Wednesday, May 6, 2020

కలువపూలు


ఒక ఙ్గాపకం -15
"కలువపూలు"
-----
"సార్ ఈ ప్లేస్ ఎక్కడ?" అని అడిగాడు నా ఫేస్ బుక్ లో నేను ఈ వేళ మార్చిన ప్రొఫైల్ పిక్ చూసి వేణు, ఒక ఫ్రెండ్.
"భద్రాచలం నుండి పాపి కొండలు వెళ్ళటానికి బోటు ఎక్కటానికి ఒక ముఫై కిలోమీటర్లు కార్లో వెళుతుండగా తీసుకున్న పోటో అది" అని చెప్పాను. 
"చాలా బాగుంది" అని చెప్పాడు వేణు.
ఆ ఫోటో చూస్తుంటే ఒక ముచ్చట ఙాపకం వచ్చింది.
ఇది జరిగి ఒక నాలుగు సంవత్సరాలు అవుతోంది. నేను, మా శ్రీమతి, ఇద్దరు పిల్లలు. పాప అప్పటికి ఇంటర్ చదువుతోంది. బాబు అప్పటికి తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు.
హైదరాబాద్ నుంచి కార్లోనే వెళ్ళాం. భద్రాచలం లో స్టే.
భద్రాచలం లో గోదావరిలో తగినంత నీటి మట్టం లేక పోవటం వల్ల ఓ ముఫై కిలోమీటర్లు వెళ్ళీ లాంచి ఏక్కాలని, చెప్పారు టూర్ ఆపరేటర్లు. వారే ఆటోలు ఏర్పాటు చేసారు అక్కడికి వెళ్ళటానికి.  కాని మేము సరదాగా మా కార్లోనే వెళ్ళాం.
ఆ ముఫై కిలోమీటర్ల కారు ప్రయాణం లో ఎన్నో అద్భుతమైన దృశ్యాలు. చాలా ఆనందించాము. అక్కడక్కడా ఆగి ఫోటోలు తీసుకున్నాము.
అప్పుడు జరిగింది ఒక చిన్న సంఘటన. అది పెద్ద ప్రాముఖ్యమున్న సంఘటన ఏమీ కాదు, కాని నన్ను అది చాలా రోజుల పాటు తీవ్రంగా ఆలోచింపజేసింది.
అది ఏమిటంటె చెప్తాను వినండి.
దారిలో ఒక పెద్ద సరస్సు. రోడ్డు ప్రక్కనే వుంది. దాని నిండా కలువ పూలు. చూడ్డానికి బాగా అందంగా వుందా దృశ్యం. ఆ కలువపూలు కోసుకోవాలని కోరిక వున్నా, సరస్సు చుట్టూ వున్నగుబురుగా వున్న చిన్న చిన్న చెట్లను దాటి నీళ్ళదాకా వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. నాకు గాని, మా వాళ్ళకు గాని. ఉన్న విషయం చెప్పుకోవటాన్కి సిగ్గెందుకు, నాకు ఈత రాదు కూడాను. జీరో బడ్జెట్ మాధవరెడ్ది గారు ఎన్నో సార్లు పిలిచారు నన్ను ఈత నేర్పిస్తాను రమ్మని. వెళ్ళాలి ఒక మారు. ఆయనకు ఈత రాని వాళ్ళను చూస్తే ఎంత జాలో.
సరె విషయానికి వస్తాను.
అందని ద్రాక్షపండ్లు పుల్లన అన్న చందంగా, మేము ఆ కలువలను కేవలం ఫోటోలు తీసుకుని తృప్తిపడి తిరిగి ప్రయాణం ప్రారంభించాము. అంతా ఒక అరకిలోమీటరు వెళ్ళివుంటాము. అప్పుడు జరిగింది ఆ సంఘటన.
ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు, కోరుకున్న పెన్నిధి దొరికినట్టు బోలెడు కలువపూలు పట్టుకుని ఓ కుర్రాడు మా ముందు వెళుతున్నాడు. వాడికి నిండా పది పన్నెండేళ్ళు వుంటే  ఎక్కువ. ఉత్తిగా నిక్కరు ఒక్కటీ వేసుకుని , సైకిల్ మీద వెనుక కూర్చుని వున్నాడు. వాళ్ళ అన్న అనుకుంటాను, వాడికన్నా ఓ అయిదారేళ్ళు పెద్ద కుర్రాడు సైకిలు తొక్కుతున్నాడు. ప్రపంచాన్నంతా గెలిచినంత అనందం వారి మొహాలలో వుంది. ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. చాలా స్వచ్చంగా వుంది వారి జీవిత విధానం. బహుశా అక్కడికి దగ్గర్లో ఏదో పల్లె వారనుకుంటా. ఇందాకటి సరస్సులో, ఈత కొట్టి, బోలెడు కలువపూలను హస్తగతం చేసుకుని హాయిగా వెళుతున్నారు.
మా పిల్లలు, మా ఆవిడ గమనించలెదు వారిని. కార్లో ఏదో వారి కబుర్లలో వారున్నారు.
నేను కారును ఆ కుర్రాళ్ళ ప్రక్కగా పోనిస్తూ, కాస్తా వేగం తగ్గించి, పవర్ విండో అద్దం దించి, 
’అబ్బాయి కొన్ని కలువ పూలు ఇస్తావా?" అని అడిగాను, వాళ్ళలో చిన్న కుర్రాడిని. 
’ఇవ్వననో, మా అన్నను అడగాలనో, లెదా డబ్బులు కావాలనో’ అంటాడనుకున్నా.
నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, తన చేతిలో వున్న అన్ని కలువలనూ ఆ అబ్బాయి ఆనందంగా అందించాడు. దానికి తోడు అమాయకమైన స్వచ్చమైన నవ్వు ఒకటి. 
"ఇన్ని వద్దు లే బాబు ఒకటో రెండొ చాలు" అని, అని నేను అన్నీ వెనుకకు ఇచ్చేసి, అసంకల్పితంగా ఆ కుర్రాడికి ఓ ఇరవై రూపాయల నోటును అందించాను. వాడు ఆశ్చర్యపోయాడు. 
’వద్దు వద్దు’ అని పులిని చూసిన ఆవులా భయపడ్డాడు ఆ నోటుని చూసి. నేను బలవంత పెట్టి వాడికి ఆ నోటుని ఇచ్చి, అది సరిపొలేదనుకుంటున్నాడల్లే వుందని చెప్పి ఇంకో పది రూపాయలను బలవంతంగా అంటగట్టి బయలు దేరాను. 
 ఆ పూలని మా అమ్మాయికి అందించాను. తను మాత్రం ఏమి చేసుకుంటుంది? కాసేపు వాటి సౌందర్యాన్ని చూసి, కార్ డాష్ బోర్డ్ పై వున్న దేవుని పాదాల దగ్గర వుంచింది.
"మీరా కుర్రాళ్ళ స్వచ్చమైన మెదళ్ళని కలుషితం చేశారేమో అని అనిపిస్తొంది" అంది మా శ్రీమతి కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక . 
నా మనస్సులో కూడా సరిగ్గా ఇదే ఆలోచన నడుస్తూ వుండటం వల్ల నేను వెంటనే కాచ్ చేయగలిగాను.
"ఇకపై వాళ్ళు డబ్బుకోసం ప్రతి కారును ఆశగా చూస్తారు. కలువలను పట్టుకుని కార్లని ఆపుతారు. వాళ్ళజీవితాల్లో మీరు కొన్ని కలుషితమయమైన భావాల్ని నాటారేమో అని అనిపిస్తోంది." తను గడ గడ మాట్లాడదు. మాట్లాడే కొన్ని మాటలు చాలా అర్థవంతంగా లోతుగా వుంటాయి. అర్థం చేసుకోగలిగితే ఎంతయినా నేర్చుకోవచ్చు ఆమె మాటలతో. 
నేనీమి అనకుండా, తన చేతిని మృదువుగా నొక్కి వదిలాను ’బాధ పడకు’ అన్న అర్థంలో.
కలుషితమైన మెదళ్ళు వున్న నగర జీవులకు నేను ప్రతినిధిగా వెళ్ళిన నేను, చిరుతప్రాయంలో వున్న అడవిపుత్రులను నాలాగా ఆలోచించమని అన్యాపదేశంగా సందేశాం ఇచ్చానా? ఏమో!
హైదరాబాదు లో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఒక్కో కలువపూవు రెండు వందలరూపాయలకు కూడా మోండా మార్కెట్ లో అమ్మబడిన సందర్భలు వున్నాయి.
వరలక్ష్మీ వ్రతం పండుగ ముందు రోజు మొదలి రేకులు రెండువందలా యాభై రూపాయలు పలుకుతాయి.
ఇలాంటి వాతావరణం నుంచి వెళ్ళిన నాకు ఆ స్వచ్చమైన చిన్నారుల చిరునవ్వు ఇప్పటికీ గుర్తు వస్తూనే వుంటుంది.


’పులివెందుల"


ఒక ఙ్గాపకం -15
’పులివెందుల"

పులివెందుల పేరు వినంగానే రాజశేఖర రెడ్డి, జగన్మోహన రెడ్డి, విజయసాయి రెడ్డి గార్ల పేర్లు గుర్తు రావటం సహజం ఎవరికైనా. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి బాంబులు, పౌరుషాలు,మీసాలు తిప్పే గూండాలు గుర్తుకు వస్తాయేమో కూడా. రాజమౌళి ’మర్యాదరామన్న’ పుణ్యమా అని అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ఈ పులివెందుల అని కూడా కొందరు అనుకోవటం కద్దు.
కాని నాకు పులివెందులతో ఉన్న అనుబంధం చాలా తియ్యటిది.
కడపలో ఇంటర్మీడెయేట్  చదువుకుంటున్నప్పుడు ఫస్టియర్ లోనే నాకు ఒక అద్భుతమైన స్నేహితుడు పరిచయం అయ్యాడు.  అతని ఊరు పులివెందుల. అతనిపేరు కంచనపల్లి రమణానందం. ఇప్పుడు అతను ఒక ఫార్మా కంపెనీకి ఎం.డి స్థానంలో వున్నాడు, అదృష్టవశాత్తు నేను అతను ఇప్పటికీ పొరుగిళ్ళలోనే వుండగలుగుతున్నాము.
అప్పట్లోనే లెక్చరర్లని ఇమిటేట్ చేయటం, క్రికేట్ గురించి అనర్ఘళంగా మాట్లాడగలగటం, నోరు తెరిస్తే ఐ.ఐ.టీ, ఎంసెట్ ల గూర్చి పూసగుచ్చినట్టు మాట్లాడగలగటం ఇలా అతనొక అద్భుతంగా తోచే వాడు ఆ రోజుల్లో నాకు. జీవితంలో సామాన్యంగా జీవించకూడదని ఒక రేంజిలో సెటిల్ అవ్వాలని నాలో స్వప్నాలని రగిల్చేవాడు. అతడు అప్పట్లోనే ఏకసంథాగ్రాహి. ఒకసారి వింటేచాలు అన్నీ గుర్తుండిపోయేవి అతనికి. 
పుస్తకాలు ముందేసుకుని కూర్చోవటం, బట్టీ పట్టటం, ట్యూషన్లకు వెళ్ళటం ఇవన్నీ సామాన్యులుచేసే పనులు అని బలంగా విశ్వసించే వాడు.
మాలో మేము వున్నప్పుడు అద్భుతంగా పాటలు చక్కగా హం చేసేవాడు.  అతనికి ఒక తమ్ముడు. ఇతనికన్నా ఒక సంవత్సరం చిన్న వాడు. ఈ అబ్బాయి పులివెందుల లోనే టెంత్ చదువుకునే వాడు అప్పట్లో. అతని తమ్ముడు అప్పుడప్పుడు శెలవులకు వచ్చినప్పుడు కలిసేవాడు మమ్మల్ని.
వాళ్ళ నాన్నగారు పులివెందులలో ’టిఫిన్ బెరైటీస్’ అనే కంపెనీలో ఇంజినీర్ గా పని చేసేవారు. వాళ్ళ అమ్మగారు చక్కటి గృహిణి.
మొత్తం మీద వారిదొక చైతన్యవంతమైన ఫ్యామిలి అని చెప్పవచ్చు. 
అసలు అప్పటిదాకా స్నేహితులే లేరట రమణానందంకు. అలాంటిది అంత తక్కువ సమయంలో ఇంత గాఢమైన మైత్రి మా మధ్య ఏర్పడటంతో వాళ్ళ వాళ్ళందరికి నేను ఒక అద్భుతంగా తోచే వాడిని. 
వాళ్ళ అమ్మ గారు మా అమ్మగారితో అన్న మాటలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి.
’మా వాడికి ఎవరూ నచ్చరు, అందర్నీ కాస్తా దూరంగానే వుంచుతాడు, బాగా స్టడీచేసాక గానీ ఎవరితో ముందుకు పోడు. అందువల్ల ఎవరూ మా వాడికి స్నేహితులు లేరు. అలంటిది మా వాడికి మీ అబ్బాయి ఇంతగా నచ్చాడంటే మీ అబ్బాయి చాలా మంచి వాడు వుంటాడు. వీళ్ళీద్దరు ఇలామంచి స్నేహితులుగా వుండటం మాకు చాలా సంతోషంగా వుంది"
నాకు ’వామ్మొ’ అని అనిపించింది అంతే.
నిజానికి అతనికి చాలా మంచి అలవాట్లు వుండేవి. ’నాకు చెల్లెళ్ళు లేరురా’ అని తెగ బాధపడే వాడు. చక్కటి  అమ్మాయిల్ని చూసి నాకు ఇలాంటి చెల్లెలు వుంటే ఎంత బాగుండేది అని బాధ పడే వాడు.
ఆ వయసులో అలాంటి సాంగత్యం వల్లనుకుంటాను నా అలోచనలు కూడా నాకు తెలియకనే చాలా పద్దతిగా వుండేవి. జీవితం పట్ల ఒక ఆశావహ ధృక్పథం, తగినంత చిలిపిదనం, తగినంత అల్లరి, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఇవన్నీఅతని వల్ల నేను బాగా ప్రభావితమైన లక్షణాలు. వాటివల్ల జీవితంలో నాకు అస్సెర్టివి నేచర్ అలవడింది. ఇది అతనికి తెలియదు బహుశా.
అతన్ని ఇంప్రెస్ చేయటానికి నా ఊహా శక్తిని ఉపయొగించి కట్టు కథలు చెప్పటం, హిందీ పాటల పై నాకున్న గ్రిప్ ని చూపించటం వంటి టెక్నిక్స్ ఉపయోగించేవాడిని నేను ఆ రోజుల్లొ.

అతన్ని వాడు-వీడు అనగలిగే చనువు ఉన్నా, మితో మాట్లాడేటప్పుడు అతన్ని ’అతను’ అనే వ్యవహరిస్తాను. మనం ఎంతో గౌరవం ఇచ్చే వ్యక్తుల్ని పట్టుకుని సభాముఖంగా, మోహన్ బాబు ’వాడు-వీడు’ అంటుంటే ఎంత చిరాగ్గ అనిపించేదో నాకు అనుభవైకవేద్యమే కాబట్టి ఈ కంచనపల్లి రమణానందం ని ’అతను’ అని, ’రమణ’ అని వ్యవహరిస్తాను ఈ వ్యాసంలో, ఓకేనా!.

సరే ఈ రమణా, నేను మరి ఇంకో స్నేహితుడు శ్యాం సుందర్ అని మా ముగ్గురం చాలా క్లోస్ గా వుండేవారం. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళే వాళ్ళం. కడప అంతా మాదే అన్నట్టు ఉండేవారం అప్పట్లో. సినిమాలు, షికార్లు, మార్నింగ్ వాక్ లు, ఈవినింగ్ సైక్లింగ్ లు, కంబైన్డ్ స్టడీలు ఇలా మాది ఒక కోలాహలంగా ఉండేది. 
మాతో చిత్తూరు నుంచి వచ్చిన చెంగల్వ ప్రసాద్ అని మరో కుర్రాడు కూడా బాగా మూవ్ అయ్యే వాడు. ఏది ఏమయినా మేము ముగ్గురం ఎక్కువ గా టీంగా వుండే వాళ్ళం.
అప్పటి ఙ్గాపకాలు కొన్ని పంచుకోబొతున్నాను రాగల కొన్ని ఎపిసోడ్లలో.

"పారిజాత"



ఒక ఙ్గాపకం -14
"పారిజాత"
-------
"నమస్కారం! నా పేరు పారిజాత"
కూర్చోమని చెప్పాను. తను వినయంగా కూర్చుని తన రెజ్యూమే ని నా ముందర వుంచింది. పెద్ద ఇంటెలిజెంట్ ఏమీ కాదు. ఆవరేజి పర్ఫార్మర్. డిగ్రీ పూర్తి చేసింది, ఓపెన్ డిగ్రీ పద్దతిలో.
చూడటానికి పెద్ద అందంగా లేకున్నా ఏదో తెలియని ఆకర్షణ వుంది తనలో అనిపించింది .
"టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్" అన్న నా ప్రశ్నకి సమాధానంగా "నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు" అంది.  తల బద్దలు కొట్టుకుందామా  అని అనిపించింది.
-------
ఇది ఓ అయిదేళ్ళ కిందటి సంగతి. 
ఆ రోజు ఉదయమే ఖాసీం ఫోన్ చేశాడు. మాకు రెగ్యులర్ గా క్యాండిడేట్లని పంపే ఓ చిన్న కన్సల్టెంట్ అతను.టెంత్, ఇంటర్, డిగ్రీ ప్యాసయిన అభ్యర్థుల దగ్గర ఓ అయిదారు వందలు తీసుకుని వాళ్ళకు చిన్న చిన్న ప్రయివేట్ ఉద్యొగాలు ఇప్పిస్తు వుంటాడు అతను. ఆఫీస్ బాయ్, రిసెప్షనిస్ట్ ఇలా చిన్న చిన్న ఎంట్రీ లెవల్ జాబ్స్ కోసం మా వద్దకు కూడా క్యాండిడేట్లను పంపటం కద్దు.
"సార్, ఈ వేళ పారిజాత అని ఒకమ్మాయి వస్తుంది. దయచేసి ఆమెకి ఏదయినా ఉద్యోగం ఇప్పించండి. తనకు అర్హత వుందా లేదా అని కూడా చూడవద్దు. తనకు అవసరం వుంది జాబ్. నేను తన దగ్గర నా కన్సల్టెన్సి ఫీజ్ కూడా తీసుకోలేదు" అని పొద్దున్నే ఖాసీం ఫోన్ సారాంశం.
ఇక ఆ అమ్మాయిని తెలుగులోనే ఇంటర్వ్యూ చేసి నేను కనుగొన్న విషయాలు విని నా కండ్లు చెమర్చాయి. సినిమా కష్టాలు అంటాము చూడండి అలాంటివి అన్న మాట. తండ్రి దగ్గర్లోనే వున్నమిర్యాలగుడా లో ఓ పెద్ద లారీ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేసేవాడట. క్రమంగా ఆయన వ్యాపారం దెబ్బతినటం, ఆయన హఠాత్తుగా చనిపోవటం, తల్లి పెరాలిసిస్ వచ్చి మంచం పట్టటం ఇలా ఒక్క సారి అన్ని కష్టాలు వచ్చి పడ్డాయి వారికి.
వీళ్ళు ముగ్గురు అక్కచెల్లెళ్ళు. పెద్ద ఆమె పెళ్ళి అయిపోయి అమెరికాలో వుండిపోయింది. వాళ్ళ అత్తగారింటి వారు వీరికి ఏ విధమైన సహాయం చేయటానికి నిరాకరించారు.
ఇప్పుడి ఈ అమ్మాయి భుజస్కంధాలపై తల్లి బాధ్యత, చెల్లి పెళ్ళి బాధ్యతలు వచ్చి పడ్డాయి. తండ్రి తాలుకు ఆస్తులు లేకపోగా, అప్పులు కూడా మీద పడ్డాయి.
ఒకట్రెండు చిన్న చిన్న ఉద్యొగాలు చేయబూనినా , అక్కడ గుంటనక్కలూ, తోడేళ్ళూ ఎదురువటంతో తను బాగా భయపడి పోయింది. వాళ్ళ నాన్నగారికి తెలిసిన వాడవటంతో, ఖాసీంగారు ఈ సహాయం చేయాలని సంకల్పించారు.
"సర్! మీ సంస్థలో ఉద్యొగం అంటే నాకు నిశ్చింత. తనకు అర్హత వుందా లేదా అన్న నిమిత్తం లేకుండా మీరే తనకు ఏదో  ఒక ఉద్యోగం ఇప్పించండి. 
మీ వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులకు హాజరవనివ్వండి. మీరేమి పనులు చెప్పినా చేస్తుంది. మొదట తనని డిప్రెషన్ నుంచి బయట పడేయండి అని ఖాసీంగారు నన్ను చాలా బలవంతం చేసారు.
సరె ఇక తప్పదు కద అని చెప్పి తనను మొదట మా ఇంగ్లీష్ ట్రెయినింగ్ క్లాసెస్ అటేండ్ అవమన్నాము. తనకు చిన్న చిన్న క్లరికల్ వర్క్స్ అప్పజెప్పి స్టయిఫెండ్ క్రింద కొంత మొత్తం ఏర్పాటు చేసాము.
తను చాలా చురుకైన అమ్మాయి. చెప్పిన పాఠాలు అయితేనేమి, అప్పచెప్పబడిన పనులు అయితేనేమి అన్నీ చాలా త్వరగా ఆకళింపు చేసుకుని క్షణంలో నేర్చెసుకునేది.
కేవలం ఒకే ఒక నెలలో తను మా ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. ఆమె వల్ల మా ఇన్స్టిట్యూట్ కి బోలేడు అడ్మిషన్లు అయ్యాయి కూడా.
ఏదో శాపవశాత్తూ ఈ భూమి మీదకు వచ్చిన దేవతా స్త్రీ లాగా వుండేది ఆమె ప్రవర్తన. చక్కటి సంస్కారం తో కూడిన సంభాషణలు చేసేది, ఎక్కడా కూడా అతి చనువు తీసుకుని ప్రవర్తించేది కాదు. ఆఫీస్ పని విషయంలో ఇతరులు ఏమయినా కొంచెం రాజీ పడినా తను వారిని సూక్ష్మంగా మందలించి, పని విలువ బోధించేది. వారికి కూడా ఎక్కడా కోపం వచ్చేది కాదు. ఆమె చెప్పినట్టే అందరూ కూడా పనిలో పరిపక్వత సాధించటానికి ప్రయత్నం చేసే వారు.
ఆమె మొహం మీద ఎన్నడూ చిరునవ్వు తొణికిసలాడేది.
ఒక సారి అడిగాను. 
"అమ్మయి నీకు ఇన్ని కష్టాలు వున్నట్టు నాకు తెలుసు, కానీ నీ ప్రవర్తన చూసిన వారికి ఎవరికీ అలా అనిపించదు. నీకసలు దిగులు అనేది లేదా? బాధ అనేది నీకు వుండదా? నీ ఉత్సాహానికి , ఆనందానికి కారణం ఏంటి" అని , నేను వృత్తిపరమైన ఆసక్తితో కూడా అడిగాను. నేను శిక్షణ ఇచ్చే అంశాలు కూడా ఇవే కద.
అప్పుడు ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం విని ఆశ్చర్య పోవటం నా వంతయింది. "నేను ప్రతి రోజు ఒక పదిహేను నిమిషాలు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగాలు వింటాను సర్. నాకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. దానికి తోడు మీరు కల్పించిన చక్కటి వాతావరణం మీరు కూడా ఇచ్చే వ్యక్తిత్వ వికాస శిక్షణ నన్ను చాలా ప్రభావితం చేసాయి. మీరు నేర్పించిన ఇంగ్లీష్ వల్ల ఇప్పుడు నాకు ఆత్మ విశ్వాసం కూడా బలపడింది."

నేను చాగంటి కోటేశ్వర రావు పేరు వినటం అదే ప్రధమం. అప్పటి దాకా ఇంగ్లీష్ రైటర్స్, వెస్ట్రన్ ట్రెయినర్స్ మాత్రమే తెలిసిన నాకు ఇది ఒక సరికొత్త సంగతి. నేను అప్పటి నుంచి క్రమ తప్పకుండా శ్రీ చాగంటి వారి ప్రసంగాలు యూ ట్యూబ్ లో వింటున్నాను. అది వినని రోజు నాకు ఒక కొరతగా వుంటుంది.

ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవటం, వారి తల్లి ఆరోగ్యం ముప్పాతికభాగం కుదుట పడటం, చెల్లి పెళ్ళి చేయటం ఇలా టక టక జరిగి పోయాయి.
ఇటీవల ఓ అయిదారుగు పెద్ద మనుషులు పారిజాత గురించి ఎంక్వయిరీకి వచ్చారు. వరుడి తరఫు బంధువులు అట వారు. ఏదో లాంచనప్రాయంగా పెళ్ళీ కూతురు గురించి ఎంక్వయిరీకి వచ్చారు.
"అమె నా శిష్యురాలు అని చెప్పేదానికంటే, చాగంటి గురించి నాకు తెలియచెప్పిన మార్గదర్శకురాలు ఆమె. ఆ అమ్మాయిని చేసుకోవటం మీ అబ్బాయి అదృష్టం. అంత చక్కటి అమ్మాయి ఈ రోజుల్లో దొరకటం దుర్లభం" అని చెప్పి పంపాను.

"ఉదయాన్నే వాకింగ్ "


"ఉదయాన్నే వాకింగ్ "
(ఒక ఙ్గాపకం -13)

ఈ కథనంలో ఎలాంటి ట్విస్టులు వుండవు ఇది కేవలం ఓ చిన్న ఙ్గాపకం అంతే. ఇది నా మార్నింగ్ వాక్ కి సంబంధించి, ఈ అలవాటు అసలెలా మొదలయ్యింది అని చెప్పుకొస్తాను ఇక్కడ. కాస్తా హాస్యం చిలికించే ప్రయత్నం చేశాను, ఎంతవరకు సఫలీకృతుడనయ్యానో మీరే చెప్పాలి చదివి.
పార్కుకు వెళ్ళి ఉదయాన్నే వాకింగ్ చేయటం చాలా మంచి అనుభూతి.  ఓ పదేళ్ళ క్రితం ఆరొగ్యానికి మంచిదన్చెప్పి ఉదయాన్నే నడక ప్రారంభించాను.
అయిదు అయిదున్నర మధ్య బయలుదేరి వెళ్ళి ఇంటికి దగ్గర్లో వుండే పార్కులో ఓ నలభై అయిదు నిమిషాలో లేదా ఒక గంటో ఉదయాన్నే వేగంగా నడిచి వస్తే ఆ అనుభూతే వేరబ్బా. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. చిన్న చిన్న చిరాకులు, అలసటలు మాయం. 
ఇటివల ఎక్కడో చదివాను ఉదయాన ఏర్పడే స్నెహితుల్ని పెంచుకో, రాత్రి స్నేహాల్ని మానుకో అని. అఫ్‍కోర్స్ ఇక్కడ ఉదయాన్నే పరిచయస్తులున్నారు గానీ ఎవర్తో స్నేహాలు పెంచుకోలేదు. దేవుని దయ వల్ల రాత్రి స్నేహాలు నాకు ఎటూ లేవు. అంటే ఆ కొటేషన్ ప్రకారం చెడు స్నేహాలు, వ్యసన పరులు అని అర్థం.
ఇక వనస్థలిపురంలో పార్కులు బోలేడు వుంటాయి, వాతావరణం కూడా చాలా అహ్లాదంగా వుంటుంది, ఈ వాతావరణంలో నడక ఎంత బావుంటుందో మాటల్లో చెప్పలేను.  ఇంకా నిద్రలేవకుండా పడుకునుండే వాళ్ళను చూస్తే నాకు ఎంత జాలేస్తుందో మాటల్లో చెప్పలేను. చల్లటి గాలుల్నీ, ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని అరుణిమలనీలే ఆకాశాన్ని ఎన్ని మిలియన్ డాలర్స్ ఇచ్చినా పదకొండు గంటల పైన లేచే నాగరికులు పొందలేరు గాక పొందలేరు కద. 
ఈ నా వాకింగ్ అలవాటు ఎలా ప్రారంభమైంది, దాని వెనుక వున్న పుణ్యాత్ముడెవరు అన్న విషయం చెప్పుకోవాలి. దాని వెనుక పెద్ద కథే వుంది.
నాకు చిన్నప్పట్నుంచీ సైనసైటీస్ సమస్య వుండేది. సంవత్సరంలో ఎప్పుడొ ఒక సారి తీవ్రమైన జలుబు, తలనొప్పి వచ్చి యాంటీ బాక్టీరియల్స్ వాడితే సర్దుకొనేది.
దిల్‍సుఖ్‍నగర్ నుంచి వనస్థలిపురంకు ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఎందుకు షిఫ్ట్ అయ్యామో మీకు నాగత ఙాపకంలో పంచుకున్నాను. కత్తి పోయి డొలు వచ్చె అన్నట్టు, వనస్తలిపురంకు షిఫ్ట్ అయినది లగాయతూ , నన్ను అప్పుడప్పుడూ సతాయిస్తూ వుండిన సైనసైటీస్ అన్నది కాస్తా ఒక నిత్యకృత్యం అయిపోయి, నావ్యాసంగాలపై తీవ్ర ప్రభావం చూపటం మొదలు పెట్టింది.
వనస్థలిపురం కు షిఫ్ట్ అయిన కొత్తల్లో, అంటే 2009 ప్రాంతాలలో నాకు ఉత్తి పుణ్యానికే జలుబు, తలభారం,చిన్నమోతాదులో విడవకుండా జ్వరం వచ్చేవి. ఇక్కడ ఎక్కువగా వుండే కాంగ్రేస్ గ్రాస్ కారణంగా నాకు చాలా త్వరగా  జలుబు చేసి, అది సైనసైటీసిగా అటాక్ అయి, అది జ్వరంగా రూపాంతరం చెంది నన్ను బాగా ఇబ్బంది పెట్టేది.
ఇదివరకు డాక్టర్లు చెప్పిన మందులు నియమబద్దంగా వాడుతూ, వేడినీళ్ళ ఆవిరి పట్టటం లాంటి ,ఏవో చిన్న చిన్న చిట్కాలు అవీ వాడి చూసి, కొన్నాళ్ళు నడిపించాను.
అయినా తిరిగి తిరిగి ఇదే పరిసస్థితి తలెత్తుతుండటంతో నా మిత్రుడి సలహా మేరకు వాళ్ళ ఫామిలీ డాక్టర్ గారైన  రావు గారిని సంప్రదించాను. నాకున్న పూర్వ జన్మ ఞ్న్యానం వల్ల (ఇదివరకటి ఉద్యోగం వల్ల అని నా భావం) డాక్టర్లు ఏమి వ్రాయబోతారో కూడా నాకు తెల్సు.
ఆయన కాస్తా పొట్టిగా వుంటారు. బయటెక్కడన్నా చూస్తే ఆయన డాక్టర్ అంటే నమ్మబుద్దేయదు. నన్ను చూసి పరీక్షించినప్పుడు ఆయన మేనరిజం చిత్రంగా వుండి నాకు బాగా గుర్తుండిపోయింది.  దయవర్షించే కళ్ళతో మనం చెప్పేదంతా విని, లేచి నిలబడి, టేబులు కు అవతలి వైపు నుంచి ఇవతలికి వచ్చి, ఆ తరువాత గంభీరంగా స్టెతస్కోపుని నా చాతీపై ఆనించి, శ్రద్ధగా ఏదో గమనించారు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడా అన్నట్టు ఒక భావనని తన మొహంపై చూపించారు, క్షణంలో వెయ్యవ వంతులో. ఇక చేసేదేమీ లేదన్నట్టు మొహం భావరహితంగా పెట్టేసి,  నిరాశనిండిన నడకతో కాస్తా వైరాగ్యంగా వెళ్ళి తన కుర్చీలో కూర్చుని, కాసేపు కళ్ళని అర్థ నిమీలితంగా పెట్టి, ఇక చెప్పక తప్పదన్నట్టుగా కళ్ళు తెరిచి, పెన్నుని టేబుల్ పై తాటిస్తూ, విషాదంగా మొహం పెట్టీ ఒక ప్రకటన చేశాడు - ’ఇక తప్పదు, మీకు అమోక్సిసిసిలిన్ పెట్టాలి’ అని. నిజానికి అది ప్రాథమిక స్థాయి అంటే ఎంట్రీలెవల్ ఏంటీ బేక్టీరియల్. నిజానికి అది చెప్పటానికి  అంత నాటకీయత అవసరం లేదు.
’సర్ అవి వాడేశాను. అంతేకాదు దాన్ని కేవలం విడిగా కాక, పొటాషియం క్లావులనేట్ తో ఫోర్టిఫై చేసి ఫలానా డాక్టర్ గారు చెప్పగా పూర్తిగా రెండు కోర్సులు వాడాను’. అని చెప్పాను.
"వ్హాట్!" అంటూ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు. ఆయన భయాన్ని మరింత పెంచుతూ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, సెఫలోస్పొరిన్లు నాకు పనిచేయవని, మాక్రోలాయిడ్స్ లో ఏరిత్రోమైసిన్ నాకు బాగా గ్యాస్టిక్ ఇరిటేషన్ కల్గిస్తుందని, రాక్సిత్రోమైసిన్ ఫర్వాలేదని, ఫ్లోరొక్వినొలోన్లు స్పార్‍ఫ్లాక్ససిన్ కూడా వాడటం జరిగిందని, వీటికి సప్లిమెంట్గా హిమాలయా వారి సెప్టిలిన్ కూడా నాపై వాడి చూశారని చెప్పుకొచ్చాను.
ఆయనకి అక్షరాల మిడిగుడ్లు పడ్డాయి.
మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయ్యాక చెప్పుకొచ్చారు,  ఆయన కెరియర్ లో మొదటి సారి కంగారు పడ్డారుట నా మాటలు విని. ఆయన నా అత్మవిశ్వాసం చూసి, మందుల పట్ల, డోసేజీల పట్ల, సైడ్ ఎఫెక్ట్స్ పట్ల నాకున్న సాధికార పరిఞ్యానం చూసి కాస్తా కంగారుగా ఫీల్ అయ్యారు.
తరువాత సంభాషణలో చెప్పుకొచ్చాను, ఇదివరకు నేను వెలగబెట్టిన ఫార్మా కంపెనీల ఉద్యోగాలు, వాటిలో నాహొదా  గట్రా , నా ఫార్మకాలజీ నాలెడ్జీ ,తెలుసుకుని కాస్తా తమాయించుకుని అప్పట్నుంచి నన్ను కాస్తా గౌరవంగా చూడటం మొదలెట్టారు.
అయ్యా ఇవన్నీ వాడేశాను, ఫలానా మందు వ్రాసి చూడండి అని సలహా ఇచ్చే వాడిని. ఈ విధంగా కొన్నివిడతలు గడిచాయి. ఇలా నాకు కావలసిన మందుల్ని ఆయనతో చర్చించి , ఆయన చేత వ్రాయించుకుని అవి వాడి కొన్ని విడతలు బండి నడిపించాను.
అయినా ఈ మాయదారి జ్వరం, జలుబు, సైనసైటిశ్ వదలవే.
అప్పటికే వాడాల్సిన మందులన్నీ ఫార్మకాలజీ బుక్స్ లో అయిపోయాయి. ఒక సారి నేను ఆయన కూర్చుని ఇద్దరు మెడికల్ ప్రొఫెసర్స్ లాగా తీవ్రంగా చర్చించుకుని, నాకు  మాష్టర్ హెల్త్ చెకప్ చేయించాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఆ టెస్టుల ప్రహసనం సెపరేట్గా ఓ ఎపిసోడ్ వ్రాయాలి.
సరే రిపోర్టులు వచ్చాయి. దానిలో నేను ఇంచుమించు పిడిరాయిలాగా వున్నానని నివేదిక వచ్చింది.
అప్పుడు సజెస్ట్ చేశారాయన "మీరు నా మాటమీద విశ్వాసం వుంచి, సరిగ్గా రేపుదయం నుంచి వాకింగ్ మొదలెట్టండి" అని.
ఏ పని చేసినా లోతుగా చేయటం ఒక అలవాటుంది కద. అట్నుంచి అటు షూస్ షాప్ కెళ్ళి వాకింగ్ షూస్, బుక్ షాప్ కెళ్ళి ’ఎక్సర్‍సైజుల్లో కింగ్- వాకింగ్" అన్న పుస్తకాన్ని కొని రాత్రికి ఇంటికి వెళ్ళాను.

***
ఈ లోగా ఒక హోమియోపతి డాక్టర్ గారు నాజివితంలోకి ప్రవేశించారు.
 ఆయన ఇంచుమించు ఒక రీసెర్చ్ చేశారు నా మానసిక స్థితి పట్ల, నా శారీరిక స్థితి పట్ల. నాకొచ్చే కలల గురించి, నాకు కలిగే మానసిక భావాల గురించి, నా వ్యక్తిత్వం గురించి ఒక సీ.బీ.ఐ ఏజెంట్ లాగా విపరీతంగా ప్రశ్నలు వేసి నన్ను కంగారు పెట్టేశారు. చెమట ఎప్పుడు పడుతుంది, దాహం ఎప్పుడెప్పుడు వేస్తుంది, కలలో ఏమేమి కనిపిస్తాయి, సమస్యలొస్తే ఎలా స్పందిస్తాను, సమస్యలు లేకుంటే ఎలా స్పందిస్తాను, కోపం ఎలా వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఏమి చేస్తాను, రాకుంటే ఏమి చేస్తాను, ఎలాంటి ఆహారం అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం... ఇలా బోలెడు ప్రశ్నలు వేసి ఆయన నాగురించి కొద్దిగా అర్థం చేసుకున్నట్టే కనిపించారు.
కానీ ఒకటి మాత్రం నిజం. మా ఆవిడకి కూడా నాగురించి ఇంత వివరణాత్మకంగా, లోతుగా తెలియదనుకుంటాను. హోమియో డాక్టర్లని సీ.బీ.ఐ విచారణ కమిటీలో వేస్తే బహుశా జగన్ గారు కూడా  జేడీ లక్ష్మీనారాయణగారికి ఆట్టే శ్రమలేకుండా వివరాలు త్వరగా చెప్పేసి వుండేవారేమో అని అనిపిస్తుంటుంది అప్పడప్పుడు నాకు.
ఇవన్నీ అటుంచితే నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ కన్నా హోమియో వైద్యం చాలా సత్ఫలితాలు ఇచ్చింది.
ఏది ఏమయినా వాకింగ్ చేయమని, నాకు చక్కటి సలహా ఇచ్చిన డాక్టర్ రావు గారికి హోమియో ద్వారా నా జీవితాన్ని తియ్యటి మలుపు తిప్పిన శ్రీకాంత్ కులకర్ణి గారికి, నీళ్ళు ఎలా త్రాగాలో యూ ట్యూబ్ ద్వార తెలియజేసిన రాజీవ్ దీక్షిత్ గారికి ఇలా ఎందరో మహానుభావులు, అందరికీ ఫేస్ బుక్ మూలకంగా ధన్యవాదాలు.
స్వస్తి.

Sunday, April 26, 2020

ముంగిట్లో మృత్యువు (కథ )

ఇది ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక లో ప్రచురింపబడ్డ కథ. 
ఆంధ్రభూమి వారపత్రిక లో తులసిదళం సీరియల్ వచ్చేవరకు కూడా ఆంధ్రప్రభ తెలుగు నాట అత్యధిక సర్కులేషన్ కలిగిన పత్రిక. 
ఎటువంటి అసభ్యతకు తావు లేకుండా చక్కటి కథలు, సీరియల్స్, శీర్షికలు ఉండేవి ఆంధ్రప్రభలో. 
అందులో నావి ఎక్కువ కథలు ప్రచురింపబడటం నాకు ఒక ప్రత్యేక ఆనందం. 

మూగి ఎండ (Mugi Enda ) (కథ )

'మూగి ఎండ '  కథ ఈనాడు ఆదివారం అనుబంధం లో ప్రచురింపబడ్డ నా రెండవ కథ. 
ఇది చాలామంది మేధావుల ప్రశంసలు పొందినది. 

యామిని (Yamini ) (కథ )

ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధం లో పడ్డ నా మొదటి కథ. 

"మీ స్థానంలోకి వీరు వస్తారు" (ఒక జ్ఞాపకం-12)



"మీ స్థానంలోకి వీరు వస్తారు"
(ఒక జ్ఞాపకం-12)
ఇది ఒళ్ళు గగుర్పొడిచే ఒక మెమొరీ.
ఇది నమ్మశక్యం కాని అనుభూతి అన్నమాట వాస్తవమని మీరు ఒప్పుకొంటారు చివరి దాకా చదివితే. 
తక్కువ వాక్యాలతో చెప్పే ప్రయత్నం చేస్తాను.  బ్రెవెటి ఈస్ ది సోల్ ఆఫ్ నేరేషన్ అని ఇటీవల ఒక మిత్రుడు అన్నాడు.
ఇది జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది. 
అప్పట్లో హైదరాబాదు లో దిల్‍షుక్‍నగర్‍లొ "భవాని నగర్" లొ రామదాసు గారి ఇంట్లో అద్దెకి ఉండే వాళ్ళం. 
అది మూడు అంతస్తుల ఇల్లు. మాకు గ్రౌండ్‍ఫ్లోర్‍ లో ఉన్న ఇల్లు దొరికింది. పైన రెండు అంతస్తులు. ఓనర్లు ముగ్గురు అన్నదమ్ములు. అన్నింటికన్నా పైనున్న ఫ్లోర్లో పెద్దన్నయ్య, రెండవ ఆయన మధ్య అంతస్తులో వుండే వారు. 
మాకు దొరికిన వాటా అందరికన్న చిన్నవాడయిన వాళ్ళ తమ్ముడిది. ఆయన అనంతపురం లో మెడికల్ రెప్రజెంటేటివ్ గా వర్క్ చేసే వారు.అందువల్ల ఆ వాటా ఖాళీగా వుండేదన్న మాట. అందువల్ల అది మాకు అద్దెకి ఇవ్వబడింది.
ఇల్లు చాలా సౌకర్యంగా వుండేది. విశాలమైన జాగా, వెనుక పెరడు లాంటి ఖాళీ జాగా. ఏ ఇబ్బంది వుండేది కాదు.
రెండో అంతస్తులో వున్న రామదాసు గారు, వారి శ్రీమతి మాకు వారి తమ్ముడి (ఓనర్ ) గారి తరఫున  మా బాబోగులు చూసుకోవటం  అవసరమైన సౌకర్యాలు కల్పించటం, రెంట్ కలేక్ట్ చేసుకోవటమ్ చేసే వారు. 
ఆయన అప్పుడప్పుడు అనంతపురం నుంచి వచ్చి మమ్మల్ని గ్రీట్ చేసి వెళ్ళే వారు. ఆయన కూడా చాలా సౌమ్యుడు.
చాలా మంది మేము కూడా వాళ్ళింటి సభ్యులనే అనుకునే వారు. మమ్మల్ని అంత బాగా చూసుకొనే వారు. వాళ్ళ ఇంట్లో ఏదయినా పెళ్ళీ పేరంటం అంటే మా భోజనాలు అక్కడే, మేము అక్కడ ఇంక వాళ్ళ ఇంటి సభ్యులలాగానే కలిసి పోయాము.
నేనొక సారి మా గురువు గారి సమాధి మందిరం వెళ్ళాను. నెల్లూరు జిల్లా గొలగమూడిలొ వున్న వెంకయ్య స్వామి వారి మందిరానికి వెళ్ళటం నాకు రివాజే.
వీలయినంతవరకు అక్కడ నేను కనీసం ఒక నిద్రచేస్తాను. అలా ఒక నియమం పెట్టుకున్నాను. ఆ స్వామితో నాకు జరిగిన మహిమలనండి, మిరాకిల్స్ అనండి, అవి ఏకరువు పెడితే నాస్తికులు నమ్మరు.
అవి ఎవరికి వారు అనుభవించవలసిందే.
అక్కడ నిద్ర చేసిన ఆ విడత నాకు ఒక కల వచ్చింది. అందులో మా ఓనర్ గారి శ్రీమతి వచ్చారు. ఓనర్ గారు అంటే రెండో అంతస్తులో వుండే రామదాసు గారి శ్రీమతి గారన్నమాట.
కలలో ఆవిడ చెప్పిన మాటలు నాకిప్పటికి స్పష్టాతి స్పష్టంగ గుర్తున్నాయి. ఆవిడ ఏమన్నారంటే, మొహమంతా భావరహితంగా పెట్టుకుని, కను రెప్పలు సైతం కదలాడించకుండా , ఏ రకమైన ఎమోషన్ లేకుండా నా వంక సూటిగా చూస్తూ " మీ స్థానంలోకి వీరు వస్తారు, మీరు ఈ ఇల్లు ఇక ఖాళీ చేయాలో, ఎక్కువ సమయం లేదు" అని అంటూ కొద్దిగా పక్కకి జరిగి నిలబడ్డారు కలలో. అప్పుడు ఆవిడ వెనుక , వారి మరిది గారు నిలబడి వున్నారు. అంటే మా ఇంటికి అసలైన ఓనర్, అనంతపురంలో మెడికల్ రెప్రజెంటేటివ్‍గా పని చేస్తున్న కుర్రాడు. ఆయన పేరు నాకు గుర్తు లేదు. ఆయనకి ఇద్దరు అబ్బాయిలు కూడా వున్నట్టు గుర్తు నాకు.
అంతటితో ఆ కల అయిపోయింది. 
ఇదేంట్రా ఇలాంటి కల వచ్చింది. అసలు ఆ ఇల్లు ఖాళీ చేసే ఉద్దేశ్యం మాకు లెదు, ఖాళీ చెయించే ఉద్దేశ్యం వారికీ లేదు. ఏదో యాధృచ్చికమైన కల అనుకుని తిరిగి హైదరాబాదు వచ్చేశాను.
రావటం రావటం మా ఆవిడకి చెప్తే ఆమె కూడా ఈ విషయాన్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. అసలా ప్రసక్తే లెదు కద.
కొద్దిరోజులకల్లా కలలో చెప్పిన విధంగానే జరిగింది. వారి మరిది గారి గురించి ఇల్లు ఖాళీ చేయమని చెప్పరు ఆవిడ. అసలలా చెప్పటం ఆవిడకి అసలు ఇష్టం లేదని, తప్పని సరిగా చెప్పవలసి వస్తోన్నట్టు చెపుతున్నారని అనిపిస్తోంది ఆవిడ ముఖ భంగిమలు చూస్తే.
ఇక తప్పదు కద. 
తక్కువ సమయం వుండటం వల్ల దొరికిన ఇంట్లో వనస్థలిపురంలో స్థిర పడ్డాం.  ఆ తర్వాత దేవుడు చల్లగా చూడటం వల్ల ఓ రెండు మూడు సంవత్సరాలలో స్వంత ఇల్లు కొనుక్కున్నాం. ఆ స్వంత ఇంటి గృహ ప్రవేశానికి ఆహ్వానించే నిమిత్తం మా పాత ఇంటి ఓనర్ గారిని కలవటానికి వెళ్ళాం.
ఈ రెండేళ్ళలో వారిని కలవలేక పోయాం వాస్తవానికి. 
క్రింద ఇంట్లో ఇంతకూ వారి తమ్ముడు గారు లేరు. మాటల్లో  తెలిసింది ఏమిటంటే మేము ఖాళీ చేసిన రెండే రెండు నెలలలో ఆయన ఓ స్కూటర్ ఆక్సిడెంట్‍లో చనిపోయారట.
ఓ మైగాడ్.
" మీ స్థానంలోకి వీరు వస్తారు, మీరు ఈ ఇల్లు ఇక ఖాళీ చేయాలో, ఎక్కువ సమయం లేదు" 
కలలోని ఆవిడ మాటలు తరచూ స్పష్టంగా గుర్తు వస్తూ వుంటాయి నాకు.

"బాంబులతో అనుభవాలు" (ఒక జ్ఞాపకం-11)





"బాంబులతో అనుభవాలు"
(ఒక జ్ఞాపకం-11)
రాయలసీమతో ప్రత్యక్ష సంబంధాలున్నప్పటికీ నాకు ఫాక్షనిస్టులవల్ల గానీ, బాంబులతో గానీ ఏనాడు ఇబ్బందికరమైన పరిస్థీతులు ఎదురు కాలేదు.
కడప బాంబులు అని వినటమే గానీ చూసింది లేదు. ఆళ్ళగడ్డ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పులివెందుల, యర్రగుంట్ల, జమ్మలమడుగు, కడప,కర్నూలు, అనంతపురం ఈ ఊళ్ళన్నిట్లో స్కూలు చదువులు చదువుకున్నాను, స్నేహితులతో తిరిగాను, ఉద్యోగరిత్యా అనేకమందితో కలిసి పనిచేశాను. కానీ రాయలసీమలో ఎక్కడా నాకు బాంబులు ఎదురుకాలేదు.

కానీ నేను బాంబు పేలుళ్ళను ప్రత్యక్షంగా చూడాల్సిచ్చింది. ఒక సారి కాదు దాదాపు మూడు సార్లు. అవెలా జరిగాయో చెపుతాను.

బాంబు పేలుళ్ళుకు కేవలం వంద అడుగుల దూరంలో నేను వుండవలసి వస్తుందని నేను కలలో సైతం అనుకోలేదు.
కోయంబత్తూరు కు ప్రమోషన్ పై వెళ్ళిన కొత్తలు. తమిళ భాష సరిగ్గా రాదు. నగరం తాలుకు టొపోగ్రఫీ పూర్తిగా తెలియదు. కొత్తగా వచ్చిన ప్రమోషన్, కొత్త ఊరు, కొత్త భాష, కొత్త పరిచయాలు. తెలిసిన ఒకే ఒక మిత్రుడు నవీన్ కుంబ్లే.
అంతకు ముందు నుంచే పరిచయము ఉన్న ఆ పెన్ ఫ్రెండ్ ఫామిలీ తో కంపెనీ బాగా వుండేది. (అప్పటికి ఫేస్ బుక్కు, వాట్సాప్ వుండేవి కావు కద. అప్పట్లో పెన్ ఫ్రెండ్షిప్ అని ఒక సంస్కృతి అమల్లొ వుండేది లెండి. ఓ సారి ఏదో జాబ్ ఇంటర్వ్యూలో పరిచయం అయిన నవీన్ తో అలా నా స్నేహంకొనసాగింది.)
ఆ ఫ్రెండ్ పెరు నవీన్ కుంబ్లే. క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇంకా పాపులర్ కాని రోజులనుంచీ నాకు పరిచయం ఆ అబ్బాయి. మంగళూర్ కు చెందిన కోంకణీ బ్రాహ్మణ కుటుంబం వారిది. నవీన్ కుంబ్లే ఒక్కడే కుర్రాడు వాళ్ళ నాన్న గారికి. ఆయనపేరు జనార్దన్ కుంబ్లే., ఆయన ఎల్ ఐ సీ లో పని చేసే వారు, వాళ్ళ అమ్మ గారు ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో హిందీ టీచర్.
కుంబ్లే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో వుంటూ చిన్నచిన్న జాబ్స్ చేసుకుంటూ వుండేవాడు. అప్పటికి ఆ కుర్రాడికి ఇంకా పెళ్ళి కాలేదు.
కుంబ్లేల కుటుంబం నన్నూ,నా శ్రీమతిని బాగా ఆదరించే వారు. వారు అక్కడి స్థానికులు అవటాన మాకు గైడెన్స్ ఇచ్చేవారు అన్నిటా.
1998 ఫిబ్రవరి 14 కోయంబత్తూరు. (ఓ భయంకరమైన రోజు)
కంపెనీ పనిపైన గాంధీనగర్ లో రాజరాజేశ్వరీ టవర్స్ వెనుకున వున్న ఓ లాయర్ గారి వద్దకు వెళ్ళాము నేను, నవీన్ కుంబ్లే.
అప్పటికి సమయం మధ్యాహ్నాం రెండున్నరయ్యుంటుంది.
లాయర్ గారు నవీన్ క్లాస్ మేటే. లాయర్ గారు మాకు కావాల్సిన సలహాలు ఇచ్చి, ఆఫీస్ గదికి ఆనుకునే వున్న విశాలమైన రాజసౌధం లాంటి ఇంట్లోకి ఆహ్వానించారు.. చాలా సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఆ లాయర్ గారిది. చక్కటి ఫిల్టర్ కాఫీ, మురుకులు ఇచ్చి ఆదరంగా మాట్లాడుతూ వుండిపోయారు.
ఆ లాయర్ గారు ఇచ్చిన సలహాలని చెన్నైలోని మా రీజినల్ మేనేజర్ గారికి ఎస్.టీ.డీ ఫోన్ చేసి చెప్పాలి. అందుకే ఇక శెలవు తీసుకోవాల్సొచ్చింది. చూస్తుండగానే ఓ గంట నిమిషంలా గడిచిపోయింది వారి ఇంట్లో.
మెయిన్ బస్టాండ్ పక్కనున్న రాజ రాజేశ్వరీ టవర్స్ వద్ద ఎస్.టీ.డీ బూత్ నుంచి ఫోన్ చేస్తే ఓ పని అయిపోతుంది అని బయలుదేరాం. కైనేటిక్ హోండా స్టార్ట్ చేసుకుని బస్టాండ్ దాటి ముందుకెళుతున్నాం.
అప్పుడు జరిగింది ఆ సంఘటన.
ఇంచుమించు బస్టాండ్ దాటి మలుపు తిరుగుతున్నాం. సరిగ్గా ఓ వంద అడుగులు వెళితే చాలు రాజరాజేశ్వరీ టవర్స్ అని పిలవబడే షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది.
అప్పుడు సమయం సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలా అయిదు నిమిషాలు.
ఏదయితే షాపింగ్ కాంప్లెక్స్ కి మేం చేరుకోవాలో అది మా కండ్లముందరే కనిపిస్తోంది. మా చెవులు బైర్లు కమ్మేలా, కళ్ళు మిరిమిట్లు గొలిపేలా పెద్ద పేలుళ్ళు రెండు జరిగాయి మాకు సరిగ్గా వంద అడుగుల దూరంలో.
ఊహించని ఆ పరిణామానికి సడెన్ బ్రేక్ వేయటంతో అదుపు తప్పిన స్కూటర్ పైనుంచి నేను, నవీన్ ఇంచుమించు క్రింద పడినంత పనయ్యింది.
కొంచెం తేరుకుని చూస్తే అర్థం అయ్యింది, రాజరాజేశ్వరీ టవర్స్ తాలూకూ సెల్లార్ పార్కింగ్ లో ఏదో పేలుడు జరిగిందని. బహుశా ట్రాన్స్‌ఫార్మర్ పేలిందేమోననుకున్నాం మొదట.
ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ అయోమయాన్ని కలిగించేవే.
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారానికి వచ్చిన శ్రీ ఎల్.కే.అద్వానీ గారిని అంతమొందించే ప్రయత్నంలో నగరమంతటా సీరియల్ బాంబులు పెట్టారని క్రమంగా తెలిసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో పన్నెండు బాంబులు పేలాయి వివిధ స్థలాల్లో. ఇంకా పేలకుండా మిగిలిపోయిన డజన్ల కొద్ది బాంబుల్ని పోలీసులు తరువాత నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్ళలో దాదాపు రెండు వందలమంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు, కొద్ది మంది అదృష్టవంతులు ప్రాణాలతో బట్టకట్టగలిగారు. వాళ్ళలో నేను ఒకడిని.
నేను బాంబు పేలుడుకి ఇంత దగ్గర్లో ఉండినానని మా ఇంట్లో వారికి ఇప్పటికీ తెలియదు.

ఆ సమయంలో మా శ్రీమతి పరిమళ లత కడపలో ఉన్న మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వుండింది. ఇంట్లో నేను ఒక్కడినే. దాదాపు వారం రోజులు కర్ఫ్యూ పెట్టారు. నేను ఓ రెండ్రోజులు చూసి రైలెక్కి కడపకెళ్ళిపోయాను. కానీ ఆ రెండు రోజులు కుంబ్లే కుటుంబం నన్ను స్వంత బిడ్డలాగా చూసుకున్నారు.
ఒక అందమైన ఊరు, శాంతికి నిలయమైన నగరం, చల్లటి వాతావరణానికి పెట్టింది పేరు , రిటైర్‍అయిన వారికి స్వర్గం అన్న పెరున్న ఓ నగరం కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఓ స్మశానంగా మారిపోయింది. కారణం ముమ్మాటికీ ఇస్లాం టెర్రరిస్టులే.
ఆ పేలుళ్ళు ఆ నగర ముఖ చిత్రాన్నే కొన్ని సంవత్సరాల పాటు మార్చేశాయి. వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. పరస్పర నమ్మకాలు దెబ్బతిన్నాయి. స్వేచ్చగా తిరిగే వాతావరణం దెబ్బ తింది. ఆ తర్వాత దాదాపు ఓ రెండేళ్ళ పాటు ప్రతి కూడలిలో పోలిసు అవుట్‍పోస్టులు, చెక్కింగ్ లు.
ఏది ఏమయినా నవీన్ కుంబ్లే కుటుంబానికి మరొక్కసారి ఈ ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా థాంక్స్.
Coimbatore Bomb Blasts

"ఎలుకకి ప్రాణ సంకటం" (ఒక జ్ఞాపకం-10)



ఎలుకకి ప్రాణ సంకటం"
(ఒక జ్ఞాపకం-10)
"పాండురంగం గారున్నారా" అన్న నా ప్రశ్నకి అక్కడున్న రిసెప్షనిస్ట్ లాంటి వ్యక్తి ఒక్క సారి తను చేసుకుంటున్న టైపింగ్ పని ఆపి ఒక సారి నా వంక తేరిపారా చూసి, ఏదో నిర్ణయానికి వచ్చిన వ్యక్తిలాగా లేచి నిలబడి
"నాతో రా బాబూ" అంటూ అక్కడే వున్న ఓ పెద్ద గది వంక తీసుకువెళ్ళాడు. 
చూడంగానే బయటనుంచే అర్థమౌతోంది ఓ పెద్ద ఆఫీసర్ గారి గది అని;
అప్పటికి నావయసు మహా అంటే పదిహేను నిండి పదహారు నడుస్తూ వుంటుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను అప్పటికి. 
కాలేజి అవగానే బుక్స్‌తో సహా All India Radio Cuddapah Station (ఆకాశవాణి కడప కేంద్రం) కి సైకిలెక్కి వెళ్ళిపోయాను. అప్పటికి కడప ఆకాశవాణి కడప కేంద్రం బస్టాండ్ రోడ్లో ఇప్పుడున్న కొత్త బిల్డింగ్‍లో వుండేది కాదు. రమేష్ థియేటర్ ప్రక్కనున్న సందులోంచి వెళితే వచ్చే ఎన్.జీ.వో కాలనీలో అద్దె భవంతిలో వుండేది. ఇదంతా 1984 ఆ ప్రాంతాలలో విషయం.
"ఇదే సర్ గది. లోనికి వెళ్ళండి" అని చెప్పి వెళ్ళిపోయారాయన.
నేను స్టేషన్‍లోనికి అడుగుపెట్టే ముందే బయట డిస్‌ప్లే బోర్డ్‌లొ అక్కడి ఆఫీసర్ల పేర్లు చూసి నోట్ చేసుకుని ఈ పాండురంగం గారి పేరు గుర్తుపెట్టుకుని లోనికి వెళ్ళాను. అంతే. ఆయన స్టేషన్ డైరెక్టరా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివా కూడా నాకు తెలియదు.
నేను లోనికి అడుగు పెట్టగానే ఏదో వ్రాసుకుంటున్న ఆయన తలెత్తి ఒక సారి నన్ను చూసి ఖంగు తిన్నారు. పట్టుమని పదహారు ఏండ్లు లేని నేను, ఏ అప్పయింట్ మెంట్ లేకుండా , కాన్ఫిడెంట్ గా ఆయన చాంబర్ లోకి వెళ్ళి ఎదురుగా నిలబడి వుండటం ఆయన అస్సలు ఊహించి ఉండలేదట, తర్వాత మా పరిచయం పెరిగిన తర్వాత చెప్పారాయన. 
"ఎవరు బాబు నువ్వు?" అని అడిగారు ఆయన దయగా.
"నేను కథలు వ్రాస్తుంటాను.మన ఆకాశవాణి కడపకేంద్రంలో అప్పుడప్పుడు కథానికలు వస్తుంటే విన్నాను. పత్రికలకు పంపాలంటే సరయిన ప్రొసీజర్ తెలీదు. సరే, మన ఊర్లోనే వుంది కద ఆకాశవాణి కేంద్రం, ఇక్కడే చదివి వినిపిద్దాం అని వచ్చాను" అని నింపాదిగా చెప్పాను.
అక్కడికి నేనేదో ఆయనకి మెహర్బాని చెయ్యటానికి వచ్చానన్నట్టు చెప్పాను. నిజానికి నాభావం కూడా అదే. అమాయకత్వం అంటే అదే. అప్పటికి నాకున్న ధృఢమైన అభిప్రాయం ఏంటంటే, పత్రికలలో పడితేనే రచయితకి నిజమైన గౌరవం అని, మిగతావన్నీ రాజీ పడటమేనని.
పక్కలో బాంబు పడ్డట్టు అదిరి పడ్డారాయన.
"ఏంటి నువ్వు కథలు వ్రాస్తావా, అవి చదివిపెడ్తావా? బాగుంది. ఇప్పటి దాకా ఏమయినా వ్రాశావా?"
ఆయన అడగటమే తరువాయి, వెంటనే నా కాలేజీ నోట్ బుక్స్ తీసి, వాటిలో అక్కడక్కడా వ్రాసుకున్న కొన్ని రాతలని ఆయనకి చూపించాను. మొదట కాస్తా అనాసక్తిగా తిరగేసినా క్రమంగా ఆయనలో ఆసక్తి పెరగటం గమనించాను.
"ఇవన్నీ నువ్వే వ్రాశావా, లేదంటే లైబ్రరీకి వెళ్ళి ఏవయినా పుస్తకాలు చూసి వ్రాశావా?" చివరికి ఆయన ప్రశ్నించారు. నేను గాయపడ్డ వాడిలా చివ్వున చూశాను, నా రియాక్షన్ ఆయన గమనించారు.
"సరే, నేను ఒక థీమ్ చెప్తాను. ఇప్పటికిప్పుడు వ్రాస్తావా?" అడిగారాయన.
"సరే" అన్నాను
ఆయన ఒక సారి చుట్టూ చూసి, టేబుల్ పైవున్న ఆవేళ్టి న్యూస్ పేపర్ అందుకుని, ఏదో మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఉరి వేసుకుని చనిపోయిన కుర్రాడి గురించిన వార్త ఒకటి చూపించి, 
"దీని ఆధారంగా వ్రాయి ఇప్పటికిప్పుడే, నాకు నచ్చితే నీచేతనే యువవాణి కార్యక్రమంలో చదివింపజేస్తాను" అన్నారాయన. 
అందులో ఇబ్బందేముంది అనుకుని, నా కాలేజి నోట్ బుక్ ఒకటి ఓపెన్ చేసి వ్రాయటానికి సిద్ధ పడిపోయాను.
"ఆగాగు" అని ఆయన్ బజ్జర్ ప్రెస్ చేసి ఇందాకటి ఫ్రంట్ డెస్క్ ఆయన్ని కేకేసి పిలిపించి, "ఇదిగో ఈ కుర్రాడిని నీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని, అతనికి కొన్ని A4 షీట్లు ఇచ్చి, కాస్తా కాఫీ, టీ ఏమన్నా కావాల్నేనేమో కనుక్కుని, ప్రశాంతంగా వ్రాసుకునేలాగా వాతావరణం కలిపించు" అని చెప్పారు.
నేను వెళ్ళి కూర్చుని వ్రాయటం ప్రారంభించాను. లోపల్నుంచి ఆయన కంఠం వినిపిస్తోంది.
"ఇంతకూ ఎవరయ్యా ఈ కుర్రాడు?"
"నాకు తెలియదు సార్, హుందాగా వచ్చి మీ పేరు పెట్టి అడిగితే మీ బంధువుల కుర్రాడేమోననుకున్నాను" ఆయన చెపుతున్నాడు , లోపల్నుంచి ఈ సంభాషణ నా చెవుల్లో పడుతోంది.
’రిజర్వేషన్ సిస్టం గురించి, ర్యాగింగ్ లగురించి, ప్రేమ ఆకర్షణల గురించి కొన్ని థీంలు నా మెదడులో ఆల్రెడీ వుండటం వల్లా చకచకా వ్రాసేసి, ఓ అరగంటలో ఆయన ముందు వాలి పోయాను.
’ఓ పల్లెటూరి పేద కుర్రాడు, అగ్ర వర్ణాల వాడు, కష్టపడి చదువుకుని ఎమ్‍సెట్ వ్రాసి ప్రతిభ ఆధారంగా మెడిసిన్ లో సిట్ తెచ్చుకుని, ధన మదంతో అహంకారంతో ప్రవర్తించే సీనియర్ స్టూడెంట్ల కారణంగా, ఆత్మగౌరవం దెబ్బ తిని, ఆత్మ హత్య చేసుకుని చనిపోతాడు. అదీ నేను వ్రాసిన కథ. దానికి ఓ చిత్రమైన టైటిల్ పెట్టాను, "------ఎలుకకి ప్రాణ సంకటం" అని. ఆ గ్యాప్ లో "పిల్లికి చెలగాటం" అన్న భావాన్ని ధ్వనింపజేస్తూ.
"అబ్బాయి అంతా బాగుంది కాని, ఈ ’ఎలుకకి’ అన్న పదం తీసేద్దాం, నీ ఉద్దేశ్యం నాకర్థమయింది కానీ, ప్రింట్ లో అయితే చుక్కలు వ్రాయచ్చు, మనది ఆకాశవాణిలో చదివే కథానిక కద, ఆ భావాన్ని ఎలా చెప్పగలం? అందుకే ఉత్తి ’ప్రాణ సంకటం’ అని ఉంచేద్దాం. అదీ కాక ఆ అబ్బాయిని అగ్రవర్ణాల పేద వాడిగా కాక, వెనుకబడ్డ పేదవాడిగా మారుద్దాం, ఆ పాత్ర పట్ల శ్రోతలకు ఇంకా సానుభూతి కలుగుతుంది."
అలా ప్రారంభమైంది నా అనుబంధం ఆయనతో. ఆయనకి నాకు దాదాపు నలభై ఏళ్ళ అంతరం వున్నా వయస్సులలో నన్ను ఒక రచయితగానే ట్రీట్ చేసే వారాయన. 
’సరస్వతీ పుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు, కథల మేష్టారు శ్రీ మధురాంతకం రాజారాం, శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి గారు’ వంటి మొదలగు మహా మహుల గళాలు వినిపించిన ఆకాశవాణి కడప కేంద్రం నుండీ అలా నా కంఠం కూడా వినిపింపబడటం నా పూర్వ జన్మ సుకృతం.
ఆ తర్వాత నేను ఆదోనికి చదువు నిమిత్తం వెళ్ళినప్పటికీ, అక్కడి నుండీ కూడా నాకు రైలు చార్జీలు చెల్లించి మరీ నన్ను పిలిపించి నా కథలు చదివి వినిపించే వారు శ్రీ పాండురంగం గారు.
ఆ తర్వాత వరుసగా నా కథలు ఆంధ్రప్రభ వారపత్రికలొ, ఆంధ్రప్రభ దిన పత్రిక ఆదివారం అనుబంధంలో, ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమ్ అవటం మొదలయ్యాక, నేను ఆకాశవాణికి పంపటం మానుకున్నాను. పాపం అక్కడీకీ శ్రీ పాండురంగం గారు నాకు ఎన్నో ఉత్తరాలు వ్రాసి వ్రాసి విసుగెత్తి చాలించుకున్నారు.
ఆ పై ఓ మూడేండ్ల తర్వాత, కడపకి వచ్చినప్పుడు యధాలాపంగా ఆకాశవాణికి వెళ్ళాను. అప్పటికల్లా వారు బస్టాండ్ రోడ్లోని తమ స్వంత భవనాలలోకి మారారు. ఇప్పుడు శ్రీ పాండురంగం గారు కనపడలేదు, బహుశా ఎక్కడికో ట్రాన్స్‌ఫర్ అయ్యుంటారు. నాకు ఈ మారు శ్రీ ఆకుల మల్లేశ్వర రావు గారు పరిచయం అయ్యారు. ఈ విడతలో కూడా బోలెడు కథనికలు, నాటికలు వ్రాయటం జరిగింది. వారికి నేను శ్రీ మధురాంతకం మహేంద్రగారిని పరిచయం చేయటం జరిగింది ఆ రోజుల్లోనే. శ్రీ మహేంద్ర గారు ఇటీవలే స్వర్గస్తులవటం విషాదం. ఈ ముచ్చట్లన్నీ ఇంకో సారి చెప్పుకుందాం.
చాలా విరివిగా వ్రాశాను ఆ రోజుల్లో, నాకు ఇరవై ఏండ్ల వయస్సు వచ్చేటప్పటికే నా కథలు దాదాపు అరవై దాకా వెలుగు చూశాయి, అదీ ప్రముఖ పత్రికలలో. అకారణంగా అస్త్ర సన్యాసం చేసేశాను. 1989 నుంచీ 1992 వరకు నేను కథలూ విరివిగా వ్రాసిన రోజులూ అవే, నేను శాశ్వతంగా మరచిపోదలుచుకున్న రోజులూ అవే నా జీవితంలో. కొన్ని వ్యక్తిగత వైఫల్యాలు, పిన్నవయస్కుడైన బావగారి మరణం ఇలా కొన్ని సంఘటనలు నన్ను మరి కోలుకోనీకుండా చేశాయి ఆ రోజుల్లో.
ఆ తర్వాత ఒక విధమైన కసితొ ఫార్మా రంగంలో ఏకాగ్రతగా పని చేసుకోవటం, జరిగి పోయింది. 
దాదాపు ఓ ఇరవై మూడుసంవత్సరాలు కలం పట్టలేదు. నేను కలం పక్కన పెట్టకుండా వ్రాస్తూనే వుండుంటే ఏమయ్యేదో? ఏమో విధి అన్నది మన చేతిలో లేదు కద.మరలా హొగినెక్కల్ జలపాతం ద్వారా 2015 లో వ్రాయటం మొదలెట్టాను.ఇదండీ ఆకాశవాణిలో నా మొదటి కథ యొక్క కథ.

"మల్లిక" (ఒక జ్ఞాపకం-9)


"మల్లిక"
(ఒక జ్ఞాపకం-9)
నా మొదటి కథ ఏది అని అడిగాడు ఇటీవల ఒక మిత్రుడు.
పెద్ద చిక్కొచ్చి పడింది. ఆలోచించకుండా ఠకీమని సమాధానం చెప్పగలిగే ప్రశ్నకాదిది అని అర్థం అయింది.
ఎందుకో చెప్తాను వినండి.
వాస్తవానికి ’మల్లిక’ నా మొదటి కథ అని చెప్పవచ్చు. కాని ఇది ఏ మేగజైన్లోనూ ప్రచురింపబడలేదు.  కాబట్టి దీన్ని నా మొదటి కథగా పరిగణించలేమేమో. 
కానీ ఇది ప్రచురింపబడింది. ఎక్కడ పడింది అంటే, ఇది కాలేజి మేగజైన్లో పడింది. దీనిది కాపీ కూడా నా వద్ద ఇప్పుడు లేదు. కడప మోచంపేట రామకృష్ణ మెమోరియల్ జూనియర్ కాలేజి లొ చదువుకుంటున్నపుడు అప్పటికప్పుడు వ్రాసిన కథ అది. మద్రాస్ రోడ్లోని కైలాస్ ప్రెస్ వారితో ముద్రింపజేశారు మా కాలేజి వారు.
అప్పట్లోనే ఆకాశవాణి కడప కేంద్రం నుంచి నెనే చదివితే  నా కంఠంతో, నేను వ్రాసిన కథలు ప్రసారమయ్యాయి. అలాంటివాటిలో నా మొదటి కథ "ప్రాణ సంకటం". ఇదీ కూడా మేగజైన్‍లొ పడలేదు కాబట్టి దీన్ని కూడా నా మొదటి కథ అని నేను పరిగణించను. కానీ నేను డబ్బులు అందుకున్న మొదటి కథ ’ప్రాణసంకటం’ అని చెప్పవచ్చు. 
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్టు వ్రాయబడ్డ పెద్ద అఫిషియల్ లెటర్ ఒకటి హిందీ, ఇంగ్లీష్ భాషలలో ముద్రింపబడి ఆకాశవాణి నుంచి వచ్చేది మనకిచ్చే చెక్కుతో పాటుగా.  ఇవన్నీ గొప్ప అఛీవ్‍మెంట్స్ అని కూడా తెలియని అమాయకత్వం ఆ రోజుల్లో నాకు. ఇవన్నీ చాలా మామూలు విషయాలు అనుకోనే వాడిని.
వారపత్రికలలో ప్రచురింపబడితేనే రచయిత అని అనుకునే వాడిని.
చిట్ట చివరికి నేను కలలు కన్నట్టే, ఆ రోజుల్లో "పల్లకీ" అనే వారపత్రికలో నా కథ "పాపం! అతనికి తెలియదు" ప్రచురితమైంది. కానీ దీన్ని కూడా నేను నా మొదటి కథ అని పరిగణించలేను. ఎందుకంటే, ఎక్కడ పొరపాటు జరిగిందొ తెలియదు, కథ అయితే ప్రచురింపబడింది కానీ, రచయిత పేరు రాలేదు. ఉత్తిగానే కథ, కథ పేరు వచ్చింది అంతే. ఈ కథకి పాపం పేమెంట్ అయితే పంపించారు, బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కు ద్వారా ముఫై రూపాయలు.  ఆ రోజుల్లోనే నేను, మా అప్ప, నా ప్రాణ మిత్రుడు కంచనపల్లి రమణానంద్ వెళ్ళి బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఓపెన్ చేసి ఆ చెక్కుని అందులో జమ చేయటం జరిగింది. ఆ విధంగా నాకు వారపత్రికల ద్వారా డబ్బు సంపాయించి పెట్టిన మొదటి కథ ఇది.
ఆలిండియా రేడియో ద్వారా ఒక్కొక్క కథకి రెండు వందలనుంచి, నాలుగు వందల దాకా చెక్కులు వచ్చి వుండినా రాని ఆనందం , పల్లకి వారి నుంచి వచ్చిన చెక్కు నాకు ఎక్కువ తృప్తిని ఇచ్చింది.
ఇన్ని అవాంతరాల తర్వాత నా పేరుతో , ప్రింట్‍లొ వచ్చిన నా మొదటి కథ , నేను డిగ్రీ ఫస్టియర్‍లో వుండగా వచ్చిన "మంచుతెర" కథ నా మొదటి కథ అని చెప్పవచ్చు.  జగ్ జీత్ సింగ్ ఘజల్ "తుమ్ ఇతన జో ముస్కురా రహీ హో, క్యా ఘమ్ హై జిస్కో ఛిపా రహీ హో" విన్న తర్వాత కలిగిన ప్రేరణతో వ్రాసిన కథ.  దీనికి యాభై రూపాయలు M.O  ద్వారా పంపారు. ఆ కథ తాలూకూ కథ వివరంగ మరొ సారి చెప్పుకుందాం.
ఇక అసలు విషయానికి వద్దాం.
కాలేజి మేగజైన్ అయితేనేమి -  అచ్చులో వచ్చిన మొదటి కథ "మల్లిక" గురించి ఇక్కడ చెప్పుకుందాం.
కడప-మోచంపేట రామకృష్ణ జూనియర్ కాలేజీలో నేను ఇంటరి ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు కాలేజీ మాగజైన్‍కి కథలు, కవితలు, పజిల్స్ ఇలాంటివి ఇవ్వచ్చు అని ఒక రోజు సర్క్యులర్ వచ్చింది.
నేను ఇంచుమించు నా పద్నాలుగవ ఏటనుంచే సీరియస్‍గా వ్రాస్తూ వస్తున్నాను. కాకపోతే అవన్నీ ఫెయిర్ చేసి పెట్టుకోవాలని,కాగితానికి ఒక వైపే వ్రాయాలనీ, అక్షర దోషాలు లేకుండా నీట్‍గా ప్రెజెంటబుల్‍గా వుండాలని స్పృహవుండేది కాదు నాకు. తోచిన థీంని తోచినట్టు ఎక్కడపడితే అక్కడ వ్రాసేసే వాడిని. అలా వ్రాసి పెట్టుకున్న కథే ’మల్లిక’. ఎందుకో తెలియదు నేను కర్నూల్లో టెన్త్ చదివే రోజుల్లో , మా పక్క సెక్షన్‍లొ, ఇంగ్లీష్ మీడియంలో మల్లిక అనే అమ్మాయి వుండేది. నాకా రోజుల్లో ఆ అమ్మయన్నా , ఆ పేరన్నా చాలా ఇష్టం ఏర్పడి పోయింది. ఆమెతో పరిచయం కూడా నాకేం లేదు. ఆమె టెన్త్ తర్వాత బై.పీ.సీ తీసుకుని డాక్టర్ అయితే ఎలా ప్రవర్తిస్తుంది అని నాలో నేనే ఆలోచించుకుని, ఆ ఊహల్ని పేపర్‍పై పెట్టానన్న మాట. అదే ఈ మల్లిక కథ. మరామె నిజ జీవితంలో ఏమయిందో దేవుడికెరుక.
కాలేజి వారికి ఈ ’మల్లిక’ కథ ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను.  కానీ పెద్ద చిక్కొచ్చి పడింది. ఫెయిర్ చేసిన కాపీ చక్కగా పేపర్‍కి ఒక వైపే వ్రాసి ఇవ్వాలట. నాకా ఫెయిర్ చేసి ఇవ్వటం ఎలాగో తెలియదు.  ఫిజిక్స్ , కెమిస్ట్రీ లెక్చరర్లు టెస్టులని , ప్రాక్టికల్స్ అని తెగ తొందర పెడుతున్నారు. తీరిగ్గ కూర్చుని ఫెయిర్ చేయటం కుదరని పని.
ఆ రోజుల్లో దేవుడే పంపినట్టు మా ఎదురింట్లో, హైదరాబాద్ నుంచి వచ్చి, గాడిచర్ల రామారావు వీధిలో వుంటూ, కడపలో పని చేస్తున్న సూరిబాబు అనే ఒక బ్యాంక్ ఉద్యోగి, ఆయనకు తోడుగా ఆయన చెల్లెలు జ్యోతి అనే ఆవిడ వుండే వారు. ఆవిడ కూడా బ్యాంకు జాబ్స్ కై ప్రయత్నాలు చేస్తుండేది. నా ఇబ్బంది గమనించి ఆమె తానె చొరవ తీసుకుని చక్కగా A4 సైజు తెల్లకాగితాలపై ఓ రెండు గంటలలో గుండ్రటి ముత్యాలలాంటి అక్షరాలతో వ్రాసి ఇచ్చి, నీ కథ తప్పక ప్రచురింపబడుతుంది అని భరోసా ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ప్రోత్సహించింది. పాపం ఇప్పుడామె ఎక్కడుందో.
మల్లిక కథ ఏంటంటే, స్థూలంగా ఇది ఆ కథ.
మల్లిక అనే ఆవిడ ఓ డాక్టర్. ఈ కథ లో రెండు సీన్లు వుంటాయి. అంతే కథ. శైలీ,గియిలీ అనే పదాలు కూడా నాకు తెలియవు అప్పట్లో.
కథ ప్రారంభం సీన్లో ఓ ధనవంతుడైన ఓ వ్యక్తి బాగా ఖరీదైన కార్లో మల్లిక గారి క్లినిక్ కి వస్తాడు. ఏమి పెద్ద జబ్బు వుండదు. తిన్నది అరగని జబ్బు అంతే. కానీ మన మల్లిక అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచి, అతనికి చక్కటి సాంత్వనతోకూడిన మాటలు చెపుతూ,  అతనికి అనేక ఖరీదైన పరీక్షలు వ్రాయించి, ఓ రోజంతా తన క్లినిక్ లో వుంచుకుని బాగా ఖరీదైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా నమ్మించి భారీగా బిల్లు చేసి పంపిస్తుంది. పాఠకులకు ఆమె డబ్బు మనిషి, హృదయం లేనావిడ అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక మనవెవరమూ ఊహించని విధంగా రెండో సీన్లో ఓ నిరుపేద పేషంట్ కీ తన స్వంత ఖర్చుతో గుండె ఆపరేషన్ చేసి, అతనికి కావల్సిన అన్నిసౌకర్యాలు ఉచితంగా అందజేసి అతన్ని ఆరోగ్యవంతుడయ్యే వరకు తానే అన్నీ ఖర్చులూ భరిస్తుంది. 
కథకుడిగా నేను ఏమీ తీర్పులు చెప్పటం వ్యాఖ్యానాలు చేయటం ఏమీ చేయకున్నా, ఆమె మంచితనం పాఠకులకు అర్థమవుతుంది. కథ ముగిసిపోతుంది.
ఇదండీ నా మొదటి కథ యొక్క కథ.
నా మిత్రుడు KV రమణానంద్, నేనూ భక్తిగా జ్యోతి అక్కదగ్గర ఫెయిర్ కాపీలు తీసుకుని, వాటిని ప్రిన్సిపాల్ రూంలో అందజేయటం అంతా నిన్న మొన్న జరిగినట్టు వుంది.
శుభం.



పిల్లికి తలస్నానం (ఒక జ్ఞాపకం -8)

 
పిల్లికి తలస్నానం
(ఒక జ్ఞాపకం -8)

చిన్నపిల్లల అల్లరి వెనుక ఎంతో అమాయకత్వం మరియు మానవత్వం దాగి వుంటాయనిపిస్తుంది.
నా మేనల్లుడు కళ్ళె అనంత కృష్ణ చిన్నప్పుడు చేసిన ఓ అల్లరి పని చెప్తాను. అనంత్‍కి అప్పుడు మహా అంటే ఒకటిన్నర సంవత్సరాల వయసుంటుంది. 
మా ఇంట్లో ఓ చిన్న పిల్లి వుండేది అప్పట్లో. 
మా నాన్న గారికి పిల్లులంటే చాలా ఇష్టం. ఆయన ట్రాన్స్ఫర్లరిత్యా మేం ఎన్ని ఊర్లు మారినా ప్రతి ఊరిలో ఓ పిల్లి వచ్చి అర్జెంట్‍గా మా ఇంట్లో మెంబర్‍గా మారిపోయేది. వాటికి ఎలా తెలుస్తుందో ఇక్కడ ఒక పిల్లి ప్రేమికుడు వున్నాడని. బదిలీ రిత్యా ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు బాగా మాలిమి అయిన ఆ పిల్లిని వదలి వెళ్ళాలంటే ఎలాగో వుండేది. కుక్కనయితే తీసుకెళ్ళవచ్చు కానీ పిల్లుల్ని ఎవరూ తీసుకెళ్ళరు అని చెప్పి నన్ను నచ్చజెప్పేవారు.
’పిల్లి ఇంటిని ఇష్టపడుతుంది, కుక్క మనుషుల్ని ఇష్ట పడుతుంది. వేరే ఊరికి తీసుకువెళ్ళినా కూడా పిల్లి పాత ఊర్లో ఇంటిని తలచుకుని బెంగపెట్టుకుంటుందని చెప్పి నన్ను కన్విన్స్ చేసేవారు.
 మా నాన్న గారు వాటితో బాగా ఆడుకొనే వారు. మాకు చిన్నప్పుడు ఇది బాగా కాలక్షేపంగా వుండేది.  
ఓ పుల్లని పిల్లి ముందు కదిలిస్తే అది యమ సీరియస్‍గా దాన్ని పట్టుకోటానికి ప్రయత్నించేది. పుల్లని దానికి అందనీయకుండా ఆడిస్తూ వుండేవాళ్ళం మా నాన్నగారి అధ్వర్యంలో.
పుల్ల ఆట ఒక్కటే కాక, దాని ముందు అద్దం పెడితే అది దాని ప్రతిబింబాన్ని చూసి తనప్రత్యర్థిగా భావించి కలబడటం, మన నోటికి చేయి అడ్డుపెట్టుకుని ’మ్యావ్.మ్యావ్’ అని అరిస్తే అది ఇంకో పిల్లివచ్చిందేమోనని కంగారు పడటం, మన అరచేత్తో దానిని వెనక్కు తొస్తే అది ఇంకా వేగంగా ముందుకు వచ్చి మనల్ని తోయటం, ఇవన్నీ పిల్లిని ఆడించే క్రీడలలో ప్రధానాంశాలు.
ఇదిలా వుండగా వేసవి శెలవులకి మా అక్కయ్య వాళ్ళు ఓ సారి కడపకి వచ్చారు. అప్పటికి మా నాన్నగారు రిటైర్ అయి కొత్తగా దొరికిన విశ్రాంతిని మనసారా ఆస్వాదిస్తున్నారు. నేను అప్పుడు ఇంటర్మీడెయేట్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాను. మా అక్కయ్య కొడుకు పేరు అనంతకృష్ణ. వాడి కూడా చాలా చిన్నవాడు. ఈ పిల్లి క్రీడలని బాగా ఎంజాయ్ చేసేవాడు.
మేమంతా ఒక రోజు భోజనాలు చేస్తుంటే మా పెంపుడు పిల్లి  కాస్తా దూరంగా హాల్లో కుర్చీపై కూర్చుని తన ఒళ్ళు తానే నాక్కుంటూ వుంది. మీరూ చూసే వుంటారు పిల్లులకు అది సహజ లక్షణం.  తన పంజాని నోటి దగ్గరగా తెచ్చుకుని, పంజాని తడిచేసుకుని తన మొహం మొత్తం తుడుచుకుంటుంది. అందినంత మేరా నేరుగా నాలుకతో ఒళ్ళు నాక్కుంటుంది, అందని భాగాల్ని తడి చేసుకున్న తన పంజాతో తుడుచుకుంటుంది. ఇది పిల్లి లక్షణం. పులులు కూడా ఇలాగే చేసుకుంటాయని ఇటీవల్ యూ ట్యూబ్‍లోనూ, సఫారిలోను చూడటం జరిగింది.
ఇలా నాక్కుంటున్న పిల్లిని ఆసక్తిగా కాసేపు చూసిన మా మేనల్లుడు, చివరికి అడిగాడు ’అదేం చేసుకుంటోంద’ని.
మేము సరదాగా ’అది స్నానం చేస్తోంది’ అని చెప్పాం.
వాడికి ఏమనిపించిందో ఏమో సాలోచనగా తలూపాడు.  
ఆ రోజు మధ్యాహ్నం మేమంతా ఎవరి పనుల్లో వాళ్ళుండగా ఉన్నట్టుండి పెద్దగా పిల్లి అరుపులు వినిపించాయి. అది ప్రాణభయంతో అరుస్తోందని అర్థమవుతోంది. ఏమయిందా అని వెళ్ళి చూస్తే ఇంకేముందీ, పిల్లి కాస్తా మా పెరట్లో వున్న బావి నీళ్ళలొ మునుగుతో తేలుతూ అరుస్తోంది.
మాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. పిల్లి బావిలో ఎలా పడిందో అర్థం కాలేదు. చూస్తే అక్కడే వున్న అనంత్, చిన్ని కృష్ణుడిలా నవ్వుతూ చెప్పాడు
"పిల్లికి తలస్నానం చేయించాలని నేనే బావిలోకి వదిలాను.కాసేపయినాక తీద్దాం. పాపం అది నీళ్ళు లేక తన నాలుకతొ స్నానం చేసుకొంటోంటుంది కద అందుకే ఇలా అన్నమాట"
మాకేమనటానికీ తోచలేదు.
బావిలో చూస్తే పిల్లి పరిస్థితి అయోమయంగా వుంది. చేతికందే లోతు కాదు.చేద(తాడు) వేస్తే కనీసం పదహైదు అడుగుల తాడు బావిలోకి వెళుతుంది నీటిపైభాగానికి బిందే తగలటానికి. 
బావిలోకి దిగ గలిగిన సామర్థ్యం మాకెవ్వరికీ లేదు. వెళ్ళి ఎవర్నయినా పిలుచుకు రావాలంటే అంతవరకు పిల్లి పరిస్తితి ఎలా వుంటుందో అని ఆందోళన.
ఈ లోగా అది కాస్తా కాస్తా ఈదుతూ, ఓ చివరికి చేరుకుని బావి చుట్టురా తాపడం చేసిన బండల్ని గోళ్ళతొ  పట్టుకుని నిలబడింది. సగం శరీరం నీళ్ళలోనే వుంది. అప్పుడప్పుడూ పట్టూ జారి నీళ్ళలోకి పడిపోయి, మళ్ళీ పంజా చాచి గోళ్ళతో గోడల్ని పట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తోంది.
ఈ జీవన పోరాటంలో అది అరవటం మానేసింది. ఈత కొట్టటం, నిలదొక్కుకోవటం, గోళ్ళతో గోడల్ని పట్టుకోవటం వీటి మీద వుంది దాని ఏకాగ్రత అంతా. పైనుంచి మేమంతా బావిలోకి తొంగి చూస్తూ దానికి అలవాటయిన ’కాషీ, కాషీ’ అన్న పిలుపులతో దాన్ని సంబోధిస్తూ వుండటం వల్ల దానికి కాస్తా ధైర్యం చిక్కింది.
అది జాలిగా మా వంక తలెత్తి చూస్తూ వుండిపోయింది.
ఈ లోగా మా అమ్మగారు ఎవరితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ఓ వెదురు బుట్ట పట్టుకోచ్చి, దానికి నాలుగువైపులా పురికోసా దారంతో వుట్టిలాగా కట్టి సిద్దం చేసారు. ఆ ఉట్టి లాంటి వెదురు బుట్టని చేంతాడు చివర్న కట్టి బావిలోకి వదలాలి. అదీ ప్లాను.
బుట్ట నీళ్ళలొ స్థిరంగా వుండటానికి అని చెప్పి బుట్టలో పెద్ద గుండ్రాయి ఒకటి ఏర్పాటు చేసి, ఓ చిన్న ప్లాస్టిక్ కప్పులో కాసిన్ని పాలు పోసి అదీ బుట్టలో పెట్టి, ఆ బుట్టని మెల్లిగా బావిలోకి వదిలాము.
సహజంగానే పిల్లి ఈ బుట్ట, ఈ హడావుడి చూసి కంగారు పడి, మరొక్క సారి పట్టు జారి నీళ్ళలోకి పడిపోయింది.
అది తిరిగి అంచుని పట్టుకుని నిలబడే వరకు వేచి చూసి, మరొక్క సారి బుట్టని లాఘవంగా దాని దగ్గరగ తీసుకువెళ్ళాము. మా అదృష్టం బాగుండీ ఈ మారు అది బుట్టలోకి దూకి కూర్చుంది. పాలని ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. ఓ మూలగా ముడుచుకుని కూర్చుంది. ఇక లాఘవంగా తాడుని పైకి లాగటంమొదలెట్టి ఆ బుట్టని పైకి తెచ్చి పిల్లిని అందుకున్నాం.
అది పైకి చేరుకోగానే మా అమ్మగారు దాన్ని దగ్గరగా తీసుకోని టవల్తో దాని వళ్ళంతా తుడిచి, ఇంకో వెచ్చటి టవల్లో దాన్ని చుట్టి పెట్టి దగ్గరే వుంచుకున్నారు. అప్పటికి గాని దానికి ధైర్యం చిక్కలేదు.
కొసమెరుపు ఏంటంటే అప్పటి నుంచి, అది ఆ వయసు పిల్లలు కనపడితే చాలు తోక లావుగా చేసుకుని పరుగో పరుగు. పిల్లలంటే దానికి అప్పటి నుంచి టెర్రర్.
అది దాని మనస్సును ఆ విధంగా కండీషన్ చేసేసుకుందన్న మాట.
అదండీ పిల్లికి తలస్నానం ముచ్చట.
-రాయపెద్ది వివేకానంద్.
all rights reserved.

జగన్ - అందమైన అమ్మాయిలు (ఒక జ్ఞాపకం-7)


 

జగన్ - అందమైన అమ్మాయిలు

(ఈ కథలకు వైఎస్.జగన్ గారికీ ఎటువంటి సంబంధంలేదని మనవి)

(ఒక జ్ఞాపకం-7)


బాగా వర్షం కురుస్తోంది.  
కడప. (అశోకా లాడ్జికి కాస్తా దగ్గర్లో,మద్రాస్ రోడ్డు)  సమయం రాత్రి పది కావస్తోంది. 
నేను ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇప్కాలో చేరిన కొత్తలవి. 1992 సంవత్సరం నాటి జ్ఞాపకం.
జగన్ గారిని హోటల్లో దించేసి నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి. నా టీవీఎస్-50 ని రోడ్డు వారగా ఆపేసి, మూసేసి ఉన్న ఏదో షట్టర్ ముందు నక్కి నించుని వర్షం నుంచి కాపాడుకొంటున్నాము.
ఎస్.జగన్‍మోహన్ ఆయన పూర్తి పేరు.  సినీనిర్మాత , పూర్ణొదయ మూవీ క్రియేషన్స్ అధినేత,ఏడిద నాగేశ్వర్రావు గారికి దగ్గర బంధువు (బామ్మర్దో, మేనల్లుడో) ఏదో చెప్పారు ఆయనే ఒక సారి మాటల్లొ. 
నా మొదటి ఉద్యోగంలో నా మొదటి బాస్ ఆయన. ఆయన హెడ్ క్వార్టర్స్ తిరుపతి  నుంచి నెలకో సారి టూర్ మీద కడపకు వచ్చి నాతో ఫీల్డ్ వర్క్ చేసీ సలహాలు, సూచనలు ఇచ్చి వెళ్ళటం ఆయన డ్యూటీలో ముఖ్య భాగం. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఆ రోజుల్లొ ఇప్పుడున్నంత వత్తిళ్ళు, టెన్షన్స్ వుండేవి కావు. ఈ రోజుల్లో ఫార్మాస్యూటికల్  ఫీల్డ్‌ వత్తిళ్ళపరంగా దారుణమైపోయిందనుకోండి, అది వేరే విషయం. జగన్ గారు ఒక బాస్‍లాగా ఎన్నడూ అధికారం చెలాయించిందీ లేదు, ఆయన చనువిచ్చాడు కదాని నేను నెత్తికెక్కిందీలేదు. ఇద్దరం చక్కటి ఫ్రెండ్స్ లాగనే వుండే వారం. 
అప్పటికే ఆయన వయసు దాదాపు ముఫై ఐదు పైనే వుంటుంది. ఆయన బ్రహ్మచారి అప్పటికి. ఇంకా పెళ్ళెందుకు కాలేదోనని ఆయన ఫ్రెండ్స్ జోక్ చేసేవారు. ఆయన నవ్వి ఊర్కునేవారు.
ఆయన చాలా మంచి వాడు, ఎవర్నీ నొప్పించే విధంగా మాట్లాడరు. మంచి భోజన ప్రియుడు. మంచి మాటకారి. ఏ విషయాన్నయినా ఆసక్తిగా చెప్పగలరు. ఆయన చెప్పే కథలకే మా సర్కిల్‍లొ జగన్ కథలు అని పేరుంది. అవి కాలక్షేపానికి ఉపయోగపడతాయి, అంతేకాదు వాటిలో తరచి చూస్తే ఏవో మర్మాలుంటాయి అని కూడా అంటారు.
ఏమా జగన్ కథలు, ఏమా కథ అంటారా?
ఓకే, మచ్చుకు ఒకటి చెప్తాను. 
ఇప్పుడు మీకు నేను చెప్పబోయే కథ ,  ఇప్పటికే నేను అనేక మందికి చెప్పి వినిపించగా,  రసికులు చొంగలు కార్చుకుంటూ విని, మధ్య మధ్యలో నెను చెప్పటం ఆపితే , ’ఆపొద్దాపొద్దు, త్వరగా చెప్పు, చెప్పు’ అని తొందరించారు. గౌరవనీయులుగా పేరు పడ్డ వాళ్ళు కాస్తా ఇబ్బందిగా మొహంపెట్టి విన్నారు. కుదురుగా కూర్చుని వినటం అలవాటు లేని వారు సైతం చెవులు రిక్కించి విన్నారు. 
చివరిదాకా విని ఆకథలోని క్లైమాక్స్‌కి వారు వీరు అని తేడా లేకుండా అందరూ ఒకేలాగా రియాక్ట్ అయ్యారు. చూద్దాం మీరెలా రియాక్ట్ అవుతారో. అప్పుడు మీరే చెబుతారు జగన్ కథల ప్రత్యేకత ఏమిటో.  
ఇదెలా మొదలయిందంటే,
ఓసారి ఇలాగే ఆయన కడపకి జాయింట్ ఫీల్డ్ వర్క్‌కి వచ్చినపుడు, ఇద్దరం కలిసి, ఉదయాన్నే రాయచోటికి టూర్‍కి కెళ్ళి వచ్చాం. ముందరే చెప్పాను కద ఈయన చాలా ఫ్రెండ్లీ మేనేజర్ అని. ఉదయం టూర్ కెళ్ళి వచ్చిన ఇలాంటి సందర్భాలలో ఇతర స్ట్రిక్ట్ బాసులు, స్టాకిస్టు వర్కనో, ఇంపార్టెంట్ అడ్మిన్ వర్క్ అనో, ముఖ్యమైన డాక్టర్ కాల్స్ అన్చెప్పో ఊపిరి తీసుకోనీయకుండా ఇబ్బందిపెడతారు. మన ట్రేడ్ యూనియన్ కామ్రేడ్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారు. చెప్పాను కద మన జగన్ శాంతి కాముకుడు, అజాతశత్రువు అని. అటు మేనేజిమెంట్‍ని బాధపెట్టేవారు కాదు, ఇటు యూనియల్ననీ ఇబ్బంది పెట్టే వారు కాదు. నొప్పింపక తానొవ్వక అన్న టైపన్నమాట.
ఆ సాయంత్రం నన్ను ఎంచక్క ఓ సినిమాకి తీసుకువెళ్ళారు.
షారుక్‍ఖాన్ - దివ్యభారతి నటించిన ’దీవాన’ సినిమా చూసి నేను, జగన్ గారు బయటికి వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిదిపైనే అయింది.  దేవునికడప రూట్‍లొ రహమతీయ టాకీసులో చూశాం ఆ సినిమా.
’ఇవ్వాళ ఏదైనా వెరైటీగా తిందామా?’ అడిగాడు ఆయన. రెగ్యులర్ గా భోంచేసే హోటల్లో విసుగొచ్చేసిందనుకుంటా ఆయనకి.
’సరే సర్. ఈ రోజు సరదాగా మిమ్మల్ని ఓ మెస్ కి తీసుకెళతాను’ అన్చెప్పి బ్రాహ్మణవీధిలో, మధ్వ వీధి అని పిలవబడే ఓ బైలేన్లో వున్న ఓ మెస్ కి తీసుకెళ్ళాను. పాపం దాన్ని  ఒక పేద మధ్వ బ్రహ్మణుడు నడుపుతూ వుండేవాడు. ఏదో ’రావు’ ఆయన పేరు. కన్నడ భాష మాట్లాడే వాడు. అదే ఇల్లు - అదే మెస్సు. ఇల్లంటే మరీ పెద్దదేం కాదు. ఓ మోస్తరు హాలు, ఓ చిన్న వంటిల్లు అంతే. అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అని విమర్శించేవారికి ఇలాంటి పేద బ్రాహ్మలని చూపించాలనుంటుంది నాకు. మహా మేధావులమని అనుకునేవారు సైతం రిజర్వేషన్ వ్యవస్థని ఎలా సమర్థిస్తారో నాకైతే అర్థం కాదు. కేవలం కులం ఆధారంగా బ్రాహ్మణులని ఎన్ని చిత్ర హింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు పేడుతోంది మన వ్యవస్థ.
దేవుని కడపరోడ్డు నుంచి చిరుజల్లుల్లో తడుస్తూ మోపెడ్ పై అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది.  ఆయన అప్పటికె మెస్సు కట్టేసి పడుకోబోతున్నాడు. 
ఆయన, ఆయన భార్య, వయసుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు, . హాలులో దుప్పట్లూ దిండ్లూ ఏర్పాటు చేసుకొని నిద్రపోవటానికి ఏర్పాట్లలో వున్నారు. వాళ్ళకున్నవే రెండు గదులు.  పగలంతా ఆ హాలులోనే వడ్డనలు జరుగుతుంటాయి. అక్కడ నేను అరుదుగా తింటాను, అక్కడి టైమింగులు నాకంతగా తెలియవు. 
’క్షమించండి. నాకు టైమింగులు తెలియకపోవటం వల్ల ఇలా రావల్సివచ్చింది’ అని నేను నా మోపెడ్‍పై కూర్చునే, గేటు దగ్గరనుంచి చెప్పాను.
’ఏం పర్వాలేదు రండి. అలా ఆకలిమీద వచ్చిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? అని ఆయన భార్యా, పిల్లల్ని నిద్ర లేపేసి, కిచెన్ లోనికి పంపి , మాకు చక చక ఆకులు వేసి వడ్డన ప్రారంభించేశాడు.  మేము ఇబ్బంది పడుతూనే లోపలికి వెళ్ళి ఏదో తప్పు చేసిన ఫీలింగ్ తోనే భోజనం ముగించి బయట పడ్డాం.
అదిగో బయటికి వచ్చింది లగాయతు పెద్దగా ఈ వర్షం. ఈ వర్షంనుంచి తప్పించుకోవటానికి, రోడ్డు పక్కనున్న ఏదో షట్టర్ ముందు ఆగి వర్షం ఆగుతుందేమోనని ఎదురు చూస్తూ నించున్నాం.
ఇక వర్తమానంలోకి వస్తే,
నాకు ఆఫర్ చేయకుండా సిగరెట్ ముట్టించి (నెను తాగనని తెలుసాయనకి),  దాన్ని వేళ్ళమధ్య ఇరికించుకుని శ్రీశ్రీ గారిలాగా గుప్పెట బిగించి పొగ పీలుస్తూ, ’నీకోకటి చెప్పనా’ అని మొదలెట్టాడు. మామూలుగా పెదాలమధ్య సిగరెట్ ఇరికించుకుని త్రాగుతూ మాట్లాడితే మామూలు కబుర్లు అని, అలా గుప్పెట బిగించి పీలుస్తూ త్రాగుతే, ’జగన్ కథ ’ మొదలవబోతోందని నాకు ఎరుకే. 
వినటానికి సిద్దపడి పోయాను. 
ఈ వర్షం, ఇందాక మేము భోంచేసిన మెస్సు, ఇవన్నీ బహుశా ఆయనకి ఆ సంచలనాత్మక కథ చెప్పటానికి ప్రేరణ కల్పించి ఉండవచ్చు. 
వర్షం జోరందుకుంది. వుండుండి, రోడ్డుపై ఒకటి అరా ఎదో వాహనాలు వెళుతున్నాయి. ఆకాశంలో కళ్ళుమిరుమిట్లు గొలిపేలా మెరుపులు మెరుస్తున్నాయి. చల్లటి గాలి. వర్షం శబ్దం మినహా మిగతా అంతా ప్రశాంతమైన వాతావరణం.
ఆయన చెప్పటం ప్రారంభించాడు.
***
గతంలోకి వెళదాం.
ఆయన ప్రమోషన్‍పై తిరుపతికి వచ్చిచేరిన కొత్తలో జరిగిన విషయం ఇది.
రెగ్యులర్‍గా ఆయన ఓ మెస్‍కెళ్ళి భోంచేసేవాడు. ఆ మెస్ నడిపే ఆయన ఓ శ్రీవైష్ణవ బ్రాహ్మణుడట. పాపం ఆయనకూడా చాలాపేదవాడట. శ్రీనివాసన్ అని అనుకుందాం ఆ బ్రాహ్మణుడి పేరు. ఈ శ్రీనివాసన్‍కి ముగ్గురు ఆడపిల్లలు. చూడటానికి చాలా అందంగా వుండేవారు. పెద్దమ్మాయి డిగ్రీ పూర్తిచేసింది. రెండో అమ్మాయి డిగ్రీ చదివేది. మూడో అమ్మాయి ఇంటర్మీడియేట్ చేసేది, అప్పట్లో.
తెల్లటి శరీర చాయ, మంచి ఒడ్డూపొడుగు, నల్లటి ఒత్తైన జుత్తు, చక్కటి పలువరుస, ఆరోగ్యకరమైన శరీరాలతో చుపరులను ఇట్టే ఆకట్టుకొనే వారట ఆ ముగ్గురూ. అందం విషయంలో ఒకరితో ఒకరు పోటీపడేవారట.
మిగిలిన ఇద్దరూ ఒక ఎత్తు, చివరమ్మాయి ఒకటీ ఒకెత్తు. మిగిలిన ఇద్దరికంటే ఈ చివరి అమ్మాయి ఇంకా ఆకర్షణీయంగా వుండేదట. సన్నని నడుము, వాలు జడ, పెద్దపెద్ద కళ్ళూ, నవ్వితే ముత్యాలు రాలుతున్నాయా అన్నట్టుండే పలు వరుస ఇలా సాగిపోయింది ఆయన వర్ణన. చూస్తుంటే మిగిలిన ఇద్దరిమీదకి ఈ చివరమ్మాయి మీద ఈయనకి ప్రత్యేక ఆసక్తి వున్నట్టుగా నాకు తోచింది.
శ్రీనివాసన్ పేదరికం కారణంగా  పనులకి ,మనుషుల్ని ఎవర్నీ పెట్టుకోలేదు.  ఆయన, ఆయన భార్యా వండునేవారట. దురదృష్టవశాత్తు గంధర్వకన్యల్లాంటి ఈ ముగ్గురమ్మాయిలు వడ్డనలో సాయంచేయాల్సొచ్చేది. పేరుకు చదువుకుంటున్నారే కానీ, కాలేజికి వెళ్ళటంకన్నా ఎక్కువ సమయం తండ్రికి సాయపడటంలోనే వారికి గడిచిపోయేది. ఏదో శాపవశాత్తు దేవలోకంనుంచి భూమిపైకి పంపివేయబడ్డారా ఈ మెరుపు తీగలు అన్నట్టుండేవారట ఆ ముగ్గురు.
పొద్దున కాసేపు క్లాసు పుస్తకాలు ఏవో చదువుకునే వారు. చూస్తుండగానే, ఉదయం దాదాపు పదకొండు, పదకొండున్నరకి మెస్సులో హడావుడి మొదలైపోయేది.
మీకు తెలియంది ఏముందీ, మెస్ అనంగానే అధిక భాగం బ్రహ్మచారులే వస్తారు. బ్రహ్మచారి శతమర్కటః అన్న సామెత ఊర్కే రాలేదు కద. వారిలో కాస్తా హుందాగా వ్యవహరించే వారు ఉండేవారు, కొందరు తమపని తాము చేసుకుని పోయేవారుండేవారు, బ్యాంకు ఉద్యోగులు, మేడికల్ రిప్రజెంటేటివ్‍లు, పీజీ విద్యార్థులు, ఇలా ఒకరేమిటి, రక రకాల వాళ్ళు వచ్చే వారు.
జగన్ గారు ప్రత్యక్షంగా చూసిందాన్ని బట్టి ఈ బ్రహ్మచారుల్లో కొందరు ఈ అమ్మాయిల్ని దారుణంగా టీజ్ చేసేవారట, అసభ్యంగా మాట్లాడే వారట. అదేపనిగా చేతులు తగిలేలా ప్రవర్తించేవారు కొందరు, ఏదోలాగ మాటకలపాలని ప్రయత్నం చేసేవారు కొందరు, చనువు తీసుకొని ప్రవర్తించేవారు కొందరు, హుందాగా ప్రవర్తిస్తున్నట్టు నటిస్తూ బుట్టలోవేసుకుందామా అని ప్రయత్నించే వారు కొందరు , ఇలా రకరకాలుగా ఆ అమ్మాయిలు ముగ్గురూ టార్గెట్ అయ్యేవారట.
ఏమాటకామాటే చెప్పుకోవాలి ఆడపిల్లలు ముగ్గురూ నిప్పులాంటి వారే.
చెప్పాను కద జగన్ గారిది టూరింగ్ జాబ్ అని. ఒక సారి ఈయన దాదాపు ఇరవైరోజుల ట్రిప్ వెళ్ళివచ్చేటప్పటికి, ఆ మెస్సు లో ఓ అంశం గమనించారు ఆయన. అదేంటంటే, ఎంత చూసినా పెద్దమ్మాయి కన్పించటం లేదట. మిగతా ఇద్దరమ్మాయిలే అన్ని పనులూ తమ భుజ స్కంధాలపైవేసుకుని పన్లు చేసుకుంటున్నారట.
ఈయన ఆసక్తితో విషయం ఏంటని శ్రీనివాసన్ గారిని ఆడిగెతే ఓ శుభవార్త తెలిసిందట. వాళ్ళ దూరపుబంధువుల కుర్రాడు, పిల్లకి బావ వరస అయ్యే అబ్బాయి పెద్దమ్మాయిని సింపుల్‍గా ఆర్భాటంలేకుండా పెళ్ళిచేసుకుని శ్రీనివాసన్‍గారికి ఓ బాధ్యత తగ్గించారట. మంచిదే. ఇది ఒక మంచి పరిణామం. జగన్ గారికి కూడా ఓ విధమైన నిశ్చింతగా అనిపించిందట ఆ మాట విని.
ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి.
ఈలోగా ఏదో బ్యాంకులో పని చేసే కుర్రాడు ఒకడు, బ్రహ్మచారి,  భోజనసమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో తరచు శ్రీనివాసన్ గారిని కలిసేవాడని ఒక వార్త షికార్లు చేసింది అందరి మధ్య.  ఆ కుర్రాడు కూడా చూడ్డానికి అందంగానె వుంటాడు. రెండో అమ్మాయికి అతనికి ఏదో వుందని అందరూ గుసగుసలాడుకోనే వారు.
ఇవన్నీ అబద్దాలని త్వరలో తేలిపోయింది. అతను నిజానికి శ్రీనివాసన్ గారి మీద అభిమానంతో బ్యాంకు లోనేదో ఏర్పాటుచేసి, కొత్త టేబుళ్ళు, ఎయిర్ కూలర్లు, ఆధునిక వంటగ్యాసు సామాగ్రి తెప్పించటంలో సాయంచేశాడని తెలిసింది అందరికి.
పెద్దమ్మాయి పెళ్ళయిపోయినప్పటి నుంచీ ఇప్పుడు ఆకతాయిలందరి కళ్ళూ మిగిలిన ఇద్దరిమీదనే వున్నాయి. అనంతపురంప్రాంతం నుంచి వచ్చిన కొందరు సాయిబుకుర్రాళ్ళ అల్లరి బాగా మితిమీరి వుండేదట అప్పట్లో.
ఈలోగా ఈ రెండో అమ్మాయికి కూడా బంధువుల కుర్రాడ్నే చూసి పెళ్ళిచేసి పంపాట్ట శ్రీనివాసన్ గారు.
అందం విషయంలో జగన్ గారు మొదట్నుంచీ ప్రత్యేకంగా హైప్ ఇచ్చిన మూడో అమ్మాయి మాత్రమే మిగిలింది ఇప్పుడు. ఆమెని గూర్చి చెబుతూ, ఈ దశలో మళ్ళీ ఒక సారి ఆ అమ్మాయిని  గూర్చి కాస్తా ప్రశంశాపూర్వకంగా మాట్లాడారు. ఆమె మాట్లాడితే కోయిల పాడినట్టుంటుందట, నడిస్తే నెమలి ఆడినట్టుంటుందట. జడ త్రాచుపాములాగుంటుందట, పలు వరుస దానిమ్మ గింజలలాగా వుంటుందట, నడుము అసలుందాలేదా అన్నట్టుంటుందట.
ఆసక్తిగా వింటూ వుండిపోయాను. ఇంతలో హఠాత్తుగా కథ చెప్పటం ఆపేసి, సిగరెట్ తాలూకు నుసి రాల్చటానికా అన్నట్టు కాసేపాగి, అవసరమైన దానికన్నా ఎక్కువ ఏకాగ్రత చూపిస్తూ సిగరెట్ విదిలిస్తూ వుండిపోయారు జగన్ గారు. నేను ఆయన వంకే చూస్తూ వుండిపోయాను.
దానిని ’ప్రెగ్నెంట్ పాజ్’ అంటారని తెలుసు నాకు. ఇంగ్లీష్ డ్రామాలు, నవలలు చదివే అలవాటుండటం వల్లనూ, అప్పటికే రచనలు చేసే అలవాటుండటం వల్లనూ, ఆయన నా రియాక్షన్‍కై ఎదురు చూస్తూ, అలా ఆగిపోయారేమోనని నాకనిపించింది.
’లొడలొడ’ మాట్లాడే అలవాటు లేని వారు సైతం, అలాంటి ఇబ్బందికరమైన నిశ్శబ్దంలో , తమ బుర్రలో ఏదయితే అనుకుంటున్నారోదానిని ఆపుకోలేక తటాల్న ప్రశ్న రూపంలో సంధిస్తారని మనస్తత్వ శాస్త్రం ఏకాస్తా తెలిసినా వారయినా చెప్పగలరు. 
సరేలెమ్మని మర్యాదగా వుండదని, "బ్రాహ్మణులకు సంఘంలో బ్రతకడం ఎంత కష్టంగా మారిందో కదండీ" అని ఒక అప్రస్తుత కామెంటొకటి చేశాను. ఆయన కొద్దిగా సాలోచనగా చూశారు నా వంక కాసేపు. కాస్తా తల ఆడించారనుకుంటా.
’ఇంతకూ తర్వాతేమయిందండీ" అని అడిగాను విషయాన్ని తేలిక పరుస్తూ.
"ఆఁ! ఏముందీ. ఆ మూడో అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేసేశాడు శ్రీనివాసన్" అని కథ ముగించారు జగన్ గారు.
"ఇదేం కథ సార్. ఇలా వుంది?" అని అడిగాను నెమ్మదిగా.
"ఇది కథ అని ఎవరు చెప్పారు? ఏదో గుర్తు వచ్చింది. చెప్పాను. అంతే. పద పద వర్షం తగ్గింది, మళ్ళీ మనం ప్రొద్దున్నే పోరుమామిళ్ళ వెళ్ళాలి" అని బయలు దేరదీశారు.
***
తరువాత ఈ కథని నేను అనేక సందర్భాలలో నా మిత్రులకు చెప్పాను. రామకృష్ణ అనే మిత్రుడయితే ఆల్మోస్ట్ నా చెంపమీద కొట్టినంత పని చేసి ’ఇదేం కథరా బాబూ. కనీసం ఆ మూడో పిల్లతో ఏదో రొమాన్స్ వుంటుందనుకుంటే, ఇలా నీరుగార్చేశావు కథని" అని కోప్పడ్డాడు.
ఇంచుమించు ఈ కథని విన్న ప్రతిఒక్కరూ ఇలాగే రియాక్ట్ అయ్యారు. ’మొదటి పిల్ల పోతే పోయింది, రెండో పిల్లా పోయింది, ఈ మూడో పిల్లతో కూడా రొమాన్స్ లేకుండా ఇదేం కథ?"
గౌరవనీయులుగా గుర్తింపు పొందిన వారు, నెమ్మదస్తులు, రసికులు, సాహిత్యంతో సంబంధంలేని వారు, ఇలా ఒకరేమిటి, ప్రతి ఒక్కరి రియాక్షనూ ఇదే.
ఈ కథ నాకు అనేక రకాలుగా పాఠాలు నేర్పింది. కథకు సంబంధంలేని వర్ణనల వల్ల పాఠకుల అంచనాలు ఎటో వెళ్ళిపోతాయని ముఖ్యంగా ఒక రచయితగా నాకు ఈ కథ ఒక గొప్ప లెసన్ నేర్పింది. 
అసలలాంటి మెస్సు లేదేమోనని కూడా నా అనుమానం. 
దీన్నీ సైకోమెట్రిక్ టూల్ గా ఉపయోగించాడేమోనని కూడా నేననుకుంటాను. FIRO-B మరియూ ఇతర సైకోమెట్రిక్ టూల్స్ లాగా ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయటానికి కూడా దీన్ని ఉపయోగించుండవచ్చు అని నా అభిప్రాయం. 
ఎందుకంటే
"The way we answer, shows our intelligence;
The way we question, indicates our character"
కాబట్టి మనిషిని ఒక స్థితికి తీసుకెళ్ళి, ప్రశ్నించే అవకాశం ఇవ్వటం ద్వారా ఆ మనిషియొక్క నిజమైన క్యారెక్టర్ ఎలాంటిది అని అంచనా వేయవచ్చు అని ఒక స్కూల్ ఆఫ్ థాట్.
ఏది ఏమయినా సర్వే జనా సుఖినో భవన్తు.
మొత్తం మీద అప్పట్నుంచీ ’జగన్ కథలు’ అన్న నానుడి మా సర్కిల్స్‌లొ వాడుక మాటగా మారిపోయింది. ఏదయినా సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ప్రథమార్ధ భాగం బాగుండి, ప్రేక్షకుల అంచనాలు ఒక స్థాయి వరకూ తీసుకెళ్ళి, క్లైమాక్స్ లో తేలిపోయిన సినిమాలు చూసి, ఇదేందిరా జగన్ కథలాగుంది అని అనుకోడం కద్దు.
ఆయనకు ఆ తర్వాత వివాహం అయితే అయింది గానీ, ఒక విషాదం ఏంటంటే, ఇటీవలే 2010 సంవత్సరం, ఆ ప్రాంతాలలో ఆయన్ హార్ట్ అటాక్‍తో చిన్నవయసులోనే చనిపోవటం జరిగింది. 
నేను ఎన్నడూ మరచిపోలేని వ్యక్తులలో జగన్ గారు ఒకరు. మోటార్ సైకిల్‍పై  జగన్ గారి ఊటి యాత్ర, ఇలా చెప్పుకోవలసిన జ్ఞాపకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ సారి ఎప్పుడైనా వీలైతే చెప్పుకుందాం.
-రాయపెద్ది వివేకానంద్
all rights reserved

చివరి కోరిక {"కుక్కాంటి")

ఈ కథ ’చివరికోరిక’ సాక్షి ఆదివారం అనుబంధం ’ఫన్ డే’ లొ ప్రచురితమైంది. 
ఈ కథకు నేను పెట్టిన పేరు "కుక్కాంటి" కాని సాక్షి ఎడిటోరియల్ బృందం వారు నా అనుమతి కూడా అడగకుండా ఈ కథ పేరుని వాళ్ళకు తోచినట్టు మార్చేశారు. అదొక అసంతృప్తి ఈ కథ విషయంలో నాకు.
ఇంకొక దారుణమైన విషయం ఏమిటంటె ఈ కథ ని ’కొత్త కథలోళ్ళు’ అంటే న్యూ టాలెంట్ /బడ్డింగ్ రైటర్స్ అనే కాటగిరిలో ప్రచురించారు. దాదాపు ముఫై ఎనిమిది ఏళ్ళుగా వ్రాస్తున్న నన్ను ఇలా కొత్త కథకుడిగా పరిచయం చేయటం నాకు అస్సలు మింగుడు పడలేదు.
సరే ఏమి చేద్దాం. 


Lock Down Song పిల్ల జెల్ల


అబ్బ. కన్నీళ్లు ఆగలేదు ఇది వింటూ ఉంటే. 
ప్రతి పదం లో జీవముంది. 
ముఖ్యన్గా పేదరికం కంటే,  పెద్ద రోగం ఏది వుంది?  అన్న వాక్యాలు గుండెల్ని పిండేసాయి. 
బస్సు వద్దు,  రైలు వద్దు,  విడిసి పెడితే నడిసి నేను పోత సారూ. 
అబ్బ కట్టి కుదిపేసింది ప్రతి అక్షరం. 
నిజమైన హృదయ ఘోష. 
జానపదాలు ఆకట్టు కుంటాయి మనసుల్ని. కానీ ఆ పేరుతో నా నా చెత్త వస్తున్న ఈ రోజుల్లో ఇది ఆణి ముత్యం. 
ఇది ఎవర్ని ఆకట్టుకోవడానికి వ్రాసింది కాదు కాబట్టి దీనికి ఆ శక్తి. 
గొంతు ఎవరిదో గానీ ఇళయరాజా రాజ గాత్రానికి దగ్గరగా వుంది. 
దీని రచన ఎవరో? 
ఆ పేరు తెలియని కళా కారులు అందరికీ వందనాలు,  వారికి  పాదాభివందనాలు. 
ప్రజానాట్యమండలి వారి 'అక్కో అక్కో నీ తమ్ములమొచ్చినామక్క ' అన్న పాట విని కూడా ఇలాగే కొన్ని రోజుల పాటు దిగ్భ్రమ కి గురి అయి వుండినాను. 
మీ 
రాయపెద్ది వివేకానంద్

మొదటి బహుమతి (ఒక జ్ఞాపకం - 6)



మొదటి బహుమతి
(ఒక జ్ఞాపకం - 6)

*********

నేను ఏమాత్రం ఇష్టపడని ఓ రాజకీయ నాయకుడిని పొగుడుతూ నా వక్తృత్వ కళ ప్రారంభం కావటమే జీవితంలో ఐరనీ అంటే.

******
ఇప్పుడు షేర్ చేసుకోబోయే జ్ఞాపకానికీ - "బావా బావా పన్నీరు" అనే జంధ్యాల సినిమాలోని కథాంశానికి దగ్గరి సంబంధం వుంది. అప్పుడప్పుడూ జంధ్యాల గారి సినిమాలు యూ-ట్యూబ్ లో చూసి మనసారా నవ్వుకుంటూ వుంటాను.
ఇటీవల మళ్ళీ ఒక సారి జంధ్యాల సినిమా "బావా బావా పన్నీరు" చూశాను. అందులొ వృద్దుడైన కోటా శ్రీనివాస రావుది చిత్రమైన మనస్థత్వం. అతడు ఓ చిన్న పిల్లని పెంచుకుంటూ వుంటాడు. తన మనవరాలి వయస్సుండే ఆ చిన్నపిల్లకి ఊహకూడా తెలియని వయసులోనే , ఆ పిల్లని పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యంతో చేరదీసి పెంచుకుంటాడు ఆ దుర్మార్గుడు. ఈ పరంపరలో ఆ పిల్లకు ఇరవై నాలుగు గంటలూ తన నిలివెత్తు ఫోటోలు కనపడేలా ఏర్పాటు చేసి, "మగవాడు అంటే వాడు, మగతనం అంటే వాడిది" అన్న మాటలు మంత్రాల్ల చెప్పించి ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆ తర్వాత హీరో పాత్రలో నరేష్ (నాలుగు స్తంభాలాట ఫేం) రావటం, ఆ తర్వాత కథ సుఖాంతం కావటం జరుగుతుంది.
****
ఇక నేనందుకున్న మొదటి బహుమతి విషయానికి వస్తాను.
అది నవంబర్ నెలే అయినా జమ్మలమడుగులో ఎండ చంపేస్తోంది.
ప్రభుత్వ బాలుర పాఠశాలలో నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు అవి.
ఇంకాసేపటికి లంచ్ బెల్ కొడతారు అనగా క్లాసుకి సర్క్యులర్ పట్టుకోచ్చాడు అటెండర్. ఆ సర్క్యులర్ చదివి మాష్టారు ప్రకటించారు. ఆ రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం కావటాన, మధ్యాహ్నం క్లాసులు వుండవనీ, అందరూ లంచ్ తర్వాత ప్రేయర్ హాలుకు రమ్మనీ ఆ సర్క్యులర్ సారాంశం.
ఏవో వక్తృత్వ పోటీలు వుంటాయట. కడప డీ.ఈ.వో ఆఫీసు నుంచి వచ్చిన ఎవరో పెద్ద అధికారి అధ్యక్షుడట ఆ మీటింగ్‍కి. స్థానిక వైద్యుడు డాక్టర్.యం.ఎల్.నారాయణ రెడ్డి గారు గౌరవ అధ్యక్షుడట.
మా ఇల్లు దగ్గరే. ఇంటికే వెళ్ళి లంచ్‍ చేయటం అలవాటు. ఇక లంచ్ తర్వాత స్కూలుకు వెళ్ళాల్సిన పని లేదన్న మాట అని నిశ్చయం చేసుకుని ఇంటికి వెళ్ళాను. భోంచేసిన తర్వాత మా బావ గారు అడిగారు, ’ఏమిటి స్కూలుకు వెళ్ళటం లేద’ని.
మా పెద్దక్కయ్య కాన్పు అయివుండటం వల్ల ఆయన వనపర్తి నుంచి వచ్చి వున్నారు. ఉదయం నుంచి ఆయన క్యాంప్‍బెల్ ఆసుపత్రిలో మా అక్కయ్య వద్ద తోడు వుండి వచ్చారు. లంచ్ తర్వాత మా అమ్మగారు, వదినమ్మ, అక్కయ్యలు అంతా ఆసుపత్రికి వెళ్ళటం వల్ల ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన వనపర్తి ప్రభుత్వ కళాశాలలో తెలుగు లెక్చరర్ అప్పుడు.( ప్రస్తుతం ఇటీవలె ఆయన ప్రిన్సిపాల్ హోదాలో రిటైర్ అయ్యారు.)
ఇలా బాలల దినోత్సవం విషయం, వక్తృత్వపోటీల సంగతి చెప్పాను ఆయనకి.
ఈ సంభాషణ నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని, ఆయన అప్పుడు తీసుకున్న నిర్ణయం నాకు జీవితాంతం ఉపయోగపడుతుందని బహుశా ఆయన కూడా ఆ క్షణంలో ఊహించి ఉండరు.
ఆయన నా సమాధనం విని ఆశ్చర్యపోయి ’మరి నీవు పార్టిసిపేట్ చేయవా?’ అని అడిగారు.
’అది ఏదో కొద్ది మంది టాపర్స్‌కే పరిమితమైన ప్రక్రియ అనే అభిప్రాయంలో వుండినాను నేను అప్పటి దాకా. ’నేనా! పార్టిటిసిపేషనా?’ అని ఆయన అమాయకత్వానికి జాలిపడుతూ అడిగాను.
హోం వర్కులు చేసుకోకుండా వెళ్ళటం, మాష్టర్లతో తిట్లు తినటం, క్లాసులో పాఠాలు వినకుండా నా లోకంలో నేనుండి, తీరా మేష్టారు ఏదయినా ప్రశ్నలు వేస్తె తెల్లమొహం వేయటం ఇలాంటి ట్రాక్ రికార్డ్ వల్ల నా మీద ఎవరికీ పెద్ద అంచనాలు వుండేవి కావనుకుంటాను ఆ రోజుల్లో. విషాదం ఏంటంటే నన్ను గూర్చి నేను కూడా చాలా తక్కువ అంచనా వేసుకునే వాడిని. స్టీఫెన్.ఆర్.ఖవీ వ్రాసిన ’7 హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ లో సోషియల్ మిర్రర్ అన్న అంశం చదివినప్పుడు ఇదే విషయం గుర్తొచ్చింది.
మన ప్రవర్తనలోని ఒకటొ రెండో అంశాలు చూసి జనాలు మనపై ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు, అదే నిజమని బలంగా విశ్వసిస్తారు. ఇక మనకు తెలియకుండానే, వాళ్ళఅభిప్రాయలకనుగుణంగా ఆ తర్వాత మనల్ని మనం రూపుదిదుకుంటాం. అందువల్ల నేను టాపర్‍ని కానని నేను డిసైడ్ అయిపోయానన్నమాట.
ఆయన ఒక సారి నా వంక సాలోచనగా చూసి ,మరేం పలక్కుండా తనే ఒక క్లిప్ పాడ్ తీసుకుని, కొన్ని తెల్ల పేపర్లు ముందేసుకుని కూర్చుని ఓ అయిదు నిముషాలు ఏదో వ్రాస్తూ వుండిపోయారు. అదేంటో నాకర్థం కాలేదు.
ఆయన వ్రాయటం అయిపోయాక నన్ను పిలిచి ఇదిగో ఈ రెండు పేపర్లలోని మేటర్‍ని ఓ పది నిమిషాలు చదువుకో. తర్వాత అందులోని ఏయే విషయాలు గుర్తున్నాయో నాకు చెప్పమని అడిగారు. అన్నీ సరదా సంగతులే కావటం వల్ల టక టక చెప్పేశాను. అప్పుడాయన నా భుజం తట్టి ఇవే విషయాలు వేదిక మీద నిలబడి అందరి ముందూ చెప్పు. అదే వక్తృత్వం అంటే అని చెప్పారు.
’ఓస్ అంతేనా’ అని నాకు ఉత్సాహంగా అనిపించింది. దానితో పాటు మా బావ గారు నాకు ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించాలో, సభాధ్యక్షులకు, హెడ్ మాష్టారు గారికి ,టీచర్లకు, సభికులకు ఎలా గౌరవం అందించాలో చెప్పారు. ఇవన్నీ ఆసక్తికరంగా వుండటంతో శ్రద్ధగా విని అలాగే అని తల ఊపి బయలు దేరాను.
నేను కాస్తా ఆలశ్యంగా వెళ్ళినట్టే లెక్క. అప్పటికే సభ ప్రారంభమైపోయింది. దీప ప్రజ్వలనం, ప్రార్థనా గీతం వంటి లాంచనాలు పూర్తి అయినట్టు అర్థమైంది. అందరూ కూర్చుని శ్రద్దగా అధ్యక్షోపన్యాసాన్ని వింటున్నారు. నేను మెల్లిగా వెళ్ళి మా తెలుగు మేష్టారు గారికి నా పేరు వ్రాసుకోమని చెప్పాను.
ఆయన ఆశ్చర్యంగా నా వంక చూసి ’నువ్వా. స్పీచా’ అన్నట్టు ఒక లుక్కిచ్చారు.
’అవును నేనే. స్పీచే’ అన్నట్టు ఫోజిచ్చాను నేను. నాకు ఆదినుంచి అతిశయంపాళ్ళు కాస్తా ఎక్కువే.
పెద్దల ఉపన్యాసాలనంతరం, విద్యార్థుల ఉపన్యాసాలు ప్రారంభమయిపోయాయి. హెడ్ మాష్టార్ గారు, డా.ML.నారాయణ రెడ్డి గారు, మా తెలుగు మాష్టారు గారు తలా ఓ ప్యాడ్, పేపర్ పట్టుకుని స్కోర్స్ వేయటం ప్రారంభించారు.
నేను పేరు చివర్న ఇచ్చాను కద అందుకే నా వంతు చివరే వచ్చింది. నాకిదంతా సరదాగా వుంది తప్పనిచ్చి ఏ కోశానా భయం అన్నది వేయటం లేదు. భయపడాలి అన్న విషయం కూడా తెలియని వయసులోనే స్టేజిమీద నిలబడటం వల్లనుకుంటాను నాకు వేదిక మీద నిలబడి మాట్లాడటానికి భయం వేయలేదసలు.
చాలా మంది స్టేజి ఫియర్ అంటుంటారు,అసలలాంటి పదమే ఇంగ్లీష్‍ భాషలొ లేదు. (సరయిన ఎక్స్‌ప్రెషన్ స్టేజిఫ్రయిట్)
నా వంతు కొరకు ఎదురుచూస్తూ కూర్చునాను. క్లాసులో బట్టీ పట్టి మార్కులు బాగా తెచ్చుకునే సోకాల్డ్ టాపర్స్ ఎవరయితే ఉన్నారో వారిపేర్లను ప్రత్యేకంగా మామాష్టార్లే చొరవతీసుకుని ప్రకటించేసి వారితో ఏవో నాలుగు వాక్యాలు బట్టీ పట్టించేసి వేదికమీదకి పంపించేశారు.
వారు అంతంతే మాట్లాడి బిక్కచూపులు చూస్తున్నారు. అయినా మేష్టార్లు వారిని విపరీతంగా ప్రోత్సహించి చప్పట్లు కొడుతున్నారు. బట్టీ కొట్టించటం, మార్కులు రాబట్టించటంలాంటి చౌకబారు పద్దతులనే అక్కడ కూడా అనుసరిస్తున్నారు మేష్టార్లు.
ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానం అంతకంటే ఏమీ మెరుగ్గా లేదు. మార్కులు, రాంకులు ఇంతే.
ప్రస్తుతం గ్రూప్ డిస్కషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ , సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని నా దగ్గరకొచ్చి చేరుతున్న అధిక భాగం స్టూడెంట్లు ఇలాంటి విద్యావిధానం వల్ల బలిపశువులుగా మారిన వారే. ఎవరికి క్రియేటివిటి వుంది, ఎవరికి ఏ ఫీల్డ్ లో ఇంటరెస్టు వుంది, ఎవరు ఎందులో రాణిస్తాడు అని గమనించి, వాడిలోని క్రియేటివిటిని ప్రోత్సహించే విద్యావిధానం లేకపోవటం దురదృష్టకరం. పైగా ప్రోత్సాహకరంగా మాట్లాడటం అన్నది రాని వాడు టీచింగ్ వృత్తిని స్వీకరించటానికి అనర్హుడు అని నా అభిప్రాయం. కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలకి ఇలాంటి లెక్చరర్లే కారణం.
సరే నా వంతు రానే వచ్చింది. మా బావ గారు చెప్పిన సూచనలన్నీ పాఠిస్తూ, సభకి వందనం, సభాధ్యక్షులకి వందనం, వేదికనలంకరించిన పెద్దలకి వందన నమస్కారాల అనంతరం మాకివ్వబడిన టాపిక్ పండిత జవహర్‍లాల్ నెహ్రూ గారి బాల్య విశేషాలు, ఆయన దేశానికి చేసిన సేవలు ఇలా ఇలా ఓ పది నిమిషాలు అలవోకగా మాట్లాడేశాను.
నా వంతు వచ్చే వరకు నేను నా ముందర మాట్లాడిన వారందరి ప్రెజెంటేషన్లలో కొన్ని విషయాలు గమనించాను.
కొందరు వేదికపై యాంత్రికంగా నిలడిపోయి కాళ్ళక్రింద బంక వేసి అతికించినట్టు నిలబడి మాట్లాడటం నాకసలు నచ్చలేదు. అదే విధంగా ఇంకొందరు ,చేతులు రెండూ బిర్ర బిగదీసుకుని , చెక్క మొహం పెట్టుకుని ప్రేక్షకులలో ఎవడో ఒక్కడ్నోచూస్తూ లేదంటే శూన్యంలోకి చూస్తూ బట్టీ పెట్టిన నాలుగు మాటలు గబగబా మాట్లాడేయటం నాకసలు నచ్చలేదు. చాలా మందిలో ఆ వేళ నాకు ఒక ప్రేక్షకుడిగా, ఒక శ్రోతగా నచ్చని అంశాలు చాలా కనిపించాయి. ఇంకా చిత్రమేమిటంటే ఆ మాత్రానికే మేష్టార్లు గంగ వెర్రులెత్తిపోయి ఒకటే చప్పట్లు కొట్టేస్తున్నారు. ప్రేక్షకులు అయోమయంగా చూస్తూ కూర్చున్నారు.
నాలో ఒక స్పష్టమైన గేం ప్లాను రూపుదిద్దుకుంటోంది. నేను ఎలాగైనా గెలవాలి. ఖచ్చితంగా వీళ్ళందరికంటే నేను బాగా మాట్లాడగలను అనే నమ్మకం నాకు వచ్చేసింది.
ఆ రోజుల్లో నేను ఇంట్లో బంధువులందరి ముందు సూపర్ స్టార్ కృష్ణ తాలూకు అల్లూరి సీతారామరాజు డైలాగులు ఏకపాత్రాభినయం చేసి చూపేవాడిని, ముఖ్యంగా రూథర్‍ఫర్డ్ తో అల్లూరిసీతారామ రాజు చెప్పిన క్లైమాక్స్ సీన్ డైలాగులు, మయసభలో దుర్యోధనుని పాత్రలో ఎన్టీఆర్ గారి డైలాగులు, అదే విధంగా కర్ణ పట్టాభిషేకమప్పటి ఎన్టీరామారావు గారి డైలాగులు ఇవన్నీ ఇంట్లో రోజు చేసి చూపించే వాడిని ఆ రోజుల్లో.
ఆ కళలన్నీ ఇందులో చూపిస్తూ, హాయిగా నా భావాల్ని పలికిస్తూ, ఏదో మా ఇంట్లో డ్రాయింగ్ రూంలో మా కుటుంబ సభ్యులముందర మాట్లాడుతున్నంత కంఫ‌ర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని ఆహ్లాదంగా మాట్లాడేశాను. నాటకీయంగా చేతులు కదపటం, కళ్ళు తిప్పటం, పదాలని స్పష్టంగా పలకటం, కావల్సినంత హావభావాల్నిపలికించటం ఇలా ఒకటేమిటి నాకు తెలిసిన అన్ని కళల్నీ చూపించాను ఆ పది నిమిషాలలో.
అప్పటి దాకా తాము కని విని ఎరుగని ఒక ప్రపంచాన్ని చవిచూశారు ప్రేక్షకులు. నా ప్రసంగం అవ్వంగానే, వారికి తెలియకుండానే వారందరూ లేచి నిలబడిపోయి ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి కాసేపటి దాకా చప్పట్లు కొడుతూ వుండిపోయారు. ’ఫస్ట్ ప్రైజ్ ఈ పిల్లోడికే ఇవ్వాలి’ అని కేకలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ రోజు - జూనియర్, సీనియర్ అన్ని విభాగాలలో కలిపి నాకే ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారు. ఓ సర్టిఫికేట్, ఓ కేమ్లిన్ పెన్ బహూకరించారు. మరుసటి రోజు పేపర్లలొ ఈ వార్త, నేను ప్రైజు అందుకుంటుండగా తీయబడిన ఫోటొ ప్రత్యేకంగా వచ్చాయి.
ఆ రోజు నుంచి స్కూల్లో నేనో సెలెబ్రిటీ స్థాయిని అందుకున్నానంటె అతిశయోక్తి కాదు. ఆ తర్వాత స్కూల్లో జరిగిన అనేక వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెను పాల్గొనటమేమిటి ప్రైజులు సహజంగానే నాకు వచ్చేయటమేమిటి, ఇదంతా ఒక రివాజుగా మారిపోయింది.
ఇప్పుడు నేను స్వీకరించిన ట్రెయినర్ వృత్తికి ఈ అనుభవం నాందీ వాక్యం అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మా పెద్ద బావ శ్రీ భాస్కర లక్ష్మీనరసింహ మూర్తి గారు ఆ రోజు చొరవ తీసుకుని నన్ను ప్రోత్సహించకుండుంటే నా జీవితంలో ఇంత ప్రయాణం జరిగిండేది కాదనుకుంటాను. మామూలుగా ఏదో డెస్క్ జాబు చేసుకుంటూ వుండుండే వాడిని. మా బావ గారికి స్పెషల్ థాంక్స్ అనేక సార్లు చెప్పాను, ఈ సందర్భంగా మరొక్క సారి తెలియజేసుకుంటున్నాను.
*****
నాకు పరిణతి వచ్చాక మన దేశం గురించి, మన దేశానికి జరిగిన ద్రోహాలగురించి తెలుసుకునేకొద్దీ, నెహ్రూ మీద నాకు తీవ్రమైన అయిష్టం ఏర్పడింది.
మన దేశం ముక్కలవటానికి, నేతాజి, పటేల్ వంటి నిజాయితీ గల నాయకుల్ని పైకి రానివ్వకుండా చేసిందానికి, ఇలా ఒకటేమిటి సవా లక్ష కారణాలు, నేను నెహ్రూని ఇష్టపడకపోవటానికి. నేను ఏమాత్రం ఇష్టపడని ఓ రాజకీయ నాయకుడిని పొగుడుతూ నా వక్తృత్వ కళ ప్రారంభం కావటమే జీవితంలో ఐరనీ అంటే.
అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశానికి దొడ్డిదారిలో ప్రధాని అయిన నెహ్రూ దాదాపు భారతీయులందరికీ , ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న సినిమాలోని కోటశ్రీనివాసరావు లాగా’నాయకుడంటే ఇతడు, నాయకత్వం అంటే అతడిది అని భారతీయులందరికీ బ్రెయిన్‍వాష్ చేశాడంటే అతిశయోక్తి కాదు.
శుభం.