Tuesday, May 3, 2022

అరుణ్ అలియాస్ గోపాల కృష్ణ Part 1

 అరుణ్ అలియాస్ గోపాల కృష్ణ

ఒక ఙ్జాపకం – 35

 

 

"అందముగ నీ కనులకు విందులుగా వాకిటనే,

సుందర మందర కుంద సుమదళములు పరువనా.

దారిపొడవునా పరిచిన పారిజాతములపై

నీ అడుగుల గురుతులే నిలిచినా చాలు.

 

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు

ఎదెరుగని (ఎద ఎరుగని ) వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు.

కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ

నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

 

స్టీరియో టేప్ రికార్డర్ లో నుంచి శ్రావ్యంగా సుశీలమ్మ పాట వినిపిస్తోంది.

 

 

ఈ సంఘటన 1997-99 ల మధ్య జరిగింది.

స్థలం: కోయంబత్తూర్ (తమిళనాడు)

 

ఆ గదిలో అయిదుగురం ఉన్నాము. నేను ఒక్కడినే తెలుగు తెలిసిన వాడిని ఆ గదిలో.

అది కోయంబత్తూరు. గాంధిపురంలో జీపీ థియేటర్ వెనుక ఉన్న న్యూ సిద్దాపూదూర్ కాలనీ. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు మూడున్నర అయి ఉంటుంది.  బయట నీరెండ వ్యాపించి ఉంది. వాతావారణం ఒక విధంగా చల్లగా ఉంది.

 

టేప్ రికార్డర్ లో కాసెట్ లోని స్పూల్ తిరుగుతోంది.  ’మేఘ సందేశము సినిమాలో ఈ పాట నెమ్మదిగా గది అంతా తెరలు తెరలుగా పరచుకుంటోంది.

గది మధ్యలో టీపాయ్ మీద పెట్టబడిన నేషనల్ పానసోనిక్ స్టీరియో టేప్ రికార్డర్ వద్ద మొదట నా మిత్రుడు అరుణ్, నేను కూర్చుని వినటం మొదలెట్టాము.

అక్కడే మంచం మీద పడుకుని కునికి పాట్లు పడుతున్న  డెబ్బై ఏళ్ళ అరుణ్ వాళ్ళ నాన్నమ్మ  ఆ సంగీత ప్రభావానికి అనుకుంటాను లేచి కూర్చుని తలని లయబద్దంగా ఉపుతూ కూర్చున్నారు.

కాసేపట్లో లోపలి గదిలోంచి అరుణ్ వాళ్ళ నాన్న గారు, అమ్మ గారు కూడా వచ్చి టీపాయ్ ముందు భక్తిగా నేలపై కూర్చుని నిశ్శబ్దంగా తలూపుతూ, అర చేతితో లయబద్దంగా తాటించుకుంటూ ఏదో లోకం లో ఉన్న వాళ్ళ వారిలాగా వింటుండి పోయారు.

 

నాకా పాటలన్నీ నిస్సందేహంగా చాలా ఇష్టం.

మా ఆవిడ తన తొలి కాన్పుకై హిందూ పూర్ కెళ్ళి ఉండింది.  నేనొక్కడినే వంటా వార్పు చేసుకుంటూ, వాషింగ్ మెషీన్ లో బటలు ఉతుక్కుంటూ, డ్యూటి కి వెళుతూ గడిపేవాడిని ఆ రోజుల్లో.

ఒక రోజు అనుకోకుండా నాకు ఒక కొరియర్ వచ్చింది.  అందులో నాకోసం ఒక ప్రేమ కానుక ’మేఘసందేశం’ పాటల్ కాసెట్ ఉంది.

నా వద్ద ఉన్న ’మేఘసందేశం’  కాసెట్ టేప్ చెడిపోవడంతో, మళ్ళీ  మా ఆవిడ నాకోసం ప్రత్యేకంగా  ఆ పాటల క్యాసెట్ కొని నాకోసం కానుకగా కోయంబత్తూరు కి పంపింది.

కోల్పోయిన పెన్నిధి దొరికినట్టు నేను పదే పదే ఆ పాటల్ని వాక్‍మెన్ లొ పెట్టుకుని వింటూ ఉండేవాడిని ఆ రోజుల్లో.

 

ఏమిటి ఆ పాటలు అని అడిగాడు అరుణ్ ఒక రోజు.

అతనికి హెడ్ ఫోన్స్ తగిలించి వినిపించాను. అతను ఒక విధమైన్ పారవశ్యంలో మునిగి పోయాడు.

 

ఆ తరువాత క్యాసెట్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో టేప్‍రికార్డర్‍లో పెట్టుకుని వినసాగాడు.

నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా వాళ్ళ ఇంట్లో అందరూ పెద్దా చిన్నా తేడా లేకుండా సజల నేత్రులయ్యారు ఆ పాటలు వింటూ. వాళ్ళ పారవశ్యాన్ని మాటల్లో వర్ణించలేను.

వారికి ఒక్క ముక్క అర్థం కాకున్నా ఆ సినిమాలోని పాటలన్నింటినీ మళ్ళీ మళ్ళీ రీప్లే చేసుకుని వింటూ చాలా సేపు పారవశ్యంలో మునిగిపోయారు.

ఆ సాయంత్రం అతను చేసిన మొదటి పని ఆ పాటలన్నింటిని ఒక ఖాళీ క్యాసెట్ లొ రికార్డ్ చేసుకోవటం.

నా క్యాసెట్ తెచ్చి నా చేతిలో పెడుతూ ఆ సాయంత్రం అతను కండ్లనిండానీళ్ళు పెట్టుకుని గద్గద స్వరంతో "నాకు తెలుగు తెలియనందుకు మొదటిసారి బాధపడుతున్నాను" అని దాదాపు ఏడ్చేసినంత పని చేశాడు.

 

అరుణ్ తో నాకు అనేక మరపురాని ఙ్జాపకాలు ఉన్నాయి, వాటిలో కలికితురాయి లాంటిది పై ఙ్జాపకం.

 

***

విశాలమైన ఆ అవరణని రెండు సగాలుగా విభజిస్తే, వెనుక సగభాగం లో అరుణ్ వాళ్ళ ఇల్లు ఉండేది. ముందర వైపు సగభాగంలో పెద్ద తోట, మా ఓనర్ గారి ఇల్లు ఉండేది. ఈ ఓనర్ గారి ఇంటి పైభాగంలో మేము బాడుగకి ఉండే పోర్షన్ ఉండేది.

విశాలమైన ఆ తోట లొ చక్కటి పచ్చిక, పూల మొక్కలు, కొబ్బెర చెట్లు వీటితో చాలా ఆహ్లాదంగా ఉండేది.

మా ఇంటి దిగువ భాగంలో ఇంటి ఓనర్లు ఉండేవారు అన్నాను కద,  వారు కే.విశ్వనాధ్ సినిమాలలో ఉండే వయసు మళ్ళిన దంపతులలాగా చక్కగా పద్దతిగా ఉండేవారు వారు. మామా, మామీ. వాళ్ళ పేర్లు. మాకు అలాగే గుర్తు ఉన్నాయి. వాళ్ళు కర్ణాటకలోని మైసూరుకి చెందిన వారు.

వారు సంప్రదాయ శైవ బ్రాహ్మణులు. ఆయన ఏదో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. వారు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా తృప్తిగా జీవించేవారు.

కోయంబత్తూరు కి ’రిటైర్డ్ పీపుల్స్ హెవన్’ అన్న పేరు ఉండేది. ఆ మాటని నిజం చేస్తు, వారు పదవీ విరమణ చేశాక కూడా తమ స్వగ్రామమైన మైసూర్ కి వెళ్ళకుండా అక్కడే నివాసం ఉండిపోయారు.

 

 వాళ్ళ కొడుకులు బెంగళూరు, అమెరికా లోనూ ఉండేవారు. మొత్తానికి వారు చాలా ఆనందంగా, ఇతరుల పట్ల దయగా ఉంటూ ఏ చీకూ చింత లేకుండా ఉండేవారు.

మామి గారు ఎప్పుడు చూసినా కాళ్ళకు పసుపు వ్రాసుకుని, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని, చక్కటి సంప్రదాయబద్దమైన పట్టుచీరలో ఉండేవారు.

మామా, మామీ లు మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకొనే వారు. చాలా చిన్న వయసులోనే నా ప్రమోషన్ మీద అంత దూరం వెళ్ళి మేము అక్కడ ఉండటానికి సిద్ద పడటం, మాకు అక్కడి స్థానిక భాష(తమిళ్) రాకపోవడం, మాకు కొద్దిగా కన్నడము తెలిసి ఉండటం , మా ఆవిడ స్వగ్రామం కర్ణాటకలోని బళ్ళారికి దగ్గరగా ఉండటం వల్ల మాపై కాస్తా అభిమానంగా ఉండేవారు. వారు ఓనర్లు, మేము అద్దెకు ఉన్నాం అని అనుకునేవారు ఎవరైనా కొత్తవారు చూస్తే. వాళ్ళ అమ్మాయి అల్లుడు అన్నట్టు గా చూసుకునేవారు వారు మమ్మల్ని.

మామి గారు ఉదయం, మరియూ సాయంత్రాలు ఆతోటమధ్య ఉండే తులసి కోటకు దీపం, అగరు వత్తులు వెలిగించి శ్రద్ధగా పూజ చేసుకునే వారు. మొత్తానికి ఆ వాతావరణం చాలా పవిత్రంగా ఉండేది.

మా ఇంటికి వెనుక భాగాన రెండు ఇండ్లు ఉండేవి. వాటిలో అరుణ్ వాళ్ళ ఇల్లు క్రింది భాగంలో ఉండేది, వారి మేడపై కేరళ బ్రాహ్మణ కుటుంబం ఒకటి ఉండేది.

మా ఇల్లు, అరుణ్ వాళ్ళ ఇల్లు, ఈ కేరళ వాళ్ళ ఇల్లు, వీటన్నింటికి స్వంతదారులు మామా, మామీ గారలే.

ఈ కేరళ వారు కూడా చాలా భక్తి తత్పరులు. వాళ్ళ అబ్బాయి ఒకాయన  విదేశాలకు వెళ్ళీచాలా పెద్ద చదువులు చదువుకునొచ్చి ఏదో పెద్ద ఎమ్మెన్సీ కంపెనీలో పని చేస్తూ

కూడా , సన్యాసం పుచ్చుకుని ఇస్కాన్ వారి కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాలు పంచుకొంటు ఉండే వాడు.

ముక్కు మీదనుంచి నుదుటిమీదుగా పాపటి దాకా లాగిన తిలకం గంధం తో పెట్టుకుని, చేతిలో ఒక కాటన్ సంచి లాంటి దాన్లోకి అరచేయి పెట్టేసుకుని నిత్యం జపమాల తిప్పుకుంటూ కనిపించేవాడు.

జగన్నాధ రథయాత్ర సందర్భంగా వారి ఇంట్లో పెద్ద హడావుడి కనిపించేది. వాళ్ళతో మాకు పెద్దగా స్నేహం పెరగలేదు. కేవలం ముఖపరిచయంతో ఆగిపోయింది, అప్పుడప్పుడు గుడ్ మోర్నింగ్ లు చెప్పుకోవటాలు, చిరునవ్వులు నవ్వుకోవటాలు, ఇంతకు మించి వారితో స్నేహం ముందుకుపోలేదు. పైపెచ్చు, ఈ కథలో వారికి పెద్ద ప్రాముఖ్యత కూడా ఏమి లేదు లెండి.

మేము తెలుగు, అరుణ్ వాళ్ళు తమిళవాళ్ళు, వారి ఇంటి పైభాగాన మళయాళీయులు, , మా క్రిందింట్లో కన్నడ వారైన ఓనర్లు. ఏతావాతా ఆ కాంపౌండ్ లో దక్షిణభారత దేశం మొత్తం ఉండేది.

 

అరుణ్,  అతనితో స్నేహం గుర్చే ఈ ఙ్జాపకం యావత్తూ.

వాళ్ళ ఇంట్లో అతన్ని అరుణ్ అని పిలుస్తారు కాని అతని పేరు కాలేజ్ రికార్డ్స్ లో గోపాల కృష్ణ అని ఉండేది. అతనిని మనం అరుణ్ అనే పిలుచుకుందాము. నాకన్నా ఇంచుమించు పది సంవత్సరాలు చిన్నవాడు అతను. కాని మేము చాలా సన్నిహిత మిత్రులము అయిపోయాము అతి త్వరలోనే.

అతను డిగ్రీ పూర్తి చేసి సీ.ఏ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. మరీ పొడుగు కాదు, మరీ పొట్టి కాదు. తెల్లగా, సన్నగా నూనుగు మీసాలతో,ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ చురుకుగా చైతన్యానికి మారుపేరులా ఉండేవాడు.

తమిళ వారి ప్రధాన లక్షణమైన సింప్లిసిటీ కి అతడు ప్రతిరూపంలా ఉండేవాడు.అతి సాధారణమైన దుస్తులు, ఇంట్లో ఉన్నప్పుడు తెల్ల బనియన్, అడ్డపంచెతో దర్శనం ఇచ్చేవాడు.

సర్వకాల సర్వావస్థలయందు నుదుటి మీద విభూతిని చెదరనిచ్చేవాడు కాదు. ఒక్కోసారి గంధం బొట్టుకూడా అదనపు ఆకర్షణగా నిలిచేది అతని నుదుటిపై.  ఆ రోజుల్లో చిన్మయా మిషన్ వారి కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనే వాడు.

 

-ఆ రోజుల్లో గూగుల్ ఇంకా పెద్ద ప్రాచుర్యంలోకి రాలేదు.  ఇంటర్ నెట్ వచ్చిన కొత్తలు. ఎమ్‍పీ త్రీ సీడీలు, ఫ్లాఫీ డ్రైవ్ లు స్టేటస్ సింబల్స్ గా చలామణి అవుతున్న కాలం అది.

-ఇంటర్ నెట్ ఎక్స్ ప్లోరర్ , యాహు రాజ్యం ఏలుతు ఉండేవి అప్పట్లో. జీ మెయిల్ ఇంకా పుట్టలేదు.

హాట్ మెయిల్, రెడిఫ్ మెయిల్ కూడా బాగా వ్యాప్తిలో ఉండేవి.

అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్లు విరివిగా వెలుస్తుండేవి. ఆ రోజుల్లో నే నాకు ఎందుకో ఒక ఇంటర్ నెట్ సెంటర్ పెట్టాలనే కోరిక కలిగింది. చివరికి పెట్టాను కూడా, ఆ ముచ్చట్లు మళ్ళీ ఇంకో సారి చెప్పుకుందాం.

డిష్నెట్ డీ.ఏస్.ఎల్ అని, వీ ఎస్ ఎన్ ఎల్ అని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉండేవారు ఆ రోజుల్లో.

-బీపిఎల్ నెట్ వర్క్ వారు సెల్ ఫోన్లు అప్పుడప్పుడే కోయంబత్తూరు లో లాంచి చేస్తూ ఉన్న రోజులు అవి. ఎయిర్ సెల్ అనే కంపెనీ చాలా హడావుడి చేసేది ఆ రోజుల్ల్

-అనకొండ, గాడ్జిల్లా, జూరాసిక్ పార్క్, టైటానిక్ లాంటి ఇంగ్లీష్ సినిమాలు పెద్ద దుమారం లేపుతూ ఆడుతూ ఉన్న రోజులు.

 

కంప్యూటర్ రంగంలో విశేషమైన సాధన చేసే వాడు అప్పట్లోనే మన అరుణ్. తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో సాధికారికంగా మాట్లాడగలిగే వాడు.

ఈ కుర్రాడికి తెలియని విషయం లేదేమో అన్నట్టు ప్రపంచంలోని అన్ని విషయాల గూర్చి చాలా సుధీర్ఘంగా మాట్లాడగలిగే వాడు. అతనికి అంత చిన్న వయస్సులోనే చాలా విషయాల పట్ల చాలా నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. చాలా మంది తమిళ వారిలాగా హిందినీ ద్వేషించేవాడు కాదు.

 

****

అప్పట్లో మా ఆవిడ తొలి కాన్పుకై పుట్టినింటికి హిందూపురంకెళ్ళిన రోజులు.

అప్పట్లో నాది మార్కెటింగ్ జాబ్ అని మీకు తెలుసు కద. కొన్ని రోజులు వరుసగా కోయంబత్తూర్ లొ పని చేసుకుంటూ ఉండేవాడిని. మరి కొన్ని రోజులు టూర్ల మీద తిరిగే వాడిని.

నేను లోకల్ డ్యూటి ఉన్న రోజుల్లో ఇంటికి  వచ్చే సరికి రాత్రి ఏ తొమ్మిదిన్నరో పదో అయ్యేది. ఆ కుర్రాడు విధిగా నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే వాడు నాతో కబుర్లు చెప్పటానికి.

మేమిద్దరం బాల్కనీ లో కుర్చీలు వేసుకునో, మెట్ల మీద కూర్చునో కబుర్లు చెప్పుకునే వారం.

సత్సాంగత్యం, సత్సంగం అంటే అదే అని చెప్పవచ్చు.

మా మధ్య ప్రస్తావనకి రాని అంశాలు అంటూ ఉండవు. ఏవేవో అంశాలు మాట్లాడుకునే వారం. మా ఇద్దరికీ కామన్ అభిరుచులు బోలేడు ఉండేవి.

మేమిద్దరం శాకాహారులం. మా ఇద్దరికీ ఏ దురలవాట్లు లేవు. ధూమపానం కాదు కద, అతను కనీసం వెల్లుల్లీని కూడా దగ్గరకి రానిచ్చేవాడు కాదు. ఇలా మా ఇద్దరిమధ్య చాలా అలవాట్లు కలిసేవి.

 

-దేశభక్తి

-సంగీతం

-ఆటోమొబైల్స్

-సినిమాలు

-టెక్నాలజీ

-సాహిత్యం

-సనాతన ధర్మం

-ఆధ్యాత్మికత

ఇలా చాలా విషయాల్లో మా అభిరుచులు కలిసేవి. మా టాపిక్స్ ఎక్కడేక్కడ తిరిగినా తిరిగి ఈ పై కేటగిరిలోకి వచ్చి చేరేవి.

నేను అప్పటికే కాలేజి లైప్ ముగించి వృత్తిలోకి ప్రవేశించి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది. అతనితో మాట్లాడటం వల్ల యువత మనోభిప్రాయాలు, సమాజంలో  వస్తున్న మార్పులు తెలుసుకోవటానికి వీలయ్యేది.

అతనికి తెలుగు అంటే ఇష్టం ఏర్పడింది నా సాంగత్యం వల్ల.

నాకు అతనితో మాట్లాడుతూ ఉండటం వల్ల తమిళ్ మీద , ఇంగ్లీష్ మీద గ్రిప్ రాసాగింది. ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి సెంట్రల్ సిలబస్ లో చదవటం వల్లనుకుంటాను, ఇంగ్లీష్లో అనర్ఘళంగా మాట్లాడగలిగేవాడు. అతనితో మాట్లాడుతు ఉంటే నాకు ఇంగ్లీష్ ఫ్లుయెన్సీ పెరిగి నా మీద నాకు నమ్మకం పెరగుతుండేది.

నెను అప్పట్లో అందరిలా ’ది హిందూ’ దినపత్రికని తెప్పించే వాడిని. ఉదయాన్నె,పేపర్ కుర్రాడి దగ్గరనుంచే లాఘవంగా పేపర్ ని ఒడిసి పట్టుకుని ఆసాంతం చదివేసి ’వివేక్ జీ, ఇదిగోండి పేపర్’ అని తెచ్చిచ్చి నేను చేసిన కాఫీ త్రాగి వెళ్ళేవాడు. అలా ఉదయాన్నే ఒక అరగంట, గంట మాట్లాడుకునే వారం.

అతనితో కలిసి బోలేడు సినిమాలు కూడా చూశాను ఆ రోజుల్లో.

 

వచ్చే భాగంలో సద్గురు జగ్గీవాసుదేవ్ సత్సంగ సభలకు వెళ్ళిన ఙ్జాపకాలు (అప్పటికింకా ఆయన పెద్ద ఖ్యాతిలోకి రాలేదు. చిన్నచిన్న గవర్నమెంట్ హైస్కూల్ కాంపౌండ్స్ లో సత్సంగం నిర్వహించేవారు), చిన్మాయా మిషన్ గురువు గారి వాగ్ధాటి, అతని ప్రేమ కథ, నాతోటి అతని మంత్రాలయం ప్రయాణం, అమరమ్మ అవ్వ దర్శనం, హైదరాబాద్ యాత్ర ఇలా బోలేడు విశేషాలు చెప్పుకుందాము.

 

 

 

No comments:

Post a Comment