ఒక ఙ్ఞాపకం 19
"దెయ్యంతో భేటీ"
"దెయ్యం.
అవును నిజంగా దెయ్యమే.
గ్రిల్
అవతల మా కళ్ళ ముందరే నిలబడి వుంది. అబ్బ! తలచుకుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
’రా...నా’, ’రా....నా’ అంటూ ఒకటే బెదిరించింది
రాత్రంతా" విశాఖదత్తుడు చెప్పుకుని
పోతున్నాడు. అతను చెబుతున్నాడే గాని నాకేమీ అర్థం కావటం లేదు.
తెల్లవారు
ఝామున అయిదున్నర ఆరు అయ్యుంటుంది. ఇది 1984 ఆ ప్రాంతాలలో జరిగింది. మేమప్పుడు
కడపలో వుండేవారం.
విశాఖదత్తుడు
మా పెద్దమ్మ కొడుకు. అతను చాలా చక్కటి చిత్రకారుడు, తెలుగు పండితుడు, సంస్కృతంలో కూడా మంచి ప్రావిణ్యం వుండేది అతనికి. తన
మేనకోడల్ని పెళ్ళిచేసుకుని తిరుపతి దర్శనానికి వెళుతూ కడపలో మా ఇంటికి వచ్చాడు.
అందరూ
హాల్లో కూర్చుని కబుర్లుచెప్పుకుంటుంటే నేను అప్పుడే నిద్రలేచి వెళ్ళీ ఆప్యాయంగా
విశాఖదత్తుడు అన్నయ్యని, వదినెమ్మ జ్యోతిని పలకరించి నేను
వారి తో చేరి కబుర్లు వింటు కూర్చున్నాను.
వారి
అనుభవం చాలా చిత్రంగా వుంది. రాత్రి ఎప్పుడొ ఒంటిగంటకు వచ్చారట. నాకు మెలకువ
రాలెదు అప్పటికి మా అప్ప (నాన్నగారు) వెళ్ళి తలుపు తీశారట.
అది
ఎండాకాలం కావటం వల్ల మేమంతా మేడ మీద ఓపెన్ ఎయిర్ లో మంచాలు వేసుకుని పడుకున్నాం.
రాయలసీమలో అది సాధారణ దృశ్యమే.
వారికి
క్రింద బెడ్ రూమ్ లో పడక ఏర్పాటు చేసి ఫ్యాన్ ఆన్ చేసి, మంచి నీళ్ళు ఏర్పాటు చేసి మా అమ్మా, అప్పలు తిరిగి పైకి వచ్చి
పడుకున్నారట. వారు ఇలా వచ్చి పడుకున్నారో
లేదో క్రిందనుంచి పెద్ద పెద్దగా కేకలు వినిపించాయట ’దెయ్యం, దెయ్యం’ అని. మా అమ్మా, అప్పలకు అసలేం అర్థం కాలేదు. ఏదో సరదాకు అలా అరుస్తున్నారేమో అని కాసేపు
వీళ్ళేమి స్పందించకుండా వుండిపోయారట. కానీ మరి కొన్ని నిమిషాలలో ఇంకా గట్టిగా
విశాఖదత్తుడు, అతని శ్రీమతి జ్యోతి ’దెయ్యం, దెయ్యం అని అరవటం మొదలెట్టారట. ఈ సారి ఆపకుండా అరవటం కొనసాగిస్తున్నారట.
ఇంత గోల
జరుగున్నా నాకు మెలకువ రాలేదు. అదే చిత్రం.
ఇక
గుండెలు చిక్కబట్టుకుని మా అమ్మా, అప్ప మెట్లు దిగి క్రిందికి
వెళ్ళారట. కొత్తగా పెళ్ళయి వచ్చిన ఆ దంపతులు గజ గజా వణికిపోతూ ’దెయ్యం, దెయ్యం’ అంటూ ఊపిరి అందక రొప్పుతున్నారట.
మా అమ్మా
అప్పలకు అసలేం అర్థం కాలేదట, వాళ్ళిద్దరూ వరండా గ్రిల్ వంక
చూపిస్తూ చెబుతున్నారు "అదిగో అక్కడే, ఆ గ్రిల్ అవతల నిలబడి తెల్లటి ఆకారం, ’రా..నా’ అంటూ బెదిరిస్తోంది.ఖచ్చితంగా
చూశాము అది దెయ్యమే."
మా అమ్మా
అప్పలకు అసలు అర్థం కాలేదు వారేమి చెబుతున్నారో. అది లక్షణకరమైన ఇల్లు. నిత్యం
దేవతార్చన, పూజ, పునస్కారాలు జరిగే లక్షణకరమైన
గృహం. కొన్ని తరాలుగా హాయిగా పిల్లాపాపలతో అన్ని విధాలుగా కళకళలాడుతున్న ఇల్లు అది. మా అప్పకి కాస్తా కోపం
కూడా వచ్చింది వాళ్ళు అలా బాధ్యతారహితంగా అలా అర్దరాత్రి అరుస్తూ వుంటే.
’ఛస్.
నోర్మూయండి. ఏమిటి మీ కంగారు? అసలు ఇక్కడ భయపడాల్సిన అవసరమే
లేదు. లక్షణకరమైన ఇల్లు ఇది. మీ భయం నుండి బయటకు వచ్చి నింపాదిగా చెప్పండి అసలేం
జరిగింది? ఎందుకు గాను కంగారు పడుతున్నారు?"
మా అమ్మగారికి సాక్షాత్తూ అక్కయ్య
గారి మనవడు, మనవరాలు వాళ్ళిద్దరు. మా అమ్మగారికి
అవ్యాజమైన జాలి ప్రేమలు కలగడంతో వారిద్దర్ని దగ్గరకు తీసుకుని, మా నాన్న గారిని కాస్తా
మందలిస్తూ,
’మీరుండండి, అసలే చిన్న పిల్లలు భయపడి కంగారు పడుతుంటే మీ కోపం
ఒకటి," అని మా అమ్మ గారు పిల్లల్నిద్దరిని దగ్గరకు తీసుకుని
పొదువుకుని "ఏమి భయపడకండర్రా. ఇక్కడేమీ భయం లేదు. ఏదో చూసి ఏదో అనుకుని
కంగారు పడుంటారు మీరిద్దరు" అంటూ
వాళ్ళకూ సాంత్వన పలికి, ఇద్దరికి మంచి నీళ్ళూ తాపించి
కాస్తా కుదుట పడేలా చేసిందట.
ఇంతలో
" రాజన్నా, రాజన్నా" అంటూ బయటి నుంచి మా నానమ్మ గారు కేక
వేశారట.
ఆవిడ వయసు
డెబ్భై పైనే వుంటుంది. ఆవిడకి పుట్టెడు చెవుడు.
తెల్ల చీర కట్టుకుని వుంటారు ఆవిడ.
బయట వీధి దీపం కాంతి ఆవిడ వెనుక వైపు నుంచి రావడం వల్ల, ఇటునుంచి చూసే వారికి ఆవిడ ఆకారం స్పష్టంగా కనిపించటం లేదు.
ఆవిడ ధరించిన తెల్లటి చీర, స్పష్టతలోపించిన ఆవిడ కంఠధ్వని ఆ చీకటి రాత్రి కొత్తవారికి
కాస్తా భయం కలిగించే మాట వాస్తవమే.
ఆవిడ
మోకాళ్ళనొప్పుల కారణంగా మేడపైకి వెళ్ళి పడుకోవటానికి చేతకాక, క్రిందనే కాంపౌండ్ లో ఓపెన్ ఎయిర్ లో మంచం వేసుకుని
’కృష్ణా....రామా’ అనుకుంటూ పడుకునే వారు.
’అదిగో
దెయ్యం, అదే దెయ్యం అంటూ కేకలు వేయటం ప్రారంభించారు ఈ నవ
దంపతులు మరి ఒక్కసారి
ఈ సారి
నవ్వటం వారి వంతయింది మా అమ్మఅప్పలకు.
మా అప్ప
లెచి హాల్లో లైట్లు వేసి, గ్రిల్ తలుపు తీసి మా నానమ్మని
లోపలికి ఆహ్వానించారు.
"నాయనా
విశాఖదత్తా! ఇది దెయ్యం కాదు తండ్రి! మా అమ్మ. ఈవిడ ఉక్క భరించలేక బయట కాంపౌండ్ లో
మంచం వేసుకుని పడుకుంది. అదోని నుంచి మా పెద్దబ్బాయి ’అప్పాజీ’ పదకొండున్నర మెయిల్
కి రావటం కద్దు. మీరు అర్ధ రాత్రి ఊరి
నుంచి రావటంతో అప్పాజీ వచ్చాడని ఆవిడ భావించి మిమ్మల్ని ఉద్దేశించి ’రాజన్నా,
రాజన్న అని పిలిచి వుంటుంది.
నా సంతానం
అందరిలోకి ఈవిడకి అప్పాజితో అనుబంధం ఎక్కువ. అతన్ని ’రాజన్నా, రాజన్నా’ అని పిల్చుకుంటుంది, తన భర్త ఈ రూపంలో పుట్టాడని ఆవిడ ప్రగాఢ అభిప్రాయం. ఆయన పేరు కూడా అప్పాజి
కావటంతో, ఆయనని పేరు పెట్టి పిలవకూడదని ’రాజా అనీ, రాజన్నా అనీ పిల్చుకుంటు వుంటుంది. ఆవిడకి పళ్ళు
ఊడిపోయిన కారణంగా ఆ పిలుపులో స్పష్టత లోపించి, రాజన్నా, రాజన్న అని ఆవిడ పిల్చినా అది వింటానికి మీకు
’రా....నా’ ’రా....నా’ అని వినిపించి వుంటుంది."
మా నాన్న
గారు ఇచ్చిన వివరణతో వారు కుదుట పడి ఆ రాత్రి ప్రశాంతంగా నిదుర పోయారు.
ఉదయాన్నే
మా అప్ప వారిద్దర్ని ఆట పట్టిస్తుండగా నేను నిద్రలేచి వెళ్ళీ వాళ్ళతో జాయిన్
అయ్యాను అది అన్నమాట విషయం.
తరువాత వారు ఒకటి రెండు రోజులు
వుండి ప్రయాణం మీద వారు బయలుదేరి వెళ్ళటం జరిగింది.
***
ఈ మొత్తం
ఎపిసోడ్ లో విషాదం ఏమిటంటే, ఈ సంఘటన జరిగిన కొన్ని నెలలకే
విశాఖదత్తుడు అతి చిన్న వయస్సులోనే కిడ్నీ ఫెయిల్యూర్ తో మరణించడం. అతనికి
మృత్యువు కొన్ని నెలలముందే కనపడింది అని అనుకుని బాధ పడ్డాము. అంతకంటే ఏమి
చెయ్యగలం?
No comments:
Post a Comment