Thursday, October 7, 2021

"పునరాగమనం"

"పునరాగమనం"

 

 

 

"వాట్! ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ చనిపోయారా?" అని ఉద్వేగంగా కేక పెట్టాడు రఘుపతి.

అతని కంఠంలొ దుఃఖం సుడులు తిరుగుతోంది. దేశంలొ మొదటి అయిదు మంది బిలియనీర్లలో ఒకడైన రఘుపతి ఉద్వేగాన్ని ఆపుకోలేక పసి పిల్లాడిలా దుఃఖించాడు.

అదీ కాసేపే.

వెంటనే తేరుకున్నాడు.                       

అప్పుడు రాత్రి పదకొండు అయి ఉంటుంది. ఎకాఎకిన తన అపాయింట్ మెంట్స్ అన్నీ నిరవధికంగా రద్దు చేసేసి జమ్మలమడుగుకు బయలుదేరాడు.

****

సమయం రాత్రి రెండు దాటింది.

"ఇంకాస్తా వేగంగా నడపవచ్చూ కద, ఇంకా ఎంతసేపు పట్టవచ్చు?" వెనుక సీట్లో నుంచి రఘపతి తొందరించాడు.

"సర్! మనం తెల్లవారి అయిందిటిలోపల ఖచ్చితంగా చేరుకుంటాము సర్" వేగంగా నడుపుతూనే వినయంగా సమాధానం చెప్పాడు డ్రైవర్. హైదరాబాద్ నుంచి కర్నూలు రెండే రెండు గంటల్లో దాటేశారు అప్పటికే.

జమ్మలమడుగు దిశగా చిమ్మచీకట్లో మెర్సిడీస్ బెంజ్ కార్ గంటకు దాదాపు నూటాయాభై కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. కారు దీపాల వెలుగు ప్రసరించిన మేరా తప్పనిచ్చి ఎటు చూసినా కాటుక పులిమినట్టు చిక్కటి చీకటి ఆవరించి ఉంది.

చాలా ఏకాగ్రతగా నడుపుతున్నాడు డ్రైవర్.

డ్రైవర్ పక్కసీట్లో కూర్చుని ఉన్న విక్రంకి ఆశ్చర్యంగా ఉంది తమ యజమాని ప్రవర్తన.

’ఎప్పుడూ నెమ్మదిగా వెళ్ళమని , వేగం వద్దని’ హెచ్చరించే ఆయన ఇవ్వాళ ఇలా తొందరించటం  విక్రంకి చాలా ఆశ్చర్యంగా ఉంది.

విక్రం రఘుపతికి వ్యక్తగత సహాయకుడు (సెక్రటరీ). దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రఘుపతి దగ్గర నమ్మకంగా పని చేస్తున్నాడు.

రఘుపతి దేశం గర్వించదగ్గ బిలియనీర్లలో ఒకరు. దేశంలోని మొదటి అయిదు మంది బిలియనీర్ల జాబితాలో అతని స్థానం గత పది సంవత్సరాలుగా పదిలంగా ఉంటూ వస్తోంది.

అతను అడుగుపెట్టని రంగం లేదని చెప్పవచ్చు. హోటల్స్, ఔషధరంగం, భవననిర్మాణం, ఇన్ఫ్రా, సాఫ్ట్ వేర్, విద్యారంగం - ప్రతి రంగంలో విలువతో కూడిన తనదైన ముద్ర వేస్తూ తన ప్రత్యేకత నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన కంపెనీ తాలూకూ షేర్లు దగ్గర ఉన్నాయి అంటే భరోసాగా నిద్రించవచ్చు ఎవ్వరైనా.

విలువల విషయంలో రాజీపడకుండావిశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ అతడు చాలా మంచి పేరే తెచ్చుకున్నాడు. అతన్ని కలిసి ముచ్చటించటానికి, ప్రధాన మంత్రి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎదురుచూస్తూ ఊంటారు. అతన్ని ఇంటర్వూ చేయటానికి దేశవిదేశ మీడియా హవుస్‍లు అన్నీ ఉవ్వీళ్ళూరుతుంటాయి.

ప్రతి పని ఎంతో ప్రణాళికాబద్ధంగా జరిగిపోతూ ఉంటుంది రఘుపతి విషయంలో.  అలాంటిది, రాత్రికి రాత్రి అన్ని అపాయింట్ మెంట్లూ నిరవధికంగా రద్దు చేసుకుని , జమ్మలమడుగుకు ఈ ప్రయాణం పెట్టుకున్నారు.

విక్రం అసలీ జమ్మలమడుగు అన్న ఊరిపేరే మొదటి సారి వింటున్నాడు. ఆ రోజు రాత్రి దాదాపు పదకొండు గంటలప్పుడు ఎవరో ఫోన్ చేశారు, రఘుపతి వ్యక్తిగత నెంబర్ కి.

ఆ కాల్ ని అందుకుని , "వాట్! ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ చనిపోయారా?" అని ఉద్వేగంగా కేక పెట్టాడు రఘుపతి.

అంతే ఆ తరువాత పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకోవటం, డ్రైవర్ ని పురమాయించి ప్రయాణానికి సిద్ద్గం కావటం ఇవన్నీ కేవలం ఒక అర గంటలో జరిగి పోయాయి.

వాతావరణం అనుమతించని కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు హెలికాఫ్టర్ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే ఆయన కార్లో  జమ్మలమడుగుకు బయలుదేరారు.

"సర్ కాస్తా హార్లిక్స్ గానీ, టీ గానీ తీసుకుంటారా తన వద్ద ఉన్న ఫ్లాస్క్ ని చేతిలోకి తీసుకుంటూ అడిగాడు విక్రం.

’వద్ద’న్నట్టు తలూపాడు రఘుపతి. తన పదిహేను సంవత్సరాల సర్వీసు లో తన యజమానిని  ఇంత ఉద్విగ్నంగా చూడటం ఇదే మొదటి సారి విక్రంకి.

 

********

 

రఘుపతి వయసు నలభై ఎనిమిదికి అటు ఇటుగా ఉంటుంది.

పాతిక సంవత్సరాల క్రితం ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ ఆతని జీవితంలోకి రాకుంటే ఆతని జీవితం ఎలా ఉండి ఉండేదో.  

ఆయన చూపిన మార్గ దర్శనం, ఇచ్చిన భరోసా కారణంగా తను డిప్రెషన్ అన్న పెను భూతాన్ని వదిలించుకుని ఈ వేళ దేశం గర్వించదగ్గ ఒక ప్రముఖ వ్యాపార వేత్తగా ఎదగగలిగాడు.

ఆ తర్వాత ఫ్రాన్సిస్ విజయకుమార్ ని చూడటానికి వీలే కాలేదు. ఆయన చిరునామా కూడా దొరకలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు.

కేవలం తన జీవితాన్ని మార్చే దానికి ఆయన ఒక దేవదూతలాగా తనజీవితంలోకి వచ్చాడేమో.

ఇవ్వాళ ఆయన చిరునామా తన దగ్గర ఉంది. ఆయన్ని కలవటానికే తను ఇప్పుడు వెళుతున్నాడు. కానీ ఆయన్ని మాట్లాడించలేడు. కేవలం ఆయన్ని విగత జీవుడిగా చూడగలడు అంతే.

రాత్రి ఫోన్ చేసి ఎవరో, ఫ్రాన్సిస్ విజయ్ కుమార్ ఫోన్ నెంబర్, చిరునామా చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఆయన్ని కలవాలి అని అనుకునేటంతలోనే, ఆయన చనిపోయారని కూడా చల్లగా చెప్పారు. చావు కబురు చల్లగా చెప్పటం అంటే అదేనేమో.

ఎన్ని ఏండ్ల అన్వేషణ ఇది. ఇప్పుడు ఫలించింది. కానీ ఏమి లాభం?

లాభనష్టాలు ఆలోచించాల్సిన సమయం కాదిది. అందుకే తక్షణం బయలు దేరాడు జమ్మలమడుక్కి.

 

శాటిలైట్ జీపీఎస్ సిగ్నల్స్ ని అనుసరిస్తూ హైవే పై నుంచి బనగానపల్లి వైపు కారు మలుపు తీశాడు డ్రైవర్.

రోడ్డు ఏమాత్రం బాగాలేదు; అయినా వింటి నుంచి సంధించిన బాణం లాగా దూసుకుపోతోంది కారు.

అంతకన్నా వేగంగా రఘుపతి ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.

అప్పటికి రఘుపతి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు .

అప్పటి రఘుపతి సామాన్యుడు. సామాన్యులలోకెల్లా సామాన్యుడు. పాదాలకు హవాయి చెప్పులు ధరించి సాదాసీదా దుస్తులలొ , చెప్పుకోడానికి ఏదయినా ఉంది అంటే అత్తెసరు మార్కులతో పాసయిన బీ,కాం డిగ్రీతో భవిష్యత్ వంక ఆశగా చూసేవాడు.

 

దూరదర్శన్ మినహా దేశం కూడా సాధించిన ప్రగతేం లేదు ఆ కాలానికి.

సాఫ్ట్ వేర్లు, కేబుల్ టీవీలు, సెల్ ఫోన్లు, మెట్రో రైళ్ళూ, ఇంటర్ నెట్ ఇటువంటి పదజాలం కూడా తెలియని రోజులు. ’సినిమా స్కోప్ - కలర్’ అని ప్రత్యేకంగా సినిమా టైటిల్ చివర వేసుకుంటున్న రోజులు అవి.

పద్దెనిమిదో ఏట ప్రేమలో పడకున్నా, ఇరవయ్యో ఏట కమ్యూనిజం పట్ల మొగ్గు చూపకున్నా నీకు హృదయం లేదు అని అర్థం అని ఎవరో మేధావి చెప్పిన ప్రకారం, తనకు హృదయం ఉందని రఘుపతి తన పద్దెనిమిదో ఏట నిరూపించుకున్నాడు అప్పటికే.

కానీ తన ప్రేమ వల్ల అతను అశాంతినే పొందాడు. భగ్నమయిన హృదయం, దానికి తోడు వామపక్ష భావజాలంతో నిండిన సాహిత్యం అతని అశాంతి అనే అగ్నికి ఆజ్యం పోసేది.

చివరికి శ్రీశ్రీ ’సంధ్యా సమస్యలు’ లో చివరి వాక్యంలా తయారయింది అతడి పరిస్థితి. ఆత్మహత్య కి ఏది సరి అయిన దారి అనే దిశగా సాగుతున్నాయి అతడి ఆలోచనలు.

అలాంటి పరిస్థితిలో అతనికి తారస పడ్డాడు ఫ్రాన్సిస్ విజయ్ కుమార్.

 

క్యాంటిన్ లో నెలకొని ఉన్న రణగొణ ధ్వనులను అన్నిటిని అధిగమిస్తూ సుష్పష్టమైన ఒక స్వరం అతని చెవులను చేరుతోంది. తన వెనుక టేబుల్ వద్ద నుంచి వినిపిస్తున్న ఆ మాటల్ని తనకు అన్వయించుకుని ఒక్క సారిగ ఏదో కుదుపు వచ్చినట్టు నిలువెల్లా కదిలిపోయాడు రఘుపతి

"నువ్వు డిప్రెషన్ లో  ఉన్నావు అంటే నీ ఆలోచనలు గతం తాలూకు ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి అని అర్థం.

నువ్వు ఆందోళనలో ఉన్నావు అంటే నీ ఆలోచనలు భవిష్యత్ ముఖచిత్రాన్ని భయం కోణంలొ చూస్తూ ఉన్నాయి అని అర్థం. అలాకాకుండా ప్రశాంతంగా,ఆనందంగా, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ఉన్నావు అంటే నీవు జీవితాన్ని సరయిన విధంగా జివిస్తున్నావు అని అర్థం. దీన్నేవర్తమానంలో జివించటం అంటారు"

ఎవరినొ ఉద్దేశించి , ఎవరో అపరిచితుడు చెప్పిన ఆ వాక్యాలు రఘుపతిపై గాఢమైన ప్రభావాన్నే చూపాయి. ఆయన్ని ఇంతకూ సరిగ్గా చూడలేక పోయాడు ఆ రద్దీలో. కానీ ఆ రూపం చూచాయగా గుర్తు పెట్టుకున్నాడు రఘు.

ఆ మాటల ప్రభావం వల్ల అతని జీవితంలో ఎకాఎకిన పెను మార్పులు సంభవించాయి అని చెప్పలేం కాని, తన ఆలోచనల్ని తనే ఒక సాక్షిగా గమనించడం ప్రారంభించాడు ఆ రోజు నుంచి. ఆ చర్య వల్ల అతని ఆలోచనలు ఒక సకారాత్మక మలుపు ఖచ్చితంగా తిరిగాయి ఆ రోజు నుంచి.

మరి కొన్ని రోజుల తరువాత అంతే ఆశ్చర్యకరమైన పరిస్థితిలో ఆయనని కలిశాడు రఘుపతి, ప్రాప్తంబు గలచోట ఫలమేల దప్పురా అని అననే అన్నారు కద పెద్దలు.

కడప పట్టణం శివార్లలో ఉన్నదేవుని కడపఅనే ప్రాంతంలోవేంకటేశ్వర స్వామి గుడిలో  ఉత్సవాలు జరుగుతుంటే వెళ్ళాడు రఘు. స్పీకర్లలోంచి అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా వినిపిస్తున్నాయి.

గుడిలోని వేదిక పై నుంచి అద్భుతంగా ఆలపిస్తున్నారు ఎవరో. "అహా ఇది దేవగానం. ఇలాంటి స్వరం దైవదత్తం. ఈ అమృతస్వరం ఉన్న వ్యక్తిని దగ్గర నుంచి చూడాలి అని అర్చన, తీర్థ ప్రసాదాలు, శఠగోపం అనంతరం  కచేరి వైపు దారి తీశాడు రఘు.

ఆశ్చర్యపోవటం తిరిగి రఘు వంతయింది. ఆ అమృతస్వరం ఎవరిదో కాదు, హోటల్లో తన మాటలతో తనపై తెలియకుండానే తీవ్రప్రభావాన్ని ఏ వ్యక్తి అయితే చూపాడో ఆ వ్యక్తి స్వరమే అది. ఆ వ్యక్తే మైకు ముందు కూర్చుని కమ్మగా పాడుతున్నాడు.

అప్పటికి ఆయన పేరు తెలియదు రఘుకు.

తనకు వాద్య సహకారం అందిస్తున్న కళాకారులందరికీ తన చూపులు హావభావాలతో కొత్త శక్తిని అందిస్తూ, తంబురా శృతికి అనుగుణంగా స్వరాలని పలికిస్తూ మూడు గంటలసేపు శ్రోతలను రంజింప జేస్తూ అందర్నీ ఏదో లోకాలకు తీసుకు వెళ్ళాడు.

మూడు గంటలు మూడు క్షణాలలాగా గడిచిపోయాయి. చివర్లో సవినయంగా చేతులు జోడించి సభికులందరికి నమస్కరించి సభ ముగించాడు.

ఆ తర్వాత ఆయనకు జరిగిన సన్మానం సందర్భంగా నిర్వాహకులు ఇచ్చిన ఉపన్యాసంలో ఆయన పేరుతెలిసింది. మరొక్కసారి ఉలిక్కి పడి ఆశ్చర్యపోవాల్సి రావటం రఘు వంతయ్యింది. ఆయన పేరు ఫ్రాన్సిస్ విజయ్ కుమార్.

’ఓ మైగాడ్! ఈయన క్రిష్టియనా?’ ప్రేక్షకులలోని చాలా మందిలా రఘు కూడా ఆశ్చర్యపోయాడు.

ఆయన ఒక బ్యాంక్ ఆఫీసరని ఆయన ఇల్లు తమ ఇంటికి దగ్గరే అని తెలిసింది. ఆయనింటికి వెళ్ళి తనని తాను పరిచయం చేసుకున్నాడు మరుసటి రోజు.

అది ఒక పొదరిల్లు అని చెప్పవచ్చు. ఇంటి చుట్టు చిన్ని తోట. ఆకట్టుకునే లాంటి ఆహ్లాదకరమైన వాతావరణం.

అణుకువతో ఆయన మాటలు శిరసావహించే అందమైన భార్య, సంస్కారం ఉట్టిపడే ఇద్దరు చిన్నపిల్లలు. ఎందుకో తెలియదు కానీ ఆ ఇంటి వాతావరణంలో ఒక విధమైన కారుణ్యం, ప్రేమ పొంగి ప్రవహించేవి.

ఆయన తనను ఆదరించి ఆహ్వానించిన తీరులో ఎంతో ప్రేమ, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. అప్పటికి రఘు ఏ విధంగానూ స్థిరపడలేదు, వయసు ఇరవై ఒకటికి మించి ఉండవు. ఏ ప్రత్యేకతా లేని ఒక సాధారణ వ్యక్తి అతను. ’నా పేరు రఘు’ అని తప్పనిచ్చి తన గురించి చెప్పుకోవటానికి ఏ ప్రత్యేకతలు లేని పరిస్థితి.

కానీ గడప తొక్కి వచ్చిన అతిధిని ఆయన ఆదరించిన తీరు అద్భుతం, ఎంతో జన్మ సంస్కారం ఉంటేనే అది సాధ్యం. అదే అనుకున్నాడు రఘు అతని గురించి.

ప్రేమ, దయ, జాలీ జాలువారే కంఠంతో ఆయన మాట్లాడుతూ ఉంటే గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.

ఇవన్నీ ఒకెత్తు, ఆయన పర్సనల్ లైబ్రరీ ఒక్కటీ ఒకెత్తు.

శృతి, స్మృతి పురాణాదులు, వేదవేదాంగల తాలూకూ భాష్యాలు, ఉపనిషద్ గ్రంధాలు, కన్ప్యూషియస్, బెర్ట్రాండ్ రస్సెల్స్, ఖలీల్ ఘీబ్రాన్,,జీన్ పాల్ సార్త్రే వంటి మేధావుల గ్రంధాలు,జీవిత చరిత్రలు, అబ్బో అదో అద్బుత ప్రపంచం. అంతకుమించి వేరే పదమేది తోచలేదు రఘుకి.

’పుస్తకాలు అంటే ఆసక్తి’ అన్న మాటకి సరాసరి తన పర్సనల్ లైబ్రరీలోకి తోడ్కొని వెళ్ళి అవన్నీ చూపించి ఏది కావాలన్నా తీస్కుని , చదువుకుని తెచ్చి ఇవ్వవచ్చు అని చెప్పాడు.

ఓ జీవిత కాలం సరిపోతుందా ఈ గ్రంధాలు అన్నీ చదవటానికి అని అనిపించింది రఘుకి.

ఆ తరువాత ఆయన్ని కలవటానికి ఎన్నో సార్లు వారింటికి వెళ్ళాడు. అప్పుడప్పుడూ ఆయన పనిచేసే బ్యాంకు కు కూడా వెళ్ళే వాడు రఘు. ఆయన్ని కలవాలి, ఆయన్తో మాట్లాడాలి అని తనలాగే చెవి కోసుకుంటారు చాలా మంది అని త్వరలోనే తెలుసుకున్నాడు రఘు.

ఓ రోజు ఓగ్ మేండినో వ్రాసిన ’ది గ్రేటెస్ట్ సేల్స్ మేన్ ఇన్ ది వరల్డ్’ అనే చిన్ని పుస్తకం ఇచ్చి దాన్ని బాగా చదవమన్నాడు రఘుని.

"ఏంటి సార్, నన్ను సేల్స్ మాన్ జాబ్ చేయమంటారా?" నవ్వుతూ అడిగాడు రఘు

"అది సేల్స్ కి సంబంధించిన పుస్తకం కాదు.  పేరలా ఉందంతే. దీన్ని బాగా చదువు. ఆ తర్వాత ఆ పుస్తకం గురించి మనం సుధీర్ఘంగా మాట్లాడుకుందాం" అంటూ రఘు అరచేతిని నొక్కి వదులుతూ, ’ఓకేనా’ అన్నట్టు దయగా చూశారు రఘు వంక.

చదవటం ప్రారంభించాడు రఘు. అంతే ఇక తన ప్రమేయం లేకుండానే అక్షరాల వెంబడి తన చూపులు పరిగెత్తనారంభించాయి.  

అది పుస్తకమా? కానే కాదు.

అది ఒక మాయా తివాచి. అది ఒక మంత్ర నగరి. అది ఒక మంత్ర దండం. అందులోని ప్రతి అక్షరం తనలోని అణువణువునా ఏదో కొత్త శక్తిని నింపినట్టు అనిపించింది.

ఆ పుస్తకం చివర్లో ఏసుక్రీస్తు జననంబాల ఏసుని చుట్టిన ఖరీదైన దుప్పటిఆ దుప్పటి లో దాగున్న కీలకమైన రహస్యం, కథలోని ఆ చివరి మలుపు దాకా ఊపిరి బిగబట్టి చదివాడు రఘు.

వెన్నెల వర్షంలో కూర్చుని అమృతం త్రాగిన అనుభూతి.

తనలో ఏదో శక్తిపాతం జరిగిన అనుభూతి.

తనలోని శక్తి జాగృతం అయిన భావన. కుండలినీ శక్తి జాగృతం అవడం అంటే ఇదేనా? రఘుకి మాటలు రావటం లేదు. కండ్ల వెంబడి అశ్రు ధారలు. ఒక ఆనందానుభూతికి గురయ్యాడు రఘు.

దత్తావతారల గూర్చి సిద్దుడు బోధించగా, నామధారకుడు సమాధి స్థితిలోకి వెళ్ళీ ఆ అనందానుభూతినుండి బయటి ప్రపంచంలోకి రావటానికి ఇచ్చగించనట్టు అయింది రఘు పరిస్థితి.

ప్రపంచాన్నే శాసించగలిగేటంతటి ఐశ్వర్యవంతుడు అవటానికి పది చిట్కాలు, ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా మార్చగలిగే సూచనలు, విజయరహస్యాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఆ పుస్తకం తాలుకు సారాంశం.

ఆ పుస్తకం చదివిన రాత్రి నిదుర రాలేదు రఘుకు. ఏదో ఉద్వేగం, ఏదో భావ తీవ్రత.

"చదివావా" మరుసటి రోజు కలవంగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న.

"చదివాను సర్. చాలా బాగుంది. నాలో ఏదో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్టు అనుభూతి కలుగుతోంది. ఇన్నాళ్ళూ నాకే తెలియకుండా నన్ను ఏదో శక్తి అడ్డు పడుతున్నట్టు అనిపించేది. ఇప్పుడు నాకు ఏ అడ్డూ లేదు" చాలా భావ తీవ్రతతో చెప్పాడు రఘు.

తనిచ్చిన మందు పుచ్చుకున్న రోగి, తనకు గుణంగా ఉందని తన స్థితిని వర్ణిస్తుంటే అతని వంక దయగా చూసే వైద్యునిలా దయగా చూస్తుండి పోయాడు ఫ్రాన్సిస్.

రఘులోని ఆత్మహత్యా ధొరణులని మొదట్లోనే అర్థం చేసుకున్న వాడై, అతనికి ఆ సమయంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వకుండా, అతనికి ఇష్టమైన అభిరుచి అయిన పుస్తక పఠనం ద్వారానే అతనిలో గణనీయమైన మార్పులని తీసుకురాగలిగాడు ఫ్రాన్సిస్.

ఆ తరువాత పుస్తకాల వెల్లువ కొనసాగింది.

యువర్ ఎర్రెనియస్ జోన్స్, టఫ్ టైంస్ నెవ్వర్ ల్యాస్ట్ - టఫ్ పీపుల్ డూ, బార్న్ టు విన్, ది పవరాఫ్ పాజిటివ్ థింకింగ్, ది ఏకర్స్ ఆఫ్ డైమండ్స్, ది స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి వ్యక్తిత్వ వికాస గ్రంధాల ద్వార అతని వ్యక్తిత్వంలో సమూలమైన మార్పులు తీస్కుని వచ్చాడు ఫ్రాన్సిస్.

మరో వైపు విశ్లేషణతో కూడిన సంభాషణలు, తర్కంతో కూడిన చిన్న వాగ్వివాదాలకు తెరనెత్తుతూ రఘు ఆలోచనల్లో పెద్ద సునామినే సృష్టించాడు ఫ్రాన్సిస్ ఆ రోజుల్లో.

ఆయన ఇచ్చిన ప్రేరణతో పై చదువులు చదవటం, సీఏ కోర్స్ చేయటం చక చకా జరిగిపోయాయి.

సీఏ కోర్స్ కై అతను బొంబాయి కి బయలుదేరుతున్నప్పుడు, ఆయన రైల్వే స్టేషన్ కొచ్చి వీడ్కోలు ఇస్తూ రఘుతో చెప్పిన మాటలు అతను ఎప్పటికీ మరచిపోలేదు

"రఘూ! ప్రేమ ఎప్పటికీ కార్య రూపేణా మాత్రమే వ్యక్తమవుతుంది. అందులోనూ నిరంతర ప్రేమ, నిష్కామ ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ భగవంతుని రూపం అని చెప్పచ్చు. ప్రేమకి ప్రతిగా ప్రేమనే నీవు వాంఛించడం ఎప్పుడు ప్రారంభిస్తావో మానసిక క్లేశాలు కలుగుతాయి, అది పతనానికి నాంది.  నీవు ఏ ప్రతిఫలం ఆశించకుండా సాటి మనిషికి ఎప్పుడైతే, నీ సాయం ద్వారా నీ ప్రేమని అందిస్తావో అప్పుడు నీవే దేవుడివి. ఏదో కోరుకుంటూ నీ ప్రేమని నీవు అందించటం ప్రారంభించావో అప్పుడు నీవు మనిషిలాగా కనిపిస్తున్నా కూడా ఒక రాక్షసుడివి. అప్పుడు నీకే తెలియకుండా నీలో ప్రతికూల భావాలు గూడు కట్టుకుంటాయి. నిన్ను వలచి వంచించిన అమ్మాయిని క్షమించు. నీలొ కరుణ కట్టలు తెంచుకుని ప్రవహించనీయ్. దీని వల్ల నీకే మంచి జరుగుతుంది."

రఘు ఆశ్చర్యంతో ఆయన వంక చూస్తుండిపోయాడు. తను ప్రేమోపహాతుడు అని ఆయనకు తాను ఎన్నడూ చెప్పుకోలేదు వాస్తవానికి. ఆయన కురిపిస్తున్న దయా వర్షంలో తడిసి ముద్దయ్యాడు రఘు.

ప్లాట్ ఫాం పై నిలబడ్డ ఫ్రాన్సిస్ ని, భారమైన హృదయంతో , సజలమైన కండ్లతో  కదిలే రైల్లోంచి చూస్తూ ఉండిపోయాడు రఘు. అదే ఆయన్ని చివరి సారి చూడటం.

అయన్ని ఆ తరువాత ఎన్నడూ చూడలేకపోయాడు.

ట్రాన్స్ఫర్ అయ్యిందని ఒక సారి, వాలంటరీ రిటైర్ మెంట్ తీస్కుని ఎక్కడొ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తలమునకలుగా ఉన్నారని ఒకసారి తెలిసింది.

ఆయనని ఎన్నడూ మరచి పోలేకున్నా, ఆ తర్వాత తన ఎదుగుదల క్రమంలో తన గొడవలో తాను తలమునకలు అయ్యాడు రఘు. కానీ ఏ క్షణమూ ఆయనని మరచి పోలేదు.

ఆ తర్వాత ఆయన అందించిన జీవనోత్సాహంతోఆయన తనతో చదివించిన పుస్తకాల తాలుకు ప్రేరణతో, పట్టుదల క్రమశిక్షణల తో దిన దిన ప్రవర్దమానమయ్యాయి రఘుపతి చేపట్టిన వ్యాపారాలు అన్ని.

అంతా లక్ అంటారు విమర్శకులు.

 

************

జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రి ఆవరణలో ఫ్రీజర్ బాక్స్ లో ఉంచిన ఫ్రాన్సిస్ శవాన్ని చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు రఘుపతి.

అంత చిన్న ఊరికి  రఘుపతి రావటమే వార్త అనుకుంటే, ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన దృశ్యాన్ని ఒడిసి పట్టుకోవటానికి పోటీలే పడ్డారు మీడియా వాళ్ళు.

అంత్యక్రియలు ముగిశాయి.

మీడియా వారికి ఏమి అర్థం కావటం లేదు, వారికి పిచ్చెక్కిపోతోంది. ఒక సామాన్యుడైన ఫ్రాన్సిస్ మృతికి రఘుపతి ఎందుకు ఇంత ప్రాముఖ్యతని ఇస్తున్నాడో తెలుగు రాష్ట్ర మీడియా, జాతీయ మీడియా అంతటా ఇదే చర్చ.

మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్ళాడు రఘుపతి. చాలా చిన్న ఇల్లు. ఆయన తన యావదాస్తిని దానధర్మాలకు వినియోగించాడు అని ఆసుపత్రి ఎండీ ఆయనకి చెప్పారు. ఆయనింటి వాతావరణాన్ని చూస్తే అది నిజమే అని తెలుస్తోంది.

ఇంటి బయట అంతా మీడియా తాలూకు ఓ బీ వ్యానులు బారులు తీరాయి.

నుదుటన ఎర్రటి బొట్టుతో శ్రీలక్ష్మీలాగా ఉంది వారమ్మాయి. ఆ అమ్మాయి పేరు సరస్వతి అట.

వారి కుటుంబానికి సహాయం చేస్తాను అన్న ఆయన ప్రతిపాదనని శ్రీమతి ఫ్రాన్సిస్ సున్నితంగా తిరస్కరించారు.’ మాకు తగినంత ఉంచి వెళ్ళారు. మాకే లోటు లేదు." అని కాసేపాగి ఆవిడ ఇలా అన్నారు

"వారు మిమ్మల్ని తన చివరి రోజుల్లో బాగా అనుకున్నారు. వారు ఎన్నడూ ఎవరి నుంచి ఏ సహాయం ఆశించలేదు. కానీ వారికి మీరేదో సాయం చేయాలట. ఈ ఉత్తరంలో వ్రాసి ఉందట అది. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు" అంటూ ఒక సీల్డ్ ఉత్తరం తెచ్చి ఇచ్చారు. తెరిచాడు రఘుపతి.

ముత్యాల్లాంటి అక్షరాల వెంబడి అప్యాయంగా అతని చూపులు పరుగులు ప్రారంభించాయి.

 

"ప్రియమైన రఘు

ఎలాఉన్నావు? ఇప్పుడు నివ్వు ఉన్న స్థితిలో నిన్ను ఏకవచనం తో సంబోధించే చనువు నాకు ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. రఘూ నువ్వు సాధిస్తున్న విజయాలు, ప్రగతీ గమనిస్తూనే ఉన్నాను. అయామ్ ప్రౌడాఫ్ యూ మై బాయ్.

ఎన్నో టీవీ ఇంటర్వ్యూలలో నాగురించి ప్రస్తావించావు. నన్ను గురువు అన్నావు. దైవం అన్నావు. అదంతా నీ సంస్కారం, పెద్దలు నీకు అందించిన వినయం.

అదే మన సనాతన సంప్రదాయంలో ఉన్న విశిష్టత.

నీ ప్రతి విజయం వెనుక నీ కృషి ఉంది, నీ పట్టుదల ఉంది. నేను కేవలం కొన్ని పుస్తకాలు చదవమని ప్రేరేపించాను నిన్ను. నీలో ఉన్న కసికి సరైన సమయంలో ఒక సన్మార్గం కల్పించాను. అది దైవ కృప. అందులో నా గొప్పతనం ఏదీ లేదు.

నీవు బొంబాయి వెళ్ళిపోయిన తర్వాత నాక్కూడా బదిలి అయింది. పదోన్నతుల మీద దేశం అంతటా తిరిగాను. పనిలో పనిగా అనేక మంది మహనీయుల సాంగత్యం లభించింది. అనేక క్షేత్రాలను దర్శించే భాగ్యం కలిగింది.

నా ఙ్జానాన్ని మరింత విస్తృత పరచుకున్నాను. దాదాపు అయిదేళ్ళ క్రితం వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని జమ్మలమడుగులో స్థిర పడ్డాను.

రఘూ నీ బిజీ జీవితంలో ప్రవేశించి నిన్ను డిస్టర్బ్ చేయదల్చుకోలేదు, అందుకే నేను నీతో టచ్ లోకి రాలేదు. 

నేను ఒక సామాన్యుడిని, కానీ నీతో సహా చాలా మంది తమకు కొత్త జీవితాన్ని అందించానని చెబుతూ ఉంటారు, అనేక మందికి దుఃఖోపశమనం కల్పించాను అని అంటుంటారు. అది మీ అందరి మంచితనం.  

నాకో సాయం చేయగలవా? రఘూ నాకు దుఃఖోపశమనం కావాలి. మీకెవ్వరికీ తెలియని దుఃఖం నాలో ఒక జ్వాల లాగా నిరంతరం రగులుతూనే ఉండినది ఇన్నేళ్ళూ. వయస్సు పెరిగే కొద్ది నాలో దుఃఖం పెరుగుతూ వచ్చిందే తప్ప తరగలేదు. ఇది ఒక చిత్రమైన పరిస్తితి.

నా బాల్యం నుండి కూడా ఎక్కడైనా గుడి గంటలు వినపడితే నాలో ఒక విధమైన పారవశ్యం కలిగేది.

వేదనాదం విన్నా, మంత్రోఛ్ఛారణ విన్నా మనసు ఆనందంతో గంతులు వేసేది. కానీ మా తల్లితండ్రులు నన్ను ఒక ’ఆడ్ మాన్ అవుట్’ అన్నట్టు చూసే వారు. ఆ దిశగా నా అభిరుచిని ప్రోత్సహించే బదులు, మా  మతపెద్దలతో చెప్పి నా అవగుణాన్ని మాన్పించే ప్రయత్నం చేసేవారు.

పరమత సహనం అటుంచి, కన్నతల్లి లాంటి సనాతన సంప్రదాయం పట్ల ద్వేషం రగిల్చే ప్రయత్నం చేసే వారు. దేవి దేవతల్ని చులకనగా మాట్లాడటం నాకు చాలా దుఃఖం కలిగించేది.

క్రైస్తవం పుచ్చుకున్న ప్రతి ఒక్కరూ అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పను కానీ, నాకు తారసపడిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పట్ల ద్వేషం రగిల్చే ప్రయత్నమే చేశారు.

ఙ్జ్యానం వికసించే కొద్ది నాలో ఈ సంఘర్షణ పెరుగుతూ వచ్చింది.

విదేశీ పాలకులు ఒక ప్రణాళికతో మనల్ని మన సంస్కృతికి ఎలా దూరం చేశారో తెలుసుకునే కొద్ది, మన సంస్కృతికి వారు చేసిన ద్రోహం తెలుసుకునే కొద్దీ నాలో ఈ దుఃఖం పెరుగుతూ వచ్చింది.

సనాతన ధర్మం ఏదయితే ఉందో , ఇది మతం అనే సంకుచిత చట్రంలొ ఇమిడే అంశం కాదు. ఇది మతం కాదు. మతం అనేది కొందరు మహానుభావులచే స్థాపింపబడి, వారు రూపొందించిన కఠిన నియమావళిని తూచ తప్పకుండా పాఠించే లాగా రూపుదిద్దబడ్డ పిల్లకాలువల లాంటివి.

సనాతన ధర్మం అనేది ఎవరిచేతా స్థాపింపబడలేదు. ఇది మతం కాదు, ఇది ఒక  ధర్మం. యావత్తు మానవాళి ఆనందంగా జీవించటానికి ఇది ఒక మాన్యువల్ లాంటిది. ఇది అత్యంత పురాతనమయినది, అత్యంత నవీనమైనది కుడా.

ఇది విన్-విన్ సిట్యుయేషన్ లాంటి నిరంతర ప్రక్రియ.  నా గెలుపు కై నీవు ఓడి పోనక్కరలేదు. నీవు ఆనందంగా జీవించు, నేనూ ఆనందంగా జీవిస్తాను. నాకు నీవు రక్ష - నీకు నేను రక్ష. మనిద్దరం యావత్తు విశ్వానికి రక్ష, ఇలాంటి మహదోధ్దేశాలతో రూపుదిద్దబడ్డ ఒక విశ్వమానవ సంక్షేమానికై ఏర్పడ్డ ధర్మం ఇది. దీనికి దేశ, కాల, లింగ పరిమితులు లేవు.

పాశ్చాత్యులు మొదటి సారి మనల్ని చూచినప్పుడు మన సంస్కృతిని మన జీవన విధానాన్ని చూసి అవాక్కయ్యారు. సుఖ శాంతులతో, ఆనందంతో, అష్టైశ్వార్యాలతో తులతూగుతున్న మనల్ని చూసి దిగ్భ్రమకి గురయ్యారు.

నాగరికతతో విలసిల్లుతున్న మన స్థితికి అబ్బురపడ్డారు.

దోచుకోడానికి వచ్చిన దొంగ ఇంటి వారి ఐశ్వర్యాన్ని చూసి ’శభాష్’ అని అభినందించి వెళ్ళిపోడు కద. ఎలా దోచుకోవాలా అని ఆలోచిస్తాడు.

సరిగ్గా అలాగే జరిగింది మన సంస్కృతి పట్ల దాడి.

బ్రీటిష్ వారు మన సంపదల్ని దోచుకుని, మనల్ని బానిసలను చేసుకొనినదే కాక, మన  సంస్కృతిని మనమే ద్వేషించే లాగా చేయటం అనే ఒక భయంకరమైన కుట్రని విజయవంతంగా అమలు చేయగలిగారు.

’హిందుత్వం అనేది ఒక మతం కాదు. ప్రపంచంలో మానవుడు ఎలా జీవించాలి అన్నవిధానాన్ని ప్రతిపాదించిన ఒక శాస్త్రీయ పద్దతి. ఒక సిలబస్. సనాతన ధర్మాన్ని ధిక్కరిచ్చటం అంటే మనం కూర్చున్న చెట్టుకొమ్మ మనం నరుక్కోవటం మాత్రమే. ప్రకృతితో, పంచభూతాలతో, మమేకం అవుతూ ఎక్కడా సిమెట్రీ దెబ్బతినకుండా సుఖసంతోషాలతో ఎలా జీవించాలో తెలిపే ఒక అద్బుతమైన విధానం. దీనికి మతాలతో సంబంధం లేదు.

విశాలమైన ఇలాంటి అమృత సాగరాన్ని వదులుకుని, ఒక చెంచాడు నీటిలో ఈత కొట్టమని శాశిస్తే ఎలాఉంటుందో అలా ఉండేది నా పరిస్థితి.

రఘూ ప్రపంచంలో అన్ని మతాలు మంచివే.

ప్రజలు బ్రష్టుపట్టిపోకుండా ఉండేందుకు కొందరు మహానుభావులు నడుం బిగించి కొన్ని నియమాలు ఏర్పరిచిన వ్యవస్థలే మతాలన్ని. ఏ మతమూ చెడుపు చేయమని చెప్పదు.

కాకపోతే అందులో చెప్పబడ్డ విషయాలని ఆ మతావలంబకులు అర్థం చేసుకోవటంలో పొరపాట్లు జరిగి మూఢ విశ్వాసులుగా మారి ఇతరులను ద్వేషించటం మొదలయ్యింది. ఆయా మతాల్లోని పెద్దలు తర్కించే ఙ్జ్యానవంతులని తృప్తిపరచలేరు తమకున్న పరిమితమైన అవగాహన వల్ల.

కానీ సర్వేజనా సుఖినోభవంతు అన్న ఆర్యోక్తిని విశ్వసించే సనాతనధర్మం నాస్తికుల్ని, చార్వాకుల్ని కూడా ప్రోత్సహిస్తుంది వారి సందేహాల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ పోతుంది. ప్రశ్నించటం అభివృద్దికి సూచన అని విశ్వసించే విధానం ఇది. అందుకే సనాతన ధర్మ అత్యంత ప్రాచీనం మరియూ నిత్య నూతనం.

ఇలా చెప్పుకుంటూ పోతే దీనికి అంతులేదు రఘు. మనం ఏదయితే సైన్స్ అనుకుంటున్నామో ఈ సైన్స్ ఇంకా టెలిస్కోపు కాదు కద, అందులో లెన్సుకి వాడే గాజు ముక్కను కూడా కనుగొనక ముందే ఖగోళ శాస్త్రంపై పూర్తి పట్టు సాధించి గ్రహ గతుల్ని, గ్రహణాల్ని ముందుగా లెక్కించి చెప్పింది ఈ ధర్మం. శాస్త్రఙ్జులు కనుగొనక ముందే భూమి గోళాకారంలో ఉందని తమ పురాణాల్లోనే పేర్కొన్న నాగరిక ధర్మం ఇది.

రఘు నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. అమ్మానానల్ని అయిన వాళ్ళనీ నొప్పించటం ఇష్టం లేక అన్య మతస్తుడిగానే చలామణి అయ్యాను బ్రతికినంతకాలము.

రిజర్వేషన్ల సౌకర్యాల కోసం అదే బంధువుల ద్వంద్వప్రమాణాల వల్ల రికార్డ్ ప్రకారం హిందువుగానే చలామణి అయ్యాను. కానీ నేను ఏనాడు రిజర్వేషన్ సౌకర్యం వాడుకోలేదు. నేనేనాడు ఇలాంటి మోసం చేయలేదు. ఏది సాధించినా మెరిట్ పైనే సాధించాను.

ఇక ఈ కపట నాటకం చాలు రఘు, నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు.

రఘూ నీవు చేయాల్సిన సాయం చాలా చిన్నది, చాలా చిత్రమైనది కూడా. నా ఆత్మ కనీసం హిందువుగా సాగిపోని. జీవించినంత కాలం సంఘర్షణ అనుభవించాను. ఇలాంటి సంఘర్షణే నేను శ్రీ ఏపిజే కలాం గారిలో కూడా గమనించాను. నా ఇలా సతమతమయ్యే చాలా మందిని నా జీవన యాత్రలో నేను గమనించాను.

రఘూ నా కోరిక చాలా చిత్రమైనది అని చెప్పాను కద.  నీవేం చెయ్యాలి అంటే కాశీ విశ్వనాథుని క్షేత్రమైన వారణాసిలో గంగానది తీరంలో సశాస్త్రీయంగా నాకు పిండ ప్రదానం చేయి.

శాస్త్రోక్తంగా నాకు పదవరోజు, పదమూడోరోజు జరగాల్సిన కర్మకాండ, మాసికాలు, పిండ ప్రదానం, సాంవత్సరికం జరిపించు. కనీసం నా అత్మ హిందువుగా ప్రయాణం చేయనీ.

యద్భావం తద్భవతి. నా భావనే నిజమవు గాక.

నువ్వు నన్ను గురువు అని అనేక వేదికల మీద పేర్కొన్నావు కద. నేను చెప్పగా నీవు చదివిన గ్రంధాలన్నీ పాశ్చాత్య సమాజం నుండి మనకు దిగుమతి అయినవే. నేటి మేటి వ్యక్తిత్వ వికాస గ్రంధాలన్నీ మన శాస్త్రాలలో, గీతలో చెప్పబడ్డ విషయాలే. అదంతా తమ సృజనే అని జబ్బలు చరచుకుంటూ ఉంటారు పాశ్చాత్య మేధావులు.

మాకు ప్రేరణ సనాతన ధర్మం తాలూకు గ్రంధాలే అని చెప్పుకోవాలి అనే కనీస మర్యాద పాటించరు ఈ రచయితలు.

నా చివరి కోరిక తీర్చటం ద్వారా  నీవు నాకు గురుదక్షిణ చెల్లించిన వాడివి అవుతావు.

నేనిటీవల ఒక గ్రంధం చదివాను, వ్రాసింది వామదేవ శాస్త్రి. నిజానికి ఇతడు పాశ్ఛాత్యుడు. అతని అసలు పేరు "డేవిడ్ ఫ్రాలే". అతడు వ్రాసిన ఆ గ్రంధం పేరు "నేనెందుకు హిందువుగా మారాను?"

ఈ గ్రంధం చదివి చాలా ఉద్వేగానికి గురయ్యాను.  వీలయితే నీవు చదువు.

ఉండనా మరి

ఫ్రాన్సిస్ విజయ్ కుమార్.

****

హైదరాబాదు టు వారణాసి వెళ్ళే విమానం వేగంగా వెళుతోంది. అందులో రఘుపతి ప్రశాంత మనస్కుడై వెళుతున్నాడు.

 

 

****

(ఈ కథ ’నమస్తే తెలంగాణ’ ఆదివారం అనుబంధం బతుకమ్మ  మరియు ముల్కనూరు ప్రజా గ్రంధాలయం వారు నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది, సెప్టెంబర్ 19 2021 సంచికలో ప్రచురితం అయింది)

1 comment:

  1. చాలా అద్భుతంగా ఉంది..భావోద్వేగానికి గురయ్యాను..

    ReplyDelete