Sunday, April 26, 2020

Lock Down Song పిల్ల జెల్ల


అబ్బ. కన్నీళ్లు ఆగలేదు ఇది వింటూ ఉంటే. 
ప్రతి పదం లో జీవముంది. 
ముఖ్యన్గా పేదరికం కంటే,  పెద్ద రోగం ఏది వుంది?  అన్న వాక్యాలు గుండెల్ని పిండేసాయి. 
బస్సు వద్దు,  రైలు వద్దు,  విడిసి పెడితే నడిసి నేను పోత సారూ. 
అబ్బ కట్టి కుదిపేసింది ప్రతి అక్షరం. 
నిజమైన హృదయ ఘోష. 
జానపదాలు ఆకట్టు కుంటాయి మనసుల్ని. కానీ ఆ పేరుతో నా నా చెత్త వస్తున్న ఈ రోజుల్లో ఇది ఆణి ముత్యం. 
ఇది ఎవర్ని ఆకట్టుకోవడానికి వ్రాసింది కాదు కాబట్టి దీనికి ఆ శక్తి. 
గొంతు ఎవరిదో గానీ ఇళయరాజా రాజ గాత్రానికి దగ్గరగా వుంది. 
దీని రచన ఎవరో? 
ఆ పేరు తెలియని కళా కారులు అందరికీ వందనాలు,  వారికి  పాదాభివందనాలు. 
ప్రజానాట్యమండలి వారి 'అక్కో అక్కో నీ తమ్ములమొచ్చినామక్క ' అన్న పాట విని కూడా ఇలాగే కొన్ని రోజుల పాటు దిగ్భ్రమ కి గురి అయి వుండినాను. 
మీ 
రాయపెద్ది వివేకానంద్

మొదటి బహుమతి (ఒక జ్ఞాపకం - 6)



మొదటి బహుమతి
(ఒక జ్ఞాపకం - 6)

*********

నేను ఏమాత్రం ఇష్టపడని ఓ రాజకీయ నాయకుడిని పొగుడుతూ నా వక్తృత్వ కళ ప్రారంభం కావటమే జీవితంలో ఐరనీ అంటే.

******
ఇప్పుడు షేర్ చేసుకోబోయే జ్ఞాపకానికీ - "బావా బావా పన్నీరు" అనే జంధ్యాల సినిమాలోని కథాంశానికి దగ్గరి సంబంధం వుంది. అప్పుడప్పుడూ జంధ్యాల గారి సినిమాలు యూ-ట్యూబ్ లో చూసి మనసారా నవ్వుకుంటూ వుంటాను.
ఇటీవల మళ్ళీ ఒక సారి జంధ్యాల సినిమా "బావా బావా పన్నీరు" చూశాను. అందులొ వృద్దుడైన కోటా శ్రీనివాస రావుది చిత్రమైన మనస్థత్వం. అతడు ఓ చిన్న పిల్లని పెంచుకుంటూ వుంటాడు. తన మనవరాలి వయస్సుండే ఆ చిన్నపిల్లకి ఊహకూడా తెలియని వయసులోనే , ఆ పిల్లని పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యంతో చేరదీసి పెంచుకుంటాడు ఆ దుర్మార్గుడు. ఈ పరంపరలో ఆ పిల్లకు ఇరవై నాలుగు గంటలూ తన నిలివెత్తు ఫోటోలు కనపడేలా ఏర్పాటు చేసి, "మగవాడు అంటే వాడు, మగతనం అంటే వాడిది" అన్న మాటలు మంత్రాల్ల చెప్పించి ఆ పిల్లని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు.
ఆ తర్వాత హీరో పాత్రలో నరేష్ (నాలుగు స్తంభాలాట ఫేం) రావటం, ఆ తర్వాత కథ సుఖాంతం కావటం జరుగుతుంది.
****
ఇక నేనందుకున్న మొదటి బహుమతి విషయానికి వస్తాను.
అది నవంబర్ నెలే అయినా జమ్మలమడుగులో ఎండ చంపేస్తోంది.
ప్రభుత్వ బాలుర పాఠశాలలో నేను ఏడవ తరగతి చదువుతున్న రోజులు అవి.
ఇంకాసేపటికి లంచ్ బెల్ కొడతారు అనగా క్లాసుకి సర్క్యులర్ పట్టుకోచ్చాడు అటెండర్. ఆ సర్క్యులర్ చదివి మాష్టారు ప్రకటించారు. ఆ రోజు నవంబర్ 14 బాలల దినోత్సవం కావటాన, మధ్యాహ్నం క్లాసులు వుండవనీ, అందరూ లంచ్ తర్వాత ప్రేయర్ హాలుకు రమ్మనీ ఆ సర్క్యులర్ సారాంశం.
ఏవో వక్తృత్వ పోటీలు వుంటాయట. కడప డీ.ఈ.వో ఆఫీసు నుంచి వచ్చిన ఎవరో పెద్ద అధికారి అధ్యక్షుడట ఆ మీటింగ్‍కి. స్థానిక వైద్యుడు డాక్టర్.యం.ఎల్.నారాయణ రెడ్డి గారు గౌరవ అధ్యక్షుడట.
మా ఇల్లు దగ్గరే. ఇంటికే వెళ్ళి లంచ్‍ చేయటం అలవాటు. ఇక లంచ్ తర్వాత స్కూలుకు వెళ్ళాల్సిన పని లేదన్న మాట అని నిశ్చయం చేసుకుని ఇంటికి వెళ్ళాను. భోంచేసిన తర్వాత మా బావ గారు అడిగారు, ’ఏమిటి స్కూలుకు వెళ్ళటం లేద’ని.
మా పెద్దక్కయ్య కాన్పు అయివుండటం వల్ల ఆయన వనపర్తి నుంచి వచ్చి వున్నారు. ఉదయం నుంచి ఆయన క్యాంప్‍బెల్ ఆసుపత్రిలో మా అక్కయ్య వద్ద తోడు వుండి వచ్చారు. లంచ్ తర్వాత మా అమ్మగారు, వదినమ్మ, అక్కయ్యలు అంతా ఆసుపత్రికి వెళ్ళటం వల్ల ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన వనపర్తి ప్రభుత్వ కళాశాలలో తెలుగు లెక్చరర్ అప్పుడు.( ప్రస్తుతం ఇటీవలె ఆయన ప్రిన్సిపాల్ హోదాలో రిటైర్ అయ్యారు.)
ఇలా బాలల దినోత్సవం విషయం, వక్తృత్వపోటీల సంగతి చెప్పాను ఆయనకి.
ఈ సంభాషణ నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని, ఆయన అప్పుడు తీసుకున్న నిర్ణయం నాకు జీవితాంతం ఉపయోగపడుతుందని బహుశా ఆయన కూడా ఆ క్షణంలో ఊహించి ఉండరు.
ఆయన నా సమాధనం విని ఆశ్చర్యపోయి ’మరి నీవు పార్టిసిపేట్ చేయవా?’ అని అడిగారు.
’అది ఏదో కొద్ది మంది టాపర్స్‌కే పరిమితమైన ప్రక్రియ అనే అభిప్రాయంలో వుండినాను నేను అప్పటి దాకా. ’నేనా! పార్టిటిసిపేషనా?’ అని ఆయన అమాయకత్వానికి జాలిపడుతూ అడిగాను.
హోం వర్కులు చేసుకోకుండా వెళ్ళటం, మాష్టర్లతో తిట్లు తినటం, క్లాసులో పాఠాలు వినకుండా నా లోకంలో నేనుండి, తీరా మేష్టారు ఏదయినా ప్రశ్నలు వేస్తె తెల్లమొహం వేయటం ఇలాంటి ట్రాక్ రికార్డ్ వల్ల నా మీద ఎవరికీ పెద్ద అంచనాలు వుండేవి కావనుకుంటాను ఆ రోజుల్లో. విషాదం ఏంటంటే నన్ను గూర్చి నేను కూడా చాలా తక్కువ అంచనా వేసుకునే వాడిని. స్టీఫెన్.ఆర్.ఖవీ వ్రాసిన ’7 హాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ లో సోషియల్ మిర్రర్ అన్న అంశం చదివినప్పుడు ఇదే విషయం గుర్తొచ్చింది.
మన ప్రవర్తనలోని ఒకటొ రెండో అంశాలు చూసి జనాలు మనపై ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు, అదే నిజమని బలంగా విశ్వసిస్తారు. ఇక మనకు తెలియకుండానే, వాళ్ళఅభిప్రాయలకనుగుణంగా ఆ తర్వాత మనల్ని మనం రూపుదిదుకుంటాం. అందువల్ల నేను టాపర్‍ని కానని నేను డిసైడ్ అయిపోయానన్నమాట.
ఆయన ఒక సారి నా వంక సాలోచనగా చూసి ,మరేం పలక్కుండా తనే ఒక క్లిప్ పాడ్ తీసుకుని, కొన్ని తెల్ల పేపర్లు ముందేసుకుని కూర్చుని ఓ అయిదు నిముషాలు ఏదో వ్రాస్తూ వుండిపోయారు. అదేంటో నాకర్థం కాలేదు.
ఆయన వ్రాయటం అయిపోయాక నన్ను పిలిచి ఇదిగో ఈ రెండు పేపర్లలోని మేటర్‍ని ఓ పది నిమిషాలు చదువుకో. తర్వాత అందులోని ఏయే విషయాలు గుర్తున్నాయో నాకు చెప్పమని అడిగారు. అన్నీ సరదా సంగతులే కావటం వల్ల టక టక చెప్పేశాను. అప్పుడాయన నా భుజం తట్టి ఇవే విషయాలు వేదిక మీద నిలబడి అందరి ముందూ చెప్పు. అదే వక్తృత్వం అంటే అని చెప్పారు.
’ఓస్ అంతేనా’ అని నాకు ఉత్సాహంగా అనిపించింది. దానితో పాటు మా బావ గారు నాకు ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించాలో, సభాధ్యక్షులకు, హెడ్ మాష్టారు గారికి ,టీచర్లకు, సభికులకు ఎలా గౌరవం అందించాలో చెప్పారు. ఇవన్నీ ఆసక్తికరంగా వుండటంతో శ్రద్ధగా విని అలాగే అని తల ఊపి బయలు దేరాను.
నేను కాస్తా ఆలశ్యంగా వెళ్ళినట్టే లెక్క. అప్పటికే సభ ప్రారంభమైపోయింది. దీప ప్రజ్వలనం, ప్రార్థనా గీతం వంటి లాంచనాలు పూర్తి అయినట్టు అర్థమైంది. అందరూ కూర్చుని శ్రద్దగా అధ్యక్షోపన్యాసాన్ని వింటున్నారు. నేను మెల్లిగా వెళ్ళి మా తెలుగు మేష్టారు గారికి నా పేరు వ్రాసుకోమని చెప్పాను.
ఆయన ఆశ్చర్యంగా నా వంక చూసి ’నువ్వా. స్పీచా’ అన్నట్టు ఒక లుక్కిచ్చారు.
’అవును నేనే. స్పీచే’ అన్నట్టు ఫోజిచ్చాను నేను. నాకు ఆదినుంచి అతిశయంపాళ్ళు కాస్తా ఎక్కువే.
పెద్దల ఉపన్యాసాలనంతరం, విద్యార్థుల ఉపన్యాసాలు ప్రారంభమయిపోయాయి. హెడ్ మాష్టార్ గారు, డా.ML.నారాయణ రెడ్డి గారు, మా తెలుగు మాష్టారు గారు తలా ఓ ప్యాడ్, పేపర్ పట్టుకుని స్కోర్స్ వేయటం ప్రారంభించారు.
నేను పేరు చివర్న ఇచ్చాను కద అందుకే నా వంతు చివరే వచ్చింది. నాకిదంతా సరదాగా వుంది తప్పనిచ్చి ఏ కోశానా భయం అన్నది వేయటం లేదు. భయపడాలి అన్న విషయం కూడా తెలియని వయసులోనే స్టేజిమీద నిలబడటం వల్లనుకుంటాను నాకు వేదిక మీద నిలబడి మాట్లాడటానికి భయం వేయలేదసలు.
చాలా మంది స్టేజి ఫియర్ అంటుంటారు,అసలలాంటి పదమే ఇంగ్లీష్‍ భాషలొ లేదు. (సరయిన ఎక్స్‌ప్రెషన్ స్టేజిఫ్రయిట్)
నా వంతు కొరకు ఎదురుచూస్తూ కూర్చునాను. క్లాసులో బట్టీ పట్టి మార్కులు బాగా తెచ్చుకునే సోకాల్డ్ టాపర్స్ ఎవరయితే ఉన్నారో వారిపేర్లను ప్రత్యేకంగా మామాష్టార్లే చొరవతీసుకుని ప్రకటించేసి వారితో ఏవో నాలుగు వాక్యాలు బట్టీ పట్టించేసి వేదికమీదకి పంపించేశారు.
వారు అంతంతే మాట్లాడి బిక్కచూపులు చూస్తున్నారు. అయినా మేష్టార్లు వారిని విపరీతంగా ప్రోత్సహించి చప్పట్లు కొడుతున్నారు. బట్టీ కొట్టించటం, మార్కులు రాబట్టించటంలాంటి చౌకబారు పద్దతులనే అక్కడ కూడా అనుసరిస్తున్నారు మేష్టార్లు.
ప్రస్తుత కార్పొరేట్ విద్యా విధానం అంతకంటే ఏమీ మెరుగ్గా లేదు. మార్కులు, రాంకులు ఇంతే.
ప్రస్తుతం గ్రూప్ డిస్కషన్స్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ , సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని నా దగ్గరకొచ్చి చేరుతున్న అధిక భాగం స్టూడెంట్లు ఇలాంటి విద్యావిధానం వల్ల బలిపశువులుగా మారిన వారే. ఎవరికి క్రియేటివిటి వుంది, ఎవరికి ఏ ఫీల్డ్ లో ఇంటరెస్టు వుంది, ఎవరు ఎందులో రాణిస్తాడు అని గమనించి, వాడిలోని క్రియేటివిటిని ప్రోత్సహించే విద్యావిధానం లేకపోవటం దురదృష్టకరం. పైగా ప్రోత్సాహకరంగా మాట్లాడటం అన్నది రాని వాడు టీచింగ్ వృత్తిని స్వీకరించటానికి అనర్హుడు అని నా అభిప్రాయం. కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలకి ఇలాంటి లెక్చరర్లే కారణం.
సరే నా వంతు రానే వచ్చింది. మా బావ గారు చెప్పిన సూచనలన్నీ పాఠిస్తూ, సభకి వందనం, సభాధ్యక్షులకి వందనం, వేదికనలంకరించిన పెద్దలకి వందన నమస్కారాల అనంతరం మాకివ్వబడిన టాపిక్ పండిత జవహర్‍లాల్ నెహ్రూ గారి బాల్య విశేషాలు, ఆయన దేశానికి చేసిన సేవలు ఇలా ఇలా ఓ పది నిమిషాలు అలవోకగా మాట్లాడేశాను.
నా వంతు వచ్చే వరకు నేను నా ముందర మాట్లాడిన వారందరి ప్రెజెంటేషన్లలో కొన్ని విషయాలు గమనించాను.
కొందరు వేదికపై యాంత్రికంగా నిలడిపోయి కాళ్ళక్రింద బంక వేసి అతికించినట్టు నిలబడి మాట్లాడటం నాకసలు నచ్చలేదు. అదే విధంగా ఇంకొందరు ,చేతులు రెండూ బిర్ర బిగదీసుకుని , చెక్క మొహం పెట్టుకుని ప్రేక్షకులలో ఎవడో ఒక్కడ్నోచూస్తూ లేదంటే శూన్యంలోకి చూస్తూ బట్టీ పెట్టిన నాలుగు మాటలు గబగబా మాట్లాడేయటం నాకసలు నచ్చలేదు. చాలా మందిలో ఆ వేళ నాకు ఒక ప్రేక్షకుడిగా, ఒక శ్రోతగా నచ్చని అంశాలు చాలా కనిపించాయి. ఇంకా చిత్రమేమిటంటే ఆ మాత్రానికే మేష్టార్లు గంగ వెర్రులెత్తిపోయి ఒకటే చప్పట్లు కొట్టేస్తున్నారు. ప్రేక్షకులు అయోమయంగా చూస్తూ కూర్చున్నారు.
నాలో ఒక స్పష్టమైన గేం ప్లాను రూపుదిద్దుకుంటోంది. నేను ఎలాగైనా గెలవాలి. ఖచ్చితంగా వీళ్ళందరికంటే నేను బాగా మాట్లాడగలను అనే నమ్మకం నాకు వచ్చేసింది.
ఆ రోజుల్లో నేను ఇంట్లో బంధువులందరి ముందు సూపర్ స్టార్ కృష్ణ తాలూకు అల్లూరి సీతారామరాజు డైలాగులు ఏకపాత్రాభినయం చేసి చూపేవాడిని, ముఖ్యంగా రూథర్‍ఫర్డ్ తో అల్లూరిసీతారామ రాజు చెప్పిన క్లైమాక్స్ సీన్ డైలాగులు, మయసభలో దుర్యోధనుని పాత్రలో ఎన్టీఆర్ గారి డైలాగులు, అదే విధంగా కర్ణ పట్టాభిషేకమప్పటి ఎన్టీరామారావు గారి డైలాగులు ఇవన్నీ ఇంట్లో రోజు చేసి చూపించే వాడిని ఆ రోజుల్లో.
ఆ కళలన్నీ ఇందులో చూపిస్తూ, హాయిగా నా భావాల్ని పలికిస్తూ, ఏదో మా ఇంట్లో డ్రాయింగ్ రూంలో మా కుటుంబ సభ్యులముందర మాట్లాడుతున్నంత కంఫ‌ర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని ఆహ్లాదంగా మాట్లాడేశాను. నాటకీయంగా చేతులు కదపటం, కళ్ళు తిప్పటం, పదాలని స్పష్టంగా పలకటం, కావల్సినంత హావభావాల్నిపలికించటం ఇలా ఒకటేమిటి నాకు తెలిసిన అన్ని కళల్నీ చూపించాను ఆ పది నిమిషాలలో.
అప్పటి దాకా తాము కని విని ఎరుగని ఒక ప్రపంచాన్ని చవిచూశారు ప్రేక్షకులు. నా ప్రసంగం అవ్వంగానే, వారికి తెలియకుండానే వారందరూ లేచి నిలబడిపోయి ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి కాసేపటి దాకా చప్పట్లు కొడుతూ వుండిపోయారు. ’ఫస్ట్ ప్రైజ్ ఈ పిల్లోడికే ఇవ్వాలి’ అని కేకలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ రోజు - జూనియర్, సీనియర్ అన్ని విభాగాలలో కలిపి నాకే ఫస్ట్ ప్రైజ్ ప్రకటించారు. ఓ సర్టిఫికేట్, ఓ కేమ్లిన్ పెన్ బహూకరించారు. మరుసటి రోజు పేపర్లలొ ఈ వార్త, నేను ప్రైజు అందుకుంటుండగా తీయబడిన ఫోటొ ప్రత్యేకంగా వచ్చాయి.
ఆ రోజు నుంచి స్కూల్లో నేనో సెలెబ్రిటీ స్థాయిని అందుకున్నానంటె అతిశయోక్తి కాదు. ఆ తర్వాత స్కూల్లో జరిగిన అనేక వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో నెను పాల్గొనటమేమిటి ప్రైజులు సహజంగానే నాకు వచ్చేయటమేమిటి, ఇదంతా ఒక రివాజుగా మారిపోయింది.
ఇప్పుడు నేను స్వీకరించిన ట్రెయినర్ వృత్తికి ఈ అనుభవం నాందీ వాక్యం అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మా పెద్ద బావ శ్రీ భాస్కర లక్ష్మీనరసింహ మూర్తి గారు ఆ రోజు చొరవ తీసుకుని నన్ను ప్రోత్సహించకుండుంటే నా జీవితంలో ఇంత ప్రయాణం జరిగిండేది కాదనుకుంటాను. మామూలుగా ఏదో డెస్క్ జాబు చేసుకుంటూ వుండుండే వాడిని. మా బావ గారికి స్పెషల్ థాంక్స్ అనేక సార్లు చెప్పాను, ఈ సందర్భంగా మరొక్క సారి తెలియజేసుకుంటున్నాను.
*****
నాకు పరిణతి వచ్చాక మన దేశం గురించి, మన దేశానికి జరిగిన ద్రోహాలగురించి తెలుసుకునేకొద్దీ, నెహ్రూ మీద నాకు తీవ్రమైన అయిష్టం ఏర్పడింది.
మన దేశం ముక్కలవటానికి, నేతాజి, పటేల్ వంటి నిజాయితీ గల నాయకుల్ని పైకి రానివ్వకుండా చేసిందానికి, ఇలా ఒకటేమిటి సవా లక్ష కారణాలు, నేను నెహ్రూని ఇష్టపడకపోవటానికి. నేను ఏమాత్రం ఇష్టపడని ఓ రాజకీయ నాయకుడిని పొగుడుతూ నా వక్తృత్వ కళ ప్రారంభం కావటమే జీవితంలో ఐరనీ అంటే.
అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన భారతదేశానికి దొడ్డిదారిలో ప్రధాని అయిన నెహ్రూ దాదాపు భారతీయులందరికీ , ఈ వ్యాసం మొదట్లో చెప్పుకున్న సినిమాలోని కోటశ్రీనివాసరావు లాగా’నాయకుడంటే ఇతడు, నాయకత్వం అంటే అతడిది అని భారతీయులందరికీ బ్రెయిన్‍వాష్ చేశాడంటే అతిశయోక్తి కాదు.
శుభం.

డాక్టర్ గారి ఆగ్రహం (ఒక జ్ఞాపకం - 5)


ఒక జ్ఞాపకం - 5
డాక్టర్ గారి ఆగ్రహం
ఇప్కా లాబ్స్ లో మెడికల్ రిప్రెజంటేటివ్ గా పని చేస్తున్న రోజుల్లోదే ఇంకో జ్ఞాపకం.
మనలో ప్రతి ఒక్కరికి తనదైన వ్యక్తిత్వం, తనదైన ప్రవృత్తి వుంటుంది. దీన్ని ఇంగ్లీష్‍లో యాటిట్యూడ్ అని అనుకోవచ్చేమో. ట్రెయినింగ్ ప్రోగ్రాంలు అటెండ్ అవడం ద్వారా యాటిట్యూడ్‍లో మార్పు రాదు, కానీ మనల్ని మనం మార్చుకోవాలనే ప్రేరణ కలుగుతుంది అంతే.
స్వంత ప్రయత్నంలేకుండా యాటిట్యూడ్ మార్చుకోలేము. అది మీ అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది ఎన్ని ట్రెయినింగ్ ప్రోగ్రాంలు అటెండ్ అయినా సరే మారరు.
కానీ కొంతమంది నిరంతరం తమని తాము అప్‍డేట్ చేసుకుంటూ వుంటారు.
ఈ ప్రయత్నాల్లో కొన్ని సార్లు ఎదురు దెబ్బలు తగలవచ్చు, కాని ప్రయత్నం మానుకోకూడదు కద. మా మిత్రుడు ఒకతను నిజానికి చాలా మంచి వాడు. కానీ అతనికి అమితమైన ఆత్మవిశ్వాసం. దానివల్ల నలుగురూ అతన్ని అహంకారి అని, సొసైటీలో మింగిల్ అవటం రానివాడని ముద్ర వేసి కాస్తా దూరమే పెట్టే వారు. అతనికి ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కూడా బాగా తక్కువ. అతనికి ఉన్న అతికొద్ది మంది ఫ్రెండ్స్ లో నేనొకడిని. అతన్ని నేను అదృష్టవశాత్తు సరిగ్గానే అర్థం చేసుకున్నానని చెప్పవచ్చు. మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.
ఒక సరదా జ్ఞాపకం అతనితో.
మనకు నవ్వు రావచ్చు గానీ అతనికి పెద్ద అవమానమే జరిగింది. సరే విషయంలోకి వస్తాను.
రైల్వే కోడూరులో స్టేషన్ రోడ్లో డాక్టర్ థామస్ గార్ని కలిసి, ఆ ప్రక్కనే వున్న మెడికల్ షాప్ లో స్టాకు వెరిఫై చేసుకుని బయలుదేరాం నేను నా మిత్రుడు.
ఈ మెడికల్ షాపతనికి నాటకాలలో వేషాలు వేసే అలవాటు వుంది. తన నాటకాల ముచ్చట్లన్నీ వివరంగా నాటకీయంగా చెప్తాడు. మనం శ్రద్దగా వింటే మనకు మంచి ’సేల్స్ ఆర్డర్’ కూడా లభిస్తుంది. అది బోనస్ మనకి. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‍కి అంతకంటే ఏం కావాలి?
’సేల్స్ ఆర్డర్’ కోసరమే అని కాకున్నా అతనిలోని ఆ కళాహృదయం కూడా నాకిష్టం. ఓపికగా అతను చెప్పే కబుర్లన్నీ విని, అతను చూపించే ఫోటో ఆల్బంలు చూసి, క్యాసేట్లు ప్లే చేసి డైలాగులు వినిపిస్తే విని, రద్దీ తక్కువ వున్నప్పుడు వీలయితే అతను అభ్జినయించి చూపితే చూసి,అభినందించి బయలుదేరటం నాకున్న విధుల్లో ఒకటి ఈ రైల్వే కోడూర్ యాత్రలో. వామపక్ష భావాలున్న సాంఘిక నాటకాలు, పద గాంభిర్యంతో నిండిన పౌరాణిక నాటకాలు ఇలా చాలానే చేసే వాడా కుర్రాడు.
అమిత ఆత్మవిశ్వాసం వల్ల భంగపడ్డాడని చెప్పానే మా మిత్రుడు - అతనికి నేనిలా ఆ నాటకాల రాయుడితో కలివిడిగా వుండటం ఇష్టం వుండేది కాదు. అతని సుత్తి ఎందుకు వినాలి?, మన ప్రాడక్టులో దమ్ముంటే సేల్స్ అవే అవుతాయి" అని, గంభీరంగా స్టాకు గురించి మాత్రమే వివరాలు కనుక్కుని రాజసంగా వెళ్ళి దూరంగా చెట్టు క్రింద నిలబడేవాడు.
అది అతని పద్దతి. కానీ ఆ పద్దతికి అతనెందుకొచ్చాడో నాకొక్కడికే తెలుసు.
తెనాలి రామలింగడి పిల్లి కథ మీకు తెలుసు కద. ఇంచుమించు అలాంటి అనుభవమే వుంది మన వాడికి. చెప్పాను కద అది చాలా నవ్వొచ్చే ఓ సంఘటన.
నిజానికి అతనికీ ఇష్టమే అందర్నీ ఆకట్టుకొనేలా మాట్లాడి, మంచి కమ్యూనికేటర్ అని అనిపించుకోవాలని.
"నాక్కూడా మీ అందరిలాగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో వ్యవహారం నడపాలనుంటుంది ఆనంద్, కానీ నాకలా చేత కాదు, అందుకే గంభీరంగా వ్యవహారం నడిపిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు ఒక సారి.
వాస్తవానికి నేను కూడా బాగా సిగ్గరిని. చాలా మొహమాట పడతాను కొత్త వారితో మాట్లాడటానికి. నా అంతటనేను, మాట కలపలేను. ఆకట్టుకొనేలా మాట్లాడి ఎదుటి వారిని రంజింప జేయలేను. కాని స్వీకరించిన వృత్తా మార్కెటింగ్. కంపెనీలలో ట్రెయినింగ్ ప్రోగ్రాంలు నాలో చాలానే మార్పులు తీసుకువచ్చాయి.
ఎవరితో మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడి పని జరుపుకుని వచ్చే వాడిని. నిజానికి ఇదే నిజమైన కమ్యూనికేషన్ అని ఇటివల ’మార్కెటింగ్ గురువులు’ చెపుతున్నారు. ఎదుటివాళ్ళని ఆకట్టుకోవటం ఎలా అని ఆలోచిస్తూ, తిమ్మిని బమ్మి చేసేలా మాట్లాడటం వంచన అని, మనస్ఫూర్తిగా చేసే స్నేహానికే విలువ ఎక్కువ అని తెలుసుకున్నాను. అయితే నా పద్దతే కరెక్టన్న మాట. ఏదయితేనేం, మార్కెటింగ్ జాబ్ పుణ్యమా అని కాస్తా ఎక్స్ట్రావర్టెడ్ గా వుండే ప్రయత్నం చేస్తుండేవాడిని ఆ రోజుల్లో. ఎక్స్ట్రావర్టెడ్ గా వుండటం నా గోల్స్‌లో ఒకటి అప్పట్లో, చాలా వరకు అఛీవ్ చేశాను అని చెప్పవచ్చు. బహుశా నాకు భంగపాట్లు ఎదురై వుండవచ్చు, చెప్పుకోదగినవి ఏవీ సమయానికి గుర్తురావటం లెదు.
మన మిత్రుడుఇలాగే ఒకసారి తన తత్వానికి భిన్నంగా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో, హావభావాలని చూపి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి భంగ పడ్డాడు. అదేలాగంటే వినండి. అదే ఈవేళ్టి జ్ఞాపకం.
కడప జిల్లాలో ఓ చివర వుండే ఊరికి టూర్ వెళ్ళాం ఒక సారి. అది ఫాక్షన్ కి, రాష్ట్ర రాజకీయాలకి కేంద్రబిందువు లాంటి ఊరు. కేంద్ర,రాష్ట్రరాజకీయాలని ఆ ఊరివారు అక్షరాలా శాసించే వారు ఆ రోజుల్లో. ఏతావాతా ప్రభుత్వోద్యోగులకు ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అంటే అది పనిష్మెంట్ క్రింద లెక్క. మాకు ఈ సంఘటన జరిగే వరకూ తెలియదు ఆ సత్యం.
ఓ సారి ఆ ఊరికి వర్కుకు వెళ్ళినప్పుడు బస్సు దిగకముందే ప్రకటించాడు నా మిత్రుడు. ఈ రోజు నుండి ఏమయినా సరే మీ అందరిలాగా నేను కూడా కాస్తా కలుపుగోలుగా ,లౌక్యంగా మాట్లాడి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్‌ని అలవరచుకుంటాను. అందుకు ఈ ఊరే నాంది అని. మొదటి ప్రయత్నంలోనే ఈ ఊరి డాక్టర్లని ఆకట్టుకుంటాను అని ఓ చిన్ని సైజు శపథం కూడా చేశాడు.
అతడు చాలా హార్డ్ వర్కర్. నిజాయితీపరుడూ కూడా. అతను కేవలం ఒక రోబోట్ లా వర్కుకు సంబంధిన విషయాలు మాత్రమే మాట్లాడి ఒక సింహంలా గంభీరంగా లేచి బయటకు రావటం పరిపాటి. ఏమాటకామాటే చెప్పుకోవాలి, టార్గెట్లు అచీవ్ చేయటంలో కాని, ఇన్సెంటివ్స్ అఛీవ్ చేయటంలో గానీ అతను ఎప్పూడూ ముందుండే వాడు కూడాను. అతని గంభీరమైన తత్వం వల్ల అతని వృత్తికి పెద్ద ఆటంకం ఏమీ ఏర్పడలేదు. అది అతని తత్వంలే అని అనుకొనే వారు డాక్టర్లు గానీ, డిస్ట్రిబ్యూటర్లు గాని.
బాసులు సరే సరి, హార్డ్‌వర్క్ కాదు, స్మార్ట్ వర్కు ముఖ్యం విజయానికి అని యధాప్రకారం MBA marketing పాఠాలు వల్లెవేసేవారు. మిగతా కొలీగ్స్ అందరి మధ్య అతనో ’ఆడ్‍మెన్ అవుట్’ లా వుండటం వల్ల, ఫ్రెండ్స్ అతన్ని ఎక్కువ ఆట పట్టించే వారు.
భావరహితంగా అతని లాగే నడవటం, అతనిలాగే మొహం పెట్టి అతను మాట్లాడినట్టు ఇమిటేట్ చేయటం చేసే వారు. దాంతో అతనికి ఉక్రోషం వచ్చేది. దాంతో అతనిలో సహజంగా అదొక కొదవ వుండిపోయింది అనుకుంటా. అందువల్ల ఆ రోజు అలా డిసైడ్ అయిపోయాడు బహుశా.
సరే ’హరిఓం’ అని గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళి వర్కు మెదలెట్టాం. అక్కడ మాకూ ఆశ్చర్యం కలిగించేలా ,కడపలో మేము రెగ్యులర్గా కలిసే ఒక ఫ్రెండ్లీ డాక్టర్ గారు అక్కడ దర్శనం ఇచ్చారు. మాటల్లో తెలిసింది ఆయనకు ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయి సరిగ్గా వారం అయ్యిందట . నేను హర్షం వెలిబుచ్చి ఆయన్ని అభినందించి, ఆల్ ది బెస్ట్ చెప్పి, నా ప్రాడక్ట్స్ గురించి ఆయనకి వివరించి నా పని ముగించాను.
నే ఇందాక చెప్పాను కద, మనోడు మంచి ఊపులో వున్నాడు ఆ రోజు అని.
ప్రారంభ వాక్యంగా, "సర్ కడపలో ఫలాన డాక్టర్ గారు మిమ్మల్ని మరీ మరీ అడిగినట్టు చెప్పారు" అని ఒక మాట వదిలాడు. ఇంతకూ ఆ ఫలాన డాక్టర్ గారేమి అలాంటి సందేశం మాతో పంపలేదు. వాళ్ళిద్దరూ కడపలో సన్నిహితంగా వుండటం అందరికీ తెలిసిన సంగతే, కాబట్టి మనవాడు చాన్స్ తీసుకున్నాడు.
అదే బెడిసి కొట్టింది.
అప్పటి దాకా ప్రశాంతంగా వున్న ఆయన ఉగ్ర నరసింహుడే అయ్యాడు. కళ్ళు ఎర్ర బడ్డాయి. టేబులుపైనున్న పేపర్ వెయిట్ని గట్టిగ ఒడిసి పట్టుకుని కోపాని కంట్రోలు చేసుకున్నాడు.
కోపంతో బుసలు కొడుతూ, "ఆయన అలా ఎలా సందేశం పంపుతాడు? అసలు ఆయనే కుట్ర చేసి నాకిక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయించాడు" అని చాలా సేపు కేకలేస్తూ వుండిపోయాడు. మనోడు బిక్క మొహం పెట్టేశాడు. ఆయన్ని శాంతపరిచేటప్పటికి తాతలు దిగివచ్చారు.
కమ్యూనికేషన్ స్కిల్స్‌ని వంటపట్టించుకోవాలనే మన వాడి మొదటి ప్రయత్నం ఈ విధంగా బెడిసి కొట్టింది.
ఈ అనుభవంతో మనోడు ఒక భీషణ ప్రతిజ్ఞ చేశేశాడు. ’ఇకపై నేను నాదైన బాణిలోనే ముందుకు వెళతాను, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నాది కాని శైలిలో పోయి భంగపాటు పడను కాక పడను.’ అని.
అక్కడికీ నేనెన్నో మార్లు చెప్పి చూశాను ఒక్క సంఘటన ఆధారంగా అలాంటి నిర్ణయం తీసుకోవద్దని. కానీ మనవాడు ఏమాత్రం ప్రయత్నం చేయలేదు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి.
గంభీరంగానే తన పని చేసుకుపోతున్నాడు. మొహమాటానికి కూడా నవ్వటం, అవసరానికి మించి ఒక్క మాట ఎక్కువమాట్లాడకపోవటం సాధన చేస్తూ వస్తున్నాడు.
లోకో భిన్న రుచి.
-రాయపెద్ది వివేకానంద్.

" భూత్ బంగ్లా" (ఒక జ్ఞాపకం - 4)



ఒక జ్ఞాపకం - 4
" భూత్ బంగ్లా"

హారర్ సినిమా చూసి వస్తున్నాం నేను మా శ్రీమతి.
భయంకరమైన వర్షం. వైపర్స్ నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వర్షం వల్ల రోడ్డు పై విజిబిలిటీ కూడా తక్కువ గా వుండటం వల్ల నెమ్మదిగానే నడుపుతున్నాను.
"సినిమా ఏం బాగాలేదు" పెదవి విరుస్తూ అంది నా శ్రీమతి, "మీకోకటి తెలుసా, మా చిన్నప్పుడు మేము ఓ అద్దె ఇంట్లో ఉండేవారం, ఆ ఇంట్లో దెయ్యాలుండేవని చెపుతుండే వారు మా స్నేహితురాళ్ళు. మేము నాలుగేళ్ళున్నా మాకొక్క దెయ్యం కూడా కనిపించలేదు ఆ ఇంట్లో"
" అవునా, నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పనా? ఖచ్చితంగా ఈ హారర్ సినిమాకంటే థ్రిల్లింగా వుంటాయి" అన్నాను నేను.
"సరే చెప్పండి, కాలక్షేపంగా వుంటుంది" ప్రోత్సహించింది శ్రీమతి.
సరే మీరు కూడా వినండి
*****
జమ్మలమడుగు అంటే ఫాక్షన్ సినిమాలు  చూసే వారెవరయినా భయపడటం సహజం. అలాంటి జమ్మలమడుగులో నా బాల్యం ఒక సంవత్సరం గడిచింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ఒక జీవితకాలానికి  సరిపోయేటన్ని అనుభవాల్ని మూట కట్టుకున్నాను.  కాకపోతే మేము ఫాక్షనిజం వల్ల సినిమా కష్టాలు ఏమీ ఎదుర్కోలేదు కాని, ఇంకో రకంగా భయంకర అనుభూతుల్ని పొందటం జరిగింది.
దెయ్యంతో మా కుటుంబం ఎదుర్కొన్న కొన్ని చిత్రమైన అనుభవాల్ని చెప్తాను వినండి.
దాన్ని దెయ్యం అనాలా లేక ఏదైనా మానవాతీత శక్తా అన్నది మాకు ఎన్నటికీ అర్థం కాని ఒక ఆశ్చర్యం.
దాన్ని ప్రత్యక్షంగా చూసిన మా అప్ప. ఆ అనుభవాన్ని ఆయన  అందరికీ చెపుతున్నప్పుడు విన్న ఆ అనుభూతి ఇంకా నాకు గుర్తుంది.  అప్పటికి నాకూ మహా అంటే పన్నెండేళ్ళు వుంటాయి. ఇది జరిగి దాదాపు ముఫై ఎనిమిది సంవత్సరాలు అయినా అది నిన్నో, మెన్నో జరిగినట్టుగా తాజాగా వుంది నా స్మృతిలో. అక్కడి విషయాలన్నీఇప్పటికీ నాకు పూస గుచ్చినట్టు గుర్తున్నాయి. ఆ అనుభవాలు చిత్రంగా వుంటాయి. నాస్తికులు నమ్మకుంటే నేనేమీ చేయలేను.
మా అప్పకి ( నాన్న గారికి) ఒక భయానకమైన అనుభూతిని కలిగించేలా దెయ్యం  కనిపించింది.
ఆ ఇంట్లో మా చుట్టాలామెకి కనిపించింది దెయ్యం ఒక సారి కాదు, అనేక మార్లు.
నాకూ ఓ చిన్న సైజు అనుభూతి కలిగింది. అన్నీ వివరంగా చెపుతాను ఈ ఎపిసోడ్‍లోనే.
మా అప్పకు డిప్యూటి కలెక్టర్‍గా పోష్టింగ్ రావటంతో మా కుటుంబం జమ్మలమడుగు రావటం జరిగింది. సినిమాలలో చూపించే విధంగా ఏమి వుండదు అక్కడి పరిస్థితి. మనుషులంతా చాలా స్నేహశీలురు, కష్ట జీవులు. అక్కడి ప్రజలు చాలా అమాయకులు, నమ్మితే ప్రాణం ఇస్తారు.
మాకు దొరికిన ఇల్లు చాలా పెద్దది.  అదేం ఊరికి దూరంగా కూడా ఏమి ఉండదు. మామూలుగా అన్ని ఇళ్ళ మధ్యనే ఉండేది.  మా ఇంటి ఓనర్స్ కూడా మా ప్రక్కింట్లోనే ఉండేవారు. అప్పట్లో ఏవిధమైన ఆధునికమైన సౌకర్యాలు ఉండేవి కాదు ఆ ఇంట్లో. ఒక పెద్ద ఇల్లు అంతే. 
ఇప్పట్లో కనీస సౌకర్యాలైనట్టి ఓవర్ హెడ్ టాంకు, బాత్రూముల్లో కొళాయిలు కూడా వుండేవి కావు. మా ఇంటెదురుగా రోడ్డుకటువైపు వున్న ఓ పెద్ద  ఓపెన్ ప్లాటులో ఓ పెద్ద బావుండేది. మా నౌకర్లు ప్రొద్దునా, సాయంత్రం నీరు చేది బాత్రూంలో తొట్లలో నీరునింపే వారు. . నౌకర్లు పగలు మాత్రం పని చేసి వెళ్ళిపోయే వారు. రాత్రి కేవలం మా కుటుంబ సభ్యులం మాత్రమే వుండేవారం.
ఇంకో విషయం చెప్పాలి. అప్పుడు మేము గమనించలేదు గాని, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే జ్ఞాపకం వస్తోంది. ఆ వీధిలోని వారు అనేక మంది వచ్చి అదే బావిలో నీరు చేదుకునివెళ్ళే వారు.  వారంతా ఒక విధమైన ఆసక్తితో మాఇంటి వంక చూసే వారు. ’అరె! ఇందులో బాడుగకు (అద్దెకు) మనుష్యులు దిగారే’ అన్న ఆశ్చర్యం వారి కళ్ళలో కనిపించేది. కొందరు మాకు ఏదో చెప్పబోయి, తిరిగి మనకెందుకులే తంటా అన్నట్టువెళ్ళిపోయేవారు. మా ఇంటి ఒనర్లు కాస్తా బలమైన మనుషులు అన్నివిధాలా. అందువల్లనుకుంటాను జనం వెనుకంజ వేసేవారు.
ఆ ఇంట్లో ఓ రెండు గదులు తాళాలు వేయబడి, మా అధీనంలో లేకుండా , ఓనర్ల అధీనంలో వున్నాయి. ఆ రెండు గదులనుంచీ చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించేవి అప్పుడప్పుడూ, ఎలకల వల్లనుకుంటాను  .
మేడపైన ఓ పెద్ద హాలు, దానికి అటు, ఇటూ పేద్ద వరండాలు వుండేవి. ముందు వేపు వరండా మెయిన్ రోడ్ వైపుంటుంది. వెనుకువైపు వరండా దాటంగానే పెద్ద ఆరు బయలు. ఆ ఆరుబయలును కప్పేస్తూ ఇందాక చెప్పిన వేప చెట్టు కొమ్మలు విస్తారంగా ఆక్రమించి నీడను ఇస్తూ వుండేవి.
ఇంకా ఓపెన్ స్పేస్ కావాలంటే మేడపైని గది పైకి చేరుకుంటే బోలెడు ఓపెన్ స్పేస్.
ఆ ఇంటి వెనుక దూరంగా పెన్నా నది కనిపించేది. అందులో అరుదుగా నీళ్ళు ప్రవహించేవి. ఎప్పుడన్నా బాగా వర్షాలు వచ్చి, మైలవరం (కడప జిల్లా)  డ్యాం గేట్లు తీస్తే అందులో నీళ్ళు ప్రవహిస్తాయి, లేదంటే నిరంతరం ఇసుక మేటలు కనిపిస్తూ వుంటాయి.వేపచెట్టు కొమ్మలు అడ్డుగా వుండటం వల్ల మొదటి అంతస్థునుంచి చూచాయగాను, పై అంతస్థునుంచి బాగా క్లియర్ గాను కనిపించేది పెన్నానది. మా ఇంటి వెనుక ఇంకేమీ ఇండ్లువుండేవి కావు, మా ఓనర్ల తాలూకు చేనేత మగ్గాలు, పశువల శాలలు కనిపిస్తుంటాయి, వాటి కాంపౌండ్ వాల్ అయినపిమ్మట, బీడుపడిన పొలాలు, వాటి తర్వాత నది.  ఈ బీడు భూములలోనే పెద్ద వృక్షం ఒకటి వుండేది. అది ఏ చెట్టో నాకు సరిగ్గా గురుతు లేదు. పిల్లతనం ఉత్సాహంలో తెలిసేది కాదు గాని, అదేమి పెద్ద సేఫ్ ఎన్విరాన్‍మెంట్ కాదని ఇప్పుడనిపిస్తోంది.  పూర్తిగా రాంగోపాల్ వర్మ హారర్ సినిమాలకు సరిపోయే నేపధ్యం.
ఇక అసలు కథలోకి వద్దాం.
ఆ వృక్షం ఏదయితే వుందో దానిపై బోలెడు పక్షులు, కోతులు వుండేవి. కోతులు పగలంతా నిరంతరం పోట్లాడుకోవటం, పరిగేత్తి గెంతులెయ్యటం, గట్టి గట్టిగా కిచకిచలని మించిన స్థాయిలో అరచుకోవటం చేస్తువుండేవి . ఇక పక్షుల విషయానికి వస్తే అవి తెల్లవారు ఝామున, సాయంసమయాన  కిలకిలారావాలతో తెగ చిరాకు పెట్టేవి. అయితే రాత్రయ్యేటప్పటికి అవన్నీ నిశ్శబ్దంగా అయిపోయేవి. చిత్రమైన విషయం ఏమిటంటే,  రాత్రుళ్ళు నిశ్శబ్దంగా వుండే ఈ జీవులన్నీఒక్కోసారి అరుదుగా, రాత్రిపూట కూడా వున్నట్టుండి తీవ్ర సంచలనం చేసేవి. చాలాసేపటి తర్వాత అన్నీ సద్దుమణిగేవి. అదెందుకో మాకర్థం అయ్యేది కాదు అప్పట్లో (అఫ్‍కోర్స్ ఇప్పటికీ అనుకోండి).
కడపజిల్లాలో ఎండాకాలం చాలా భయంకరంగా వుంటుంది. పగలంతా చండప్రచండంగా మార్తాండుడు తన ప్రతాపం చూపిస్తాడు, ఇక రాత్రంతా ఉక్కపోత. ఈ కారణం వల్ల రాయలసీమలో ప్రజలు రాత్రిళ్ళు ఇంటిముందర ఆరుబయల్లో పడుకుని నిద్రపోయేవారు. మేడలున్న వారు మేడలపై పడుకొనే వారు. ఇది చాలా సహజమైన విషయం అక్కడి ప్రాంతాలలో. చిత్రంగా మా వీధీలో ఎవ్వరూ కూడా ఇలా ఓపెన్ ఎయిర్‍లో పడుకొనేవారు కాదు. ఇప్పుడు గుర్తొస్తొంది ఆ సంగతి కూడా.
మా కుటుంబం మాత్రం మేడపై ఓపెన్ ఎయిర్లో పడుకొనే వారం నిశ్చింతగా. రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకల్లా పడుకోనేవారం ఆ రోజుల్లో. నౌకర్లు మంచాలు, దోమతెరలు ఏర్పాటు చేసి వెళ్ళే వారు. కబుర్లు చెప్ప్కున్నంతసేపు చెప్పుకుని క్రమంగా హాయిగా నిద్రలోకి జారుకునే వారం.
మా అప్ప మాత్రం మా  గోలకి దూరంగా, పైమిద్దె పైకి వెళ్ళి పడుకొనే వారు. మేం పిల్లలం వెళ్ళి త్రాగే నీళ్ళ చెంబు, గ్లాసు పెట్టి వచ్చే వారం. మా అప్ప ట్రాన్సిస్టర్ తీసుకుని పైకి వెళ్ళి ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, ఏవయినా కర్ణాటక సంగీతాన్నో, ఏదయినా చర్చావేదికో వింటూ నిద్రలోకి జారుకొనేవారు. ఆ రోజుల్లో ఇంటిపెద్దలందరి పద్దతి ఇలాగె వుండేది.
ఇక నాకు ఒళ్ళు గగుర్పొడిచిన ఒక చిన్న అనుభూతిని మీకు చెప్తాను.
ఒకరోజు రాత్రి ఇలాగే పక్షులు, కోతులు గోలగోలగా అరుస్తుంటే నాకు మధ్యరాత్రిలో మెలకువ వచ్చింది. బాగా అలసిపొయినట్టున్నారు ఇంకెవ్వరికి మెలకువ రాలేదు.  యధాలాపంగా ఆ పెద్ద వృక్షాన్ని చూసి కాస్తా అదిరిపడ్డాను. పైనున్న చెట్టుకొమ్మకు ఎవరో మనిషి ఉరివేసుకుని వేలాడుతున్నట్టు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే తలనుండి కాళ్ళదాకా తెల్లటి నీడలాగా, మనిషి ఆకారంలో కత్తిరించిన ఒక తెల్లటి కటౌట్ లాగా వుంది తప్పనిచ్చి ఒక మనిషిలాగా జుత్తు, కాళ్ళు, చేతులు ఇలా స్పష్టంగా కనిపించలేదు. ఏదో భ్రమలెమ్మనుకుని నిద్రలోకి జారిపొయాను.  క్రమంగా కోతులు, పక్షుల చప్పుళ్ళూ మందగించాయి.
 తెల్లవారి మామూలుగానే మెలకువ వచ్చింది.భయపడాలి అని కూడా తెలిసే వయసు కాదది. అందరూ కాఫీలు త్రాగుతూవుండగా వెళ్ళి ఈ అనుభవాన్ని చెప్పాను, కాకపోతే ఉరివేసుకున్నట్టు కనపడింది అన్నది మినహాయించి ఏదో తెల్లటి ఆకారం కనపడింది అనె చెప్పాను.  ఉరి గిరి అంటే వయసుకు మించి మాట్లాడుతున్నానని కేకలేస్తారేమోనని కాస్తా భయపడ్డాను.
నేనూహించినట్టే అంతా తేలిగ్గా కొట్టేశారు, ఉత్తి భ్రమ అయివుంటుందని, నిద్రలో కలవచ్చివుంటుందని తీర్మానం చేసేసి ఆ విషయం అంతటితో ముగించారు.
ఇది జరిగిన కొన్ని రోజులకి ఇంకో చిత్రం జరిగింది.
మా పెద్దక్కయ్య అప్పుడు గర్భిణి. మా అక్కయ్య బయటపడుకోకుండా మేడపైనే వున్న పెద్ద గదిలో పడుకొంది. ఆమెకు తోడుగా మా చుట్టాలావిడ ఒకరు పడుకొనే వారు. మేమంతా మేడమీదే, ఆగది బయట ఆరుబయల్లో పడుకోని ఉన్నాం. మా నాన్నగారు పై అంతస్థులో ఆరుబయల్లో పడుకుని వున్నారు. 
ఒక సారి మధ్య రాత్రప్పుడు మా చుట్టాలావిడకి మెలకువ వచ్చి చూస్తే ప్రక్కనే మంచి వర్చస్సుతో కూడిన ఒక పెద్ద ముత్తైదువ కూర్చుని చిరునవ్వుతో పలకరించిందట. ఆమెవరో తెలియకున్నా మా చుట్టాలావిడ మొహమాటానికి చిరునవ్వు నవ్విందట. ఆ తర్వాత ఆమె చాలా చక్కగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయేదట.
ఇలా కొన్ని రోజులు జరిగిందట. ఆ వచ్చినావిడ ఒకోసారి చాలా ఉత్సాహంగా కబుర్లు చెప్పేదట, ఒక్కోసారి దిగులుగా వుండేదట. ఒక్కోసారి అకారణంగా కోపం తెచ్చేసుకుని కర్ర తీసుకుని ఎడాపెడా మా చుట్టాలావిడని కొట్టేసేదట.
ఇంకా చిత్రమైన విషయమేటిటంటే ఆ వచ్చే ఆవిడ (దెయ్యం?) ఒక్కోరోజు ఒక్కో వ్యక్తి రూపంలో కనపడేదట. అదీ బ్రతికున్నవారి రూపాలలోనే. సాక్షాత్తు  అప్పటికి బ్రతికే వున్న మా దగ్గర బంధువుల రూపాలలోనే వేర్వేరు రూపాలతో వచ్చేదట.
ఇవేవీ ఆమె మాకు చెప్పేది కూడా కాదు. ఒక సంఘటన జరిగే దాకా. ఆ  సంఘటన ఏంటో చెపుతాను వినండి.
ఇదే అన్నిటికన్నా తీవ్రమయిన సంఘటన. అయితే ఒకటి మాత్రం నిజం. ఏ సంఘటనలోనూ ఎవ్వరికీ అపకారం గాని, గాయాలు గానీ కలుగలేదు.
అది మంచి పున్నమి రాత్రి. అంతా పడుకొని వున్నాం. నేను, మా ఇద్దరక్కయ్యలు, మా అమ్మగారు, మా పెద్దన్నయ్య మొదటి అంతస్థు ఆరుబయల్లోనూ, మా పెద్దక్కయ్య, చుట్టాలావిడ ఈ ఇద్దరూ  గదిలోనూ, మా నాన్నగారు పై అంతస్థు ఆరుబయల్లోనూ ఇలా ఎవరి స్థానాలలో వాళ్ళు పడుకుని ప్రశాంతంగా పడుకుని వున్నాం.
సాధారణంగా మా నాన్నగారు దేనికీ పెద్దగా ఉద్వేగానికి గురవ్వరు. ఆయనకి మూఢనమ్మకాలు కూడా ఏమీ లేవు. పిచ్చి పిచ్చి నమ్మకాలు, తాయెత్తులు గట్రా సెంటిమెంట్లు కూడా ఏమీలేవు. అలాంటి కథలు ఎవరయినా చెపితే కూడా నవ్వి వదిలేస్తారు.
సడెన్‍గా మెలకువ వచ్చి లేచి కూర్చున్నాను ఒక రాత్రి. మేడపైనుంచి దిగి వచ్చినట్టున్నారు మా నాన్నగారు. ఆయన బనీన్ అంతా చెమటతో తడిసి పోయుంది. బాగా ఆయాస పడిపోతున్నారు.
అప్పటికే అందరూ లేచి ఆయన చుట్టు కూర్చుని ఆయనని సేదతీరుస్తున్నారు.
నేను వెళ్ళి మాఅమ్మగారిప్రక్కనే కూర్చున్నాను. నాకర్థమయినదాన్ని బట్టి ఆయన అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనని చూశారు. అదేంటంటే...........
*****
ఎప్పట్లాగే ఆకాశవాణిలో ఇంగ్లీష్ వార్తలు విని, కాసేపు సంగీతమేదో విని ట్రాన్సిస్టర్ రేడియోని ఆపేసి నిద్రకుపక్రమించారట మా నాన్నగారు ఆరాత్రి కూడా.

ఒక రాత్రప్పుడు ఎవరో తట్టిలేపుతున్నట్టనిపిస్తే మెలకువ వచ్చిందట. మెలకువ వచ్చి కళ్ళు కూడా తెరవకముందే ఆయనకి పక్షుల గోల, కోతుల అలజడి వినిపించిందట. ఏంట్రా తెల్లవారిందా అని అనుకుని కళ్ళు తెరిచి చూస్తే ఇంకా చీకటి వీడలేదు.
అప్పుడు వినిపించిందట ఆయనకి "ఒరే హనుమంతుడూ (మా అప్ప పేరు హనుమంతరావు గారు) బావున్నావా?" అన్నపిలుపు ఆప్యాయంగా.
అప్పుడు చూశాడట మానాన్నగారు రమణమ్మని (పేరు మార్చబడింది).
ఆవిడ మాకు దూరపు బంధువు. కాని వారి కుటుంబంతొ మాకు బాగా సాన్నిహిత్యం వుంది . మా నాన్న గారికంటే బాగా పెద్దావిడ ఆమె. అందుకే ఆయనని ’ఒరె, నీవు అని ఏకవచనంతో సంబోధించే చనువు వుంది ఆవిడకి. రమణమ్మగారు పెద్దముత్తైదువ. అప్పటికే అరవైపైన వుంటాయి ఆవిడకి. పెద్ద కుంకుమ బొట్టు, సోడాబుడ్డి లాంటి కళ్ళజోడు, చింపిరి జుత్తు, మడతలు పడి నలిగిపోయిన కాటన్ చీర, ఆవిడ అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది.
చాలాసేపు అప్యాయంగా మాట్లాడిందిట,  అందరి గురించి పేరు పేరునా క్షేమసమాచారాలు అడిగి కనుక్కుందిట. వాళ్ళ ఊరి విశేషాలు, క్షేమ సమాచారాలు తెలియజెప్పిందిట. ఆవిడ నిజంగానే మా రమణమ్మ అత్త అనే అనుకున్నాడట మా నాన్న.
ఆవిడ ప్రవర్తన తేడాగా ఏమీ అనిపించలేదు. బహుశా అప్పుడే ప్రయాణం చేసొచ్చినట్టుంది. అలసటగా కూడా వుంది.  అయినా సరే వచ్చి పలకరించాలని పైకి వచ్చి మాట్లాడిస్తోంది అనే అనుకున్నారట.
కాసేపయ్యాక  ’పదరా క్రిందకెళదాం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చని’ చెప్పి నడవటం మొదలెట్టింది రమణమ్మ.
ఆవిడ వెనుకే మానాన్నగారు కూడా నడవటం మొదలెట్టారు. మేడపైన సగం దాకా వచ్చాక , ఆవిడ మెట్లున్న వైపునకు కాకుండా తిన్నగా ముందుకే వెళుతోందట. అలాగే ముందుకు వెడితే  పారపెట్ వాల్ కూడా లేని ఆ మూడంతస్తుల మేడపై నుంచి కింద పడటం ఖాయం. క్రింద మా ఓనర్ల తాలుకు పశువుల శాల, మగ్గాలు వున్నాయి.
’రమణమ్మా అలా కాదు, ఇటు వేపు’ అని మా నాన్న హెచ్చరిస్తూనే వున్నా కూడా ఆవిడ ఇక ఏమీ పలక్కుండా అలాగే ముందుకే వెళ్ళి వెళ్ళి అలాగే నడచుకుంటు, ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత, కాసేపు గాల్లోనే నడిచి ఆపై అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయి చూస్తూ వుండగానే గాల్లో కలిసిపోయిందట.
అప్పుడు కలిగింది భయం మా నాన్నగారికి, మొదటి సారి.
పెద్దగా కేకలు పెట్టుకుంటు పరిగేట్టుకుంటు క్రిందికి వచ్చేశారు.
అదీ జరిగింది.
ఇది ఏదో సినిమాలో అయితే చూడటానికి బాగుంటుంది కాని ఒక సామాన్యమయిన మనిషికి అస్సలు ఎన్నడూ ఊహకుకూడా రాని విధంగా ఇలా జరిగితే ఎలా ఉంటుందో వివరించటానికి మాటలు చాలవు. ఆ రాత్రి ఎవ్వరికి నిద్ర లేదు. అలాగే చర్చించుకుంటూ వుండిపోయారు పెద్ద వాళ్ళందరు.
ఇది భ్రమనా నిజమా అని చాలా సేపు విచికిత్సకి గురయ్యారు. ఏదయినా పీడకల వచ్చిందేమోనని కూడా అనుకున్నారు. ఘంటాపదంగా మా నాన్నగారు అది నిజంగా జరిగిందేనని నొక్కివక్కాణించారు.
ఈ హడావుడికి గదిలో పడుకున్న మా చుట్టాలావిడ కూడా బయటకు వచ్చి జరిగిందంతా విని, అప్పుడు ఏకరువు పెట్టింది తన అనుభవాల్ని.
అందరికీ మిడిగుడ్లు పడ్డాయి.
తరువాత ఉదయాన్నే రమణమ్మ వాళ్ళ ఊరికి ఎస్.టీ.డీ కాల్ బుక్ చేసి మాట్లాడితే ఆవిడ నిక్షేపంగా వున్నారని తెలిసింది.
ఇలా లాజిక్‍కి అందని సంఘటనలు జరిగాయి ఆ ఇంట్లో. అయినా మా వాళ్ళు ఇల్లు మార్చాలని ఏమీ అనుకోలేదు.
మరో ఆరునెలలకు మా నాన్నగారికి నూజివీడు ట్రాన్స్ఫర్ అయ్యింది.
అంతే ఇంతకు మించి ఏమి జరగకున్నా, మాటల్లో వ్యక్త పరచలేని ఒక విధమైన్ ఉద్విగ్నతకి గురవుతాము మా ఇంట్లో అందరమూ ఈ సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా.

****
"ఓ! మై గాడ్ ఇదంతా నిజమా!" గుడ్లు తేలేసింది నా శ్రీమతి.

ఇంతలో రోడ్డుపై ఎవరో ఒక ముసలావిడ, పెద్ద ముత్తైదువ చేయి చాచి లిఫ్ట్ అడుగుతోంది. బాగా వర్షం పడుతున్న కారణంగా బస్సులు, ఆటోలు కూడా దొరకటం లేదనుకుంటా. ఆపుదామా అన్నట్టు కారును స్లోడవున్ చేశాను.
"ఏయ్ ఆపకు, స్పీడు పెంచు" ఆ కథ ప్రభావంతొ శ్రీమతి కేకేసింది.

****


ప్రియమైన పాఠకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.
మేమా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన అయిదారు సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో అద్దెకి దిగారట మా శ్రీమతి వాళ్ళు, తన చిన్నతనంలో. చిత్రంగా వారికి ఎటువంటి అనుభవాలు ఎదురు కాలేదట. మా శ్రీమతి వాళ్ళ స్నేహితురాళ్ళు చాలానే చెప్పారట ఆ ఇంటి గురించి స్కూలుకు వెళ్ళినప్పుడు.
మాకెవ్వరూ చూచాయగా కూడా చెప్పలేదు, కానీ మాకేమో చిత్రాతిచిత్రమైన అనుభవాలు.
ఏంటొ అంతా విచిత్రం.

"చెరకు రసం బండి వాని పంచ్" (-ఒక జ్ఞాపకం - 3)



ఒక జ్ఞాపకం - 3
"చెరకు రసం బండి వాని పంచ్"
మంచి ఎండాకాలంలొ జరిగిన ఓ చిన్న సంఘటన తాలూకు ఙ్గాపకం. ఒక నిరక్షరాస్యుడు కూడా దారుణంగా పంచ్‍లేయగలడని అర్థం అయ్యింది ఆ రోజు.
ఇప్కా లెబొరేటరీస్ అనే కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్న రోజులవి.
నేను మా మిత్రుడితొ కలిసి టూర్ నిమిత్తం రైల్వే కోడూరు వెళ్ళాను. డాక్టర్లని కలవటం మా లేటెస్ట్ ప్రోడక్ట్స్ గురించి వివరించి, కెమిస్టులవద్ద స్టాకు పొజిషన్ వెరిఫై చేసుకోవటం ఇదీ మా పని.
పని చురుగ్గా సాగుతోంది. వచ్చిన పని ఆల్‍మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంత మంది డాక్టర్లను కలిస్తే వచ్చిన పనైపోతుంది. రకరకాల మనస్తత్వాలు కల డాక్టర్లు, రకరకాల మనస్తత్వాలు గల కెమిస్టులు. ఈ ముచ్చట్లు వ్రాయాలంటె అదో పెద్ద గ్రంధమవుతుంది.
ఇంకో నలుగురయిదుగురు డాక్టర్లను కలిసి. ఆ పై ఏదో ఒక ఆర్యవైశ్య హోటల్లో (ఎదో ఒక శాకాహార భోజనశాల అని భావం ) భోంచేసి కడపకు బయలు దేరటమే.
పైన ఎండ మండిపోతోంది. లంచ్ టైంలోగా కాస్తా ఏదయినా కడుపులో పడితే హాయిగా పని చేసుకోవచ్చు కదా అని అటు ఇటు చూశాను. ఈ ఎండకి టీ త్రాగలేం.
మరేంచేయాలా అని ఆలోచిస్తుండగా ఓ చెట్టుక్రింద ఉన్న చెరకు రసం బండి వాడు ’రండ రండ’ అని అరవ యాసతో ప్రేమగా ఆహ్వానించాడు. నేను మా మిత్రుని వంక చూశాను. మనవాడు కూడా సుముకత వ్యక్తం చేశాడు , చెరకు రసం త్రాగటానికి.
రోడ్డు పై తిరుపతి వైపు వెళ్ళే వాహనాలు చప్పడు చేసుకుంటూ వెళుతున్నాయి. వాహనాల కారణంగా పైకి లేస్తున్న దుమ్ము, ఎండ వేడి, ధారాపాతంగా కారుతున్న చెమట్లు చాలా చిరాగ్గా వుంది.
చెరకురసం బండి వాడు చెట్టు కొమ్మకు వేలాడదీసిన టేప్ రికార్డర్‍లో నుంచి ఏదో పాత అరవ పాటలు వస్తున్నాయి.
"ఇదిగో గ్లాసులు బాగా కడిగి ఇవ్వు" మన వాడు ఒక సూచన జారీ చేశాడు. అతని కంఠంలో నేను కస్టమర్‍ని అన్న అహం వచ్చేసింది. ఏకవచన సంబోధన చేస్తాడు ఇలాంటి సందర్భాలలో అతను. కస్టమర్ ఈజ్ ది కింగ్ అన్న మాటని మనోడు మనసార విశ్వసిస్తాడు.
ఆ రోజుల్లో ఇప్పట్లా డిస్‍పోసబుల్ గ్లాసులు వుండేవి కావు. గాజు గ్లాసులనే బాగా కడిగి ఇచ్చే వారు. ఇలా కడిగి ఇవ్వటంలో ఒక ఘోరమేమిటంటే అన్ని గ్లాసులని ఒకటే బకేట్ నీళ్ళలో ముంచి కడుగుతూ వుంటారు. నాకు రోత.
"బాబూ! ఏమనుకోకుండా ఓ జగ్గులో నీళ్ళు తీసుకుని గ్లాసులు విడిగా కడిగి అందులో చెరకురసం ఇవ్వవా " అని నే రిక్వెష్టింగ్ టోన్‍లో చెపుతున్నంతలో, "ఇదిగో అలా ఒకే బకెట్ లో కడగకు, అర్థమయిందా! నీ గ్లాసుల్ని , బండినీ అడ్రసు లేకుండా చేస్తా, అలా గానీ కడిగావంటే" మనోడు రంగంలోకి దిగి పోయాడు.
చెరకురసం బండి తాలూకు తాతకు యభై పైనే వుంటుంది వయస్సు. జీవితంలో అతను చవి చూసిన అనుభవాలు ముఖంపై ముడుతల రూపంలో కనిపిస్తున్నాయి. అతను చాలా శాంతంగా చిరునవ్వుతో తలఊపుతూ "లేదు బాబూ, మంచిగా కడిగి ఇస్తా" అని అన్నాడే గాని, అతను చూసిన చూపులో క్షణంలో వెయ్యవ వంతులో ఉవ్వెత్తున ఎగిసిన కోపాన్ని నేను పసి గట్టాను. కాని అతను దాన్ని అదుపులో వుంచుకుని గ్లాసులు శుభ్రంగా కడగటంలో నిమగ్నమయ్యాడు.
కరెంట్ మోటారు కూడాలేదు ఆ చెరకురసం బండికి. ఆ ముసలాయన, వాళ్ళబ్బాయనుకుంటా - ఓ కుర్రాడు కలిసి చక్రాన్ని తిప్పి తిప్పి మిషన్ ఆడించి, మాకు ఓ రెండు గ్లాసుల చెరకు రసం తయారు చేసి చెరొక గ్లాసు ఇచ్చారు.
దగ్గర్లోని బస్టాపులో వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు ఒక్కొక్కరే ఆ చెట్టు క్రిందకి చేరి చెరకు రసం ఆర్డర్ ఇస్తున్నారు.
నేను ఒక గుటకేసి ’పెద్ద మధురంగా లేదు, అలాగని ఘోరంగా ఏమి లేదు’ అని మనస్సులో అనుకుంటుండంగానే, మనోడు ఉరుము లేని పిడుగులా "ఇదేమి చెరుకు రసమయ్యా పెద్దాయనా! పూర్తి పిల్లి ఉచ్చ వున్నట్టుంది. థూ!" అని గట్టిగా అరిచాడు. ఆ దెబ్బకు ఒకరిద్దరు ఆర్డర్ కాన్సెల్ చేసుకుని వెళ్ళిపోయారు.
అప్పుడా ముసలాయన నిదానంగా అన్నా అతని పంఛ్ ఇప్పటీకీ మరచిపోలేను. " ఏమో బాబూ పిల్లి ఉచ్చ ఎట్లుంటుందో నాకు తెలియదు, మీరంటే నాలుగు ఊర్లు తిరిగి అన్నీ త్రాగుతూ వుంటారు. ఆ గ్లాసు ప్రక్కన పెట్టేయండి. డబ్బులేమి వద్దులే బాబూ." ఈ మాట అనింది ఏ త్రివిక్రం శ్రీనివాస్ సినిమాలోని పాత్రో అయ్యుంటె పెద్ద ఆశ్చర్యం లేదు, తెలుగు సరిగ్గా రాని ఓ నిరక్షరాశ్యుడు, స్పాంటేనియస్ గా, అనటమే విచిత్రం. గట్టిగా నిలేసి అడిగితే, "నేనన్నదాంట్లో తప్పేం వుంది బాబు" అని చెప్పి తప్పించుకోవటానికి వీలున్న విధంగా మాట్లాడటమే అతని చమత్కారానికి నిదర్శనం.
కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు అంటారు చూడండి, అలా అయిపోయింది మనోడి మొహం.
ఏమీ మాట్లాడకుండా మిగతాది త్రాగేసి, డబ్బులు ఇచ్చేసి బయలేరాం ఇద్దరం.
ఆ సంఘటన తర్వాత చెరకురసం కోసరం ఎక్కడికి వెళ్ళినా ఈ రైల్వేకోడూరు చెరకురసం బండి వాని పంఛ్ ఖాయంగా గుర్తుకు వస్తుంది.
"ఏమో సర్, మీరయితే నాలుగు ఊర్లు తిరిగి, అన్నీ త్రాగుతూ వుంటారు" అనేది మా ఇంట్లో ఓ ఇడియం అయి కూర్చుంది ఈ దెబ్బకి.
-రాయపెద్ది వివేకానంద్.
All rights reserved

"నువ్వూ ఇంతేనా లాజా!" (ఒక ఙ్ఞాపకం 2)


ఒక ఙ్ఞాపకం 2
"నువ్వూ ఇంతేనా లాజా!"
--------
"పిన్నమ్మా! నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నేను చిన్న పిల్లాడి నమ్మకాన్ని వమ్ము చేశాను. ఇకపై వాడు  ఎన్నడూ నన్ను నమ్మడు పిన్నమ్మా" అంటూ ఏడుస్తూ వుండిపోయాడు నాగరాజ శాస్త్రి.

అసలేం జరిగిందంటే, .....
******

అవి నేను అనంతపురంలో ఆరవ తరగతి చదువుకుంటున్న రోజులు. విద్యారణ్యా హైస్కూల్లొ చదువుకుంటూ వుండే వాడిని. అఫ్‍కోర్స్, ఈ కథకి నా స్కూలుకి సంబంధం లేదు అనుకోండి. ఆ ఉర్లో వుండినది ఒకే ఒక సంవత్సరం. తరువాత ఏడవ తరగతి జమ్మలమడుగులో చదివాను. ఆ కథలు తర్వాత.

ఈ కథలో అసలు హీరో వల్లీనాథ శాస్త్రి. పెరు విని ఎదో చాలా పెద్ద వాడనుకునేరు. అప్పటికి వాడి వయసు మహా అంటె నాలుగు లేదా ఆయిదు సంవత్సరాలు అంతే.  మనం ఇతన్ని ముద్దుగా వల్లీ అని పిలుచుకుందాం.

మా అప్పకి తన కెరియర్ లోనే మొదటి అతిపెద్ద ప్రమోషన్ అనంతపురం ఆర్.డీ.ఓ గా వచ్చిన రోజులవి. కర్నూల్లో డిప్యూటి కలెక్టర్ గా చేసిన తర్వాత మా అప్పకి ప్రమోషన్ మీద అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భం అది.

అప్పుడే వల్లీని చూడటం తటస్తించింది.  ఎవరయ్య ఈ వల్లీ అని కదా మీ సందేహం? అదిగో అక్కడికే వస్తున్నా. మా పెద్దమ్మ వాళ్ళ ఎకైక మనవడే ఈ వల్లీ నాథ శాస్త్రి అదేనండీ మన వల్లీ అన్న మాట.
బొద్దు బొద్దుగా, తెల్లటి తెలుపుతో, ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షించి అందరికీ వినోదం పంచే వాడు మా వల్లీ.
వాడి గురించి కబుర్లు చెప్పాలంటే బోలెడున్నాయి.
మా పెద్దక్కయ్య పెళ్ళి జరిగింది ఆ రోజుల్లోనే. వజ్రకరూరు అనే ఊరికి చెందిన శ్రీ.భాస్కర లక్శ్మీనరసింహమూర్తి గారికి ఇచ్చిచేయటం జరిగింది. ఆ పెళ్ళి ముచ్చట్లు చాలా సరదాగా ఉంటాయి అవన్నీ మరోసారి.
పెన్న అహోబిలం, ఊరవకొండ దాటుకుని వెళ్ళాలి వజ్రకరూరు కు. అన్నట్టు వజ్రకరూరులో వజ్రాలు నిజంగానే దొరుకుతాయట. మాకు మాత్రం మా బావగారి రూపంలో దొరికినట్టయింది. అయన నుంచి ప్రస్తుతతరం యూత్ ఎంతయినా నేర్చుకోవాలి. అవన్నీ ఇంకోసారి.
సరే ఈ వజ్రకరూర్ ముచ్చట ఎందుకంటే, ఆ ఉరికి మా వాళ్ళు కొన్ని సార్లు కార్లలోనూ, కొన్ని సార్లు బస్సులలోను వెళ్ళాల్సి వచ్చింది, ఈ పెళ్ళి పనుల కారణంగా. ఆ ట్రిప్పుల్లొ భాగంగా మా అన్నయ్య శ్రీ అప్పాజీ గారు ఒక సారి వల్లీని తీసుకుని బస్సులో వజ్రకరూర్ వెళుతూ వుంటే, ఆయన మాటలమధ్య ’వల్లీ,వల్లీ’ అంటుండటం చూసి కొందరు సాయిబులు, మీరెవరు ఎందుకు మా సాయిబుల పిల్లోడిని తీసుకుని వెళుతున్నారు అని నిలేశారట. ’అయ్య మేము పదహారణాల తెలుగు వాళ్ళం, మీరనుకుంటున్నట్టు వీడు ’వలీ’ కాదు, వల్లెలంబాదేవి వరప్రసాదంగా జన్మించటం వల్ల వీళ్ళ తలితండ్రులు వీడికి వల్లీనాథ శాస్త్రీ అని పేరు పెట్టుకున్నారు. మేము ’వల్లీ’ అని ముద్దుగా పిలుచుకుంటాము" అని చెప్పటంతో వారు శాంతించారట.
"ఆకాశంలో చుక్కలు లేవు" అన్న పాట ఫేమస్ అప్పట్లో. అది పాడటంలో వాడు "ఆకాశంలో కుక్కలు లేవు" అని పాడే వాడు నోరు తిరగక. మా అప్ప వాడితొ ఆ పాట అడిగడిగి పాడించుకునే వారు.

అనంతపురంకి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన మాకు  అక్కడ దొరికిన బాడుగ (అద్దె) ఇంటికి   దగ్గరలొనే యాదృచ్చికంగా మూడో ఇంట్లో మా పెద్దమ్మా వాళ్ళు వుండేవారు. పెద్దమ్మ అంటే స్వయానా మా అమ్మగారికి అక్కయ్య.  మా పెద్దమ్మ పేరు శ్రీమతి రామలక్షమ్మ.  ఈమె మా అమ్మ గారికి పెద్ద అక్కయ్య. మా అమ్మ గారి ఆనందానికి అవధులు లేకపోయింది. మా అమ్మ గారికి రెండో అక్కయ్య గారు హొస్పేటలో వుండేవారు. ఆ ముచ్చట్లు ఇంకో సారి.

మా రామలక్షమ్మ పెద్దమ్మ గారి భర్త అంటే మా పెదనాన్న గారి పేరు శ్రీ గొల్లాపిన్ని వాసుదేవ శాస్త్రి గారు; ఆయన సంస్కృతాంధ్రాగ్ల భాషలలో తలపండిన పండితులు. అంతే కాక ఆయన క్వాలిపైడ్ ఆయుర్వెద వైద్య శిఖామణి. ఆయనని కలిసినప్పుడల్లా ’ఓమ్ శ్రీ మాత్రే నమహ’ అని అంటూ వుండేవారు.  ఆయన ఇంటి బయట కూడా వారి నేమ్ ప్లేట్‍పై ’ఓమ్ శ్రీ మాత్రే నమహ’ అని వ్రాసుండేది.  ఆయన డాక్టర్ కద మాత్రలకు నమస్కారం అని చెప్పి మాట్లాడేవారేమోనని అనుకునే వాడిని చిన్నతనంలో. కానీ కాదని అది మాతృవందనం అని ఇంట్లో వాళ్ళు తర్వాత చెప్పారు. మా పెద్దనాన్న గారు ఇంకో రకంగా కూడా మాకు చుట్టం, అదేలాగంటె, మా అమ్మగారికి ఆయన పెద్ద మేనమామ. ఆయన్ విద్వత్తు విషయంలో కాశీపండితుల నుంచి సైతం మన్ననలు అందుకున్న పెద్ద పండితోత్తములు. ఆయనకు  జీవితంలో ఎందుకో తెలియదు గానీ, రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడేవారనిపించేది. కానీ ఆయనకు విపరీతమైన ఆత్మాభిమానం. ఎందరో రాజకీయనాయకులు, అధికారులు ఆయన దర్శనార్థం వచ్చేవారు, ఎవ్వరి ముందు ఆయన చేయి సాచింది లేదు. ఆయనకు అయిదుగురు మొగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు.
మా పెదనాన్న గారి రెండవ అబ్బాయే శేషశాస్త్రి. ఈ శేషశాస్త్రి గారి పుత్రుడే వల్లీ.
మా పెదనాన్న గారికి అంత విస్తృతమైన సర్కిల్ వున్నా, అపరిమితమైన పాండిత్యంవున్నాతన వ్యక్తిగత పనులకు గాని, తన పిల్లల ఉద్యొగ సంబంధిత సిఫార్సులకు గానీ ఆయన ఎవర్నీ అర్థించింది లేదు. నాకు అప్పుడు పిల్లతనం వల్ల తెలియదు గానీ, ఇప్పుడనిపిస్తుంది, మా పెదనాన్న కాస్తా లౌక్యంగా వ్యవహారించివుంటే ఆయన జీవితం ఇంకో లాగా వుండుండేది అని. ఇక మా నాన్న గారి విషయానికి వస్తే ఆయనా అంతే. అవన్నీ ఇంకో సందర్భంలో చెప్పుకుందాం.

మన వల్లీ తండ్రి గారు శేషశాస్త్రి గారు, మలేరియా డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ గా పని చేసే వారు. ఆయన దారుణమైన నక్సలైట్ భావజాలం కలిగిన వారు.
ప్రతి రోజూ మా ఇంటికి వచ్చి చాలా చక్కటి స్వరంతో విప్లవ గీతాలు పాడివినిపించే వాడు.
"ఎర్ర జెండెర్రజెండెన్నియల్లో... ఎర్రెర్రనీదీ జండేన్నియల్లో..."
"బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి.."
"శీకాకుళము పై చీమకొండకూ, ఎమి పిల్లో ఎళదము వస్తావా..?"
ఇలాంటి సాహిత్యమంతా అప్పుడే నేను మొదటి సారిగా వినింది. ఒక విధమైన ఉద్రేకం వచ్చేది.
రంగనాయకమ్మ వ్రాసిన రామాయణ విషవృక్షం గురించి పొగట్టం, రంగనాయకమ్మ తదితర నాస్తిక సభలకు మా కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్ళటం, చారు మజుందార్, నక్జల్బరీ ఉద్యమం గురించి తరచు చర్చించటం బాగా మోపయ్యింది ఆ రోజుల్లో.
ఆ తర్వాత ఓ ఇరవై ఏళ్ళ పాటు నామీద ఆ ప్రభావం ఉండిపోయింది. ఒక అర్థం లేని ఆవేశం, ప్రతీ దాన్ని వ్యతిరేకించటం ఇలా సాగిపొయింది. ఈ మూలాల కారణంగానే నేను నా పదిహేనో ఏటే సీ.పీ,యం వారితో విపరీతంగా తిరిగే వాడిని. మాదాల రంగారావు సినిమాలు విపరీతంగా చూసే వాడిని. గద్దర్ అంటే ఒక దైవ సమానంగా భావించే వాడిని.
చాల సంవత్సరాల పాటు దేవుళ్ళని నమ్మకపొయే వాడిని, అవధూతలని , దైవదూతలని తూలనాడేవాడిని. సాయుధ విప్లవం ఎప్పుడొస్తుందా, మాదాల రంగారావు సినిమాలలో క్లైమాక్స్ సీన్ లాగా జనాలందరూ కర్రలు, చాటలు ఇలా ఏవి చిక్కితే అవిపట్టుకుని శ్రీశ్రీ గారి పాటలు పాడుకుంటూ (వీలయితే చక్రవర్తి సంగీతం సమకూరుస్తారు బాక్ గ్రౌండ్లో )అని విశ్వసిస్తూ చాలా సంవత్సరాలు అమాయకంగా ఎదురు చూశానంటే నమ్ముతారా?
ఆ రోజుల్లో ఎవరయినా  సనాతన ధర్మానికి సంబంధించిన మంచి విషయాల్ని చక్కగా చాగంటి కోటేశ్వర రావు గారిలా చెప్పే గురువు దొరికి వుంటే నా జీవితం వేరేలాగా వుండేది. నేను నా జీవితంలో ఏదయినా రిగ్రెట్ అయ్యే అంశం వుందా అంటే ఇది ఒకటి. ఇలా చాలా వున్నాయి. సందర్బం వచ్చినప్పుడు చెప్పుకుందాం.
మా అప్ప ఒక్కటే చెప్పే వారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మన రుషులు, సనాతన ధర్మ సారధులు అందరి లక్ష్యం ఒక్కటే. పేదలనే వారుండకూడదు. అందరూ ఆనందంగా వుండాలి. లక్ష్యమ్ ఒక్కటే గానీ మార్గాలు వెరు. కాని చివరికి అందరూ ఎంచుకోవాల్సిన మార్గం సనాతన ధర్మమే, గుడిపాటి వేంకట చలం జీవితమే ఇందుకు ఉదాహరణ అని చెప్పి, చర్చలలో ఎక్కువ పాల్గొనకుండా హుందాగా వెళ్ళిపోయే వారు.
కార్ల్ మార్క్స్ అయినా, శంకరాచార్యుల వారయినా, గౌతమ బుద్దుడయినా అందరూ కోరుకునేది సమాజ హితాన్నే. అందరూ వాంచించేది సర్వమానవ సౌబ్రాతృత్వమే. ఈ కమ్యునిజమనేది ఆవేశంలో వున్నవారికి తాత్కాలికంగా మంచిగా అనిపించవచ్చు కాని, శాస్వతమైన సత్యాలన్ని సనాతనధర్మంలోనే వున్నాయి అని చెప్పి తప్పుకొనేవారు తప్పనిచ్చి ఎప్పుడు వాదనకు దిగింది లేదు.
నేను ఏ మార్గంలో పయనించినా మా అప్ప అభ్యంతరపెట్టే వారు కాదు. ఎలాంటి స్నేహితులని ఎంచుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని వాచా ఆయన ఏనాడు చెప్పలేదు. అన్నీ తెలుసుకుని, మన జీవితాన్ని మనం మలచుకోవాలన్నది వారి ఫిలాసఫీ అనుకుంటా. దీని వల్ల రచయితగా నేను ఎదగటానికి దోహదం అయింది.
ఇంప్రెషనబుల్ ఏజ్డ్ పిల్లల పట్ల వారి స్నేహితుల పట్ల తలితండ్రులు జాగురుకత వహించాలి అనే భావం నాకు ఈ సంఘటనల వల్ల ఏర్పడింది. కాని అది కూడా తప్పే. ఎవరూ కూడా కర్మచక్రానికి అతీతులు కాదు అని ఇటివల అభిప్రాయ పడుతున్నాను.
చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ శేషశాస్త్రి కూడా తన తదుపరి జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం జరిగింది. ఆయన మనసు చాలా మంచిది. నా ఇరవైయ్యవ ఏట  ఒక సందర్భంలో తుంగభద్రా డ్యాం (ఇది ఊరిపేరు) లో వారింట్లో ఒక పది రోజులు ఆయన దగ్గరే వుండి ఆయనని దగ్గర నుంచి చూడటం జరిగింది. ఆయనొక విఙ్యాన ఖని.
సరె వల్లీ విషయానికి వద్దాం.
ఒక రోజు ఉదయాన్నే వల్లీ వాళ్ళ చిన్నాయన నాగరాజ శాస్త్రి  వచ్చాడు మా ఇంటికీ. రావటం రావటమే కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ వుండిపోయాడు. మా అమ్మ దగ్గర బాగా చనువు.
"పిన్నమ్మా! నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నేను చిన్న పిల్లాడి నమ్మకాని వమ్ము చేశాను. ఇకపై వాడు నన్ను ఎన్నడూ నమ్మడు పిన్నమ్మా" అంటూ ఏడుస్తూ వుండిపోయాడు నాగరాజ శాస్త్రి.
అసలేం జరిగిందో చూద్దాం.
వల్లీని స్కూల్లో చేర్పించిన కొత్తలు అవి. సహజంగానే అందరు పిల్లల లాగా వల్లీ కూడా స్కూలుకు వెళ్ళను అని మొండికేశే వాడు. వాళ్ళ నాన్న సహజంగానే ఇలా బలవంతంగా స్కూలుకు పిల్లల్ని పంపటానికి వ్యతిరేకి, అందునా ఆయన పార్టీ పనులతోనూ, ఆఫీసు పనులతో బిజీగా వుండటం వల్ల, వల్లీని స్కూలుకు దింపి రావాల్సిన బాధ్యత వల్లీ అత్తయ్యగార్లపైనా, మిగతా బాబాయిల పైనా పడేది.
వాళ్ళు పిల్లవాడిని బలవంతంగా స్కూలుకు దింపి వచ్చే వారు, పిల్లవాడు ఏడ్చినా అది వాడి మంచికోసమే కదా అన్న కన్విక్షన్ వుండటం వల్ల వారు విధిగా ఆ బాధ్యత నిర్వర్తించే వారు.
ఆ రోజు ఆ బాధ్యత రాజా అని పిలవబడే నాగరాజ శాస్త్రి పై పడింది.
ఈయన సహజంగానే  ’కవి హృదయం’ కలవాడు. సున్నిత మనస్కుడు. పిల్లవాడ్ని ఏడిపించకూడదు అన్న సిద్ధాంతాన్ని విశ్వసించి, "స్కూలుకు కాదు వల్లీ మనం సరదాగా అలా వెళ్ళొద్దాం" అని చెప్పి వేరే దారిలో తీసుకువెళ్ళి ఆ వీధీ, ఈ వీధి తిప్పి చివరకు స్కూలు ముందుకే తీసుకెళ్ళి దింపాడట. సరదాగా అలా తిప్పటం వల్ల పిల్లవాడిలో మార్పు వచ్చి స్కూలుకు ఆనందంగా వెళతాడని ఈయన్ అంచనా.
కానీ ఈయన అంచనాల్ని తలక్రిందులు చేస్తూ వల్లీనాధుడు యధాప్రకారం ఏడుపులంకించుకున్నాడట.
కళ్ళనిండా నీళ్ళతో, వెక్కిళ్ళుపెట్టి ఏడుస్తూ కుడిచేతి చూపుడు వేలిని సూటిగా రాజావైపుకి సంధించి "నీవూ ఇంతేనా లాజా" అన్నాడట వల్లీనాధుడు. అప్పట్లో వాడికి ’ర’ పలికేదు కాదు బహుశా.
"యూ టూ బ్రూటస్" అని కళ్ళ నిండా ఆశ్చర్యం నింపుకున్న సీజర్ చక్రవర్తిలా వల్లీ అలా అడిగేసరికి, రాజా గారికి హృదయం ద్రవించింది.
నేరుగా మా ఇంటికి వచ్చి ఏడ్చేశాడు. ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపేశాడు, అన్నం కూడా సహించలేదాయనకు ఆ రోజు. తిరిగి వల్లీ స్కూలు నుంచి వచ్చే వరకు అన్యమనస్కంగానే గడిపి, సాయంత్రం వాడు రాగానే ముద్దులాడేవరకు ఆయనకు మనస్సు నెమ్మదించలేదు.
అప్పట్నుంచి మాఇంట్లో ’యూ టూ బ్రూటస్’ అనాల్సిన ప్రతి సందర్భంలో "నీవూ ఇంతేనా లాజా" అన్న మాట వాడుకలో స్థిరపడిపోయింది.
***
ఇప్పుడు ఆ వల్లీనాధ శాస్త్రి చాలా మంచి పొజిషన్ లో స్థిరపడి, ఇటివలే స్వంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి ఆహ్వానిస్తే వెళ్ళినప్పుడు ఈ ముచ్చట్లు చెప్పుకుని మనసారా నవ్వుకున్నాం.

స్వర్గం అంటే ఇదే (పిల్లల కథ )

హొగినేక్కల్ జలపాతం (కథ )

దారి దోపిడీ (కథ )

ఇడ్లి బాబాయి (కథ )

అల్లూరి సీతారామ రాజు

అద్భుతం 
ఈ సందర్బంగా ఒక ముచ్చట. 
ఎదుగుతున్న క్రమం లో తమ పాత రచనల్లో లోపాల్ని తామే గ్రహించి బయట పెట్టుకోవటం గొప్ప సంస్కారం. 
జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పటికీ ఈ పాటలో ఒక లోపం ఉందని మహాకవి తన పుస్తకం 'పాడవోయి భారతీయుడా ' లో వ్రాసుకున్నారు. 
అది ఏమిటంటే 
'ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగుల గొట్టి,  *సింహాలై*  గర్జించాలి... '
ఇది పాట. 
కానీ,  ప్రతి మనిషి అనేది ఏకవచనం కాబట్టి,  సింహం లా గర్జించాలి అని ఉండాలి,  తాళం కూడా తప్పదు. కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది అని బాధ పడ్డారు మహాకవి శ్రీ శ్రీ. 
ఇలా స్వీయలోపమ్ములు ఎరుగుటలో రంగనాయకమ్మ,  యండమూరి లు కూడా చాలా ముందున్నారు. 
యండమూరి దేముడు అని వ్రాయకూడదు అని తెలుసు నాకు,  అయినా దేవుడు అని వ్రాయాల్సిన దగ్గర నాకు తెలియకుండా దేముడు అని వ్రాస్తాను అని చెప్పుకున్నారు. 
చలం గారు కూడా అరుణాశ్రమం చేరిన కొన్నాళ్ళకి తన రచనలు అన్నింటిని disown చేసుకున్నారట.

ఈ సినిమాకు డైరెక్టర్ గారు రామచంద్ర రావు గారు,  సినిమా మధ్యలోనే చనిపోయారు. కానీ వారు టైటిల్స్ లో తన పేరు వేయాలని మాట తీసుకుని చనిపోయారు అట. 
వాస్తవానికి తతిమ్మా చిత్రమంతా సూపర్ స్టార్ కృష్ణ గారే డైరెక్షన్ చేశారు. పోరాట దృశ్యాలు శ్రీ కే ఎస్ అర్ దాస్ గారు చేసుకున్నారట. 
కానీ సంస్కారానికి మారుపేరైన శ్రీ కృష్ణ గారు రామచంద్ర రావు గారి పేరే టైటిల్స్ లో వేసారట. 
సూపర్ స్టార్ కృష్ణ గారికి వాస్తవానికి ఎడిటింగ్ పైనే గాక 24 క్రాఫ్ట్స్ పై మంచి పట్టు ఉందట. 
ఆయన ఏదయినా సినిమా రషెస్  చూసి,  అది హిట్టో కాదో నిర్మొహమాటంగా లాబ్ లోనే చెప్పేసే వారట. 
ఆయన ఎడిటింగ్ కి పరాకాష్ట దేవుడు చేసిన మనుషులు సినిమా అంటారు. 
అన్న గారు కూడా బెంబేలెత్తి పోయారట ఆ సినిమా initial రషెస్ చూసి. అప్పుడు కృష్ణ గారు పూనుకుని ఒక్క రోజు లో ఆ సినిమా రూపు రేఖలే కాదు ఆ సినిమా జాతకమే మార్చేశారట మన సూపర్ స్టార్ గారు. 
అది విషయం

Saturday, April 25, 2020

పెండు మేక (ఓక ఙాపకం - 1 )



ఓక ఙాపకం - 1
పెండు మేక
నా వయసప్పుడు మహా అంటే ఆరేండ్లు వుండవచ్చు. గాడిచర్ల రామారావు వీధిలో, మా స్వంత ఇల్లు, 6-25 డొర్ నెంబర్ ఇంట్లో వుండేవాళ్ళం. తరువాత 1991లో అనుకుంటాను అది 6-34 గా మారింది. నా బాల్యం చాలా ఆనందంగా గడిచేది. అఙానమే ఆనందం కద.
ఆ రోజుల్లో మా ఇంటికి పొద్దున్నే ఒక మేక వచ్చి తలుపు తట్టి నిలబడేది. మేము కాసేపు ఆడుకున్నాక వెళ్ళిపోయేది. ఆ మేక కారణంగా మా ఇంట్లో పుట్టిన ఇడియమే ’పెండుమేక’. ఈ ’పెండుమేక’ అన్న పదాన్నిఅనేక సందర్భాలలో ఎలా వాడుకొనే వారమో తరవాత చెపుతాను. ముందుగా ఈ కథ కి హీరో అయిన పెండుమేక గూర్చి మాట్లాడుకుందాం.
పాతకాలం ఇల్లు. మా నాన్నమ్మ గొందిపల్లి లక్షమ్మ గారు కట్టిచ్చిన ఇల్లు అది. ఆవిడ ముచ్చట్లు ముందు ముందు చెపుతాను. గొందిపల్లి ఇంటిపేరు కాదు ఆవిడది, వారి పల్లె పేరు, అక్కడ నుంచి కడపకి వచ్చి సెటిల్ అవ్వటాన అది వ్యవహార నామం అయింది.
కాంపౌండ్ వాల్ దాదాపు అయిదున్నర అడుగుల ఎత్తు వుండి, గేటు వచ్చేసి మామూలు టేకు తలుపులు వుండెవి.
మన పెండు మేక వచ్చి పొద్దున్నే తన తలతో ఈ తలుపులనే కొట్టి తన రాకని తెలిపేది. మా అప్పకు (మేము మా నాన్నని అలానే పిలుస్తాం) దాంతో ఎలా కుదిరిందో స్నేహం, అది ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడేది. ’ఒరే ఆనందూ (అంటే నేనే) రారా పెండుమేక వచ్చింది’ అని పిలవంగానే నేను, మా అక్కలు (రుక్కు, సుభద్ర) పరిగెత్తుకుని వెళ్ళి అబ్బురంగా చూసే వాళ్ళం.
ఫ్రెండు మేక అని అనటానికి అప్పట్లో నాకు నోరు తిరగకపోవటం వల్ల నేను పెండుమేక అని అనేవాడిని. చివరికి అదే ఖాయం అయ్యింది.
నేను భయపడుతూ వుంటే మా అప్ప ఏం భయంలేదు దగ్గరకు రా అని నన్ను దాన్ని తాకించే వాడు. అదో అద్భుతమైన సాహసం అప్పట్లో. 
నాకు జంతువులంటె ప్రేమ ఏర్పడటానికి ఆ సంఘటనలు కారణం కావచ్చు.
దాని నుదుటిపై మన అరచేయి ఆనిచ్చి బలంగా తోస్తే, అది కాస్తా వెనక్కు వెళ్ళి అంతే బలంగా మన అరచేతిని తోసేది. మనం వెనక్కు తోస్తే, అది ముందుకు తోస్తుంది. మనం ఎక్కువ బలంగా నెడితే, అది బాగా వెనక్కు వెళ్ళిపోయి, ఈ మారు తన ముందరకాళ్ళని రెండింటినీ లేపి ఏదో యుద్దానికి వెళ్ళే గుర్రంలాగా ముందుకు దూసుకు వచ్చేది. తరువాత తన రెండు కాళ్ళనీ మా అప్ప భుజాలపై వేసి ఆయన కళ్ళలోకి చూస్తూ వుండిపోయేది. 
ఇలా మా ఆటలు ఎంతసేపు సాగేవో సమయం తెలిసేది కాదు. కొన్ని నెలలు అలా వచ్చి ఆ తర్వాత రావటం మానేసింది. దాని ఓనర్లు ఎవరో సాయిబులు కూర వండుకుని తినేసుంటారేమోననే అనుమానం మా అప్ప చెప్పగా విని ఎన్ని నెలలు దిగులుగా గడిపానో నాకు ఇప్పటికి గుర్తే.  
మా అప్ప అప్పట్లో కడప కలెక్టర్ ఆఫీసులో రెవిన్యూ ఇన్స్పెక్టర్ (ఆరై) గా చేసేవారు. ఆ తరువాత ఆయన 1983 లో డిప్యూటి కలెక్టర్ గా రిటైర్ అయ్యే వరకూ కూడా మాకోసరం మా అప్ప రోజూ కాస్తా సమయం కేటాయించే వాడు ఆడుకోవటానికి, ఆ సమయంలోనే మాకు ఎన్నో విషయాలు తెలిపే వారు. అదే నాకు లోకఙానం.
ఇక ఇడియం విషయాన్కి వస్తే, ఎవరయినా బాగా చనువుగా వ్యవహరించే వ్యక్తిని పెండుమేక అని మేము వాడుకలో అనుకోవటం కద్దు.
అలాగే మానసిక స్పర్థలు వుండి బాగా తగవులాడి తర్వాత దగ్గరయిన వ్యక్తులను కూడా పెండుమేకలయ్యారు అని చెప్పుకుంటాం. ఫరెగ్జాంపులు, చంద్రబాబు, కేసీఆర్ లు కలిసి మాట్లాడుకొనే న్యూస్ చూసి అరె వీళ్ళు పెండుమేకలయ్యారే అని అనుకుంటామన్న మాట.
అలాగే, ఇప్పుడేదయితే ’సహజీవనం / లేదా లివింగ్ రిలేషన్ షిప్’ అని సుప్రీం కోర్ట్ వారి ఆమోదం పొందిన భావన ఏదయితే వుందో అది కూడా పెండు మేకలుగా వుండటమే మా పరిభాషలో.
ఇదీ పెండుమేక వృత్తాంతం.


TRANCE It is a nice thriller ట్రాన్స్ - ఇది అద్భుతమైన థ్రిల్లర్


TRANCE Movie
A must watch for all, especially the vulnerable
-----------------------------------------------------------------------
ఇది అద్భుతమైన థ్రిల్లర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సైకో థ్రిల్లర్. కాళ్ళ క్రింద భూమి కదలిపోతుంది ఈ సినిమా చూస్తుంటే. 
అయ్యబాబోయ్ ఇంత దారుణమా అని అనిపిస్తుంది. 
అద్భుతమైన డైరెక్షన్,  ఫోటోగ్రఫీ, సిట్యుయేషన్ కి తగినట్టు సంగీతం. 
మొత్తం మీద అంతర్జాతీయ ప్రమాణాలతో తీయబడిన సినిమా. 
ఇలాంటి కథతో సినిమా  తియ్యాలి అంటే చాలా గుండె ధైర్యం కావాలి. 
ఈ దర్శకుడికి అది పుష్కలంగా వుంది అని అర్థం అవుతోంది. 
ఈ సినిమా బ్యాన్ అయినా అవచ్చు,  అమెజాన్ ప్రైమ్ నుంచి త్వరలో  తొలగించబడినా ఆశ్చర్యం లేదు. 
వెంటనే చూడండి. అలాగని చెప్పి ఇందులో అసభ్యత,  హింస ఎంత మాత్రం లేవు. కుటుంబ సమేతంగా చూడవచ్చు. చూడాలి కూడా. పిల్లలకు, అమాయకులకు తప్పని సరిగా చూపాల్సిన సినిమా. 
ఈ కథనే చాలా వైవిధ్యభరితమైనది. సత్యం మాత్రమే చూపారు ఇందులో. 
ఇది మిస్ అయితే మీరు ఒక మంచి సినిమా మిస్ అయినట్ట్లు. 
First హాఫ్ లో ఉన్నంత గ్రిప్ second హాఫ్ లో మిస్ అయ్యింది. అయినా ఓవరాల్ గా అద్భుతమైన చిత్రం ఇది. 
నేడే చూడండి. 
ఇంత మంచి సినిమా గురించ్జి తెలియబరచిన Kiran Prabha గారికి హృదయ పూర్వక ధన్యవాదములు. 

https://youtu.be/uSudz8zb2I8

P. S. :  మీ కామెంట్స్ లో ఎవరు కథ ను reveal చేయవద్దు. కథ తెలియకుండా చూస్తేనే,  ఆ థ్రిల్లు.  హీరో ముంబయి వెళ్లే వరకు,  వెళ్లిన తరువాత అన్నట్టు చూస్తే ఇది థ్రిల్లరే. 
అంతకు మించి కథ reveal చేయను