ప్రత్యేక బోధన చేసే
వారు. ఆ అంకితభావం నాకు తెగనచ్చేది. నేను టీచర్ అయితె ఇలాగే ఉండాలి అని
అనుకునేవాడిని ఆ రోజుల్లో.
కరెంట్ ఎప్పుడుంటుందో ఎప్పుడు
పోతుందో తెలియని స్థితి ఉండేది చిన్న ఊర్లలో. అందుకు సదా హరికెన్ లాంతర్లు
సిద్ధంగా ఉంచుకునే వారు. అధిక భాగం హరికెన్ లాంతరు వెలుగులో చదువుకునే వారం అక్కడ.
పాపం ఆయన ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు
ఒక హరికెన్ లాంతరు చొప్పున ఇచ్చేవారు. ఆ
లాంతరు అద్దం లోపలి భాగం తీసి, ముగ్గుపిండి
పెట్టి తుడవటం ఒక ప్రత్యేక ప్రక్రియ. అది కేవలం అనుభవఙ్జులైన వారు మాత్రమే చేసే
వారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ గాజు పగిలిపోవటం ఖాయం, సుశీల
గారు పాడిన ’చూసుకో పదిలంగా హృదయాన్ని
అద్దంలా, పగిలేను ఖాయం ఏదయినా, రగిలేను
నీలో వేదన’ అన్న పాట లాగ.
మేము ఆ ఊర్లో ఉండినది కేవలం ఒక్క సంవత్సరం
మాత్రమే అని చెప్పాను కద., అది కూడా నా పద్నాలుగో ఏట.
చివరగా కొస మెరుపు ఏమిటి అంటే , మా తర్వాత మేము ఉండిన అదే ఇంట్లోకి అద్దెకి మా శ్రీమతి వాళ్ళు
దిగారట. (అప్పటికి మేము ఎవ్వరము ఒకరికొకరు తెలియదు).
అదే మేష్టారు గారి దగ్గర మా
శ్రీమతి ఈ దక్షిణ భారత హిందీ ప్రచార సభవారి పరీక్షలు అన్నీఏ టు జెడ్ చదివెయ్యడం ,ఆయన శిష్యులందరిలోకి ఆల్ టైం రికార్డులు సృష్టించడం
జరిగిపోయాయి.
కొన్ని ఏళ్ళ తర్వాత దంపతులమైన మేము
1996 ప్రాంతాలలో ఆయన్ని కడపలో కలిసి ఆయన్ని ఆశ్చర్యానికి గురి చేయటం
జరిగింది. ఆయన స్టూడెంట్స్ అందరిలోకి మోస్ట్
ఆర్డినరీ స్టూడెంట్ అయిన నేను , మోస్ట్ బ్రిలియంట్
అయిన మా శ్రీమతి దంపతులం అవటమే సృష్టి వైచిత్రి.
నా హిందీ ప్రయాణంలో, ఇవన్నీ ఒకెత్తు, కర్నూల్లో, నేను టెన్త్ చదివేటప్పుడు నాకు సయ్యద్ ఇలియాస్ బాషా ఖాద్రీ తో పరిచయం
ఒకెత్తు. అప్పట్లో ఇలియాస్ అని ఒక ఆప్త మిత్రుడు ఉండేవాడు. నిజానికి అతను నాకన్న
ఒక సంవత్సరం జూనియర్. చాలా సరదాగా ఉండే వాడు. బక్కపలచగా గాలి వస్తే ఎగిరిపోతాడేమో
అన్నట్టు ఉంటూ చాలా చమత్కారంగా మాట్లాడే వాడు. కాకపోతే అతనికి తెలుగు సరిగా రాదు.
హిందీలాంటి, ఉర్దూలాంటి కర్నూలు తురకం బాగా మాట్లాడేవాడు.
అతని ప్రభావం వల్ల అమితాబ్ బచ్చన్
మీద నాకు అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ రోజుల్లో వరుస
పెట్టి హిందీ సినిమాలు చూశాను ఈ ఇలియాస్ బాషా ఖాద్రీ సాంగత్యంలో.
దేశ్ ప్రేమి, నమక్ హలాల్, మనోజ్ కుమార్ క్రాంతి,
బీ ఆర్ చోప్రా వారి నిఖా, రాజ్ పుత్, వక్త్ కీ దివార్, శక్తి, , మహాన్, ముఖ్యంగా
డిస్కో డాన్సర్ ఇలాంటి సినిమాలు చూడాల్సి వచ్చేది ఇలియాస్ వల్ల. ఉండేది ఉండగా ఆ
సినిమా చూసొచ్చాక అతను ఒక చిన్న పాటి క్విజ్ ఒకటి పెట్టే వాడు.
ఏఏ పాత్రలు ఏమి మాట్లాడుకున్నాయి, కథ ఎంత మేరకు అర్థం అయింది, ఫలానా పాటకు
అర్థం ఏమిటి ఇలా సాగేది ఆ క్విజ్ .
అతని సాంగత్యంలో నాకు అలవడిన ఇంకో
అలవాటు ఏమిటి అంటే ’రేడియో సిలోన్’ లో వచ్చే హింది పాటలు అన్నీ శద్ధగా వినడం, అమీన్ సయానీ నిర్వహించే ’బినాకా గీత్ మాలా’ వినటం ఒక పని. ఇది
వివిధ భారతీలో వచ్చేది ఆ తర్వాత.
చివరిగా కొన్ని సరదా సంఘటనలు.
ఈ ఇలియాస్ తో మాట్లాడేటప్పుడు
హిందీలో మాట్లాడాల్సొచ్చేది. అతని తెలుగు వినడం దుర్భరంగా ఉండటమ్ వల్ల.
శుభం.
No comments:
Post a Comment