Thursday, October 7, 2021

కేశవుడు కథ (కౌముది లో ప్రచురితం )

 


"కేశవుడు" (కథ)

- రాయపెద్ది వివేకానంద్

 

చాలా ఘోరం జరిగిపొయింది మా స్కూల్లో.

అతను నా దగ్గర చేరిన రోజే ఏదో తేడాగా అనిపించింది. ఇక ఈ పిల్లలని ఆ దేవుడే  బాగు చేయాలి. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్టు, మా మేనేజ్ మెంట్ వారు ఈ వెర్రి వాడిని నమ్మి ఇక్కడికి పంపారు.

అసలేం జరిగిందో వివరంగా చెపుతాను . మీరు ఆసక్తిగా వింటున్నారు కాబట్టి మీరు ఆప్తులు అన్న భావన కలుగుతోంది నాకు.

 

*****

 

"మనం మన మాతృభాషని ప్రేమించాలి" నాకు స్పృహ తప్పినంత పనయింది. ఏమిటి ఈ పాడుమాటలు. మాది ఇంగ్లీష్ మీడియం స్కూలు. కార్పొరేట్ స్కూలు ప్రిన్సిపాల్ గా

ప్రతిరోజు ఉదయాన్నేఅన్ని తరగతి గదుల ముందూ పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూ ఉన్న నాకు కేశవుడి కంఠం పెద్ద షాకే ఇచ్చింది.

ఆగిపొయి వింటూండిపోయాను, ఇంకా ఏమేమి చెప్తాడో అని.

జొశ్యం టెక్నోస్కూల్ పదవ తరగతి గది నుంచి కేశవుడి కంఠం స్పష్టంగా వినిపిస్తోంది. "మనం విఙ్గ్యానం ఎంతగా పెంపొందించుకుంటామో, మన సంస్కారాన్ని కూడా అంతగానూ పరిరక్షించుకుంటూ వుండాలి. మన మూలాల్ని మనం మర్చి పోకూడదు. మనం ఎప్పుడైతే మన అస్తిత్వాన్ని కాపాడుకుంటామో అప్పుడే ప్రపంచం మనల్ని గౌరవిస్తుంది"

అయ్యా ఆయన తెలుగు మాష్టారు కాదు. స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెప్ మెంట్ ట్రెయినర్ గా అతను ప్రఖ్యాతి గాంచిన మా  జోశ్యం టెక్నో స్కూల్లో చేరి పట్టుమని నాల్గు నెలలు కాలేదు.

అతని పోకడ ఆది నుంచి నాకు చిరాగ్గానే వుంది.

తెలుగు కూడా ఇంగ్లీష్ లో నేర్పిస్తాం మేం.

అ టు అః’  అనిట్రెయినప్ చేస్తాం, ’అ ఫర్ అమ్మ, ఆ ఫర్ ఆవు’ అని చెప్పి మేము స్టూడెంట్స్ ని ఇంగ్లీష్ లో పర్ ఫేక్ట్ గా మౌల్డ్ చేస్తాం. అది మా పద్దతి. లేదంటే పిల్లలకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? వెధవది తెలుగుదేముంది, వద్దన్నా వస్తుంది. రాకున్నా చింతలేదు. పరీక్ష్లలలో మార్కులు వచ్చేటట్టు ట్రెయినప్ చేస్తాం. జోశ్యం టెక్నోస్కూలా మజాకా? మాకు ఇంగ్లీష్ ముఖ్యం. ఇంగ్లీష్ లో మాట్లాడితే మాకు సొసైటీలో వచ్చే గుర్తింపే వేరు.

లోపల పాఠం కొనసాగుతోంది. వింటూండి పోయాను.

"జపాన్, జర్మనీ, దక్షీణకొరియా,చైనా, ఫ్రాన్స్ లు అభివృద్ది సాధించటానికి ప్రధాన కారణం వారు విద్యను వారి మాతృభాషలో నేర్చుకోవటమే"

నాకు మిడిగుడ్లు పడ్డాయి. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ’మా స్కూలు కేదో కీడు జరగబోతోంది. ఈ కేశవుడి రాక వల్ల ఖచ్చితంగా ఏదో ఉత్పాతం జరగబోతోంది అని అర్థం అయింది.. థాంక్ గాడ్ నేను సరి అయిన సమయానికి వచ్చి ఇతని నిజ స్వరూపాన్ని చూడగలిగాను.’కరుణామయుడైన భగవాన్ ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా.’ నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఆసరా కోసం స్తంభం పట్టుకుని నిలబడిపోయాను.

అయిదంతస్తుల భవంతిలో మిగతా అన్ని క్లాసులు సక్రమంగా ఇంగ్లీష్ లో నడిచి పోతున్నాయి, ఇక్కడే నాకు పంటి కింద రాయిలా ’చెడు పలుకు ’వినిపిస్తున్నాయి.

ఎవరయినా పిల్లలు తెలుగులో మాట్లాడుతూ కనిపించారంటే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఒక పలక మీద "నేను గాడిదను. నేను తెలుగులో మాట్లాడాను ఈ వేళ. అయాం సారీ" అని వ్రాయించి వాడిని ఒక్కో క్లాసుల్లొకి తీసుకెళ్ళీ పిల్లలందరి ఎదుట, బోర్డు దగ్గర నిలబెట్టి ఆ పలకలోని మాటలను వాడితోనే చదివించి, మిగతా వారికి కూడా ఙ్గ్యానోదయం అయ్యేలాగా చర్యలు చేపడతాం. అటువంటి ఉత్తమ శిక్షణ మా స్వంతం.

ఇలాంటి శిక్షలు ఎన్నో ఉన్నాయి మా దగ్గర. మరి క్రమ శిక్షణ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని కద నేను.

ఇటువంటి క్రమశిక్షణ కలిగిన మా సంస్థలో, సాక్షాత్తు ఒక మాష్టారు, అందునా ఇంగ్లీష్ మాష్టారు, ఆ పిల్లల క్లాస్ టీచర్ ఇలాంటి పాఠాలు చెబుతుంటే నాలాంటి డిసిప్లిన్డ్ ప్రిన్సిపాల్ కి ఎలా వుంటుంది మీరే చెప్పండి. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వెయ్యాలో మీరే చెప్పండి.

ఇందాకే చెప్పినట్టు మాది నగరంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన కార్పొరేట్ స్కూలు. ర్యాంకులు, గ్రేడ్లు మా స్కూలుకు ప్రతి సంవత్సరం వస్తూ వుంటాయి. అలా ర్యాంకులు రెగ్యులర్ గా రావాలి అంటే మేము ఎంత శ్రమ పడతామో మీరు ఊహించలేరు. నగరం నడిబొడ్డున ఓ అయిదంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ని అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాం ఈ స్కూలు ని. ఇలాంటి బ్రాంచులు నగరం నిండా మాకు ఓ ఇరవై దాకా ఉన్నాయి. గిట్టని వాళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళలా కుక్కేస్తాం క్లాసుల్లో పిల్లలని అని ఆడిపోసుకుంటారు. మాకు అద్దెలూ అవీ వెళ్ళాలి గదండి మరి. గిట్టని వాళ్ళదేముంది లేండి ఏదయినా అనగలరు. మా స్కూళ్ళన్నింటిలో ఏకాగ్రత అంతా ర్యాంకులు , గ్రేడింగులు, మార్కులమీదనే వుంటుంది. చదువుకు ఆటంకం కలిగించే ప్లేగ్రౌండ్, ఆడిటొరియం, లైబ్రరీ వంటి వాటి జోలికి వెళ్ళం, వీటన్నిటి మాట దేవుడెరుగు, అసలు టాయిలెట్లు కూడా సరిగ్గా వుండవు. మా ఏకాగ్రత అంతా, ఇందాకే చెప్పాను కద, ర్యాంకులు, మార్కులు, గ్రేడింగులు వీటిమీదనే వుంటుంది. అదన్న మాట మేము విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత. ఇవన్నీ మాములు వాళ్ళకు చెబితే అర్థం చేసుకోరు, మీలాంటి సహృదయులకు చెబితే కనీసం నన్ను అభినందించి, నా పట్ల జాలి చూపిస్తారు.

నాకు  విద్యావేత్తగా నగరంలో చాలా మంచిపేరు వుంది. నేను డబల్ ఎమ్మే, ఎం.ఫిల్, పీ.హెచ్.డీ. గోల్డ్ మెడలిస్టుని. బట్టీ పట్టేసి చదువుకుంటు వెళ్ళిపోతే, ’ఏదో రకంగా’ డిగ్రీలు తెచ్చుకుంటే ఒక విద్యావేత్తగా గుర్తింపు పొందవచ్చు. ఏమంటారు?

ఇక ప్రస్తుత విషయానికొస్తే, ఈ కేశవుడి పూర్తి పేరు ’బలీరాం కేశవుడు’ అట. నాగ్ పూర్ కు చెందిన ఎవరో స్వాతంత్ర్య సమరయోధుడి పేరట అది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటే అదే. ఈ బలీరాం కేశవుడి పేరే కాదు, అతని ప్రవర్తన కూడా చాలా చిత్రంగా వుంటుంది. నాకు సహజంగానే వ్యక్తిత్వవికాస శిక్షణ నిపుణులంటే ఎందుకో తగని చిరాకు, వీళ్ళు చెప్పే పాఠాలు మార్కులు తెచ్చిపెట్టవు కద. ఇతన్ని దగ్గరనుంచి చూసే కొద్దీ ఆ చిరాకు ద్విగుణీకృతం అవుతోంటుంది.

విద్యార్థులకుపోయి వ్యక్తిత్వవికాస శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ గాడిద గుడ్డు ఎందుకండి?  వీటికిపొయి మళ్ళీ ఒక ట్రెయినర్.

అసలు పిల్లలంటే ఏమి చేయాలి? చక్కగా కూర్చుని చదువుకోవాలి. అర్థం కాకుంటే బట్టీ పట్టాలి. ప్రతీ రోజు స్లిప్ టెస్టని, తరచూ యూనిట్ టెస్టనీ, క్వార్టర్లీ అనీ, హాఫియర్లీ అని ఏదో ఒక పరీక్ష వ్రాస్తూ సంవత్సరాంతం లో వచ్చే పెద్ద పరీక్షకి సిద్ధపడాలి. ఇంతకు మించి ఈ పర్సనాలిటి డెవలెప్ మెంట్ వంటి పనికిమాలిన విషయాలు అస్సలు అక్కరలేదని నా నిశ్చితాభిప్రాయం.

ఇదిగో రాబోయె చెడురోజులకు నాందీప్రస్తావనగా, మా బ్రాంచీలోకి ఈ కేశవుడు వచ్చి పడ్డాడు. అసలు ఇతని ప్రవేశం వెనుక మా చైర్మన్ గారి అబ్బాయి పాత్ర వుంది. ఈ చైర్మన్ గారి అబ్బాయి మా స్కూలు మేనేజిమెంట్ లోకి రెండొ తరం ప్రతినిధిగా ఎంటర్ అవ్వటం, అతను తనతో కూడా ఈ కేశవుడిని తీసుకు రావటం జరిగాయి.

మా  చైర్మన్  గారు తనకున్న వందాలాది బ్రాంచిలలొ ఓ పాతిక బ్రాంచిలకు ఇదిగో తన పెద్దబ్బాయిని డైరెక్టర్ గా నియమించారు.

నాకు తెలుసు లెండి, మీలాంటి సహృదయులు ఖచ్చితంగా నాలాగే ఈ కేశవుడి పట్ల ఇప్పటికే అయిష్టత పెంచేసుకుని వుంటారని. కాని ఏమి చేద్దామండి, మేనేజిమెంట్ సపోర్ట్ వుంది ఈ కేశవుడికి. కలికాలం. ఏం చేద్దాం చెప్పండి?

ఈ వింత మానవుడు ఎలా వుంటాడో కాస్తా వివరంగా చెప్తాను, మీక్కూడా అతని మీద ఇంకాస్తా చిరాకు కలుగుతుంది.

పాతికేళ్ళు కూడా వుండవు ఈ వింత మానవుడికి.తెల్లటి శరీర చాయ, పల్చటి కళ్ళద్దాలు,లేత గడ్డం, మరీ సన్నం కాని శరీర నిర్మాణం, కోలమొహం, ఎప్పుడూ తెల్లటి కుర్తా పైజామలలో కనిపిస్తాడు.

అసలు నాకు తెలియక అడుగుతానండి, ఉపాధ్యాయుడు అంటే ఎంత సీరియస్ గ వుండాలి, అందునా పిల్లలతో ఎంత గంభీరంగా వుండాలి. ఈ వింత మానవుడికి అది కూడా తెలియదు.

ఎప్పుడు చూసినా చిరునవ్వుతో పిల్లలతో మాట్లాడుతూ వుంటాడు.

నిజం చెప్పొద్దూ అతనిలో నాకు అన్నింటికన్నా అత్యంత చిరాకు కలిగించే అంశం ఆ చిరునవ్వుతో కూడిన మొహం.  ఎప్పుడు నవ్వుతూ కనిపించే వాళ్ళంటే మీక్కూడా చిరాకే అని నాకు తెల్సు లెండి. అందునా ఉపాధ్యాయులు ఎంత సీరియస్ గా వుండాలి అని నేను అక్కడికీ ఎన్నో సార్లు చెప్పిచూశాను.

తెలివా తేటా నా మాట విని ఏడిస్తే కద. నా మాట వింటే ఎప్పుడో బాగు పడిపోయే వాడు.

ఇకపోతే స్టూడెంట్లంతా ఇతగాడికి పెద్ద ఫాన్స్ అయిపోయారు. ఇతని రాకతో మాస్కూలు పరిస్థితి చాలా అరాచకంగా తయారయేటట్లు కనిపిస్తోంది. ఇతను నిప్పులో దూకమంటే దూకటానికి సిద్ధం అనేలా ఉన్నారు పిల్లలంతా.

ఖర్మ. ఇతను స్కూల్లోకి, నా జీవితంలోకి కూడా సునామిలా ప్రవేశించాడు.

ఇక మీకు ఒక విషయం చెప్పాలి. నాకు అనేక డిగ్రీలు, గోల్డ్ మెడల్స్, డాక్టరేట్లు వున్నప్పటికి ఇంగ్లీష్ లో అనర్ఘళంగా మాట్లాట్టానికి రాదు. ఏదో ఒక లాగ లాగిస్తూ వుంటాను.. ఉన్న మాట చెప్పుకోవటానికి మొహమాటం ఎందుకు చెప్పండి, అందులో మీ వంటి సహృదయుల దగ్గర. కాకపోతే పిల్లలంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అన్నది నా నిబంధన.

ఏమండీ మీరైనా చెప్పండి, మన పిల్లలు మనకంటే మెరుగ్గా వుండాలనే కదా ఆశిస్తాం? ఇంగ్లీష్ మాట్లాడే విషయం కూడా అలాగే అనుకోండి. మీరు ముసి ముసి గా ఎందుకు నవ్వుతున్నారో నాకైతే అర్థం కావటం లేదండి.

పిల్లలు చక్కగా చదువుకుని, హాయిగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ వుంటే తప్పేమిటి? ఇందుకు గాను వారిని అనేకరకాలుగా మోటివేట్ చేస్తూ వుంటాము.

వారిలో వారికి పోలికలు తెచ్చి, కించ పరిచి, రెచ్చగొట్టేలాగా మాట్లాడి మా తంటాలు మేము పడుతూ వుంటాము. నా ఆందోళనంతా వారి భవిష్యత్తు గురించే సుమండి.

ఇకపోతే మీకు తెలిసిన విషయమే కద పిల్లల ప్రగతికి ప్రధాన శత్రువులు ఆట పాటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ అని నా నిశ్చితాభిప్రాయం. యోగా , ఆటపాటలు వంటి అల్పమైన విషయాలలో పడి చదువు సంధ్యలను ఎక్కడ దెబ్బతీసుకుంటారో అని నేను బెంబేలెత్తి పోతూ వుంటానంటే నమ్మండి.

మా టీచర్లందరికీ నా మాట శిలా శాసనమే. ఇక్కడ మా టీచర్ల గురించి కాస్తా చెప్పాలి. మా స్కూలు చుట్టు ప్రక్కల నివసించే గృహిణులు, అత్తెసరు మార్కులతో బి.టెక్ పూర్తి చేసి ఏ ఉద్యోగం దొరికే అవకాశంలేని యువతీ యువకులు వీళ్ళే టీచర్లంటే. మీరు మరీ ఎక్కువెక్కువ ఊహించేసుకోమాకండి మా టీచర్ల గురించి. ఈ విషయంలో కూడా మేనేజిమెంట్ తో నాకు ఏ అభిప్రాయ భేదం లేదు. ఇలాంటి టీచర్లయితే తక్కువ జీతానికి వస్తారు. అసలు టీచర్ ఎంత బాగా చెప్పినా బట్టీ పట్టకుంటే మార్కులు ఎలా వస్తాయి చెప్పండి. అందుకే ఇలాంటి టీచర్లతో మేము బండి నడిపిస్తున్నాము.

ఈ టీచర్లంతా నాతో మాట్లాడేటప్పుడు చక్కగా తెలుగులోనే మాట్లాడి తమ తమ పనులు చక్కబెట్టుకుని వెళుతూ వుంటారు. వారు నాకు చాలా గౌరవం ఇస్తారు.

"మీ అంతటి వారితో ఇంగ్లీష్ లో మాట్లాడటానికి , మీ అంత బాగా మాకు ఇంగ్లీష్ రాదు సార్" అని సవినయంగా చెప్పుకుంటారు. వారిలోని ఆ వినయమే నాకు నచ్చేది.

ఈ కేశవుడితో ఈ విషయంలో కూడా నాకు తలనొప్పే. అతడికి చాలా భాషలు వచ్చు. ఇంగ్లీష్ నిజానికి మంచినీళ్ళ ప్రాయం అతనికి. ఏ బ్రిటిష్ వాడో వచ్చి మాట్లాడుతున్నాడేమో నన్నంత ఫ్లూయెంట్ గా అచ్చు అదే ఉచ్చారణతో మాట్లాడే వాడు. అతని మాటల్లొ కొన్ని అర్థమయి కూడా చావవు నాకు.

రూల్ పెట్టింది నేనే కద. మింగలేను, కక్కలేను.

పిల్లలతో తెలుగు, నాతో ఇంగ్లీష్ మాట్లాడి చావగొడుతున్నాడు. నా చావు ఎవ్వరికి చెప్పుకోను?

లెసన్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అన్న విషయంలో మిగతా టీచర్లంతా నా వద్దకు వచ్చి నా సలహామేరకు వాళ్ళ లెసన్ ప్లాన్ చేసుకోని వెళతారు. నేను చెప్పినట్టు తు.చ తప్పకుండా పాఠిస్తారు.

ఈ విషయంలో కూడా కేశవుడిది అరాచక ధోరణే. లెసన్ ప్లాన్స్ నిశితంగా తయారు చేసుకుని వస్తాడు. పీ.డీ.ఎఫ్ ఫైల్స్, జే.పీ.జీ ఇమేజెస్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, కేస్ స్టడీస్, రోల్ ప్లేస్, నా పిండం, నా శ్రాద్ధం, ఇలా ఏవేవో తీసుకుని వస్తాడు, వాటిని వివరించి చెప్పేటప్పుడూ ఒక విధమైన ఆధిపత్య ధోరణి, ఇంగ్లీష్ లోనే నాకు వివరించి, నా సలహాలు అడుగుతాడు. తానా రోజు క్లాసులో ఏమేమి చెప్పబోతున్నాడో ఇంగ్లీష్ లోనే నాకు వివరించి నా అభిప్రాయం అడిగి, చక్కా క్లాసుకు వెళతాడు. పెద్దల్ని గౌరవించే పద్దతి ఇదేనా మీరే చెప్పండి. నాకు ఇంత అనుభవం వుంది కద, నన్ను ఆడిగి కద పెన్ను పేపర్ పై పెట్టాలి? అహంభావి. అహా, మీరైనా చెప్పండి, ఇదంతా అహంకారం కాకపోతే మరేంటి? వినయం లేదు, భక్తి లేదు, పెద్దలయందు ఉండాల్సిన భయంలేదు. సరే అతనే దారికి వస్తాడు అని ఎదురుచూస్తున్నాను.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజే, అందరిలా నా ఆశీర్వాదం తీసుకోవటం మాట అటుంచి, రివర్స్లో తన గురించి ఒక అరగంట లెక్చర్ ఒకటి ఇచ్చాడు. అంతా ఆధిపత్య ధోరణే.

ఎవడడిగాడండి ఇతగాడి లెక్చర్? పెద్ద వాడిని కద, నా సలహా సంప్రదింపులు తీసుకోవాలా వద్దా?

" నా వరకు నాకు వృత్తే దైవం సార్. నాకప్పజెప్పబడిన పనిని సంపూర్ణంగా , శ్రద్ధగా చేయటమే నాకు అలవాటు. నా గురించి నా పని మాట్లాడాలి. ఒకవేళ మీరు మీ కారు తుడవమని నాకు అప్పజెప్పారనుకుందాం. కారు అప్పుడు ఎంత బాగా తుడుస్తాను అంటె, మీరు కారును చూసి ఇంప్రెస్ ఐపోయి అరె ఈ కుర్రాడికి డ్రైవర్ పని కూడా అప్పజెప్పుదామా అని మీకు అనిపించేలా తుడవాలి సార్. అదీ నా పద్దతి. పిల్లల అభివృద్ధి విషయంలో నేను అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తాను సార్.హోలిస్టిక్ అప్రోచ్ తో ముందుకు వెళతాను. నాకు మీ సలహాలు సూచనలు ఎప్పటికీ కావాలి సార్" అంటూ చక్కా క్లాసుకు పోయాడు. అతని మాటల్లో నాకు సగం అర్థం కాలేదు.

అది ప్రారంభం మాత్రమే.

ఇతగాడు స్కూల్లో చేరింది లగాయతు రోజుకొక వింత వార్త నా చెవుల్ని సోకుతోంది.

ఇతని ప్రవర్తన మా టీచర్లందరికీ ప్రధాన వినోదమైంది.  ఇంచుమించు అతగాడు ఒక ’లాఫింగ్ స్టాక’యిపోయాడు మా అందరికి.

ఉండుండి అతగాడి గురించిన ఏదో ఒక న్యూస్ ఇంచుమించు బ్రేకింగ్ న్యూస్ లాగా వస్తూనే వుంది.

"ఏమండోయ్ ఇది విన్నారా? అదేదో సంఘంలో సభ్యుడట ఇతగాడు, అందులో చిన్ననాడే భరతమాత పటం ముందు నిలబడి ప్రమాణం చేశాట్ట, ఆజన్మ బ్రహ్మచారిగ వుండిపోతానని" అని ఒక వార్త వస్తుంది ఒక రోజు, దాని తాలూకు ప్రభావం నుండి కోలుకొనే లోగా ఇంకో వార్త వస్తుంది.

"అన్నట్టు ఇది విన్నారా? మన స్కూలుకు దగ్గరలోనే ఓ పెద్ద ఇల్లు అద్దెకి తీసుకుని దిగిపోయాట్ట."

"భలే. అంత పెద్ద ఇంట్లో ఏ వస్తూ సామగ్రి లేకుండా, ఓ లారీడు పుస్తకాలు లోడుతో దిగి పోయాట్టటండీ. అతని ఇల్లు ఇంచుమించు ఒక లైబ్రరీ లాగా వుంటుందటండి"

"ఫర్నిచర్ కాదు కద చిన్నపాటి సామగ్రి కూడా లేదట, ఏదొ కాసిన్ని వంట పాత్రలు తప్పనిచ్చీ"

"మన స్కూలు పిల్లలు ఏ క్లాసువారయినా సరే ఎప్పుడు వెళ్ళినా సరె, విసుగు విరామం లేకుండా ఉచితంగా ట్యూషన్స్ చెబుతాడటండి. అంతే కాదు భోజనం కూడ వండి మరీ వడ్డిస్తాడటండి"

ఇవన్నీ ఒక ఎత్తయితే, స్కూలుకు లీవనేది పెట్టడు, ఒక క్షణం ఆలశ్యంగా రాడు. వంటరిగాడు పెళ్ళామా పిల్లలా, ఇందులో ఏమి పెద్ద గొప్ప వుంది? కాని అమాయకులైన మా టీచర్లలో కొందరికి ఇతగాడు అప్పుడే ఒక రోల్ మోడల్ , ఆరాధ్యపురుషుడు అయిపోయాడు.

ఇతనికేం వెర్రో గానీ, ఏ టీచరైనా ఎప్పుడైనా లీవు పెడితే, తనెళ్ళి ఆ క్లాసు తీసుకునే వాడు. తనకు ఆ పీరియడ్ ఖాళీ వుంటేముందు వెనుకలుఆలోచించకుండా ఆ క్లాసులో వాలిపోయి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ,తెలుగు, హిందీ ఇలా ఒకటేమిటి ఆయా టీచర్ల సబ్జక్టును కంటిన్యుయిటి దెబ్బతినకుండా ఆ పాఠం చెప్పి వచ్చే వాడు.

ఘోరమేమిటంటే అసలు సబ్జక్టు టీచర్ కన్నా ఇతను బాగా చెప్పి వచ్చాడని పిల్లలు అనే వారు. ఇది ఏమయినా బాగుందా చెప్పండి. కీర్తి కండూతి ఇతనికి ఎక్కువ అనుకుంటాను.

పరీక్షలకు పనికి వచ్చేవిధమైన శిక్షణ మాత్రమే కాక ఆయా సబ్జక్టులు జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో అన్న విషయంలో లోతైన అవగాహన కల్పించాడని,పిల్లలు, వారి తలితండ్రులు చెప్పుకోవటం వినవచ్చింది.

ఇతన్ని ప్రత్యేకంగా చూడటానికి తలితండ్రులు వచ్చి ఆపిల్స్, స్వీట్స్ కూడా తీసుకు వచ్చి ఇవ్వటం అతన్ని ఆరాధనగా చూస్తూ మాట్లాడటం తరచుగా జరుగుతోంది. టిచర్లను గురించి ఏదో ఒక కంప్లయింట్ ఇవ్వటానికి తలితండ్రులు రావటమే మాకు తెలిసిన విషయం ఇప్పటిదాకా.

ఈ విధంగా కూడా ఇతను వ్యక్తి ఆరాధనకి తెర ఎత్తి మా స్కూలు పరువు తీయటనికి సిద్ధపడి పోయాడు.

కేశవుడు సారి కల్పించిన ఙ్గ్యానం ఇచ్చిన ఆనందం వల్ల , మనసులకు మస్తిష్కానికి రెక్కలు మొలిచిన అనుభూతి కల్గిందట" బడుద్ధాయిలు కవిత్వం వెలగబెడుతున్నారు.

పరీక్షలలో మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలి, తద్వారా వచ్చే సంవత్సరంలో స్కూలు అడ్మిషన్లు ఎలా పెంచుకోవాలి అని ఆలోచించకుండా ఇవన్నీ ఇతనికి అవసరమా చెప్పండి. ఏదో మీరు నా భావలతో మమేకం అయ్యే పెద్దమనసు వున్న వారు కాబట్టి ఇవన్నీ చెప్పుకొస్తున్నాను.

ఇంకో వెర్రి వేషం గురించి మీకు ఇక్కడ చెప్పాలి. చదువేస్తే ఉన్న మతి పోయింది అన్నట్టు,అసక్తి వున్న పిల్లలందరినీ ఓ గంట ముందే రమ్మనే వాడు. పోనీ చదివిస్తాడా అంటే అదీ లెదు. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అన్నాట్ట వెనుకటికి ఒకడు. ఇతను చేపట్టిన పని అంతకన్న మెరుగ్గా ఏమీ లేదు.

పిల్లలందరినీ మొదట ఒక అరగంట వేగంగా నడిపించే వాడు. కాళ్ళూ, చేతులు బాగా కదిలిస్తూ వేగంగా నడిపించే ఈ ప్రక్రియకి ’బ్రిస్క్ వాక్’ అని పేరు పెట్టాడు. గాడిద గుడ్డేం కాదూ? "హెల్తీ బాడీ లీడ్స్ టు హెల్తీ మైండ్" అని పిచ్చి స్లోగన్ ఒకటి చెప్పిస్తూ పిల్లలందరితో సూర్య నమస్కారాలు, యోగా, ప్రాణాయామాలు చేయించి ఆపై క్లాసులకు వెళ్ళమనే వాడు. హతోస్మీ, చదువు చెప్పించకుండా ఇవేమీ వెర్రి మొర్రి వేషాలు చెప్పండి?

ఇక ఆసక్తి వున్న పిల్లలతో సాయంత్రాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణ అని పేరు పెట్టుకుని ఏదో సుత్తి కొట్టి, ఆ తర్వాత ఓ అరగంట పిల్లలని వేదికపై నిలబెట్టి వాళ్ళతో చిన్నచిన్న ఉపన్యాసాలు ఇప్పించటం మొదలెట్టాడు. అయా ఇవన్నీ పిచ్చి పనులు కాక ఏమిటి మీరే చెప్పండి. ర్యాంకులు వస్తాయా, మార్కులు వస్తాయా, ఉత్తి టైం వేస్ట్ తప్ప.

కొత్తొక వింత అన్నట్టు, పిల్లల తల్లి తండ్రులు వచ్చి నన్ను అభినందిచటం మొదలు పెట్టారు, మంచి మేష్టారుని అపాయింట్ చేసారు అని. వాళ్ళ్ పిల్లలో చాలా మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయంట. ఉదయాన్నే నాలుగున్నర, అయిదు మధ్యన లేచిపోతున్నారట, తల్లి తండ్రుల పాదాలు మొక్కి, ఆ తర్వాత కాసేపు దైవధ్యానం చేసుకుని పుస్తకాలు తీసుకుని కూర్చుంటున్నారట. ఖర్మ, లేచింది లగాయతూ చదివితే ఇంకో అరగంట కలిసి వస్తుంది కద.  హతవిధి, మా స్కూలుకేదో చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయని నాకు బలంగా అనిపిస్తోంది.

ఇప్పుడు పిల్లలందరూ పెద్దలకు గౌరవమర్యాదలు ఇస్తున్నారట. వీడియోలు, వీడియో గేమ్స్ తగ్గించారట. ఇంట్లో చిన్నచిన్న పనులకు సహాయ పడుతున్నారట. పిచ్చి పేరెంట్స్, రేప్పొద్దున టెన్త్ క్లాసులో పదికి పది గ్రేడింగ్ రాకుంటే నా పీక పట్టుకోరా అని నాకు భయం పట్టుకుంది. ఇల్లలుకగానే పండగ అనుకుంటున్నారు.

అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు కద, ఇక నేనే నడుం బిగించి పిల్లలందరిని పూర్వ పద్ధతులలో క్రమశిక్షణలో వుంచాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేనిలా అనుకుంటుండంగానే మరొక ఉపద్రవం జరిగింది.

ఒక మధ్యాహ్నం నేను నా చాంబర్ లో పని చేసుకుంటుండగా ఓ పదవ తరగతి విధ్యార్తిని , ఆపిల్ల తలితండ్రులు, మిఠాయిలు తీసుకువచ్చి ఓ బాంబు పేల్చారు. ’యునెస్కో’ వారు రక్షిత కట్టడాలు అన్న టాపిక్ పై నిర్వహించిన ఓ పోటీలో ఈ పిల్ల గీసిన ఛాయా చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో బహుమతి వచ్చిందట. తనలో అంతటి కళ దాగుందని ఆ పిల్లకే తెలియదట, యధాప్రకారం, మన కేశవుడే ఆ పిల్లలోని స్పార్క్ ని కనిపెట్టి, దగ్గరుండి ఆ పిల్లతో ఆన్ లైన్ లో అప్లై చేయించాడట. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయించాడట. ఇంకేముంది, ప్రైజ్ రానే వచ్చింది.

మేము పదవ తరగతి పిల్లలని రక్షిత కట్టడాలకంటే జాగ్రత్తగా కాపాడుకుంటాము, వారి విలువైన టైం ని మేము వృధా చేయనివ్వము. వారిని ఇంచుమించు జాగ్రత్తగా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్ లోని పేషంట్ల లాగా కాపాడుతూ, పరీక్షల పట్ల వారిలో విపరీతమైన భయాన్ని కలిగించి, శ్రద్ధగా చదువుకొనేలాగా ప్రోత్సహిస్తాము. ఈ వ్యవస్థకి కూడా గండి కొట్టేశాడన్న మాట ఈ కేశవుడు. ఇలాంటివన్నీ నాకు తెలియకనా, నేనెందుకు ప్రొత్సహించలేదంటారు పిల్లలని ఇలాంటి వాటి పట్ల. ఏమి పనులండీ ఇవన్నీ, చదువులు అటకెక్కవా ఇలాంటి పనుల వల్ల? ఇక తప్పదు, ఇతని నిర్వాకాలన్ని, మా చైర్మన్ గారబ్బాయికి కాదు గాని, చైర్మన్ గారికే తెలియజేయాలి. ఆయన ఏదో విదేశీ యాత్రలకు వెళ్ళారట. రానివ్వండి చెపుతాను.

ఇది అంతం కాదు ఆరంభమే అని నాకు అర్థం అయిపోయింది. ఇది తుఫాను ముందటి మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిదని నాకు త్వరలోనే అర్థం అయింది. ఇలాగే అనేక జాతీయ, రాష్ట్రీయ స్థాయి పోటీల్లొ మా స్కూలు పిల్లలకు బహుమతులు వచ్చాయి.  వీటన్నిటి వెనుక కేశవుడే వున్నాడన్నది బహిరంగా రహస్యం.  నా కళ్ళ ముందే పిల్లల చదువులని బ్రష్టు పట్టిస్తూ, తాత్కాలిక విజయాలకోసం,  బంగారులాంటి భవిష్యత్తు ని పణంగా పెడుతున్న ఈ కేశవుడిని ఏమి చేయాలి మీరే చెప్పండి.

నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి?

ఇతని దురాగతాలన్నీ ఒకెత్తు. మా స్కూల్ డే రోజు ఇతను చేసిన నిర్వాకం ఒక్కటీ ఒకెత్తు. ఇతని దౌష్ట్యాలన్నిటిలో కలికి తురాయి లాంటిది అని చెప్పుకోదగ్గ దుర్మార్గం ఒకటి చెపుతాను. మీకు కూడా బాగా కోపం వస్తుంది.

ప్రతి సంవత్సరం నగరంలో ఉన్న మా బ్రాంచీలన్నింటి పిల్లలని ఒక దగ్గర చేర్చి,  ఓ పెద్ద స్టేడియంలో స్కూల్ డే నిర్వహిస్తాం. మా చైర్మన గారికి రాజకీయాల్లో బాగా పలుకుబడి వుందిలేండి. ఎవరో ఒక మంత్రివర్యులు వస్తారు ముఖ్య అతిధిగా. మీడియా ప్రతినిధులు సరేసరి.

ఏ ఆర్ రెహమాన్ పాడిన వందేమాతరం వంటి దేశభక్తి గీతాల తర్వాత చక్కటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. పిల్లలు చిన్న చిన్న బృందాలుగా వేదికపైకి వస్తారు. కాస్తా చిన్ని చిన్ని బట్టలు ధరించి, సినిమా పాటలకు అనుగుణంగా నడుం కదిలిస్తూ, చిలిపిగా హావభావాలు ఒలకబోస్తూ హుషారు కలిగించేలా డాన్సులు చేయటం మొదలెడతారు;. పిచ్చి పిల్లలు జన్మకో శివరాత్రిలా సంవత్సరానికి ఒక సారి ఏదో కాస్తా ఎంజాయ్ చేస్తే తప్పేమిటి మీరే చెప్పండి. ఈ సత్సాంప్రదాయానికి కూడా గండి కొట్టేశాడు మన కేశవుడు.

ఈ సంవత్సరం మా బ్రాంచి తరఫున హుషారెత్తించే పాటలు లేకపోగా , పరమ బోరు కలిగించే స్కిట్స్ అంటూ ఏవో ప్రదర్శించటం జరిగింది. వీటిలో కూడా ’గోల్ సెట్టింగ్’, ’పాజిటివ్ థింకింగ్’, ’విన్-విన్ సిట్యుయేషన్’, 360 డిగ్రీస్ థింకింగ్’, అంటూ నిరర్థకమైన నినాదాలు, నిరాసక్తమైన సందేశాలు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి చచ్చు కార్యక్రమాలు నా జన్మలో చూడలేదు నేను. మిగతా బ్రాంచీల పిల్లలు యధావిధిగా ఐటెం సాంగ్స్ కి చక్కగా నడుం కదిలిస్తూ డాన్సులు చేసి నన్ను ఆకట్టుకున్నారు.

మా బ్రాంచి పిల్లల్నే కేశవుడు ఇలా దిగజార్జేశాడు. నా ఖర్మ ఏం చేద్దాం చెప్పండి? చిత్రంగా ఇతను నిర్వహించిన కార్యక్రమాలకు చప్పట్లు ఎక్కువగా వచ్చినట్టుగా అనిపించింది నాకు.

ఇంకో చిత్రం చెప్పనా, చక్కటి డాన్సులన్నింటినీ త్రోసి రాజని మన కేశవుడి స్కిట్స్ కే అవార్డులన్నీ క్యూ కట్టుకుని మరీ వచ్చాయి.ఇలాంటి గొప్ప శిక్షకుడు ప్రతి బ్రాంచిలో వుండాలని మా చైర్మన్ గారి అబ్బాయి ప్రశంశా వాక్యాలొకటి.

విదేశాల నుంచి రాగానే చైర్మన్ గారితో కూలంకషంగా మాట్లాడాలని ఇక ధృఢంగా నిశ్చయించుకున్నాను.

తదుపరి పరిణామాలు మరింత ఘోరంగా పరిణమించాయి.

నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నట్టు , టీచర్లందరిపై తన దృష్టిని కేంద్రీకరించాడు కేశవుడు. సాధికారికంగా ఇంగ్లీష్ లో మాట్లాడే శిక్షణ ప్రారంభించేశాడు. ఆశువుగా మాట్లాడే వక్తృత్వ శిక్షణ, వ్యక్తిత్వ వికాస శిక్షణ, ప్రారంభమయిపోయాయి. ఇక ఇతగాడి ట్రేడ్ మార్క్ సూర్యనమస్కారాలు, యోగా, బ్రిస్క్ వాకింగ్, ప్రాణాయామాలు సరేసరి.

నాకు తెలియక అడుగుతా. ఎందుకండి ఇవన్నీ.

ప్రతీరోజు కనీసం ఒక్కసారన్నా ఇతగాడిని నా ఛాంబర్ కి పిలిచి, ’ ఈ పిచ్చి పనులు కట్టిపెట్టి, పిల్లలందరికీ పదికి పది స్కోరు వచ్చే దానిపై ఫోకస్ చేయమ’ని చెప్పటం  నా నిత్య కృత్యాల్లో ఒకటిగా మారిపోయిందంటే నమ్మండీ. ఇలా అనుభవం లేని అధ్యాపకులని మలచుకోవటమే కద ప్రిన్సిపాల్ గా నా విధి.

ఇక సంవత్సరం అంతంలో పరీక్షలు జరగటం, ఫలితాలు వెలువడటం చక చక జరిగి పోయాయి. మా బ్రాంచి చరిత్రలోనే కని విని ఎరుగని ఫలితాలు ఈ సంవత్సరం వచ్చాయి.

ఎక్కడ చూసినా అభినందనల వెల్లువ. కేశవుడిని అప్పాయింట్ చేయటం నా దార్శనికతకి ప్రతీక అని పేరెంట్స్ అందరూ కొనియాడుతున్నారు. ఖర్మ , ఇన్నేళ్ళూ నేను చేసిన శ్రమ ఫలించింది., క్రెడిట్ ఈ కేశవుడు కొట్టేస్తున్నాడు.

పోన్లెండి కనీసం కేశవుడికి అయినా అర్థమయి బుద్ది తెచ్చుకుని, ఇకనైనా నేను చెప్పినట్టు వింటాడని ఆశిద్దాం.

కానీ తానొకటి తలచిన దైవమొకటి తలచును అన్నట్టు , కేశవుడిని మా బ్రాంచికి ప్రిన్సిపాల్ గా అప్పాయింట్ చేస్తూ, నన్ను ఇంటి దారి పట్టమన్నారు.

 

***

పోన్లెండి. ఈ జ్యోస్యం టెక్నో స్కూలు ఒక్కటే కాదు కద. గోవిందా టెక్నో స్కూలు, వైప్లవ్య కాన్సెప్ట్ స్కూలు ఇలా బోలెడు స్కూళ్ళు నన్ను రమ్మని ఎప్పటినుండో పిలుస్తూనే వున్నాయి.  నేనంటూ వెళితే కళ్ళకద్దుకుని తీసుకుంటాయి.

కానీ ఈ కేశవుడి చేతిలో పడి ఈ స్కూలు గతి ఏమవుతుందో ఊహించుకుంటేనే జాలి కలుగుతుంది.

 

******సమాప్తం******

 

(ఈ కథ కౌముది డాట్ కామ్ లో ఫిబ్రవరి 2020 సంచికలో ప్రచురితం అయింది)


No comments:

Post a Comment