Monday, May 23, 2022

పుళు (మలయాళ చిత్రం)


 

పుళు (మలయాళ చిత్రం)

మమ్ముట్టి నటనా జీవితంలో మరో మైలు రాయి.

సోనీ లైవ్ ఓటీటీ లో లభ్యం - 115 నిమిషాలు.

****

ఈ చలన చిత్రం తెలుగులో ’పురు’ అనే పేరుతో శబ్దానువాదం చేయబడింది. ’పురు’ అంటే ఏమిటో మనకు తెలియదు. దర్శకుడికైనా తెలుసో లేదో మనకు తెలియదు.

మలయాళంలో ’పుళు’ అంటే ’పురుగు’ అని అర్థం.

 

ఈ చలన చిత్రాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదించాలి అంటే ఈ కింది రెండింటిలో ఒక వర్గానికి చెందిన వారయి ఉండాలి. అప్పుడే ఈ చలన చిత్రాన్ని మీరు పూర్తిగా ఇష్టపడతారు.

ఒకటవ వర్గం: సినిమాని సినిమాగా చూస్తున్నాం అని అనుకునే మంచివారు

రెండవ వర్గం: అభ్యుదయవాదులుగా చలామణి అవుతున్న బ్రాహ్మణద్వేషులు

 

మీరు మొదటి వర్గానికి చెందిన వారయితే, ఒక చిన్న హెచ్చరిక.

ఈ చలన చిత్ర దర్శకులు మిమ్మల్ని నెమ్మదిగా రెండో వర్గములోకి మార్చేదానికి ఈ చిత్రాన్ని ఒక ఆయుధంగా ఎన్నుకున్నాడు అని తెలుసుకోవాలి అలాగన్చెప్పి ఎక్కడా బ్రాహ్మణులను నేరుగా కించపరచలేదు ఆయన. చిత్రాన్ని చివరిదాక చూస్తే, చిత్రంలోని ప్రతి పాత్రని మలచిన తీరు సనాతనవాదులని పరమ దుర్మార్గులుగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకునేవారిగా చూపించారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని తుంగల్లో తొక్కేవారిని, బ్రాహ్మణ్యాన్ని, దేవతలని కించపరిచేవారిని అతి ఉత్తములుగా చిత్రీకరించటంలో దర్శకులు ఎటువంటి సంకోచం చూపలేదన్నది స్పష్టమవుతుంది.

 

మీరు రెండో వర్గానికి చెందిన వారయితే చింతే లేదు. హాయిగా ఈ సినిమా చూసేయవచ్చు.

****

ఇది నిస్సందేహంగా ఒక చక్కటి చలన చిత్రం. కథ ఆద్యంతం నత్త నడక నడిచినా, ఎక్కడా బోర్ కొట్టకుండా తీయగలిగారు. కథ ఎటుదారి తీస్తోందో ఎంతకీ అర్థం కాదు. ఆ తరువాత ఒక్క సారిగా షాక్ మీద షాక్ తగులుతుంది మనకు. 

మొదట స్థూలంగా ఈ చలన చిత్రం కథ చెప్పుకుందాం.

కథ ఏమిటి అంటే:

కుట్టన్ (మమ్ముట్టీ) ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయన రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆఫీసర్ అని మనకు అర్థం అవుతు ఉంటుంది. ఆయన భార్య చనిపోయుంటుంది. కానీ ఆవిడ ఎక్కడా కనిపించదు కథలో. మామూలు ఫార్ములా చిత్రాలలో లాగా గోడకి ఫోటో వేసి, దండ వేసే విధంగా కూడా ఏమి ఉండదు. పాత్రల సంభాషణలని బట్టి అర్థం చెసుకోగలం మనం.

ఈయన చాలా ఖరీదైన బంగళాలో అతి సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవితం జీవిస్తుంటాడు.

ఆయనకి హైస్కూల్ కి వెళ్ళే వయసున్న కొడుకు ఉంటాడు. వాడి పేరు రిషికేష్ / కిచ్చు (వాసుదేవ్ సాజిష్). ఈ కుర్రాడిని మమ్ముట్టి అత్యంత క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అలాగన్చెప్పి కొట్టడు, తిట్టడు. కేవలం కనుసైగతో ఆ కుర్రాడిని శాశిస్తుంటాడు. వాడి బాగు కోసం తాను మరో పెళ్ళి చేసుకోకుండా, వాడిని చాలా చక్కగా పెంచుకుంటున్నాను అని అనుకుంటాడే కానీ , వాడికి తల్లి ప్రేమ లేదు, ఇటు ఈయన క్రమ శిక్షణ కారణంగా తండ్రితో ప్రేమగా దగ్గర అవలేకపోతుంటాడు. వాడికి స్వేఛ్ఛ మృగ్యం. ఆయన తన పోలీస్ శిక్షణ తాలూకు అనుభవాన్నంతా రంగరించి ఆ కుర్రాడిని క్రమశిక్షణతో పెంచుకుంటున్నానని అనుకుంటుంటాడు కానీ వాడికి మానసికంగా దూరం అవుతున్నాను అని తెలుసుకోడు.

ఆయన క్రమ శిక్షణ ఎలాగుంటుందంటే, ఆయన బయటనుంచి రాగానే, ఈ కుర్రాడు చదువుకుంటూ కనిపించాలి. డస్ట్ బిన్ వద్ద ఏదయినా చిన్న చిత్తు కాగితం కనిపిస్తే, ఆయన గంభీరంగా ఒక సారి గొంతు సవరించుకుంటాడు.

కార్ ఎక్కి కూర్చోగానే తను సీట్ బెల్ట్ తగిలించుకుని, ఈ కుర్రాడి వంక సాభిప్రాయంగా చూస్తాడు. అంతే, వాడు కిక్కురుమనకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

ప్రతి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకునేటప్పుటు, నిలువుగా ఎన్ని సార్లు, అడ్డంగా ఎన్ని సార్లు బ్రష్ చేసుకోవాలో ఆయన ఒక సారి చెబుతాడు గంభీరంగా.

ఆ కుర్రాడు ఏమీ చేయలేక తరచు తండ్రిని పొడిచి చంపేసినట్టు ఊహించుకుని తృప్తి పడుతుంటాడు (??), ప్రతి రాత్రి పడుకునే ముందు.

ఈ మమ్ముట్టి గారికి భారతి (పార్వతి తిరువోతు) అని  ఓ చెల్లెలు ఉంటుంది. ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి, తనకంటే పెద్ద వాడైన ఒక నాటక కళాకారుడు కుట్టప్పన్ (అప్పుణ్ణీ శశి)తో సహజీవనం చేస్తుంటుంది. ఈ పెద్ద మనిషి ఒక దళితుడు. అతనికి ఇది వరకే పెళ్ళీ అయిఉంటుంది. మరి ఆవిడని ఈయన వదిలేశాడా, ఆవిడ ఈయన్ని వదిలేసిందా తెలియదు, కానీ ఈయన గారు శంబూక వధ, తదితర నాటకాలు, అభ్యుదయనాటకాల పేరిట హిందూ ధర్మాన్ని కించపరిచే నాటకాలు, బ్రాహ్మణ వాదాన్ని విమర్శిస్తూ కవితలు గట్రా వ్రాస్తూ బోలెడు అవార్డులు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈయన్ని ఆకాశానికెత్తేసే పత్రికలు, మీడియా హవుసులకూ కొదవలేదు. ఏతావాతా ఆయన పెద్ద సెలబ్రిటీగా చెలామణి అవుతుంటాడు.

వీరు మమ్ముట్టి ఉండే ఊరికే వచ్చి సహజీవన కాపురంపెట్టాలనుకుంటారు. ఇంటి యజమానులు, వీరిద్దరి మధ్య వయోబేధాన్ని గమనించి, మేరేజ్ సర్టిఫికెట్ చూపించండి అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దశలో వీరు, ఒక మిత్రుడి సాయంతో, మమ్ముట్టి నివసించే అపార్ట్‌మెంట్ లోనే ఇంకో ఫ్లాట్ లోకి వచ్చి స్థిరపడతారు. మమ్ముట్టి వారి ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఆ అమ్మాయి తరచు వచ్చి మేనల్లుడిని (కిచ్చు) తమింటికి తీస్కు వెళ్ళటం, వాడికి రకరకాల కథలు చెప్పటం , వాడికి ఇష్టమైన తిండి పదార్థాలు వండిపెట్టడం చేస్తూ ఉంటుంది. తన భర్త నటించే నాటకాలకి కూడా తరచు తిస్కువెళుతుంటుంది.  సహజంగానే మమ్ముట్టికి ఇవన్నీ నచ్చవు. కానీ ఏమీ అనడు. దిగమింగుకుని జీవిస్తుంటాడు.

ఇదిలా ఉండగా, ఇంకో పారలెల్ కథ నడుస్తూ ఉంటుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మమ్ముట్టి మీద తరచు హత్యా యత్నాలు జరుపుతూ ఉంటారు. ఇది ఒక ఉపకథ. తన చెల్లెల్ని, బావగారిని, చివరికి స్వంత టీనేజి కొడుకుని కూడా అనుమానిస్తాడు మమ్ముట్టి.

చివరకు కథ ఎలా అంతమైంది అనేది తెలుసుకోవాలంటె, మీరు "పుళు" చూడాల్సిందే. మీ మనోభావాలు గాయపడితే నాది బాధ్యత కాదు.

****

ఇక ఈ సినిమా లో ముఖ్యమైన కొన్ని ముఖ్యాంశాలు.

* తన కెరియర్ లో అన్ని రకాల పాత్రలను పోషించిన మమ్ముట్టి ఈ చలన చిత్రంలొ విలనీ షేడ్స్ ఉన్న పాత్ర బహు సునాయాసంగా పోషించాడు.  మన తెలుగులో ’స్వాతి కిరణం’ లో ఆయన ఇలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది.

* మమ్ముట్టి నటన అద్భుతం. పెదవి విరుపుతోనూ, కను రెప్పలు కదిలించటం ద్వారానూ, ముఖం చిట్లించుకోవడం ద్వారానూ ఆయన తన ఏహ్యతని చూపిన విధానం అద్భుతం.

* కొడుకుతో అతను అనే మాటలు విని మమ్ముట్టి పాత్ర మిద జాలి కలుగుతుంది. "నేను నిన్ను ఎంత ప్రేమగా చూస్కుంటున్నాను, మీ తాత నన్ను కొట్టినట్టు ఏనాడైనా నిన్ను కొట్టానా?, నీ మంచి కోసమే కద నేను తపన పడుతున్నది’ అంటాడు. కాకపోతే,  ఆయనకి పోలీస్ డిపార్ట్‌మెంట్ తాలుకు కాఠిన్యం అలవాటయిపోయి ఇంట్లోని సభ్యుల పట్ల ప్రేమ ఎలా చూపాలో కూడా తెలియని విధంగా తయారయి పోయాడు అన్న కోణం భలే చూపించారు.

* ఏడు పదుల వయస్సులో కూడా ముఫై ఏళ్ళ కుర్రాడిలా ఉండగలగడం ఆయనకే చెల్లింది. యువకుడిలా కనిపిస్తున్న ఆయన్ని అలా ఆరోగ్యంగా, అందంగా చూస్తుంటే, ఒకటి గుర్తు వచ్చింది. స్వాతి కిరణం సినిమాలో ఆయన చెప్పిన డైలాగే ఆయనతో చెప్పాలనిపిస్తుంది "ఏమి వరం పొంది వచ్చావు నివ్వు? అమృతం త్రాగి వచ్చావా?" అనే అర్థం లో డైలాగు చెప్తాడు ఆయన మాష్టర్ మంజునాథ్ తో.

* చివరి పదిహేను నిమిషాలు ఊపిరి బిగపట్టి చూడాల్సిందే సినిమాని. మన కళ్ళని మనమే నమ్మలేము. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ఎవ్వర్నీ తప్పుపట్టాలనిపించదు. 

* అబ్బ మమ్ముట్టి ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కూడా చేయగలడా అనిపిస్తుంది.

* ఈ సినిమా చూసిన గంట వరకు ఈ సినిమా తాలూకు ఆలోచనలే. ఆ దిగ్భ్రమ అంత తేలిగ్గా వదలదు ప్రేక్షకులను.

***

మమ్ముట్టి చర్యలని సమర్థించటానికి ఎవరికైనా బోలేడు కారణాలు కనిపిస్తాయి ఈ చిత్రంలో.

సంప్రదాయ వాది ఆయన. ఆయన చెల్లెలు, ఆయన్ని కాదని ఇంట్లోంచి వెళ్ళీపోయి తనకన్నా వయసులో పెద్దవాడైన వ్యక్తితో పెళ్ళికూడా చేసుకోకుండా సహజీవనం చేస్తు, తన అలవాట్లకి భిన్నంగా ఆహారాన్ని వండి, వడ్డిస్తూ, తానూ తింటూ , ఇలాంటి జీవితం మమ్ముట్టి ఎదురుగా  గడుపుతూ ఉంటే, మమ్ముట్టి కోణంలో ఒక సారి ఆలోచించండి, ఆయనకి ఎంత ఆక్రోశం కలుగుతుందో

ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. అది వారి వ్యక్తిగత అభిరుచి. అలాంటి వ్యక్తి తన పిల్లల్ని తన అభిరుచులకి అనుగుణంగా పెంచుకోవచ్చు, అది ఆయన వ్యక్తిగత స్వేఛ్ఛ.

అభ్యుదయవాది అయిన మేనత్త, క్రమ శిక్షణలో పెరుగుతున్న టీనేజి కుర్రాడిని, మందు, మాంసం తో కూడిన పార్టీకి తీస్కువెళితే, ఆ కుర్రాడి తండ్రి మనసు ఎలా తల్లడిల్లి పోతుంది , ఒక సారి మమ్ముట్టి కోణంలో ఆలోచించండి.

***

’నీ స్వేచ్చ ఎంత వరకు? నా స్వేఛ్చకి అడ్డు తగలనంత వరకే’, అలాంటిది, నువ్వు నా జీవితంలోకి చొచ్చుకువచ్చి, నా నమ్మకాలని, నా సంప్రదాయాలని, నా మనో భావాలని కించపరిస్తే నేనేం చేయాలి? నేను నీకు అడ్డు రాలేదు. నీవే ప్రతి అడుగులో నాకు అడ్డు వస్తున్నావు. నన్ను ధిక్కరిస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు. నన్ను ఏం చేయమంటావు?’ ఈ మాటలు ఏవీ మమ్ముట్టి అనడు.

ఆయన పాత్రని చిత్రీకరించిన విధానంలో దర్శకులు మనకు ఎన్నో కోణాలని ఆవిష్కరిస్తారు ఆ పాత్రలో. ఆయన విచిత్రమైన పరిస్థితులలో అడకత్తెరలో పోక చెక్కలాగా చిక్కుకుపోతాడు. ఆయన పరిస్థితులకి లొంగి పోతాడు.

ఇలాంటి సంఘర్షణే రాంగోపాల్ వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర, మిర్యాలగూడా లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తీసిన ’మర్డర్’ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలో చూపిస్తాడు. కానీ ఈ ’పుళు’ లో ఎంతో సున్నితంగా భావ సంఘర్షణలు చూపారు.

మళ్ళీ మమ్ముట్టి పాత్ర గూర్చి.

ఈ చలన చిత్రంలో,

అసలే ఆయన సంప్రదాయవాది.

అసలే ఆయన అహంకారి.

అసలే ఆయనకి రాజసం ఎక్కువ.

అసలే ఆయనకి అధికారం వల్ల వచ్చిన మత్తు ఇంకా దిగలేదు.

అసలే ఆయనకి క్రమశిక్షణ ఎక్కువ

డబ్బుకి కొదవలేదు ఆయనకి.

ఉదాత్తుడైన ఆయన , కొడుకు కోసం త్యాగం చేసి, రెండో పెళ్ళి చేసుకోలేదు. ఇలా రూపు దిద్దారు ఆ పాత్రని.

’ఎందుకు నాలా అందరూ ఉదాత్తంగా ఉండరు?’

ఎందుకు నాలాగా అందరూ సంప్రదాయబద్దంగా ఉండరు?’

ఎందుకు నాలా అందరూ విలువలతో కూడిన జీవితాన్ని జీవించరు?’

ఎందుకు అందరూ క్రమశిక్షణని ఉల్లఘించి జీవిస్తూ ఉంటారు?’

ఈ మాటలు ఆయన ఎక్కడా బయటకి చెప్పడు. కానీ ఆయన నటన ద్వారా తెలుపుతూ ఉంటాడు.

ఒక సందర్భంలో ఆయన తన చెల్లి ఇంటికి విందుకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయన పక్కనే కూర్చున్న అతిథులు (వామపక్ష వాదులు) ప్లేట్లలో మాంసాహారం భుజిస్తూ ’ఆయన వంక చూస్తూ”మీకు ఓకే కద’ అంటారు. అప్పుడు ఆయన నటన చూడాలి.

ఆ తర్వాత ఆయన వాష్ బేసిన్ వద్ద చేతులు, మొహం కడుక్కుని పుక్కిలించి అక్కడ ఉన్న టవల్ ని యధాలాపంగా అందుకుని, ఉత్తర క్షణమే దాన్ని అక్కడ పారేసిన వైనం మన కండ్లారా చూడాల్సిందే.

నటన అంటే ఇలాంటి చిన్నచిన్న హావభావాలే కద. మన బాలయ్యకి చూపించాలి ఈ సినిమాని ఈ విషయంగా అని అనిపించింది.

 

మమ్ముట్టి పాత్రని మలచిన తీరు అద్భుతం. ఒక కొత్త దర్శకుడు తన మొదటి ప్రయత్నంలో ఇలాంటి చిత్రం తీశాడు అంటే అది నిజంగా ఒక గొప్ప విషయం.

మమ్ముట్టికి నూటికి వెయ్యి మార్కులు వేయవచ్చు ఈ పాత్ర పోషణకి.

ఒక సందర్భంలో తన బావగారిని లిఫ్ట్ లోకలుస్తాడు మమ్ముట్టి. ఆ సందర్భంగా ఆయన మాట తూలి చెల్లెలి మొగుడి కులాన్ని వారి  పూర్వీకుల కులవృత్తి ని ప్రస్తావిస్తూ కించపరుస్తాడు.

ఈ సీన్ తీయటం వెనుక దర్శకుడి ఉద్దేశాలు సుస్పష్టం. ఏ బ్రాహ్మణుడు ఇప్పటి సమాజంలో అలా మాట్లాడడు. కానీ ఈ దర్శకుడి టార్గెట్ బ్రాహ్మణద్వేషాన్ని రగల్చటమే కద.

 

***

ఈ చిత్రం  షూటింగ్ 2021 లో ప్రారంభం అయింది. నేరుగా థియేటర్లలో విడుదల చేద్దామనుకుని కూడా  చివరి నిమిషంలో వారు మే 12 , 2022 న సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‍ఫాం పై విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హింది, కన్నడ లోకి కూడా శబ్దానువాదం చేశారు. ప్రధానంగా ఇది మలయాళ చిత్రం.

***

పాత్రలు పాత్రధారులు:

కుట్టన్ - మమ్ముట్టి

భారతి - పార్వతి తిరువోతు

కుట్టప్పన్ - అప్పుణ్ణీ శశి

వాసుదేవ్ సాజిష్ - కిచ్చు

మోహన్ - నెడుమూడి వేణు

****

సాంకేతిక బృందం:

దర్శకత్వం - రతీన (తొలి ప్రయత్నం)

రచన - హర్షద్

నిర్మాత- ఎస్ జార్జ్

ఫోటోగ్రఫీ -తేనీ ఈశ్వర్

సంగీతం-జేక్స్ బిజోయ్

 

 

 

 

 

 


Tuesday, May 17, 2022

 


హృదయాల్ని పిండేసే

దొంగాట

ఆహా ఓటీటీ ప్లాట్‍ఫాం లో తెలుగులో లభ్యం

=================================================

"అమ్మా! దొంగ అంటే ఎట్లుంటాడమ్మా? నేను దొంగను ఎప్పుడు చూడలేదు" దాదాపు ప్రతి పిల్లాడు తన చిన్న తనంలో ఈ ప్రశ్నని తప్పకుండా తన తల్లిని అడిగే ఉంటాడు.

ఈ చిత్రంలో దొంగ పాత్రలో నటించిన/జీవించిన ఫహద్ ఫాజిల్‍ని చూపించవచ్చు ప్రతి చిన్నపిల్లాడికి. అప్పుడు ఆ చిన్న పిల్లాడికి దొంగ అంటే సానుభూతి, జాలి కలుగుతాయి.  దొంగలగూర్చి మానవత్వంతో ఆలోచించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది ఓ క్షణం.

****

ఒక మంచి చలన చిత్రాన్ని చూసినతర్వాత నాలుగుముక్కలు వ్రాయకుండా ఉండలేని బలహీనత నాది. ’దొంగాట’ ఒక మంచి చలన చిత్రం. కుటుంబ సమేతంగా అందరూ చూడదగ్గ చిత్రం.

కథేమీ లేకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆకట్టుకునే కథనం, హృదయాన్ని ద్రవింపజేసే ఆర్ద్రమైన దృశ్యాలు, చివరి వరకు వచ్చాక ఆలోచింపజేసే విధంగా తీసిన విధానం ఇవన్నీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.

రెండే రెండు వాక్యాలలో వ్రాయదగ్గ కథ ఇది. అసలీ కథతో ఇంతలా ఆకట్టుకునేలా చిత్రాన్ని తీయటానికి సాధ్యమా అని ఆశ్చర్యం కలుగక మానదు.

ఇంతకీ కథేంటంటే:

ఒక యువజంట (శ్రీజ, ప్రసాద్) ఉంటుంది.

మొదట చిన్న అపార్థంతో మొదలైన పరిచయం, వారిద్దరి మధ్యా ఓ చిన్నపాటి గొడవకి దారి తీసినా చివరికి ఇద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని ప్రేమలో కూరుకుపోతారు. ఇద్దరూ పారిపోయి వేరే ఊర్లో స్థిరపడతారు. ఆర్థిక కష్టాలనుండి బయటపడి జీవితంలో స్థిరపడటానికి, ఆ కుర్రాడు తమ వ్యవసాయ క్షేత్రంలో బోర్ వెల్ వేసి పంటలు పండించుకుందాం అని అనుకుంటాడు. ఆ బోర్‍వెల్ వేయాటానికి అవసరమైన డబ్బుల కోసం ఆ అమ్మాయి తన రెండు తులాల తాళి బొట్టు గొలుసుని అమ్మి అతనికి  సాయపడటానికి సిద్ధపడుతుంది. ఆ పరంపరలో వాళ్ళు దగ్గరలో ఉండే ఊరికి బస్సులో ప్రయాణం అవుతారు.

ఇక్కడ కథ కీలక మలుపుతిరుగుతుంది.

ఆ బస్సులో ప్రయాణం చేస్తున్న చిల్లరదొంగ, ఈ అమ్మాయి  వెనుక సీట్లో కూర్చుంటాడు. ఆమె నిద్రపోగానే లాఘవంగా గొలుసు కత్తిరించి జేబులో వేసుకోబోతాడు. బస్సు కుదుపులకి ఈ అమ్మాయికి మెలకువ వచ్చి వాడి హస్తలాఘవాన్ని పసిగట్టి ’దొంగ దొంగ’ అని అరవబోయేలోగా వాడు మెరుపువేగంతో అ అమ్మాయి చూస్తుండగానే ఆ గొలుసుని మింగేస్తాడు. సాక్ష్యం ఎవ్వరూ లేరు, ఎవరి పనిలో వారు ఉంటారు. ఈమె ఒక్కటే సాక్ష్యం.

ఆ తరువాత రక్షకభటులకి ఫిర్యాదు చేయటం, వారు  తమదైన బాణిలో వాడ్ని విచారించటం ఇత్యాది సంఘటనలు వరుసగా జరిగిపోతాయి.

చివరికి ఏమైంది అన్నది చిత్రాన్ని చూసి తెలుసుకోవలసిందే.

ఇంతే కథ.

అసలు ఇలాంటి ఓ అప్రాముఖ్యమైన చిన్న కథతో హృదయాల్ని పిండేసే చిత్రాన్ని తీయవచ్చు అన్న ఆలోచన వచ్చిన దర్శకుడు అభినందనీయుడు.

****

మా చిన్న తనంలో మా అమ్మ  ఓ వెండి చెంబు చూపించి ఓ సంగతి చెబుతూ ఉండేది.  అలా చెప్పేటప్పుడు అప్రయత్నంగా తను కంట తడిపెట్టేసేది. నేనింకా పుట్టక ముందు, ఆ వెండి చెంబుని ఓ దొంగ దొంగిలించాడాట. కాని వాడి ఆచూకి కనుగొని రక్షకభటులు నాలుగు తగిలించి మా వాళ్ళకి అప్పజెప్పారట. కానీ ఆ దొంగని కొట్టిన వైనాన్ని తలచుకుని మా అమ్మగారు కంటతడిపెట్టే వారు. ఇదిగో ఈ చలన చిత్రంలో కూడా మీకు ఇలాంటి దృశ్యం కనిపిస్తుంది.

***

ఇది ’తొండముదిలుమ్ ద్రిక్సాక్షియుం’ అనే మలయాళ చిత్రానికి శబ్దానువాదం చేయబడ్డ చలన చిత్రం. 2017 లో మలయాళం లో విడుదల అయిన ఈ చిత్రానికి అనేక జాతీయ పురస్కారాలు లభించాయి.

మహేషింట ప్రతీకారం అనే చిత్రాన్ని తీసిన దర్శకుడి రెండవ చిత్రం ఇది. ఇందులో కూడా అదే బాణిలో భావొద్వేగాలకి పెద్ద పీట వేశారు.

***

ఈ చిత్రంలో నాకు కనిపించిన ప్రత్యేకతలు చెబుతాను.

ఏదైనా చిన్న ఊరికెళ్ళి ఒక ఇంటికిటికీ తలుపు తీసి బయటకి చూస్తే ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో అలాంటి వాతావరణం చక్కగా చూపించారు దర్శకుడు. సినిమా చూస్తున్నాము అనే భావనకంటే నిజ జీవిత వాతావరణాన్ని చూస్తున్నాము అనే భావనే కలుగుతుంది ఆద్యంతం.

భారీ మేకప్పులు, భారీ శబ్దముతో కూడిన సంగీతం, పంచ్ డైలాగులు, హీరో ఇమేజిని ఎలివేట్ చేసే దృశ్యాలు ఇవేవి లేకుండా హాయిగా నిజ జీవితాన్ని ఒడిసి పట్టి చూపించినట్టు ఉంది.

మానవత్వం, కరుణ ఈ రెండు భావాలు ఈ సినిమాని ఆద్యంతం నడిపిస్తాయి. ఎవ్వరూ చెడ్డవారు కాదు, ఎవ్వరూ మంచి వారు కాదు. పరిస్తితులు మనల్ని నడిపిస్తాయి. ఈ భావన కలుగుతుంది మనకు చివరకి.

ఇంతకు మించి ఏ మాత్రం చెప్పినా మీకు సస్పెన్స్ విడదీసి చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి ఇంకేమి చెప్పను.

***

* పారిపోతున్న దొంగని వెంటాడే సందర్భంగా నిరాయుధుడైన ప్రసాద్ (భర్త) దొంగని ఒక నీటి కాలువలో ముఖాముఖి ఎదుర్కొంటాడు. అతనికి ప్రాణభయం లేదు, అలాగన్చెప్పి దొంగకి హాని తలబెట్టే ఉద్దేశం కూడా లేదు. కేవలం తన నగని తిరిగి తెచ్చుకోవాలనే తపనే అతనిది. పారిపోవాలనే ప్రయత్నమే తప్ప, ప్రసాద్‍కి హాని తలపెట్టే ఉద్దేశం లేదు దొంగకి.

’మీకు భయం వేయదా’ అని  రమణ మహర్షిని ఎవరో అడిగితే, అనన్య భావన ఉంటే ఎవ్వరికీ భయం కల్గదు అని చెప్తారు. ఆ  సంగతి అసంకల్పితంగా గుర్తొచ్చింది ఈ దృశ్యంలో.

దొంగని వెనుకపాటుగా వాటేసుకుని పారిపోకుండా ప్రసాద్ పట్టుకున్నప్పుడు, వారిద్దరి ముఖాలలో భావాలని వర్ణించటానికి మాటలు చాలవు.

పట్టుకున్న పెద్ద బండ రాయిని జారవిడిచేస్తాడు దొంగ ఆ క్షణంలో. ఫాజిల్ కేవలం దొంగతనం చేస్తాడే కానీ ప్రసాద్‍కి హాని చేయాలని ప్రయత్నం చేయడు. పారిపోవాలని చూస్తాడు, ఆ సమయంలో అడ్డుపడ్డ ప్రసాద్ ని వదిలించుకోవాలని చూస్తాడు కానీ గాయపరచాలని అనుకోడు.

ఇక చిక్కక తప్పదు అనుకున్నప్పుడు కూడా భావ రహితంగా ఉండిపోతాడు.

* ప్రసాద్ కూడా అతన్ని పట్టుకోవాలనే చూస్తాడు తప్పనిచ్చి, గాయపర్చాలని గానీ, కొట్టాలని గానీ చూడడు. ’నా గొలుసు నాకివ్వరా’ అని అర్థిస్తాడు. ఆ దృశ్యం చూసేటప్పుడు మనకు కన్నీరు వస్తుంది

* ఇది చిన్న కేసే కద అని పోలీసులు తేలిగ్గా చూడరు. వాళ్ళ శాయశక్తులా వారు ప్రయత్నించిన విధానం అబ్బురపరుస్తుంది. ఎక్స్ రే తీయిస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే వాడు టాయిలెట్ కి వెళ్ళినప్పుడు గొలుసు బయటకి వచ్చిందేమో అని చూస్తారు. కొద్దిపాటి పోలీసు హింస ఉంది. ఆ సమయంలో దొంగ మీద జాలి కలుగుతుంది మనకు.

* వాడు బాధగా కేకలు పెట్టే దృశ్యాల సందర్భంగా భార్యాభర్తలు ’మేము కేసు వెనక్కు తీస్కుంటాం, వాడ్ని వదిలేయండి’ అనేస్తారు.

* నాక్కూడా మీలా గౌరవంగా బ్రతకాలని ఉంటుంది అని దొంగ అన్నప్పుడు మనకు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అవుతుంది.

* దొంగ పాత్రలో అనేక షేడ్స్ కనిపిస్తాయి. చిలిపిదనం, శాడిజం, హస్తలాఘవం, దయనీయమైన చూపులు, బాధతో ఆక్రందనలు చేసే అరుపులు, యువజంటని చూసి కాస్త అసూయగా చూసి ’అరె నా జీవితం ఇలా లేదే’ అని బాధపడే చూపులు, ’నా జీవితం మీ చేతిలో ఉంది’ అని వేడుకునేటప్పుడు దైన్యం, ఎక్స్ రే లో గొలుసుకనిపించేదాకా బుకాయింపు ధోరణి, ఎక్స్ రే లో గొలుసు కనిపించగానే చిలిపిగా నవ్వుతూ ’నేను దొంగతనం చేశాను’ అని ఒప్పుకున్న విధానం ఇవి మామూలు నటుడు చేయలేడు, ఈ పాత్ర కోసమే ఫహద్ ఫాజిల్ పుట్టాడు అన్నట్టుగా నటించాడు. అందుకే అతనికి జాతీయ అవార్డ్ దక్కింది ఈ పాత్ర పోషణకి.

నిజాయితీగా చెబుతున్నాను. తెలుగులో ఒక వేళ్ రీమేక్ చేస్తే ఈ పాత్రకి ఎవరు సరిపోతారు అని ఆలోచిస్తే నాకు ఇద్దరి పేర్లు తట్టాయి.

ఇప్పుడు కాదు కానీ, వయసులో ఉన్నప్పటి రాజేంద్రప్రసాద్, ఇప్పటి నటుల్లో అయితే సత్యదేవ్ మాత్రమే ఈ పాత్రకి న్యాయం చేయగలరు అనిపించింది.

***

ఈ చిత్రం గూర్చి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. సాధారణంగా ఇటీవలి మలయాళ చిత్రాలలో ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే ప్రధాన పాత్రలుగా ఉంటూ,  ఆ తరహా వాతావరణాన్ని గ్లామరైజ్ చేసి చూపిస్తూ, కేరళ మొత్తంలో హిందూ సమాజం లుప్తం అయిపోయిందేమోఅన్నట్టు భ్రమ కలగజేస్తున్నారు.

తద్విరుద్ధంగా ఈ చిత్రంలో, పాత్రలన్నీ హిందూ మతానికి చెందినవి. చక్కగా శివపార్వతుల పటానికి శ్రీజ దీపం వెలిగించి హారతి ఇస్తుంది. గ్రామంలో జాతర జరుగుతూ ఉంటుంది. గుడి వాతావరణాన్ని, జాతర ఉత్సవాలని అద్భుతంగా నేపథ్యంలో చూపించారు. భగవాధ్వజం (కాషాయ జండాలు), కాషాయ తోరణాలు ఆద్యంతం గ్రామంలో కనిపిస్తు ఉంటాయి, బస్ స్టాప్ గోడలమీద ఏబీవీపీ, వీహెచ్ పీ, ఆరెస్సెస్ అనే గ్రాఫిటీలు కనిపిస్తాయి.

తాళి బొట్టు  తాలుకు ప్రాశస్త్యాన్ని పోలీసులు వివరిస్తూ ఉంటారు, సంభాషణలలో భాగంగా.

***

పాత్రలు - పాత్రధారులు

ప్రసాద్ (దొంగ)- ఫహాద్ ఫాజిల్

శ్రీజ-నిమిష సాజయన్

ప్రసాద్(అమ్మాయి భర్త)-సూరజ్ వెన్‍జార్‍మూడ్)

ఎస్ ఐ- సిబీ థామస్

కానిస్టేబులు-ఆలెన్చియర్ లే లోపెజ్

సాంకేతిక శాఖలు:

దర్శకత్వం - దిలీష్ పోతన్

తెర కథ - సాజీవ్ పళూర్

సంగీతం -బిజ్‍బాల్

 

 

 

"కంచి పరమాచార్య దర్శనం"

 "కంచి పరమాచార్య దర్శనం"

ఒక ఙ్జాపకం

****

"నిన్ను నీవు అన్ని విధాలుగా బలోపేతుడిని చేసుకో, ఆర్థికంగా, హోదా పరంగా, నైతికంగా నిన్ను బలోపేతుడిని చేసుకో. 

నీవు బలహీనంగా ఉంటే నలుగురికి ఎలా సాయపడగలవు?

బలమే జీవం - బలహీనత మరణం.

నీ ఇల్లే సరిగా లేకుంటే వేరొకరికి ఆశ్రయం ఎలా ఇవ్వగలవు?

నీవే బలహీనంగా ఉంటే వేరొకరికి ఎలా సాయం చేయగలవు?

టీచర్లను ప్రభుత్వాలు, పాఠశాలల యజమానులు నియమిస్తారు. అది సరే. నివ్వు కూడా టీచరే.  నిన్ను నీవు ఈ సమాజానికి టీచర్‍గా నియమించుకో. ఈ సమాజానికి మార్గదర్శనం చేయగలిగే గురు స్థానంలో ఉండు.

మంచి చెడు అనేవి సమాజంలో ఆది నుంచి ఉన్నాయి. నీవు ఒక సాక్షి స్థానంలో ఉండకు. మంచిని ప్రొత్సహించు, చెడుని ఖండించి మంచిని పెంపొందించు.

మానవ సమాజంలో ఒక వృత్తి ఎక్కువ అని కానీ, ఇంకొక వృత్తి తక్కువ అని కానీ లేదు. ప్రతి వృత్తి కూడా గౌరవప్రదమైనదే. వ్యక్తి యొక్క అవసరాలని తీర్చాగలిగిన అన్ని వృత్తుల వారూ ఈ సమాజానికి అత్యంత ఆవశ్యకమే కద."

ఈ మాటలని వింటూ మైమరచి పోయాను.

ఇటీవల కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి గారి అనుగ్రహ భాషణంలో దొరికిన కొన్ని ఆణిముత్యాలు ఇవి. ఈ సభలో పాల్గొనగలిగిన అదృష్టం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం.

ఆయన ఆశువుగా రెండు గంటలకు పైగానే మాట్లాడారు.

ఎదురుగా పేపర్ పెట్టుకుని మాట్లాడిన మాటలు కావవి. సమాజం పట్ల ప్రేమతో, మానవుల పట్ల అవ్యాజమైన దయతో వారు వెలిబుచ్చిన కరుణామయమైన పలుకులు అవి. 

వారి ప్రతి పలుకులో దయ, వదనం పై చెక్కుచెదరని చిరునవ్వు, ఆవేశ కావేషాలకు ఆమడదూరంలో ఉండే నిర్మలమైన స్వరం ఆ యోగికి పెట్టకనే పెట్టిన ఆభరణాలు.

"నిన్ను నీవు బాగుపరచుకోవడం స్వార్థం కాదు. నీవే బాగులేకుంటే నీవు నలుగురికి ఎలా ఉపయోగపడతావు. కాబట్టి ఇతర వ్యాపకాలన్నీ కట్టి పెట్టి రోజుకు కొంత సేపయినా నిన్ను నీవు బాగు పరచుకోవటానికి సమయం కేటాయించు.

ఈ వేళ్టి సమాజానికి కావల్సింది ఙ్జానం మరియు క్షాత్రం. నిన్ను నీవు ధృఢపరచుకో. బలహీనతలకు లొంగకు. నీ ధర్మాన్ని వీడకు. నీ జన్మ ఈ సమాజానికి ఉపయోగపడేలా తీర్చు దిద్దుకో"

డబ్బు సంపాయించటం గూర్చి నేను విశ్వసించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవే చెబుతుంటాను నా స్టూడెంట్స్‌తో కూడా

"మన మనసులలో డబ్బు సంపాయించడం అన్నది ఒక తప్పుడు పని అన్నట్టుగా ముద్ర పడింది. అదేమీ లేదు. డబ్బు సంపాయించాలి. వీలయినంత ఐశ్వర్యవంతుడిగా ఎదగాలి. అన్ని అనర్థాలకు పేదరికం కారణం. వీలయినంత డబ్బు సంపాదించాలి.

పనికి ప్రతిఫలాన్ని ఆశించటం తప్పు కాదు. కానీ డబ్బు కోసం పని చేయకండి. ఆత్మ తృప్తి కోసం పని చేయండి. చేసే పనిలో ఆత్మానందాన్ని అనుభవించండి. 

డబ్బు సంపాయించటానికి అడ్డదారులు తొక్కకండి. ధర్మ మార్గంలో, నైతికంగా, న్యాయబద్దంగా డబ్బు సంపాయించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైతే మంచి వాళ్ళు డబ్బు సంపాయించటం పట్ల విముఖంగా ఉంటారో ప్రపంచంలోని సంపదంతా చెడ్డవాళ్ళ చేతిలో చేరిపోతుంది. 

కాబట్టి మంచి వాళ్ళు విధిగా ఐశ్వర్యవంతులుగా ఎదగాలి. ఎప్పుడైతే సంపద మంచి వారి చేతిలో పడుతుందో, వారు తమ సంపదని మంచి పనులకూ, నలుగురి సంక్షేమానికి  వినియోగిస్తారు. 

చెడ్డవాళ్ళని ఆర్థికంగా చితికిపోయేలా చేయాలి.

 ఈ సమాజాన్ని బాగు పరచటానికి ఇంతకన్నా గొప్ప కార్యం ఉండదు. నీవు ఏకాకివి కాదు నీకు సామాజిక బాధ్యత ఉంది. నీవు ఆర్థికంగా ఎదగాలి. ఐశ్వర్యవంతుడివి అవ్వాలి. నలుగురికి ఉపయోగపడాలి" నా అభిప్రాయాలు తప్పో ఒప్పో నాకు తెలియదు. ఇలా చెబుతూ ఉంటాను నా శిక్షణా కార్యక్రమాలలో భాగంగా.


స్వామి వారి ప్రసంగం విన్నాక నా అభిప్రాయాలు మరింత ధృడతరమయ్యాయి.


ఇటీవల వ్యక్తిత్వ వికాసం అనే పేరు పెట్టుకుని కొందరు పుస్తకాలు వ్రాస్తున్నారు. మైకులు అందుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. దురదృష్టవశాత్తు, సామాజిక బాధ్యతని విస్మరించి మాట్లాడుతున్న ఇలాంటి వారి ప్రసంగాలని విని ఇంప్రెషనబులు ఏజ్ లో ఉన్న పిల్లల మనస్సులు కలుషితం అవుతున్నాయి. 

"నీకు నీవే ముఖ్యం. నీ తర్వాతే ఏదైనా. అమ్మనీ నాన్ననీ పట్టించుకోవద్దు. నీకు కావాల్సింది చేయి. ఈ రోజు పోతే రేపు రాదు. ఈ క్షణం గడిచిందా, మళ్ళి రాదు. నీకు కావాల్సిన ఆనందాల్ని జుర్రుకో. ఈ క్షణంలో జీవించు. ఎవ్వర్నీ పట్టించుకోవద్దు. ఎవ్వరి అభిప్రాయాలకి విలువ ఇవ్వద్దు. 

నీ జీవితం నీ ఇష్టం. నీ స్వేఛ్చని అరికట్టే ఏశక్తినైనా ఎదిరించు. హాయిగా ఉండు. ఆనందంగా తోచినట్టు జీవించు" ఇట్లా సాగుతాయి వీరి ప్రసంగాలు.

ఇలాంటి ట్రెయినర్లకి తీరుగా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు. వారు ఏమి చదువుకుని ఉంటారో వారికైనా తెలుసో లేదో మనకు తెలియదు. 

ఇట్లాంటి కుహనా వ్యక్తిత్వ వికాస శిక్షకుల పట్ల, సెల్ఫ్ స్టయిల్డ్ మానసిక చికిత్సా నిపుణుల పట్ల , చివరి నిమిషం వరకు ఆందోళన వ్యక్తం చేసే వాడు మిత్రుడు హిప్నోకమలాకర్.కన్ను మూసే వరకు ఇలాంటి అపరిపక్వ ట్రెయినర్ల పట్ల బాధ వ్యక్తం చేసేవాడు.

****

నేను ఈ వ్యాసం ప్రారంభంలో కంచి స్వామి వారు చెప్పిన విషయాలు చూడండి ఎంత బాధ్యతాయుతంగా ఉన్నాయి. వారు చెప్పింది కూడా ఏమిటంటే ప్రతి వ్యక్తి బలోపేతుడు అవ్వాలి, ఆర్థికంగా ఎదగాలి, హోదా పెంచుకోవాలి, ఆరోగ్యం పెంచుకోవాలి, మంచి ఆలోచనలు పెంచుకోవాలి. తన వ్యక్తిత్వ నిర్మాణం పట్ల శ్రద్ధ చూపాలి.

ఇలా బలోపేతుడైన ప్రతి వ్యక్తి,  తన కుటుంబానికి , సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆకాంక్ష ఉంది. ఆ పలుకులలో ఎంత దయ ఉంది. ఎంత బాధ్యత ఉంది. 

ఇంకా కొన్ని ముచ్చట్లతో మళ్ళి కలుస్తా అప్పటివరకు శెలవు.

Tuesday, May 3, 2022

“ప్లే బ్యాక్"



 “ప్లే బ్యాక్"

హుషారు ఫేమ్ దినేష్ తేజ్, మల్లేశం ఫేమ్ అనన్య నాగల్ల  కీలకపాత్రల్లో హరిప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం “ప్లే బ్యాక్" . నిన్ననే ఆహా ఓటీటీ ఫాట్ఫాం పై విడుదల అయింది. ఇది వరకే వెండి తెరపై విడుదల అయి మంచి పేరు తెచ్చుకుంది.

 

ప్లే బాక్’ సినిమా నాకు కాస్తా ప్రత్యేకమైనది. నా సన్నిహితుడు, ఆప్తుడు మానస్ జమ్మిశెట్టి అసోసియేట్ డైరెక్టర్ గా ఈ సినిమాకి పని చేయటం విశేషం.

అయినా ఈ రివ్యూ ని నిష్పక్షపాతంగా వ్రాస్తున్నాను సుమా.

హెచ్ జీ వెల్స్ నవల లో చర్చించిన ’టైం మషీన్’ భావన అనేక హాలీవుడ్ సినిమాలకు, ఇతర భాషా సినిమాలకు ప్రేరణ అన్నది అందరికీ తెలుసు.

జీవితాన్ని గూర్చి ఒక అద్భుతమైన విషయం చెబుతాను. ఒక మాట చెబుతాను, ఇది  మన అందరికీ అనుభవములో ఉన్నదే. అది ఏమిటి అంటే, హఫ్ ఆఫ్ లైపు ఈస్ ఇఫ్.

మల్లాది వెంకటకృష్ణ మూర్తిగారు వ్రాసిన నవల లిటిల్ రాస్కెల్ లో అనుకుంటా ప్రారంభ వాక్యాలు ఇలా ఒక కొటేషన్‍తో ప్రారంభం అవుతాయి.

"Half of life is If"

అంటే - అలా జరిగుంటే బాగుండు అని అనుకోవటంలోనే జీవితంలో సగభాగం ఖర్చు అయిపోతుంది. ఇలాంటి ఊహ నుంచి పుట్టినవే ఈ సినిమాలు నవలలూ అన్నీ కూడా.

ఇంగ్లీష్ గ్రామర్ లో ’ఇఫ్ కండీషన్స్’ కి అందుకే ప్రత్యేక స్థానం ఉంది.

సాధారణంగా మనం ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాము, గతంలో అలా జరిగి ఉంటే ఎంత బాగుణ్ణు అని. చాలా సంవత్సరాల క్రితం ఒక తమిళ సినిమా చూశాను.

ఒక యువకుడు ఇంటర్వ్యూకి అని బయలు దేరి సిటీ బస్ స్టాప్ లో నిలబడతాడు. ఆ బస్సు దొరికి ఇంటర్వ్యుకి వెళ్ళి ఉద్యోగం దొరికి అతను ఆనందంగా ఉన్నట్టు ఒక కథనం, అతనికి బస్సు మిస్స్ అయి అతను ఇంటర్యూకి వెళ్ళలేక వేరే ఇతర నాటకీయ పరిణామాలు అతని జీవితంలో చోటు చేసుకున్నట్టు ఇంకో కథనం, ఇవి రెండు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ఎక్కడా బోరు కొట్టకుండ అన్ని క్లాసు ప్రేక్షకులను రంజింపచేస్తూ దర్శకుడు అద్భుతంగా తీశాడు.

అరె , మన చేతిలో ఏమి లేదు కద, మనం అందరం విధి ఆడే వింత నాటకంలో పావులం అన్న ఆధ్యాత్మిక అనుభూతికి గురయి ప్రేక్షకుడు బయటికి వస్తాడు ఆ తమిళ సినిమా చూశాక.

అదే విధంగా అనేక కొరియన్ డ్రామాలలో, హాలివుడ్ సినిమాలలో గతంలోకి టైం మషీన్ లో వెళ్ళి గతాన్ని మార్చగలిగితే ఎలా ఉంటుంది అన్న భావనని స్పృశించటం ఇదివరకూ బాగానే జరిగింది.

మన తెలుగులో సింగీతం శ్రీనివాసరావు గారి ’ఆదిత్య 369’ లో గతంలోకి టైం మషీన్ లో వెళ్ళటం అన్నభావనని పూర్తి కమర్షియల్ హంగులతో తీయటం జరిగింది.

ఏదైనా అద్భుతం జరిగి మన వర్తమానాన్ని మనం మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది అన్న భావనని ఇది వరలో అన్న గారి ’యమగోల’, ఎస్వీ కృష్ణారెడ్డి గారి  ’యమలీల’ లో చర్చించటం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫక్తు మాస్ మసాల చిత్రాలు. ఎక్కడా కూడా మసాల సినిమా గ్రామర్ నువీడి కాస్తా మేధావిత్వంతో తీద్దాం అన్న ప్రయత్నం జరగలేదు. నేను నిర్మొహమాటంగా చెబుతున్నాను ఈ మాటలు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారి యమలీల లోని మదర్ సెంటి మెంట్, సుకుమార్, మహేష్ బాబుల  నెంబర్ వన్ లోఅమ్మా, నాన్నల ప్రేమకి దూరమైన హీరో యొక్క మదర్ సెంటి మెంట్ అప్పుడప్పుడు గురుతు వస్తాయి ఈ చిత్రంలో. మెత్తం మీద హార్ట్ టచింగ్ ఫీలింగ్ ని తెప్పించటంలో దర్శకుడు సఫలీకృతుడు అయ్యాడు.  ఈ సినిమాకి కథ వ్రాసింది, వన్ నేనొక్కడినేకి కథ వ్రాసింది ఒక్కరే.

ఒక్క ముక్కలో కథ చెప్పాలి అంటే, గతంలోకి వెళ్ళి, అమ్మ ప్రాణాన్ని కాపాడుకోవడం అన్న పాయింట్ మూలం ఈ సినిమాకి.ఈ ఫాంటసీ ఆలోచనకి చక్కటి  కథని వ్రాసుకుని, చక్కటి కథనంతో, మంచి టీం వర్క్ తో తీయబడ్డ సినిమా ఇది.

 

హరిప్రసాద్ జక్కా గతంలో ’వన్ నేనొక్కడినే, 100% లవ్, దర్శకుడు, ఏప్రిల్ 28 న ఏమి జరిగింది?’ తదితర చిత్రాల ద్వారా తన ప్రతిభని వివిధ విభాగాలలో నిరూపించుకుని, పూర్తిస్థాయి దర్శకుడిగా చేసిన మరో ప్రయత్నం ఈ ప్లే బాక్ అని గూగుల్ సమాచారం. వీటిలో నేను వన్ నేనొక్కడినే, 100% లవ్ చూడటం జరిగింది.

దర్శకుడిగా హరిప్రసాద్ జక్కాకి మంచి భవిష్యత్ ఉంది అని నిర్ద్వందంగా చెప్పవచ్చు. మదర్ సెంటిమెంట్ వన్ నేనొక్కడినే లో పండినంతగా ప్లేబాక్ లో పండలేదు అని అనిపించింది. పోలిక లేకుండా ఒపెన్ మైండ్ తో చూస్తే అద్భుత ప్రయత్నం అనడం లో సందేహం లేదు.

 

కథ:

 

టైటిల్స్ కి ముందే ఓ జంట హత్యల దురాగతం మనకు కనిపిస్తుంది. గుడి ద్వారం వద్ద కూర్చున్న అనాధ అయిన ఓ పసి బాలుడు అనుకోకుండా చూడటం జరుగుతుంది  ఈ హత్యలను. ఇది ప్రారంభ సన్నివేశం.

అది అర్ధ రాత్రి కావటం, మెరుపులు, ఉరుములు, పిడుగులు ఈ అర్ధరాత్రి హత్య కి మరింత హారర్ నేపధ్యాన్ని జోడిస్తాయి. ప్రారంభమే ఉత్కంఠ కలిగించేలా ఉండటం వల్ల ఇంక ప్రేక్షకులు అతుక్కుపోతారు సీట్లకి.

ఆ చిన్న కుర్రాడు భయపడి పారిపోతాడు. హంతకుడు (టీ ఎన్నార్ ) వాడిని వెంబడిస్తాడు. అనాధ అయిన ఆ పసి బాలుడు సుజాత (అనన్యా నాగల్ల ) ఇంటి పెరడు లోకి వచ్చి స్పృహతప్పి పడిపోతాడు.ఆచూకి కనుక్కోలేక  టీ ఎన్ ఆర్ నిరాశగా వెళ్ళిపోతాడు.

ఇంకో సీన్లో, కార్తీక్ (దినేష్ తేజ్) జర్నలిస్టుగా స్థిర పడాలని ప్రయత్నం చేస్తూ టీవీ ఆఫీసుల చుట్టూ తిరుతుతూ ఉంటాడు.అతని మిత్రుడి అత్యుత్సాహం వల్ల ఇల్లుఖాళీ చేసి, హుటాహుటిగా ఇల్లు వెదుక్కోవాల్సి వస్తుంది. ఆ ఎమర్జెన్సీ కారణం వల్ల ఊరి చివర ఇందిరానగర్ కాలనీ అనే అభివృద్దికి నోచుకోని కాలనీలో ఒక పాత ఇల్లు, బ్రోకర్ సాయంతో దొరుకుతుంది. అతను తన స్నేహితుడితో ఆ ఇంటికి అద్దెకు వస్తాడు. కార్తీక్ కు ఆ ఇల్లు చాలా అలవాటయిన ఇల్లు లాగా అనిపిస్తుంది. లైట్ స్విచ్చు ఎక్కడ ఉంది, ఏ కిటికీ తీస్తే ఏమి కనిపిస్తుంది, తన వైట్ బోర్డు సరిగ్గా  ఎక్కడ అమర్చుకోవాలో లాంటి దేజావూ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అతనికి.

కార్తీక్ ఆ ఇంట్లో ఓ పాత మోడల్ ల్యాండ్‌లైన్ ఫోన్‌ను చూస్తాడు. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సుజాత (అనన్య నాగల్లా) నుంచి ఫోన్ వస్తుంది. నిజానికి ఆ ఫోన్ కి కనెక్షన్ ఎప్పుడో రద్దు అయి ఉండటం విశేషం. అయినా ఫోన్ కాల్ రావటమే విచిత్రం. అలా వారిద్దరు మాట్లాడుకుంటున్న నేపధ్యంలో సుజాత ఉన్నది 1993లో, కార్తీక్ బ్రతుకుతున్నది 2019లో అని తెలుస్తుంది ఇది మరో ట్విస్టు. 

అసలు సుజాత-కార్తీక్ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ప్రస్తుతంలో ఉన్న కార్తీక్ ఫోన్ ద్వారా గతంలో సుజాత భవిష్యత్‌ను ఏ విధంగా మార్చాడు? ఈ మొత్తం కథలో అసలు టెలిఫోన్ పాత్ర ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే.

ఒక టెలిఫోన్‌ను వేదికగా ఉపయోగించి రెండు వేర్వేరు కాల వ్యవధులను పరస్పరం అనుసంధానించే భావన చాలా బాగుంది. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆద్యంతమూ బాగా చూపారు.

ఇక లుక్స్ పరంగా దినేష్ తేజ్ బాగున్నాడు మరియు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో అతని నటన కూడా బాగుంది. నటి అనన్య నాగల్లా తనకు చేతనయింత మేరా బాగా చేసింది. ఈమె సాధన చేస్తే మరింత మంచి నటిగా రాణిస్తుందనటంలో సందేహం లేదు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ లో  నాటకీయత కాస్తా తగ్గించి ఇంకా కాస్త సహజంగా నటించి ఉంటే బాగుండేదేమో అనిపించింది ముఖ్యంగా ఎమోషన్లు పండించే సందర్భాలలో.

కథ వ్రాసుకోవడంలో రచయిత యొక్క మెచ్యూరిటి కనిపించింది. గతంలో ని ఆ అమ్మాయి కి  వర్తమానంలోని ఈ హీరోకి మధ్య ఉన్న అనుబంధం ని చిత్రీకరించటంలో రచయిత చాలా హుందాతనం పాటించాడు.

 

టీవీ5 న్యూస్ ప్రెజంటర్ మూర్తి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించారు. ఆయన  నటుడిగా అనుభవం ఉందో లేదో తెలియదు కానీ చాలా అనుభవఙ్జుడైన నటుడిలా ఈజ్ తో నటించాడు, కొన్ని సీన్లలో అయన మెథడ్ ఆక్టింగ్ కూడా ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ఆయనకి వీరతాడు వేయవచ్చు.

టిఎన్ఆర్ ది  ఈ సినిమాలో  అతి కీలక పాత్ర. గతంలోనూ వర్తమానం లోనూ కూడా కనిపిస్తూ భయపెడతాడు. ఆయన కనిపిచ్చినపుడల్లా ఒక స్పెషల్ మ్యూజిక్ పెట్టి ఉంటే బాగుండేది.  టీ ఎన్ ఆర్ గారికి పెద్దగా డైలాగులు లేకపోయినా స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ స్పందన, అర్జున్ కళ్యాణ్ వారి పాత్రలలో మెప్పించారు. అర్జున్ కళ్యాణ్ గూర్చి ఊరికే బాగా చేశాడు అని వదిలేయలేస్తే దోషమే. అతని నటనలో ఈజ్ ఉంది. కథలో కీలక సమయాల్లో వచ్చి ప్రియురాల్ని కాపాడుకునే సందర్భాలలో ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్ ఇస్తాడు. మూగ ఆరాధకుడిగా బాగా నటించాడు. ఆ రోజుల్లో నిజంగానే ఇంతటి తెంపరితనం ఉండేది కాదు ప్రేమికుల్లో. ఈ అంశం బాగా పట్టాడు డైరెక్టర్.

కథకు మూలస్తంభం లాంటి బాల నటుడు ముద్దులొలుకుతూ భలే ఆకట్టుకుంటాడు అందర్నీ.

 

కొన్ని సైడ్ లైట్స్

టీ ఎన్ ఆర్ గారికి ప్రారంభంలో నివాళి అర్పించడం సమయోచిత చర్య. కాసేపు బాధేసింది ఆ స్లైడ్ చూసి. ఈ సినిమాలో కథకి అనుగుణంగా టిఎన్‍ఆర్ పాత్రని హింసించేటప్పుడు అరెరె ఆయన్ని కొట్టొద్దండిరా అని అరిచి చెప్పాలి అనిపించింది. తనికెళ్ళ భరణి చెపుతారు ఒక దగ్గర, మమ్మల్ని ప్రేక్షకులు ఎంత ఏవగించుకుంటే విలన్ గా మా పాత్ర అంత పండినట్టు అని. సరిగ్గా ఆ మాటలు సూట్ అవుతాయి ఈ సినిమలో టీఎన్ఆర్ గారికి. ఒక మంచి నటుడిని కోల్పోయామే అని బాధ కలుగుతుంది ఆయన్ని చూసినంత సేపు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యలో సామాన్యుడైన గ్రామీణుడి పాత్ర కీ, ఇందులో విలన్ పాత్రకి పోలికే లేదు. ఆయా పాత్రల్లో జీవించే నటుడు ఆయన అని అనిపించింది.

 

ఈ చిత్రం 1993 మరియు 2019 సమయాల మధ్య ఉండడంతో, ప్రధాన తారాగణానికి సంబంధించిన చాలా ఎపిసోడ్‌ల విషయంలో  ప్రేక్షకులు  గందరగోళానికి గురి అవకుండా హేండిల్ చేసిన విధానం చాలా బాగుంది. సమయోచితంగా భూకంపము ఎపిసోడ్ వాడుకున్న విధానం బాగుంది.

చెట్టు మాయవడం, ఇంటి వెనుక ప్రత్యక్షం అవడం బాగుంది. అదే  చెట్టు మొదట్లో 1993 లో ఫోటోలు తవ్వి దాచి పెడితే ఒక కొరియర్ సర్వీస్ లాగా 2019 లో ప్రత్యక్షమవడం, ఫోన్ స్క్రూ తీసి ఫోన్ బాడిలో కీలకమైన ఫోటోలు పెడితే హీరోకి అవి అందటం  ఇలాంటి వన్న్నీ దర్శకుడు తీసుకున్న స్వేచ్చాయుత చర్యలు. అవన్నీ బాగున్నాయి.

మెట్రో, ఆధార్ కార్డ్, వెబ్ సైట్, సెల్ ఫోన్స్ ఇవేవి హీరోయిన్ కి తెలియక పోవటం మనల్ని కూడా ఆలోచింపచేస్తాయి. అరె పాతిక సంవత్సరాలలో మనం ఎన్ని అద్భుతాలు చూశాము కద అని.

1993 నాటి వాతావరణాన్ని చూపించేందుకు ఆర్ట్ డైరెక్టర్ కి ఒక మంచి అవకాశం ఈ చిత్రం ద్వారా వచ్చినప్పటికి, బడ్జెట్ పరిమితుల కారణంగా అనుకుంటా చాలా సందర్భాలలో ఉత్తినే మమ అనిపించారు. ఒకే వీధిని మెట్రో లైన్ లేనప్పుడు, మెట్రో ఉండగానూ చూపించి ఉండవచ్చు. ప్రేక్షకులు అబ్బ అని థ్రిల్ అయి ఉండేవారు.

అదే విధంగా అప్పటి ప్రధాన వాహనాలు మారుతి 800, మారుతి ఎస్టిం, మేటిజ్ కార్లు, ఆర్టిసి బస్సులు అప్పటి కలర్, మోడల్స్ తో,  బజాజ్ చేతక్, ఎల్ ఎం ఎల్ వెస్పా స్కూటర్లు, అప్పుడప్పుడే వస్తున్న కేబులు టీవి ప్రసారాలు, పంజగుట్ట ఫ్లై ఓవర్ లేనప్పుడు, సెంట్రల్ షో రూం లేకుండా ఉండే జంక్షన్ ఇలా ఎన్నోవిన్యాసాలు చేసి ఉండవచ్చు.

ఇంకా హీరో హోండా, ఇండ్ సుజుకి, కవాసాకి బజాజ్, యమహా ఆర్ ఎక్స్ 100 విరివిగా నడుస్తున్న కాలం అది. అవన్నీ చూపించి ఉండవచ్చు. అఫ్ కోర్స్ నేను రంధ్రాన్వేషణ చేసినట్టు అనిపిస్తు ఉండవచ్చు. పీరియడ్ ఫిలింస్ లో ఉన్న అడ్వాంటేజి మరియు రిస్కు కూడ ఇదే.

ఆర్ట్ డిపార్ట్ మెంట్ కి నేను కాస్తా తక్కువ మార్కులు ఇస్తాను . డైరెక్టర్ తెలివిగా మేనేజి చేశాడు.

రిచర్డ్ అటెన్ బరో గాంధీ, టైటానిక్ మూవీ ల లాగా కాకున్నా కాస్త రిచ్ గా ఈ దిశగా ప్రయత్నం చేసి ఉండవచ్చు. లాండ్ లైన్ కూడ 1993 నాటికి ఇలా బండగా నల్ల ఫోన్లు కాకుండా రంగుల్లో బటన్ ప్రెస్ టైపు వి అందుబాటులో ఉండినవి.

వార్తలు చూపటానికి అప్పటికి ఇంకా ప్రయివేట్ కేబుల్ చానెల్స్ వారికి అనుమతి లెదు. ఆ విషయం చక్కగా చూపారు. వార్తలను దూరదర్శన్ లో వచ్చినట్టు చూపారు. అప్పటికి రీలు ఉండే కెమెరాలు అందుబాటులో ఉండేవి. అదే చూపారు. కెమెరా రీలు తీసి లాబ్ లో ’కడగటానికి’ ఇచ్చి రెండ్రోజులు అయ్యాక తెచ్చుకోవాల్సిన రోజులు అవి. బాగా చూపారు. ఇంకా కోనికా వచ్చి సకురా గానో, లేదా సకూర వచ్చి కొనికా గానో మారుతున్న కాలం అది. విపరీతంగా ఆడ్స్ వచ్చేవి అప్పట్లో., ఇంకా కోడక్, ఆగ్ఫా,, ఫ్యూజీ ఫిలిం గట్రా కూడా స్టుడియో వాతావరణంలో చూపించి ఉండవచ్చు.

కాడ్ బరీస్ చాక్లెట్ అప్పటి రాపర్ చూపారు. అది గమనించాను. 1993 నాటి ఫాషన్ కి అనుగుణంగా లూజ్ షర్ట్స్, బ్యాగీ పాంట్సు, పెద్ద కళ్ళ జోడులతో భలే ఆకట్టుకుంటాడు అర్జున్ కళ్యాణ్.

టైం పీరియడ్ కి సంబంధించి ఎక్కువ లోపాలు కనిపించే అవకాశం లేకుండా తెలివిగా, మెయిన్ స్ట్రీట్స్ గట్రా చూపకుండా , కాలనీలలో, ఓపెన్ గ్రౌండ్స్ లో  అదీ చీకట్లో, సాయంత్రాలలో కథ నడిపారు.

గతానికి సంబంధించి. ఐషర్ మిని ట్రక్కు అప్పట్లో ఐషర్ అన్న అక్షరాలు చిన్నగనూ మిట్సూబిషి అన్న అక్షరాలు పెద్దగానూ , మిట్సుబిషి లోగో తోనూ వచ్చేవి అప్పట్లో.అది పరిగణలోకి తీసుకోలేదు అనుకుంటా. ఆ బాలుడిని దాచేసే టెన్షన్ లో ఉన్న ప్రేక్షకులు కూడా ఇది పట్టించుకోరు.

చక్కగా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబీంచటానికి హెచ్ ఎం టీ వాచీలు చూపారు కానీ అప్పటికే టైటాన్ వాచీలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. రేబాన్ గ్లాసెస్ ఇండియాలోకి వచ్చిన కొత్తలు అవి.

26 సంవత్సరాలు అంటే మరీ పూర్వకాలం ఏమి కాదు. కానీ ఫాషన్స్ విషయం లో చాలా మార్పులు వచ్చాయి అప్పటికి ఇప్పటికి. ఈ విషయంలో కూడా మరింత శ్రద్ద వహించి ఉండవచ్చు.

మొత్తంగా చూసుకునట్టయితే “ప్లే బ్యాక్” అనేది ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పాలి. ప్రస్తుతం, గతంలను టెలిఫోన్ సంభాషణతో కొత్తగా చూపిస్తూ, అప్పటికి ఇప్పటికి మధ్య ఉన్న ఆసక్తికరమైన క్షణాలు చూపిస్తూ, బలమైన కథ కథనం తో మదర్ సెంటిమెంట్ ని ఆద్యంతం పండిస్తూ సాగిన అద్భుతమైన చిత్రం అని చెప్పవచ్చు. మాస్ ప్రేక్షకుల కోసం  అనే కోణం లో ఒక్క సీన్ కూడా లేదు. కనీసం ఒక మదర్ సెంటిమెంట్ తో ఒక పాట పెట్టి ఉంటే (సుడిగాడు లో చెప్పినట్టు ఫామిలీ సాంగ్ లాగా) ఖచ్చితంగా ప్లస్ అయ్యేది.

ఆల్బర్ట్ ఐనిస్టిన్ చెప్పినట్టు ఫిజిక్స్ లోతుల్లోకి వెళ్ళే కొద్ది దేవుడు ఉన్నాడు అన్న భావన బలపడుతుంది.  ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు కూడా ఆధ్యాత్మికత ఫిజిక్స్ వేరు వేరు కావు అన్న భావన కల్గుతుంది.

ఈ చిత్రం కూడా మనల్ని బాగా ఆలోచింపచేస్తుంది. ఆద్యంతం ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మంచిని స్థాపించడంలో భాగంగా దుష్టులైన వారిని చీడపురుగులను నిర్మూలించినట్టు సకాలంలో నిర్మూలిస్తే భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుంది కద అని అనిపిస్తుంది.

మంచి చేస్తే మంచే జరుగుతుంది అన్న కర్మ సిద్ధాంత భావన సామాన్యుడికి కూడా కలగజేయటంలో దర్శకుడు సఫలీకృతుడు అయ్యాడు.

చివరి సీన్లు చూసి తేలిక పడ్ద మనసులతో ఇంటిదారి పడతాడు ప్రేక్షకుడు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు హరిప్రసాద్ జక్కా టెలిఫోన్‌ను ద్వారా రెండు వేర్వేరు కాల వ్యవధుల మధ్య పోలికలను చూపించే ఆలోచన బాగుంది కానీ  తనకున్న బడ్జట్ పరిమితుల్లో ఎగ్జిక్యూషన్, క్యాస్టింగ్ మరియు ప్రొడక్షన్ డిజైన్ విషయాల్లో రాజీ పడ్డారు.కానీ అవుట్ పుట్ విషయంలో ఏమీ ఢోకా లేదు. తనకున్న పరిమితుల్లో అద్భుతంగా తీశాడు.  ఏదేమైనా ఇలాంటి కొత్త తరహా సినిమా తీయాలనే ఆయన ఆలోచనను మాత్రం ప్రశంసించాల్సిందే. ఇక కమ్రాన్ సంగీతం, అతని నేపథ్య స్కోరు సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి. బుజ్జి.కె సినిమాటోగ్రఫీ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉంది. నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ పని కూడా ఒకే. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికి నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు : దినేశ్ తేజ్, అనన్య నాగల్ల, అర్జున్ కళ్యాణ్, టీ ఎన్ ఆర్

దర్శకత్వం : హరిప్రసాద్ జక్కా

నిర్మాత‌లు : ప్రసాద్‌రావ్ పెద్దినేని

సంగీతం : కమ్రాన్

సినిమాటోగ్రఫీ : కె.బుజ్జి

ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి

 

చివర్లో ఒక పిట్ట కథ:

కొన్నేళ్ళ క్రితం ఒక యువకుడు మా ఆఫీసులో ఉద్యోగంలో చేరాడు. కుదురుగా కూర్చుని అడ్మిన్, మార్కెటింగ్ చూసుకోవడం అతని విధి. చక్కటి జీతం, మంచి వాతావరణంలో పని. ఎవరైనా ఎగిరి గంతేసి చేసుకుంటూ ఉండిపోయేవారు. ఈ కుర్రాడు చేరిన కొన్ని రోజులకే ఉద్యోగం మానేసి వెళ్ళి పోయాడు.

నాకు తర్వాత తెలిసింది ఏమిటి అంటే, నేను రచయితను కాబట్టి నా దగ్గర రచనలు, స్క్రీన్ ప్లేకి సంబంధించి మెళకువలు నేర్చుకుందామన్న ఉద్దేశంతో నా దగ్గర చేరాడట ఆ కుర్రాడు. నాకు తెలియదు కద ఆ సంగతి. నేను ఎంత సేపున్నా ఆఫీసు పని, ఆఫీస్ మాటలే మాట్లాడుతు ఉండటంతో విసుగొచ్చి వెళ్ళిపోయాడు.

ఆ కుర్రాడికి కథా రచనలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విభాగాల మీద ఉన్న ఆసక్తి అంత తీవ్రమైనది. సుఖంగా కుర్చుని చేసే ఉద్యోగం వదిలేసి, చివరికి తానెన్నుకున్న గమ్యం వైపు సాగిపోయాడు.చక్కటి అవకాశం తెచ్చుకున్నాడు. అతనెవరో కాదు, ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్స్ లో ఒకరైన మానస్ జమ్మిశెట్టి. అతనికి కథా రచనా పరంగా నేను నేర్పించినది ఏమీ లేకున్నా నన్ను తన గురువులలో ఒకరిగా భావించడం అతని సంస్కారం. తన డెవలెప్‍మెంట్స్ ఎప్పటికప్పుడు నాకు తెలుపుతు ఉంటాడు. ఆల్ ది బెస్ట్ మానస్.

 

తీర్పు:

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హాలీవుడ్, కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఆకర్షిస్తుంది. మామూలు ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభుతిని ఖాయంగా ఇస్తుంది.  మీకు కాస్త సమయం దొరికితే ఈ వారాంతంలో ఆహాలో  ఈ సినిమా చూసేయండి.