Tuesday, May 3, 2022

బీచుపల్లి బ్రిడ్జి

 బీచుపల్లి బ్రిడ్జి

ఒక ఙ్జాపకం -30

 

ఇది 1992-93 ప్రాంతాలలో జరిగింది.

మృత్యుకేళిని చూడ్డానికా అన్నట్టు వినీలాకాశంలో అక్కడక్కడా ఉన్న మబ్బులు  బీచుపల్లి బ్రిడ్జి వంక ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి.

పుచ్చపువ్వులా విరగ గాస్తున్న వెన్నెల. శ్రావణ పౌర్ణమి రాత్రి. సమయం దాదాపు అర్దరాత్రి కావస్తోంది.

హైదరాబాద్ - కడప డీలక్స్ బస్సు నెమ్మదిగా బీచుపల్లి బ్రిడ్జి వంక పయనిస్తూ వస్తోంది.

అప్పట్లో ఈ హైవేని ఎన్ హెచ్ 7 అనే వారు.

ఇప్పటిలాగా విశాలమైన  రోడ్డు, టోల్ గేట్లు, బీచుపల్లి నదిపై రెండు బ్రిడ్జీలు ఉండేవి కావు ఆ రోజుల్లొ. ఒక్కటే బ్రిడ్జి ఉండేది.

 

****

 

ఆ వేళ ఉదయమే శ్రావణ పౌర్ణమి (జంధ్యాల పౌర్ణమి) సందర్భంగా కొత్త యఙ్జోపవీతం  ధరించి గాయత్రి మంత్రం శాస్త్రోక్తంగా పఠించి తలితండ్రుల కాళ్ళకి మొక్కాడు కృష్ణ.

ఆ రాత్రే అతని ప్రయాణం కడపకి. రిజర్వేషన్ దొరకలేదు, హైదరాబాద్ కి వచ్చిన ఉద్యమకారులు అన్ని బస్సులలో, రైళ్ళలో ముందుగా రిజర్వ్ చేసేసుకోవటం వల్ల ఎక్కడా రిజర్వేషన్ దొరకలేదు.

సరే చివరి నిమిషంలో బస్టాండ్ కి వెళ్ళి ఏదో లాగా ప్రయత్నిద్దాం అనుకున్నాడు కృష్ణ. బ్యాగులు సర్దేసుకున్నాడు.

అతని తల్లి అతని చేతిలో ఒక మేక్సీసైజ్ కలర్ ఫోటో ఒకటి పెట్టి " ఈ అమ్మాయి ఎలా ఉంది?" అని అడిగింది.

సిగ్గుగా తలూపుతూ "చాలా బాగుంది" చెప్పాడు కృష్ణ .

"ఒరే చక్కగా మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది మంచి జీతం. అనేక సంబంధాలు వస్తున్నాయి. నువ్వా అన్నిటికీ ఏదో ఒక వంక పెట్టి వద్దంటున్నావు. ఈ సంబంధం అయినా ఖాయం చేసుకుందాం" వాళ్ళ నాన్న గారు చెప్పాడు.

"సరేలే నాన్నా. ఈ రాత్రికి కడపకు వెళుతున్నాను. రేపు మేనేజర్ గారితొ జాయింట్ ఫీల్డ్ వర్క్ అక్కడ. ఈ సారి శెలవులకు హైదరాబాద్ కి వచ్చినప్పుడు పెళ్ళి చూపులు పెట్టుకుందాం" మెల్లిగా చెప్పాడు కృష్ణ.

కాని అతనికి కాని , వాళ్ళ అమ్మానాన్నలకు కాని తెలియదు ఈ ప్రయాణమే అతని చివరి ప్రయాణం అవబోతోంది అని, విగతజీవుడుగా మాత్రమే అతను తిరిగి ఇంటికి రాబోతున్నాడు అని .

***

హైదరాబాదు నుంచి కడపకు వెళుతున్న సూపర్ డిలక్స్ బస్సు బీచుపల్లి బ్రిడ్జిపైకి వచ్చింది. వంతెన కింద కృష్ణా నది గట్లు తాకుతూ నిండుగా ప్రవహిస్తోంది. ఆ సంవత్సరం కర్ణాటకలో కురిసిన విపరీతమైన వర్షాల కారణంగా ఎన్నడు లేనంతగా నీరు వచ్చింది నదికి.

నిద్రలోనే మగతగా కదిలాడు కృష్ణ,  ఆ మగత నిద్రలోనే దూరంగా కనిపిస్తున్న బీచుపల్లి ఆంజనేయ స్వామి మందిర గోపురాన్ని మనసారా మొక్కుకుని తిరిగి కళ్ళుమూసుకున్నాడు.

ఇంకో మూడు నిమిషాలలో ఆ కళ్ళు శాశ్వతం మూత పడిపోతాయని అతడు ఏమాత్రం ఊహించలేదు.

బస్సులో ఉన్న మిగతా ప్రయాణీకులు కూడా నిద్రలో ఉన్నారు. అధిక భాగం ప్రయాణీకులు మెడికల్ ఏజెన్సీ ఓనర్లు.

అప్పటి ముఖ్యమంత్రి రామారావు గారు కొత్తగా ప్రవేశపెట్టిన ఏదో టాక్స్ (టర్నోవర్ టాక్సో/ఎంట్రీ టాక్సో) కు వ్యతిరేకంగా వారంతా "ఛలో హైదరాబాద్" అనే ధర్నాలో పాల్గొని తిరిగి కడపకు వెళుతున్నారు.

అప్పటికి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఉండేవి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి వేలాది మంది హైదరాబాదు కి వెళ్ళి దొరికిన ప్రయాణ సాధనాల్లో తమ తమ ఊర్లకు తిరిగి వెళుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసి వారి ఈ సూపర్ డీలక్స్ బస్సు కూడా ఆ ఉద్యమకారులతో నిండి ఉన్న బస్సులలో ఒకటి.

ఇంగ్లీష్ పత్రికల భాషలొ  ’ఇల్ ఫేటెడ్ బస్’ అని ఒక ఒక పద బంధం ఉంది. ’తెలుగు పత్రికల వారు మృత్యు శకటం అని వ్యవహరిస్తుంటారు. 

పదజాలం ఏది అయితేనేం ఈ బస్సులో ప్రయణీస్తున్న ఒక్కరు కూడా బ్రతికి బట్టకట్టలేదు.

హైదరాబాద్ నుంచి బయల్దేరిన నైట్ సర్వీస్ బస్సుల డ్రైవర్లందరూ  విధిగా ఒక పదిహేను నిమిషాలు అక్కడ బస్సులు ఆపి , జడ్చర్లలో టీలు త్రాగి ఒకరితో ఒకరు పరాచికాలు ఆడుకుని బయల్దేరడం చాలా సామాన్యమయిన విషయం. ఆ విధంగా ఈ బస్సు, దీని వెనుక కర్నూలు కి చెందిన బస్సు ఒకటి బయలు దేరాయి.

మన కృష్ణ వాళ్ళు ఉన్న బస్సు ముందర వెళుతోంది. వెనుక కర్నూలు బస్సు వస్తోంది. ఒక్కోసారి వాటి మధ్య దూరం పెరిగి తరుగుతూ ఉన్నా,  కర్నూలు బస్సు డ్రైవర్ ఈ బస్సు ని గమనిస్తూనే ఉన్నాడు.

ఒక గంటన్నర ప్రయాణం తర్వాత పెబ్బేరు దాటి బీచుపల్లి బ్రిడ్జిని సమీపించాయి ఈ బస్సులు.  అక్కడ రోడ్డు అర్దచంద్రాకారంలో మలుపు తీసుకుని బ్రిడ్జి ఎక్కాలి బస్సులు.

కర్నూలు బస్సు కాస్తా వేగం తగ్గింది. ఇప్పుడు కడప బస్సు మలుపు తిరిగేసి బీచుపల్లి బ్రిడ్జి ఎక్కింది, ఇంకా మలుపు లోనే ఉన్న కర్నూలు బస్సు డ్రయివర్ కి కడప బస్సు కనిపించటం లేదు ఇప్పుడు.

తీరా మలుపు తిరిగి బ్రిడ్జి మీదకి వచ్చాక ముందర వెళుతూ ఉండాల్సిన కడప బస్సు కనిపించటం లేదు.

అది ఎంత వేగం పుంజుకున్నా ఇలా క్షణాల్లో కనుమరుగయిపోయే ప్రసక్తే లేదు.

ఈ వెనుక బస్సు డ్రయివరుకి మనస్సు ఏదో కీడు శంకించింది.

కాస్తా ముందుకు వెళ్ళాక అతనికి తన అనుమానమే నిజమేమో అనిపించే విధంగా ఒక దగ్గర బ్రిడ్జి తాలుకు పారపెట్ వాల్ మొత్తం విరిగిపోయి ఉంది.

బస్సు ఆపి చూశాడు ఆ డ్రయివర్. నిండుగా ప్రవహిస్తున్న నదిలో ఏ ఆనవాలు కనపడటం లేదు. మరి కడప బస్సు నదిలో పడిపోయిందా, లేదా వేగంగా వెళ్ళి పోయిందా?

అతడికి ఏమీ అర్థం కావటం లేదు.

తన బస్సు బయలుదేరదీశాడు. దారిలో ఎదురుగా వస్తున్న బస్సుల్ని ఆపి అడిగాడు "కడప బస్సు ఏమయినా ఎదురు అయిందా?" అని

వారు "లేదని" సమాధానం చెప్పారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు.

అతను అలాగే అడుగుతూ వచ్చీ చివరికి కర్నూలు బస్టాండ్ కి కడప బస్ రాకపోవడంతో కన్ఫర్మ్ చేసుకున్నాడు, అది బ్రిడ్జి పై నుంచి కృష్ణా నదిలో కి పడిపోయి ఉంటుందని.

 

ఆ విధంగా నదిలో పడిపోయిన ఆ బస్సులోని వారందరూ జలసమాధి అయ్యారు.

నేను ఉద్యోగం లో చేరిన కొత్తలు అవి.

జర్మన్ రెమెడీస్ అనే కంపెనీలో పని చేసే కృష్ణ అనే ఆ కుర్రాడికి ఆ విధంగా నూరేళ్ళు నిండాయి.

 

కాకపోతే ఉదయాన్నే మా ఇంటి దగ్గర ఉన్న శ్రీరామ చంద్రమూర్తి (సిగ్మా మూర్తి) అనే రెప్ ఇంటి దగ్గర పెద్ద కోలాహలం . మా మిత్రులంతా వచ్చి ఆని కుటుంబ సభ్యులని ఓదార్చనారంభించారు.

ఇంతకూ ఏమి జరిగింది అంటే, నిజానికి సిగ్మా మూర్తికి కడప బస్సులో రిజర్వేషన్ కన్ఫర్మ్ అయింది.కానీ బస్టాండ్ కి వచ్చాక జర్మన్ రెమెడిస్ కృష్ణ రెక్వెష్ట్ చేయటంతో , తన టిక్కెట్ అతనికి ఇచ్చి , మూర్థి తన ప్రయాణం వాయిదా వేసుకుని వెనక్కు వెళ్ళాడట.

సిగ్మా మూర్తి వెంట్రుక వాసిలో అప్పటికి మృత్యువు ని తప్పించుకున్నాడు. దుబాయి లో సెటిల్ అయిన ఈ సిగ్మా మూర్తి  ఇటీవలే ఇండియా కి వచ్చినప్పుడు, హఠాత్తుగా విజయవాడలో గుండెపోటుతో మరణించాడు.

 

****

ఇప్పటికీ బీచుపల్లి బ్రిడ్జిపై ప్రయాణం చేసినప్పుడల్లా ఈ కృష్ణ నాకు గుర్తు వస్తుంటాడు. ఆటోమేటిగ్గా సిగ్మా మూర్తి గురుతుకు వస్తారు.

 

 

P.S:

చిత్రమేమిటంటే ఇదంతా నాకు ఙ్జాపకం ఉన్నంత మేరకే వ్రాసాను, మరింత పక్కాగా వివరాలు సేకరిద్దామని గూగుల్ తీసి చూస్తే ఒక్క వాక్యం కూడా ఈ ఆక్సిడెంట్ గుర్చి లేదు. ఒక్క ఫోటో కూడా ఈ ఆక్సిడెంట్ తాలుకు వి గూగుల్ లో లేవు.

 

 

 

 

 

 

No comments:

Post a Comment