Tuesday, May 3, 2022

ప్రాడో - 3 (ఫైనల్ ఎపిసోడ్)

 ప్రాడో - 3 (ఫైనల్ ఎపిసోడ్)

ఒక ఙ్జ్యాపకం -24

 

బ్రతికి చెడిన ఆ నవాబు గారి దగ్గర లాబ్రడార్ బ్రీడ్ కి చెందిన పప్పీని తీసుకుని కారెక్కి ఇంటి ముఖం పట్టాం.

మా పిల్లలు ముందు చూపు కలిగిన వారై ముందుగానే తమ వెంబడి ఒక ప్లాస్టిక్ బాస్కేట్ (మనకు షాపింగ్ చేసేటప్పుడు మాల్స్ లో ఇస్తారు చూడండి అలా లోతుగా ఉండే ప్లాస్టిక్ బాస్కెట్) ఒకటి ముందుగానే పట్టుకొచ్చారు. అందులో చక్కగా కుషన్ ఒకటి వేసి దాని మీద మెత్తగా పాత టర్కీ టవల్ ఒకటి  పరిచి దానికి సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లూ చేశారు.

అది కార్లో కాసేపు గంతులు వేసి ఆ బుట్టలో ఒదిగి ఉండటానికి ససేమిరా అన్నట్టు బాగా మొరాయించింది. అది తల్లి పాలు తాగుతూ ఉండే లాంటి మరీ చిన్నదేమి కాకపోవటం వల్ల మేము కూడా ధైర్యంగా తెచ్చుకున్నాము.

 

నాకు ఉండుండి ఆ బ్రతికి చెడిన నవాబు గారె గుర్తు వస్తున్నారు.

రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు వ్రాసిన  "స్మోకింగ్ టైగర్ అను పులి పూజ" కథ ఎప్పుడో చదివినది పదే పదే గుర్తు వస్తోంది ఆ వేళ నాకు. అందులో బ్రతికి చెడిన జమీందారు భూపతి పాత్ర గుర్తు వస్తోంది.

అందులో భూపతి పాత్ర గురించి  ఆ కథలోని వాక్యాలు వ్రాస్తాను రావి శాస్త్రి గారి మాటల్లోనే "వడలిపోయినప్పటికీ బలంగా కనిపించే వాడు. బలంగా కనిపించినప్పటికీ అసహాయంగా ఉన్నట్టుండేవాడు. ముఖం గజం చదరం ఉండి, అతను చాలా ఎత్తుగా వెడల్పుగా ఉండేవాడు. చాలా పళ్ళూడిపోయి , దవడలు మడతలు పడి సంచుల్లా వేళ్ళాడేవి. కారా కిళ్ళీవల్ల నోరు ఎర్రగా ఉండి నవ్వినప్పుడల్లా నాలిక ఎర్రగా కనిపించేది.

ఆ నోరు, పళ్ళు లేని పాము నోర్లా ఒక్కోసారి నాక్కనిపించేది. అతనెప్పుడూ ఓ మాసిన పంచె మీద మాసిన చొక్క వేసుకుని అంచుమీద ఓ మాసిన ఖాళీకోటు తొడుక్కుని ఉండేవాడు. చేతిలో తరచు గా ఓ షోకైన చేతికర్ర  మాత్రం ఉంటుండేది. ఆ చేతికర్ర వల్లనో మరెందువల్లనో గాని ఆయనొక చెడిపోయిన రాజు గార్లా ఉండేవాడు.

ఆ చేతి కర్ర ఊతే లేకపోతే అతను ముష్టికి దిగిపోయిన ముసలి రాక్షసుడిలాగానో, పొట్లకాయలు నవులుకొని పొట్టపోషించుకునే ముసలి పులిలాగానో కనిపించిఉండేవాడు" ఈ వర్ణన ఇంచుమించు ఈ నవాబు గారికి కూడా సరిగ్గా సరిపోతుంది.

ఈ బ్రతికి చెడిన నవాబు కూడా  చేతులు చాచి మేము ఇచ్చిన కొద్ది పాటి వందల రూపాయలను అపురూపంగా అందుకుని ఎవరూ చూడకుండా అటు ఇటు చూసి తన జుబ్బా జేబులో దాచుకున్న వైనం నన్ను బాగా కలచి వేసింది.

 

సరే ఆ రోజే వస్తూ వస్తూ దారిలోనే కుక్కలకు సంబంధించి గొలుసులు వగైరాలు అమ్మే దుకాణంలో దాని మెడకు ఒక బెల్టు, గొలుసు, దాని ఆహారం కోసం పెడిగ్రీ అనే బ్రాండెడ్ ఫుడ్ ప్యాకెట్లు కొనుక్కున్నాము.

చెప్పాను కద ఇంకో పదిరోజుల్లో కొత్త ఇంటి గృహప్రవేశం పెట్టుకుని కూడా శుభకార్యానికి సంబంధించిన ఒక్క ఏర్పాటూ సక్రమంగా మొదలెట్టలేదు ఈ శునక సేవ సరిపోయింది.

ఓల్డ్ సిటీ నుంచి వనస్థలిపురం చేరేలోగా కారులోపల దుర్వాసన అలుముకునిపోయింది. అది ఆ బుట్టలోనే చేయగల చండాలం అంతా చేసేసింది. భరించక తప్పదు కద.

పక్క సీట్లో నే కూర్చుని ఉన్న శ్రీమతి నా వంక కొరకొర చూస్తోంది.  ఆ విషయం తెలుస్తూనే ఉన్నప్పటికి , అవసరమయిన దానికన్న ఎక్కువ ఏకాగ్రతతో రోడ్డును చూస్తూ కారు నడపడం ఇంత కష్టమా అని ఇతరులకు అనిపించేలా పూర్తి దృష్టిని రోడ్డు మీదకు సారిస్తూ నడుపుతున్నాను.

పొద్దుపొడిచేకొద్ది ఆకాశంలో తారలు ఒక్కొక్కటిగా బయటకి వచ్చినట్టు, రోజులు గడిచే కొద్ది  మేము పడే కష్టాలు ఒక్కొక్కటి పెరుగసాగాయి.

మొదటి రాత్రే (అపార్థం చేసుకోకండి, పప్పీని ఇంటికి తెచ్చిన మొదటి రాత్రి) అది మాకు చుక్కలు చూపించింది.

కాంపౌండ్ వాల్ లోపలే కార్ పార్కింగ్ దగ్గర దాన్ని గొలుసు వేసి కట్టేసి మేము లోపల పడుకున్నాము. మా ఇంట్లో ఉన్న జంతుప్రేమికుల సంఘం (అదే పిల్లలు) ఈ చర్యని తీవ్రంగా నిరసించారు. వాళ్ళు ఉద్దేశం ప్రకారం దానికి కూడా మా బెడ్ రూంలొ  ఒక పరుపు ఏర్పాటు చేస్తే సబబుగా ఉంటుంది అని., అది తల్లి దగ్గర నుంచి అప్పుడే వచ్చిన పిల్ల కద ఓంటరిగా ఉండటానికి భయపడుతుంది అని వారి వాదన.

అది వారి మనసు చదివిందో ఏమో, బయటి నుంచి రోదన ప్రారంభించింది.  మాలో ఎవరో ఒకరు బయటకు పోతే అది తోకాడిస్తూ ఆడుకోవటానికి సిద్దపడుతోంది. దానికి నిద్ర రావటం లేదు కాబోలు. నాకు నిద్ర చాలా అవసరం , మళ్ళీ పొద్దున నుంచి ట్రెయినింగ్ సెషన్స్, క్లాసులు ఈ హడావుడి సరిపోతుంది.

సరే ఏతావాతా పిల్లలు, మా అవిడ తలా కాసేపు వంతులు వేస్కుని దానికి కంపెని ఇచ్చారు ఆ రాత్రి అంతా. ఇది దానితో తొలిరాత్రి.

చెప్పాను కద అది అద్దె ఇల్లు అని. ఈ లోగా పై పోర్షన్ లో ఉంటున్న ఓనర్ గారు వచ్చి అకారణంగా కాంపౌండ్ లో సంచరిస్తున్నారు. ఆయన చూపుల్లో ఏదో నిరసన కనిపిస్తూనే వుంది. ఏమిటి విషయం అని అడిగితే ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు "కుక్క రోదన ఇంటికి మంచిది కాదు. మీరు దానిని ఎక్కడనా వదిలేసి రండి, లేదా మీరు దానిని చూస్తూ కూర్చోంటారో, లేదా దానితో ఆడుకుంటూ కూర్చుంటారొ నాకు తెలియదు, దాని ఏడుపు నాకు ఎన్నటికి వినపడకూడదు" అని పెదరాయుడు తమిళ్ వర్షన్లో రజనీకాంత్ లా తాను చెప్పదలచుకున్న విషయం చెప్పేసి చక్కా పోయాడు. కండువా స్టయిల్ గా తిప్పుతాడేమో అని తెగ ఎదురుచూశాను. ఊహు తిప్పలేదు.

ఆయన మాట్లాడుతుంటే దానికి తెగ వినోదంగా అనిపించింది అనుకుంటా ఆయన మాట్లాడుతుంటే ఆయన్ని బాగా వినోదంగా చూసి అయన అటువెళ్ళీపోగానే అది కుయ్య్ కుయ్య్ మని చిన్నగా అరవటం మొదలెట్టింది. వామ్మొ ఇది ఏడిస్తే కొంపలు అంటుకుంటాయి మళ్ళీ రజనీకాంత్ వచ్చేస్తాడని కంగారు పడ్డాం.

ఆ విధంగా ఆ రాత్రి గడిచింది.

ఆ తరువాత చెప్పుకోదగ్గ అంశం దాని కాలకృత్యాల ప్రహసనం.

నేను చాలా మందిని గమనించాను వారి శునకాలను ఉదయన్నే గొలుసు పట్టుకుని సరదాగా అలా రోడ్డు మీదకు తీసుకు వస్తే అది ఏ చెట్టు కిందనో చేమ కిందనో తన పని కానిస్తుంది. దాన్ని చూసి స్థానిక వీధి కుక్కలు వెంటబడ్డా కూడా అవి వాటిని ఏ మాత్రం పట్టించుకోక తమ యజమాని కనుసన్నల్లొ మెలుగుతు ఆయన చెప్పినట్టు వింటూ ఆయన వెంబడి గృహోన్ముఖులు అవటం చూశాను.

కానీ ఇది కూడా అంత సునాయాసమైన విషయం కాదని మా అనుభవం లో తెలిసొచ్చింది.

దీన్ని గొలుసుతో బయటికి వ్యాహ్యాళికి తీసుకువెళితే ఉదయాన్నే ఆ తాజాగాలిని పీలుస్తూ హాయిగా నాతో బాటు నడిచి, దానిని అలా బయటకు తీస్కువచ్చినందుకు కృతఙ్జ్యతతో నా వంక చూస్తుంది.

అంతే గానీ అసలు తీసుకువచ్చిన పని చేయదు. నేనే ఏదయినా కరంటు స్థంభం దగ్గర నిలబడి కొద్దిగా కాలు ఎత్తి సూక్శ్మంగా దానికి అర్థం చెయిపించే ప్రయత్నం చేశాను. పోయిన వారం ఎవరో వ్రాసారు, దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి అని. అది వాస్తవమే. నేను అలాగా కరంట్ స్థంభం దగ్గర నిలబడి దానికి సైగల భాషలో ఏదొ చెప్పే ప్రయత్నం చేస్తుంటే అది నన్ను జాలిగా చూసినట్టు బాగా గుర్తు.

"ఊ, కానివ్వు, మనం వచ్చిన పని కానివ్వు" అని దానికి ఎంత నచ్చ జెప్పినా దానికి అర్థం అయ్యెది కాదు. జల్సా సినిమాలో పవని కళ్యాణ్ చెప్పినట్టు "కుక్కలతో లాంగ్వేజ్ ప్రాబ్లెం" అన్న మాట ఎన్ని సార్లు గుర్తొచ్చిందో అప్పట్లో.

సరే ఈ ప్రయత్నాలతో విసిగి వేసారి ఇంటికి తిరిగి వచ్చి నేను బాత్ రూంకు వెళ్ళగానే, అది కూడా హాయిగా కాంపౌండ్ లోపలే తన పనులు కానిచ్చేది. అవి ఎత్తిపోయలేక మా ఆవిడ తీవ్రమయిన ఇబ్బందికి గురయ్యి నన్ను కొరకొర చూసేది.

’ అందరి లాగా కుక్కతో బయట కాలకృత్యాలు తీర్పించి తీసుకురాలేని మీరేమి ట్రెయినర్’ అన్నట్టు చురకలు వేసేది నేనేమయినా డాగ్ ట్రెయినర్‍నా చెప్పండి.

కుక్కను పెంచుకోవటం మొదలెట్టాక ప్రతిరోజూ దాన్ని కాలకృత్యాలకు తీసుకువెళతాం అని నమ్మబలికిన మా పిల్లలు నాకు చల్లగా మాట మార్చేశారు. హోం వర్కులని, ప్రాజెక్టు వర్కులని ఇలా వంక పెట్టుకుని మొత్తం మీద ఈ కుక్క కాలకృత్యాల వల్ల్ నేను మా శ్రీమతి బలయ్యే వాళ్లం చెరొక రకంగా. ఫలితమ్ లేని కాలి తిప్పట నాకు, ఎత్తిపోసుకోలేక అగచాట్లు తనకు.

సరె ఇదిలా ఉండగా, అది తనను గొలుసుతో కట్టి పడేసే విషయం లో తీవ్రమయిన పొరాటాలు జరిపి గొప్ప విజయం సాధించింది. మా ఇంట్లో జంతు ప్రేమికులు ఉన్నారు కద, వారు దాని పోరాటానికి పూర్తి మద్దతు.

కాబట్టి దాన్ని గొలుసుతో కట్టేయటం అనేది మూడు రోజుల ముచ్చటే అయింది.

వాక్సినేషన్ చేయిస్తే మంచిది అన్న హితోక్తి ప్రకారం దాన్ని స్థానిక వెట్ (పశువుల డాక్టర్ ని అలా అనాలట) వద్దకు తీస్కు వెళ్ళాం. ఆయన దాని పేరుతో ఒక ఫైల్ ఓపెన్ చేసి దానిక్ ఒక సీరియల్ నెంబర్ ఇవ్వటం వంటి ఫార్మాలిటిస్ అన్నీ పూర్తి చేసి, దానికి ఎన్నెన్ని రోజులకు ఒకసారి ఏయే ఇంజెక్షన్ చేయించాలో వ్రాసి ఇచ్చాడు.

ఆ సందర్భంలోనే ఆయన చూచాయగా చెప్పాడు ’అది ఒరిజినల్ బ్రీడ్ కాదు, దాని తల్లో తండ్రో లాబ్ అయ్యుంటే అయ్యుండచ్చేమొ అన్నాడు.

ఆ నవాబు గారి శీలాన్ని శంకించాల్స్ వచ్చింది మరి.

లాబ్రడార్ ఆంటీ గారు (మా వీధిలో లాబ్ ల  తాలూకు నడిచే విఙ్జ్యాన సర్వస్వం)  చెప్పిన ప్రకారం ఒక ఆరు నెలలు ఎదురు చూసి ఒక మంచి కులమూ గోత్రం ఉండే కుక్కని అటేడు తరాలు ఇటేడు తరాలు వివరాలు కనుక్కుని సంబధం కలుపునే ముందే మంచి చెడ్డలు మాట్లాడుకున్నట్టు, అన్నీ చూసుకుని తెచ్చుకునింటే ఎంత బాగుండేది అని బాగా పశ్చాత్తాప పడ్డాను. ఇదేదో వర్ణ సంకరం కుక్క అని తెలిసి ఏమి చెయలేము కద. 

సరే దాని లీలలు ఒక్కొక్కటి చెబుతాను.

అది చిన్నగా ఉండటం వల్ల మా గేటు తాలుకు గ్రిల్ లోంచి దూరి వెళ్ళకుండా గేటుకు ప్రత్యేక ప్లాస్టిక్ షీట్ తెప్పించి ఏర్పాటు చేశాము. అది పోరాడి సాధించుకున్న విజయం కారణంగా గొలుసు అన్నది దాని చరిత్రలోనే లేదు కద. అది రాత్రంతా కాలక్షేపం కోసం  అనుకుంటా ఆ షీట్ ని ఒక క్రమ పద్దతి లో కొరికి తాను బయటకు వెళ్ళగలిగేలా రంధ్రం ఏర్పాటు చేసుకోగలిగింది.  జైలు గదిలోంచి సొరంగం తవ్వి తప్పించుకున్న ఖైదీల గాధలాగా ఒక కథ వ్రాసుకోవచ్చు కుక్కలకి చదివే అలవాటు ఉంటే.

ఈ ప్లాస్టిక్ షీట్ మాత్రమే కాక, కాదేది కవితకి అనర్హం అన్న స్థాయిలొ టెర్రసి పైకి వెళ్ళి ఆరేసిన బట్టల్ని విధిగా కొరికేది. అవి మరి ధరించటానికి వీలు లేనంతగా చినిగి పీలికలు అయ్యేవి. దీనివల్ల బాగు పడ్డవాడు ఎవడు అంటే బిగ్ బజార్ వాడు. తరచు వెళ్ళీ కొత్త బట్టలు తెచ్చుకునే వారం , అప్పటికి ఇంకా మాకు దగ్గర్లొ బ్రాండ్ ఫాక్టరీ, స్టార్, పాంటలూన్స్, వెస్ట్ ఎండ్ ఇలాంటివి రాలేదు.

ఇవన్నీ ఒకెత్తు. ఇంకో ముఖ్య విషయం చెప్పకుంటే ఈ కథకే అందం ఉండదు.

కుక్కకి అందునా పెంపుడు కుక్కకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏమిటి, ఎవరైనా అపరిచితులు వస్తే అది ’భౌ, భౌ మని ’ అరిస్తే మనం స్టయిల్గా దాన్ని విసుక్కుని , ఆ అతిథుల వంక అపొలజెటిక్ గా చూస్తూ ’రండి రండి’ అని ఆహ్వానించాలని నాకు చాలా కోరికగా ఉండేడి.

పెంపుడు కుక్కలున్నవారు అందరూ ఇలాగే చేస్తు ఉంటారు.

ఆ విధంగా ఆ కోరిక ఒకటి జనించింది నాలొ. కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయింది.

సరే ఇలా కాదన్చెప్పి ఎవరయినా వచ్చినప్పుడు  అరవాలి అని దానికి  శిక్షణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసాను. ఎవరయినా అతిథో, పోస్ట్ మానో, కరెంట్ బిల్లు వాడో, ఇలా ఎవరో ఒకరు దూరంగా కనపడంగానే వారికి కనపడకుండా ’భౌభౌ’అని చిన్నగా అరిచి దానికి దాని కర్తవ్య బోధ చేసే వాడిని.

దాని దుంపతెగ. దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి. అది నన్నుజాలిగా చూసేది ఆ టైం లో .

’ఒకె, ఎవరయినా వస్తే అరవాలా. సరే దానికి ఇంత హైరానా పడతారెందుకు’ అన్నట్టు భరోసా ఇచ్చినట్టు చూసి ఎవరయినా రాగానే ’భౌ భౌ’ అని అరిచి నా వంక విజయ గర్వంతో చూసేది.

ఇదంతా బాగుంది కాని చిక్కెక్కడ వచ్చింది అంటే ’ నేను చూస్తున్నప్పుడు మాత్రమే అది అలా అరిచేది. మేమంతా లోపల ఉన్నప్పుడు ఎవరొచ్చినా సరే తోక ఊపుకుంటూ వాళ్ళ  దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీదకి ఎగబడేది.

క్రమంగా అది పెరిగి పెద్దగయింది. దాని సైజు చూసి భయపడేవారు జనాలు నిజానికి. కాని వట్టి లొట లొట అని తెలియదు వారికి. రోడ్డు మీద మా ఇంటి ముందు ఎవరు వెళ్ళినా వారితో బాటుగా నడుచుకుంటూ వెళ్ళేది. దీని స్నేహభావం వారికి తెలియదు. భయపడి చచ్చే వారు.

ఒకరిద్దరు కుర్రాళ్ళూ మోటారు సైకిళ్ళపై నుంచి కింద పడ్డారు కూడా. ప్రతి ఒక్కర్ని విధిగా ఇలా వెంట పడి వారితొ వీధి చివరి వరకు నడిచేది. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.

ఇంకా చిత్రమయిన విషయమ్ ఏమిటంటే మేము చూస్తుండగా వారిని చూసి గట్టిగా అరిచేది ’భౌ భౌ అని.

దాంతో వాళ్ళకు మరింత బిత్తర ఎతుకొనేది.  రోడ్డు మీద వెళ్ళే వారు కట్రాట లాగా నిలబడి పోయేవారు దీని దెబ్బకు. ఇదొక ప్రహసనం. దేవుని దయ వల్ల మమ్మల్ని ఎవ్వరూ పల్లెత్తు మాట అనలేదు. లేకుంటే మేము వారి తిట్లకు అన్ని విధాల అర్హులమే.

సరె ఇదిలా ఉండగా దానికి వయసెంత సేపట్లో వస్తుంది. ఆ తరుణం రానే వచ్చింది.

హిందీ సిన్మా పాటలలొ , తరచుగా చెబుతుంటారు ’ప్రేమికులని ఆపగల గొలుసులు ఏవీ ఇంకా పుట్టలేదు’ అని. సరిగ్గా అలాగే జరిగింది దీని విషయంలో.

కొంత వయసు వచ్చాక అది గోడలు దూకడం కూడా నేర్చుకుంది. పిట్ట గోడ ఎక్కి దూకడమే కాదు, దానికి వీధిలో ఆడ కుక్కల మధ్య ఒక స్టార్ ఇమేజి కూడా ఉంది., ఆ విధంగా గోడ దూకడం అన్నది రూపకాలంకారంగా కూడా నప్పింది దాని విషయంలో.

మా తృప్తి కోసం గేటు వేసి ఉంచటమే కానీ దాని స్వేచ్చా విహారానికి ఏ గేటు, ఏ గోడ అడ్డుకట్టలు వేయలేక పోయాయి.

ఇటీవల చలం గారి మైదానం గూర్చి కిరణ్ ప్రభ గారు తమ  టాక్ షోలో  యూ ట్యూబ్ లో చెబుతుంటే మా ప్రాడొ గురించి చెబుతున్నట్టే అనిపించింది.

 

అది క్రమంగా మా ఇంట్లో ఉండటం తక్కువ బయట గడపటమే ఎక్కువ అయింది. కెవలం తిండి కోసం వచ్చేది ఇంటికి, కాలకృత్యాలు తీర్చుకోవటానికి వచ్చేది. అన్నట్టు చెప్పనె లేదు కదు, దానికి బయట కాలకృత్యాలు తీర్చుకోవటం అన్న అలవాటు కానే లేదు. దానికి చెడ్డ నామోషి అలా బయట కూర్చోవటం. మూత్ర విసర్జన కావచ్చు, మల విసర్జన కావచ్చు చక్కగా ఏకాంతంగా మా ఇంటి టెర్రస్ పైకి వెళ్ళీ గుట్టుగా ముగించుకుని వచ్చేది.

 

ఉండేది ఉండగా ఒక మధ్యాహ్నం అది ఒక పెద్ద చేపని తెచ్చుకుంది. మేము కంగారుపడ్డాం ఎక్కడిదబ్బ ఇది అని. కాసెపట్ళొ కొందరు యువకులు లబలబ లాడుతూ వచ్చారు.

మా ఇంటి దగ్గరలో ఒక పెద్ద లేక్ ఉంది. వనస్థలిపురం కి సంబధించి దీన్నిమిని ట్యాంక్ బండ్ అంటారు. ఇక్కడ చేపలు పట్టుకోవటానికి వచ్చే వారు తాము పట్టిన చేపలు అన్ని ఒక వారగా బుట్టలో పెట్టుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ శ్రద్ధగా చేపలు పట్టటంలొ నిమగ్నమవుతారు.

ఇది అదును చూసి ఆ చేపల్ని రోజు గుటకాయస్వాహ చేస్తొంది అట.

మేము పూర్తి శాఖాహారులం కావటం వల్ల దానికి ’పెడిగ్రీ’ తెప్పిచ్చి ముక్కు మూసుకుని పెట్టే వారమే కాని దాని కి సంబంధించిన సహజ ఆహార అలవాట్లకు అణుగుణంగా ఏర్పాటు చేయలేకపోయే వారం.

అది విషయం.

ఆ విధంగా అది మాంసాహారం తానే సంపాయించటం మొదలెట్టాక మా ఇంటికి రావటం కూడా తగ్గించింది.

ఇప్పటికి అది వీధిలో తారస పడుతుంది కానీ విశ్వాసం వినయం స్థానే, ఒక దేశాధ్యక్షుడు మరో దేశాధ్యక్షుడిని పలకరించిన స్థాయిలో తల ఎగరేసి ’ మీ రాజ్యంలో అంతా కుశలమా’ అన్నట్టు చూస్తుంది.

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి దాని కళ్ళలో భావాలు బాగా పలుకుతాయి.

ఇంతటితో ఈ శునక పురాణం సమాప్తం.

 

No comments:

Post a Comment